Friday, March 6, 2026

Suka Yogi Teaches Cosmology and Geography - శుకయోగి యుపదేశమునం దెల్పుభూగోళ నిర్ణయము

శుకయోగి యుపదేశమునం దెల్పుభూగోళ నిర్ణయము

నరేంద్రా! భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమయిన భూమిలో జంబూద్వీపం తామరాకు లాగున గుండ్రంగా కనిపిస్తుంది. అది లక్షయోజనాల పొడవూ, లక్ష యోజనాల వెడల్పూ కలిగి ఉంటుంది. అందులో గుండ్రటి ఆకారాలతో తొమ్మిదివేల యోజనాల విస్తీర్ణం గల తొమ్మిది వర్షాలున్నాయి. వాటినన్నింటిని విభజించే సరిహద్దులుగా ఎనిమిది పర్వతాలున్నాయి. ఆ తొమ్మిది వర్షాలలో నట్టనడుమ 'ఇలావృతమనే' వర్షం ఉంది. దాని నడుమ బంగారురంగుల పర్వతం ఉంది.

అదే సువర్ణమయమైన సుమేరుపర్వతం. భూమి పద్మమయితే సుమేరు పర్వతం దాని కర్ణిక. సుమేరు పర్వతం కులగిరులకే రాజు. దేవతలందరు ఆ పర్వతాన్ని చూచి ఆశ్చర్యచకితులవుతుంటారు.

(భూమిని పద్మంగా ఊహిస్తే దానిమధ్య జంబూద్వీపమున్నదని భావం. ఇలావృతమంటే భూమిచే ఆవృతమని గ్రహించవలసి ఉంటుంది. మేరువనగా ఇరుసు. భూపరిభ్రమణానికి కేంద్రమని అర్ధం. ఏడు దీవులకు ఏడు కులగిరులున్నాయి. వాటిలో మేరువు ముఖ్యమయినది. జంబూద్వీపం డెబ్భైలక్షల మైళ్ళు.)

ఆ మెరుగిరి లక్ష యోజనాల ఎత్తు కలిగి ఉంటుంది. దాని పాదప్రదేశం పదారువేల యోజనాల విసృతి కలిగి అంతే కొలత గల లోతు కలిగి ఉంటుంది. పైన విసృతి ముప్పది రెండువేల యోజనాలు. దానికి ఉత్తరపు దిక్కులో నీలం, శ్వేతం, శృంగం అనే మూడు పర్వతాలు ఆకాశాన్ని అంటుతూ నిలిచివున్నాయి. వీని విస్తారం రెండువేల యోజనాలు. ఇవి తూర్పునుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉంటాయి. ఈ దృశ్యం చాల రమణీయం.

తూరుపు పడమరలలో ఉప్పునీటి సముద్రంవరకూ ఉన్న సరిహద్దు పర్వతాలలో నీలశ్వేత శృంగవత్పర్వతాలు క్రమంగా ఒకదానికంటె ఒకటి పది యోజనాల తక్కువ పొడవు కలిగి ఉంటాయి. ఈ మూడు పర్వతాల నడిమి ప్రదేశంలో రమ్యక, హిరణ్మయ, కురు నామాలుగల మూడువర్షాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి తొమ్మిదివేల యోజనాల విస్తృతి కలిగి ఉన్నాయి. అవన్నీ సముద్రందాక వ్యాపించి ఉన్నాయి. ఆ మూడు వర్షాల పొడవు నీలశ్వేత శృంగవత్పర్వతాల పొడవుతో సమానంగా ఉంటుంది.

ఇలావృతవర్షానికి దక్షిణంగా మూడు సరిహద్దు పర్వతాలు ఉన్నాయి. అవే నిషధ పర్వతం, హేమకూట పర్వతం, హిమవత్పర్వతం. ఇవి తూర్పునుండి పడమటి వరకూ పొడవూ, ఉత్తరంనుండి దక్షిణం వరకూ వెడల్పూ కలిగి ఉన్నాయి. వీటి నిడివి నీలశ్వేత శృంగవత్‌ పర్వతాలతో సమానంగా ఉంటుంది. ఈ మూడు కొండల నడుమ మూడు భూప్రదేశాలున్నాయి. అవే హరివర్షం, కింపురుషం, భారతవర్షం అనేవి.

ఇలావృతవర్షానికి పశ్చిమంలో మాల్యవంతం. తూర్పున గంధమాదనం అనే సరిహద్దు పర్వతాలున్నాయి. అవి తూర్పు పడమరలకు పొడవూ, ఉత్తర దక్షిణాలకు వెడల్పూ కలిగి నీలపర్వత నిషధ పర్వతాలను ఆనుకొని ఉన్నాయి. వాటి విసృతి రెండువేల యోజనాలు. మాల్యవంతం, గంధమాదనం అనే ఈ రెండూ కేతుమాల భద్రాశ్వవర్షాలకు సరిహద్దు పర్వతాలుగా ఉన్నాయి. సుమేరు పర్వతానికి తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పడమట సుపార్శ్వపర్వతం, ఉత్తరాన కుముద పర్వతం ఉన్నాయి. ఈ నాలుగు పర్వతాలు పదివేల యోజనాల ఎత్తు కలిగి ఉన్నవి.

ఇన్నిటికీ నడుమ మేరుపర్వతం ఎత్తుగా పొడుగైన స్తంభం లాగా ఉంటే మిగిలిన పర్వతాలు నాలుగు పక్కల నాటిన పొట్టిగుంజలలాగున ఉన్నాయి.

ఈ నాలుగు పర్వత శిఖరాలమీద పతాకాల లాగున క్రమంగా పెద్ద పెద్ద మామిడిచెట్టు, నేరేడు చెట్లు, కడిమి చెట్లు, మర్రిచెట్లు ఉన్నాయి. ఈ వృక్షరాజాలు ఒక్కొక్కటీ పదకొండు వందల యోజనాల పొడవూ, నూరు యోజనాల వెడల్పు కలిగి ఉన్నాయి. ఇంతేగాక ఆ నాలుగు పర్వత శిఖరాల మీద శతయోజన విస్తీర్ణములయిన నాలుగు పెద్ద పెద్ద సరోవరాలు ఉన్నాయి. క్రమంగా వానిపేర్లు క్షీర సరస్సు, మధుసరస్సు, ఇక్షురస సరస్సు, నిర్మల జలసరస్సు. ఆ సరస్సులలో స్నానం చేసేవారికి స్వభావం చేతనే యోగనిష్ఠా, అణిమాదిసిద్దులూ సిద్ధిస్తాయి. ఇంకా ఆ పర్వత శిఖరాలపైన నందనం, చైత్రరథం, వైభ్రాజకం, సర్వతోభద్రం అనే దేవోద్యానాలు ఉన్నాయి. ఆ ఉద్యానవనాలలో దేవతలు దేవకాంతలతోకూడి గంధర్వుల ఆటపాటలను ఆలకిస్తూ ఆలోకిస్తూ ఆనందంగా విహరిస్తారు.

మందరపర్వతంమీద మామిడిచెట్లున్నాయి. ఆ చెట్లఫలాలు పర్వత శిఖరాలంత పెద్దవి. ఆ పండ్లరుచి అమృతంవలె ఉంటుంది. బాగా మాగిన పండ్లు చెట్లనుండి రాలుతాయి. ఆ పండ్లు పడి పగిలినపుడు ఆ పండ్లరసం అచ్చెరువు గొల్పేవిధంగా మహాప్రవాహమై 'అరుణోద' ము అనే పేరుతో ప్రవహిస్తుంది.

ఆ నదీరసాలు చాలా తియ్యనివి. సుగంధంతో కూడినవి. ఎర్రనిరంగు కలవి. ఆ నది మందరాచలం నుండి బయల్వెడలి తూర్పువైపుగా ఇలావృతవర్షాన్ని ఒరుసుకొంటూ సాగిపోతుంది. ఆ నదీతరంగాలు అందరినీ పవిత్రం చేస్తుంటాయి.

ఓ రాజా! ఆ నదీజలాలలో పార్వతీదేవి చెలికత్తెలు స్నానం చేస్తారు. వారి శరీరాలలోని సహజ దివ్యపరిమళాన్ని గ్రహించిన వాయువు పదివేల యోజనాల పర్యంతం సుగంధాలు వెదజల్లుతుంది.

మేరుమందరపర్వతాలమీద నేరేడు పండ్లున్నాయి. ఆ పండ్లు పెద్ద ఏనుగులంత పరిమాణంగలవి. చెట్లనుండి అవి రాలిపడి పగులగా ఆ పగిలిన పండ్లరసమే ప్రవాహంగా ఆ కొండమీద జాలువారుతున్నది.

ఆ నేరేడు పండ్లరసం నదిగా ప్రవహిస్తున్నది. ఆ నదిపేరు జంబూనది. ఆ నది సాటిలేనిది. ఆ నది ఇలావృత వర్షాన్ని తడుపుతూ భూభాగంమీద ప్రవహిస్తున్నది.

ఆ జాంబూనదీజలంతో బాగా నానిన మట్టి, గాలి, సూర్యకిరణాల సంపర్కంతో పరిపక్వమై బంగారంలా మారిపోతుంది. ఆ కారణంగా బంగారానికి జాంబూనదం అనే పేరు వచ్చింది. మంచివన్నెగల ఆ శుద్ధ సువర్ణంతో దేవతలు నగలు చేయించుకొని అలంకరించుకొంటారు.

(హాటకోత్పత్తి కథనం : బంగారు ఉత్పత్తి అయ్యే విధం పంచమస్మంధం - ద్వితీయాశ్వాసంలోనే రెందు విధాలుగా చెప్పబడింది. 
1) 5-2-26 - జాంబూనదము = బంగారు
2) 5-2-111 - హాటకము = బంగారు

దేవతలు ధరించే బంగారం - జాంబూనదము. 'వితలం' (అధోలోకాలలో ఒకటి) లోని ప్రజలు ధరించే బంగారం హాటకము. మూలంలో ఏయే నగలుగా మార్చుకొంటారో, అలంకరించుకొంటారో వివరణ ఉంది. 'ముకుట, కటక, కటిసూత్ర ఆది ఆభరణ రూపేణ ఖలు ధారయన్తి' (16-21) కిరీటాలు, కంకణాలు, మొల నూలులాంటి నగలని గ్రహించవచ్చు.)

సుపార్శ్వమనే కొండ పైభాగంలో ఐదుప్రవాహాలు. ఒక్కొక్క ప్రవాహం ఐదుబారల వెడల్పు కలది. నదీరూపంగా కనిపించేది. అవి క్రిందికి ప్రవహిస్తూ ఇలావృత వర్షం పడమటిభాగాన్ని తడుపుతుంటాయి. ఆ ఐదు తేనెప్రవాహాలనూ ఆస్వాదించినవారి ముఖాలనుండి వెలువడిన పరిమళం నూరు యోజనాల పర్యంతం వ్యాపిస్తుంది.

(వ్యామము అంటే రెండు చేతులు చాస్తే వాని నడుమగల పరిమాణం. దాదాపు 8 అడుగులు. ఒక్కొక్కధార 40 అడుగుల వెడల్పు కలదని భావించాలి.)

ఓ రాజా! కుముద పర్వతం శిఖరంమీద దృఢమయిన మర్రిచెట్టు ఉన్నది. ఆ మర్రిమాను బోదెనుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం ఇంకా రకరకాల రుచులు కలిగిన ఆహారపదార్థాలు ఎప్పుడూ పుడుతూ ఉంటాయి. వస్త్రాలు, పాన్పులు, ఆసనాలు, నగలు మొదలయిన వస్తువులను ఆ వటవృక్షం ప్రసాదిస్తుంది. ఆ మర్రిమాను కోరిన కోరికలు తీరుస్తూ ఇలావృత వర్షంలో నివసించే ప్రజల కందరికి సమస్త విధములయిన సుఖసంపత్తిని ప్రసాదిస్తుంది. ఆ ఆహారపదార్థాలు వాడడం వల్లనూ ఆ ప్రదేశంలో అయాచితంగా దక్కే సుఖానుభోగంవల్లనూ అక్కడ ఎవరికీ ముసలితనం రాదు. చర్మం ముడుతలు పడదు. జుట్టు నెరిసిపోదు. శరీర దుర్గంధం ఉండదు. మరణభయం అసలుండదు. చలి, ఎండల బాధలసలు ఉండనే ఉండవు.

దేవతలు, రాక్షసులు, దివ్యమునీంద్రులు, గంధర్వులు మొదలయిన వారందరూ ఈ కుముద పర్వతాన్ని ఆశ్రయించి పట్టరాని సంతోషంతో విహరిస్తుంటారు.

(మూలంలో 'కుముదనిరూఢో యశ్శతవల్మోనామ వటః' 16-24 అని మర్రిచెట్టు పేరు 'శతవల్మము' గా చెప్పబడింది.

నరేంద్రా! మేరుపర్వతం తామరదుద్దు. దానిచుట్టూ కురంగం, కురరం, కుసుంభం, వైకంకతం, త్రికూటం, శిశిరం, పతంగం, రుచకం, నిషధం, శితివాసం, కపిలం, శంఖం మొదలయిన పర్వతాలు కేసరాలుగా ఉన్నాయి. ఆ మేరుపర్వతానికి తూర్పుభాగంలో జఠరగిరి, దేవకూటం అనే కొండలున్నాయి. పడమట పవనగిరి, పారియాత్రం అనే పర్వతాలున్నాయి. ఈ నాలుగు పర్వతాలు ఒక్కొక్కటి దక్షిణం నుంచి ఉత్తరం వరకు పద్దెనిమిది వేల యోజనాల పొడవూ, తూర్పునుండి పడమటివరకూ రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. ఆ కొండల కావల దక్షిణంలో కైలాసం, కరవీరం అనే కొండలున్నాయి. ఆ కొండలు ఒక్కొక్కటీ తూర్పునుండి పడమటి దిక్కుదాక పద్దెనిమిది యోజనాల పొడవూ, దక్షిణం నుంచి ఉత్తరం దాకా రెండువేల యోజనాల వెడల్పూ కలిగి ఉంటాయి. మేరువు చుట్టూ ఉన్న ఎనిమిది కొండలు అగ్నిహోత్రునికి ప్రదక్షిణంగా పరిచిన దర్భల లాగున నిలిచి ఉన్నాయి. మేరుపర్వత శిఖరంలో 'బహ్మపురం' ఉన్నది. అది పదివేల యోజనాల పొడవూ, అంతే వెడల్పు కల ప్రదేశం. అదంతా సువర్ణభూమి. ఆ బ్రహ్మపురానికి ఎనిమిది దిక్కులలోనూ అష్టదిక్పాలకుల పట్టణాలున్నాయి.

(అష్టాగ్నులు - అగ్ని, జాతవేదుడు, సహోజుడు, అజరా ప్రభుడు, వైశ్వానరుడు, నర్యావసుడు, విస్ఫురుడు, పంక్తిరథుడు. 
అష్టదిక్పాలకులు : ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు.
దిక్పాలుర పట్టణాలు : అమరావతి, తేజోవతి, సంయమని, కృష్ణాంగన, శ్రద్ధావతి, గంధవతి, అలక, యశోవతి. 
అష్టదిక్కులు : తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం.)

ఓ రాజా! బ్రహ్మపట్టణంలో నారాయణుడు త్రివిక్రమత్వాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన కాలిగోటి దెబ్బకు బ్రహ్మాండం పైభాగం బ్రద్దలయింది.

(మూలంలో 'బహ్మపురి' కి సంబంధించిన కొన్ని అంశాల వర్ణనలున్నాయి. మేరుపర్వత శిఖరంపై మధ్యలో బంగారంతో నిర్మించిన నగరం బ్రహ్మపురి. ఇది సమచతుర్భుజాకారం గలది. కోటియోజనాల నిడివి కలది. 'యజ్ఞలింగస్య విష్ణోర్విక్రమతో వామపాదాంగుష్ఠ నఖనిర్భిన్నోర్ధ్వాండ  కటాహవివరేణ'(17-1) అని వర్ణన. యజ్ఞంనందు వామనాకృతి గలిగి మూడు అడుగులు వేయుచున్న విష్ణువు ఎడమకాలి బొటనవ్రేలియొక్క గోటిచే పగులగొట్టబడిన పైభాగంగల గంగాళంవంటి బ్రహ్మాండం యొక్క రంధ్రం అని వివరణ కనిపిస్తుంది.)

త్రివిక్రమావతారం ప్రదర్శించిన శ్రీమన్నారాయణుని వామ పాదాంగుష్ఠంచేత బ్రహ్మాండం పై కప్పు బద్దలుకాగా ఒక రంధ్రం ఏర్పడింది. అప్పుడు అంతవరకు వెలుపలివైపు ప్రవహిస్తున్న జలధార అంతర్వాహినియై త్రివిక్రమదేవుని పాదాన్ని స్పృశిస్తూ ప్రవహించింది. ఆ ప్రవాహమే 'భగవత్పాది' అనే పేరుతో సకల లోకాల పాపాలను పరిహరిస్తూ చాలకాలం స్వర్గంలో విహరించింది. ఉత్తానపాదుని కుమారుడూ, భాగవతులలో అగ్రేసరుడూ అయిన ధ్రువుడు తన ఇలువేల్పయిన శ్రీహరి పాదోదకాన్ని ప్రతిదినం నిమీలిత నేత్రుడై భక్తితో స్వీకరిస్తూ, ఆనందబాష్పాలతో, పులకించిన దేహంతో, ఎంతో ఆదరంతో నేటికీ తలపై చల్లుకొంటున్నాడు. ఆ ధ్రువునికి దిగువ భాగంలోనే మండలాధిపతులయిన సప్తర్షులున్నారు. వారు శ్రీమన్నారాయణుని పాదోదక ప్రభావం తెలుసుకొని ఆకాశగంగలో స్నానం చేయడమే తమ తపస్సిద్ధి అని భావిస్తారు. అలా స్నానం చేయడంవల్ల తమ జన్మ చరితార్థమవుతున్నట్టు విశ్వసిస్తారు. అఖిల జగత్తులో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుని పై భక్తి దృఢంగా నిలిపి, వేరే ప్రాపంచికమయిన వస్తువులపై అపేక్ష లేకుండా, మోక్షం కోరేవ్యక్తి, ముక్తిమార్గాన్ని గౌరవించినట్లు భక్తిగౌరవాలతో సప్తమహర్షులు ఆ ఆకాశగంగాజలాన్ని తమ జటాజూటాలలో ఈనాటికీ ధరిస్తుంటారు.

(ధ్రువమండలానికి విష్ణుపదం అని ప్రసిద్ది.)

వారాహే వామపాదం తు తదన్యేషు తు దక్షిణమ్‌ ।
పాదం కల్పేషు భగవాన్‌ ఉజ్జహార త్రివిక్రమః ॥

కుడిపాదంపై నిలిచి, ఎడమ పాదాన్ని విశ్వం యొక్క అంచువరకు చాచి వామనమూర్తి త్రివిక్రముడుగా ప్రసిద్ది చెందాడు. 
సప్తర్షులు - ఆయామనువుల కాలంలో విభిన్న ఋషులు సప్తర్షులు. వైవస్వత మనువు కాలంలో వసిష్ఠ, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమదగ్ని విశ్వామిత్రులు సప్తర్షులు.)

విష్ణుమూర్తి పాదాలనుండి వినిర్గతమైన ఆకాశగంగ లెక్కలేనన్ని దివ్యవిమానాలతో నిండి సువిశాలమయిన దేవమార్గం గుండావచ్చి చంద్రమండలాన్ని ఒరుసుకొంటూ మేరుపర్వత శిఖరాగ్రానికి చేరుకొంటుంది. అక్కడి ఆ బ్రహ్మపట్టణం నాలుగుద్వారాలగుండా సీత, చక్షువు, భద్ర, అలకనంద అనే నామములతో నాలుగు విధాలుగా ప్రవహించి చివరకు లవణ సముద్రంలో కలిసిపోతుంది. ఆ గంగాజలాలు తమను దర్శించేవారికీ, తమలో స్నానం చేసేవారికీ అమృతత్వం ప్రసాదిస్తూ ఉంటాయి.

సీత అనే పేరుతో ప్రఖ్యాతమయిన నదీప్రవాహం బ్రహ్మపురం తూర్పుద్వారం నుంచి ప్రవహించి కేసరగిరి శిఖరాలను తడుపుతూ గంధమాదన పర్వతం మీదుగా సాగి భద్రాశ్వవర్షాన్ని పవిత్రం చేస్తూ తూర్పువైపున లవణసముద్రంలో ప్రవేశిస్తుంది. బ్రహ్మపురం పడమటి ద్వారం నుండి వెలువడిన ప్రవాహం పేరు చక్షువు, ఆ ప్రవాహం మాల్యవంతమనే పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తూ పడమటి సముద్రంలో సంగమిస్తుంది. బ్రహ్మపట్టణం ఉత్తరద్వారం గుండా వెలువడిన ప్రవాహం పేరు భద్ర. అది కుముదం, నీలం, శ్వేతం అనే పర్వత శిఖరాల మీదుగా ప్రవహిస్తూ, శృంగ నగం చేరుకొని, అక్కడనుండి మానసోత్తరాలైన కురుభూముల్ని పవిత్రం చేస్తూ ఉత్తరసముద్రంలో కలుస్తుంది.

బ్రహ్మనగరం దక్షిణ ద్వారం నుండి వెలువడే నది పేరు 'అలకనంద'. అది మిక్కిలి దుర్గమాలైన పర్వత పంక్తుల గుండా ప్రవహించి హేమకూటం, హిమకూటం అనే పర్వత ప్రాంతాలను దాటివచ్చి చాల ఉరవడితో కర్మ క్షేత్రమయిన భారతవర్షాన్ని పవిత్రం చేస్తుంది. ఆ తరువాత దక్షిణ సముద్రంలో కలిసిపోతుంది.

ఓ అధిపా! ప్రపంచంలో మేరువువంటి పర్వతాలు ఎన్నో ఉన్నాయి. వాటికి పుత్రికలేమో అన్నట్లుగా పుణ్యతీర్థాలున్నాయి. వాటిని లెక్కపెట్టడం వీలుకాని పని. అవి వేలసంఖ్యలో ఉన్నాయి. జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి. తక్కిన వర్షాలు భోగభూములు, స్వర్గంనుండి భూమికి దిగివచ్చినవారు అక్కడ పుణ్యఫలాలు అనుభవిస్తుంటారు. భూలోక స్వర్గంవంటి ఆ వర్షాలలో జీవించేవారు పదివేల సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉంటారు. పదివేల ఏనుగుల బలం కలిగి ఉంటారు. దేవతలతో సమానులుగా ఉంటారు. వజ్రదేహులై ఉంటారు. ఎంతో సంతోషంతో జీవిస్తారు. వారి ప్రవర్తనలో ఎటువంటి పొరపాట్లు ఉండవు. వారు పూజ్యులు. అంతేకాదు. పుణ్యాత్ములు.

ఈ ఎనిమిది వర్షాలలో ఉన్నవారు కామ సుఖానంద పరవశులై మోక్షాన్ని సైతం కోరరు. అక్కడి స్త్రీలు ఒక్క పర్యాయం మాత్రం బిడ్డలను కంటారు. అక్కడ ఎల్లప్పుడూ త్రేతాయుగం ప్రవర్తిస్తుంది. ఈ ఎనిమిది వర్షాలలోనూ దేవతలు తమ సేవకులు చేసే ఉపచారాలు గ్రహిస్తూ విహరిస్తుంటారు. అన్ని ఋతువులందూ చివుళ్ళతో పువ్వులతో ఫలాలతో నిండిన తీగెలు, వృక్షాలు గల వనాలు అక్కడే ఉంటాయి. సరోవరాలలో వికసించిన పద్మాలు ఉంటాయి. ఆ పద్మాల పరిమళం ఆఘ్రాణిస్తూ రాజహంసలు, కలహంసలు విహరిస్తుంటాయి. నీటికోళ్ళు, కొక్కెరలు, బెగ్గురుపక్షులు, జక్కవలు, కొలకులలో ఈదులాడుతుంటాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఝంకారాలు చేస్తుంటాయి. అటువంటి వనాలలో, సరస్సులలో, కొండలలో, కోనలలో దేవతాస్త్రీలు విహరిస్తూ విలాసంగా ఆడుతూ పాడుతూ, పకపక నవ్వుతూ పక్కచూపులు చూస్తూ కామోద్రేకం కలిగిస్తూ సంచరిస్తుంటారు. వారి విలాస చేష్టలకు ఆకర్షితులయిన పురుషులు అక్కడ స్వేచ్చావిహారాలు చేస్తుంటారు.

ఈ తొమ్మిది వర్షాలలోనూ జీవులకు సరయిన జ్ఞానం అనుగ్రహించడానికి నారాయణుడు అనేకరీతుల తన లీలావిలాసాలను ప్రదర్శిస్తూ సంచరిస్తుంటాడు.

ఇలావృత వర్షానికి త్రిపురాసుర సంహారకుడయిన శివుడు అధిదేవత. ఆ ఇలావృతవర్షంలో పార్వతీదేవి విహరించే ఉద్యానవనం ఉంది. ఆ వనంలోనికి పురుషులు ఎవరయినా ప్రవేశిస్తే వారందరు స్త్రీలవుతారని జగజ్జనని శాపం. అక్కడ పార్వతీదేవి వేలకొలది చెలికత్తెలతో వచ్చి ప్రతినిత్యమూ పరమశివుని పరమభక్తితో సేవిస్తుంటుంది. ఆ ఇలావృత వర్షంలోని జనులు ఎంతో సంతోషంతో ఆయా మంత్రతంత్రాలతో పరమేశ్వరుని పూజించి సదా సంస్మరించి తరిస్తుంటారు.

భద్రాశ్వవర్షానికి భద్రశ్రవుడు అధిపతి. అతడు మేరుపర్వతం వంటి ధైర్యం కలవాడు. అతడు సముద్రాలు హద్దుగా కలిగిన భూమిని పరిపాలించాడు.

