Monday, August 24, 2026

Srikrishnudu Kundina Nagarambunaku Ratharudhudai Chanuta - శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము - 
శ్రీకృష్ణుడు కుండిన నగరంబునకు రథారూఢుడై చనుట

అని ఈ విధంగా బ్రాహ్మణునిద్వారా రుక్మిణి చెప్పిపంపిన సందేశాన్ని శ్రీకృష్ణుడు విన్నాడు. అతనిద్వారా ఆమె అందమైన ఆకృతిని, చక్కదనం మొదలైన వివరాలను మనసుపెట్టి తెలుసుకున్నాడు. పిదప తనచేతితో అతని చేతిని పట్టుకొని నవ్వుతూ, ఆ యాదవ శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

విద్వాంసులచేత ప్రశంసింపబడేవాడా! ఆ కన్య రు
క్మిణిమీద నాకు ఎంతగానో కోరిక ఉంది. రాత్రివేళల్లో ఆమెను గురించి ఆలోచనలతో నిద్రపట్టదు. నా పెళ్లి రుక్మిణితో జరగడాన్ని ఆమెఅన్న రుక్మి ఓర్వలేక నాకు హాని చేయాలని భావిస్తున్నాడు.

ఈ విషయం నాకు ముందే తెలుసు. చెట్టును మధించి కొత్త అగ్నిజ్వాలను పుట్టించి, తెచ్చినట్లుగా ఎదిరించిన శత్రువుల గుంపులను సంహరించి, రుక్మిణిని తీసుకుని వస్తాను.

విదర్భదేశానికి వస్తాను. ఆ దేశాధిపతి అయిన భీష్మకునినగరాన్ని ప్రవేశిస్తాను. అందమైనరీతిలో బాలామణి రుక్మిణిని చిటికెలో తెస్తాను. శత్రువులు అడ్డం వచ్చినట్లతే యుద్ధంలో వాళ్లను ముక్కలు చేస్తాను.

అని చెప్పి, రుక్మిణీదేవి పెళ్లినక్షత్రాన్నీ ముహూర్తసమయాన్నీ శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. తన సారథి దారుకుణ్ణి రథాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. దారుకుడు శైబ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వలాహకం అనే పేర్లుగల నాలుగు గుర్రాలను కట్టి రథాన్ని సిద్ధం చేశాడు.

దృఢమైన కోరికగల శ్రీకృష్ణుడు, ఆ అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణునితో పాటు రథమెక్కాడు. ఒకే రాత్రిలో ఆనర్తకదేశాలను దాటాడు. విదర్భదేశానికి వెళ్లాడు. అక్కడ కుండినమనే నగరానికి భీష్మకుడు రాజు.

అతడు తనకొడుకైన రుక్మిమాటలకు లొంగిపోయి, రుక్మిణిని శిశుపాలునికిచ్చి పెళ్లిచేద్దామనుకుని మంగళప్రదమైన కార్యక్రమాల ప్రయత్నాలను చేయిస్తున్నాడు. ఆ సమయంలో

పెళ్లివేడుకలకై నగరాన్ని అంతా అలంకారం చేశారు. మండపాలు, చిన్నసందులు, రాజమార్గాలు, అంగళ్లుండే ప్రదేశాలు అన్నిటినీ శుభ్రపరిచారు. చందనంనీళ్లతో కళ్లాపి చల్లారు. కలువపూలను దండలుగా కూర్చి తోరణాలుగా కట్టారు. నగరంలోని ఇళ్లన్నిటినీ తీర్చిదిద్దారు.

కర్పూరంతో, కుంకుమతో అలంకరించారు. అగరుపొగలతో పరిమళింప చేశారు. రకరకాల వస్త్రాలతో, రకరకాల పూలమాలలతో అలంకరించుకుని ఆడవాళ్లు, మగవాళ్లు పరిమళాలను అద్దుకుని కనిపిస్తున్నారు. ఎంతో ఇష్టంతో వాద్యాలను మ్రోగిస్తున్నారు. నగరమంతా ఉత్సవంతో అందంగా ఉంది.

