పాహి రామప్రభో
తాళం: ఝంప
రాగం: మధ్యమావతి
రూపకర్త: రామదాసు
పల్లవి
పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥
చరణము(లు):
శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥
సుందరాకార హృన్మందిరోద్ధార సీ
తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥
ఇందిరా హృదయారవిందాదిరూఢ
సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥
ఎందునేజూడ మీసుందరాననము
కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥
పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం
భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో ॥ 5 ॥
కందర్పజనక నాయందు రంజిల సదా
నందుడవై పూజలందు రామప్రభో ॥ 6 ॥
ఇంపుగా జెవులకు న్విందుగా నీకథల్
కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో ॥ 7 ॥
వందనముచేసి మునులందరు ఘనులైరి
విందవైనట్టి గోవింద రామప్రభో ॥ 8 ॥
బృందారకాది సద్బృందార్చితావతార
వింద ముని సందర్శితానంద రామప్రభో ॥ 9 ॥
తల్లివినీవె మాతండ్రివినీవె మా
ధాతవునీవె మాభ్రాత రామప్రభో ॥ 10 ॥
పల్లవాధరలైన గొల్లభామలగూడి
యుల్లమలరంగ రంజిల్లు రామప్రభో ॥ 11 ॥
మల్లరంగంబునందెల్ల మల్లులజీరి
యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో ॥ 12 ॥
కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ
సల్లాపమున క్రీడసల్పు రామప్రభో ॥ 13 ॥
తమ్ముడును నీవు పార్శ్వమ్ములంజేరి వి
ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో ॥ 14 ॥
క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు
ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో ॥ 15 ॥
రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్
నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 16 ॥
కంటి మీ శంఖమ్ము కంటి మీ చక్రము
కంటి మీ పాదముల్గంటి రామప్రభో ॥ 17 ॥
వింటి మహిమ వెన్నంటి తమ్ముడు నీవు
జంటరావయ్య నావెంట రామప్రభో ॥ 18 ॥
మేము నీవారమైనాము రక్షింపుమ
న్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో ॥ 19 ॥
నామనోవీధిని ప్రేమతోనుండు మీ
భూమిజాసహిత జయ రామచంద్రప్రభో ॥ 20 ॥
మీ మహత్త్వమ్ము విన మనమందు ప్రేమ
వేమరున్ బుట్టు శ్రీరామచంద్రప్రభో ॥ 21 ॥
శ్యామసుందర కోమలం జానకీమనః
కాముకం త్వం భజే రామచంద్రప్రభో ॥ 22 ॥
కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న
నా మొరాలించు నాస్వామి రామప్రభో ॥ 23 ॥
కామితప్రభుడవై ప్రేమతో రక్షించు
స్వామి సాకేతపురి రామచంద్రప్రభో ॥ 24 ॥
అన్న రావన్న నీకన్న నామీద నెన
రున్న వారేరి నాయన్న రామప్రభో ॥ 25 ॥
నిన్నెగాకను మరే యన్యులగానన్
గన్నతండ్రివిగ మాయన్న రామప్రభో ॥ 26 ॥
వెన్నదొంగిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని
న్నెన్నగా వశమె రావన్న రామప్రభో ॥ 27 ॥
ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక
నిన్నె నెమ్మదిని వర్ణింతు రామప్రభో ॥ 28 ॥
ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని
మన్నించి దయచేయుమన్న రామప్రభో ॥ 29 ॥
పన్నగాధిపశాయి భావనాతీత ఆ
పన్న నామనవి వినవన్న రామప్రభో ॥ 30 ॥
మేటివాక్యంబు మీసాటిదైవంబు ము
మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో ॥ 31 ॥
పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున
వేడుచున్నాను గాపాడు రామప్రభో ॥ 32 ॥
వేడుకోగానె నీజోడుకాడును నీవు
కూడి రారయ్య నాతోడ రామప్రభో ॥ 33 ॥
నేడు నాకోర్కె లీడేరగాజేసి కా
పాడరా కరినేలు జాడ రామప్రభో ॥ 34 ॥
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందు
వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో ॥ 35 ॥
చూడు మీభక్తులను గూడు మీరిపుల గో
రాడు మీవల్ల గోవింద రామప్రభో ॥ 36 ॥
పుండరీకాక్ష మార్తాండవంశోద్భవా
ఖండలస్తుత్య కోదండ రామప్రభో ॥ 37 ॥
కుండలిశయన భూమండలోద్ధరణ పా
షండజనహరణ కోదండరామప్రభో ॥ 38 ॥
నిండుదయతోడ నాయండ బాయకను నీ
వుండి గాపాడు కోదండరామప్రభో ॥ 39 ॥
జాతకౌతూహలం చక్షుకృత్యారమాం