ఆ భద్రశ్రవునికి హయగ్రీవుడు ఇష్టదైవం. ఆ హయగ్రీవ మూర్తిని ధ్యానంతో, జపంతో, స్తుతులతో, అనుష్ఠానాలతో సత్పురుషులు పూజించి తరిస్తుంటారు.

ఆ హయగ్రీవ తత్త్వాన్ని ప్రకాశింపజేసే ప్రధాన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల మహిమతో ఆ వర్షంలోనివారు హయగ్రీవుని అర్చించి, స్తుతించి, ధ్యానించి ముక్తి పొందుతున్నారు.

ఓ రాజా! హరివర్షం వారికి నరసింహుడు ఇష్టదైవం. అక్కడున్న జనులు దైత్య, దానవ వంశాలలో ఉత్తములయినవారు. వారు ప్రహ్లాదుడు మొదలయిన పెద్దలతో కలిసి స్నానంచేసి శుచులై నరసింహుని సేవిస్తుంటారు. రమణీయాలైన పట్టుబట్టలు కట్టుకొని ఆ నరసింహతత్త్వాన్ని ప్రకాశింపజేసే మంత్రం జపిస్తూ, ఆ మంత్రానికి సంబంధించిన తంత్ర కార్యాలను నిర్వహిస్తూ, నరసింహుననికి ప్రీతిపాత్రమయిన ధ్యానం, జపాలు, తపాలు, స్తోత్రాలు చేస్తూ నిలుకడగల బుద్ధితో స్వామిని సేవిస్తుంటారు. ఆ స్వామి కరుణకు పాత్రులై ఇహపరసుఖాలను అనుభవిస్తుంటారు.

కేతుమాల వర్షంలో భగవంతుడు శ్రీదేవిని సంతోషపెట్టడంకోసం మన్మథరూపంలో సాక్షాత్కరిస్తాడు. ఆ కామదేవుని అనుగ్రహంవల్ల ధాత్రీదేవతల గర్భాలు సంవత్సరకాలం సంరక్షింపబడినప్పటికిని నిర్జీవాలై స్రవిస్తాయి. తన నడకల సొగసులతో, విలాస వీక్షణాలతో, అందమైన కనుబొమలతో, పద్మాలవంటి మనోహర ముఖకాంతులతో ఆ కామదేవుని రూపంలో ఉన్న శ్రీహరి రమాదేవిని సంతోషపెడతాడు. భగవంతుని మాయకు ప్రతిరూపమయిన ఆ శ్రీదేవికూడా ప్రజాపతి పుత్రికలూ, పుత్రులూ అయిన రాత్రులతో, పగళ్ళతో కలిసి కామదేవుని స్తుతిస్తూ పూజలు చేస్తూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఉంటుంది.

ఓ రాజా! పరిశుద్ధమయిన మనసుతో శ్రద్ధగా విను. రమణీయమయిన రమ్యకమనే వర్షానికి మత్స్యరూపుడయిన హరియే అధిదేవత.

ఆ రమ్యక వర్షానికి మనువు అధిపతి. అతడు కొడుకులతో, మనుమలతో, మంత్రివరులతో మత్స్యరూపుడయిన శ్రీహరిని అనుపమానమయిన భక్తితో ఆరాధిస్తుంటాడు.

ఆ రమ్యక వర్షంలోనివారు అధిపతి అయిన మత్స్యమూర్తిని ప్రకాశింపజేసే మంత్రాలతో, స్తోత్రాలతో, అర్చిస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ, అగ్నికార్యాలు నెరవేరుస్తూ పుణ్యాత్ములై భుక్తిముక్తులను ఆనందంగా అనుభవిస్తారు.

అర్యముడు హిరణ్మయ వర్షంలోని జనులందరితోకూడా కలిసి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులందుకొంటారు.

మూలంలోని అర్యముని మంత్రం - ఓం నమో భగవతే అకూపారాయ సర్వ సత్త్వగుణ విశేషణాయానుప లక్షిత స్థానాయ, నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమోవస్థానాయ నమస్తే 

అర్యముడు హిరణ్మ్యయ వర్షంలోని జనులందరితోకూడి కూర్మరూపుడయిన శ్రీహరిని మనసులో ధ్యానిస్తూ స్తోత్రాలతో సంస్తుతిస్తూ భుక్తిముక్తులనందుకొంటాడు.

ఉత్తర కురు వర్షానికి వరాహదేవుడు అధిపతి. అక్కడ భూదేవి ఆ హరిని మనసులో నిలుపుకొని పూజలు చేస్తుంటుంది.

ఆ ఉత్తర కురువర్షంలోని ప్రజలు వరాహమూర్తిని అనుదినమూ సేవిస్తూ సంభావిస్తూ, సంస్తుతులు కావిస్తూ మోక్షాన్ని పొందుతారు.

పరీక్షిన్మహారాజా! కింపురుష వర్షానికి సీతాలక్షణసమేతుడయిన శ్రీరామభద్రుడు అధిదేవత.

ఆ కింపురుష వర్షంలో అంజనాదేవి కుమారుడయిన ఆంజనేయుడు కింపురుష గణాలతో కూడి శ్రీరామచంద్రుని ప్రత్యక్షం చేసే మంత్ర స్తోత్రాదులతో శ్రీరామచంద్రుని ఆరాధిస్తుంటారు.

భారత వర్షానికి బదరికాశ్రమవాసియైన నారాయణుడు అధిపతి. ఆ భారతవర్షంలోనివారు మహాత్ములయిన నారదాది మునుల సాంగత్యంతో సాంఖ్యయోగాన్ని ఉపదేశంగా పొంది తన జన్మలను సార్ధకం చేసుకొంటారు. నారాయణదేవుని ఆరాధించి ఆ దేవునికి ప్రియమయిన మంత్రస్తోత్రాదులతో పూజలు చేస్తారు. భక్తితో మొక్కి ముక్తిని దక్కించుకొంటారు.

ఓ రాజా! భారతవర్షంలో లెక్కలేనన్ని పుణ్యపర్వతాలున్నాయి. అంతేగాకుండా, లోతయిన నదీప్రవాహాలు కూడా ఉన్నాయి. వాటి విశేషాలను నేను వినిపిస్తాను.

భారతవర్షంలోని పుణ్యపర్వతాలలో మలయం, మంగళప్రస్థం, మైనాకం, త్రికూటం, ఋషభం, కూటరం, గోల్లం, సహ్యాద్రి, వేదాద్రి, ఋశ్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రగిరి, మేఘపర్వతం, వింధ్యపర్వతం, శుక్తిమంతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణగిరి, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుంభం, నీలగిరి, కాకముఖం, ఇంద్రకీలాద్రి, రామగిరి మొదలయినవి ప్రసిద్ధ పర్వతాలు.

ఈ పర్వతాలకు పుత్రికలవంటివయిన చంద్రవట, తామ్రపర్ణి, అవటోద, కృతమాల, వైహాయసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణ, తాపి, రేవానది, శిలానది, సురస, చర్మణ్వతి, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసమ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృధ, వితస్త, అసిక్ని, విశ్వ మొదలయినవి ప్రధానమైన నదులు. నర్మద, సింధు, శోణ అనునవి నదములు. ఇట్టి మహానదులు భారతవర్షంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో స్నానం చేసిన మానవులకు ముక్తి కరతలామలకం.

ఈ భారతవర్షంలో పుట్టిన మానవులు మూడువిధాలైన కర్మలు చేస్తుంటారు. కొన్ని తెల్లనివి. కొన్ని ఎర్రనివి, కొన్ని నల్లనివి. తెల్లనివి సత్వగుణ ప్రధానమయిన కర్మలు. ఎర్రనివి రజోగుణ ప్రధానమయిన కర్మలు. నల్లనివి తమోగుణ ప్రధానమైన కర్మలు. ఇట్టి కర్మల కారణంగా భారతవర్షంలో పుట్టిన ప్రజలు క్రమంగా దేవలోకం, మానవలోకం, నరకలోకం చేరుకొంటారు.

రాగం, ద్వేషం మొదలైనవి లేనివాడూ, వాక్కులనుగాని, మనసునకుగాని అందనివాడూ, అన్నిటికీ తానే ఆధారమైనవాడూ అయిన శ్రీ వాసుదేవమూర్తి యందు హృదయం పదిలంగా నిలుపుకొని భక్తితో ఆరాధించేవారు ఉత్తమగతి తప్పక పొందుతారు. అటువంటి మహాత్ములు అజ్ఞానం రూపుమాసిపోగా పరమభాగవతులు పొందే పుణ్యలోకాలకు యోగ్యులవుతారు. అందువలన, మహాపురుషులు 'భారతవర్షం' ఉత్తమోత్తమమైనదిగా కొనియాడుతుంటారు. వారి ప్రస్తుతి ఈ రీతిగా ఉంటుంది.

భారతవర్షంలో పుట్టిన జీవుల అదృష్టమే అదృష్టం. ఈ భారతవర్షంలోనే శ్రీమన్నారాయణుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఇక్కడి మానవులకు తత్త్వం ఉపదేశించాడు. వారితో స్నేహం చేశాడు. ఆత్మబంధువులాగున జీవులు కష్టసుఖాలలో భాగం పంచుకొని వారిని కృతార్థులను చేశాడు.

ఓ రాజా! కృష్ణుని మహిమ లేమని వర్ణించేది. ఆయన తన అవతారాలను, లీలావిలాసాలను కొనియాడే వారికందరికి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అంతేకాదు, మోక్షం కూడా అనుగ్రహిస్తాడు.

భారతవర్షంలో పుట్టిన జనులకు సాధ్యం కానిదంటూ ఏది లేదు. శ్రీమన్నారాయణుని సంస్మరణం సమస్త పాపాలను పటాపంచలు చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుని స్మరణంలేని యజ్ఞాలు, తపస్సులు, దానాలు నిరర్థకాలు. వాటివల్ల పాపాలు పోవు. పునర్జన్మ మరల వస్తుందేమో అన్న భయంతో ఇతర ప్రదేశాలలో బ్రహ్మ కల్పం చివరిదాకా జీవించడంకంటె భారతవర్షంలో క్షణకాలం జీవించి సర్వసంగ పరిత్యాగం చేసినట్లయితే అటువంటి పురుషశ్రేష్ఠునికి శ్రీమన్నారాయణ పదప్రాప్తి చాల సులభంగా దక్కుతుంది. అందుచేత, అందరూ భారతవర్షంలో జన్మించాలని కోరుకొంటారు. అదీగాక ఏ స్థలంలో వైకుంఠనిలయుని పుణ్యకథలవాసన ఆవంతయినా ఉండదో, ఏ ప్రదేశంలో పుణ్యపురుషులయిన భాగవతోత్తములు ఉండరో, ఏ స్థలంలో యజ్ఞేశ్వరుని ఉత్సవాలు జరుగవో అటువంటి ప్రదేశం దేవేంద్రలోకమైనా ఆ చోట నివసింపరాదు. మానవజన్మ ఎత్తి జ్ఞానమూ, సదనుష్ఠానమూ, గ్రహసంపత్తి అన్నీ ఉండికూడా తపస్సుద్వారా ముక్తి అందుకోలేని మానవులు పశువులవలె తమకు తామే బంధనాల పాలవుతారు. భారతవర్షంలోని ప్రజలు శ్రద్ధతో యజ్ఞాలు నిర్వహించినట్లయితే, ఆ హోమాలలోని హవిస్సును అనేక నామాలతో ఆ పుండరీకాక్షుడు అందుకొని ప్రసన్నుడై వారికి తనమీది భక్తిని అతిశయింపజేస్తాడు. భారతవర్షంలోని ప్రజలమీద అపరిమితమయిన అనుగ్రహం ప్రకటిస్తూ ఆ భగవంతుడు ఇహలోక సౌఖ్యాన్ని పరలోక సౌఖ్యాన్ని వారికి ప్రసాదిస్తాడు. జంబూద్వీపంలోని సగరుని కుమారులు అపహరింపబడిన అశ్వమేధాశ్వాన్ని అన్వేషిస్తూ పలువైపులా భూమిని త్రవ్వినపుడు ఎనిమిది ఉపద్వీపాలు ఏర్పడ్డాయి. అవే స్వర్ణప్రస్థం, చంద్రశుక్లం, ఆవర్తనం, రమణకం, మందేహారుణం, పాంచజన్యం, సింహళం, లంక అనబడేవి.

రాజా! జంబూద్వీపం లక్షయోజనాల వైశాల్యం గలిగి ఉంది. దానిచుట్టూ అంతే ప్రమాణంగల లవణ సముద్రం ఉంది. ఆ తర్వాత ప్లక్షద్వీపం రెండులక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంది.

ఆ ప్లక్ష ద్వీపం నట్టనడుమ ఒక పెద్ద జువ్వి చెట్టున్నది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి ప్లక్ష ద్వీపమనే పేరు వచ్చింది. ఆ ద్వీపంలో నివసించే వారికి అగ్నిదేవుడు అధిదేవత. ఆ ద్వీపాన్ని ఇధ్మజిహ్వుడు పరిపాలిస్తున్నాడు. అతడు ప్రియవ్రతుని కుమారుడు.

పరీక్షిన్నరేంద్రా! ఇధ్మజిహ్వుడు ప్లక్షద్వీపాన్ని ఏడు వర్షాలుగా విభజించాడు. ఆ వర్షముల పేర్లుగల తన కుమారులు ఏడుగురిని శివుడు, యశస్యుడు, సుభద్రుడు, శాంతుడు, క్షేముడు, అభయుడు, అమృతుడు అనేవారిని ఆ ఏడు వర్షాలకు అధిపతులను చేశాడు. ఆ తరువాత ఇధ్మజిహ్వుడు నిస్సంగుడై తపస్సు చేసుకోవడానికోసం అడవికి వెళ్ళిపోయాడు. విభజింపబడిన ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క కులపర్వతమూ, ఒక్కొక్క మహానది ఉన్నాయి. ఆ విధంగా ఆ సప్తవర్షాలలో వరుసగా మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం అనే ఏడు కులపర్వతాలు ఉన్నాయి. అరుణ, సృమణ, అంగిరస, సావిత్రి, సుప్రభాత, ఋతంభర, సత్యంభర అనే పేర్లుగల ఏడు మహానదులున్నాయి. ఆ నదులలో స్నానంచేసి నాలుగువర్ణాల వారును పాపం పోగొట్టుకొంటారు. ఆ నాలుగు వర్ణాలవారు హంసులు, పతంగులు, ఊర్ధ్వాయనులు, సత్యాంగులు అని వ్యవహరింపబడుతారు. ప్లక్షద్వీపంలో నివసించే పురుషుల ఆయుర్దాయం వేయి సంవత్సరాలు. వారు దేవతలతో సమానమయినవారు. కేవలం చూపుతోనే శ్రమ స్వేదాదులు లేని సంతానాన్ని అనుగ్రహింపగలవారు. వేదస్వరూపుడూ, స్వర్గానికి ద్వారమైనవాడూ, భగవంతుడూ అయిన సూర్యుని వారు ఋగ్యజుస్సామవేదమంత్రాలతో సేవిస్తుంటారు. ప్లక్షద్వీపం మొదలయిన ముందు చెప్పబడే ఐదు ద్వీపాలలోని పురుషులకూ ఆయుర్చలం. ఇంద్రియపటుత్వం, తేజోబలం పుట్టుకతోనే సంక్రమిస్తాయి.

ప్లక్ష ద్వీపంచుట్టూ రెండు లక్షల యోజనాల విస్తృతి గల చెరకు రససముద్రం ఉంది. దీనికి రెట్టింపు విస్తృతితో శాల్మలీ ద్వీపం ఉంది.

ఆ ద్వీపంలో ఉన్న శాల్మలీవృక్షంవల్లనే దీనికి శాల్మలీ ద్వీపమనే పేరు వచ్చింది. ఆ శాల్మలీవృక్షం(బూరుగుచెట్టు) కూడా ప్లక్షద్వీపంలోని జువ్వి చెట్టంత ఉంది. ఆ బూరుగుచెట్టు దిగువభాగంలో పక్షులకు రాజయిన గరుత్మంతుడు స్థిరనివాసం చేస్తుంటాడు. ఈ ద్వీపాన్ని పరిపాలించేవాడు ప్రియవ్రతుని పుత్రుడయిన యజ్ఞబాహువు. అతడు తాను పాలించే భూభాగాన్ని ఏడువర్షాలుగా విభజించాడు. ఒక్కొక్క వర్షంలో ఒక్కొక్క పర్వతమూ, ఒక్కొక్క నదీ ఉన్నాయి. ఆ వర్షాలకు తన ఏడుగురు కుమారులను అభిషిక్తులను చేశాడు. వారి పేర్లతోనే ఆ వర్షాలు వ్యవహరింపబడుతున్నాయి. వారి పేర్లు సురోచనుడు, సౌమనస్యుడు, రమణకుడు, దేవబర్హుడు, పారిబర్హుడు, ఆప్యాయనుడు, అభీజ్ఞాతుడు.

ఈ ఏడువర్షాలలో స్వరసం, శతశృంగం, వామదేవం, కుముదం, ముకుందం, పుష్పవర్షం, శతశ్రుతి అనే పర్వతాలున్నాయి. వరుసగా అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే ఏడు మహానదులున్నాయి.

ఆ వర్షంలోని పురుషులు శ్రుతధరులు, విద్యాధరులు, వసుంధరులు, ఇధ్మధరులు అని పిలువబడతారు. వారు భగవత్‌ స్వరూపుడూ, వేదమయుడూ, ఆత్మస్వరూపుడూ అయిన సోముణ్ణి వేదమంత్రాలతో ఆరాధిస్తారు. ఆ ద్వీపంచుట్టూ నాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగిన సురాసముద్రం ఉంది.

(సినీవాలి : ప్రాతఃకాలంలో చంద్రకళ కనబడే అమావాస్యను సినీవాలి అంటారు.)

ఓ రాజా! ఆ సురాసముద్రం ఆవల కుశద్వీపముంది. అది ఎనిమిదిలక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపం మధ్య ఒక పెద్ద కుశస్తంభం(దర్భుదుబ్బు,) మొలిచి ఎత్తుగా పెరిగి ఉంది. అది దివ్యకాంతులతో జిగేలుమంటూ దిక్కులను వెలిగింప చేస్తుంది. ఈ కారణంవల్లనే దీనికి కుశద్వీపమనే పేరు కలిగింది. అలాంటి దీవికి అధిపతి ప్రియవ్రత తనయుడు హిరణ్యరేతసుడు. అతడు తన కుమారుల పేర్లతో భూభాగాలను ఏర్పాటు చేశాడు.

ఈ కుశద్వీపానికి ప్రియవ్రత కుమారుడైన హిరణ్యరేతసుడు అధిపతి. వసుదానుడు, దృఢరుచి, నాభిగుప్తుడు, సత్యవ్రతుడు, విప్రుడు, వామదేవుడు అనువారు హిరణ్యరేతసుని కుమారులు. తండ్రి అయిన హిరణ్యరేతసుడు తన తనయుల పేర్లతో విభజించిన కుశద్వీపంలోని ఏడు వర్షాలలో ఏడుగురు కుమారులను నియమించాడు. అనంతరం తపస్సు చేయడానికి అడవికి వెళ్ళాడు. ఆ కుశవర్షంలో బభ్రువు, చతుశ్శృంగం, కపిలం, చిత్రకూటం, దేవానీకం, ఊర్ధ్వరోమం, ద్రవిణం అనే పేర్లుగల ఏడు పర్వతాలున్నాయి. అలాగే రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే పేర్లుగల మహానదులున్నాయి. కుశలులు, కోవిదులు, అభియుక్తులు, కులకులు అను పేర్లుగల నాలుగు వర్ణాలవారును ఆ పవిత్ర నదీజలాలలో స్నానంచేసి పవిత్రులై భగవంతుడయిన యజ్ఞపురుషుని ఆరాధిస్తుంటారు.

ఆ కుశద్వీపం చుట్టూ ఎనిమిదిలక్షల యోజనాల వైశాల్యం కలిగిన నేతికడలి ఉన్నది. ఆ నేతికడలి ఆవల పదునారు లక్షల యోజనాల విస్తృతి కలిగిన అందమయిన క్రౌంచద్వీపం ఉన్నది. ఆ ద్వీపం మధ్యభాగంలోనే క్రౌంచాద్రి ఉన్నది. ఆ పర్వతం మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరు వచ్చింది. ఒకసారి ఆరు మొగాలుగల కుమారస్వామి దివ్యశరం ప్రయోగించగా అది ఆ క్రౌాంచపర్వతానికి కన్నంవేస్తూ దూసుకుపోయింది. ఆ కన్నంగుండా పాలవెల్లి ప్రవాహం వెలువడినది. ఆ ప్రవాహమే ఆ క్రౌంచద్వీపాన్ని తడుపుతూ ఉంది. వరుణదేవుడు ఆ ప్రదేశాన్ని కాపాడుతూ ఏమాత్రం ఎవరికీ భయం లేకుండేటట్లు చూస్తుంటాడు.

నరేంద్రా! క్రౌంచ ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుని కుమారుడైన ఘృతపృష్ఠుడు. అతనికి ఏడుగురు కొడుకులు. వారే ఆమోదుడు, మధువహుడు, మేఘపృష్ఠుడు, సుదాముడు, ఋషిజ్యుడు, లోహితార్ణుడు, వనస్పతి అనువారు. తన కుమారుల పేరుమీదుగా క్రౌంచ ద్వీపాన్ని ఘృతపృష్ఠుడు ఏడు వర్షాలుగా విభాగంచేసి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క కుమారుని రాజుగా నియమించాడు. తాను మంగళగుణయుతుడయిన శ్రీహరి పాదపద్మాలను స్మరిస్తూ తపం చేయడానికి అడవులకు వెళ్లాడు. ఆ క్రౌంచద్వీపంలోని ఏడు వర్షాలలో శుక్లం, వర్ధమానం, భోజనం, ఉపబర్హణం, ఆనందం, నందనం, సర్వతోభద్రం అనే ఏడుకొండలు, వరుసగా అభయ, అమృతోఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తి, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులూ ఉన్నాయి. ఆ నదిజలాలలో స్నానంచేసి గురువులు, ఋషభులు, ద్రవిణకులు, దేవకులులు అనే నాలుగు వర్ణాలవారు జలాంజలులు సమర్పిస్తూ వరుణదేవుని సేవిస్తుంటారు.

పరీక్షిన్నరేంద్రా! విను. క్రౌంచద్వీపం చుట్టూ పదహారు వేల యోజనాల విస్తృతిలో పాలసముద్రం ఉంది. క్రౌంచద్వీపానికి ఆవల శాకద్వీపం ప్రసిద్ధి పొందిన ద్వీపం. ఆ ద్వీపం ముప్పదిరెండు లక్షల యోజనాల విస్తృతి కలిగింది. ఆ ద్వీపంలో ఒక పెద్ద శాకవృక్షం ఉన్నది. దాని సుగంధంవల్ల ఆ ద్వీపమంతా పరిమళవంతంగా ఉంటుంది. ఆ కారణంగానే ఆ ద్వీపానికి శాకద్వీపమని పేరు. ఆ ద్వీపానికి ప్రియవ్రత నందనుడయిన మేధాతిథి అధీశ్వరుడు.

మేధాతిథికి పురోజనుడు, మనోజనుడు, వేపమానుడు, ధూమ్రానీకుడు, చిత్రరథుడు, బహురూపుడు, విశ్వచారుడు అనే కొడుకులున్నారు. వారికి వారి పేర్లతో ప్రసిద్ధములయిన శాకద్వీపంలోని ఏడు భూభాగములు పంచియిచ్చి పట్టంగట్టి మేధాతిథి శ్రీహరి పాదసేవచేస్తూ తపోవనానికి వెళ్ళాడు. ఆ ఏడు వర్షాలలో క్రమంగా ఈశానం, ఉరుశృంగం, బలభద్రం, శతకేసరం, సహస్రస్రోతం, దేవపాలం, మహానసం అనే సరిహద్దు పర్వతాలు, అనఘ, ఆయుర్ద, ఉభయసృష్టి, అపరాజిత, పంచపరి, సహస్ర సృతి, నిజధృతి అనే ఏడునదులూ ఉన్నాయి. ఆ ద్వీపవాసులు ఆ నదీజలాలు సేవిస్తూ ప్రాణాయామం చేస్తూ రజోగుణ, తమోగుణాలను వశింపజేసుకొని సమాధి నిష్ఠులయి వాయురూపుడయిన భగవంతుని ఆరాధిస్తారు. అక్కడ ఋతవ్రతులు, సత్యవ్రతులు, దానవ్రతులు, సువ్రతులు అనే నాలుగు వర్ణాలవారున్నారు.

శాకద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దధి సముద్రం ఉంది. దాని తరువాత అరవై నాలుగు లక్షల యోజనాల విస్తారం కలిగిన పుష్కరద్వీపం ఉంది. ఆ మహాద్వీపంలో పదివేల బంగారు రేకులు కలిగి బ్రహ్మదేవుని ఆసనమయిన పద్మం ఉన్నది. ఈ ద్వీపం నడుమ మానసోత్తరమనే పెద్ద పర్వతం ఉంది. తూర్పు పడమరలలోగల వర్షాల రెండింటికి ఆ మానసోత్తరం సరిహద్దు కొండ.

ఈ విధంగా లోపల వెలుపల ఉన్న వర్షాలకు సరిహద్దుగా ఉన్న మానసోత్తర పర్వతం పదివేల యోజనాల విస్తీర్ణమూ. అంతే ఎత్తూ కలది. ఆ పర్వతానికి నాలుగు దిక్కులలోనూ నలుగురు లోకపాలకుల పట్టణాలున్నాయి. ఆ మానసోత్తర పర్వతశిఖరాన సంవత్సరాత్మకమయిన సూర్యరథచక్రం తిరుగుతూ రాత్రింబగళ్ళు మేరువునకు ప్రదక్షిణం చేస్తున్నది. ఆ పుష్కరద్వీపాధిపతి వీతిహోత్రుడు. అతనికి రమణకుడు, ధాతకుడు అనువారు కుమారులు. వీతిహోత్రుడు పుష్కరద్వీపాన్ని రెండు వర్షాలుగా విభజించి, ఆ భూభాగాలకు తన కొడుకులను రాజులను చేశాడు. తన అన్నల అడుగుజాడలలో వీతిహోత్రుడు భగవత్ప్రీతికరాలైన కర్మలు ఆచరిస్తూ తపోవనానికి వెళ్ళిపోయాడు.

