Friday, April 3, 2026

Gopikas complained to Yashoda about Krishna's mischievous acts - గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

ఓ యశోదమ్మా! మా ఇళ్ళలోని బాలింతలు తమ బిడ్డలకు పాలు లేవు కాబట్టి కృష్ణునితో దూడలను ఆవుల వద్దకు వదిలిపెట్టొద్దు అని గోల పెట్టినా వినకుండా పకవకా నవ్వి వాళ్ళను పరిహసిస్తూ, ఆవులవద్దకు దూడలను వదిలిపెట్టాడమ్మా!

తల్లీ! యశోదా! ఈ నీ కొడుకు మేము మా ఇండ్లలోని, కుండలలో చక్కగా మరగపెట్టి ఉంచిన పాలను తనతో ఉండే గోపబాలురందరకూ తాగడానికి పోసి, పోయగా మిగిలిన పాలనైనా ఉంచాడా అంటే అలా కాకుండా ఆ కుండలను పగలగొట్టి పోయాడమ్మా!; ఇలా చేస్తే అతణ్ణి దండిస్తావో! లేదో!

యశోదమ్మా! మీ చిన్ని కృష్ణుడు మా ఇండ్లలోకి పాలకోసం వచ్చి, తృప్తితీర పాలు తాగడానికి పాలు కనబడకుంటే కోపంతో మా పసిపాపలను ఏడ్చేటట్లు కొట్టుకుంటూ వచ్చేశాడమ్మా!

నిన్నగాక మొన్న పుట్టాడో లేదో అపుడే దొంగతనాలు మొదలు పెట్టాడు. అవికూడ మామూలు దొంగతనాలుగా ఉన్నాయా? మా యింట్లో జొరబడి ఉట్టి అందకపోతే రోళ్ళు, పీటలు ఒకదానిమీద ఒకటి ఎక్కించి అందుకోవాలని ప్రయత్నించాడు. చేయి పెట్టడానికి వాడికి సాధ్యం కాలేదు. క్రిందనుంచే కుండకు పెద్ద చిల్లిపెట్టి, మీగడపాలు దోసిళ్ళతో పట్టి తాగాడు. ఇంత సన్ననికడుపు గలదానవు. అంతపెద్ద పొట్టగల బిడ్డను ఎలా కన్నావమ్మా?

ఓ యశోదా! నీ కొడుకు ఆడుకోడానికి వెళ్ళి, ఇదిగో ఈ యింటివారి పెరుగంతా తాగి, చివరగా కొంచెం పెరుగును (పడుకునివున్న) ఆ యింటికోడలిమూతికి రాసిపోయాడు. అత్త కోడలిమూతిని చూచి, కోడలే పెరుగు తాగినదొంగ అంటూ ఆమెను కొట్టసాగింది.

నందుని ఇల్లాలైన ఓ యశోదా! నీ కొడుకు అదిగో వారింట్లో కుండల్లో నిండుగా ఉండే నేతిని తాగి, ఆ ఖాళీ నేతి కుండల్ని ఇదిగో వీరింట్లో ఉంచగా, వారే నేతిని దొంగిలించారని వీరికీ వారికీ పెద్ద తగాదా అయిందమ్మా!

ఓ యశోదమ్మా! మా ఇంటిగోడలపై మేము చిత్రించుకున్న దేవతల బొమ్మలు చూచి, వీళ్ళు దేవతలా? నా కన్నా వేరే దేవుడున్నాడా? అంటూ నవ్వుతూ, వేలుపుల చిత్రాలున్న మా గోడలపై ఎంగిలి ఉమ్మేశాడమ్మా!

చంద్రముఖీ! యశోదా! నీ కొడుకు మా యింట్లోకి వచ్చి వెన్న తింటూ వుంటే చూచి మా(కోడలుపిల్ల) చిన్నది ఇతడు పారిపోకుండా అడ్డంగా నిల్చుని, వాడిచేయిపట్టుకొని వెనక్కులాగగా, ఆ చిన్నదాని స్తనం పట్టుకొని గోటితో గీరాడమ్మా! ఇవి చిన్న పిల్లవాడు చేసే పనులా?

అమ్మా! నీ బిడ్డడు ఒకరింటిముందు తిరుగాడుతుంటే చూచి, ఆ ఇంటి యిల్లాలు పిలిచి బాబూ! నీ పేరేమిటి? అని అడిగింది. వెంటనే నీ కొడుకు ఎర్రనైన ఆమెపెదవిని కొరికి కాటు చేసి, వేగంగా పారిపోయాడు. ఇది చిన్న పిల్లవాడు చేసే పనంటావా? నీ బిడ్డడు చిన్నవాడంటావా? చెప్పవమ్మా.

ఓ యశోదా! నీ కొడుకు తనచేతిలో వున్న బంతి ఎగిరి మా ఇంట్లో పడిందంటూ మా ఇంట్లోకి వచ్చాడు. మా పెరట్లో స్నానం చేస్తున్న మా ఆడుబిడ్డ పక్కన పెట్టిన వస్త్రాన్ని పట్టుకొనిపోయాడు. ఇలాంటి పనులు ఏమైనా బాగున్నాయా?

ఓ యశోదా! ఈ చిన్నిబిడ్డడు ఇదిగో ఈ స్త్రీని చూచి - నిన్ను దొంగిలించి బాగా తీసుకొని పారిపోతాను నాతో వస్తావా? అని అడిగాడట. ఎక్కడైనా ఇటువంటి వింత ఉందా?

ఓ యశోదమ్మా! ఈ వింత విను. ఓ ఇల్లాలు తనకు పిల్లలు లేరని బాధపడుతూవుంటే నీ కొడుకు ఆమెతో తనను మగనిగా చేసుకొంటే పిల్లలు పుడతారంటూ ఆమె మీద పడ్డాడు. ఇటువంటివి నీ కొడుకు కృష్ణునివంటి పసిపిల్లవాడు చేసే పనులా? చూడు.

ఓ హరిణాక్షీ! యశోదా! నీ కొడుకుతో ఓ యువతి “నేను బహిష్ఠను నన్ను తాకకూడదు - దూరంగా పో బాబూ" అంటే ఆమె సిగ్గుతో చితికిపోయేలా, నీవు బహిష్ఠు అయిన చోటేది? అంటూ కొంటెగా తల ఊపాడు. ఇదేమైనా న్యాయంగా ఉందా తల్లీ?

(భగవంతుని విషయంలో స్పృశ్య, అస్పృశ్యతలకు తావులేదు. అతనికీ అన్నీ పవిత్రమైనవే!)

పూర్ణబింబంవంటి ముఖంగల ఓ యశోదా! నీ కొడుకు ఒక ఇల్లాలి వడిలో పడడానికి రాగా, ఆమె "నేను గర్భవతిని. దూరంగా పో బాబూ" అంది. అప్పుడు నీ బిడ్డడు గర్భం రావడానికి కారణం ఏమిటో చెప్పమన్నాడు. ఏ ఇల్లాలైనా చెప్పగలదా! తల్లీ?

యశోదమ్మా! మా భర్తలు కొంచెం దూరంగా వెళ్ళడం చూచి, నీ కొడుకు మాతో రహస్యంగా మాట్లాడేలా పిలిచి మా పొందును కోరాడు. ఏ లోకంలోనైనా పూర్వం ఇట్టి బిడ్డడున్నట్లు తెలిసిందా?

