Sunday, December 29, 2024

CHERI YASODAKU చేరి యశోదకు శిశు వితడు

 పల్లవి 

చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ||

చరణములు 
సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు |
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు ||

మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి |
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ||

ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు |
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ||

CHOODARAMMA SATULAARAA చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ

 పల్లవి 

చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||

చరణములు 
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||

కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ||

DAACHUKO NEE PAADAALAKU దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి

 రాగం: ఆరభి


పల్లవి 
దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ||

చరణములు 
వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ |
తక్కినవి భాండారాన దాచి వుండనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి విక నవి తీరని నా ధనమయ్యా ||

నానాలికపైనుండి నానాసంకీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడించితివి |
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ |
కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా ||

యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ||

RAMA DASARATHA RAAMAA రామ దశరథరామ నిజ సత్య

 పల్లవి 

రామ దశరథరామ నిజ సత్య
కామ నమో నమో కాకుత్థ్సరామ ||

చరణములు 
కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ |
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ||

దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ |
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ||

సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ |
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ||

DEVA DEVAM BHAJE దేవ దేవం భజే దివ్యప్రభావం

 రాగం: ధన్నాసి


పల్లవి 
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం ||

చరణములు 
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం |
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం ||

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి
శాలవక్షం విమల జలజనాభం |
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం ||

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం |
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం ||

DEVA EE TAGAVU TEERCHAVAYYAA దేవ యీ తగవు దీర్చవయ్యా

 పల్లవి 

దేవ యీ తగవు దీర్చవయ్యా
వేవేలకు నిది విన్నపమయ్యా ||

చరణములు 
తనువున బొడమినతతి నింద్రియములు
పొనిగి యెక్కడికి బోవునయా |
పెనగి తల్లికడ బిడ్డలు భువిలో
యెనగొని యెక్కడి కేగుదురయ్యా ||

పొడుగుచు మనమున బొడమిన యాసలు
అదన నెక్కడికి నరుగునయా |
వొదుగుచు జలములనుండు మత్స్యములు
పదపడి యేగతి బాసీనయ్యా ||

లలి నొకటొకటికి లంకెలు నివే
అలరుచు నేమని యందునయా |
బలు శ్రీవేంకటపతి నాయాత్మను
గలిగితి వెక్కడి కలుషములయ్యా ||

DOLAAYAANCHALA డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం

 రాగం: వరాళి


పల్లవి 
డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ||

చరణములు 
మీనకూర్మ వరాహా మృగపతి//అవతారా |
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ||

వామన రామ రామ వరకృష్ణ అవతారా |
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ||

దారుణ బుద్ద కలికి దశవిధ//అవతారా |
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ || 2 ||

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....