తర్వాత భీష్మకుడు శాస్త్రంలో చెప్పినవిధంగా పితృదేవతలకు పూజలు చేశాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టించాడు. వారినుండి ఆశీర్వాదాలు గ్రహించాడు. రు
క్మిణీదేవికి తలంటుస్నానం చేయించి ఆమెకు వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి, అలంకరింపచేశాడు. 

ఋక్‌ - యజుస్‌ - సామ - అథర్వణవేదాల మంత్రాలతో శుభకార్యాలు జరిపించి, బ్రాహ్మణులు రక్షలు కట్టారు. పురోహితుడు గ్రహశాంతికోసం పద్ధతిప్రకారం హోమం చేయించాడు. కొత్తదంపతులకు మేలు కలగాలని భీష్మకుడు నువ్వులు, గోవులు, వెండి, బంగారం, వస్త్రాలు మొదలైనవి బ్రాహ్మణులకు దానం చేశాడు.

ఆ సమయంలో విదర్భరాజపుత్రిని చేపడతానంటూ మదోన్మత్తుడైన శిశుపాలుడు భటుల పటాలంతో, తేరులబారుతో, భద్రజాతికి చెందిన కుంజర బృందంతో, కడువడిగా పరుగిడే గుఱ్ఱాల పౌజుతో బంధుమిత్ర సమేతంగా మహాటోపంతో కుండిన నగరానికి వచ్చాడు.

బంధువులతో కలిసి శ్రీకృష్ణుడు, బలరాముడు, వచ్చినా, వాళ్లను పారిపోయేలా తరిమి, నిరాటంకంగా రు
క్మిణిని శిశుపాలుని కిచ్చి పెండ్లి జరిపిస్తామని ఏనుగులు కాల్బలం, గుర్రాలు, రథాలతో కూడిన సైన్యంతో జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వుడు, విదూరకుడు, పౌండ్రకుడు మొదలైనవాళ్లంతా వచ్చారు.

తర్వాత ఎన్నోదేశాలను పరిపాలిస్తున్న రాజులు చాలమంది వచ్చారు. వాళ్లు శిశుపాలునికి ఎదురుగా వెళ్లి పూజించారు. భీష్మకుడు అతనికి ఒక ప్రత్యేక నివాసస్థానాన్ని ఏర్పరిచి, అక్కడ విడిది చేయించాడు. అంతలో ఆ సమాచారమంతా విని,

'శ్రీకృష్ణుడు ఒంటరిగా వెళ్లాడు. జరాసంధుడు మొదలైనవాళ్లు, శిశుపాలునికి మేలు జరగాలని అతణ్ణి అనుసరిస్తున్న ఎందరో రాజులు వెళ్లారు. కన్యను తెచ్చే చోట యుద్ధం జరగవచ్చు. శ్రీకృష్ణునికి సహాయం కావాలి - అనుకొని వెంటనే బలరాముడు అసంఖ్యాకమైన సైన్యంతో శ్రీకృష్ణుడు వెళ్లినమార్గంలో తానూ వెళ్లాడు

అంతలో రుక్మిణి ఏకాంతమందిరంలో ఆలోచిస్తూంది. విశాలమైన ఆమెనేత్రాలు అటూ ఇటూ చలిస్తున్నాయి. లోకానికి కన్నులాంటివాడైన శ్రీకృష్ణుడు తన సందేశాన్ని తిలకించి తన దగ్గరకు వస్తాడో రాడో అనే సందేహంతో

రేపే ముహూర్తం. పెళ్లికూడా దగ్గరపడింది. ఎందుకు శ్రీకృష్ణు డింకా రాలేదు? మనసంతా కలవరంగా ఉంది. ఈ పెళ్లిగురించి సమాచారాన్ని విన్నాడో లేదో. అగ్నిద్యోతనుడు ఎందుకు ఆలస్యం చేశాడు? నా ప్రయత్నం ఫలిస్తుందో లేక వికటిస్తుందో? బ్రహ్మదేవుని సంకల్పం ఎలా ఉందో!

