Sunday, December 29, 2024

తిరుప్పావై - పదిహేనవ పాశురము

తిరుప్పావై - పదిహేనవ పాశురము


శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు పదిహేనవ పాశురము యొక్క విశేషాలు తెలుసుకుందాం.

ఇంత వరకు తొమ్మిది మంది గోపికలను మేల్కొల్పి.. ఈరోజు పదవ గోపికను యీ పాశురంలో మేలుకొలుపుతున్నారు. ఈ పాశురంలో... లోపల ఉన్న గోపికకు మరియు బయట ఉన్న గోపికలకు సంభాషణ చూద్దాం. ఈ పాశురం చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం.

ఎల్లే! ఇళంగిళియే ఇన్నముఱంగుదియో?
శిల్లెన్రు అళైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్! పండే ఉన్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తానాయుడుగ!
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేరుడైమై!
ఎల్లారుం పోందారో? పోందార్ పోందెణ్ణిక్కొళ్;
వల్లానై కొన్రానై, మాత్తారై మాత్తళిక్క
వల్లానై, మాయనై ప్పాడేలోరెంబావాయ్ || 15 || 

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని చూద్దాం

బయట గోపికఓ లేత చిలుక వంటిదానా! అయ్యో ఏంటమ్మా! ఇంకా నిద్రపోతున్నావా?

లోపలి గోపికచిరాగ్గా చిరుబురులాడుతూ, "చెవులు చిల్లులు పడినట్టు గట్టిగా అరవకండి. మీరే భక్తులు.. మీరే గొప్పవాళ్ళని తెలుసమ్మా! ఇదిగో నేనూ వస్తున్నాను".

బయట గోపిక : ఓ చిలుకా! నువ్వు చాలా తెలివైన దానివి. చమత్కారంగా మాట్లాడగలవు. నీ నేర్పరితనము, నీ మాటలు, నీ సామర్థ్యము మాకు తెలియదు అనుకున్నావా! మాకు ముందే తెలుసు.

లోపలి గోపిక : పోన్లెండమ్మా చెప్పక్కర్లేదు. మీరే తెలివైన వాళ్ళు. మీరే సమర్థులు. నేను కాదు. నేను ఒంటరి దాన్ని. అయినా మీరు చెప్పినట్లు నేను ఎందుకు కాదు అనాలి!. అది సరే గానీ రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా?

బయట గోపిక : అందరూ వచ్చేరు. నమ్మకం లేకపోతే నీవే వచ్చి లెక్కపెట్టుకో. నీకు వేరే పనేముంది గనుక.. బయటికి రా! కువలయా పీడమనే ఏనుగును, కంసుడు మొదలైన శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన మాయదారి శ్రీకృష్ణుని కీర్తించుటకు రావమ్మా!

లోపలి గోపిక వచ్చిన తర్వాత అందరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్తారు.

వివరణ :

ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధన గురించి వివరించబడింది. ఇట్టి సాధన చేయుటచేత ఏర్పడవలసిన ప్రధానమైన లక్షణము అహంకారము తొలుగడం. అది పూర్తిగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగదు. ఇట్టి పరిపూర్ణస్థితిలో ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుపబడుతుంది.


ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...