Tuesday, January 7, 2025

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

తిరుప్పావై - ఇరవై నాలుగోవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 24 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

నిన్న ఇరవై మూడవ పాశురం లో మన వాళ్ళు స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా! స్వామి వస్తుంటే ఆయన పాదాలను చూసారు. అవి కంది పోయినట్లు అనిపించింది. పాదాలు స్వతహాగా గులాబి రంగులో ఉంటాయి. కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు కంది పోయాయి అనుకుంటున్నారు. మేం నీ పాదాలు కందిపోయేలా చేసామే అంటూ బాధపడ్డారు. వీళ్ళేమీ శ్రీకృష్ణుణ్ణి బాధ పెట్టడానికి రాలేదు కదా!. కేవలం ఆ స్వామిని చూసి అనందిద్దామని వచ్చారు.వెంటనే స్వామి దివ్య పాదారవిందాన్ని మొదలుకొని మంగళం పాడుతున్నారు.

ఈ 24 వ పాశురాన్ని మాంగళాశాసన పాశురం లేక హారతి పాశురం అని కూడా అంటారు. భగవంతుణ్ణి తెలుసుకున్న జీవుడికి రెండు రకాల దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ప్రేమ దశ. జ్ఞాన దశలో భగవంతుడు ఎలాంటివాడో, తను ఎలాంటివాడో తెలుసుకోవడం. భగవంతుడు చాలా గొప్పవాడు, జగత్తును రక్షించేవాడు అని తెలుసుకోవడం. తను ఏ జ్ఞానం లేనివాడూ, భగవంతుడు రక్షిస్తే తప్ప తనకు రక్షణ లభించదు అని తెలుసుకుంటాడు. ఇక ఈ జ్ఞానం పండితే క్రమంగా ప్రేమ లేక భక్తి దశగా మారుతుంది. ఈ దశలో భగవంతునికున్న శక్తిని మరచి.. ఆయనకున్న సౌకుమార్యం, సౌశీల్యం అనే గుణాలనే చూస్తాడు. ఇక తను అజ్ఞాని అని మరచిపోయి తనే భగవంతుణ్ణి రక్షించుకోవాలని అనుకుంటాడు. జ్ఞానం కల్గినప్పుడు భగవంతుడు తనని రక్షించేవాడు అని ఒకప్పుడు భావించినవాడు, ఈనాడు భక్తితో తాను భగవంతుణ్ణి రక్షించుకోవాలి అన్నట్టుగా మారుతాడు. ఏదైన ఒక విలువైన వస్తువు మన ఇంట్లో ఉంటే మనం ఎలాగైతే ఆ వస్తువుని రక్షించుకుంటామో అట్లానే. అందుకే మనం.. ఆలయాల్లో తలుపులనీ, తాళమనీ ఇలా అన్నీ రక్షించుకోవడం కోసం చేస్తుంటాం. లోకాలను రక్షణ చేసే వాడికి మనం రక్షణ కల్పించడం ఏంటి? కనుక అది ఎంతో ప్రేమతో చేస్తాం. దృష్టిదోషం తొలగుగాక అని, కర్పూరం ఎలాగైతే హరించుకు పోతుందో. అదేవిధంగా దోషాలన్నీ హరించుగాక! అని మంగళం పాడుదాం. 

ఈరోజు పాశురం…..

అన్రివ్వులగ మళందాయ్ ! అడిపోత్తి
చ్చెన్రంగుతైన్నిలంగై శెత్తాయ్ ! తిరల్ పోత్తి
పోన్రచ్చగడ ముదైత్తాయ్! పుగళ్ పోత్తి
కన్రు కుణిలా వెరిన్దాయ్! కళల్ పోత్తి
కున్రుకుడైయావెడుత్తాయ్ ! గుణం పోత్తి
వెన్రు పగైకెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమే యేత్తిపఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలో రెంబావాయ్ || 24 ||

ఇప్పుడు ఈ పాశురము యొక్క భావాన్ని చూద్దాం.