ప్రజలకు రక్షకుడవయిన పరీక్షిన్నరేంద్రా! ఈ పుష్కరద్వీపంలో సంచరించేవారు వేదోక్తకర్మలను ఆచరిస్తూ చతుర్ముఖుణ్జి కొలుస్తుంటారు. వారు నిశ్చలమయిన బుద్ధిబలం, నియమనిష్ఠలు కలిగినవారు.

ధరణీనాథా! పుష్కరమనే ద్వీపంలో నాలుగువర్ణాల విభాగం లేదు. అక్కడి వారందరూ భేదభావం లేకుండా సమభావంతో కలసిమెలసి సంచరిస్తారు.

ఆ పుష్కర ద్వీపం అరవైనాలుగు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. దానిచుట్టూ అంతే విస్తీర్ణం కలిగి పరిశుద్ధమయిన జలంతో నిండిన సముద్రం ఉంది. ఆ సముద్రానికి ఆవల లోకాలోక పర్వతముంది. సముద్రానికీ, ఆ పర్వతానికీ మధ్యగల ప్రదేశం రెండుకోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అక్కడ మానవ సంచారం లేదు. ఆ భూమి అద్దంలాగా స్వచ్చంగా నున్నగా ఉంటుంది. అది దేవతలు నివసించడానికి అనువయిన ప్రదేశం. ఆ భూమిలో పడవేసిన పదార్ధం మరల ఎంత ప్రయత్నించినా చేతికందదు. ఆపైన ఎనిమిది కోట్ల యోజనాల ప్రదేశం బంగారు భూమిలాగా ప్రకాశిస్తుంటుంది. సూర్యునినుండి ధ్రువతార వరకు వ్యాపించిన జ్యోతిర్గణం మధ్య ఉండడంవల్ల ఆ పర్వతానికి లోకాలోక పర్వతమనే పేరు సార్థకం అవుతున్నది. ఈ భూమండలమంతా యాభైకోట్ల యోజనాల విస్తృతి కలిగింది. అందులో నాల్గవవంతు లోకాలోక పర్వతం. ఆ పర్వతం మీద సకల లోకగురుడైన బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కర చూడం. వామనం, అపరాజితం అనే దిగ్గజాలను లోకరక్షణార్థం నిలిపి ఉంచాడు.

ఆ లోకాలోక పర్వతంమీద ఆదిదేవుడూ, జగద్గురుడూ, భగవంతుడూ అయిన శ్రీమన్నారాయణుడు లోకాలను రక్షించడంకోసం, యోగమాయాసహితుడై కల్పాంతంవరకూ ఉంటాడు. దేవతల సమూహమంతా శ్రీమన్నారాయణుని వైభవ స్వరూపమే, ఆ దేవతల తేజస్సు, పరాక్రమమూ విస్తరింపజేయడానికోసం విష్ణుభగవానుడు ధర్మం, జ్ఞనం, వైరాగ్యం అనే విభూతులతో ప్రకాశించే విష్వక్సేనుడు మొదలయిన పార్షదులతో కూడి చతుర్బాహువులలో శ్రేష్ఠయిన ఆయుధాలు ధరించి ఆ పర్వతంమీద ప్రకాశిస్తాడు.

(విష్వక్సేనుడు విష్ణుసేనాధిపతి. శైవంలో విఘ్నేశ్వరుని వంటివాడు. వైష్ణవులకు విఘ్ననివారకుడయిన స్వామి. ఆకారంలో ఏనుగు ముఖం కల్గి ఉంటాడు. సూత్రవతీదేవి విష్వక్సేనుని భార్య. 'సేన మొదలారి' అని వైష్ణవులు ఆయనను కీర్తిస్తారు. విష్వక్సేనుని ధ్యాన శ్లోకం-

శ్లో. యస్యద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ ।
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥

ఆ లోకాలోక పర్వతంమీద భగవంతుడు వివిధ మంత్రాలను రహస్యంగా రక్షిస్తుంటాడు. ఆ భగవంతునికి తప్ప ఆ లోకాలోకపర్వతానికి ఆవల ఎవరికిగాని సంచరించడానికి శక్యంకాదు. బ్రహ్మాండానికి మధ్యభాగంలో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యునికి ఇరువైపులా ఇరవైఅయిదు కోట్ల యోజనాలదూరంలో బ్రహ్మాండ కటాహం ఉంది. ఆ సూర్యభగవానుడే ఆకాశం, దిక్కులూ, స్వర్గనరకాలు, మోక్షం అనేవాటిని నిర్ధేశిస్తాడు. దేవతలకూ, మనుష్యులకూ, జంతువులకూ, సర్పాలకూ, పక్షులకూ, గడ్డిపోచలకూ, తీగెలకూ, పొదలకూ, సర్వజీవరాసులకూ సూర్యుడే ఆత్మ.

(లోకమంటే సూర్యకాంతిగల దేశం. అలోకం అంటే సూర్యకాంతి లేని దేశం.)

ఓ రాజా! నీవంటే నాకున్న ప్రీతి కారణంగా భూమండల నిర్మాణానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేశాను. ఇంతేకాదు. ఇపుడు నీకు సృష్టి కొలతలను కూడా చెబుతాను. విను.

భగణ విషయము

Wednesday, March 4, 2026

Sree Maha Bhagavathamu Part 5.2 - శ్రీ మహా భాగవతము పంచమస్కంధము ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు శీమహాభాగవతము పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము

శ్రీకాంతాహృదయప్రియ!, లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లోక! భవభయనివారక!, గోకులమందార! నందగోపకుమారా!


లక్ష్మీదేవి మనసు మెప్పు పొందినవాడవూ, చక్రవాళపర్యంతం పేరెన్నిక గన్నవాడవూ, లోకాలన్నింటికి ప్రభువయినవాడవూ, మంచి యశస్సు కలవాడవూ, సంసారభయాలను నివారించేవాడవూ, గోకులంలోని వారికి కల్పవృక్షం వంటి వాడవూ, నందగోపుని కుమారుడవూ అయిన శ్రీకృష్ణా! అవధరించు.

(లోకాలోక పర్వతానికే చక్రవాళ పర్వతమని పేరు. ఈ పర్వతం భూమిని చుట్టి ఉంటుంది. ఇక్కడ లోపలి భాగం వెలుతురుతోను వెలుపలి భాగం చీకటితోను నిండి ఉంటుంది.)

సమస్త పురాణ గాథల రహస్యాలను తెలుసుకోవడంలో విఖ్యాతుడయిన సూతుడు శౌనకాది మహామునులతో ఈ విధంగా చెప్పాడు.

మునులార! బాదరాయణుని కుమారుడయిన శ్రీ శుకుడు పుణ్యాత్ముడూ, ఉత్తరానందనుడూ అయిన పరీక్షిత్తుకు భరతునిచరిత్ర చక్కగా వినిపించి ఆ తర్వాత తగినరీతిలో ఇలా అన్నాడు.

(వేదవ్యాసునికే పరాశరాత్మజుడు, కృష్ణద్వైపాయనుడు, బాదరాయణుడు, శుకతాత అనే పేర్లున్నాయి.

శ్లో వ్యాసం, వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్‌ ।
     పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ॥

బ్రహ్మ - వశిష్ఠుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు - శుకుడు. ఇది వ్యాసుని వంశవృక్షం. వ్యాసుడు వశిష్టనికి మునిమనుమడు. శక్తికి మనుమడు. పరాశరునికి పుత్రుడు. తపోనిధి. శుకుని తండ్రి.)

భరతుని కుమారుడయిన సుమతి ధర్మయుక్తంగా పరిపాలన సాగిస్తున్న సమయంలో, దుర్మార్గులయిన పాషండులు తమ మతాన్ని స్థాపించాలని అతని దగ్గరికి వచ్చి ఈ విధంగా పాగడసాగారు.

ఓ రాజా! 'మేము నిత్యమూ బుద్ధభగవానుని కొలిచినట్టుగా నిన్ను కూడా సేవిస్తాము అంటూ ప్రియోక్తులతో తమ ధర్మాలను సుమతికి బోధింపసాగారు.

వేదనిందలయిన పాషండుకులు క్రమంగా సుమతిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అటువంటి సమయంలోనే సుమతి భార్య అయిన దేవసేనకు దేవతాజిత్తు అనే కొడుకు పుట్టాడు. అతడికి ఆసురి అనే భార్యవల్ల దేవద్యుమ్నుడనే సుపుత్రుడు జన్మించాడు. మహాపురుషుడైన ఆ దేవద్యుమ్నునికి ధేనుమతివల్ల పరమేష్ఠి పుట్టాడు. సత్యసంధుడయిన అతనికి సువర్చలవల్ల ప్రతీహుడు కలిగాడు. అతడు చాల గొప్పవాడు. అందువల్ల జనులకందరికి బ్రహ్మోపదేశం చేశాడు. అతడు పరిశుద్ధమయిన మనస్సుతో హరిస్మరణ చేస్తుండేవాడు. ఆ ప్రతీహుడికి ప్రతిహర్త, ప్రసోత, ఉద్గాత అనే ముగ్గురు కుమారులు పుట్టారు. వారు ముగ్గురూ యజ్ఞాలు చేయడంలో నిపుణులు. వారిలో ప్రతిహర్తకు స్తుతి అనే భార్యవల్ల వ్యోముడు, భూముడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. వారిలో భూమునికి ఋషికుల్య అనే భార్యవల్ల 'ఉద్గీథుడు' అనే కొడుకు పుట్టాడు. అతనికి దేవకుల్యవల్ల 'ప్రస్తోత' అనే కుమారుడు జనించాడు. ఆ ప్రస్తోతకు 'వరరుత్స' వల్ల విభుడనే కొడుకు పుట్టాడు. అతనికి భారతివల్ల 'పృథుషేణుడు' కలిగాడు. పృథుషేణునికి 'ఆకూతి' వల్ల 'నక్తుడు' జన్మించాడు. ఆ నక్తుని కుమారుడే గయుడు. ఆ గయుడు రాజర్షులలో చాలా గొప్పవాడై ఎంతో కీర్తి గడించాడు.

(ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత, ఉద్గీథ అనే పేర్లు వైదికమైన యజ్ఞానికి సంబంధించిన ఋత్విజుల పేర్లు. 
ఋత్విజుడు : యజ్ఞం చేయించేవానిని యాజకుడు అంటారు. అంటే యజ్ఞకర్తయైన యజమానుని వద్ద దక్షిణ పుచ్చుకొని యజ్ఞం చేయించే బ్రాహ్మణుడు.

ఋత్విజులు నలుగురు. 1) హోత 2) ఉద్గాత 3) అధ్వర్యువు 4) బ్రహ్మ - వీరిలో ఒక్కొక్కరికి ముగ్గురు చొప్పున సహాయక ఋత్విజులుంటారు. (4x౩=12) ఆ పన్నెండు ఋత్విజుల పేర్లివి - 1)బ్రాహ్మణాచ్చంసి 2) ప్రస్తోత ౩) మైత్రావరుణుడు 4) ప్రతిప్రస్థాత 5) పోత 6) ప్రతిహర్త 7)అచ్చావాకుడు 8) నేష్ఠ 9) ఆగ్నీధ్రుడు 10) సుబ్రహ్మణ్యుడు 11) గ్రావాస్తుతుడు 12) ఉన్నేత.

అధ్వర్యుడు : యజుర్వేదంలో చెప్పబడిన మంత్రాలను పఠిస్తూ యజ్ఞంలో చేయవలసిన హోమాది ప్రధాన కృత్యాలను ఆచారించే ఋత్విక్కు.

హోత : ఋగ్వేద మంత్రాలతో హోమకాలంలో, ఆయా దేవతలను పిలిచే ఋత్విక్కు అందుకే ఋగ్వేదానికి 'హౌత్రవేద' మని పేరు.

ఉద్గాత : సామవేద మంత్రాలతో హోమాది కాలాలలో ఆయా దేవతా సంతుష్టికోసం గానం చేసే ఋత్విక్కు కాబట్టి సామవేదానికి 'ఉద్గాతృవేద' మని నామాంతరం.

బ్రహ్మ : పై ఋత్విక్కులు చేసేదీ, యజమానుడు చేసే, సకల కృత్యాలను పరీక్షిస్తూ సాక్షీభూతుడై అనుజ్ఞ ఇచ్చే ఋత్విక్కు అధర్వవేదానికి 'బహ్మవేద' మని పేరు.

ఆగ్నీధ్రుడు : దేవతలకు సమర్పించే చరు, పురోడాశాది హవిస్సులు చేయడానికి, తదితర క్రియాకలాపాల్లో సహాయం చేసే ఋత్విక్కు ఆగ్నీధ్రుడు. 'చరువు' అంటే బియ్యంతో వండిన హోమద్రవ్యం. పురోడాశమంటే బియ్యపు పిండితో కపాలంలో/కుండ పెంకుమీదగాని చక్కగా కాచి పక్వం చేయబడిన పిండిముద్ద.

ఉద్గీథ : సామవేదము (ఉద్గాతృవేదము))

సకల జీవరాసులను రక్షించడానికి విష్ణువు సత్త్వ ప్రధానమయిన దేహం ధరించి ఆత్మతత్త్వాన్ని తెలిసినవాడుగా(గయుని రూపంలో) ఉన్నాడు.

గయుడు మహాసద్గుణ సంపన్నుడు. ఆ మహానుభావుని కథలన్నీ పురాణవేత్తలయిన మహాత్ములకు బాగా తెలుసు. వారందరు గయుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నారో చెబుతాను. నీవు శ్రద్ధగా విను.

పరీక్షిన్నరేంద్రా! గయుడు ధర్మమార్గానుసారంగా ప్రజలను సత్కర్మలలో నియోగిస్తూ మంచిమాటలతో బుజ్జగిస్తూ, మంచి పనులను ప్రోత్సహిస్తూ, అవసరమయినపుడు గట్టిగా మందలిస్తూ ఎంతో సంతోషిస్తూ పరిపాలించాడు. యజ్ఞాలు నియమాలతో నిర్వర్తించేవేళ తన మనస్సులో యజ్ఞపురుషుడయిన ఈశ్వరుని నిలిపి సేవించాడు. హృదయస్థుడైన ఈశ్వరుని సందర్శించాడు. సకల జీవరాశికి ఆనందం కలిగేలాగా స్వాభిమానం లేకుండా భూమిని పరిపాలించాడు. సత్యవిషయంలో, మంచివారిని సేవించడంలో, ధర్మసంబంధంలో, యజ్ఞకర్మల విషయంలో గయుడు సాక్షాత్తు విష్ణుస్వరూపుడేగాని మానవమాత్రుడు కానే కాడు.

మహాపురుషులకు ఎటువంటి గుణాలు ఉండవలెనో అటువంటి గుణాలు కలవాడు గయుడు. ఆ కారణంవల్ల దక్షప్రజాపతి పుత్రికలయిన శ్రద్ధ, మైత్రి, దయ మొదలయిన దేవతలు తమంత తాముగా వచ్చి వరాలు ప్రసాదించారు. భూదేవి ఆయనకు కామధేనువయింది. వేదాలు కోరిన కోరికలు అనుగ్రహిస్తున్నాయి. యుద్ధంలో పరాజయం పొందిన రాజులు కప్పం చెల్లిస్తున్నారు. బ్రాహ్మణులు తమ పుణ్యసంపదలలో ఆరవభాగం పంచియిస్తున్నారు. ఎడతెగని సోమపానంతో, శ్రద్ధాభక్తులతో నిర్వహింపబడే యజ్ఞాలతో ఇంద్రాది దేవతలు సంతృప్తిపడుతూ ఆయా యాగాల ఫలాలను ప్రసాదిస్తున్నారు. బ్రహ్మ మొదలు గడ్డిపరక పర్యంతం అన్నిరకాల ప్రాణులను గయుడు సంతృప్తిపరిచాడు. ఇందువల్ల శ్రీహరికూడా సంతుష్టుడైనాడు. ఈ విధంగా గయుడు చాలకాలం రాజ్యపరిపాలన గావించాడు.

అలాంటి గయునికి జయంతివల్ల మువ్వురు కొడుకులు పుట్టారు. వారే చిత్రరథ, స్వాతి, అవరోధనులు. చిత్రరథునికి ఊర్ణవల్ల సమ్రాట్టు. సమ్రాట్టుకు ఊర్మిళవల్ల మరీచి, మరీచికి బిందుమతివల్ల బిందుమంతుడు జన్మించారు. ఆ బిందుమంతునికి సరఘవల్ల మధువు, మధువుకు సుమనసవల్ల వీరవ్రతుడు, వీరవ్రతునికి భోజవల్ల మన్యుప్రమన్యులనే ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో మన్యువుకు సత్యవల్ల భువనుడు, భువనునికి దోషవల్ల త్వష్ట ధర్మాత్ముడయిన త్వష్టకు విరోచనవల్ల విరజుడనేవాడు జన్మించాడు.

(రాజ్యపరిపాలన చేసేవారికి నాలుగు అంశాలు ముఖ్యం. పోషణం మొదటిది. రెండవది ప్రీణనం, మూడవది ఉపలాలనం, నాల్గవది అనుశాసనం. ప్రజలకు తగినంత ఆహారం సమకూర్చడం, సంతృప్తిపరచడానికి ప్రియవస్తువులు ఇవ్వడం, కొన్నిమార్లు సమావేశపరచి ప్రియమయిన వాక్కులతో సంతోషపరచడం, ఉత్తమ పౌరులు కావడానికి తగిన ఉపదేశం ఇవ్వడం.)

ఓ రాజా! ఆ విరజునికి విషూచివల్ల నూరుగురు కుమారులు పుట్టారు. ఆపై ఒక కన్యక కూడా జనించింది. తమ భూపతికి కలిగిన సంతాన సంపత్తికి సకలజనులు సంతోషించారు.

ప్రియవ్రతుని వంశంలో విరజుడు చివరివాడు. ఇంద్రుని తమ్ముడైన ఉపేంద్రుని లాగున అతడు రాజవంశంలో రాణించాడు.

ఈ విధంగా పలికిన శుకమహర్షి మాటలకు అభిమన్యు కుమారుడయిన పరీక్షిత్తు చాల సంతోషించాడు. ఇంకా విష్ణు మహిమలను వినాలనే కుతూహలంతో మరల ఈ విధంగా ప్రశ్నించాడు.

మునీంద్రా! ఎందాక సూర్యరశ్మి ప్రసరిస్తుందో, ఎందాక నక్షత్రాలతో కూడిన చంద్రుని కిరణాలు వ్యాపిస్తుంటాయో, అందాక ప్రియవ్రతుని రథచక్రాల ఒరిపిడులవల్ల సప్తద్వీపాలు, సప్తసముద్రాలు ఏర్పడ్డాయని చెప్పారు గదా! ఆ ద్వీపాల పరిమాణాలనూ, సముద్రాల పరిమాణాలను సవిస్తరంగా తెలియజెప్పు. ఈ లోకమంతా గుణమయమయిన శ్రీహరి స్థూల స్వరూపమే. అందువల్ల అటువంటి భావనను లోకమందు నిలిపినట్లయితే నిర్గుణమూ, సూక్ష్మమూ, స్వయంప్రకాశమూ, బ్రహ్మస్వరూపమూ అయిన వాసుదేవునియందు మనస్సు సుస్థిరంగా లగ్నమవుతుంది. అందుచేత ద్వీపాలకూ, వర్షాలకూ, సముద్రాలకూ సంబంధించిన విశేషాలను సవిస్తరంగా తెలుపవలసింది అని ప్రార్ధించగా శుకయోగి పరీక్షిత్తుతో ఇలా అన్నాడు.

రాజా! నీవడిగిన దానికి సమాధానం చెబుతాను. విను. ఈ సముద్రాలు, ఈ ద్వీపాలు, ఈ భూభాగం అన్నీకూడా శ్రీహరి మాయవల్ల పుట్టిన వైభవాలే. వాటిని సంపూర్ణంగా వర్ణించి చెప్పడం ఎవరికి చేతనవుతుంది?

"నాకు తెలిసినంతవరకు సంక్షిప్తంగా చెబుతాను. నీవు ఏకాగ్రచిత్తంతో వినుము" అని శుకమునీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పసాగాడు.

శుకయోగి యుపదేశమునం దెల్పుభూగోళ నిర్ణయము

bharatha gave a profound spiritual answer to King Rahugaṇa - భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

ఓ రాజా! నీవు చెప్పింది ముమ్మాటికి నిజం. బరువు శరీరానికే గాని నాకేమాత్రం కాదు. మనిషి బలిసిపోవడం చిక్కిపోవడం, శరీరానికి మనసుకూ సంబంధించిన జబ్బులు, ఆకలిదప్పులూ, ఇష్టపడడం, ద్వేషించడం, భయపడడం, వార్ధకం, మరణం, రోషం, నిద్ర మెలకువ, అహంకారమమకారాలు, మదమాత్సర్యాలు దేహంతో పుడతాయి. కాని, నాకు లేవు. జీవన్మృతుడను నేను మాత్రము కాదు. జననమరణాలు కలిగి ఉన్న వారందరూ జీవన్మృతులే. యజమానుడు సేవకుడు అనే సంబంధం కర్మవల్ల కలిగినది కనుక అది శరీరానికి గాని జీవునికి సంబంధించినది కాదు. "నేను రాజును కదా" అనే అభిమానంతో నీవు నన్ను ఆజ్ఞాపించావు. అంటే నీవు మదోన్మత్తుడవై ఉన్నావన్నమాట. అది నీ స్వభావం గాని మరేంకాదు. అందుకు నేనేం చేయగలను? పిచ్చివాడూ, మూగవాడూ, గుడ్దివాడూ, తెలివిలేనివాడూ ఎంతో నేనూ అంతే. అందుచేత నన్ను శిక్షించడంలో నీకు కలిగే లాభం ఏమీ లేదు. అంతేగాకుండా జడుడనూ, మత్తుడనూ అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం. ఇలా పలికి శాంతస్వభావుడయిన ఆ ముని శ్రేష్ఠుడయిన భరతుడు పూర్వ కర్మఫలాన్ని అనుభవించక తప్పదనే భావంతో దండె వదలిపెట్టుకుండా ఎప్పటిలాగే పల్లకిని మోయసాగాడు. శాస్త్రసమ్మతాలైన బ్రాహ్మణుని వాక్యాలను రాజు విన్నాడు. ఆ మాటలు తత్త్వజ్ఞానాపేక్షతో పోతున్న ఆ రాజేంద్రుని హృదయానికి సూటిగా తగిలాయి. అతనిలోని అహంకారం తొలగింది. ఆ రాజు వెంటనే పల్లకి నుండి దిగాడు. బ్రాహ్మణునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వినయవినమ్రుడై చేతులు జోడిస్తూ ఇలా అన్నాడు.

(దేహానికి ఆత్మకు తేడా ఉంది. దేహానికి సంబంధించిన సుఖదుఃఖాదులచే ఆత్మప్రభావితం కాదు. జడభరతుడు ఆత్మస్వరూపుడు. అతనికి లౌకిక సుఖదుఃఖ భావన లేదు. పరమప్రభువు దేవుడు ఒక్కడే. ఇతరులు కాదు. ప్రకృతి అధీనంలో భౌతిక జగత్తులో ఎవడూ ప్రభువు కాడు.

'దైవీహ్యేషాగుణమయీ మమమాయా దురత్యయా' 7-14 ప్రకృతిమాయచే ప్రభువులు, భృత్యులమనే భావన. ఇది మిథ్యాపూర్వక భావన భరతుడు ఒక్కడే 'ధర్మాధికారి'

'తత్తే
నుకమ్పాం సుసమీక్ష్యమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకమ్‌,
హృ ద్వాగ్వపుర్భిర్విద ధన్నమస్తే జీవేత యో ముక్తిపదే సదాయభాక్‌.' భాగ 10-148

'గతకర్మలు అనుభవిస్తూ ఏ నిర్హేతుక కరుణకై వేచియుండి హృదయకుహరమున సదా వందనములను కావించువాడు మోక్షపదమునకు నిశ్చయంగా అర్హుడగును. అది అతని ధర్మయుతమను అధికారమే యగును అని భావం.

1. వ్యాధులు, ఆధులు : 'ఆధి అంటే మనస్సుకు సంబంధించిన జబ్బు. 'వ్వాధి' అంటే శరీరానికి చెందిన జబ్బు.

2. సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి : స+అష్ట+అంగ+దండ ప్రణామం ఆచరించే పద్దతి.

శరీరంలోని ఎనిమిది అంగాలు నేలకు తగిలేటట్లుగా చేసే నమస్కారం.)

నీవు సామాన్యబ్రాహ్మణుడవు కావు. అవధూతలా కనిపిస్తున్నావు. అయితే ఎందుకు ఈ వేషంలో ఒంటరిగా తిరుగుతున్నావు? నన్ను ధన్యుణ్ణి చేయడంకోసం దయతోవచ్చిన కపిల మహామునీంద్రుడవు కావు గదా? నీ మహిమలు తెలుసుకోలేక నేను అపచారం చేశాను. నన్ను దయతో చూడు. నా తప్పును క్షమించు. నేను బ్రాహ్మణునకు భయపడినట్లు యమధర్మరాజు పాశానికి గానీ, శివుని శూలాయుధానికి గానీ, ఇంద్రుని వజ్రాయుధానికిగానీ, అగ్ని, చంద్ర, సూర్య, వరుణుల శస్తాస్రాలకుగానీ ఏ మాత్రం భయపడను సుమా!

నీవు కోరికలు లేనివాడవై కూడా పైకి జడునివలె కనిపిస్తున్నావు. నిగూఢమయిన విజ్ఞానరహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీ మాటలు యోగశాస్త్రాలలోని వాక్యాలకు దీటుగా ఉన్నాయి. నీ వాక్యాలు వాక్కుకు గాని మనసుకు గాని విడదీయడానికి వీలు లేనట్టుగా ఉన్నాయి.

