Wednesday, May 6, 2026

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - శంఖచూడుడి పూర్వజన్మ

పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృత్తాంతం అంతా నాకు తెలుసు. అతడు పూర్వజన్మలో గోలోకవాసి. గోపకుడు. మహాతేజస్వి. అతడిపేరు సుదాముడు. నాకు పార్షదుడు. రాధాదేవి శాపంవల్ల దానవుడయ్యాడు.

ఒకనాడు నేను నా మందిరంనుంచి రాసమండలానికి వెళ్ళాను. నాతోపాటు ప్రాణాధికప్రియ విరజనుకూడా తీసుకు వెళ్ళాను. ఆక్కడ విరజతో నేను క్రీడిస్తున్న సంగతి దూతికద్వారా రాధకు తెలిసింది. కోపంగా వచ్చింది. నేను తిరోధానం చెందాను. విరజనుమాత్రం నదివైపామ్మని శపించింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. అక్కడ సుదాముడితో సరససంభాషణచేస్తూ నేనున్నాను. రాధికను చూస్తూనే నేను మౌనం వహించాను. ఆయినా కోపం ఆపుకోలేని రాధ నన్ను నిష్టురంగా నిందించింది. చేపేవన్సీ చేస్తావు, ఏమీ ఎరగనట్టు కూచుంటావు. నిన్ను ఏమి చేసినా తప్పులేదని దెప్పి పొడిచింది. కానీ ఎన్నిసార్లు తప్పించుకుంటావో చూస్తాను, చిక్కకపోతావా ? అప్పుడు చెబుతాను నీపని అంటూ పళ్ళు బిగి చూపుడువేలుతో బెదిరించింది.

ఇదంతా చూస్తున్న సుదాముడు రాధికాదౌష్ట్యాన్ని భరించలేకపోయాడు. అతడికి నామీద భక్తి గౌరవం ప్రేమ ఎక్కువాయె. దానితో చర్రునలేచి రాధికను అదే స్థాయిలో అదే చూపుడు వేలుతో అలాగే బెదిరించాడు. రాధాదేవి కోపానికి ఆజ్యం పోసినట్టయ్యింది. కళ్ళు చింతనిపులయ్యాయి. నా సన్నిధిలో నా సేవకుడు తనను కించపరచడం అవమానించడం బెదిరించడం అస్సలు భరించలేకపోయింది. వీడి బయటకు నెట్టివెయ్యండి అని ఆజ్ఞాపించింది. రాధిక వెంట ఉన్న వేనవేల చెలికత్తెలు చుట్టుముట్టి, ఎదేదో ఇంకా వాగుతున్న ఆ తేజస్విని బైటకు లాక్కుపోయారు. ఉక్రోషం ఆపుకోలేక ఆ బలశాలి సుదాముడు చెలికత్తెల్లో చాలామందిని అందినమటుకు అందినట్టు చావబాదాడు. ఇది తెలిసి రాధాదేవి కోపం మరింత భగ్గుమంది. దానవజన్మ ఎత్తరా - అని దారుణంగా శపించింది.

ఆ సుదాముడు శప్తుడై, విలపిస్తూ, వెళ్ళిపోతూ, ఆగి ఆగి వెనక్కి చూస్తూ మాకు నమస్మరిస్తూంటే రాధికాదేవికి గుండె కరిగిపోయింది. కోపం రాలి వాత్సల్యం చిగురించింది. కళ్ళల్లో నీళ్ళు కమ్ముకున్నాయి.

వత్సా! ఆగు. ఆగు. ఎక్కడికి వెడతావంటూ తానూ వెంటబడింది. గోపికలు విలపిస్తూ అనుసరించారు. ఆప్పుడు నేను కల్పించుకుని అందరినీ నిలువరించి, అరక్షణంలో నీ శాపాన్ని ఆనుభవించి సుదాముడు హాయిగా తిరిగి ఇక్కడికి వస్తాడు. ఇంతలోకే బెంబేలుపడకు అని చెప్పి రాధికను ఓదార్చాను. వెనక్కి తీసుకువచ్చాను. అందరినీ సముదాయించాను. విరించీ! గోలోకంలో అరక్షణమంటే భూలోకంలో ఒక మన్వంతరం. నీకు తెలుసుగదా!

ఈ రకంగా సుదాముడు శంఖచూడుడై దానవవంశంలో జన్మించి మన్వంతరం గడిచింది. అతడీ అవతారం త్వరలోనే ముగియనుంది. అతడు యోగవిద్యా విశారదుడు. మహాబలిష్టుడు సర్వమాయా విశారదుడు. కనక - శివా! నీకొక శూలం ఇస్తాను. దానితో రాక్షస సంహారం చెయ్యి. శంఖచూడుడి మెడలో సర్వమంగళ కారకమైన నా కవచం ఉంటుంది. నిరంతరం ధరించే ఉంటాడు. అది ఉన్నంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చెయ్యలేరు. విజయం ఎప్పుడూ అతనిదే. అంచేత నేను విప్రరూపంలో వెళ్ళి ఆ కవచాన్ని యాచించి స్వీకరిస్తాను.

చతుర్వదనా! మరొక విషయం. శంఖచూడుడికి నువ్వొక విచిత్రమైన వరం ఇచ్చావు. గుర్తుందా? ఇతడి భార్యకు శీలభంగం అయితే తప్ప శంఖచూడుడు మరణించడు. అది జరిగినప్పుడే ఇది జరుగుతుందనికదా నీ వరం!

అంచేత నేను వెళ్ళి రహస్యంగా తులసీగర్భంలో వీర్యనిక్షేపణం చేస్తాను. శంఖచూడుడు మరణిస్తాడు. అటుపైని తులసి దేహత్యాగం చేస్తుంది. గోలోకానికి విచ్చేసి మళ్ళీ నాప్రియ గోపిక అవుతుంది.

ఇంతగా వివరించి చెప్పి జగన్నాథుడు శివుణ్ణి పిలిచి శూలం అందించి తన అభ్యంతర మందిరంలోకి నిష్క్రమించాడు. బ్రహ్మ రుద్రాది దేవతలందరూ భారతభూమికి పయనమయ్యారు.

శివదూత రాయబారం


No comments:

Post a Comment

Previous life of Sankhachudu - శంఖచూడుడి పూర్వజన్మ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  శంఖచూడుడి పూర్వజన్మ పద్మసంభవా! శంఖచూడుడు దానవేంద్రుడే కావచ్చు. దేవతలనందరినీ పారద్రోలి ఉండవచ్చు. కానీ అతడి వృ...