శ్రీకృష్ణుడు శయనమందిరం బయటికి వచ్చి ఆస్థానంలో సింహాసనముపై ఆసీనుడివి కావాలని ఆమె మరియు ఆమె సఖులు ప్రార్థిస్తున్నారు. దేవేరి నప్పిన్నాయ్ తో సహా, కృష్ణుడు సింహాసనముపై ఆశీనుడయ్యాడు. ఆయన నడిచివచ్చిన తీరు సింహం నడకని మరిపించిందట. ఆయన నడకను చూసిన గోపికలు అద్భుతమైన ఆశ్చర్యానికి లోనయ్యారు. భగవంతుడు, పిరాట్టి ప్రసాదించిన దర్శన సౌభాగ్యాన్ని కన్నులపండుగగా తిలకించారు. వారి శ్రీచరణాలకు దృష్టిదోషం అంటకుండా మంగళాశాసనం పలికారు. ఆ తర్వాత వారు అక్కడికి వచ్చిన కార్యాన్ని విన్నవించుకున్నారు. శ్రీ వ్రతం ఆచరించడానికి కావలసిన ఉపకరణాలు అందజేయాలని వేడుకున్నారు. నిరంతర కైంకర్య భాగ్యం ప్రసాదించమని గోపికలు ప్రార్థించారు. గోపికలు ప్రార్థించగా కృష్ణుడు శయ్య మీద నుంచి లేచాడు. ఆయన తన వంక ఒక పెద్దపులి, ఒక సింహం వచ్చినట్లు నడిచి రావడాన్ని చూసి గోపికలు ఆయనకు అడుగడుగునా మంగళాశాసనం సమర్పించారు.

వామనావతార కాలంలో బలిచక్రవర్తి వలన బాధలు పడుతున్న దేవతలను రక్షించడానికి, బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచడానికి, ముల్లోకములను రెండడుగులతో కొలిచిన స్వామీ! అటువంటి మీ పాదారవిందములకు మంగళమగు గాక! శుభమగు గాక! రామావతార కాలమున సీతను అపహరించిన, దక్షిణ దిశగా వున్న లంకాధీశుడూ, దుష్టుడూ అయిన రావణుడున్న చోటికి వచ్చి సుందరమైన లంకను నశింపజేసిన స్వామీ! నీ పరాక్రమమునకు మంగళమగు గాక! జయ మంగళం. నిన్ను అంతం చేయడానికి బండి రూపంలో వచ్చిన శకటాసురుని తన్ని, ఏ ముక్క కి ఆ ముక్క వూడదీసిన నీ కీర్తికి మంగళమగు గాక ! దూడ రూపంలో వచ్చిన వత్సాసురిని కర్రపుల్ల వలె విరిచి, నిన్ను సంహరించడానికి వచ్చిన కపిత్థాసురుని గాలిలోకి ఎగరవేసిన స్వామీ!.....

మీ శ్రీ పాదములకు మంగళమగు గాక! దేవేంద్రుడు కురిపించిన కుంభవృష్టి నుండి గోవులను, గోపాలురను కాపాడడానికి గోవర్ధన పర్వతమును 7 రోజులు గొడుగుగా ఎత్తిన స్వామీ! నీ కృపాగుణమునకు మంగళమగుగాక! శుభమగు గాక! శత్రువులను జయించి, ద్వేషమును నశింపజేయు నీ చేతియందున్న బల్లెమునకు (వేలాయుధమునకు) మంగళమగు గాక! అని ఈ ప్రకారము మంగళాశాసనం చేసి నీ వీర చరిత్రనే పాడడానికి వచ్చాము. మేము నీకు దాసులము. నీ దగ్గరనుండి వాద్య విశేషమును (పఱను) పొందుటకు వచ్చినాము. దయ చూపించు అని వేడుకుంటున్నారు.
ఈ పాశురం తిరుప్పావై ప్రబంధంలో పొదిగిన ఒక ఆభరణం వంటిది. తండ్రి విష్ణుచిత్తుడు లాగే ఆండాళ్ కూడా భగవంతునికి 'పల్లాండు' అంటే మంగళాశాసనం గానం చేసింది.