ఆ మహాత్ముడైన బ్రాహ్మణుడు వెళ్లాడో? లేక నడిదారిలోనే నడచినడచి అలసి ఆగిపోయాడో? లేక బ్రాహ్మణుడు సందేశాన్ని తెలపగానే శ్రీకృష్ణుడు విని తప్పుగా భావించాడో? లేక ఈ పాటికే ఇక్కడికి వచ్చినాడేమో? పరమేశ్వరుడు నాకు అనుకూలం కలిగించాలని తలుస్తాడో? తలచడో? పార్వతీదేవికి నన్ను రక్షించాలని తెలుసునో! తెలియదో! తెలియదు. ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో?

రు
క్మిణి మనసులో సందేహాలూ, విశ్వాసాలూ పెనవేసుకుని ఉన్నాయి. ఔను - కాదుల మధ్య మనసు ఊగిసలాడుతూ ఉంది.

సందేశహరుడైన అగ్నిద్యోతనుడు శ్రీకృష్ణుని దగ్గరకుపోయి ఉండడు అనుకుంటుంది. శ్రీకృష్ణుడుకూడా ఇక్కడికి రాడు అనుకుంటుంది. మళ్లీ ద్వారకకువెళ్లి శ్రీకృష్ణుణి పిలిచే ఆత్మబంధువు ఎవడూ లేడే అనుకుంటుంది. 

నా అన్న రుక్మికి ఈ విషయంలో నీతి, న్యాయం తెలియదు అనుకుంటుంది. చేదిరాజైన శిశుపాలునికి నన్ను ఇస్తానని ఉన్నాడు - అనుకుంటుంది అయ్యో! సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతికి కూడా నా పైన ఈ రోజు దయలేదు - అనుకుంటుంది.

రు
క్మిణి తనమనసులోని చెలరేగే వేదనను తల్లికికూడా చెప్పుకోదు. దిక్కులలో చిరునవ్వు వెన్నెల నింపదు. తన ముఖం నుండి వెలువడే పరిమళానికి తుమ్మెదలు మూగుతున్నా వాటిని తోలదు. నిద్రపోదు. వక్షంపై హారాలు ఒకదానిపై ఒకటి పెనవేసుకుని ఉన్నా వాటిని సరిచేసుకోదు. శ్రీకృష్ణుడు వస్తాడని ఎదురుచూచే దారిపై నిలిపిన తన చూపును మాత్రం ఎప్పటికీ పక్కకు తిప్పదు.

ఈ వేదనవలన రు
క్మిణికళ్లలో కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. వాటిని తుడవనైనా తుడవదు. కొప్పు సవరించుకొని సరిగా ముడవదు. తన ఇష్టసఖిని కలిసి ఏదో సరససల్లాపాలకైనా వెళ్లదు. ఏ మాత్రంకూడా అన్నం తినదు. నీళ్లుకూడా తాగదు. ప్రియమైన రామచిలుక వద్ద చేరి, పద్యాన్ని చెప్పించదు. వీణతీగను మీటి వినోదించదు. ఎవరివద్దకూ వెళ్లదు.

పరిమళించే వనమాలను ధరించిన శ్రీకృష్ణుడు కొంచెమైనా న్యాయం లేకుండా నన్ను ఆదరించి దయచూపకుండా ఉన్నాడే! నన్ను చేపట్టడానికి రాడే! అని రుక్మిణి వేదనపడుతూ ఉంది. 

సింహంనడుమువంటి సన్నని నడుముగల ఆమె కస్తూరి పూసుకోవడం లేదు. పద్మంవలె పరిమళించే ఆమె జలకాలాడడం లేదు. అద్దంవంటి ముఖం కల ఆమె అద్దం చూడడం లేదు. పూలవంటి సున్నితమైన శరీరమున్న స్త్రీ ఆమె పూలను పెట్టుకోడం లేదు. 

