Wednesday, August 26, 2026

Rukminidevi Srikrishna Lalithayai Yathanini Stuthinchuta - రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - ఉత్తరభాగం - 
రుక్మిణిదేవి శ్రీకృష్ణ లాలితయై యతనిని స్తుతించుట

ఓ కృష్ణా! ప్రాతఃకాలంలో వికసిస్తున్న తామరరేకులవంటి కన్నులుకలిగినవాడా! అంతులేని నిర్మలమైన కాంతిచే ప్రియమైన రూపం కలిగినవాడా! నీవనింది - తగినమాటే!

సర్వలోకేశ్వరులకు ప్రభువైన ఓ కృష్ణా! జ్ఞానం, సుఖం, శక్తి సంపన్నత మున్నగు మంచిగుణాలు గలిగిన, పాపరహితుడవైన మీ దృష్టిలో నేను యోగ్యురాలినా? నేను తగుదునా? అని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నది.

(శ్రీకృష్ణుడు ఆత్మసంతృప్తుడు. సచ్చిదానందశాలి అనడంవల్ల సర్వం కలిగినవాడని స్ఫురిస్తున్నది. రుక్మిణీదేవి మాటలవల్ల నామెలోని ఆత్మానందం వ్యక్తమవుతూంది. సచ్చిదానందం అనగా సత్‌, చిత్‌, ఆనంద స్వరూపుడని అర్థం. కృష్ణుడు తనను తక్కువ చేసుకొని, రు
క్మిణిని గొప్పగా పొగడాడు. ప్రస్తుతం రుక్మిణి కృష్ణుని పరతత్త్వాన్ని గుర్తించి, తనను తక్కువ చేసుకొని, ఆయన్ను ప్రశంసిస్తూ - అసలు నీకు నేను తగినదాన్నా? మీ తాహత్తుకు మా తాహత్తు చాల తక్కువదని ఎదురు ప్రశ్నలతో బదులివ్వడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనం.)

ఓ మహాత్మా! ప్రకృతికీ, మానవులకూ, కాలాలకు నీవు ప్రభుడివి. సుందరం, పవిత్రం అయిన లీలామాధుర్యంతో కూడిన నీ రూపమెక్కడ? సత్త్వాదిగుణాలతోకూడిన తెలివితక్కువదానినైన నేనెక్కడ? నీయొక్క శుభప్రదాలయిన గుణసంపద దానం చేయబడుతుందనే భయంతో సముద్రమధ్యభాగంలో శేషతల్పంపై నిద్రిస్తున్నావు. ఇట్టి నీ లీలలు దివ్యమైనవి.

శబ్దం, స్పర్శ, రూపం, రసం, అనే గుణాలచేత గ్రహించబడిన శుభప్రదం, సుందరం అగు శరీరం కలవాడివై నీవు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే రూపాన్ని స్వీకరించి, నీ సేవకులకు సదా అనుభవించదగినవాడివై ఉన్నావు. నీ పాదారవిందమకరందాన్ని ఆస్వాదించే యోగిశ్రేష్ఠులుసైతం నీ మార్గాన్ని తెలుసుకోలేరు.

ఇక ఈ పశుప్రాయులైన మనుషులకు అది భావించరానిదని వేరే చెప్పవలెనా? నీ ఇచ్చ స్వతంత్రమైంది, నీకు ఇష్టమైంది. అందువల్ల నేను నిన్ను అనుసరిస్తాను. ప్రభూ! నీవు ఏమీలేని దరిద్రుడవైతే బలిని స్వీకరించే బ్రహ్మేంద్రాదులు బలి ఎవరికిచ్చినట్లు?

నీవు పురుషార్థస్వరూపుడివి. ఫలరూపుడివి. నీపైగల ప్రేమచేత విజ్ఞానదీప ప్రకాశంతో దోషాంధకారం నశించగా బుద్ధిమంతులు లౌకికసాఖ్యాలు వదిలేస్తారు. నీ దాసులతో కలయికను అభిలషిస్తారు. అలా చేయకుండా, అధికారమనే అంధకారంలో మునిగినవాళ్లు నీ తత్త్వం గ్రహించి బలిసమర్పణం చేయలేక అజ్ఞానులై సంసారమనే చక్రంలో తగుల్కొని తిరుగుతూ ఉంటారు.

జన్మపాపాలులేనివాడా! శ్రేష్ఠులైనమునులచే, మహాయోగులచే, దేవతాసమూహాలచే, వర్ణింపబడిన ప్రభావం కలవాడివై సర్వజీవులకు విజ్ఞానమిస్తున్నావు.

దేవా! మీ నిశిత దృష్టి ప్రభావంతో ప్రేరణపొందిన కాలవేగంచేత శుభాలకు దూరమైన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మొదలైనవారిని తిరస్కరించిన నా మనస్సుతో

(శివ, బ్రహ్మ ఇంద్రాలకు మంగళత్వం విష్ణుదేవుని కాలవేగ తీవ్రదృష్టి పడనంతవరకే! నని రు
క్మిణి - విష్ణువును (కృష్ణుణ్ణి) ఆదిమూలతత్త్వంగా భావించింది.)

పద్మాక్షా! ఈశ్వరా! శ్రీకృష్ణా! నిన్నే పెండ్లి చేసుకోవాలని నేను నిశ్చయించి ఉండగా, ఆ విషయం తెలిసి, నీవు నీ శార్ఙ్గమనే ధనుస్సుయొక్క ధ్వనిమాత్రంతోనే సమస్త శత్రురాజులైన శిశుపాల పక్షంవాళ్లను జయించి, సింహం తన మహాబలశౌర్యాలతో ఇతర పశువుల్ని పారద్రోలి, తన మాంసభాగాన్ని తాను తెచ్చుకొన్నట్లు - నీవు మొక్కవోని మహాశౌర్యంతో నన్ను నీ సొమ్ముగా గ్రహించావు కదా!