ఆండాల్ తిరువడిగళే శరణం

Monday, January 6, 2025

Nitya Sthothravali - నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

తిరుప్పావై - ఇరవై మూడవ పాశురము

తిరుప్పావై - ఇరవై మూడవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 23 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

ఈ రోజు ఆండాళ్ చేసిన.. ఒక సింహం తన గుహలోంచి ఎలా బయలుదేరి వస్తుంది అనే అద్భుత వర్ణన ఈ నాటి పాశురంలో చేస్తుంది, అందుకే ప్రకృతి గురించి అధ్యయనం చేయాలన్నా తిరుప్పావై చదవాలి. సాహిత్యం తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఉపమానోపమేయాల గురించి తెలియాలంటే తిరుప్పావై చదవాలి. ఇక ఇదీ అదీ అని నియమం లేదు అన్నట్లుగా సవాలు విసురుతుంది తిరుప్పావై. అన్నింటికి ఇదే మూలం అని చెప్పవచ్చు.

మారి మలై ముళంగిల్ మన్నిక్కిడందు రంగుమ్
శీరియ సింగ మరివిత్తు తీవిళిత్తు
వేరి మయిర్ పొంగ వెప్పాడుమ్ పేరుందు దఱి
మూరి నిమిరుందు ముళంగిప్పుఱప్పట్టు
పోదరు మాపోలే; నీ పూవైప్పూ వణ్ణా! ఉన్ 
కోయిల్ నిన్రింగనే పోందరుళి, కోప్పడైయ
శీరియ సింగాశనత్తిరుందు, యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెంబావాయ్ || 23 ||
 
ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం..

ఈ పాశురంలో కృష్ణుడు యొక్క గంభీరమైనటువంటి స్వభావాన్ని.. మృగరాజు అయిన సింహం నడకలాగ ఆండాళ్ వర్ణిస్తుంది. దీనికి ముందు పాశురంలో గోపికలు కృష్ణుని పడక గదిలో ప్రవేశించి ఆయన పాదాల వద్దకు చేరుకోవడం, కనులు విప్పి చూడమని అర్థించడం గురించి వివరించింది. ఆయన అంగీకరించాడు. 'యశోద ఒడిలోని కొదమ సింహం' (యశోద ఇళై సింగం) నిద్ర మేల్కొన్నాడు. ఆయన మేల్కొన్న తీరు ఎలా ఉందంటే వర్ష ఋతువులో మేఘ గర్జన విని నిద్రాభంగం అయిన సింహం మేల్కొన్నట్లు ఉందిట.

గోపికల మేలుకొలుపు విన్న కృష్ణుడు మృగరాజు అయిన సింహం.. కొండగుహలో నిద్రిస్తుండగా వర్ష ఋతువులో మేఘం గర్జిస్తే ఎలా ఉంటుందో..గుహ దద్ధరిల్లినట్లు ఉలిక్కిపడి, కోపంగా లేచి, నిప్పులు కక్కుతున్న ఎర్రని నేత్రాలతో సింహనాదం చేస్తూ, తీక్షణమైన తన చూపులతో నలుదెసలా పరికించినట్లు, నిక్కబొడుచుకున్న జూలు విదిల్చికొని గుహ బయటకు రాజఠీవితో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట ఆ పరమాత్మ. నీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగిస్తూ సింహం వలే నీ మందిరం నుంచి బయటకు రావయ్యా! నీలమేఘశ్యామా! వచ్చి నీ ఉత్తమ సింహాసనం మీద ఆసీనుడవై మమ్మల్ని అనుగ్రహించు. మా అభీష్టాన్ని తీర్చు అని ఆండాళ్ కోరుతుంది.

కృష్ణుడికి కోపం వచ్చినట్లుంది. 'వేళాపాళా లేకుండా నిద్ర లేపడానికి వచ్చేయడమేనా?' అని ఆయన అంటే, "స్వామీ! బిడ్డలు తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడానికి సమయా సమయాలతో పనేముంది? నీ దర్శనం కోరుకునే భక్తులను రక్షిస్తానని నువ్వే హామీ ఇచ్చావు కదా! సర్వసంగ పరిత్యాగులకే నీ దర్శన భాగ్యం కలుగుతుందా? నిన్నే నమ్ముకున్న మాలాంటి గొల్ల పిల్లల సంగతి ఏమిటి? సంసారం విషయంలో విరక్తి పెంచుకొని.. నీ కోసం బయల్దేరి శరణాగతులమై వచ్చాం. ఓ పురుష సింహమా! గంభీరంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనంపై కూర్చుని మా పూజలందుకొని మామొర ఆలకించు స్వామీ! మమ్మల్ని అనుగ్రహించు" అని గోపికలందరూ మొరపెట్టుకున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Sunday, January 5, 2025

తిరుప్పావై - ఇరవై రెండువ పాశురము

తిరుప్పావై - ఇరవై రెండువ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 22 వ. పాశురం గురించి తెలుసుకుందాం.