కలువపూలవంటి కండ్లున్న ఆ రుక్మిణి వనవిహారం చేయడం లేదు. హంసవలె ఒయ్యారంగా నడిచే ఆమె హంసలను చేరదీయడం లేదు. తీగవలె నాజూకైన శరీరంకల ఆమె తీగలను పెంచడం లేదు. నగలకే నగవంటి ఆమె ఏ నగనూ పెట్టుకోవడం లేదు. 

తిలకం పెట్టుకునే స్త్రీలందరికీ తిలకంవంటి ఆమె నొసట తిలకం పెట్టుకోదు. పద్మాలవంటి చేతులున్న ఆమె కమలాలతో ఉన్న కొలనులోకి ప్రవేశించదు.

ఇంకా

రుక్మిణీదేవి మన్మథాగ్నిజ్వాలల్లో తపించిపోతున్న శరీరంకలదై - సుకుమారంగా, నెమ్మదిగా వీస్తున్న చల్లగాలికి ఆమె దూరంగా తొలగిపోతూంది. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలతో తిరుగుతూంటే, పక్కకు వెళ్లిపోతుంది. కోయిల కూతకు కోపగించుకుంటుంది. రామచిలుకలనుంచి ముద్దుమాటలు పుట్టుకొస్తూంటే మదనవేదనతో ఉలికిపడుతుంది. వెన్నెల వేడికి అలసిపోతుంది. చిరుమామిడికొమ్మల లేతనీడలకు దూరంగాపోతుంది.

రుక్మిణి ఈ విధంగా విచారిస్తూ ఉంది. శ్రీకృష్ణుడు ఎపుడు వస్తాడా అని ఎదురుచూస్తూ ఉంది. ఏ పని చేయడానికే ఆమెకు ఆసక్తి లేదు. మనసులో మదనాగ్ని చెలరేగుతూ ఉంది. ఆమె దుఃఖపడుతూ ఉంది. అలాంటి స్థితిలో ఆమెకు మంచివార్తను చెప్పే విధంగా ఎడమకన్ను ఎడమభుజం అదిరాయి. 

అంతలో శ్రీకృష్ణుడు ఆనతిచ్చిన రీతిలో అగ్నిద్యోతనుడు తిరిగి వచ్చాడు. అతనిముఖలక్షణాలను గమనించింది - రుక్షిణి. ఆ లక్షణాలు తనకు శుభాన్ని చెపుతున్నాయి. మధురమైన కంఠస్వరంగల రుక్మిణి శ్రీ కృష్ణుణ్ణి ఎప్పుడు చూస్తానా అనే అడ్డుతొలగడంతో ముఖంలో చిరునవ్వు చిందులాడగా ఆ బ్రాహ్మణునికి ఎదురువెళ్లి నిలబడింది. అపుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు.

అమ్మాయీ! సుదర్శనచక్రాన్ని ఆయుధంగా కల్గిన శ్రీకృష్ణుడు అదిగో తానే వచ్చాడు. నీ ఉత్తమగణగణాలను మెచ్చాడు. నాకు అంతులేని ధనరాసులను కూడా ఇచ్చాడు. 

దేవతలూ, రాక్షసులూ నిరోధించినా అతనికి లెక్కలేదు. రాక్షసవివాహపద్ధతిలో నిన్ను తీసుకొనిపోతాడు. నీ మంచివ్రవర్తన, నీ అదృష్టం అన్నీకూడా నేటికి ఫలించాయి.

అలా అగ్నిద్యోతనుడు అన్న మాటకు విదర్భరాజపుత్రి అయిన రుక్మిణి ఇలా అంది.

రుక్మిణీదేవి అగ్నిద్యోతనునికి నమస్కరించుట


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...