ఓ యశోదమ్మా! కృష్ణునితో ఆడుతూ పాడుతూ, మన కృష్ణుడే కదా అని నమ్మకంతో నా బిడ్డ నిద్రపోతే అతడి జుట్టును దూడతోకతో ముడివేసి, వీథులలో దూడను తోలాడమ్మా! నా బిడ్డది ఎంత బాధ! మా రేపల్లెకు రాజైన నందుని కుమారుడైనంత మాత్రాన ఇలాంటి చేష్టలు తగునా?

తీగెవలె చక్కనిశరీరంతో ఒప్పే ఓ యశోదా! నీ కొడుకు నా కొడుక్కు పొట్టనిండిపోగా పైకి వచ్చేటంతగా బానెడు వెన్నముద్దలు పట్టించాడు. నా బిడ్డకు ఊపిరాడడం లేదు. ఏమైనా జరిగితే దానికి నీవే బాధ్యత వహించాలిసుమా!

యశోదా! ఒక స్త్రీ నిద్రపోతూవుంటే ఆమె వస్త్రాన్ని విప్పి, ఒక పెద్ద తేలుతో కరిపించాడు. ఆమె బాధతో వివస్త్రగా పరిగెడుతూవుంటే, నీ కొడుకు పక పక నవ్వాడు. ఇదేమైనా బాగుందా? (బాగులేదు)

గుణవతిగా పేరు గాంచిన ఓ యశోదా! నా కొడుకూ, కోడలూ ఇంట్లో ఏకాంతంగా సుఖిస్తూవుంటే నీ కొడుకు వారిద్దరి మధ్యలో ఒక పామును తెచ్చి పడవేశాడు. దాంతో భయపడి వారిద్దరూ ఒంటిమీద బట్టలు లేవనే సంగతి కూడా మరచి పరిగెడుతూ ఉంటే - నీ బిడ్డడు నవ్వుతూ కేకలు వేశాడు. ఇదేమైనా మంచిపనా తల్లీ?

ఓ యశోదా! ఒక గోపకాంత కుండలో పెరుగు చిలికి, ముందుకు వంగి వెన్న తీస్తూవుంటే, పక్కన పొంచి ఉన్న నీ కొడుకు ఆమె వెనుక చేరి శృంగారపరమైన మగవారు చేసే చేష్టలు చేయసాగాడు. ఇట్టి నీ కొడుకును చక్కదిద్దుకోవడం నీకు ఉచితం గదా!

ఓ యశోదమ్మా! మా వాడలో వున్న గోపకాంతల మందరం కూడుకొని, నీ బిడ్డ వస్తాడేమో నని పాలు, పెరుగు అంతటినీ మా ఇండ్లలోపల పెట్టి, ఆ గదులకు తాళాలు వేసి, వాటిపైన గుర్తులు పెట్టి, తాను వచ్చే దారివైపే చూస్తూ ఉన్నాం. ఎలా వచ్చాడో తెలియదుగాని, మేము వేసిన తాళాలు, ముద్రలు వేసినవి వేసినట్లే వున్నాయి. కానీ నీ బిడ్డడు ఒక ఇంటిలో ఆడుతూ, మరో ఇంటిలో పాడుతూ, ఇంకోచోట నవ్వుతూ, మరోచోట తిడుతూ, ఇంకోచోట వెక్కిరిస్తూ, ఇంకో ఇంటిలో జంతువుల్లా, పక్షుల్లా ధ్వనులు చేస్తూ, ఇలా చేసి చేసి ఎలా వెళ్ళిపోతాడో తెలియదు, కనబడడు. తీరా మేము లోపలికి వెళ్ళిచూస్తే మా ఇండ్లలో పాలు, పెరుగులేని ఖాళీ కుండలే ఉంటాయి.

ఓ చంద్ర బింబంవంటి మోముతో ఒప్పే యశోదా! నీ వంటి రాచకాంతలకు మిక్కిలి సంపదవుంటే, మంచి మంచి పదార్థాలను తినవచ్చు, ఖరీదైన వస్త్రాలను కట్టుకోవచ్చు. కానీ పరిహాసంగా ఎక్కడైనా తమ బిడ్డలను పేదవారిఇండ్లపై పడి, బాధించండని విడిచిపెడతారా!

ఓ యశోదతల్లీ! నీ బిడ్డడు మా ఇండ్లలో పాలు పెరుగు ఉండనివ్వడం లేదు. మా అన్నలయొక్క గోవులమీద సాక్షిగా ఒట్టుపెట్టి చెపుతున్నామమ్మా! మేము వేరే ఎక్కడికైనా పోతాము.

ఈ విధంగా చిన్ని కృష్ణుని కొంటె చేష్టలన్నింటినీ రకరకాలుగా వివరిస్తున్నారు - గోపకాంతలు. అవన్నీ తమపై చూపే మహాప్రసాదాలని తెలుసుకోలేక నిందాపూర్వకంగా చెపుతున్నవారితో యశోద ఇలా అనింది.

ఓ గోపకాంతలారా! నా ఈ చిన్ని కృష్ణుడు నా ఒళ్లో ఉండి పాలుతాగడం మాని ఎక్కడికీ వెళ్ళడంలేదు. అసలు మా ఇల్లు తప్ప - ఇరుగు పొరుగు ఇండ్లకు దారే తెలియదు - వాడికి. అంతేకాదు, ఇప్పటికీ ఇంకా కండ్లు పూర్తిగా విప్పని ఇంత చిన్నబాలుణ్ణి పట్టుకుని వీనిపై నిందలు మోపడం మీకు తగునా? (తగదని భావం.)

ముల్లోకాలలో అందమైన గోపవనితలారా!, చక్కనిగుణములుగల ఆడువారిలో శ్రేష్ఠలారా! ఈ నా చిన్ని కృష్ణుడు తనంతట తానేదో కూర్చుని ఆడుకుంటాడే తప్ప - ఇతర విషయాలేమీ తెలియనివాడమ్మా! మావాడని కాదుకానీ, ఇతడెంతో మంచి బాలుడమ్మా! ఎందుకు అనవసరంగా ఈ నా బిడ్డడిపై నిందలు మోపుతూ రచ్చ చేస్తారు? ఇది మానండమ్మా!

తన చిన్నికృష్ణునిపై నిందలువేస్తూ వచ్చిన ఆ గోపకాంతలకు యశోద నచ్చచెప్పి, వాళ్లను సమాధానపరచి పంపివేసింది. కానీ కొడుకుమీదమాత్రం కోపించలేకపోయింది. ఈ విధంగా

మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Sri Krishna and Balarama’s childhood Plays Discription - శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

బలరాముడు, శ్రీకృష్ణుడు బాల్య క్రీడలతో అందరినీ ఆనందపరుస్తున్నారు. పిల్లలు వచ్చీ రాని అడుగులు వేసుకుంటూ మోకాళ్లపై వచ్చి పడిపోతూ, మళ్లీ లేస్తూ అటూ ఇటూ తిరగడం, తల్లులపైటలు లాగిపట్టుకుని ఉయ్యాలలూగడం, ఆవుదూడలతోకలు పట్టుకొని అవి ముందుకు పరుగిడడంతో తోకలు వదలలేక వాటితోపాటు వీళ్లూ పరుగెత్తడం, అలా పరుగెత్తి బురదలో పడడం, తల్లులు ఎత్తుకొని చనుబాలిస్తున్నప్పుడు రెండుచేతులతో పాలిండ్లను తడుముతూ, మూతితో పొడుస్తూ, పాలు ఎక్కువగా చేపడంతో గుక్క గుక్కకూ తాగడం, వచ్చీ రాని ముద్దు మాటలాడుతూ చేతులను, పాదాలను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకోవడం - ఇవన్నీ అంతటా చిన్న పిల్లలు చేసే చేష్టలే. బలరామకృష్ణులు కూడా అలాగే బాల్యచేష్టలుచేస్తూ చూసేవారికి ఆనందం కలిగిస్తున్నారు.