అంగణ్ మా జాలత్తరశర్, అభిమాన
బంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శంగమిరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయ్ దామరై ప్పూప్పోలే
శెంగణ్ శిరిచ్చిరిదే యెమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళుందార్ పోల్
అంగణిరండుంగొండు ఎంగల్ మేల్ నోక్కుదియేల్
ఎంగల్ మేల్ చాబ మిళందేలో రెంబావాయ్ || 22 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క భావాన్ని చూద్దాం

"ఓ స్వామీ! ఈ సువిశాల, సమస్త భూమండలాన్ని పరిపాలించిన రాజులు తమకి ఎదురులేదన్న అహంకారాన్ని, మమకారాన్ని, అభిమానాన్ని అణచుకొని తమ చక్రవర్తుల దగ్గర పాదాక్రాంతులై దేవరవారి సింహాసనము కింద గుమిగూడి ఉన్నారు. అదేవిధంగా మేము కూడా అరిషడ్వర్గాలను వదులుకొని నీ సన్నిధికి వచ్చాము. మాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు ప్రభూ!. కావున లేత ఎరుపు గల మందారు పువ్వుల్లా, సిరిమువ్వల్లా ఉన్న నీ కనులు తెరచి ఒక్కసారి మా వైపు చూడు. తామర పువ్వులు వికసించడానికి సూర్యరశ్మి ఏవిధంగా తోడ్పడుతుందో, అదేవిధంగా మేము ఆర్తితో ప్రార్థించిన ప్రార్థనల వల్ల నీ అందమైన నేత్రాలు తెరుచుకోవాలి. చంద్రుడు, సూర్యుడు ఇద్దరూ ఉదయించినట్లున్న అందమైన నీ కన్నులతో ఒక్కసారి చూసావంటే మా పాపాలన్నీ నశించిపోతాయి". 

సూర్యుని వెలుగు.. చీకట్లను పోగొట్టినట్లు, చంద్రుని వెలుగు.. మనసుకు ఆహ్లాదం కలిగిస్తుంది. సూర్య చంద్రులు పరమాత్మ యొక్క రెండు నేత్రాలు. ఆయన గాని కళ్ళతో ఒక్క చూపు మన వైపు చూస్తే చాలు.. మనలో గల అజ్ఞానం నశిస్తుంది. 

అతసీ పువ్వు లాగా నల్లని శరీర కాంతి కలిగిన ఓ స్వామీ! వర్షాకాలంలో కొండగుహలలో పడుకొని ఉన్న సింహం మేల్కొని అగ్ని జ్వాలల లాంటి చూపులతో నాలుగు దిక్కులు చూస్తూ అవయవములు కదిలించి, శబ్దం చేసి, బాగా నిట్టనిలువుగా సాగి గర్జించి బయటికి వచ్చినట్లే.. నువ్వు కూడా నీ శయన మందిరం నుంచి ఈ మణి మంటపానికి ఒక సింహంలా విచ్చేసి, జయప్రదమైన సింహాసనం మీద కూర్చుని, మేము వచ్చిన పనిని గమనించు తండ్రీ. నీ చూపులు మాపై ప్రసరించిన వెంటనే మా కర్మ బంధములన్నీ తొలగిపోవును. కనుక మా కర్మబంధములు తొలగ గానే మేము నిన్ను చేరుకుంటాం కదా ! మా వ్రతమునకు పొందవలసిన ఫలము గూడ యిదియేగదా ! అని ఆండాళ్ తల్లి కర్మ బంధం తొలగితే ముక్తి లభిస్తుందని' తెలియజేస్తోంది. 