నే నిపుడు విష్ణుదేవుని అంశతో అవతరించినవాడూ, సాక్షాత్‌ విష్ణుస్వరూపుడూ అయిన కపిలమహాముని వల్ల బ్రహ్మవిద్యోపదేశం పొందాలని వెళుతున్నాను. నీవు లోకులను పరీక్షించడంకోసం, ఇతరులు గుర్తించడానికి వీలులేని ఆకారంలో తిరుగుతున్న సాక్షాత్‌ కపిలమహామునీంద్రుడవే అని అనుకొంటున్నాను. మూర్ఖుడైన నావంటి గృహస్థుడు మీవంటి యోగీశ్వరుల చరిత్రలను ఎలా తెలుసుకోగలుగుతాడు? ఈ గృహస్థాశ్రమం బాదరబందీ నాకులాగా నీకు ఉన్నట్టుంది. కుండలేకపోతే నీరు తీసుకురావడం కుదరదు. అందువల్ల అసలు లేనిది అనుభవానికి రానేరాదు. ప్రమాణాలను బట్టి 'లోకవ్యవహారాన్ని నమ్ముతున్నాము. అందువల్ల నీ మాటలు నాకు సరిపడుట లేదనిపిస్తున్నది అని సింధు దేశానికి అధిపతి అయిన రహూగణుడు అన్నాడు. ఆ మాటలు విని బ్రాహ్మణకుమారుడైన భరతుడు 'లోకవ్యవహారంలోని నిత్యత్వం ఉపాధిపై ఆధారపడి ఉంటుందేగాని అది సత్యం కానేకాదు' అని ఉదాహరణలతో ఇలా విశదీకరించాడు.

(జడభరతుడు పరిపూర్ణ యోగి. మునులలో శ్రేష్ఠుడు. యోగేశ్వరుడు గీతలో -

'యోగినామపి సర్వేషాం మద్గతేనాన్తరాత్మనా 

శ్రద్ధావాన్‌ భజతే యో మాం స మే యుక్తతమో మతః' ॥ 6-47

అత్యంత శ్రద్ధతో నా భావనయందే నిలిచియుండేవాడును, నన్నే తనయందు సదా స్మరించువాడును మరియు నాకు దివ్యమైన ప్రేమయుతమైన సేవను ఒనరించినవాడును అగు యోగి యోగులందరికన్నను అత్యంత సన్నిహితంగా నాతో యోగమునందు కూడినట్టివాడైయున్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు ఇక్కడరాజు రాజుకాడు. భరతుడు జడుడు కాడు. ఇవి ఉపాధులు. ఆత్మకు అచ్చాదనలు తొడుగులు మాత్రమే.

ఉపాధి : ఇక్కడ శరీరమే 'ఉపాధి.')

అగ్నిజ్వాలలతో కుండ కాలుతుంది. కాలిన కుండ కారణంగా అందులో పోసిన నీరు వేడెక్కుతుంది. ఆ నీటిలో వేసిన బియ్యం బాగా ఉడికి పక్వమయి అన్నం సిద్ధమవుతుంది. అలాగే దేహాన్ని ఇంద్రియాలను ఆశ్రయించుకొని జీవుడున్నాడు. దేహంలోనే ప్రాణం ఇంద్రియాలున్నాయి. అందువల్ల దేహేంద్రియాలకు సంబంధించినవన్నీ జీవునకూ సంక్రమిస్తాయి.

ప్రజల శిక్షణ, రక్షణలకోసం రాజున్నాడు. ఆ రాజు చెడుకర్మలు వదలిపెట్టి విష్ణుపాదాలను సేవిస్తే, సంసార బంధాలనుండి విముక్తుడవుతాడు.

బ్రాహ్మణకుమారుడయిన భరతుడు ఇలా పలుకగానే రాజులో మార్పు కలిగింది. ఆ తరువాత వినయోక్తులతో స్తుతించి భరతునితో సింధురాజు ఇలా అన్నాడు.

మహాత్మా! నేను రాజుననే దురహంకారంతో కన్నులు గానక మహాత్ముడవైన నిన్ను తిరస్కరించాను. అపరాధినైన నన్ను కరుణించు. నీవు నావంటి మోక్షచింతనచే ఆర్హులైన తత్త్వజిజ్ఞాసువులకు దగ్గరి చుట్టానివి. నీవు నాపై నీ కృపాకటాక్షవీక్షణం ప్రసరింపజేస్తే, మహాత్ములకు అవమానం చేసిన పాపం నుండి నేను విముక్తుణ్ణి అవుతాను. నీవు లోకానికి ఆప్తమిత్రుడవు. అందువల్ల నీకు అసలు కోపమనేదే ఉండదు. మేము ఏమీ చేతగాని వాళ్ళం. గొప్పవారిని అవమానించడమనే పాపకర్మంవల్ల తొందరగా వినాశం కొని తెచ్చుకుంటాము. అందువల్ల దయాదృష్టితో నన్ను క్షమించు అని క్షమాభిక్ష వేడిన రాజును జూచి బ్రాహ్మణుడైన భరతుడు ఇలా అన్నాడు.

నీవు విద్వాంసుడవు కావు. అయినా విద్వాంసునిలాగా మాట్లాడుతున్నావు. ఇది చాలా చిత్రంగా ఉంది. అయినా నిన్ను కొంత మెచ్చుకోవచ్చు.

రాజచంద్రా! పెద్దలెవరు గాని ఈ ప్రపంచం సత్యమని చెప్పరు. అయితే నీవు సత్యమంటున్నావు. వ్యవహారసత్యం అసలు సత్యం కాదు. అందువల్ల నీ ఆధిక్యాన్ని అంగీకరించడానికి వీలు లేదు.

యజ్ఞాల్లో గాని, వేదాలలోగాని, పరమార్ధతత్త్వం చెప్పబడదు. కలలో అనుభవించిన సౌఖ్యాలకు ఆకారాలు ఉన్నాయి. కలలో అవి సత్యాలే. అయితే మెలకువలో అవి అసత్యాలు. అలాగే వేదాంత వాక్యాలనేవి తత్త్వస్వరూపం అనుభవమయ్యేవరకూ సత్యాలుగా భాసిస్తాయి. కాని అవి నీత్యాలు కావు. జీవుని చిత్తం ఎంతకాలం త్రిగుణాలతో కూడి ఉంటుందో అంతకాలం జ్ఞానేంద్రియాలతోనూ, కర్మేంద్రియాలతోనూ సన్నిహితత్వం కలిగి ఉంటుంది. ఈ అలవాటువల్ల ధర్మాలో, అధర్మాలో మనసులో పుడుతుంటాయి.

మనసుకు ఒక సంస్కారం ఉంది. ఆ సంస్కారం ధర్మాధర్మ రూపాలలో ఉంటుంది. ఆ మనస్సు ఇంద్రియ వ్యసనాలపట్ల అనురక్తి కలిగి ఉంటుంది. సత్త్వరజస్తమోగుణాల ప్రవాహాలతో వికారం పొందుతుంది. ఈ సంస్కారాన్నిబట్టి జీవుడు దేవతలు, జంతువులు, మానవులు అనే రూపాలను ధరిస్తుంటాడు. అటువంటి దేహాలలోని మనస్సు ఆయా కాలాలలో ప్రాప్తించే సుఖదుఃఖఫలాలను అనుభవిస్తూ జీవునికి ఎల్లప్పుడూ ప్రత్యక్షమవుతూ స్థూలసూక్ష్మరూపాలతో ఉంటుంది.

మనసు గుణరహితమైనప్పుడు కలిగే అనుభవమే ముక్తి. నేతిలో వత్తులు ముంచి దీపం వెలిగిస్తే పొగలతో కూడిన జ్యోతి పుడుతుంది. నేయీ వత్తీ రెండూ లేకపోతే స్వస్వరూపాన్ని పొందుతుంది. అలాగే గుణకర్మల సంబంధం కలిగిన మనస్సు ఆయా గుణాలకూ, కర్మలకూ తగిన జన్మలకు కారణమవుతుంది. గుణాలూ, కర్మలూ అనేవే లేకపోతే మనసు అనేది ఉండదు. కేవలం పరతత్త్వంగా మిగులుతుంది.

జ్ఞానేంద్రియాలు ఐదు. ఇంద్రియార్థాల మీద పనిచేసే ప్రజ్ఞలైదు. అభిమానం అనే పదకొండున్నూ మనస్సుకు ఏర్పడే వృత్తులు. ఈ పదకొండు వృత్తులతో కూడిన మనస్సు. ఈ జీవునికి లెక్కలేనన్ని జన్మలను కలిగిస్తుంది. పైని చెప్పిన మనోవృత్తులను దాటిన జీవుడు అఖండపరంజ్యోతి అయిన నారాయణస్వరూపమే అవుతాడు. చరములూ, అచరములూ అయిన జీవులకు వాయువు ప్రాణంగా ఉన్నట్టు, ఈశ్వరుడు అన్ని ప్రాణులలోనూ ఉంటూ జీవాత్మ స్వరూపుడుగా గోచరిస్తాడు. జీవుడు జ్ఞానోదయం కలిగి మాయను గెలువనంతవరకూ ఇంద్రియాలతో సాంగత్యం విడువలేడు. కామక్రోధాది అరిషడ్వర్గాన్ని జయించి పరతత్త్వాన్ని తెలుసుకొన్నట్లయితే అతడే ఈశ్వరుడవుతాడు. మనస్సు ఎంతకాలం ఇంద్రియ లోలుపమై సంచరిస్తుందో అంతకాలం సంసారచక్రంలో తిరగడం తప్పదు. అందుచేత మహావీరుడయిన వాడెవ్వడైననూ తనకు శత్రువయిన మనోవృత్తులపట్ల ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఉండాలి. మనస్సును తోచినట్లు తిరుగనీయరాదు. జీవుడు శ్రీహరి పాదధ్యానమనే ఆయుధంతో మనస్సును గెలిచినట్లయితే పరతత్త్వాన్ని అందుకుంటాడు అని బ్రాహ్మణుడయిన భరతుడు పలుకగానే, అతని మహిమకు ఆశ్చర్యపడి అతనికి నమస్కారంచేసి రాజయిన రహూగణుడు ఇలా అన్నాడు.

(16 తత్త్వాలంటే పంచమహాభూతాలు, దశేంద్రియాలు, మనస్సు. మనస్సు బద్ధ జీవనానికి కారణం. ప్రబలమయిన మనస్సు జీవుని కప్పివైచి సంసార సాగరమనే తరంగాలలో తోసివేస్తుంది.)

కారణజన్మమైన ఈ నిండైన విగ్రహం, ఈ అవధూతవేషం, ఈ బ్రాహ్మణత్వం, జన్మాంతర సమాగతమైన ఈ ఆత్మజ్ఞానం, ఈ స్వేచ్చావిహారం, సాటిలేని ఈ శాంతగుణం, ఈ విధమైన రహస్య ప్రవర్తనం కలిగిన నీకు సదా నమస్కరిస్తున్నాను.

జ్వరంతో బాధపడే రోగికి రుచికరమైన మందు దొరికినట్లు, ఎండలో తపించిన వానికి చల్లని నీరు సమకూరినట్లు అహంకారమనే పాముకాటుకు గురి అయిన నాకు నీ మాటలనే అమృతం ప్రాప్తించింది. ఇంతకంటె నాకు ఇంకో ఔషధ ఎందుకు?

బ్రాహ్మణ శ్రేష్ఠుడా! నా సందేహాలన్నిటినీ నివారించుకోవాలని కుతూహలపడుతున్నాను. దయచేసి నాకు అధ్యాత్మతత్త్వాన్ని సమగ్రంగా వివరించు.

ఈ విధంగా అడిగిన ఆ రాజుతో భరతుడు ఇలా అన్నాడు. "రాజా! పూర్వజన్మలలో చేసిన కర్మలనుబట్టి ఫలితాలు కలుగుతుంటాయి. ఆ ఫలితాలనే మానవుడు ఈ జన్మలో తన శక్తియుక్తులవల్ల కలిగాయని భావిస్తుంటాడు. మనస్సు సంసార బంధంలో చిక్కుకొని ఉన్నంతవరకు తత్త్వయోగం నిత్యమైనదని తెలుసుకోలేవు.

ఈ భూమి ఆధారంగా నా పాదాలు ఉన్నాయి. పాదాలకు పై భాగంలో పిక్కలు, ఆ పైన మోకాళ్లు, ఆ పైన తొడలు, ఆ పైన నడుము, ఆ పైన వక్షం, ఆ పైన కంఠం, ఆ దాపున మూపు, ఆ మూపుపైన పల్లకి బొంగు ఉన్నది. ఆ బొంగు ఆధారంగా పల్లకి ఉన్నది. పల్లకిలో నీవున్నావు. నేను రాజుననే అహంకారం నీలో ఉన్నది. కష్టపడేవారని చూచి వారిపట్ల దయ చూపడం మాని వారిని బెదరించి, పీడించి ప్రజాపాలనం చేస్తున్నావు. నేను పరిపాలిస్తున్నాను. ఇతరులందరు నాచేత పరిపాలింపబడుతున్నారనే అహంకారం నీకుండడంవల్ల మావంటి వారున్న సభలలో నీకు పూజ్యత లేదు.

ఈ సమస్త జీవరాసులకు భూమి నివాసస్థానం. అందువల్ల ప్రపంచదృష్టికి కారణమయిన తత్త్వం తెలియజేస్తున్నాను. ఈ భూమి పరమాణువుల సమూహంతో ఏర్పడింది. అవిద్య మనస్సుల కలయికచే ఈ జగత్తు పుట్టింది. ఈ అవిద్య కారణంగా జగత్తు రెండవది అయింది. ఇట్లా ఒకటి రెండుగా కల్పింపబడడం మాయ. ఈ కల్పన అనేకవిధాలు. సన్నం, లావు, పెద్దది, చిన్నది, ఉన్నది, లేనిది. ఇట్లే జీవుడు, అజీవుడు, ద్రవ్యములను భేదాలూ, నామభేదాలూ, వేరు వేరు స్వభావాలూ, ఆశయాలూ ఈ మాయవల్లనే కాలభేదాలు కలిగాయి. తనంతట తాను ప్రకాశించేదీ, భగవంతుడనే మాటతో పిలువబడేదీ, పరిశుద్ధమయినదీ, జ్ఞానరూపమయినదీ బ్రహ్మమొక్కటే సత్యం. జగత్తు అసత్యం అని విశదీకరించి మరల భరతుడు ఈ లాగున అన్నాడు.

(ఈ వచనం చాలా గంభీరమైనది. ఇది అద్వైతతత్త్వాన్ని ప్రతిపాదించే పరిభాషలుగల వచనం.)

పరమ భాగవతుల పాదసేవవల్ల లాభించినంత సులభంగా బ్రహ్మ తపస్సువలనగానీ, దానంవల్లగానీ, గృహస్థాశ్రమ ధర్మంవల్లగానీ, స్నానాలవల్లగానీ, హోమాలవల్ల గానీ, సూర్యచంద్రోపాసనంవల్లగానీ, వేదాధ్యయనంవల్ల గానీ లభించదు. భగవద్భక్తుల చరణసేవయే పరమబ్రహ్మప్రాప్తికి సులభమార్గం అని ఆర్యులంటారు. బాహ్యసౌఖ్యాలకు విముఖులై శ్రీమన్నారాయణుని సద్గుణ కీర్తనలో సంతోషమనుభవించే భాగవతులను అనుదినమూ ఆరాధించితే మన బుద్ది మోక్షమార్గంవైపు పయనిస్తుంది. నారాయణునిలో నెలకొని ఉంటుంది.

నరేంద్రా! నేను పూర్వజన్మలో భరతుడనే రాజును. నేను సర్వసంగపరిత్యాగం చేశాను. తరువాత భగవంతుని భక్తితో భజించాను. చివరకు ఒకానొక జింకపిల్ల మీద మమత పెంచుకున్నాను. ఆ కారణంగా లేడిగా జన్మనెత్తాను. అయితే ఈ జన్మలో కూడా హరిభక్తి విడనాడలేదు. ఆ పుణ్యవిశేషంతో నాకు మరల మానవజన్మ లభించింది. నేను సర్వసంగ పరిత్యాగినై ఇపుడు ఒంటరిగా తిరుగుతున్నాను. నరుడయినవాడు పెద్దలను సేవించడంవల్ల క్రమంగా సంసారం మీది వ్యామోహాన్ని వదలిపెడతాడు. శ్రీహరిని సదా ధ్యానించడం వల్లనూ, శ్రీహరికథలు వినడం వల్లనూ అతడు జ్ఞానవంతుడవుతాడు. చివరకు శ్రీమన్నారాయణుని పూజిస్తూ పరమపదం చేరుకొంటాడు అని పలికి పరమభాగవతుడైన భరతుడు మరలా ఈ లాగున అన్నాడు.

(ఈ వచనంలో వర్ణితమయిన సన్నివేశం మహత్తరమైనది. 'వినా మహత్‌ పాదరజో
భిషేకమ్‌' మహాభాగవతుని పాదపద్మధూళిని శిరస్సుపై దాల్చనిదే మనుజుడు పూర్ణత్వం పొందజాలడు. భరతుడు నిష్టాపూర్వకమయిన భక్తియుత జీవనం గడిపేవాడయినా జింకపట్ల అమితాసక్తుడయినప్పుడు గురుదేవుని ఆశ్రయించలేదు. అందువల్లనే, జింకపట్ల గాఢానురక్తి ఏర్పడింది. ఆధ్యాత్మిక విధులను మరవడంవల్ల పతనం తప్పలేదు. దుష్టసాంగత్య భయంతో నేను ప్రచ్చన్నంగా జీవిస్తున్నానని చెప్పాడు. హరిసేవవల్లే పూర్వజన్మస్మృతి తనకు కలిగిందని భరతుడు చెప్పడం సరియైనదే. మహాభక్తుల సాంగత్యంవల్ల పూర్ణజ్ఞానం, ఆ జ్ఞానం కారణంగా మిథ్యాసాంగత్య ఖండనం. ఆపై భక్తుల సాంగత్యం ద్వారా శ్రవణ కీర్తనాదుల కారణంతో భగవత్సేవానురక్తి కలుగుతుంది.)

భూపాల! మాయవల్ల దృఢమైన సంసారబంధాలలో బంధింపబడిన జీవుడు ప్రయోజనం ఆశించి వర్తకునిలాగా లాభదృష్టితో కర్మలు ఆచరిస్తూ సంచరిస్తాడు. సంసారం ఒక పెద్ద అడవి వంటిది. ఆ అడవిలో కామం, లోభం మొదలయిన అంతఃశత్రువులు తిరుగుతుంటాయి. అవి ఇంద్రియాలను జయించలేని మనిషిని చుట్టుముట్టి పట్టుకొంటాయి. వాడు దాచుకొన్న ధర్మమనే మహాధనాన్ని దోచుకుపోవటానికి ప్రయత్నిస్తాయి. అందువల్ల సంసారంపట్ల కోరికలు పెంచుకోకూడదు.

(సుఖపడడంకోసం ధనసంపాదన. ఆ సంపాదనలో కష్టపరంపరలు. ఆ పరంపరలోనే చనిపోవడం. సుఖపడడానికి సమయంలేదే అని పరితాపం. సంసారమనే అడవిలో భ్రమణం. కామాదులు కోరికల్ని ప్రేరేపించి అల్పమైన శారీరక సుఖానికి దారి తీస్తాయి. ఇంద్రియాలు ప్రకోపిస్తాయి. ధర్మధనం కరిగిపోతుంది. అందువల్ల సంసారాపేక్ష తగదని సారాంశం.)

సంసారం అడవివంటిదని చెప్పాను. ఆ అడవిలో కొడుకులూ, స్నేహితులూ, భార్యలూ మొదలయిన వారందరునూ, తోడేళ్ళు మేకలను భక్షించే విధంగా పురుషుని పీక్కుతింటారు.

సంసారమనేది భయంకరమయిన అడవిలోని మందిరం వంటిది. ఆ మందిరం చుట్టూ తీగలూ, పొదలూ దట్టంగా అల్లుకుని ఉన్నట్లు జీవి చుట్టూ ఆపదలుంటాయి. దుర్జనులనే కందిరీగలు జీవులను బాధిస్తుంటాయి. ఆ కారణంగా జీవులు ఆపదలకు లోనవుతారు.

గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంద్రియ సుఖాలకు అలవాటుపడతాడు. వాడికి విశ్వమంతా ఒక గంధర్వ నగరంగా కనిపిస్తుంది. ఆ సుఖాలన్నీ శాశ్వతం అనుకొంటూ సంతోషపడుతుంటాడు.

(ఆకాశంలో మబ్బులున్నప్పుడు తదేకదృష్టితో చూస్తుంటే అనేక ఆకారాలు కనబడతాయి. మిద్దెలు, గోపురాలు, ఆలయాలు, కోటలు కనబడతాయి. అవన్నీ మబ్బుల ఆకారాలే. నిజం కావు. భార్యలు, బిడ్డలు మబ్బుల ఆకారాలే. వీటిని చూచి సంతోషపడడం నైజం.)

అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాన్ని చూచి ఏదో నిప్పు అనే భ్రాంతితో దానికోసం దానివెంటబడి తిరిగినట్లు ధనంకోసం భాగ్యవంతుల ఇళ్లచుట్టూ ఊరకే రాకపోకలు చేస్తూ నరుడు వ్యథలకు లోనవుతాడు.

(అడవిలో రాత్రిపూట కొరవి దయ్యాలు తిరుగుతుంటాయి. కంటికి నిప్పురవ్వలవలె భ్రాంతి కలిగిస్తాయి. నిప్పుకోసం వాటి వెంబడి తిరిగితే దారి తప్పడం, శ్రమపడడం సంభవిస్తుంది. ఆపదలే మిగులుతాయి. ధనవంతుల దగ్గర గొడ్దుచాకిరి తప్ప ఇతర లాభములు లేవు. వారి ఎత్తుగడలు కాలాంతరంలో తెలుస్తాయి.)

కుటుంబాన్ని పెంచుకుని దానిని పోషించడంకోసం ధనం సంపాదించాలనే ఆరాటంలో ఎండమావుల వెంబడి పరుగెత్తే మృగంలాగా నరుడు పరుగులు పెడుతూ తిరుగుతుంటాడు.

(ఎండమావులలో నీరుండదు. ఆ ఎండమావుల వెంట పరువెత్తడం వల్ల అలసట, దప్పిక అధికమగునే గాని దప్పిక తీరదు.)

సుడిగాలి ఊహించినది కాదు. పైగా అడవి, ధూళి కారణంగా దారులు తెలియవు. పైగా కళ్ళకు పొరలాగా అడ్డగిస్తుంది. అలాగే సంసారబద్దుడు పొగరుతో చెడ్డపనులు చేసి ఇతరులకు హాని తలపెడతాడు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తాడు. చిక్కుల్లో పడతాడు.

అయ్యో! నరుడు పడే నానావిధాలైన పాట్లు ఎన్నని చెప్పను? అడవిలో సంచారం చేసేటప్పుడు గుడ్లగూబల కూతలకు, కీచురాళ్ల రొదలకూ మాదిరిగా విరోధుల తిరస్కారాలకు భయపడతాడు. బాధపడతాడు. అడవిలో ఏమీ దొరక్కపోతే చివరకు ఏ పిచ్చి చెట్లపళ్ళనో తినడానికి సిద్ధమయినట్లు పాపాత్ములైన ధనవంతులను ఆశ్రయిస్తూ జీవితం గడుపుతాడు. దప్పికకు ఏమాత్రం తట్టుకోలేక విసిగి వేసారి చివరకు ఎక్కడయినా కాసంత నీరు దొరుకుతుందేమోనని ఆశతో వట్టిపోయిన నది దగ్గరికి వెళ్ళినట్లు ఇహానికి పరానికి దూరులయిన పాషండులను సేవిస్తుంటాడు.

మంటలు చుట్టుకోగా తప్పించుకొందామని ప్రయత్నించి కారుచిచ్చులో చిక్కుకొన్నట్టు అన్నంకోసం దాయాదుల పంచజేరి వంచింపబడుతుంటాడు. ఒక్కొక్కసారి ఇతరులు తనకు కలిగించే బాధలకు తట్టుకోలేక రాజ్యాభిలాషతో తండ్రినీ, కొడుకునూ, అన్ననూ చివరకు ప్రాణమిచ్చిన మిత్రుణ్ణి కూడా నామరూపాలు లేకుండ చేస్తాడు. చివరకు బలవంతులయిన వారిచేత చావుదెబ్బలు తిని, డబ్బు యావత్తూ పోగొట్టుకొని దిగులుతో కుంగిపోతాడు.

గగనంలోని గంధర్వ నగరంవంటి గాలిమేడలను ఊహించుకొని మురిసిపోయినట్లు సారంలేని సంసార సుఖాలు అనుభవిస్తూ అందులో ఏదో ఆనందాన్ని జుర్రుతూ జీవిస్తాడు. కొండలెక్కేవాడు ముళ్ళూ, రాళ్ళూ గుచ్చుకొని పాదాలు బొబ్బలెక్కి బాధపడుతున్నట్టుగా గృహస్థాశమంలో చేపట్టవలసిన కార్యక్రమాలలో నానావిధాలైన బాధలతో వ్యసనాలతో పీడింపబడతాడు. ఒక్కొక్కసారి ఆకలిమంటలకు తట్టుకోలేక ఇంట్లో అందరిమీదా అనవసరంగా విసుగుకొని కసురుకుంటాడు. అడవిలో కొండచిలువ నోట్లోబడి మెలికలు తిరిగి స్పృహగోల్పోయినట్టుగా గృహం అనే అడవిలో రాత్రివేళ దిక్కుతోచక నిద్రలో మైమరచి పొరలుతుంటాడు.