ఇలా వ్రేపల్లెలో బలరామశ్రీకృష్ణులు బాల్యచేష్టలు చేస్తూవుంటే పై లోకంలో వున్న రంభ ఊర్వశి మొదలగు అప్సరసలు ఆ బాలురచేష్టలకు ముచ్చటపడి వారూ తమకిష్టమైన నృత్యం చేయడం ప్రారంభించారు. ఇక శత్రువులు అప్పటికే పూతనాది రాక్షససంహారం చేసిన బాలునిగా శ్రీకృష్ణుణ్ణి గురించి వినడంవల్ల భయంతో తడబడ్డారు. మహర్షులు దుష్టశిక్షణం, శిష్టరక్షణం జరిగే సమయం ప్రారంభమయిందన్న సంతోషంతో వాళ్లలో వాళ్లు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు.

చిన్నపిల్లలు బోర్లాపడుకొని తలలు పైకి నిలుపుతారు. అలా రామకృష్ణులు తలలు పైకెత్తి ఆదే సమయంలో ఆదిశేషుడు మొదలైన సర్పరాజులు పడగలెత్తినట్లు ఉన్నారు. ఏనుగులకు ఒంటిపై మట్టి జల్లుకోవడం సరదా. దానిని 'వప్రకీడ' అంటారు. అలాగే ఈ బాలురు శరీరానికి బురద అంటించుకోగా ఒళ్ళంతా మట్టి జల్లుకున్న పిల్లఏనుగుల్లా కనబడుతున్నారు. ఉత్సాహంతో ముందుకు ఉరుకుతూఉంటే సింహంపిల్లలు దూకుతున్న శోభను వహిస్తున్నారు. రోజు రోజుకూ ముఖకాంతులు పెరుగుతూవుంటే ఉదయిస్తున్న బాలసూర్యచంద్రులవలె ప్రకాశిస్తున్నారు. తల్లుల చనుబాలు తాగుతూ జోగుతూవుంటే ఎంతో సాధనచేసి మోక్షానందమనే అమృతం గ్రోలి పరవశిస్తున్న యోగీశ్వరులవలె ముచ్చట గొలుపుతున్నారు. ఇలా చూచే జనులందరికీ ఒక్కొక్కసమయంలో వారిచేష్టలనుబట్టి ఆయా రూపాలుగా రామకృష్ణులు కనబడుతూ చూపరులకు ఆనందం కలిగిస్తున్నారు.

తనవైపు చూడనివారిని ఎప్పుడూ తాను చూడకుండా, తనచూపులతో ముల్లోకాలనూ తిరిగేటట్లు చూచే ఆ బాలకృష్ణుడు తనను చూస్తున్నవారిని క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. (ఇక్కడి నుండి కేవలం బాలకృష్ణుని రూపాన్ని చేష్టలను వర్ణిస్తున్నాడు పోతన. ఒక వైపు పరమాత్మతత్త్వం, ఒక వైపు సామాన్య బాలకుల లక్షణాన్ని చూపుతున్నాడు. విష్ణువు తన నెవరైతే భావిస్తారో వాళ్లకు సులభుడు. అలా కానివారికి ఆయన కానరాడు)

బాలకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఆయన నవ్వితే జ్ఞానం ప్రకాశించి, అజ్ఞానం పటాపంచలైపోతుంది. అట్టి బాలకుడు తన వద్దకు వచ్చి నవ్వుతున్న ముఖాలుగల గోపకాంతల్ని చూచి తానూ నవ్వసాగాడు.

త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు గనుక “అమ్మ” అంటూ ఆయన కెవరూ లేరు. ఆ పరమపురుషు డిప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు “అమ్మా” “అమ్మా” అని పిలవడం నేర్చుకున్నాడు.

సహస్రాక్షుడైన పరమాత్ముడు సహస్రపాదుడు కూడా. అట్టివేయి అడుగుల శ్రీమహావిష్ణువు వామనావతారంలో ఒక అడుగుతో భూలోకాన్ని మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అతడే బాలకృష్ణుడై అడుగులు వేయటం ప్రారంభించడంతో, వామనునిమూడవపాదంతో బలి పాతాళానికేగినట్లు ఇప్పుడు శత్రువులు కూడా నేలకూలి పాతాళానికి వెళ్తున్నారు.

అంతేకాదు, బాలకృష్ణునిఒంటికి పట్టిన దుమ్ముతోపాటు, పెట్టిన అలంకారాలు అన్నీ అతనిలో శివస్వరూపాన్నికూడా స్పురింపజేస్తున్నాయి. శరీరాని కంటిన నేలధూళి శివునిశరీరంపై నిండిన విభూతిలాగా తల్లి బాలుని ముంగురులెత్తి పట్టి ఓ ముత్యాలహారాన్ని చుట్టగా, అది శివుని బాలచంద్రరేఖరూపం దాల్చగా, నుదుట పెట్టిన ఎర్రనితిలకం మన్మథుణ్ణి బూడిద చేసిన శివుని చిచ్చర కన్నులా ఉండగా; మెడలోనిహారం మధ్యలో నల్లగా ప్రకాశించే నాయకమణిగా వెలుగొందే నీలం శివునికంఠంమీది హాలాహలంమచ్చవలె కనబడగా; మెడలోని హారాలు శివుని సర్పభూషణాలుగా ప్రకాశించగా; బాలునిరూపంలో ఉన్న ఆ విష్ణుస్వరూపుడైన బాలుడు (కృష్ణుడు) తనకూ శివునికీ భేదం లేదని తెలియజేస్తున్నాడా అన్నట్లు శివస్వరూపంతో ప్రకాశించాడు.

బలరామకృష్ణుల విలాసచేష్టలను చూస్తూవుంటే ఆ గోపకాంతలకు ఎంతమధురంగా అనిపిస్తోందో! అందుకే ఏ రకమైన భయం, సంకోచం లేకుండా చేయవలసిన పనులన్నీ మరచి కేవలం ఆ బాలురనే చూస్తూ ఉండిపోయారు.

అప్పుడు బలరామకృష్ణుల తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలురను పెంచుతూ వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు, ఉన్న జంతువులనుండి, నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆయా ఋతువులకు తగినవిధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకులపై ప్రేమానురాగాలు ఉప్పాంగిపోతూ ఉండగా ఆనందంగా కాలం గడపుతున్నారు. అంతలో

తన వయస్సే కలిగిన గోపాలబాలకులు కృష్ణుణ్ణి తమనాయకుడన్నట్లుగా భావిస్తూ కలసి మెలసి ఆడుకొంటూ ఉన్నారు. బలరామునితో కలసి చిన్నచిన్న అడుగులతో కృష్ణుడు తృప్తి పొందుతున్నాడు. అలా ఆడుతున్న కృష్ణుణ్ణి చూస్తూ గోపకాంతలు ఆనందిస్తూ ఉండగా అతడు నల్లనిశరీరకాంతితో ప్రకాశించాడు.