పరమాత్మను పొందాలని కోరుకొనేవారు స్వామికి సంపూర్ణ శరణాగతులవ్వాలి. సంపూర్ణ ప్రపత్తిని చేయాలి. స్వామి పాదాలచెంత వ్రాలి నీవు తప్ప మాకు వేరే దిక్కులేదు. మేము పూర్తిగా నీవారమే అనే శరణాగతి చేసి పాదాలను ఆశ్రయించాలని ఆండాళ్ తల్లి బోధిస్తోంది. ఈ మాలికలో - మేము నిన్ను స్తుతిస్తుండగా నీ అతిలోక సుందరమైన రూపాన్ని - అనగా మెల్లమెల్లగా సూర్యచంద్రులవంటి నీ కన్నులను వికసింపచేస్తుండగా.. నీ కరుణా కటాక్ష వీక్షణాల వాత్సల్య రస పూర్ణధారలను తనివితీరా పొంది ఆనందించాలని వచ్చాము అని గోపికలు తెలిపారు. కర్మల కారణంగా పరమాత్మకు బహుదూరమైన జీవులు తిరిగి కలుసుకొనేటట్లు చేసేదే యీ ధనుర్మాస వ్రతమంటుంది మన ఆండాళ్ తల్లి.

గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుము అని వెనుకటి పాశురములో ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురములో వివరిస్తున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉంటుంది. సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంకారంతో కూడిన అభిమానము. భగవంతుడిని ఆశ్రయించినపుడు ఇతర సంబంధమును పూర్తిగా వదలి, భగవంతుడికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అదేవిధంగా ఈ పాశురములో విజ్ఞాపన చేస్తున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Saturday, January 4, 2025

తిరుప్పావై - ఇరవై ఒకట వ పాశురము

తిరుప్పావై - ఇరవై ఒకట వ  పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 21వ రోజు.

నిన్న విసనకర్ర, అద్దము అనునవి స్నాన వ్రతానికి కావలసిన పరికరములు. విసనకర్ర శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాపాన్ని పోగొడుతుంది. ఇక అద్దము స్వస్వరూపాన్ని తెలియజేసేది. మనల్ని మనకు చూపించేది. మమ్మల్ని అనుగ్రహించి సుఖ పెట్టమ్మా!

అని గోపికలు ఆ తల్లిని ప్రార్థించారు.

ఈరోజు శ్రీ కృష్ణుడిని స్తుతిస్తున్నారు.

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప
మాత్తాదే పాల్ శొరియమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కళ్
అత్తప్పడైత్తాన్ మగనే! యఱివుఱాయ్
ఊత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోత్తమాయ్ నిన్రశుడరే! తుయిలెళాయ్
మాత్తారునక్కు వలితులయిందు వున్ వాశఱ్కణ్
ఆత్తాదు వందు వున్నడి పణియు మాప్పోలే
పోత్తియామ్ వందోమ్ పుగళుందు ఏలోరెంబావాయ్ || 21 ||

ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం….

ఓ నందగోపుని పుత్రుడా! పాలు పితకడానికి పెట్టిన కుండలన్నీ నిండిపోయి కిందకి పొర్లి పోతున్నాయి. గొప్ప ఔదార్యం కలిగిన పశువులు సమృద్ధిగా కలిగి ఉన్నాడు నీ తండ్రి. అటువంటి గొప్పవాని పుత్రుడా! మేలుకో! వేదములచేత చెప్పబడిన వాడా! మేలుకో! లోకంలో ఆశ్రితులను రక్షించడానికి అవతరించిన తేజోరూపుడా! నిద్రలోంచి లే! నీ శత్రువులు నీతో ఎదురుగా వచ్చి పోరాడి నిలువలేక, వేరే గతిలేక, దీనులై, నీ సన్నిధిలో, నీ పాదములను ఏ విధముగా ఆశ్రయిస్తారో.. అదేవిధంగా మేము కూడా నీ కళ్యాణ గుణములను కీర్తిస్తూ, నీకు మంగళాశాసనము చేయడానికి వచ్చితిమి.

అంతరార్ధం

గోపికల ప్రార్థనను మన్నించి, నీలాదేవి వారితో గొంతు కలిపి, శ్రీకృష్ణుని మేల్కొలుపుతుంది.నందగోపుడికి చాలా గోసంపద ఉంది. పెద్ద పెద్ద పొదుగులు కలిగి ఉండి, పొదుగు కింద కుండ పెట్టగానే పాలు ఆగకుండా పొంగిపొర్లుతుంటాయి.