అరణ్యంలో గడ్డితో కప్పబడిన పాడుబావిలో పడిపోయి పాముకాటుకు గురి అయినట్టు సంసారంలో దుర్దనులు పెట్టే బాధలకు మనస్సు కల్లోలపడి కనులు గానక అజ్ఞానమనే చీకటిగోతిలో పడతాడు. ఒక్కొక్కసారి తేనెకోసం తేనెతెట్టను రేపి తేనెటీగల బారినిపడినట్లు సంసారసుఖాన్ని కోరి ఇతరుల భార్యలనూ, ఇతరుల వస్తువులనూ అభిలషించి ఇంటి యజమానుల చేతనో లేదా రాజుల చేతనో తన్నులు తిని నరకయాతన అనుభవిస్తాడు. యౌవనంలో ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని ముసలితనంలో పరులపాలు చేసినట్లు సంసారి అయినవాడు చలికీ, గాలికీ, వానకూ ఓర్చుకొని సంపాదించిన సొమ్ము ఇతరులు హరింపగా దిగులుతో కుంగిపోతాడు. అంతేగాకుండా, అడవిలో ప్రాప్తించిన అల్పజంతువుల మాంసానికి బోయలు కొట్లాడుకొన్నట్లు సంసారంలో కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అల్పవిత్తాలకోసం తన్నులాడుకొంటారు.

ఈ విధంగా రహూగణుడనే రాజుకు పరమ భాగవతుడైన భరతుడు సంసారమనే అడవిలోని అగచాట్లను విశదపఱచి మళ్లీ ఇలా అన్నాడు.

(పాషండులు : ఏతు సామాన్య భావేన మన్యంతే పురుషోత్తమమ్‌ ।
                         తే పాషండినః జ్ఞేయాః సర్వకర్మ బహిష్కృతాః 


"ఎవరు పురుషోత్తముడైన విష్ణుమూర్తిని లోకసామాన్యుడైన మానవునిగా చూస్తారో వారిని పాషండులని పిలుస్తారు. అటువంటివారు వైదికమైన సకల కార్యకలాపాల నుండి వెలివేయబడుచున్నారు?" అనగా 'పాషండులు వేదబాహ్యులు' అని అర్థం.)

ఏదో కొంత ధనం సంపాదించుకున్నవాడు తాను సంపాదించుకొన్న ఇల్లు వాకిళ్ళలో సంతోషపడక ఇతరుల ఆస్తి కాజేయాలని ప్రయత్నం చేస్తాడు. ఈ దుశ్చర్యవల్ల వాడు చివరకు చీవాట్లు తిని అవమానం పొంది ఎంతో దుఃఖాన్ని కొని తెచ్చుకొంటాడు.

ఇంకా కొందరు వస్తువులనూ, డబ్బునూ, మార్పిడి చేసుకోవడంలో పట్టుదలలు పెంచుకొని వైరభావంతో ఆత్మచింత లేక అనుదినమూ కలహించుకొంటూ ఉంటారు.

మరికొందరు సంసారంలో సంచరిస్తూ ఆ సంసారపోషణకు అంతులేని ప్రయాసపడుతూ అందుకుగాను వస్తుసంభారాలను సమకూర్చుకొంటూ ఇహలోక సుఖాలకే అలవాటుపడతారు. అవే ఇంకా కావాలని కోరుతారు. అంతేకాని మోక్షమనేదొకటుందని ఆ ముక్తివల్ల కలిగే ఆనందం శాశ్వతమని తెలుసుకోలేరు. అందుకు అవసరమైన ఆధ్యాత్మయోగాన్ని అవలంబించక చెడిపోతుంటారు. అభిమానవంతులయినవారూ, సాటిలేని శార్యవంతులైనవారూ పరస్పరం వైరం పెంచుకొని సమరంలో ఒకరినొకరు చంపుకొంటారు. అంతేకాని, ఆ మందబుద్ధులు మోక్షమార్గాన్ని అసలు దర్శించనే లేరు. ఈ విధంగా సంసారమనే అరణ్యంలో విహరించేవారి వృత్తాంతాన్ని భరతుడు తెలియజేసి మరలా సింధు రాజుతో ఇలా అన్నాడు.

కొందరు కాలచక్ర భ్రమణమునకులోనై ఆ చక్రాయుధుని కొలువక కాకుల్లాంటివారూ, గద్దల్లాంటివారూ, కొంగల్లాంటివారూ అయిన పాషండులతో స్నేహం పెంచుకొంటారు. వారి వలలోబడి వంచింపబడతారు. కొందరు బ్రాహ్మణకులంలో పుట్టి శ్రౌతం, స్మార్తం మొదలయిన వైదికకర్మలు నియమనిష్టలతో చేస్తున్నా విషయసుఖాలకు లోబడి ఉంటారు. చెట్టులాగా వయసు పెరుగుతుంది గాని నరుడు మనసా పెరుగడు. అంత్యకాలం సమీపించుతున్నా ఇహలోక సుఖాలమీద ఆశ పెంచుకుంటాడు. స్త్రీ సంగమాభిలాషకు లోనై భార్యాపుత్రులందు స్నేహం పెంచుకుంటాడు. ఏనుగులకు భయపడ్డ బాటసారి తెలియక ఏనుగులకోసం త్రవ్విన గోతులలో పడ్డట్టు సంసారి మృత్యువనే ఏనుగు భయంతో కొండ గుహలాంటి అజ్ఞానమనే చీకటిలో పడతాడు. అందుచేత మాయను తొలగించుకొని సంసార కారణమయిన నీ రాజభావాన్ని వదలిపెట్టు. అన్ని ప్రాణులపట్ల మైత్రిని పెంచుకొని, ఇంద్రియాలను జయించు, జ్ఞానమనే కత్తి చేబట్టి జీవిత ప్రయాణ మార్గాన్ని ముగించడం తెలుసుకో! భయంకరమైన ఆ అడవినుండి బయటపడు అని బోధించగా రహూగణుడు భరతునితో ఇలా అన్నాడు.

భూలోకంలో అన్నిజన్మలలో మానవజన్మ శ్రేష్ఠమని అంటారు. ఇది నిజమని ఏలాగున నమ్మాలి. మీవంటి సర్వసములయిన మహనీయుల సందర్శనం కలిగినప్పుడే ఇది సత్యమవుతుంది.

(ఎనభై నాల్గు లక్షల జన్మల తరువాత సిద్ధించేది మానవజన్మ. అటువంటి మానవజన్మ పొందినవారు యోగులతో చేరిక గలిగినవారయితే అంతకంటె శ్రేష్ఠత్వం మరొకటి లేదు.)

భూసురశ్రేష్ఠా! నీ పాదపద్మపరాగాల సంస్పర్శనం నా పాపాలన్నింటినీ పటాపంచలు చేసింది. అంతకంతకూ నాలో హరిభక్తి అతిశయించింది.

యోగీశ్వరులు పరివ్రాజక వేషంతో బ్రాహ్మణరూపంలో తిరుగుతుంటారు. వారికి వయసుతో నిమిత్తం లేదు. అందుచేత చిన్నపెద్ద తేడాలు చూడకుండా బ్రాహ్మణులైన వారికందరికీ నా నమస్కారం అంటూ సింధు దేశాధిపతి భరతుణ్ణి స్తుతించాడు. కరుణాసముద్రుడైన ఆ యోగీశ్వరుడు సింధుపతి అయిన రహూగణునికి తత్త్వజ్ఞానం ఉపదేశించాడు. సింధుపతి మొక్కులు అందుకొని భరతుడు పొంగిపొరలే మహాసముద్రంలో దయారసపరిపూర్ణమైన హృదయంతో భూమిమీద సంచరిస్తున్నాడు. సింధు భూపతి కూడ సత్పురుష సాంగత్యం కారణంగా తత్త్వజ్ఞానం పొందాడు. అతనికి దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అని చెప్పిన శుకయోగీంద్రునితో పరీక్షిన్నరేంద్రుడు ఈ విధంగా అన్నాడు.

నరేంద్రా! ఈగ ఎంత ఎగిరినా గరుత్మంతుని చేరుకోగలుగుతుందా? అలాగే రాజులందరూ కలసినా భరతుని సచ్చరిత్రను కొనియాడడం సాధ్యమా? మనస్సుతోకూడా ఊహించలేరు. అందువల్ల భరతుని పవిత్ర చరిత్రం ప్రస్తుతించడం నాకు సాధ్యంకాని పని.

నరేంద్రా! భరతుడు పూర్వమందే పుత్రులనూ, భార్యను, రాజ్యవైభవాన్ని వదలిపెట్టాడు. భగవంతునిపట్ల నిష్ఠ పెంచుకొన్నాడు. యజ్ఞమయుడూ, ధర్మస్వరూపుడూ, సాంఖ్య యోగీశ్వరుడూ, ప్రకృతిపురుషాత్మకుడూ అయిన నారాయణునికి నమస్కారమంటూ హరిణరూపాన్ని పరిత్యజించాడు. అటువంటి పుణ్యపురుషుడైన భరతుని చరిత్రాన్ని వినిపించిన వారినీ, విన్నవారినీ శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారికి ఆయురభివృద్ధీ, ధనధాన్య సమృద్ధీ సిద్ధిస్తుంది. ఆ తరువాత వారు స్వర్గ సౌఖ్యాలనుభవిస్తారు.

(ఒక కథకు ఫలశ్రుతి చెప్పడం పురాణసంప్రదాయం. ఈ దృష్టితో భరతుని కథకు ఫలం చెప్పబడింది. ఫలం రెండు రకాలు. ఇహం పరం. పరం చెప్పడమే కథాఫలం. కాని సామాన్యులకు ఆసక్తి కలగడానికోసం ఇహఫలాలు చెప్పడం పౌరాణిక సంప్రదాయం. అన్నింటికంటె 'పుండరీకాక్షుండు రక్షించున్‌' అనడం మేలుబంతిలాంటిది.)

శ్రేష్ఠుమయిన జన్మలుగల నరులు, దేవతలు, అసురులు, యక్షులు, రాక్షసులు, మునీంద్రులు మున్నగువారి స్తోత్రమునకు గమ్యమైనవాడా! అప్రాకృతములయిన వస్త్రములచే, నగలచే అలంకరింపబడినవాడా! భక్తులయందు వాత్సల్యం గలవాడా! అపరిమితమైన దయగలవాడా! వైకుంఠమే నివాసముగా గలిగి, భూదేవి భార్యగా కలిగి, సజ్జన బృందములను రక్షించు వెలుగు గలిగి, సంపత్కరుడవై, పుణ్యములకు నివాసమై, గోవులను కాచుచు, మూడులోకములకు శుభముల నిచ్చుచు, వెలుగుల మార్గమున పొందదగిన మూర్తికల కృష్ణమూర్తి!

ఉత్తమమయిన వైకుంఠమే నివాసంగా కలవాడా! దయకు నిధియైనవాడా! మహాత్మా! రాక్షసులను చంపినవాడా! ప్రకాశించే గోపికల మనస్సులను హరించినవాడా! పద్మపత్రాలవంటి కన్నులు కలవాడా! భక్తజనులచే నుతింపబడే దివ్యదేహం కలవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం!

సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకల కలవాడా! శుభప్రదమయిన చరిత్ర కలవాడా! సూర్యచంద్రులు కన్నులుగా కలవాడా! సాటిలేని నీలమేఘచ్చాయ గల అవయవాలు గలవాడా! స్వచ్చమయిన జ్ఞానముచే ఒప్పువాడా! భారమైన సంసార బాధలను దూరం చేసేవాడా! గోపికల హృదయాలను అపహరించేవాడా! శ్రీకృష్ణా! నీకు నమస్కారం.

॥ శ్రీకృష్ణార్పణమస్తు 

Servants of vrushala raja took Bharatha for Kali Bali - వృషల రాజభృత్యులు కాళీబలికి భరతునిఁగొంపోవుట

వృషల రాజభృత్యులు కాళీబలికి భరతునిఁగొంపోవుట

భరతుడు కాపలా కాస్తున్న పొలానికి దగ్గర్లో ఒక నగరం ఉంది. ఆ నగరానికి నాయకుడైన భిల్ల రాజుకు పిల్లలు లేరు.

అందుచేత ఆయన కాళికాదేవికి నరబలి ఇవ్వడంకోసం ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకొని పోతున్నాడు. అయితే మార్గమధ్యంలో ఆ బలిపశువు తప్పించుకొని పారిపోయాడు. సేవకులు వానికోసం గాలించారు.

ఆ రాత్రి ఎంత వెదకినా ఆ వ్యక్తి కనబడలేదు. చేనిలో ఒకచోట వీరాసనం వేసికొని పొలానికి కావలి కాస్తున్న బ్రాహ్మణకుమారుడు భరతుడు భటులకు కన్పించాడు. నరబలికి తగిన పశువు దొరికింది కదా అని భటులు ఆ బ్రాహ్మణయోగిని పట్టుకున్నారు.

(వీరాసనమనగా - కుమారసంభవము 3వ సర్గ 45 శ్లో. వ్యాఖ్యయందు మల్లినాథునిచే ఉట్టంకితం.

శ్లో
 ఏకపాదమథైకస్మిన్విన్య స్యోరౌతు సంస్థితమ్‌ 
ఇతరస్మింస్తథైవోరుం వీరాసనముదాహృతమ్‌ ॥ -అని.

ఒక తొడమీద రెండవ పాదము నుంచి, మఱియొక తొడక్రింద మరియొక పాదముంచి కూర్చుండుట.)

ఆ సేవకులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుని వెంటనే కాళికాలయమునకు గొని పోయారు. బాగా తలంటిపోశారు.

ఈ విధంగా భరతుడికి అభ్యంజనస్నానం చేయించి కొత్త బట్టలు కట్టించారు. ఒంటినిండా గంధం పూశారు. మెడనిండా పూలదండలు వేశారు. ఆభరణాలతో అలంకరించారు. అక్షతలు చల్లారు. విందుభోజనం పెట్టారు. అమ్మవారికి ధూపం వేశారు. దీపం వెలిగించారు. పుష్పమాలలు, పేలాలు, చివుళ్ళు, పండ్లు, ఉపహారాలు సమర్పించారు. డప్పులు, డోళ్ళు, తప్పెటలు మోగించారు. బలి పశువును కాళికాదేవికి ఎదురుగా కూర్చోపెట్టారు. భిల్లరాజు నరబలితో వేడిరక్తంతో అమ్మవారిని సంతోషపెట్ట తలచాడు. కాళికామంత్రంతో అభిమంత్రించి భయంకరమయిన కత్తి పట్టుకొని తన కోరిక నెరవేరడంకోసం భరతుణ్ణి నరికి బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు.

(పంచమహావాద్యములు -- భేరీ శంఖ కాహళ పటహ జయఘంటలు.)

భరతు డే మాత్రం తొణకలేదు. బెదరలేదు. అతడు పరబ్రహ్మ స్వరూపుడు. సర్వజీవరాసులకు మిత్రుడయినవాడు. ఎవరిపట్ల కూడా వైరభావం లేనివాడు. అటువంటి బ్రాహ్మణోత్తముడైన భరతుని తేజస్సు చూడలేక కాళికాదేవి భయపడింది. వెంటనే కాళికాదేవి ముప్పిరిగొన్న క్రోధంతో కంపించిపోతూ హుంకారంతో వికటాట్టహాసం చేసింది. పాపాత్ములూ, దౌష్ట్యానికి తలపడినవారూ, రజోగుణ తమోగుణాల ప్రేరణలతో బ్రాహ్మణహింసకు పూనుకొన్నవారూ అయిన ఆ బోయరాజు మీద అతని పరిచారకుల మీదా విజృంభించింది. వారి శిరస్సులు నేలకూల్చింది. నాయకుడైన భిల్లరాజు శిరస్సు చేత పట్టుకొని ఆడుతూ పాడుతూ ఆనందతాండవం చేసింది.

విప్రునిలో అంతర్యామిగా విష్ణువు ఉంటాడు కనుక లోకంలో ఎవరయినా సరే బ్రాహ్మణులకు అపకారం తలపెడితే వారు తప్పక చెడిపోతారు.

ఇంకనూ జడభరతుడు ఏమాత్రమూ భయం లేనివాడు. తనను చంపడానికి వచ్చిన వారిని, వారి చేతుల్లో తళతళ మెరిసే కత్తులనూ, మహాభీకరమైన కాళికను, విష్ణుస్పరూపులుగా భావించి, గుండెలో అచ్యుతుడైన విష్ణువును పదిలపరచి, ఎటువంటి అనుమానమూ లేక నిశ్చింతగా ఉండిపోయాడు.

('అచ్యుత' శబ్దమునకు తెలుగులో అచ్చుతుడు అనుట కలదు.)

ఆ తర్వాత ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు కాళికాలయాన్ని వదలి మళ్లీ తనకు అప్పగించబడిన పొలం కావలి పనిలో నిమగ్నుడు కాగా.

ఇలా కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. ఒకసారి సింధుదేశాన్ని పరిపాలించే రహూగణుడనే రాజుకు అధ్యాత్మ విద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అందువల్ల ఇక్షుమతీ నదీతీరంలోని కపిలమహామునిని దర్శించడానికి పల్లకి ఎక్కి బయలుదేరాడు. పల్లకిమోసే బోయీలు పొలానికి కావలి ఉన్న భరతుణ్ణి చూశారు. పల్లకీ మోయడానికి వీడు చాల బలంగా ఉన్నాడు అనుకున్నారు. భరతుని తీసుకువచ్చి ఒకవైపు పల్లకి బొంగును అతని భుజంమీద పెట్టారు. అయినా భరతుడు ఎదురు చెప్పకుండా చీకూ చింతా లేకుండా మోస్తున్నాడు.

అలవాటులేని భరతుడు మనసుకు తోచినట్టు మామూలు ప్రకారం నడుస్తున్నాడు. కాని, పల్లకి సరైన పద్ధతిలో సాగడంలేదు. అందువల్ల తక్కిన బోయీల నడకతో అతని నడక జతపడలేదు. పల్లకి ఎగుడుదిగుడుగా ఊగుతుంటే రాజు బోయీలను చూచి ఇలా అన్నాడు.

మీరేమో ఎంతో శ్రమ తీసుకొని పల్లకి మోస్తున్నారు. కాని, మీ నడకలలో కుదురు కనిపించడం లేదు. మీ ఎగుడు దిగుడు నడకలవల్ల కుదుపు ఎక్కువై నాకు బాధగా ఉన్నది అని అనగానే బోయీలు రాజుగారికి ఇలా సమాధానమిచ్చారు.

మహాప్రభూ! ఈ ఎగుడుదిగుడు నడక మాది కాదు. ఈ నాల్గవ బోయవాడు సరిగా నడవడం లేదు. వీనితోపాటు మేము సరిగా నడవలేకున్నాం అన్నారు. ఆ మాటలు వినగానే సింధురాజయిన రహూగణునికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకొని ప్రవహించింది. అతడు మంచివాడే. పెద్దలను సేవించినవాడే. అయినా కోపాన్ని దిగమింగుకోలేకపోయాడు. నివురుగప్పిన నిప్పులాగా కనిపించని బ్రహృతేజస్సుతో ఉన్న బ్రాహ్మణుని చూచి పరుషవాక్కులతో ఇలా గద్దించాడు.

ఓయీ! నీవు బాగా అలసిపోయావు. పైగా ముసలివాడివి. పాపం ఆకలితో నకనకలాడుతున్నావు. నీ వెన్నెముక చాలా పలుచగా ఉంది. ఈ పల్లకి ఏమో బరువయింది. ఎంతో దూరం మోశావు. ఎలా నిలబడగలుగుతున్నావో అని రాజు ఎత్తిపొడుపుగా మాట్లాడినా బ్రాహ్మణకుమారుడు భరతుడు ఏమీ బదులాడకుండా పల్లకిని అలా మోస్తూనే ఉన్నాడు.

భరతునికి ఇదే తన కడపటి జన్మమని తెలుసు. అందువలన అహంకారమమకారాలకు మనసులో అవకాశం ఇవ్వలేదు. పైగా అతడు జ్ఞాని. పరబ్రహ్మస్వరూపుడు. అందుచేత ఏమీ ఎదురుచెప్పక మౌనంగా పల్లకిని మోస్తూనే ఉన్నాడు. పల్లకి యథాతథంగా ఎగుడుదిగుడుగా సాగుతూ ఉంటే రహూగణుడు పిచ్చికోపంతో ఇలా అరిచాడు.

ఓరీ పొగరుబోతా! నడపీనుగా! నేను చెప్పింది అసలు వినిపించుకోకుండా నడుస్తున్నావు. నీ కుంటినడకలను వదిలించి సరి అయిన మార్గంలో నిన్ను నడిపిస్తాను అని అధికారమదంతో తమోగుణ ప్రకోపంతో కారుకూతలు కూశాడు రాజు. అపుడు శమదమాది గుణసంపన్నుడూ, బ్రహ్మస్వరూపుడూ, సమస్త జీవరాసుల హితంకోరేవాడూ అయిన ఆ బ్రాహ్మణుడు యోగులస్వభావం బొత్తిగా తెలియని ఆ రాజును చూచి ఇలా అన్నాడు.

భరతుండు రహూగణుని మాటలకుఁబ్రత్యుత్తరంబు లిచ్చుట

Bharatha Story - భరతోపాఖ్యానము

భరతోపాఖ్యానము 

పరీక్షిత్తుతో శుకుడు చెప్పసాగాడు. రాజా! ఋషభుని అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు భూమండలాన్ని ఎంతో దీక్షతో పరిపాలించాడు. అతని కాలంలో విశ్వరూపుడనే రాజుండేవాడు. అతడు రాజులలో శ్రేష్ఠుడు. అతనికి పంచజని అనే కొమార్తె ఉంది. ఆమె అత్యంత కాంతిమతి అయిన కాంతామణి. అటువంటి పంచజనిని భరతుడు సుముహూర్తంలో కోరి పెళ్ళీ చేసుకున్నాడు.

(ఋషభుని వందమంది కుమారులలో భరతుడు జ్యేష్టుడు. మహాభాగవతుడు. భక్తజనపరాయణుడు. అందువల్ల ఋషభుడు అతనిని రాజుగా చేశాడు. భరతుడు పాలనాధికారి అయ్యాడు.)

అహంకారానికి శబ్ద స్పర్శ రూపరస గంధాలనే పంచతన్మాత్రలు పుట్టినట్లు మహారాజైన భరతునికి పంచజనివల్ల సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువులనే అయిదుగురు కొడుకులు పుట్టారు. ఇంతకుముందు అజనాభమనే పేరుతో పిలువబడే ఈ భూభాగాన్ని భరతుడు పాలించడంవల్ల దీనికి భరతవర్షం అనే పేరు రూఢమయింది.

భరతుడు పరమాత్ముని కరుణతో, తన తాత తండ్రులు పరిపాలించిన రీతిలోనే సత్కర్మలు ఆచరిస్తూ, బ్రాహ్మణులు పొగడేవిధంగా ప్రజలను పరిపాలించాడు.

భరతుడు అండపిండ బ్రహ్మాండాది లోకాలను భరించే భగవంతుణ్ణి చిన్నవీ, పెద్దవీ అయిన యజ్ఞాలతో ఆరాధించాడు. అమావాస్య పూర్ణిమలతో చేసే సత్కార్యాలనూ, చాతుర్మాస్యల కాలంలో చేసే అగ్నిహోత్రాదులనూ ఆచరించాడు. ఇంకా పశు యాగాలు, సోమయాగాలు నిర్వర్తించాడు. వేదోక్తంగా నిర్వహించిన ఆ సత్కర్మ ఫలాన్ని పరమేశ్వరార్పణం చేశాడు. యాగాలలోను, మంత్రాలలోను పలికే దేవతలను వాసుదేవుని అవయవాలుగా భావించాడు. ఆ మహారాజు భగవంతుని గొప్పతనాన్ని తలచుకొంటూ భక్తిమయమైన హృదయంతో, శ్రద్ధతో సమస్తరాజ్యాన్ని పరిపాలించాడు.

(చాతుర్మాస్యము : “ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధం మొదలుకొని కార్తిక శుద్ధం వరకు నాలుగు నెలలు, చేసే వ్రతం చాతుర్మాస్యం. దీనికే వార్షిక చాతుర్మాస్యమని పేరు.)

ఇట్లు నిర్మల మనస్సుతో కర్మలను ఆచరించి సిద్ధులను పొంది మిక్కిలి ధర్మంతో భరతుడు రాజ్యపరిపాలన చేశాడు.

శ్రీవత్సం, కౌస్తుభం, వనమాల అనువానితో శోభిల్లువాడూ, సుదర్శనం మొదలైన పంచాయుధాలను ధరించినవాడూ, ఆత్మీయ భక్తుల హృదయాలలో నివసించేవాడూ, పరమపురుషుడూ అయిన వాసుదేవునిపట్ల భక్తిప్రపత్తులతో భరతుడు యాభై లక్షల వేల సంవత్సరాలు రాజ్యపరిపాలన గావించాడు. తాతతండ్రుల కాలంనుండి తరతరాలు సంక్రమించిన ధనరాశిని తగినట్లు తన తనయులకు పంచిపెట్టి భోగభాగ్యాలనూ, అపార సంపదనూ, రాజసౌధాలనూ వదలిపెట్టి తాను పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు.

(పులహాశమం సాలగ్రామాలు లభించే స్థలం.)

ఆ ఆశ్రమంలో శ్రీమన్నారాయణుడు ఆశ్రమవాసులను వాత్సల్యంతో ఆదరిస్తూ కనులముందు నిలిచి ఉంటాడు. సాలగ్రామాలకు ఆలవాలమైన గండకీనది ఆ ఆశ్రమసమీపంలో ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి రమణీయమైన ఆశ్రమంలో భరతుడు ఒంటరిగా ఉంటూ శ్రీహరిని నానావిధాలయిన పువ్వులతో, చిగుళ్ళతో, తులసీదళాలతో, జలాలతో, కమలాలతో, కందమూలఫలాలతో అర్పిస్తూ తనివితీరా సేవ చేస్తున్నాడు.