ఆ బాలకృష్ణుడు రోజురోజుకు ఆ ప్రాంతంలో తిరగడంలోను, మాట్లాడడంలోను సమర్థుడై

అల్లరి చేస్తున్న బాలకృష్ణునితో తల్లి అలా చేయవద్దని బెదిరిస్తే అలకతో దూరంగా పోతాడు. మళ్లీ తల్లి చేయిజాపి నా ముద్దుల బాబు వచ్చాడంటూ ప్రేమతో పిలిస్తే తల్లి దగ్గరకు వచ్చి, హత్తుకొని, మళ్ళీ ఎప్పటిలాగే అల్లరిచేస్తూ, మొలనున్న గంట చక్కగా శబ్దంచేస్తూ ఉంటే ఆనందంతో వచ్చి చిన్ని కృష్ణుడు చనుబాలు తాగుతాడు.

చిన్ని కృష్ణుడు గోపవనితల ఇళ్ళలోని వెన్నంతా మెక్కి ఏమి తెలియనివాడిలా అమ్మదగ్గరికి వచ్చి, అమ్మా! పాలివ్వమంటూ తల్లి చుట్టూ తిరుగుతాడు.

బాలకృష్ణుడు తన చుట్టూవున్న గోపబాలురతో ఆటలాడుతున్నప్పుడు వారితో 'నేను ఆబోతును మీరు ఆవులు' అంటూ పెద్దగా రంకెవేస్తూ, ఆబోతులా వంగి ఆడతాడు. 'నేను రాజును, మీరు సేవకులు. అందరూ ఇలా రండి రండంటూ తన అధికారాన్ని చూపుతూ పనులు పురమాయిస్తాడు. 'మీరు ఇంటివాళ్ళు, నేను దొంగను' అని వాళ్లందరినీ నిద్రపోయేట్లుగా చేసి వాళ్ళనగలు దొంగిలించి దాక్కుంటాడు. 'నేను మీ అందర్నీ నడిపేవాడను, మీరు నేను చెప్పినట్లుగా నడిచేవారం' టూ వారందరినీ ఆటాడిస్తాడు. మూలమూలలకు వెళ్తాడు. దాగుడు మూతలాడతాడు. ఉయ్యాల లూగుతాడు, బంతులతో ఆడతాడు, జారులరూపంతో, దొంగల రూపంతో అంతటా తిరుగుతాడు.

అలా కృష్ణుడు మాయారూపంతో ఉండినబాల్యంలో జారుడులాగా, దొంగలాగా ఆడుతూ ఉంటే గొల్లభామలు అతని ఆగడాలను సహించలేక యశోదతో ఇలా అన్నారు.

గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The demon Trinavarta came to Nandavraja in the form of a whirlwind and abducted the infant Krishna - తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

బరువెక్కిన కొడుకును మోయలేక యశోదాదేవి బిడ్డను క్రిందికి దించి, ఇతడు భూమిని ఉద్ధరించటానికి పుట్టిన మహాపురుషుడేమో అని మనస్సులో అనుకొంది.

ఆ సమయంలో

కఠినాత్ముడైన కంసుడు ఆజ్ఞాపించగా, తృణావర్తుడనే రాక్షసుడు భూమిమీదికి వచ్చి, అకస్మాత్తుగా సుడిగాలిగా అయి, బిసబస అని శబ్దం చేస్తూ, అందరు ఇలాంటి గాలిని ముందెన్నడు చూడలేదని ఆశ్చర్యపడుతుండగా క్రమ్ముకొని వీచి, బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనిపోయాడు.

ఓ పరీక్షిన్మహారాజా! ఎవరివల్లనూ తిరుగుడువడని శ్రీహరి (బాలకృష్ణుడు) ఇప్పుడు తిరుగుడు పడ్డాడు. సుడిగాలి రూపంలో వచ్చిన రాక్షసుడు విసరిన సుడిగాలివల్ల రేగిన దుమ్ము కళ్ళనిండా క్రమ్ముకోగా, గోపకులంతా భయపడి గుండ్రంగా తిరుగుతూ పడ్డారు.

అంతేకాక, ఆ సుడిగాలిరాక్షసుడు తృణావర్తుడు ప్రళయకాలవాయువువలె చెలరేగి, చుట్టుముట్టి, వీచిన సుడిగాలిలో పుట్టినదుమ్ము, పైకెగసి సూర్యుకిరణాలను కప్పివేసింది. భయంకరమై దట్టమైన చీకటి పదిదిక్కులను ఆవరించింది. వ్రేపల్లెమొత్తం కలవరపాటు నొందింది. ఒకరికొకరు అగుపడనిస్థితి ఏర్పడింది. దిక్కు తెలియనిస్థితిలో జనులంతా భయపడ్డారు. ఆ సుడిగాలి తిరిగే వేగానికి, భయంకరధ్వనికి దిక్కుల చివరలు చెవిటివయ్యాయి. ఒక ముహూర్తకాలం లోకాలకు భయంకరస్థితి ఏర్పడింది. అప్పుడు

యశోదకు బాలకృష్ణుడు అగుపడక పోయేసరికి, ఆపద కలిగినట్లుగా భావించి, కలతనొంది 'ఓ బిడ్డా! బాలభానునివంటి కాంతికలవాడా! బాలురందరిలో శ్రేష్ఠుడా! ఈ రోజు గాలిచేతిలో చిక్కువడితివా? అంటూ, బాలుణ్ణి పిలుస్తూ ఈ స్థితి కలిగించినందుకు దేవుణ్ణి దూషిస్తూ, దుఃఖంతో క్రుంగి కృశించి గట్టిగా కేకలు పెట్టుతూ.

'సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుకొని ఆకాశానికి ఎత్తుకు పోయింది. ఆకాశంలో సుడితిరుగుతూ, భయపడుతున్న ఓ ముద్దుల కొడుకా! ఏమంటున్నావు? ఇది ఘోరం'- అని (దేవకీదేవి) అంటూ

'కుమారుణ్ణి ఇక్కడే కూర్చోపెట్టాను. వాడు ఇక్కడే ఆడుకొంటూ ఉన్నాడు. ఇంతలోనే ఈ మాయదారి సుడిగాలి ఎటునుండి వచ్చిందో? బిడ్డ ఏ త్రోవపట్టిపోయాడో? నేను ఎక్కడికని వెళ్ళివెదికేది' అంటూ యశోద, దూడను వదలిపెట్టి దుఃఖంతో నేలమీద కూలే ఆవులాగా నేలమీద పడిపోయింది.

బిడ్డకోసం ఈ విధంగా దుఃఖిస్తున్న యశోదాదేవిని చూచి గోపాలుర భార్యలందరు ఆర్తితో కలతపడి దుఃఖించగా వాళ్ళకళ్ళనిండా నీళ్ళునిండాయి.