నందుడు దగ్గర అటువంటి గోవులు ఎన్నో వేల కొద్దీ ఉన్నాయి. గోవులు అంటే వేదములు. నందగోపుడే ఆచార్యుడు. ఆయనే పాలిచ్చే గోవు కూడా. ఆచార్యుడి ఉపదేశమే పాలు. గోవుకి చిన్న కుండ, పెద్ద కుండ అని తేడా ఉండదు. పొదుగు కింద పెట్టడమే ఆలస్యం పాలతో కుండ నిండిపోతుంది.మనం కూడా గురువుని ఆశ్రయిస్తే జ్ఞానం కలుగుతుంది. గురువుని చేరడానికి మనదే ఆలస్యం.

గోవు మనకి పాలు ఇచ్చినప్పుడు తను ఏదో మనకి ఉపకారం చేసినట్టుగా భావించదు. గురువు కూడా అంతే. గురుభక్తి మనకు ఉండాలి.

భగవత్ కటాక్షం పొందిన గోపికలు పరతత్వాన్ని తెలిసినవారు. భగవత్ తత్వాన్ని తెలుసుకోలేని వారు మూఢులు అని చెప్తుంది వేదం. ఆలయంలో అర్చామూర్తులను కేవలం విగ్రహములుగా, ఉపకరణాలుగా చూస్తున్న వారు మూఢులు.

తనను ఆశ్రయించిన వారిని పరమాత్మ రక్షిస్తాడు అనడంలో ఎటువంటి అనుమానం అక్కరలేదు.గోపికలకు పరమాత్మపై విశ్వాసం చాలా ఉంది.

గోపికలు పరమాత్మ తమను అనుగ్రహించడం లేదని భావిస్తూ ఈ విధంగా అనుకుంటున్నారు."స్వామీ! మేము ఎన్నో తప్పులు చేసాము. మేము కూడా హిరణ్యకశిపుడు, రావణాసురుడు వంటి వారమే. నీవు మాకు దూరంగా ఉండటం వలన మేము కూడా భాగవతులను హింసించేమేమో అని బాధపడుతున్నాము. పూర్వం కాకాసురుడు బ్రహ్మాస్త్రాన్ని తట్టుకోలేక రాముని శరణు కోరాడు. ఈరోజు మేము కూడా నిన్ను శరణు వేడుకుంటున్నాము".

సీతాదేవి.. శ్రీరాముడే వచ్చి తనను రక్షిస్తాడని తనను తాను రక్షించుకొనే ప్రయత్నం మానుకుంది.భక్తుడు కోరినా, కోరక పోయినా భగవంతుడు రక్షిస్తాడు. కానీ మనం కోరి భగవంతుడిని పొందితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది.

అంతా భగవంతుడే అనుకున్న వాడికి శాంతి. అంతా నేనే అనుకున్న వాడికి ఆశాంతి. ఈ విధంగా భావిస్తూ గోపికలు శ్రీకృష్ణుని శరణు వేడుకున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Friday, January 3, 2025

తిరుప్పావై - ఇరవైవ పాశురము

 తిరుప్పావై - ఇరవైవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఈరోజు 20వ రోజు.

నిన్నటి రోజున గోపికలు నీలాదేవి తో చెబుతున్న మాటలు..
నువ్వు నీ స్వామిని ఇప్పటికైనా లేపి మాకు చూపించవా? ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా? నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు.

ఈరోజు పాశురాన్ని చదువుదాం.

ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే! తుయిలెళాయ్
శెప్పముడైయాయ్! తిఱలుడైయాయ్! శెత్తార్కు
వెప్పమ్ కొడుక్కుం విమలా! తుయిలెళాయ్
శెప్పన్న మెన్ ములై శెవ్వాయ్ చ్చిరుమరుంగుల్
నప్పిన్నయ్ నంగాయ్! తిరువే! తుయిలెళాయ్
ఉక్కముం తట్టొళియుం తన్దు వున్ మణాళనై
ఇప్పోతే ఎమ్మై నీరాట్టేలో రెంబావాయ్ || 20 ||

ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం

దేవతలకు ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే శ్రీహరి తన శక్తి చేత వారిని ఆదుకుంటాడు.ముప్పై మూడు కోట్ల దేవతలకు రాక్షసుల వల్ల కానీ, మరే విధంగా గాని కలిగే ఆపదలను ముందుగానే పోయి తొలగించేటంత బలం కలవాడా! 