ఇటువంటి హరిసేవవల్ల భరతునికి విషయవాంఛలు నశించాయి. శమదమాది గుణసంపత్తి అలవడింది. పరమ పురుషుణ్ణి భక్తిభావంతో ఎడతెగకుండా భజిస్తుంటే అహంకారమనే ముడి విడిపోయి ఆనందానుభూతి కలిగింది. ఆయన మేను పులకించింది. ఆయన కన్నులలో ఆనందాశ్రువులు పొంగి పొరలాయి.

ఇష్టమయిన పరంధాముని పాదపద్మాలను ధ్యానించడం వల్ల ప్రాప్తమైన భక్తియోగం కారణంగా ఆయన హృదయం పరమానందంతో నిండిపోయింది. ఆ ఆనందానుభవం అమృతసరోవరంలో స్నానం చేసినట్టుగా అనిపించింది. భరతునికి తాను చేస్తున్న పూజకూడా తనకు తెలియనంత తన్మయత్వం కలిగించింది. ఈ విధంగా భగవంతుని సేవావ్రతంలో మునిగిపోయిన భరతుడు జింక చర్మం ధరించాడు. మంత్రపూర్వకంగా మూడువేళలా స్నానం ఆచరించాడు. నిత్యమూ స్నానం చేయడం మూలాన తల వెండ్రుకలు తడిసి వంపులు తిరిగి జడలుగట్టి రాగిరంగుతో మెరవసాగాయి.

మార్తాండమండల మధ్యవర్తి అయిన పరమేశ్వరుణ్ణి హిరణ్మయ పురుషునిగా భావిస్తూ భరతుడు ఇలా ప్రస్తుతించాడు.

('ధ్యేయ స్సదా సవితృమండల మధ్యవర్తీ' ఇత్యాది సూర్యనారాయణ ధ్యాన శ్లోకంచేతను, “ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌” అనే గాయత్రి మంత్రంచేతను అర్చింపబడు దేవత సూర్యమండలస్థుడయిన శ్రీమన్నారాయణుడు.)

పరమేశ్వరా! జీవులకు కర్మఫలాలను ప్రసాదించేవాడవు. కేవలం సంకల్పమాత్రంతో ఈ లోకాలను సృష్టించావు. నీవే ఈ లోకాలలో అంతర్యామివై ఉన్నావు. ఆనందస్వరూపమైన బ్రహ్మాన్ని అందుకోవాలనే జీవులను నీయందలి యోగశక్తితో కాపాడుతున్నావు. సూర్యమండల మధ్యభాగంలో ప్రకాశిస్తూ సమస్త లోకాలలో నిండి ప్రకృతికి అందకుండా ప్రకాశిస్తున్నావు అంటూ ఆనందమయుడూ, దివ్యమంగళ స్వరూపుడూ అయిన భగవానుణ్ణి భరతుడు శరణు వేడాడు.

ఒకనాడు భరతుడు గండకీ నదిలో స్నానంచేసి మూడు ముహూర్తాలకాలం నీటిలో నిలబడి ప్రణవం జపిస్తున్నాడు. అపుడు నిండుచూలాలయిన లేడి ఒకటి నీరు తాగాలని ఒంటరిగా నదీ తీరానికి వచ్చింది. అది నీరు త్రాగుతుండగా ఆ నదీసమీపంలో ఒక సింహం దిక్కులు దద్దరిల్లేటట్లు భయంకరంగా గర్జించింది. పుట్టుకతోనే భయస్వభావం కలిగిన ఆ లేడి ఆ ధ్వనిని విని అదరిపడింది. ఆ హరిణాంగన తత్తరపాటుతో దప్పిక తీర్చుకోకుండానే ఆకాశంవైపు అమాంతం ఎగిరి ఆవలికి ఒక్కదూకు దూకింది. అలా అకస్మాత్తుగా కలిగిన భయంతో నదిని లంఘించడంలో దాని గర్భంలోని పిల్ల జారి నదీజలాలలో పడింది. ఆందోళనతో ఒక్కసారిగా దూకటంలో తల్లి జింక ఆ నదీతీరంలోని కొండ రాతిమీద పడి ప్రాణాలు విడిచింది. అపుడు ఆ నదీజలాలలో విలవిలలాడుతూ మునిగి తేలుతున్న లేడిపిల్లను చూచిన భరతుని హృదయం తల్లడిల్లింది. దయార్దచిత్తుడైన భరతుడు ఆ తల్లిలేని పిల్లను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. ఆ బాల కురంగాన్ని ఎంతో గారాబంతో సాకడం మొదలు పెట్టాడు. దానిని లాలించడం, పాలించడం ముద్దుగా పెంచి పెద్ద చేయడంలో ఆసక్తుడై క్రమంగా భరతుడు తన నిత్యకృత్యాలయిన అష్టాంగయోగాలనూ, భగవంతుని పూజాకైంకర్యాలను మరచిపోయాడు. క్రమక్రమంగా అతని నిత్య నైమిత్తిక క్రియాకలాపాలు ఒక్కొక్కటి మూలబడసాగాయి.

(యోగం యొక్క అష్టాంగాలు ; 1) యమం 2) నియమం 3) ఆసనం 4) ప్రాణాయామం 5)ప్రత్యాహారం 6) ధ్యానం 7) ధారణం 8) సమాధి.)

తాను తపస్సుకు దూరం కావడాన్ని అతడు గుర్తించడం లేదు. తన యోగానికి విఘ్నం వాటిల్లిందని అతడు గమనించ లేదు. రాత్రింబవళ్లు ఆ జింకపిల్లతో ఆడుతూ పాడుతూ దానిమీది గారాబంతో తన మనస్సులో ఇలా అనుకొన్నాడు.

పాపం ఈ జింకపిల్లకు తల్లి లేదు. ఆప్తులా అసలే లేరు. దిక్కెవ్వరూ లేని కారణంవల్ల ఈ జింకపిల్లను ఇక్కడికి తీసుకొని వచ్చాను. నేనంటే దీనికి ఎంతో ప్రేమ. నా దగ్దరే నన్నంటిపెట్టుకొని తిరుగుతోంది. అందుచేత నేను నాచేతనయినంత వరకూ ఈ తల్లిలేని పిల్లను తప్పక కాపాడుతాను.

నీవే దిక్కంటూ కాళ్లబడ్డ ఏ జంతువునయినా సరే కనికరంతో కన్నెత్తిచూచి కాపాడడంకంటె  మహాపుణ్యం మరేదీ లేదని సన్మునీంద్రులు చెప్పారు.

ఇలా భావించినవాడై భరతు డెంతో ఆసక్తితో ఆనందంతో లేడిపిల్లను సాకడం మొదలుపెట్టాడు. కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎక్కడికయినా వెళ్ళినప్పుడు, స్నానం చేసేటప్పుడు, సమిధలు ఏరి తెచ్చుకొనేటప్పుడు, దర్భలు, పూలు, పళ్ళు, ఆకులు కోసేటప్పుడు, దుంపలు త్రవ్వి తెచ్చుకొనేటప్పుడు, నీళ్లు తెచ్చుకొనేటప్పుడు, దేవతార్చన చేసేటప్పుడు చివరకు జపం చేసేటప్పుడు కూడా అతడు ఆ బాలహరిణాన్ని తనపక్కనే అట్టిపెట్టుకొనేవాడు. తోడేళ్లు, నక్కలు మొదలైన మృగాలు జింకపిల్లను ఏం చేస్తాయో అని దానివెనువెంట అడవులకు వెళ్ళేవాడు. రాను రాను ఆ జింకపై మమకారం ఎక్కువవుతుంటే దాన్ని భుజాలపైకి ఎక్కించుకొనేవాడు. గుండెలపై పడుకోబెట్టుకొని ఒడిలో చేర్చుకొని బుజ్జగించేవాడు. నిత్యనైమత్తిక కర్మలు ఆచరించేటప్పుడు కూడా అప్పు డప్పుడు లేచి జింకపిల్ల ఏమయిందో అని చూచేవాడు. ఆ జింకపిల్ల కనబడగానే మనసు కుదుటపరచుకొనేవాడు. ఒక్కొక్కప్పుడు ఆ లేడిపిల్లను దీవించేవాడు. నానాటికి ముద్దుమురిపాలతో పెంచుకుంటూ దానిమీద మోహం పెంచుకున్నాడు భరతుడు.

(చదివే వారికి ఈ వచనం భరతునిపట్ల జాలి కలిగిస్తుంది. జింకపట్ల పెంచుకున్న ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.)

ఆ బాలకురంగం చెంగుచెంగున పరుగులు తీస్తూ దుముకుతూ ఉన్నట్టుండి ఆ రాజరిషిని రాచుకొనేది. కొమ్ములతో గోకేది. దగ్గరికివస్తూ కాళ్ళు రాస్తూ గిట్టలతో గీకుతూ మారాం చేసేది. ఒక్కోసారి భరతుని తొడలపై హాయిగా పడుకొని అంతలో చెంగుమంటూ లేచి భుజాలమీదికి ఎక్కి ఆడుకొనేది.

పరీక్షిన్నరేంద్రా! ఆ జింకపిల్ల ఈ విధంగా తనపైబడి ఆటలాడుతున్నా రాజర్షి భరతుడు సంతోషించేవాడేగాని ఏమాత్రం ఆగ్రహించేవాడు కాడు. పైగా ఎంతో మురిసిపోయేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ లేడిపిల్ల ఆశ్రమం విడిచి ఎటో పారిపోయింది.

ఆ లేడిపిల్ల కనిపించకపోయేసరికి భరతునికి మనసు చెదిరిపోయింది. ధనం పోగొట్టుకొన్న వానిలాగ అతడు దిగులుపడ్డాడు. బెంగతో బాధతో మనస్సులో తహతహలాడుతూ మాటిమాటికీ ఆ జింకను తలచుకొంటూ ఇలా వాపోయాడు.

ఓ జింకపిల్లా! అడవిలోని క్రూరమృగాల బాధ నీకేమాత్రం లేకుండా నేను జాగ్రత్తపడ్డాను. అయినా నీవు నా కనులు గప్పి వెళ్ళిపోయావా అంటూ భరతుడు ఎంతగానో ఆరాటపడసాగాడు.

అయ్యో! తల్లి చచ్చిన ఆ జింకపిల్ల దురదృష్టవంతుడనయిన నా పాలబడింది. ఇప్పుడు తప్పించుకొనిపోయింది. ఇంక నేనేమి చేయాలి? అసలు ఆ జింకపిల్లను ఈ జన్మలో మళ్ళీ చూస్తానా? దాన్ని ఇదివరకులాగా గారాబంగా కాపాడుకోగలనా?

అయ్యో! ఈ అశ్రమంలో మొలచిన పచ్చిగడ్డి పరకలు తిని నవనవలాడుతూ అటునిటు తిరుగుతున్న నా లేడిపిల్లను ఏ సింహం తన పొట్టనబెట్టుకుందో కదా!

ఇలా అనుకొంటూ లేడిపిల్ల క్షేమంగా ఉండాలని భరతుడు మనసులో కోరుకొంటూ మళ్ళీ ఈ విధంగా తహతహలాడాడు. ఆ జింకపిల్ల ఎపుడు నా దగ్గరికి వచ్చి నన్ను సంతోషపెడుతుందో! నానావిధాలయిన తన నడకల హొయలుతో నన్నెపుడు మురిపిస్తుందో! నేను ధ్యానం చేసుకొనేటప్పుడు నన్ను కొమ్ములతో గోకేది కదా! మరల అలాంటి మనోవినోదాలు నే నెపుడు అనుభవిస్తానో! దేవపూజకని తెచ్చిన వస్తువులను త్రోక్కి వాసన చూసినపుడు నేను కోపంగా చూస్తే చప్పున చిన్నబిడ్డలాగ దూరంగా పోయి, ఆ తరువాత నేను పిలువగానే మెల్లగా వచ్చి నావెనుక నిలుచుండేది. ఇంత తెలివితేటలతో మసలుకొనే స్వభావం దానికెలా అబ్బిందో! ఈ భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో! ఇటువంటి జింకపిల్ల పాదస్పర్శవల్ల స్వర్గముక్తికాములైన మునుల యజ్ఞవాటిక కావటానికి యోగ్యత సంపాదించుకొంది.

ఇప్పుడా హరిణశాబకంకోసం నేనెక్కడని వెదకను? తల్లిని పోగొట్టుకుందనీ, ఆశ్రమంనుండి పారిపోయి వచ్చిందనీ, జాలిపడి సింహాల నోట్లో పడకుండా భగవంతుడయిన చంద్రుడు ఆ జింకపిల్లను ఎత్తుకొనిపోయి పెంచుకుంటున్నాడేమో?

పూర్వం నేను పుత్రవియోగ తాపాన్ని చంద్రకిరణాలతో శాంతింప జేసుకునేవాణ్ణి. తర్వాత ఆ జింకపిల్ల చంద్రకిరణాల కంటె చల్లనైన తన శరీరస్పర్శతో ఆ సంతాపాన్ని పోగొట్టింది అని హరిణశాబకాన్ని గురించి పరిపరి విధాలుగా భావించి పరితపిస్తున్న భరతుడు యోగభ్రష్టుడయ్యాడు. భగవంతుణ్ణి ఆరాధించడం మానుకున్నాడు. మృగజాతిలో పుట్టిన జింకపిల్లమీద మమకారం పెంచుకున్నాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి భరతుని కథ చెబుతూ మళ్ళీ ఇలా అన్నాడు.

ఓ రాజా! పూర్వం భరతుడు ముక్తి మార్గానికి ఆటంకమనే భావనతో ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మొదలైన సమస్తమూ వదలిపెట్టి తపస్వి అయ్యాడు. అయితే ఇంతలో ఒక జింకపిల్ల అతనికి తటస్థపడింది. దానిని లాలించి పాలించడం, బుజ్జగించడం, పెంచడంలో నిమగ్నమైనాడు. కోడెత్రాచు ఎలుక కన్నంలో ప్రవేశించినట్లు వారింపరాని తపోవిఘ్నం అతనిలో చోటు చేసుకుంది. బ్రష్టుణ్ణి చేసింది. ఎటువంటివారికయినా విధిని దాటడం ఏమాత్రం సాధ్యం కాదు. మహర్షులకయినా కర్మబంధాల నుండి తప్పుకోవడం శక్యం కాదు. అటువంటప్పుడు సామాన్యుల సంగతి చెప్పేదేముంది రాజా!

ఈ విధంగా భరతుడు బాధపడుతున్న సమయంలో ఆ జింకపిల్ల తిరిగి వచ్చింది. దానిని చూచి భరతుడెంతో సంబరపడ్దాడు. ఇలా కొంతకాలం గడచిపోయింది.

భరతునికి చివరిక్షణం రానేవచ్చింది. ఆ అంత్యకాలంలో కన్నకొడుకువైపు చూస్తున్నట్టు ఆ జింకవైపు ఆసక్తితో చూస్తూ మనసులో ఆ జింకనే భావించుకుంటూ భరతుడు ప్రాణాలు విడిచాడు. అట్టి స్మృతి కారణంచేత ఆతడు జింక కడుపున పుట్టి జింకయై ప్రకాశించాడు.

(గీతలో (8-6) మరణవేళా స్మృతిని గురించి 'యం యం వాపి స్మరన్‌ భావం త్యజంత్యన్తే కలేబరమ్‌, తం తమేవైతి కౌన్తేయ సదా తద్భావభావితః' అని చెప్పబడింది. దేహం త్యజించేవేళ మానవుడు ఏ భావాన్ని స్మరిస్తాడో అదే భావం అతడు నిశ్చయంగా పొందగలడు అని భావం. భగవదర్చన మరచినవాడు, హరిణపోతంపై మమకారం పెంచుకున్నవాడు, హరిణాన్ని చూస్తూ మరణించినవాడు హరిణ జన్మ ఎత్తడం సహజం. కాని, భగవదారాధన ఫలితముంది కనుక గత జన్మ విషయాలను మరచిపోలేదు. ఉద్దేశపూర్వకంగా భక్తిని నిర్లక్ష్యం చేసినందున భక్తుడు కొంతకాలం శిక్షకు గురికావలసివచ్చింది. 'మృతమను న మృతజన్మానుస్మృతి రితరవన్మృగ శరీరమవాప' అని మూలం. మరణ సమయంలో జింకనే స్మరిస్తూండడంవల్ల మరుజన్మలో జింకదేహాన్ని పొందాడని భావం.)

ఈ విధంగా భరతుడు లేడి కడుపున పుట్టినా, పూర్వజన్మంలో భగవంతుణ్ణి ఆరాధించిన పుణ్యపరిపాకంచేత తానెందుకు జింకగా పుట్టవలసి వచ్చిందో తెలుసుకొని బాధపడుతూ ఈ లాగున అనుకున్నాడు.

రాజులందరూ నన్ను తెగ పొగిడారు. నేను దేవేంద్రవైభవాలను తనివితీరా అనుభవించాను. నా కుమారులను రాజులుగా చేసి రాజ్యభారం వారికి అప్పగించి అడవికి వచ్చి తపస్వినైనాను. తాపసులందరూ నన్ను గొప్ప రాజర్షి అని గౌరవించారు. చివరకు ఒక జింకపిల్ల మీద మోహం పెంచుకుని నా గత వైభవమంతా పోగొట్టుకొని సాటియోగులలో ఎందుకూ కొరగాని వాడనయిపోయాను.

(ఇక్కడ భరతుని పశ్చాత్తాపం ప్రకటితం. పశ్చాత్తాపం సగం పాపహారకం. భక్తియోగసాధనలో ఏర్పడే మమకారవాంఛలను తొలగించుకోవడం అవసరమని బోధ. కనుకనే గీతలో 'దృఢవ్రతాః' అని 'సతతం కీర్తయన్తో మాం యతంతశ్చ దృఢవ్రతాః' అని చెప్పారు.

శ్రీమన్నారాయణుని గూర్చి వినడం, హరిని తలచుకోవడం, హరినామ సంకీర్తన చేయడం, హరిపూజ గావించడం, హరిభక్తులను అనుసరించడం మొదలయిన సత్కర్మలతో క్షణకాలం కూడా వ్యర్థం చేయని నాకు ఈ లేడిపిల్లవల్ల తపో విఘ్నం కలిగింది. మోక్షానికి దూరమయ్యానంటూ లోలోపల కుమిలిపోయాడు. ఆ తర్వాత తన జన్మకు కారణమయిన తల్లిజింకను వదలి కాలాంజనపర్వతాన్ని విడిచిపెట్టి దట్టమైన సాలవృక్షాలచే నిండిన సాలగ్రామ సమీపంలో ఉన్న పులస్త్యపులహాశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో శాంతస్వభావులైన మునీశ్వరులున్నారు. అది ఒక భగవత్‌ క్షేత్రం. అక్కడికి వచ్చి తనకు ప్రాప్తించిన హరిణదేహాన్ని వదలిపెట్టడానికి తగిన సమయంకోసం ఎదురుచూడ సాగాడు. ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండి ఎండిన ఆకులూ, గడ్డిపరకలూ, తీగదుబ్బలూ తింటూ తన జింకజన్మకు కారణమయిన ఆ నదీతీర్ధంలోనే బతుకు ముగించాలని కోరుతూ కాలం గడిపాడు. చివరకు ఆ పుణ్యనదిలో స్నానం చేస్తూనే తన హరిణశరీరం వదలిపెట్టాడు అని శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు చెప్పి ఆ తరువాతి వృత్తాంతం ఇలా వినిపించాడు.

మహారాజా! భరతుడు లేడి దేహాన్ని వదలిపెట్టి తరువాతి జన్మలో ఆంగిరసగోత్రుడైన ఒక బ్రాహ్మణునికి కుమారుడుగా పుట్టాడు. ఆ బ్రాహ్మణుడు పవిత్రుడు. సద్వంశసంభవుడు. శమదమాదిగుణసంపన్నుడు. తపోనిరతుడు. వేదాధ్యయనం చేసేవాడు. సుగుణ గరిష్ఠుడు. నీతికోవిదుడు. అటువంటి బ్రాహ్మణునికి భరతుడు పుత్రుడుగా జన్మించాడు. పుట్టింది మొదలు సంసారబంధాలకు దూరంగా ఉన్నాడు. కర్మబంధాలను తెంపివేసేవాడూ, సర్వేశ్వరుడూ, అచ్యుతుడూ, జననం లేనివాడూ అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ ఆయన కథలను ఆలకిస్తూ మళ్ళీ ఎటువంటి ఆటంకం రాకుండా ఆయనను సంస్తుతిస్తూ యశోభరితుడైన భరతుడు కాలం గడపసాగాడు.

(భరతుడు క్షత్రియకులంలో జన్మించాడు. అయితే ఆధ్యాత్మిక కర్మలను నిర్లక్ష్యం చేశాడు. అందువల్ల జింక జన్మ ఎత్తాడు. అయినా గత జన్మస్మృతి అతనిని రక్షించింది. 'శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే' (6.4.1) యోగభ్రష్ఠుడు పవిత్రులైన శ్రీమంతుల గృహంలో పుడతాడు అన్నట్లుగా ఉత్తమ బ్రాహ్మణ వంశంలో పుట్టాడు.)

ఆ బ్రాహ్మణునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు తొమ్మిదిమంది పుత్రులు. చిన్న భార్యకు ఒక కొమార్తె ఒక కుమారుడు. ఆ చిన్న భార్య కుమారుడే భరతుడు. పరమ భాగవతుడూ, రాజర్షి పుంగవుడూ అయిన భరతుడు తన హరిణ శరీరాన్ని పరిత్యజించి ఈ జన్మలో బ్రాహ్మణుని ఇంట జన్మించాడు. ఇతరులతోడి సాంగత్యం జన్మపరంపరలకు కారణమౌతుందని భయపడిన భరతునికి శ్రీహరి అనుగ్రహంవల్ల పూర్వజన్మ స్మృతి కలిగింది. అందువల్ల అతడు కర్మబంధవిముక్తికోసం ఉన్మత్తుడుగా, జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపిస్తూ జీవితం గడుపుతున్నాడు.

(భరతుడు జడుడుగా, అంధుడుగా, చెవిటివాడుగా లోకులకు కనిపించడానికి కారణం తన్ను దుష్టసాంగత్యం నుండి రక్షించుకోవడానికే. అభక్తుల దాడినుండి తన్ను తాను రక్షించుకోవడానికే.)

భరతుని తండ్రి తన చిన్న కుమారుణ్ణి ఎంతో గారాబంగా పెంచాడు. పుట్టు వెండ్రుకలు తీయించడం మొదలైన సంస్కారాలు చేయించాడు. కుమారునిమీద ఉన్న అనురాగాతిశయంతో నిత్యమూ శౌచ సదాచారములు నేర్పాడు. అవి ఏమాత్రం తనకు ఇష్టం లేకున్నా భరతుడు విధేయతతో వాటిని అవలంబించాడు.

బ్రాహ్మణ కుమారుడయిన భరతునికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కావడం వల్ల వాటిని పాటించడం తప్పనిసరి అయింది. తండ్రిదగ్గర ప్రణవం, వ్యాహృతులతో కూడిన గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. ప్రతి సంవత్సరం, తప్పకుండా చైత్ర, వైశాఖ, జ్యేష్ఠాషాఢ మాసాలలో ఇతరులతో కలిసి వేదాధ్యయనం చేశాడు. తండ్రి కుమారునకు శిష్టాచారం నేర్పాలనే లోకాచారం మేరకు తన కుమారుడైన భరతునికి అతని తండ్రి శౌచవిధి, ఆచమనవిధి, అధ్యయన విధి, వ్రతవిధి మొదలైన నియమాలను అగ్ని ఆరాధనం గురు శుశ్రూషవంటి సత్కార్యాలను నేర్పాడు. అయినా కుమారునికి వాటిపట్ల అభినివేశం లేకుండడం గుర్తించి తన ప్రయత్నం యావత్తూ వ్యర్థమయిందనీ, తన కోరిక నెరవేరలేదనీ నిరాశ పడాడు.

(ఈ జన్మలో భరతుడు కర్మకాండలకు అతీతుడు. ఇప్పుడతడు గుణాతీతస్థితిని కొరుకుంటున్నాడు.)

ఈ విధంగా తన తనయునికి సదాచారాలు నేర్పే ప్రయత్నంచేసి కొంతకాలం సంసారజీవితం సాగించి ఆంగిరస గోత్రజుడైన ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు.

తండ్రి చనిపోగానే తల్లి భర్తతో సహగమనం చేసింది. సవతితల్లి కొడుకులు అవినీతిపరులు. అందుచేత వారు భరతుని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు. వారు భరతుని శాస్త్రాదులుకూడా చదువనీయలేదు.

(ఇక్కడ మూడు అంశాలున్నాయి. మొదటిది 'సహగమనం' ఆనాటి ఆచారం. రెండవది తండ్రికి భరతుని గురించి తెలిసినంత సోదరులకు తెలియకపోవడం. మూడవది వారు అవినీతిపరులు కావడం.)

ఈ విధంగా తండ్రి మరణానంతరం సవతితల్లి కొడుకులు భరతుణ్ణి వేదవిద్యలు చదువనీయకుండా ఇంటిపనులు చేయుమని శాసించారు.

(తల్లి తండ్రి లేనివారి జీవితం ఎంత దుర్భరమో భరతుని కథలో ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది.)

అయినా భరతుడు వారు చెప్పిన పనులను ఏ మాత్రం కాదనకుండా పనులలో ఏమాత్రం ఏమరుపాటు లేకుండా చేస్తున్నాడు. అయితే ఆ పనులపట్ల అతనికి ఆసక్తి మాత్రం లేకపోయింది.

భరతుడు ఇంటి పనులన్నీ చెప్పినట్లు చేస్తున్నాడు. నీచస్వభావులూ, మూర్ఖులూ, పశుప్రాయులూ అయిన జనులు భరతుని చిత్తవృత్తిని తెలుసుకోలేక 'ఓరీ పిచ్చివాడా! మొద్దూ! చెవిటివాడా! అని గద్దించేవారు. ఈసడించుకొనేవారు. భరతుడు కూడా అందుకు తగినట్టు వారితో సంభాషించుతూ తలవంచుకొని వారి ఆజ్ఞమేరకు నడుచుకునేవాడు. వెట్టిచాకిరీ చేసేవాడు. కూలిపని చేసేవాడు. బిచ్చమెత్తేవాడు. ఇలాగా భరతుడు కాలం గడపసాగాడు.'