అంతలోపల ఆ సుడిగాలి రాక్షసుడు తృణావర్తుడు మితిమీరిన అహంకారంతో బాలకృష్ణుణ్ణి ఆకాశానికి ఎత్తుకొని పోయాడు. కాని, ఆ బాలుడిబరువును మోయలేక గమనవేగం తగ్గి, కదలలేక 'ఇంతకుముందు ఇలాంటి బిడ్డను ఎక్కడా చూడనే లేదు. ఇక మీదట నా గతి ఏమౌతుందో' అని చింతింపసాగాడు.

అని పై విధంగా సుడిగాలి రాక్షసుడు చింతిస్తున సమయంలో

పరీక్షిన్మహారాజా! బాలకృష్ణుడు పిల్లఏనుగుల తొండాలవంటి తన రెండుచేతులతో తృణావర్తరాక్షసుని కుత్తుక నాళాన్ని బిగియపట్టి, ఒక కొండవలె బరువై వ్రేలాడాడు.

తన మెడను బిగియపట్టి ఒక కొండలా వ్రేలాడుతున్న బాలకృష్ణుని పట్టునుండి బయటపడలేక ఆ రాక్షసుడు, మెడకు ఉచ్చుబిగుసుకొన్న పక్షివలె భయపడసాగాడు.

దేవతల శత్రువైన కంసునిబంటు తృణావర్తుడు, విష్ణుస్వరూపుడైన శ్రీకృష్ణునిఅరచేతిరాపిడికి స్వాధీనం తప్పినవాడై, త్రిపురాంతకుడైన పరమశివుని బాణంతో కూలిపోయిన పురంవలె, అవయవాలన్నీ విరిగి రాళ్ళమీద పడ్డాడు.

అప్పుడు గోపకాంతలు జరిగిందంతా చూచి, ఏడ్పులు మాని, సంతోషంతో రాక్షసుని వక్షఃస్థలం మీద ఉల్లాసంగా, చూడముచ్చటగా, ఇది వరకటి బరువులేక వ్రేలాడుతున్న బాలకృష్ణుణ్ణి ఎత్తుకొనివచ్చి, చింతాక్రాంతురాలై ఉన్న యశోదాదేవి కిచ్చారు. తరువాత అందరు గోపకులు, గోపికలు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు.

సాధుశీలుడు సమబుద్ధి కలిగి ఉంటాడు కనుక రక్షణలేకపోయినా కష్టాలు కలిగినపుడు రక్షింపబడుతాడు. దుర్మార్గుడికి వెయ్యి రక్షణలున్నా అతడు పాపాత్ముడు కనుక తప్పక శిక్షింపబడుతాడు.

గత జన్మలలో ఏ యేనోములు నోచామో, ఏ యేయాగాలు చేశామో, ఏయే సత్పురుషులకు ఏమేమి దానా లిచ్చామో, ఏ యే మంచి విషయాలమీద మనస్సు నిలిపి కాలం గడిపామో, ఏ యే సత్యాలు పలికామో; ఏ యే పుణ్యక్షేత్రాలలో సంచరించామా! ఆ పుణ్యఫలంగా ఇప్పుడిక్కడ భయం లేని బాలకృష్ణుణ్ణి దర్శించగలిగాము.

అని పలికి గోపకుల మాటలు విన్న నందుడు, చాల ముందుగానే వసుదేవుడు తనతో తెలిపిన విషయాలకు ఆశ్చర్యపడుతూ ఉండినాడు. ఇంకా,

ఓ పరీక్షిన్మహారాజా! ఒక రోజు యశోద పాలిండ్లు చేపునకు రాగా, చిన్నారి ముద్దుల కృష్ణుణ్ణి దగ్గరికి తీసుకొని, తొడలమీద ఉంచుకొని, ముద్దుపెట్టుకొని చనుబాలు త్రావించింది. ప్రేమగా ముఖాన్ని నిమిరింది. అప్పుడు మెల్లగా నవ్వుతూ బాలుడు ఆవులించాడు. ఆ బాలకృష్ణునినోరు ఆమెకొక పెద్దగుహలాగా అగుపించింది. అందులో ఆమె సముద్రాలను, దిక్కులను, భూమిని, అడవులను, ద్వీపాలను, పర్వతాలను, నదులను, వాయువును, సూర్యచంద్రులను, అగ్నిని, ఆకాశాన్ని గ్రహనక్షత్రాలను, అఖిలలోకాలను, చరాచరాలైన భూతగణాలను దర్శించి, కన్నులు మూసుకొని, ఆశ్చర్యచకితురాలైంది.

(బాల్యంలోనే కృష్ణుడు ఆవులించి యశోదమ్మకు తననోట విశ్వరూపదర్శనభాగ్యమిచ్చాడు.)

తరువాత ఒకరోజు వసుదేవుని ఆజ్ఞమేరకు యాదవుల పురోహితుడైన గర్గమహాముని వ్రేపల్లెకురాగా, నందుడు ఆయనను చూచి లేచి నిలబడి నమస్కరించి,

ఉత్తమగుణాలు, నడవడులు, సత్పురుషులసాంగత్యం కలిగి, శివారాధకుడై, అరిషడ్వర్గాన్ని పారద్రోలి, నీచజనుల్ని దగ్గరకు రానీయనట్టి ఆ గర్గమహామునిని నందుడు అతిప్రీతితో సేవించాడు.

వచ్చిన గర్గమహామునికి తగిన సత్కారాలు చేసిన పిదప నందుడు ఇలా అన్నాడు.

మహాత్మా! ఓ గర్గమహామునీ! గొప్పవారు ఏ కారణం లేకుండా ఒక చోటికిగాని, ఒకరి దగ్గరికిగాని రారు. తక్కవవారిఇండ్ల దగ్గరికి వచ్చారంటే-వారి రాకలు శుభాలకు కారణాలు. ఇప్పటి మీ రాక మాకు శుభాన్ని సమకూరుస్తుంది. ఇది సత్యం.

ఓ గర్గమహామునీ! నీవు జ్యోతిశ్శాస్త్ర పండితులందరిలో శ్రేష్ఠుడివి. మిక్కిలి తేజోమూర్తివి. అన్నిదిక్కుల చివరలదాకా వ్యాపించి వెలిగే కీర్తి కలవాడివి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి. నా మనవి విను. వేదజ్ఞుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడే మానవులకు నిర్ణయింపబడిన గురువని పెద్దలంటారు. నీవు నేర్పుగ ఈ కుమారులిద్దరికి నామకరణాదిసంస్కారాలు వేదోక్తంగా జరిపించు.

అని నందుడు చెప్పి బలరామకృష్ణులను చూపగా, ఆ గర్గమహాముని ఇదివరకు కంసునిచేత వ్రేటువడి ఆకాశానికి ఎగసిపోయిన యోగమాయ చెప్పినమాటలను నందునికి వివరించి, కృష్ణుడు దేవకీదేవికొడుకు అని కంసుడు తలచి, ప్రమాదం చేయవచ్చు కనుక, పిల్లలకు నామకరణాది సంస్కారాలు రహస్యంగా చేయటం మంచిదని సూచించాడు. నందుడు అందుకు సమ్మతించాడు. అప్పుడు ఆ మహాముని రోహిణికొడుకును గురించి

ఓ పరీక్షిన్నమారాజా! ప్రజలు ఆనందించేట్టు మెలిగే పద్ధతి కలవాడు కనుక రాముడనీ, ఒక గర్భంనుండి లాగబడి మరాక గర్భంలో ప్రవేశపెట్టబడినవాడు కావటంచేత సంకర్షణుడనీ, గొప్పబలం కలవాడు కావటంచేత బలుడనీ నామకరణం చేశాడు.