అట్టిరాజుల్ని యుద్ధరంగంలో ఎదిరించలేక భయపడ్డట్లు నటించి, సముద్రుణ్ణి శరణుకోరావు. నిజంగా ఇది నీ మాయకాక యథార్థమైన విషయమా? నీ భక్తులైన చక్రవర్తులు, రాజర్షులు సంతోషంతో

(ఇక్కడ శ్రీకృష్ణుడు భయంనటిస్తూ సముద్రుని శరణుకోరుట ఆతని యుద్ధనీతికి ఉదాహరణంగా పేర్కొనవచ్చు.)

ఓ కృష్ణా! నిన్నెదిరించిన రాజులు తమమనస్సులలో నీ పాదకమలాలను నిలుపుకొని గాలి, నీరు, ఆకులు ఆహారం కాగా, కఠిననియమాలతో అరణ్యంలో నివసిస్తూ ఉన్నారు. అంటే మోక్షమార్గాన్ని పొందే స్థితిలో ఉన్నారని అర్దం.

నిర్మలమైన జ్ఞానంతో ప్రసిద్ధులైనవారు చూస్తుండగా మీపాదపద్మాలలోని మకరందంయొక్క సువాసనను ఆస్వాదించి మోక్షాన్ని కలిగించేదీ, సజ్జనులచే స్తుతింపబడిందీ, శోభా లక్ష్మికి నివాసమూ అయిన మిమ్ము సేవింపక మరేబుద్ధి కలిగిన అల్పమానవుణ్ణి సేవిస్తానా? (సేవించను)

(రుక్మిణీదేవి ఆత్మసంకల్పం వర్ణింపబడింది.)

ఓ దేవా! సర్వప్రపంచానికి ప్రభువైన నిన్ను భూలోకంలోను, వైకుంఠంలోను, అన్ని ప్రదేశాల్లోను నీవు కోరిన రూపంలో సేవిస్తాను. నీ పాదపద్మాల మకరందాన్ని ఆస్వాదించటంలో నైపుణ్యంగల ఆడుతుమ్మెద అయిన స్త్రీ అతినీచమైన చర్మ నఖ, కేశాదులచేత కప్పబడి, లోపల మాంసము, ఎముకలు, రక్తము, క్రిములు, మలము, కఫము, పిత్తము, వాతముగల జీవచ్చవమైన మానవాధముణ్ణి మూఢురాలై ప్రేమించగలదా? అంతేకాక

భక్తమందార! దుర్భరభవవిదూర! నిర్మలాకారా! వర్షాకాలంలో మేఘాలనుండి వచ్చేనీటిని తాగే చాతకపక్షి చవిటిగుంతల్లోని నీటిని తాగుతుందా? మామిడిపండు రసాన్ని తాగే చిలుక ఉమ్మెత్తలకొఱకు వెళ్ళుతుందా? మేఘ శబ్దాన్ని వినే నెమలి ఈలపురుగు ధ్వని కోరుతుందా? ఏనుగుకుంభస్థలమాంసం కోరే సింహం కుక్కమాంసాన్ని మంచి ఆహారంగా భావిస్తుందా? మీ పాదద్వయాన్ని కోరి, ఆశ్రయించే హృదయం అన్యుల్ని కోరుతుందా?

త్రిలోకాధిపతియైన ఇంద్రునిచే నమస్కరింపబడినవాడా! కైలాసంలో, సత్యలోకంలో నీ చరిత్ర అందమైన పాటలుగా పాడబడుతున్నది.

విషయాసక్తులైన రాజులు మిమ్మల్ని తెలుసుకోలేక తమతమ అంతఃపురకాంతల మందిరాలలో ఎద్దులు, గాడిదలు, పిల్లులమాదిరి బద్ధులై సంచరిస్తారు.

(ఈ జంతువులు సంసారంలోపడి తలమున్కలవుతున్న వాళ్లకు - ప్రతీకలుగా చెప్పబడ్డాయి. ఇవి అజ్ఞాన సంకేతాలు.)

ఓ కృష్ణా! సర్వలోకాలలోనూ అంతరాత్మవైన దేవా! నీ పాదపద్మాలపై నాహృదయంలో అనురాగం నిరంతరం ఉండేటట్లు చేయవయ్యా!

పద్మాలవంటి కన్నులుకలిగిన కృష్ణా! నీవు రాజసంతో నిండిన కన్నులతో నన్ను చూచుట నాపైగల గొప్ప దయగా భావిస్తాను.

ఓ మధుసూదనా! నీమాటలు అసత్యంకాదు. కన్నతల్లిమాటలు ప్రియమైనకుమార్తెకు సమ్మతమే కదా! వయస్సువల్ల కలిగిన గర్వంతో జారిణియైన స్త్రీ పరపురుషాసక్త ఐతే తెలివిగల ప్రేమికుడు ఆమెను వదలివేస్తాడు.

వివేకం లేనివాడు ఆ జారిణితోనే సంబంధం పెట్టుకొని, ఆమెతోనే సంసారం చేస్తూ, ఇహపరాలకు కాకుండాపోతాడు. నీకు తెలియనివేమైన ఉన్నాయా? అని చెబుతున్న రుక్మిణిమాటలకు కృష్ణుడు సంతోషించి ఇలా అన్నాడు.

కృష్ణుడు రుక్మిణీదేవి నూరడించుట






No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...