షడ్రసోపేతమైన అన్నం పెట్టినా, పాసిపోయిన కూడుపెట్టినా కాదనకుండా ఒకేవిధంగా స్వీకరించేవాడు. అదీ ఇదీ కావాలని రుచులకోసం అర్రులు సాచేవాడు కాడు.

భరతుడెప్పుడూ ఆత్మానుభూతి పొంది ఆనందంగా ఉండేవాడు. అతనికి సుఖదుఃఖాలు తెలియవు. దేహంపై ఏమాత్రం శ్రద్ధలేదు. చలి, వేడి, గాలి, వానలకు భయపడేవాడు కాదు. ఒంటిమీద బట్ట కప్పుకునేవాడు కాదు. ఆబోతులాగా బలిసిగట్టి పడిన దేహంతో వట్టి కటికనేలపై పడుకొనేవాడు. మట్టి గొట్టుకాన్న మాణిక్యంలాగా ప్రకాశింపని బ్రహ్మవర్చస్సుతో కనిపించేవాడు. ఒక్కొక్కసారి మాసిన బట్టలతో, మలినమైన యజ్ఞోపవీతంతో తిరిగేవాడు. ఒక్కొక్కసారి అతనినిచూచి అజ్ఞానులైనవారు వీడు జనానికి బ్రాహ్మణుడుగాని వట్టి పనికిమాలిన మొద్దని అనుకొనేవారు. ఏదయినా పనిచేసి భరతుడు ఇతరులనుండి ఆహారం స్వీకరించేవాడు. అంతేగాని, అయాచితంగా ఏదీ తీసుకునేవాడు కాడు.

ఇదంతా చూచి సవతితల్లి కొడుకులు కొంతకాలం అతనికి పొలం పనులు అప్పజెప్పారు. అయినా ఆ పనులేవీ అతనికి తెలియవు. మంచివా, చెడ్డవా, చిన్నవా, పెద్దవా అనే ఆలోచన లేకుండా చెప్పిన పనులు చేసేవాడు. అతని సోదరులు నూకలు, తవుడు, తెలికపిండి, ఊక, పొట్టు, మాడుచెక్కలు ఏవి పెట్టినా వద్దనకుండా తినేవాడు. వాటిని అమృతంలాగా భావిస్తూ ఆప్యాయంగా భక్షిస్తూ పొలానికి కాపలా కాస్తుండేవాడు.

(భరతుడు అమృతత్వానికి అర్హుడయ్యాడని చెప్పవచ్చు. “సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే”. సుఖదుఃఖాలలో నిర్వికారుడయినప్పుడు మనుజుడు అమృతత్వానికి అర్హుడవుతాడని గీత (2-15). మంచిచెడులు, సుఖదుఃఖములు విస్మరించుటయే అమృతత్వసిద్ధికి మార్గం!)

శ్లో॥ తుల్యనిందా స్తుతిర్మౌనీ సంతుష్టోయేన కేనచిత్‌ ।
అనికేతః స్థిరమతిః భక్తిమాన్‌ మే ప్రియోనరః ॥ - భగవద్గీత - భక్తియోగం

“ఎవరైనా తిట్టినా, పొగడినా దానిని సమానంగా భావించేవాడూ, మౌనంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవాడు, ఇల్లూవాకిలీ లేకుండా పరివ్రాజకుడుగా సంచరించేవాడు, స్థిరనివాసం లేకపోయినా బుద్ధి భగవద్భావనలో స్థిరీకరించినవాడూ, భక్తిపరుడూ అయిన మానవుడే నాకు ఇష్టమైనవాడు. జడభరతుడు అట్టివాడు.

వృషల రాజభృత్యులు కాళీబలికి భరతునిఁగొంపోవుట

Rushaba Teaches Ethics to His Sons - ఋషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట

ఋషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట

ఋషభుడు ఈ ప్రకారంగా కొంతకాలం రాజ్యపరిపాలనం సాగించాడు. అతడు ఇహలోక ఫలాన్ని ఏ మాత్రం అపేక్షించలేదు. సంసార వ్యామోహాన్ని వదలిపెట్టాడు. కొడుకులకు రాజ్యమంతా అప్పగించాడు. ఆ తరువాత మెల్లగా బ్రహ్మావర్త దేశానికి పయనించాడు. కొడుకులూ, మంత్రులూ ఆ ఋషభుని అనుసరించారు. అక్కడ బ్రహ్మావర్త దేశంలో మహాత్ములైన మునిజనుల సమక్షంలో కుమారులనందరినీ దగ్గరికి పిలిచాడు. మహాపుణ్యాత్ముడైన ఆ ఋషభదేవుడు సంతోషంతో ఇలా అన్నాడు.

(బ్రహ్మావర్తం అంటే ఢిల్లీకి వాయవ్యభాగంలో ఉండే దేశ విశేషం.)

బిడ్డలారా! ఈ గడ్డమీద పుట్టిన మనుష్యులు కామానికి లొంగిపోతే కుక్కలకు కూడా రాని కష్టాలు వారికి ఎదురవుతాయి. అందువల్ల కోరికలకు మీరు దూరంగా ఉండాలి.

(ఈ భాగం మానవాళికంతా సందేశం. మానవజన్మ వచ్చాక జీవుడు జంతువులకు భిన్నంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక జీవన పురోగతికై స్వచ్చందంగా దేహపరమయిన కష్టాలు స్వీకరించడమే మానవ జన్మకు అర్ధం. శునక సూకరాదులకు కూడా లభించే జీవనానికి మానవజీవితం ఉద్దేశింపబడలేదు.

అంతేకాదు, సహజ సంరక్షకుడయిన తండ్రి తమపై ఆధారపడిన వారికి బోధ కావించడం అవసరమని చెప్పక చెప్పడం.)

తపస్సువల్ల మానవులకు తరగని సుఖం కలుగుతుంది. అలాంటి తపస్సు అవలంబించితే బ్రహ్మానందం తప్పక సిద్ధిస్తుంది. వృద్దులనూ, దీనులనూ దయతో కాపాడండి. చెడుమార్గాలలో నడిచే కాముకుల తోడి కలయిక పూర్తిగా వదలిపెట్టండి. మీకు శుభం కలుగుతుంది.

ఆడువారంటే మోజుపడి కామవాంఛ తీర్చుకోవడమే ప్రధానమనుకొన్నవారికి సంసారం ప్రత్యక్షనరకమే అవుతుంది. పెద్దల సహవాసం మోక్షానికి దారి తీస్తుంది. పెద్దలయిన మహాత్ములు ఎవరని అంటారా? వినండి. వీడు విరోధి, వీడు స్నేహితుడు అనే భేదభావం లేకుండా సమదృష్టి కలవారూ, శాంతస్వభావులూ, ఏ మాత్రం కోపం లేనివారూ, సమస్త జీవులపట్ల పరమ కారుణ్య స్వభావం కలవారూ, కపటం లేనివారూ, మహాత్ములని పిలువబడతారు. అలాంటి మహానుభావులకు నాయందే పరిపూర్ణ భక్తి ఉంటుంది. అందువల్ల వారు విషయలంపటులయిన దుర్మార్గులపట్ల ప్రీతి గలిగి ఉండరు. తమ ఇల్లన్నా దేహమన్నాా మిత్రులన్నా, భార్యాపుత్రులన్నా వారికి వ్యామోహం ఏ మాత్రం ఉండదు.

ఇంద్రియసుఖాలకు లోనయినవాడు పనికిరాని పాడుపనులు చేస్తుంటాడు. చెడ్డపనులు చేసేవాడు పాపం కొనితెచ్చుకొంటాడు. దుఃఖ కారణమయిన దేహాన్ని మోస్తుంటాడు. అందువల్ల మీరు పాపాలకు మూలమయిన కోరికలను కోరకండి. యథార్థ జ్ఞానం ప్రాప్తించనంతవరకూ మీకు ఆత్మతత్త్వం బోధపడదు. ఆ తత్త్వం తెలియని కారణం వల్ల దేహికి దుఃఖం మిక్కుటమవుతుంది. లింగదేహ మెంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు కర్మవశమై ఉంటుంది. జ్ఞానం లభించదు. అవిద్య వదలదు. శరీరం కర్మమూలం. అందుచేత కర్మలు చేయడం తగదు. వాసుదేవుడినైన నామీద ఆసక్తి కుదరనంతవరకూ మిమ్మల్ని దేహధర్మాలు బాధిస్తాయి. ఎంత చదువుకున్నవాడయినా, దేహేంద్రియ సుఖములందు ఆసక్తుడై సంభోగసుఖప్రధానమయిన గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. ఆ ఆశ్రమంలో ఆత్మస్మృతి కోల్పోవడం తథ్యం. అటువంటివాడు మూఢుడై సంసారక్లేశాలకు లోనౌతాడు.

సంసారికి ఇల్లన్నా పొలాలన్నాా కొడుకులన్నా ఆప్తులన్నాా ధనమన్నా నేను, నాది అనే వ్యామోహం పెరుగుతుంది. స్త్రీపురుషుల కలయికవల్ల సంతానం కలుగుతుంది. ఆ సంతానంకోసం ఇల్లు కట్టడమో, పొలాలు కొనడమో, ధనం సంపాదించడమో జరుగుతుంది. వాటివల్ల మోహం పెంచుకోవడంతో వానికి మోక్షమార్గం దూరమవుతుంది. సంసారంలో మునిగి ఉన్నవారికి ఎపుడయితే మోక్షాసక్తి కలుగుతుందో అపుడే అతడు సంసారాన్ని వదలిపెడతాడు.

పరమేశ్వరుడనైన నా మీద భక్తి కలిగి ఉండడం, కోరికలు లేకపోవడం, సుఖ దుఃఖాలలో సహనం, సమస్త జీవుల కష్టాలపట్ల సానుభూతి కలిగి ఉండడం, భగవద్విషయమైన జ్ఞానమునందు ఆసక్తి తపస్సు, నా కథలనూ, లీలలనూ ఆలకించడం, నన్నే దైవంగా భావించడం, నా గుణాలను కీర్తించడం, ఎవరితోనూ విరోధభావం లేకుండడం, సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండడం, శాంతంతో జీవించడం, నా గేహం, నా దేహం అనే బుద్దిని వదలి పెట్టడం, అధ్యాత్మయోగం అవలంబించడం, ఏకాంత భక్తిభావం, ఇంద్రియాలను జయించడం, కర్తవ్య పరాయణత్వం, సత్కార్యములందు శ్రద్ధ, బ్రహ్మచర్యం, జాగరూకత, వాక్కులను సంయమనంతో వాడడం, అన్నిటిలో నన్నే చూడడం - జ్డానం విజ్ఞాన విజృంబితమయిన యోగం, గుండెదిటవు, సాత్విక ప్రవృత్తి మున్నగు విధానాలతో లింగదేహాన్ని జయించి మానవుడు శాశ్వత సుఖం సంపాదించాలి.

(ఈ వచనంలో భక్తిమార్గం, మోక్షమార్గం విశదం చేయబడ్డాయి.

లింగదేహము= సూక్ష్మశరీరము= అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, అయిదు ప్రాణములు, బుద్ధి, మనస్సు అను ఈ పదిహేడు కలిసి లింగదేహమనబడుతుంది.)

అజ్ఞానంనుండి పుట్టిన హృదయబంధనమనే తీగెను యోగం అనే చురకత్తితో ధైర్యంగా తెంపివేయాలి.

(కర్మలను త్రెంపడమంటే పనులు ఎగగొట్టడం కాదు. ఆలుబీడ్డలను బంధుమిత్రాదులను వదలడం కాదు. వారితో తమకుగల వ్యామోహ బంధాలను త్రెంపడమే. కర్తవ్యాలు మిగలకుండా ఆచరించడమే.)

అటువంటి యోగం అనుష్ఠించే వ్యక్తి గురువయితే శిష్యులనూ, తండ్రి అయితే బిడ్డలనూ, రాజయితే ప్రజలనూ తాను నేర్చిన యోగమార్గంలో పెట్టవలెనే గాని కర్మఫలాలపై ఆసక్తులను చేయకూడదు.

ప్రజలందరు ఏదో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తూంటారు. మూర్ఖులయి ఎల్లప్పుడూ మనసులో ఐహిక ఫలాలు కోరుతుంటారు. అల్పసౌఖ్యంకోసం ఒకరిపై మరొకరు వైరం పెంచుకొంటారు. అంతులేని దుఃఖంలో మునిగిపోతారు. అందుచేత గురువయినవాడు తానే ముందు నడిచి మాయామోహాలకు లోబడి మూర్ఖులయిన జీవులపట్ల సానుభూతి చూపాలి. కళ్లున్నవాడు గ్రుడ్డివారికి దారి చూపిన విధంగా అజ్ఞానులకు బోధించి సహాయపడాలి. సాటిలేనిదీ, దివ్యమయినదీ అయిన మోక్షానికి మార్గం చూపాలి.

అంతేగాదు. తండ్రిగానీ, తల్లిగానీ, గురువుగానీ, బంధువుగానీ చివరకు భర్త అయినా సరే అక్షయమైన మోక్షమార్గం చూపలేకపోతే వారెవరూ హితులుకారు.

నా శరీరంఎలా ఏర్పడిందో మీరేమాత్రం ఊహించలేరు. నా మనస్సు సత్త్వగుణంతో కూడింది. ధర్మంతో కూడింది. పాపరహితమైంది. అందు వల్లనే ఆర్యులు నన్ను 'ఋషభు'డన్నారు. శుద్ధసాత్వికమయిన నా శరీరం నుండి పుట్టిన వారే మీరందరూ. కుమారులారా! తోడ బుట్టినవాడూ, మీ అందరికీ పెద్దవాడూ, మహాత్ముడూ అయిన భరతుణ్ణి నాలాగే భావించి సద్బుద్ధితో సేవించండి. అదే మీరు నాకు చేసే శుశ్రూష కూడా. ప్రజలను పాలించడమే మీకు ధర్మం. అని ఋషభదేవుడు మరల ఇలా అన్నాడు.

సమస్త జీవరాసులలో వృక్షాలు శ్రేష్ఠమైనవి. చెట్లకంటె సర్పాలు శ్రేష్ఠమైనవి. పాములకంటె మేధావులు ఉత్తములు, బుద్ధిమంతులకంటె భూపతులు గొప్పవారు. రాజుల కంటె సిద్ధులు, కిన్నరులు, గంధర్వులు శ్రేష్ఠులు. వారి కంటె దేవతలు గొప్పవారు. వారిని మించి ఇంద్రాది దిక్పాలకులు, వీరికంటె దక్షుడు మొదలయిన ప్రజాపతులు ఉత్తములు. ప్రజాపతులకంటె రుద్రుడు; రుద్రుని కంటె బ్రహ్మ బ్రహ్మకంటె విష్ణువు అధికులు. విష్ణుడు బ్రాహ్మణులను ఆదరిస్తాడు. అందుచేత మానవులకు బ్రాహ్మణుడే దైవం.

ఈ చరాచరప్రపంచంలో నాకు తెలిసినంతవరకు బ్రాహ్మణులకు సాటి అయిన దైవంలేదు. విధి విహితంగా అగ్నులలో వేల్చే హవిస్సుకంటె బ్రాహ్మణులు భోజనం చేస్తూండేటప్పుడు నాకు ఎక్కువ సంతోషం కలుగుతుంది.

నా దేహం పరబ్రహ్మ స్వరూపం, వేదమయం, దీనికి ఆదిలేదు. ఆలాంటి వేదరూపమైన నా దేహన్ని బ్రాహ్మణోత్తములు ధరిస్తారు. సత్వగుణం కలవాడు, జితేంద్రియుడూ, దయాళువూ, సత్యసంధుడూ, తపస్వీ, సహనశీలీ అయిన బ్రాహ్మణుడే మంచి గురువు. అందుచేత నేను పరమభక్తులూ, మహానుభావులూ అయిన బ్రాహ్మణుల దేహంతో కనిపిస్తుంటాను. పైన చెప్పిన గుణాలు కలిగిన బ్రాహ్మణులను నా రూపంగా భావించుకుని పూజచేయడం నన్ను పూజించడమే అవుతుంది అని మళ్ళీ ఇలా అన్నాడు.

ఈ రహస్యం తెలుసుకొని బ్రహ్మవేత్తలయిన విప్రులను పూజించే మానవుడు మాయాతీతుడవుతాడు. భూలోకంలో మోక్షానికి మార్గం గుర్తిస్తాడు.

సదాచార సంపన్నులయిన కుమారులకు, లోకానికి వెల్లడించు నిమిత్తం అవసరమైన ఆచారాలను ఋషభదేవుడు ఉపదేశించాడు. మహానుభావుడూ, లోకబాంధవుడూ అయిన భగవంతుడు ఋషభుని రూపంలో కర్మసన్యాసం కావించి శాంతస్వభావులైన మునులకున్నూ, భక్తి జ్డాన వైరాగ్యాదులతో కూడిన పరమహంస ధర్మాలను ఉపదేశించాలని ఎంచాడు. ఆయన తన నూరుమంది కొడుకులలో పెద్దవాడు, పరమభాగవతుడైన భరతునికి పట్టంగట్టి రాజ్యభారం అప్పగించాడు. అనంతరం శరీర మాత్రసహాయుడై, దిగంబరుడై, చింపిరిజుట్టుతో, పిచ్చివానిలాగా ప్రవర్తిస్తూ అగ్నుల్ని తనలో ఆరోపించుకొని కొంతకాలంగడిపాడు. తర్వాత బ్రహ్మావర్తదేశాన్ని వదలిపెట్టి వెళ్ళిపోయాడు. జడునిలాగా, చెవిటివానిలాగా, మూగవానిలాగా, పిశాచం ఆవహించినవాడుగా, పిచ్చివాని విధంగా అవధూత వేషం ధరించాడు. ఎవరయినా పలకరించినా బదులు చెప్పకుండా మౌనవ్రతం చేపట్టాడు.

నగరాలు, గ్రామాలు, పల్లెలు, తోటలు, శిబిరాలు, బిడారులు, గొల్లపల్లెలు, గొడ్లపాకలు, కొండలు, తపోవనాలు, ఋష్యాశ్రమాలు దాటిపోసాగాడు. అక్కడక్కడ కొందరు వెంటపడేవారు. దుండగులు కొడుతున్నా తిడుతున్నా, రాళ్ళువిసురుతున్నా దుమ్ముచల్లుతున్నా తనపై మూత్రవిసర్జనం చేసినా, ఉమ్మివేసినా, కుళ్ళినవస్తువులు పైకి విసరివేసినా, బూతుకూతలు కూస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా జోరీగలను లెక్కపెట్టక, అడవి యేనుగులాగా ముందుకు నడచి పోతున్నాడు. ఏ మాత్రం దేహాభిమానం లేకుండా, నిశ్చలమైన చిత్తంతో ఏకాకిగా సంచరిస్తున్నాడు.

అతని చేతులు, కాళ్ళు, ఉరోభాగం చాలా సుకుమారంగా ఉన్నాయి. భుజాలు, కంఠసీమ, ముఖంమొదలయిన అవయవాలు విశాలంగా తీర్చినట్లున్నాయి. అతని రూపం సహజ సుందరంగా ఉంది. పద్మం వంటి ముఖంలో స్వతస్సిద్ధమైన చిరునవ్వులు చిందుతున్నాయి. కొంగ్రొత్త తామర రేకులలాగ చల్లని కనుపాపలు కనిపిస్తున్నాయి. విప్పారిన కళ్ళల్లో ఎర్రదనం ప్రకాశిస్తున్నది. చెక్కిళ్ళుగాని, చెవులుగాని, మెడభాగంగాని ముకుపుటాలుగాని ఏ మాత్రం లోపం లేకుండా దిద్ది తీర్చినట్లున్నాయి. అతని పెదవుల లోపలి చిరునవ్వు ఇతరులను భ్రమింపజేసేవిధంగా ఉంది. అటువంటి ఆతని దివ్యమంగళ విగ్రహం ముద్దుగుమ్మలను మోహంలో ముంచెత్తుతున్నది.

(అవధూత= అ అంటే అక్షరస్వరూపం తెలిసి, వ= సర్వజీవుల్లోనూ శ్రేష్ఠుడై, ధూ= సర్వబంధాలను త్రోసివేసి, త= నేనే పరమాత్మనను అనుభూతి పొంది ఆనందస్వరూపుడై ఉండేవాడు.

ధూళి కొట్టుకొని ఋషభుని జుట్టు ధూసరవర్ణం ధరించింది. వెండ్రుకలు జడలుకట్టి గోరోచన వర్ణంతో మెరిసిపోతున్నాయి. అటువంటి వేషంతో అతడు ఎవరూ తనను గుర్తుపట్టకుండా తిరుగుతున్నాడు.

(ప్రాపంచిక అనుబంధం పోగొట్టుకోనివాడు, ఆ అనుబంధాన్ని ఆనందంగా భావించేవాడు అందరూ తన్ను గుర్తుపట్టాలని కోరుకొంటాడు. కాని, ఈ అనుబంధాన్ని తెంచుకొన్నవాడు కోరడు. పైగా తన్ను గుర్తు పట్టకూడదని భావిస్తాడు.)

ఆ ఋషభుడు పిశాచం పట్టిన వానిలాగా, మురికిపట్టిన అవయవాలతో అవధూత వేషంతో సంచరించ సాగాడు.

తన అవధూత వేషం, తన యోగవిధానం ప్రజలకు వింతగా ఉంటుందని ఋషభుడు గ్రహించి ఒకేచోట కొండచిలువలాగా నేలపై పడివుండి లభించినవాటినే ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు.

(తన ప్రవర్తన లోకవిరుద్ధమని ఋషభుడు తెలుసుకొన్నాడు. నగరం వదిలాడు. అడవుల్లో తిరిగాడు. జనసంచార స్థలాలు వర్జించాడు. చివరకు నిలబడి సంచరిస్తే ఎవరి దృష్టికైనా బాధగాని, వింతగాని కలుగుతుందేమోనని నేలపై పడుకొని కొండచిలువలాగా ఉండసాగాడు.)

ఈ విధంగా ఆయన జుగుప్స కలిగించే తీరున నేలమీద పరుండి ఉండేవాడు. అన్నం తింటూ, నీరు తాగుతూ, మలమూత్రాదులలో పొరలుతుండేవాడు. అతని మలసుగంధంతో కూడిన వాయువు పది దిక్కులలోనూ పది ఆమడల దూరం పరిమళిస్తుండగా; భగవదంశ సంభూతుడైన ఋషభుడు ఎద్దువలె, జింకవలె, కాకివలె ప్రవర్తిస్తూ మహానందం పొందేవాడు. సర్వాంతర్యామి అయిన వాసుదేవుణ్ణి తనలో ప్రత్యక్షంగా దర్శించుకొంటూ యోగసిద్ధుడైనాడు. అపుడు ఆకాశగమనం, మనోవేగం, పరకాయ ప్రవేశం, అంతర్ధనం, దూరదర్శనం, దూరశ్రవణం మొదలయిన సిద్ధులు తమంత తాము ఋషభుణ్ణి ఆశ్రయించాయి. అయినా ఆ ఋషభుడు ఆ సిద్దులను స్వీకరించలేదు అని శుకయోగి ఋషభుని వృత్తాంతం చెప్పగా పరీక్షిత్తు తన సందేహం ఇలా వెలిపుచ్చాడు.

మునివరేణ్యా! యోగాభ్యాసంవల్ల జ్ఞానం కలుగుతుంది. కర్మలు నశిస్తాయి. అలాంటి మహనీయులకు మహాసిద్దులు ప్రాప్తిస్తాయి. అయినా తమంత తాము వచ్చిన ఐశ్వర్యాలను ఋషభుడెందుకు స్వీకరించలేదు స్వామీ!

అని పరీక్షిన్మహారాజు అడుగగా ఆ శుకమహర్షి ఇలా చెప్పాడు. "ఓ రాజా! నీవన్నది నిజమే. అడవిలోని మృగాలు వేటగానికి పట్టువడుతాయి. అయినా ఏదోవిధంగా వాణ్ణి వంచించి తప్పించుకొని బయటపడతాయి. అలాగే ఇంద్రియాలను లొంగదీసుకున్నా మనస్సు మరల ఏదోవిధంగా విజృంభించి కోరికలకు అవకాశమిస్తుంది.

మహీనాథ! మనసు చాల చిత్రమయింది. చాలకాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునయినా అది హరిస్తుంది. అందుచేత పెద్దలు మనసును నమ్మరు. విటులను ఆకర్షించే జారిణిలాగా మనసు నిలకడ కోల్పోయి కామక్రోధాదులను ఆహ్వానిస్తుంది.

నరేంద్రా! కామక్రోధాది అరిషడ్వర్గాలకూ, కర్మబంధాలకూ మనస్సే మూలకారణం. అందుచేత ఆర్యులు మనస్సును సుతరామూ విశ్వసింపరు.

ఓ రాజా! మనసు గతి తెలిసినవాడు కావడంవల్ల తమంత తాము వచ్చినను యోగసాధనచే లభించిన సిద్ధులను ఋషభుడు చేపట్టలేదు. కనీసం వాటివంక చూడనయినా చూడలేదు. లోకంలో శుభం కోరేవారి అభివందనాలను ఆ మహాత్ముడు అందుకున్నాడు. వేషంలోగాని, మాటల్లోగాని ఋషభుడని గుర్తు పట్టడానికి వీలు లేనట్టుగా భగవత్స్వరూపంతో ఋషభుడు వెలిగిపోతున్నాడు. పరమయోగాన్ని ధ్యానించేవారికందరికీ దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని ఋషభుడు సూచిస్తున్నాడు. మహాయోగులలో శ్రేష్ఠుడయినవాడు, మహాత్ములలో అగ్రేసరుడు, సాటిలేని దివ్యతేజస్సులో ప్రకాశించేవాడు, దేవతలకు గురువయినవాడు, పరమపురుషుడయిన ఋషభుడు శరీరం విడవడానికి నిశ్చయించాడు.