నిర్మలుడవు, ఆర్జవము కలవాడా! అంటే నిజాయితీ కలవాడా! నిదుర మేలుకో! మనసుతోను, వాక్కుతోను, శరీరంతోనూ కూడా ఒకే విధమైన గుణము కలవాడా!...
(భగవంతుడు తన మనసులో ఉన్నది మాటలతోనూ, మాటలతో వచ్చినది చేతులతోనూ చేసి చూపిస్తాడు.మన లాగా మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి. ఆ విధంగా ఉండదు పరమాత్మ తత్వం.)

నిన్ను ఆశ్రయించిన వారి దుఃఖములను పోగొట్టేవాడా! నిద్ర మేల్కో! అని గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మని లేపినా సరే ఆయన నిద్ర లేవలేదు. 

పరమాత్మ లేవలేదు అంటే, లేచి వాళ్ళను అనుగ్రహించలేదు అంటే ఆ గోపికలకి ఇంకా మోక్షం పొందడానికి కొంచెం సమయం ఉందన్నమాట.

అప్పుడు గోపికలు ఆలోచించి..అలాక్కాదు ముందు అమ్మనే నిద్ర లేపుదాం అని నీలాదేవిని మేల్కొలపడానికి ప్రయత్నిస్తున్నారు. నిద్రలే అమ్మా! బంగారు కలశముల వంటి మృదువైన స్తనములను కలదానా!, దొండపండు వలె ఎర్రని పెదవియును, సన్నని నడుమును కలిగిన నప్పిన్న అనే పేరుగల ఓ మహాలక్ష్మీ!

ఓ నీలాదేవీ! నిద్ర మేలుకో! 
నీలాదేవి వక్షస్థలమే (స్తన ద్వయమే) శ్రీకృష్ణపరమాత్మ నివాసస్థానం.
(లోకలన్నింటికీ అమ్మ కదా! అందుచేత అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇలా వర్ణించడం తప్పుకాదని గోపికలు భావించారు.) 

మాకు (ఆలపట్టం) విసనకర్రను, అద్దమును ఇచ్చి మమ్ములను నీ పెనిమిటితో కలిసి,
స్నానమాడించి సుఖింప చేయుము. 

ఆ గోపికలు పరమాత్మతో కలిసి స్నానం చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
విసనకర్ర, అద్దము అనునవి స్నాన వ్రతానికి కావలసిన పరికరములు. విసనకర్ర శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి తాపాన్ని పోగొడుతుంది. ఇక అద్దము స్వస్వరూపాన్ని తెలియజేసేది. మనల్ని మనకు చూపించేది.మమ్మల్ని అనుగ్రహించి సుఖ పెట్టమ్మా!

అని గోపికలు ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Thursday, January 2, 2025

తిరుప్పావై - పంతొమ్మిదివ పాశురము

తిరుప్పావై - పంతొమ్మిదివ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

జై శ్రీమన్నారాయణ

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ప్రియ భగవత్ బంధువులారా!

ఇప్పుడు తిరుప్పావై 19 వ పాశురంని చదువుదాం.

కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్ మేల్
మెత్తైన్ఱ పంచశయనత్తిన్ మేలేరి
కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తుక్కిడంద మలర్ మార్ పా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్న మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెళ వొట్టాయ్ గాణ్ 
ఎత్తనై ఏలుమ్ పిరివాత్త గిల్లాయాల్
తత్తువమన్ఱు తగవేలోర్ ఎంబావాయ్ || 19 ||

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం.

బంగారంతో తయారుచేసిన గుత్తు దీపములు వెలుగుతుండగా, ఏనుగు దంతములతో చేసిన కోళ్ళు గల మంచం మీద, అందంగా, తెల్లగా, మెత్తగా, చల్లగా, ఎత్తుగా, వెడల్పు కలిగిన విశాలమైన పాన్పుపై (పరుపుపై), అప్పుడే వికసిస్తున్న గుత్తులు గుత్తులుగా వున్న పువ్వులు తలలో ముడుచుకుని, అందమైన కేశములు కలిగిన నప్పిన్న పిరాట్టి (నీలాదేవి) అటువంటి సుఖవంతమైన పరుపు మీద నిద్రిస్తుండగా, ఆమె వక్షస్థలంపై (స్తనములపై) తల ఉంచి హాయిని అనుభవిస్తున్న విశాలమైన వక్షస్థలం గల..