తరువాత గర్గమహాముని యశోదకొడుకును ఉద్దేశించి 'ఈ శిశువు పూర్వం తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లగా ఉన్నాడు కనుక కృష్ణుడని పిలవండి. ఇతడు ఒకానొక ప్రదేశంలో వసుదేవునికి జన్మించాడు కనుక వాసుదేవుడనికూడ ఇతణ్జి పిలువవచ్చు. ఈ బాలుడికి అనేకగుణాలు, రూపాలు, కర్మలు ఉండటంచేత ఇంకా ఎన్నో పేర్లు వస్తాయి. ఈ బీడ్డవల్ల మీరు అన్ని దుఃఖాలనుండీ గట్టెక్కుతారు. అంతేకాదు. ఈ బాలుడివల్ల దుష్టశిక్షణం, శిష్ట రక్షణం కూడా జరుగుతుంది. ఈ కుమారుడు శ్రీమహావిష్ణువుతో సమానమైనవాడు అని చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. అది విని నందుడుకూడా పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత

శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Balakrishnudu (Baby Krishna) kicked and bucked a cart with his feet - బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

యశోదాదేవి తన బిడ్డడు బాలకృష్ణుడు ఒత్తిగిలి బోర్లపడటం నేర్చుకొన్నాడని ఎంతో సంతోషించి, కొడుకు జన్మనక్షత్రాన ఒకరోజు వేడుకగా అతడికి స్నానం చేయించటానికి గోపికలను పేరంటానికి పిలిచింది. మంగళవాద్యాలు మ్రోగగా, గోపికలు పాటలుపాడగా, బ్రాహ్మణుల వేదమంత్రాలతో బిడ్డకు అభిషేకాదులు చేయించింది. ఆ వేదవిప్రుల ఆశీర్వచనాలు అందుకొని, వారికి ఆవుల నిచ్చింది. విందుభోజనం పెట్టింది. వస్త్రా లిచ్చింది. అడిగినవారికి అడిగినట్టుగ ఇచ్చింది. బాలకృష్ణుణ్ణి ప్రియమార పానుపుమీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది. గోపాలురకు, గోపికలకు పూజలుచేస్తూ ఆమె బిడ్డ విషయం మరచింది.

చిన్ని కృష్ణుడు నిద్రపోయిన సంగతి మరచిన సమయంలో

నిద్రపోతున్న బాలకృష్ణుడు ఆకలి గొని, మేల్కొని, కాళ్ళుచేతులు ఆడిస్తూ, ఒడలు విరుచుకొంటూ, పాలకొరకు చన్నుకోరుకొని, అది దొరకకపోయే సరికి ఆగ్రహించి, చిగురుటాకువలె మృదువై, చక్రరేఖలు, ధనుస్సు రేఖలు మున్నగు సాముద్రిక లక్షణాలుండే తన పాదంతో ప్రక్కనున్న ఒక బండిని బలంగా తన్నాడు.

బాలకృష్ణుడు తన్నగానే ఆ బండి, గోపకులందరు చూస్తుండగా, ఆశ్చర్యకరంగా ఆకాశాని కెగిరింది. ఇరుసు బరువుకు దాని చక్రాలు ఆకారం మారినవై నేలమీద పడ్డాయి.

అప్పుడు యశోద, నందుడు మొదలైన ముఖ్యగోపికలు, గోపకులు ఆ బండిలో ఉన్నట్టి మధుర పదార్థాలన్నీ నేలపాలై నిరుపయోగాలు కావటంచూచి, ఆశ్చర్యచకితులై తాము చేస్తున్న పనులు వదలిపెట్టి, పండుగలు మాని, సంతోషాన్ని కోల్పోయి, భయాలు నిండిన మనస్సులతో

కారణం లేకుండా బండి ఆకాశానికి ఎగురదు కదా! పక్కమీద పడుకొని ఉన్న ఈ చిన్నిబిడ్దడు ఆ బండిని తన్నటానికి సమర్ధుడు కాడు. మరి ఏ విధంగా ఇది ఎగిరిందో! ఇది అలా ఎగరడమేమిటి?; దీనికి కారణం ఎలాంటిదో!

అని పై విధంగా చర్చించుకుంటున్న సమయంలో

బాలకృష్ణుడు ఆకలిగొని ఏడుస్తూ కాలు ఎత్తగా, ఆ కాలు తగిలి బండి ఆకాశాని కెగిరింది గాని, అది ఎగరటానికి ఇతర కారణ మేదీ లేదని, కృష్ణుని పాన్పుకు దగ్గరలో ఆడుకొంటున్న పిల్లలు చెప్పారు.

అని పై విధంగా చిన్న పిల్లలు పలికిన మాటలను విన్న తర్వాత

'ఈ పసిబాలుడేమిటి! ఇంత పెద్ద బండి ఏమిటి! ఇతడు దాన్ని తన్నటమేమిటి! అది ఆకాశాని కెగిరి ముక్కలు ముక్కలుగ విరగడమేమిటి! ఈ ఆడుకొనే పిల్లలు అబద్ధం చెప్పారు. ఇంత తెలివి తక్కువమాట ముల్లోకాల్లో ఎక్కడైనా చెప్పబడుతుందా? ఇదంతా ఏ విధంగా జరిగిందో' అని అనుకొంటూ, సందేహాలతో సతమతమౌతూ గోపాలురు, గోపికలు అందరూ, ఆశ్చర్య చకితులయ్యారు (వ్రే= గొల్లకులానికి చెందినవాడు, వ్రేలు= గోపాలురు (బహువచనరూపం)).

అప్పుడు ఆ చిన్ని కృష్ణుని ఏడ్పును విన్న యశోద పరుగెత్తుకొని వచ్చింది.

'అన్నా! అలసిపోయావు కదన్నా!; ఆకలితో ఉన్నావు కదన్నా!; మంచివాడివి కదన్నా!; ఏడుపు మానుమన్నా!; నా చనుబాలు త్రావుమన్నా!; సంతోషంగా ఉండుమన్నా!' - అంటూ యశోదాదేవి ఆ బాలకృష్ణునికి తన చనుబాలిచ్చింది.

ఆ తరువాత బాలకృష్ణునికి పిల్లలను పట్టి హింసించే చెడుగ్రహం ఏదో సోకిందని, గోపకులు చాలామంది ఆ గ్రహపీడ తొలగటానికి అనేక బలిదానాలు చేశారు. బ్రాహ్మణులు పెరుగుతో, దర్భలతో, అక్షతలతో అనేకహోమాలు చేశారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద మంత్రాలతో అభిషేకాలు చేయించి, శుభాన్ని పుణ్యాన్ని కలిగించే స్వస్తివాచనాలు, పుణ్యాహవాచనాలు చదివించి, కుమారుడికి మేలు జరగాలని నందుడు అలంకరించిన పాడిఆవులను పండితులకిచ్చి, వారి ఆశీర్వాదాలు పొంది, ఆనందించాడని చెప్పి, శుకుడు ఇంకా ఇలా అన్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! ఒకరోజు యశోదాదేవి కొడుకును తొడమీద కూర్చోపెట్టుకొని ముద్దాడి దేహాన్ని ప్రేమతో అలా నిమురుతూ ఉండగా, పెద్దకొండ శిఖరంవలె బాలకృష్ణుడు బరువెక్కిపోయాడు.