పూతసీతాపతే దాత రామప్రభో ॥ 40 ॥
పాతకులలో మొదటి పాతకుడ నావంటి
పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో ॥ 41 ॥
భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖండించి
సీతగైకొన్న విఖ్యాత రామప్రభో ॥ 42 ॥
పూతనాకల్మషోద్ధూత పె\న్శత్రు సం
హారి శ్రీసీతాసమేత రామప్రభో ॥ 43 ॥
జాతినీతులులేక భూతలంబున దిరుగు
ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో ॥ 44 ॥
ఎప్పుడును గంటికి రెప్పవలె గాచి న
న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో ॥ 45 ॥
ఏదయా నీదయా యోదయాంభోనిధీ
యాదిలేదయ్య నామీద రామప్రభో ॥ 46 ॥
ఘోరరాక్షస గర్వహార విశ్వంభరో
ద్ధార గుణసాంద్రవిస్తార రామప్రభో ॥ 47 ॥
మోదమున నీవు నన్నాదుకోవయ్య గో
దావరీ తీర భద్రాద్రి రామప్రభో ॥ 48 ॥
నీదు బాణంబులను నాదుశత్రులబట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో ॥ 49 ॥
ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో ॥ 50 ॥
చాలదేమి పదాబ్జములసాటి యీపదు
నాల్గులోకంబుల గూడి రామప్రభో ॥ 51 ॥
ఏల యీలాగు జాగేల జేసెదవు మ
మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో ॥ 52 ॥
పాలువెన్నలు మ్రుచ్చిలింతివని యశోద
రోటగట్టిన మాయచాలు రామప్రభో ॥ 53 ॥
కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో
నల్లబిల్లిగను రంజిల్ల రామప్రభో ॥ 54 ॥
వాలి నొక్కమ్మునన్ గూలవేసిన శౌర్య
శాలియౌ నినుదలతు జాల రామప్రభో ॥ 55 ॥
సాలభంజికల నిర్మూలంబు చేయగా
జాలితివి గోపాలబాల రామప్రభో ॥ 56 ॥
తాళవృక్షము లొక్కకోల ధరగూలగా
లీలనేసిన బాహుశాలి రామప్రభో ॥ 57 ॥
(శిలయైన యహల్య శ్రీపాదములు
సోక నెలతయై మిము మదితలచె ॥ 58 ॥
వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్
గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో ॥ 59 ॥
దానధర్మంబులున్ దపజపంబులు నీదు
నామకీర్తనకు సరిరావు రామప్రభో ॥ 60 ॥
మానావమానములు మహిని నీవై యుండ
మాకేల మదిని ఈచింత రామప్రభో ॥ 61 ॥
జ్ఞానయోగాభ్యాసమందు నుండెడివారి
కానందమయుడవైనావు రామప్రభో ॥ 62 ॥
భానువంశమునందు మానవాధిపుడవై
దానవుల బరిమార్చినావు రామప్రభో ॥ 63 ॥
అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా
మనవి విను దేవకీతనయ రామప్రభో ॥ 64 ॥
మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స
న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో ॥ 65 ॥
నిత్యమై సత్యమై నిర్మలంబై మహిని
దివ్యవంశోత్తంసమైన రామప్రభో ॥ 66 ॥
సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన
శ్రావ్యమై యుండునో దివ్య రామప్రభో ॥ 67 ॥
గట్టిగా నీవున\న్ పట్టుగా విహితమౌ
నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో ॥ 68 ॥
దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి
పట్టి యాగము గాచినట్టి రామప్రభో ॥ 69 ॥
చుట్టుకొని కాళింగు డట్టహాసముచేయ
పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో ॥ 70 ॥
సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి
మ్మెంతురా జానకీకాంత రామప్రభో ॥ 71 ॥
పంతమున మీ పాదచింతనము చేయ నా
వంతలన్నియు మానుటెంత రామప్రభో ॥ 72 ॥
వింతగాదయ్య నేనింతనాడినది నా
పంతమున మిమ్ము భావింతు రామప్రభో ॥ 73 ॥
శాంతమూర్తిని రమాకాంతుడవని చాల
సంతసంబున నిన్ను నెంతు రామప్రభో ॥ 74 ॥
అక్షయంబైన నీకుక్షిలో లోకముల
రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో ॥ 75 ॥
దంతివత్సల భక్తచింతామణీ విశ్వ
మంతయును నీవు రక్షించు రామప్రభో ॥ 76 ॥
పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను
రక్షించు మోక్షప్రదాత రామప్రభో ॥ 77 ॥
రక్షించి సజ్జనుల వీక్షించి దుర్జనుల
రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 78 ॥
రక్షకుడవై జగద్రక్షణముచేయగా
రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 79 ॥
లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా
కక్షయంబుగ కటాక్షించు రామప్రభో ॥ 80 ॥
రావయా అభయంబు లీవయా నాస్వామీ