ఓ శ్రీ కృష్ణా! ఓ స్వామీ! నోరు తెరిచి మాతో మాట్లాడవయ్యా! విశాలమైన కన్నులకు.. అందంగా వున్న నల్లని కాటుక దిద్దుకున్న ఓ నీలా దేవీ! నీ భర్త.. నీ దగ్గరనుంచి లేవడం నీకు ఇష్టం లేదా! ఆయన కౌగిలి నుంచి బయటపడలేకపోతున్నవా! ఎంతసేపు లేవకుండా ఉంటావు? ఎంతసేపు ఆయన్ని లేవనియ్యకుండా ఉంటావు? ఆయన్ను వదిలి ఉండలేక పోతున్నావా! అంత విరహాన్ని భరించలేక పోతున్నావా! ఇది నీ స్వభావానికి, స్వరూపానికి తగదు సుమా! నీవంటి దయగల తల్లికి ఇది న్యాయమా! అని ఆండాళ్ తల్లి ప్రార్థిస్తుంది, అర్ధిస్తుంది.


క్షణమైనను శ్రీకృష్ణుని ఎడబాటు సహింపలేకున్నావే? నీవలె మేము కూడా అతనికి కావలసినవాళ్ళమేకదా! కాబట్టి కరుణించి కొంచెం అవకాశం యివ్వు తల్లీ! అట్టి అవకాశము నీవు యిచ్చినట్లయితే.. మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సమాప్తి చెందుతుంది. ఇందుకు యే మాత్రమూ సంశయము లేదు అని ఆండాళ్ తల్లి నీలాదేవినీ, శ్రీకృష్ణుడినీ వేడుకొంటుంది. 

కమలాకుచ కస్తూరి 
కర్దమాంకిత వక్షసే 
యాదవాద్రి నివాసాయ 
సంపత్ పుత్రాది మంగళమ్

అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం. అమ్మ తన వక్షస్థలానికి కుంకుమను పూసుకుంటుంది. ఆయన అమ్మని ఆలింగనం చేసుకుని దేహమంతా ఆ కుంకుమను అంటించుకున్నాడు. ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు. కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను గురించి. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా! లోకంలో అమ్మ అందానికి.. నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది. కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది. అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం.. నీవు ఉపాసించదగినదే కానీ అనుభవించదగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది. అదే అందం నాన్నకు భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది. ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి. అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.

నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది. కాని అంతలోనే స్వామి..నేనే తెరుస్తాలే అని అమ్మని లేవనీయకుండా.. ఒక్కసారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్తలంపై వాలిపోయింది. ఆమె స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు. ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ స్వామిని వదలలేదు. బయటనుండి ఇది గమనించిన గోపికలు లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు.

కుత్తు విళక్కెరియ చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి. అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామిని కూడా తలుపు తెరవనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు. 

గతంలో "కువలయాపీడాన్ని" చంపి దాని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. కోట్టుక్కాల్ ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టిల్మేల్ కట్టె మంచంలో మెత్తెన్ఱ మెత్తటి అతి సుకుమారమైన, పంచ శయనత్తిన్ పంచశయనంపై మేల్ ఏఱి పడుకొని ఉన్నారు. కొత్తలర్ పూంగురల్ గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై ఆ అందగత్తే కొంగైమేల్ వక్షస్తలం వైత్తుక్కిడంద స్పర్శచే మైకంలో పడి ఉన్న మలర్ మార్బా! వక్షస్థలం వికసించి ఉన్న స్వామీ వాయ్ తిఱవాయ్ నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే.. సరే తలుపు తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ.. వద్దు నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు. మైత్తడం కణ్ణినాయ్! కాటుకతో విశాలమైన కన్నులు కల నీ ఉన్-మణాళనై నీ స్వామిని ఎత్తనై పోదుం తుయిలెర ఇప్పటికైనా లేపి ఒట్టాయ్ కాణ్ మాకు చూపించవా! 

ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్ ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, తత్తువమన్ఱు తగవ్ నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచం కఠినంగా పిలిచారు.

ఆండాల్ తిరువడిగళే శరణం

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...