తృణావర్తుండను రాక్షసుండు సుడిగాలియై కృష్ణు నెత్తుకొని పోవుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

King Kansa sent the demoness Putana to Vrepalle - కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

వసుదేవుడు ఆ విధంగా చెప్పి నందుడు మొదలైన గోపకులను సాగనంపగా, వారు వడిగా నడువగల ఎద్దులను కట్టిన బండ్లెక్కి అందరు చూస్తూ ఉండగ తమ తమ గ్రామాల త్రోవన వెళ్ళారు. నందుడు తన ముందర చెడు జరిగే సూచనలను స్పష్టంగా చూస్తూ, వసుదేవుడు తనతో చెప్పిన మాటలు తప్పవని అనుకొంటూ, ఆలోచిస్తూ వెళ్ళాడు. తరువాత

పసిబిడ్దల్ని చంపే పూతన అనే రాక్షసి, కంసుని ఆదేశానుసారం పల్లెల్లో, గొల్లపల్లెల్లో, పట్టణాల్లో పసిబిడ్డల్ని చంపుతూ ఎవరి పేరు చెపితే సర్వభయాలు తొలగిపోతాయో, ఆలాంటి రాక్షసాంతకుడు జన్మించి ఉన్న వ్రేపల్లెకు ఒకరోజు ఆకాశమార్గంలో వచ్చింది. మాయతో తాను కోరుకొన్న రూపాన్ని ధరించింది. ఎవ్వరికి అగుపించకుండ ఇల్లిల్లు తిరిగింది. నందుని ఇంట్లో ఒక పసిబిడ్డ చేసే శబ్దం వినింది. చాలా సంతోషించింది. అందమైన స్త్రీ వేషం ధరించి,

చలించే కన్నులతో, మిక్కిలి ఎత్తై మొనదేలిన గుండ్రనిచన్నులతో, మచ్చలేని నిండైన చంద్రునివంటి ముఖంతో, ఉన్నదా లేదా అని బుద్ధికి అందని సన్ననినడుముతో, పెద్ద పిరుదులతో, చిగురుటాకువంటి లేత ఎరుపురంగుగల కాలు సేతులతో; పెద్దకొప్పుతో అందరికీ మోహాన్ని కలిగించే రూపంతో

(కామరూపులైన రాక్షసులు కోరినరూపం ధరిస్తారు. అందుకే పూతన ఇలాంటి రూపాన్ని ధరించింది)

చెవులకు అలంకరించుకొన్న బంగారుకుండలాల కాంతులు చెక్కిళ్ళమీద చిందులాడుతుండగా, జడలో దండిగ అలంకరించుకొన్న మల్లెపూల సువాసనలకు గండుతుమ్మెదలు పైనుండి ముసురుతుండగా, కంకణాల కాంతులు, హారాల వెలుగులు అందంగా అగుపిస్తుండగా, వల్లెవాటుగా మీదవేసుకొన్న పైట కొద్దిగా ప్రక్కలకు జారుతూ ఉండగా, చంద్రునివంటి అందమైన ముఖంతో ఆ పూతన బాలకృష్ణుడుండే నందుని ఇంటికి వెళ్ళింది.

పూతన నందునిఇంటికి వెళ్లిన సమయంలో

పూతన లోపలికి వెళ్ళుతూ ఉంటే గోపికలందరు మాకు గొప్ప బ్రతుకు ప్రసాదించటానికే లక్ష్మీదేవి ఈ అందమైన వేషం ధరించి వచ్చిందేమో అనే, భ్రాంతితో ఏమీ మాట్లాడటానికి నాలుకలు రాక; తదేకదృష్టితో ఆమెను చూస్తూ నిలబడ్డారు. అందమైనరూపంతో ఆ పూతన లోనికి వెళ్ళి, బూడిదలో నిప్పుకణికవలె వెలుగుతున్నవాడూ, దుష్టశిక్షణ మొదలు పెట్టుటకు సిద్ధంగా ఉన్నవాడూ, పరమాత్ముడూ అయిన బాలునిగా ఉండేవాణ్ణి మంచం మధ్యలో పరుండి ఉండగా చూచింది.

(మాటకు, మనస్సుకు అందనివాడు, అన్నింటికి అతీతమైనవాడు, ఎన్ని ప్రళయాలు వచ్చినా చివరకు మిగిలేవాడు కనుక పరమాత్మ - పరుడు.

శ్రీకృష్ణావతారంలో దుష్టశిక్షణ పూతన సంహారంతోనే కదా ప్రారంభమౌతుంది. అందుకే ఆ బాలకృష్ణుడు దుర్జనవధ ప్రారంభకుడయ్యాడు.)

(పడక మధ్యలో పవళించిన చిన్ని కృష్ణుని) చూచి దగ్గరికి వచ్చే సమయంలో

లోకాలన్నింటికీ ప్రభువూ, చరాచరాలను పాలించేవాడూ, గోపాలబాలుడు అయిన శ్రీకృష్ణుడు, పసిపిల్లలను చంపేది, దుష్టురాలు అయిన పూతన, బాలింతరాలివలె పాలిండ్లలో విషాన్ని నింపుకొని త్వరత్వరగ రావటాన్ని తెలుసుకొని, తనలో తాను నవ్వుకొంటూ, కాలేదో చేయ్యేదో తెలుసుకోలేనంతగా నిద్రపోతున్నవాడిమాదిరిగా గురకలుపెట్టసాగాడు.

పాపాత్ముల జాతికి చెందిన ఆ అందమైన పూతన, పసిబిడ్డడి పడకదగ్గరికి వెళ్లి, చేతులతో బిడ్డనెత్తుకొని, తన చన్నుల మీద ఆనించుకొని, ముద్దు పెట్టుకొని, తలను వాసన చూచి ఈ విధంగా అనింది.

నీకు చనుపాలు త్రావించటానికి తగినవారు ఇక్కడ ఎవ్వరు లేరు. నీవు చావాలి. నీకు చనుపాలు త్రాగించిన తరువాత నిదానంగా నేను వెళ్ళుతాను అన్నట్లుగ రెండు చళ్ళు త్రావించింది.

(“చను గుడిపి మీంద నిలుకడం జనుదాన” అనుటలో మరొక అర్ధం కూడ స్ఫురిస్తుంది. నీకు చనుబాలు తావించి, నిన్ను చంపి, తరువాత నిదానంగా నేను కూడా చస్తానులే అనేదే మరోఅర్థం. ఈ 'చనుటు' చనిపోవుట, పూతన ఆశించినట్లు కృష్ణుని విషయంలో జరుగలేదు గాని పూతనవిషయంలో మాత్రం జరిగింది.)

పద్మపత్రాలవంటి కన్నులు కలవాడా! ఓ చిన్నికుమారా! నా చనుబాలు ఒక గ్రుక్కెడు తాగవయ్యా! అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుస్తుంది. నేను చేసిన పనికూడా ఫలిస్తుంది.