నీవయా గతి దేవరాయ రామప్రభో ॥ 81 ॥
కావు కావుమటంచు కాకాసురుడురాగ
కాచి రక్షించినావయ్య రామప్రభో ॥ 82 ॥
దేవదేవోత్తమా దేవేంద్రసన్నుతా
కావవేనన్ను శ్రీరామచంద్రప్రభో ॥ 83 ॥
భావజజనక నా బాధలన్నియుమాన్పి
యే విధంబునైన నేలు రామప్రభో ॥ 84 ॥
శ్రీవైష్ణవులపాలి చింతామణివి చాల
సేవగైకొని కరుణచేయు రామప్రభో ॥ 85 ॥
భావమున మిముభక్తి సేవించు జనులకు
కైవల్యమొసగు శ్రీరామచంద్రప్రభో ॥ 86 ॥
గోపాలురను గూడి యావులను మేపి
ఆపదోద్ధారకుడవైన రామప్రభో ॥ 87 ॥
నాపాలి శ్రీరామ భూపాలకా నను
కాపాడరావ గోపాల రామప్రభో ॥ 88 ॥
సారమౌశౌర్య విస్తారమౌ సుందరా
కారసద్భక్తమందార రామప్రభో ॥ 89 ॥
శరణాగతత్రాణ బిరుదాంకితంబైన
వరము నాకొసగు యేమరక రామప్రభో ॥ 90 ॥
శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె
సారెకును వింతగా జదువ రామప్రభో ॥ 91 ॥
శ్రీరామ నీనామ చింతనామృతపాన
సారమే నాదుమది గోరు రామప్రభో ॥ 92 ॥
చేరి మీపాద పద్మారాధనము చేయ
కోరినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 93 ॥
ఘోరరాక్షసగర్వహారి విశ్వంభరా
భూరిగుణసాంద్ర విస్తార రామప్రభో ॥ 94 ॥
మారీచమాయానివార శరసంధాన
ధారుణీతనయా విహార రామప్రభో ॥ 95 ॥
పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న
న్నరసి పోషింపగదవయ్య రామప్రభో ॥ 96 ॥
పరధనంబును పరస్త్రీల నపేక్షించు
నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో ॥ 97 ॥
కామాదిదుర్గుణ స్తోమంబులడగ మీ
నామామృతమె దిక్కు రామచంద్రప్రభో ॥ 98 ॥
దుష్టులగు దానవుల నష్టంబుగా జేయగా
బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో ॥ 99 ॥
కష్టపడలేనయ్య పట్టాభిరామ నా
కిష్టసంపదలిచ్చి యేలు రామప్రభో ॥ 100 ॥
కేశవాయనిన భవపాశముళొలగు స
ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో ॥ 101 ॥
నారాయణా నీదు నామామృతం బెపుడు
పారాయణము చేతు నేను రామప్రభో ॥ 102 ॥
మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు
సాధుసజ్జనదయాంభోధి రామప్రభో ॥ 103 ॥
గోవింద గోవింద గోపాలకృష్ణయని
గోపకులు గొనియాడు గోపరామప్రభో ॥ 104 ॥
విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ
యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో ॥ 105 ॥
శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం
గాధర స్తోత్ర యానంద రామప్రభో ॥ 106 ॥
మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుంచి
తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో ॥ 107 ॥
కూర్మరూపము నొంది కొండమూపునదాల్చి
కూర్మితో నమృతంబుగూర్చి రామప్రభో ॥ 108 ॥
వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి
సురల రక్షించు దాశరథి రామప్రభో ॥ 109 ॥
శరణన్న ప్రహ్లాదు గరుణించి రక్షింప
నరసింహమూర్తివైనట్టి రామప్రభో ॥ 110 ॥
వామనత్వమున భూదానమడిగియు బలిని
భూమిక్రిందనడంచి పొల్చు రామప్రభో ॥ 111 ॥
పరశురాముడనంగ నరపాలకులనెల్ల
నరసిపొరికొన్న దాశరథి రామప్రభో ॥ 112 ॥
శ్రీరామమూర్తివై యారావణుని తలల్
ధారుణిన్ పడగూర్చినావు రామప్రభో ॥ 113 ॥
హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల
బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో ॥ 114 ॥
సిద్ధసన్నుత మనోబద్ధుండవై నీవు
బౌద్ధుండవైతి ప్రబుద్ధ రామప్రభో ॥ 115 ॥
కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో ॥ 116 ॥
అవ్యయుడవైన నీయవతారముల జూచి
దివ్యులైనారు మునులయ్య రామప్రభో ॥ 117 ॥
శ్రీరామనామమే వేళస్మరియింతు
స్వామి దయచేయు సంపదను రామప్రభో ॥ 118 ॥
అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ
నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో ॥ 119 ॥
తెప్పరంబులుదీర్చి యిప్పుడేమరక నన్
ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో ॥ 120 ॥
పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైలి రామప్రభో ॥ 121 ॥
పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని
కష్టపెట్టకను చేపట్టు రామప్రభో ॥ 122 ॥
No comments:
Post a Comment