భగవంతుని అవతారమైన ఋషభుడు మనసులో దేహాభిమానాన్ని వదలుకొన్నాడు. కుమ్మరివాడు సారెను వేగంగా త్రిప్పి విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ చక్రం కొంతసేపు తిరుగుతున్నట్లే, పూర్వ సంస్కార విశేషంవల్ల ఆయన దేహ సంచలనం పూర్తిగా ఆగిపోదు. ఋషభుడు లింగదేహాన్ని వదలిపెట్టినా యోగమాయావాసనల కారణంగా లౌకికంగా దేహధారిగా చరించాడు. అతడు కొంకణం, వంకం, పటం, కుటకం అనే పేర్లతో పిలువబడే దక్షిణ కర్ణాటక దేశాలవైపు కదిలాడు. కుటక పర్వత సమీపంలోని ఉపవనం చేరుకున్నాడు. అక్కడ శిలాఖండాలను నోటిలో పెట్టుకొని పిచ్చివానిలాగా జుట్టు విరియబోసుకొని దిగంబరుడై సంచరించాడు. అపుడు వీచిన సుడిగాలి విసురుకి దుమ్ము రేగింది. దుమ్ముతోకూడిన గాలికి అడవిలో నిప్పంటుకుంది. ఆ నిప్పు కార్చిచ్చులాగా అడవినంతా అలముకొనింది. ఆ కార్చిచ్చుమంటలలో ఋషభుడు కాలిపోయాడు. ఋషభుని చేతలను ఆ ప్రాంతంవారు చెప్పుకోగా అర్హతుడు అను పేరుగల ఆ రాష్ట్రాధికారి ఆలకించాడు. అతడు స్వధర్మం వదలిపెట్టి స్వదేశస్థులతో ఆ ఆచారానికి ఆమోదం తెలిపాడు. అధర్మ బహుళమయిన కలియుగంలో భవిష్యత్తుకు లోబడిపోయి తన రాష్ట్రంలోని మానవులను అయోగ్యమయిన వేద బాహ్యమతంపట్ల మొగ్గేటట్లు చేశాడు.

కలియుగంలో అధములైన మానవులు దేవమాయవల్ల మోహితులవుతారు. శాస్త్రాలలో ప్రవచనం చేయబడ్డ శౌచాలనూ, ఆచారాలనూ వదలిపెడతారు. తమకు ఇష్టం వచ్చినట్లు దేవతలను పరిహసిస్తారు. స్నానం చేయరు. ఆచమనం అసలు లేదు. శుచిత్వం సున్న. జుట్టు గొరిగించుకొంటారు. అపవిత్ర వ్రతాలను పాటిస్తారు. అధరాలు పెచ్చు పెరిగిన కలియుగంలో బుద్ధి చెడిపోగా వేదాలనూ, బ్రాహ్మణులనూ, యజ్ఞపురుషులనూ నోటికి వచ్చినట్టు అనరాని మాటలంటారు. తమ తమ అభిప్రాయాలకు తామే తెగ మురిసిపోతారు. వేదవిరుద్ధంగా ప్రవర్తిస్తారు. గుడ్డిగా వ్యాపించే దురాచారాలపట్ల నమ్మకం పెంచుకుంటారు. చివరకు అంధతమసంలో పతనమవుతారు.

రజోగుణంతో నిండిన పురుషులకు మోక్షమార్గం ఉపదేశించడం కోసమే ఋషభుని అవతారం. ఏడు సముద్రాలతో కూడిన ఈ ద్వీపాలలోని జనులు దివ్యమైన ఎవని అవతార లీలలను కీర్తిస్తారో, ఎవడు ఎంతో కీర్తి గడించిన ప్రియవ్రతుని వంశంలో జన్మించాడో, ఎవడు లోకాలకు ఆది అయిన పురాణ పురుషుడో అలాంటి ఋషభదేవుడు భూలోకంలో అవతరించి కర్మసంబంధంలేని మోక్షధర్మాన్ని ప్రబోధించాడు. యోగమాయవల్ల తనకు తామై లభించిన సిద్ధులన్నిటినీ గడ్డిపరకలనువలె తిరస్కరించాడు. అలాంటి మహావ్యక్తికి సిద్ధులకోసం ప్రయత్నించే యోగీశ్వరులు ఏ విధంగా సాటి అవుతారు?

అన్ని వేదాలకూ, అన్ని లోకాలకూ, సమస్త దేవతలకూ, బ్రాహ్మణులకూ, గోవులకూ పరమ గురువయినవాడు, భగవంతుడయినవాడు ఋషభుడు. ఆయన చరిత్రం వింటే దుశ్చరిత్రుల దురితం తొలగిపోతుంది. శుభాలు చేకూరుతాయి. ఎవరయితే ఋషభుని చరిత్రం మిక్కిలి శ్రద్ధతో వింటారో, ఎవరు ఇతరులకు వినిపిస్తారో వారికి సుదృఢమైన హరిభక్తి లభిస్తుంది. అటువంటి హరిభక్తిపట్ల తత్పరత కలిగిన పెద్దలైన భాగవతులు హరికృపవల్ల ధర్మ, అర్ధ, కామ, మోక్షాలనే పురుషార్థాలను సాధించుకొంటారు. నానావిధ పాపకారణమయిన సంసారతాపాన్ని పోగొట్టుకుంటారు. హరిభక్తి యోగమనే అమృతస్నానం చేసి పవిత్రులవుతారు. పరమపురుషార్ధమైన మోక్షాన్ని సిద్ధింపచేసుకొంటారు. ఈ విధంగా సప్త ద్వీపాలలోని జనులు నేడు కూడా ఋషభుని మహిమను పొగడుతుంటారు.

(ఈ వచనంలో ప్రధానంగా నాల్గు అంశాలున్నాయి. మొదటిది దేహత్యాగ విధానం. రెండవది 'కలియుగవర్తన' కథనం. మూడవది కర్మ సంబంధం లేని మోక్షధర్మోపాయం. నాల్గవది భాగవత మార్గం.

పరీక్షిన్మహారాజా! యాదవులకున్నూ, మీకున్నూ(పాండవులకు) కులగురువయిన శ్రీకృష్ణుడు ఆ చోట ఈచోట అనక అన్నిచోట్లా ఉన్నాడు. కొలిచేవారికి అతడు కొంగుబంగారమై తప్పక మోక్షం ప్రసాదిస్తాడు. నీవేమాత్రం దిగులుపడవద్దు.

ఋషభదేవుడు నిత్యానుభూతమైన స్వస్వరూప లాభంవల్ల తృష్ణను నివారింపజేశాడు. యోగమాయవల్ల లభించిన మహాసిద్దులచేత ఆయన బుద్ధి ఆకర్షింపబడలేదు. ఆ మహానుభావుడు లోకులందరినీ కనికరించి అభయమిచ్చాడు. నిత్యమయినదీ, దివ్యమయినదీ, ఆనందప్రదమైనదీ, సేవింపదగినదీ, సాటిలేనిది అయిన వైకుంఠలోకాన్ని అందింపగల మోక్షమార్గాన్ని అందరికీ ఉపదేశించాడు. ఆ తరువాత దేహం వదలి జనులంతా ఆశ్చర్య చకితులయ్యేటట్లు విష్ణుమూర్తితో తాదాత్మ్యం పొందాడు. ఋషభుడు సామాన్యుడు కాడు. ఆయన సాక్షాత్తు విష్ణువు.

భరతోపాఖ్యానము

Tuesday, March 3, 2026

Rushabhavatara is the Incarnation of Lord Maha Vishnu - భగవంతుండగు నారాయణుండు ఋషభావతార మెత్తుట

భగవంతుండగు నారాయణుండు ఋషభావతార మెత్తుట

నరవరేణ్యుడైన నాభి సంతానార్థం భార్యాసమేతంగా, శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడయిన వాసుదేవుని పూజించాడు.

నాభి ప్రవర్గ్యమనే ధర్మక్రతువును శ్రద్ధతో పరిశుద్ధమయిన ద్రవ్యాలతో ఉచిత ప్రదేశంలో దేశకాలానుగుణంగా, విధివిహితంగా, మంత్రవేత్తలయిన ఋత్విక్కులలో భూరిదక్షిణలతో ఆరంభించాడు. సాధారణంగా ఎవరికీ ప్రత్యక్షంకాని భక్తవత్సలుడయిన పుండరీకాక్షుడు పరమాత్ముడు ప్రకాశవంతమయిన అవయవ సౌష్టవంతో నాభీ హృదయంలో తాను సదా నెలకొని ఉన్నప్పటికినీ ప్రత్యక్షరూపంతో కనులకు పండువుగా మనసుకు నిండుగా తన స్వరూపాన్ని అతనికి చూపాలనుకొన్నాడు.

ప్రకాశించే చతుర్భుజాలతో, పట్టుపీతాంబరాలతో, రమణీయమైన శ్రీవత్సం, కౌస్తుభమణి, శ్రీదేవి విరాజిల్లే వక్షః స్థలంతో, శంఖం, చక్రం, గద, పద్మం, ఖడ్గం మొదలయిన దివ్యాయుధాలతో, సాటిలేని నవరత్నాల కాంతులు వెదజల్లే బంగారు కిరీటంతో మకరకుండలాలూ, మొలనూలూ, మణులు చెక్కిన స్వర్ణహారాలూ, బాహుపురులూ, కాలి అందెలు ప్రకాశింపగా లక్ష్మీరమణుడు ఆ దంపతుల ముందు ప్రత్యక్షమైనాడు.

ఈ విధంగా ప్రత్యక్షమయిన భగవంతుణ్ణి ఋత్విక్కులు మున్నగువారు చూచారు. పెన్నిధిని దర్శించిన పేదవారివలె సంతోషంతో వారందరూ తలలు వంచి ఈ విధంగా స్తోత్రాలు చేశారు.

స్వామీ! నీవు పరిపూర్ణుడవు. అయినా మమ్మల్ని మరచిపోకుండా మా పూజలను స్వీకరిస్తున్నావు. పెద్దలు మాకు చెప్పినట్లు నీ చరణారవిందాలను సేవిస్తాము.

మహాత్మా! మేము నీ మహిమలు తెలిసి సంస్తుతి చేయడం లేదు. పెద్దలు మాకు ఏ విధంగా ఉపదేశించారో ఆ విధంగా ప్రస్తుతి చేస్తున్నాము.

సంసారంలో మునిగి తేలేవారికి నీవు పట్టువడవు. నీవు ఈశ్వరుడవు. ప్రకృతికన్నా, జీవునికన్నా భిన్నమైనవాడవు. పరమపురుషుడవు. అయితే మేము పంచభూతాల సృష్టికి లోనయిన నామరూపాలు ధరించిన వాళ్లం. అటువంటి మాకు నీ తత్త్వాన్ని నిరూపించడం సాధ్యం కాదు. సకల జీవరాసుల పాపసమూహాలను తొలగించడం నీ స్వభావం. అటువంటి నీ ఉత్తమ గుణాలలో ఏదో ఒక అంశమేగాని సమస్త గుణాలను నిరూపించడం ఎవరికీ ఏ మాత్రం శక్యంకాదు. నీ భక్తులు భక్తితో డగ్గుత్తికతో సంస్తుతిస్తూ, నీకర్పించే నిర్మలజలం, చిగురుటాకులు, తులసీదళాలు గరికపోచలు మొదలైన వాటితో నీవు సంతృప్తి పడతావు. అంతేకాని, నానావిధ ద్రవ్యాలు సంతరించుకొని మహావైభవంతో చేసే అశ్వమేధాది యాగాలు కూడా నీకు సంతృప్తి కలిగించవు. స్వాభావికంగానే నీవు సర్వకాలాలలోనూ సాక్షాత్కరిస్తావు. నీవు సర్వాతిశాయివి. సమస్త పురుషార్థాలు నీవే. పరమానంద స్వరూపుడవైన నీకు యజ్ఞయాగాదులవల్ల తృప్తి లేకున్నామా కోరికలను తీర్చుకోవడంకోసం మేము యజ్ఞాలు చేస్తున్నాము.

దయానిధీ! మేము మూర్ఖులం. మాకేది మంచిదో ఏది కాదో మాకే తెలియదు. అయినా ఎంతో దయతో మమ్మల్ని కాపాడి ఇహపరాలకు తగిన సకల సుఖాలను నీవు మాకు ప్రసాదిస్తున్నావు.

ఇపుడు మేము నీకు సంతుష్టి కలిగేటట్లు ఇష్టమైన పూజలు చేయకపోయినా మామీద కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి ప్రసన్నుడవైనావు.

నీలమేఘంలాంటి శరీరచ్చాయ కలవాడా! కోరిన కోరికలు అనుగ్రహించేవాడా! నీవే మాకు వరమివ్వడంకోసం మాముందు సాక్షాత్మరించావు. నిన్ను సందర్శించడానికి గానీ, మరి సంస్తుతించడానికి గానీ మాకు సాధ్యమవుతుందా!

మునులు కోరికలు లేనివారు. సునిశ్చితమైన జ్ఞానం కలవారు. దోషరహితులు. భగవంతుని ప్రతిరూపాలు. ఆత్మారాములు. అలాంటి మునులకు స్తోత్రార్హుడ వయినప్పటికి నీవు అందరిపట్ల అనుగ్రహం చూపుతున్నావు. కాలు జారినప్పుడూ, క్రిందపడ్డప్పుడూ, తుమ్మినప్పుడూ, ఆవులించినప్పుడూ, ముసలితనంతో పీడింపబడుతున్నప్పుడూ, చావుకు చేరువ అయినప్పుడూ, మామీద మాకే అధికారం తప్పినప్పుడూ మా పాపాలను పోగొట్టే నీ దివ్యనామాలు మా నోటివెంట వెడలునట్లు అనుగ్రహించు.

ఈ రాజర్షి అయిన నాఖి నీతో సమానమైన సంతానం కావాలని నిన్ను పూజించాడు. కోరిన కోరికలనూ, స్వర్గాన్నీ మోక్షాన్నీ సైతం ఇవ్వగల నిన్ను ఇలా అడగడం ధనంకోసం ధనవంతుని దగ్గరికివెళ్లి ఊక అడిగినట్టుంది. మోక్షప్రదాతవయిన నిన్ను సంతానంకోసం ప్రార్థిస్తున్నాడు. నీ మాయ దాటరానిది. అలాంటి మాయలకు లోబడి ఇంద్రియ కాంక్షలకు లోనుకాని వాడెవడు? ప్రతి పనిని ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళం మేము. గర్వాంధులము అయినా నిన్ను ఆహ్వానించిన మా అపరాధాన్ని మన్నించు. మమ్ము అనుగ్రహించు అని నమస్కరించారు. అపుడు సర్వేశ్వరుడు జంబూద్వీపంలోని ఒక వర్షానికి అధిపతి అయిన నాఖి, ఋత్విక్కులతో కలిసి చేసిన వందనాలు అందుకొంటూ దయతో ఇలా అన్నాడు.

మునులారా! నన్ను వేదమంత్రాలతో ప్రస్తుతి చేశారు. సకల శుభలక్షణాలు కలిగి నాకు సాటి రాదగిన కొడుకును ప్రసాదించవలసిందిగా ఎంతో కుతూహలంతో మీరు నన్ను కోరారు.

(భగవంతుడు వేదగోచరుడు అందువల్ల వేదవాక్కులతో ప్రస్తుతి చేయడం సమంజసమే.)

స్వర్గాదిలోకాలలో నాకు సాటిరాదగ్గ కుమారుడు ఎక్కడా కనిపించడు. నాకు సాటి నేనే. ఈ విషయం మీరు తెలుసుకొనండి.

అంతేగాక, బ్రాహ్మణులు నాకు ముఖంలాంటివారు. బ్రాహ్మణవాక్యం దాటడానికి వీలుకానిది. నాతో సమానుడైన కుమారుణ్ణి మీరు కోరారు. అందుచేత, నాభి రాజేంద్రుని పత్ని అయిన మేరుదేవికి నేనే కొడుకునై పుడతాను అని రాజదంపతులు చూస్తుండగా అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత దిగంబరులూ, తాపసులూ, జ్ఞానులూ, ఊర్థ్వరేతస్కులూ అయిన నైష్ఠికులకు యోగధర్మాలు బోధించడం కోసం నాభిమీది దయతో నారాయణుడు మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు.

('బ్రాహ్మణోస్య ముఖ మాసీత్‌' అని పురుషసూక్తం. అందువల్ల 'నా ముఖంబగుటం జేసి' అని చెప్పబడింది.)

సమస్త శుభలక్షణాలు కలవాడూ, శమదమాది గుణసంపన్నుడూ, మేరుధీరుడైన శ్రీహరి సమస్త జనులూ సంతోషించేటట్లు మేరుదేవికి కుమారుడుగా అవతరించాడు.

(సమస్త శుభలక్షణాలు అన్నప్పుడు సాముద్రిక లక్షణాలు, భగవల్లక్షణాలు అన్నీ చేరుతాయి. చక్కని శరీరం, శౌర్యం, బలం, సౌందర్యం, నామం, యశస్సు, ప్రభావం, ఉత్సాహం, అలాగే సర్వసమత్వం, పరమశాంతత్వం, భౌతిక భోగసుఖాలపట్ల వైరాగ్యంలాంటివి కూడా శుభలక్షణాలు. అలాగే పాదాదులందు ధ్వజ, వజ్ర, పద్మచిహ్నాలు.)

బలిష్టమైనవాడని, పరాక్రమవంతుడని, ధైర్యశౌర్యాలు కలవాడనే లక్షణాలనుబట్టి నరనాథుడయిన నాభి తన కుమారునికి 'ఋషభుడు' అని పేరు పెట్టాడు.

(సర్వశ్రేష్ఠుడు, మహాపురుషుడు అనడాన్ని ఋషభ అనే శబ్దం సూచిస్తుంది.)

బ్రాహ్మణులు, మంత్రులు, రాజపరివారం, హితులు, ప్రజలు, చుట్టాలు అనురాగాతిశయంతో ఋషభుని రాజుగానే భావించారు.

ఇంద్రుడు ఋషభుని మహిమలు విన్నాడు. అతడు అసూయాపరుడు కనుక సహించలేకపోయాడు. ఋషభుని రాజ్యంలో వర్షాభావ పరిస్థితి కల్పించాడు.

ఋషభుని మహిమలు విని ఇంద్రుడు లోలోపల కుమిలిపోయాడు. అందుచేత, ఋషభుడు పరిపాలించే రాజ్యంలో వానచినుకు పడకుండా చేయగా ఇంద్రుని దౌష్ట్యాన్ని ఋషభుడు గుర్తించాడు. తన యోగమాయాబలంతో నానాటికి సర్వసమృద్ధిగా వర్షం కురిపించాడు.

(ఇంద్రుడు వర్షాధిదేవత. త్రిలోకాధిపతి. తనకు సాటిగా మరొకరు వృద్ధి పొందడాన్ని సహించలేనివాడు. అందువల్ల ఋషభుని సాధింప తలపెట్టాడు. 'యజ్ఞాత్‌ భవతి పర్జన్యః' - యజ్ఞం చేయడంవల్ల వర్షాలు కురుస్తాయి అని భావం. మూలంలో 'భగవాన్‌ ఋషభదేవః యోగేశ్వరః' అని చెప్పబడ్డాడు. ఇందువల్ల ఆధ్యాత్మికశక్తి కలవాడని భావం.)

దేవేంద్రుని దుర్బుద్ధికి ఋషభుడు నవ్వుకొని, అజనాభమనే పేరుతో వ్యవహరింపబడే తన భూమండలాన్ని సుభిక్షం చేశాడు. తాను కోరినట్టు కొడుకు పుట్టడం, పెరగడం చూచి నాభి చాల సంబరపడ్డాడు. పుండరీకాక్షుని మాయ కారణంగానూ, భూలోకధర్మాల కనుగుణంగానూ నాభీ తన ప్రియనందనుణ్ణి నాయనా! నా తండ్రీ! అంటూ ముద్దాడాడు. ప్రజల అభిమానం చూరగొన్న వాడున్నూ అన్నివర్గాల వారికి ఆమోదయోగ్యుడూ అయిన తన కుమారుడు రాజ్యపాలనకు తగినవాడని భావించి పట్టం కట్టాడు. బ్రాహ్మణులకూ, మంత్రి వర్గానికీ అతణ్జి అప్పగించాడు. ఆ తరువాత భార్య మేరుదేవితోకూడ నరనారాయణులకు నిలయమైన బదరికాశ్రమం చేరుకొన్నాడు. అక్కడ నారాయణ స్వరూపుడూ, పురుషోత్తముడూ అయిన వాసుదేవుని తదేకధ్యానంతో ఆరాధించాడు. చివరకు సతీసమేతుడైన నాభి శ్రీహరితో తాదాత్మ్యం పొందాడు.

ఏ మహారాజు యజన సమయంలో బ్రాహ్మణోత్తములైన ఋత్విక్కులు విష్ణుమూర్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకొన్నారో, ఏ రాజు భార్య గర్భంలో ప్రవేశించి ఈశ్వరుడు తనంత తాను కొడుకుగా పుట్టాడో, అలాంటి మహారాజుకు సాటిరాగల రాజు లెవరూ భూమండలంలో లేరు.

ఆ తరువాత కథ విను.

రాజైన ఋషభుడు తన రాజ్యాన్ని కర్మాచరణకు తగిన భూమిగా భావించాడు. జనుల కందరికీ ప్రియమయ్యేటట్లు కర్మతంత్రం తెలియజేయాలనుకొన్నాడు. అందుచేత, కర్మలు ఆచరించడానికి తానే స్వయంగా గురువులవద్ద వేదాలు చదివాడు. వారి ఆజ్ఞ శిరసావహించి శతమన్యుడు ఇచ్చిన జయంతిని వివాహం చేసుకున్నాడు. ఆ జయంతివల్ల భరతుడు మొదలయిన నూర్గురు కొడుకులను కన్నాడు. పట్టణాలతో, ఆశ్రమాలతో, కొండలతో, చెట్లు చేమలతో నిండిన భూమండలం ఆ భరతుని పేరు మీదుగా భరతవర్షమనే ప్రశస్తి గడించింది.

(ఋషభుడు భగవంతుడే. సర్వజ్ఞుడు. గురువువల్ల నేర్వవలసినది ఏదీ లేకపోయినప్పటికినీ గురువునుండి ఏ విధంగా విద్యార్జన చేయాలో జనసామాన్యానికి బోధించే నిమిత్తం తానే గురువు దగ్గరికి వెళ్ళాడు. అలాగే, ఆదర్శవంతుడయిన గృహస్టుడయ్యాడు. ఋషభుని కుమారుడైన భరతుని వల్లనే ఈ దేశానికి భారతదేశమనే పేరు ఏర్పడింది.)

భారతవర్షమనే పేరుతో ప్రసిద్ధి పొందిన భూమండలంలోని ఆయా భాగాలకు భరతుడు తన తొంబది తొమ్మిదిమంది సోదరులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతువు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిదిమందిని ప్రధానులుగా నియమించాడు. వారి కప్పగించిన భూభాగాలు వారి వారి పేర్లతో ప్రసిద్ది పొందాయి. కవి, హరి, అంతరిక్ష ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రమీఢ, చమన, కరభాజనులనే తొమ్మండుగురు భాగవత ధర్మాన్ని ప్రకాశింపజేశారు. దేవుని మహిమల్ని వ్యాప్తిచేసే వారి చరిత్రలు నీకు తర్వాత చెబుతాను. తక్కిన ఎనభైయొక్క మంది కుమారులు తమ తండ్రి అయిన ఋషభుని మాట జవదాటనివారు. వారందరు మహావినయ సంపన్నులు. వేదధర్మాలు అనుష్ఠించేవారు. యాగాలన్నాా ధర్మాలన్నా శ్రద్ధగలవారు. అందుచేత వారు బ్రాహ్మణోత్తములుగా పేరెన్నికగన్నారు.

ఋషభుడు సాంసారిక బంధాలలో చిక్కుకోలేదు. స్వతంత్రుడయి మెలిగాడు. తాను ఆనందానుభూతి కలిగిన ఈశ్వరుడయినా సామాన్యునిలా ప్రవర్తించాడు. ఆయాకాలాలలో చేయవలసిన ధర్మాలను ఆచరించేవాడు. ధర్మప్రవర్తకులపట్ల సమబుద్ధి కలిగి ఉండేవాడు. శాంతస్వభావంతో జీవులపట్ల కరుణ కలిగి మైత్రీభావంతో ఉండేవాడు. ధర్మం, అర్ధం, కీర్తి, సంతతి, ఆనందం, అమృతత్వం చక్కగా సాగడంకోసం గృహస్థాశ్రమం పాటించవలసిందిగా ప్రజలను అనుశాసించేవాడు. ఈ విధంగా ఋషభుడు నీతిమార్గం తప్పకుండా ప్రజాపాలనం చేశాడు. వేదాలలోని ధర్మరహస్యాలు తనకు అవగతమయినా బ్రాహ్మణులు బోధించినట్లు ఋత్విక్కులు ఉపదేశించినట్లు వస్తుసంభారాలతో, దేశకాలానుగుణంగా శ్రద్ధాపూర్వకంగా, తన వయస్సుకు తగినట్టు ఒక్కొక్క యాగాన్ని నూరు పర్యాయాలు యథావిధిగాజేసి సుఖజీవనం సాగించాడు.

(ప్రజానందామృతావరోధంబుచేన్‌- ఇచ్చటి ప్రజానంద పదమునకు ప్రజార్థోభోగః; అమృతం అను పదమునకు మోక్షః అనియు, అవరోధము అనగా సంగ్రహము అని శ్రీధరీయమునందు వివరింపబడినది.)

రాజా! ఆ ఋషభ దేవుని రాజ్యంలో పారలౌకిక ఫలమే తప్ప ఇహలోకఫలం కోరేవాడు ఒక్కడూ కనబడడు. అతడు సూర్యుని తేజస్సు వంటి తేజస్సు కలవాడు. అతని మహిమలను ఏమని వర్ణించేది?


ఋషభుండు పుత్రులకు నీతి యుపదేశించుట

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...