Tuesday, May 5, 2026

Sita - Chayasita - Draupadi - సీత - ఛాయాసీత - ద్రౌపది

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సీత - ఛాయాసీత - ద్రౌపది

కాలం గడిచింది. కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది. వేదవతి జనకమహారాజు ఇంట సీతాదేవిగా అవతరించింది. పూర్వజన్మ తపఃఫలంగా శ్రీరాముణ్జీ పరిణయమాడింది. సీతారాములిద్దరూ చాలాకాలం వివిధ కామోపభోగాలతో ఆనందించారు. గతజన్మ తపఃక్లేశాలకు విరుగుడుగా సీతమ్మ సుఖసంతోషాలు అనుభవించింది.

తండ్రి మాటను నిలబెట్టడంకోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయంకదా! సీతాలక్ష్మణ సహితుడై దాశరథి సముద్ర తీరారణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు విప్రవేషంలో వచ్చాడు. అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాడు. ఏకాంతంలో కలుసుకున్నాడు.

రామా! ఒక నిజం నీకు చెప్పి వెడదామని వచ్చాను. దైవం ఎవరికైనా దుర్నివార్యం. దైవం కన్నా బలీయమేదీ లేదు. కనక నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించు. ఇది సీతాపహరణకాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగించు. ఛాయా సీతను నువ్వు కాపాడుకో. పరీక్షాసమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నీకు అప్పగిస్తాను. దేవతలు పంపితే వచ్చాను నేను. కేవలం విప్రుణ్ణి కాదు. హంతాశనుణ్ణి.

రాముడు ఆలకించాడు. శ్రద్దగా ఆలకించాడు. ఏ మార్పూ ముఖంలో కనపడనివ్వలేదు. హృదయంలో మాత్రం కుమిలిపోయాడు. అగ్నిదేవుడు చెప్పినదానికి అంగీకరించాడు. హంతాశనుడు తన యోగశక్తితో ఛాయాసీతను సృష్టించి రాముడికి అప్పగించాడు. అసలు సీతను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది అత్యంతగోప్యంసుమా అని హెచ్చరిక చేసి మరీ వెళ్ళాడు. నారదా! ఈ రహ్యం లక్ష్మణుడికికూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో గ్రహించు.

అగ్నిదేవుడు అటు వెళ్ళాడో లేదో బంగారులేడి రాముడి కంటపడింది. దాన్ని పట్టి తెమ్మని సీతాదేవి రాముణ్ణి కోరింది. లక్ష్మణుడిని సీతకు కాపలాఉంచి రాముడు బయలుదేరాడు. బంగారులేడిని వెంబడించి చివరికి బాణం వేశాడు. అది “హా లక్ష్మణా!” అని రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలింది ప్రాణాలు వదిలే సమయంలో రాముణ్ణి దర్శించింది కనక దివ్యరూపంతో రత్నవిమానంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు ఆ మాయామృగరూపధారి మారీచుడు. వైకుంఠ ద్వారపాలకులకు కింకరుడై అటుపైని వారి అనుమతితో లోపలికి ప్రవేశించాడు.

హా! లక్ష్మణా! అని వినిపించిన రామకంఠధ్వనిని విని సీతాదేవి భయపడింది. రాముడికి ఏదో ఆపద వచ్చింది సహాయపడమని లక్ష్మణుడిని పంపించింది. అతడు అలా వెళ్ళగా చూసి రావణుడు వచ్చి సీతను లంకకు అపహరించుకుపోయాడు.

రామలక్ష్మణులు అడవిలో కలుసుకున్నారు. లక్ష్మణుడిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు, ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చారు. పర్ణశాల బోసిపోయింది. సీతమ్మ లేదు. రాముడు దుఃఖించి దుఃఖించి మూర్భపోయాడు. తేరుకున్నాడు. ఇద్దరూ అడవులన్నీ గాలించారు.

రావణుడు అపహరించుకుపోయాడనే వార్త గోదావరీతీరాన తెలిసింది. అటుపైని వానరులతో సఖ్యంచేసి సముద్రానికి వారధి కట్టి లంకలో ప్రవేశించిన రాముడు స్వయంగా బాణం సంధించి రావణుడిని సంహరించాడు.

సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించాడు. ఛాయాసీత అగ్నిదేవుడికీ రామచంద్రుడికీ సవినయంగా నమస్కరించి నా కర్తవ్యమేమిటో ఉపదేశించండి అని అభ్యర్థించింది. పుష్కరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమనీ అక్కడే స్వర్గలక్ష్మివి అవుతావు అనీ చెప్పి పంపించారు.

ఛాయాసీత పుష్కరక్షేత్రంలో మూడులక్షల దివ్యసంవత్సరాలు తపస్సుచేసి స్వర్గలక్ష్మి అయ్యింది. ఆమెయే అటుతరవాత ద్వాపరయుగంలో ద్రుపదుడి ఇంట యజ్ఞకుండంనుంచి ఆవిర్భవింది ద్రౌపది అయ్యింది. ఇలా మూడు యుగాలలోనూ ఉంది కనక ఈమెకు త్రిహాయణి అనే పేరు ఏర్పడింది.

పుష్కరక్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆమె కామాతురయై పతిని ఇయ్యి పతిని ఇయ్యి ఆని ఆవేశంగా అయిదుసార్లు అంది. రసికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి “ప్రియా! నీకు అయిదుగురు భర్తలుంటా” రని వరమిచ్చి అదృశ్యుడయ్యాడు.

నారదా! అందుచేతనే ద్రౌపదికి పాండవులు అయిదుగురూ భర్తలయ్యారు. ప్రస్తావనలో వచ్చిందీ కనక ఈ విషయమూ చెప్పాను. అదిసరే.

అసలు సీతను స్వీకరించి, లంకారాజ్యానికి విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు ఆయోధ్యకు తిరిగివచ్చాడు. పదకొండువేల సంవత్సరాలపాటు రాజ్యం పరిపాలించాడు. అటు పైని సర్వలోకాలతో పాటూ తానూ వైకుంఠానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవి అంశయైన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశించింది. చతుర్వేదాలూ మూర్తిమంతాలై వేదవతి నాల్కమీద నాట్యమాడుతూ ఉండేవిట! అతి పవిత్రమూ పాపనాశకమూ పుణ్యప్రదమూ అయిన వేదవతీ వృత్తాంతం చెప్పాను. తరువాత కథ ఆలకించు.

తులసీ వృత్తాంతం


No comments:

Post a Comment

Tulsi story - తులసీ వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - తులసీ వృత్తాంతం నారదా! నువ్వడిగిన తులసీ వృత్తాంతం ఇప్పుడు చెబుతున్నాను విను. కుశధ్వజుడి సోదరుడున్నాడే ధర్మధ్వ...