తాళం: ఆది (రూపక)
రాగం: వరాళి (మేళకర్త 39, జలవరాళి జన్యరాగ)
రూపకర్త: రామదాసు
ఆరోహణ: స గ3 మ2 ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 మ2 గ3 రి2 గ3 స
పల్లవి:
అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య
చరణము(లు):
చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య॥ 1 ||
వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱివగల బొందుచుంటిగా కొన్నాళ్ళు॥ 2 ||
మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తేలుచుంటిగా కొన్నాళ్ళు॥ 3 ||
ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు॥ 4 ||
అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు॥ 5 ||
మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు॥ 6 ||
ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు॥ 7 ||
జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు ॥ 8 ||
వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు॥ 9 ||
వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు॥ 10 ||
పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు॥ 11 ||
వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓరామ ॥ 12 ||
ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు॥ 13 ||
అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు॥ 14 ||
ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటిగదా కొన్నాళ్ళు॥ 15 ||
చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య॥ 16 ||
పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలోనలిగి వరలుచు నుంటిగదా కొన్నాళ్ళు॥ 17 ||
పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు॥ 18 ||
లేతరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు॥ 19 ||
తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామా ॥ 20 ||
తెల్లతెల్లనై దంతము లూడివణకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు॥ 21 ||
బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు॥ 22 ||
అంతట మృతినొంది యలయుచు యమునిచే బాధలొందితిగా కొన్నాళ్ళు॥ 23 ||
ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు॥ 24 ||
కంజజనక భద్రాచలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు॥ 25 ||
వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామా ॥ 26 ||
No comments:
Post a Comment