అని ఆ బాలకృష్ణుణ్ణి ఉద్దేశించి ముద్దుపెట్టుకొనే విధంగా మాట్లాడుతున్న కాంతను (పూతనను) చూచి,

యశోదారోహిణులు 'మా బిడ్డను తాకవద్దు. నీ చనుబాలు ఇవ్వవద్దు. మా కొడుకు నీ చనుబాలు త్రాగడు. బిడ్డను వదలి వెళ్ళిపో' అని పూతనను దగ్గరికి పిలిచి చెప్పినా, ఆ రాక్షసి వాళ్ళమాటలు లెక్క పెట్టకుండ వాళ్ళవైపు సూటిగా చూస్తూ మాయతో, ఒరలోని క్రూరమైన కత్తిలా మాటల్లో మెత్తదనం, మనసులో క్రూరత్వం ఉట్టిపడుతుండగా

చాలదగ్గరగా వచ్చి, తీయగా మాట్లాడుతూ, భయపడకుండ, తడబడకుండ, నిద్రపోతున్న బిడ్డను, నిద్రపోతున్న నాగుబాము అని తెలియక, త్రాడు అనే భావంతో బుద్ధిహీనుడు తనవైపు లాగుకొన్న విధంగా, మోసగత్తె, దుర్మార్గురాలు అయిన పూతన నేర్పుగ, పరుపుమీద చక్కగా ప్రకాశిస్తూ, కళ్ళు మూసుకొని నిర్భయంగా నిద్రపోతున్నట్లున్న అందాల బాలకృష్ణుణ్ణి ఎత్తి తన తొడల మధ్య ఉంచుకొన్నది. శరీరం నిమురుతూ ప్రేమను ఒలకపోస్తూ 'ఆకలితో ఉన్న నా ముద్దు బిడ్డా! నా చనుబాలు త్రావు' అని తన చన్నుకుడిపే సమయంలో

బాలకృష్ణుడు అప్పుడే మేలుకొన్నట్లు నిదానంగా కళ్ళు విప్పి, ఓరగంట చూస్తూ, ఒడలు విరుచుకొంటూ మూల్గి, నిక్కి ఆవులిస్తూ, చేతులు చాచి, ప్రక్కకు తిరిగి, ఆకలితో ఉన్నవానివలె, పూతన బిగి చన్నులను చేతులతో గట్టిగా ఒత్తిపట్టుకొని నోటపెట్టుకొన్నాడు. గుటుకు గుటుకుమని శబ్దం చేస్తూ రెండుగ్రుక్కలు తాగాడు. ఆ రాక్షస స్త్రీ ప్రాణాల్ని దేహబలాన్ని ఆ పాలతో పాటు పీల్చివేశాడు. పూతన గుండెలు తల్లడిల్లగా వేగంగా, గిరగిరా తిరుగుతూ, నిలబడలేక తలవాల్చి, 'నీవు నా దగ్గర పాలు తాగిన తక్కిన బాలుర వంటివాడివి కాదు. ఇపుడు పాలు తాగినంతవరకు చాలు. నా చన్ను విడిచిపెట్టు, విడిచిపెట్టు అని అంటూ

అధికమైన దప్పిక, మంటలు శరీరమంతా వ్యాపింపగా, ధైర్యాన్ని కోల్పోయి, కళ్ళు విచ్చుకొని, కాళ్ళు, చేతులు చాచుకొని, గుండెలదరే గుబ్బనే శబ్దంతో అరుస్తూ నేలమీద కూలింది.

దేవతలను నాశం చేసేదైన పూతన, వజ్రాయుధంతో భేదింపబడిన పర్వతంవలె, తన తొలుతటి రాక్షసశరీరంతో నేలమీద కూలి, పెద్ద కేకపెట్టగా ఆ ధ్వనికి భూమి కొండలతోకూడ కదలాడింది. గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో బెదిరిపోయాయి. అన్నిదిక్కులా ఆ కేకప్రతిధ్వనులు అతిశయిల్లాయి. అన్నిలోకాలు కంపించాయి.

అప్పుడు సహింపశక్యం గాని ఆ శబ్దం తమగుండెల్లో ప్రవేశించి, భయపెట్టగా, గొల్లవాళ్ళందరూ, చలించినవాళ్లై, స్పృహ కోల్పోయి మెలికలు తిరిగి భూమిమీద పడ్డారు.

ఓ పరీక్షిన్మహారాజా! దుష్టురాలు, రంకుటాలు, రాక్షసి అయిన ఆ పూతన సహజదేహం నలిగిపోయేట్టుగా నేలమీద పడగానే, దాని దెబ్బకు ఒకటిన్నర ఆమడల దూరందాకా ఉన్న చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయ్యాయి.

తోకలవలె వంకరగా, కఱ్ఱలవలె నిడుపుగా కానవచ్చు పండ్లు, కొండగుహవంటి ముక్కు పెద్ద బండలవలె ఉన్న చన్నులు, చెదిరి చలిస్తున్న ఎర్రని జుట్టు, చీకటి క్రమ్ముకొన్న చేదబావులవంటి కళ్ళు, పెద్ద మట్టిదిబ్బవంటి పిరుదులు, పొడవైన కట్టలవంటి కాళ్ళు, తొడలు, చేతులు, నీళ్ళు ఎండిపోయిన మడుగులాంటి కడుపు, ఆరుకోసుల పొడవు కలదై, దగ్గరకు వెళ్ళి చూస్తే భయాన్ని కలిగించే పూతన శవాన్ని చూచి, గోపకులు, గోపికలు అందరు గుమికూడి భయపడ్డారు.

ఇలాగా పూతన నేలకూలిన ఆ సమయంలో, కొత్తగా పూచిన తామరపువ్వువంటి కన్నులుండే ఆ బాలకృష్ణుడు పసిపిల్లలను చంపేది, మునులను బాధించేది, అయిన ఆ పూతనసంగతి తెలుసుకొని, తన బాలక్రీడావిలాసంతో, పాలు త్రాగటానికని ఆ రాక్షసి రొమ్ముమీద ప్రాకసాగాడు.

విషసర్పాలను భక్షించే గరుత్మంతుడినే వాహనంగా కలవాడు, కంఠమందే విషముంచుకొన్న శివుడికి సుఖుడైనవాడు, విషం (నీళ్ళ)మీద శయనించేవాడు, విషం (నీటి)నుండి ఉద్భవించిన పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవునికి తండ్రి అయినవాడు విషపు చన్నుల పూతన చనువిషం త్రాగడం ఒక పెద్ద విషమా?

ఈ సంఘటన నుండి తేరుకొన్న గోపీగోపకులు రోహిణీ, యశోదాదేవులను కలిసి, భయపడకుండా దగ్గరికి వచ్చి

నేలమీద కూలిన రక్కసి అయిన పూతన పెద్ద రొమ్ముమీద ఏ భయమూలేకుండా ఆడుకొనే ఆ బాలకృష్ణుణ్ణి 'రా బిడ్డా! అని భుజాలమీదికి ఎత్తుకొని, దేహమంతా, నిమిరి లాలించి, దోషపరిహారార్థం పవిత్రమైన ఆవుతోకతో దిగదుడిచి, ఆవు కాలిదుమ్మును, పంచితాన్ని పైనచల్లి, ఆవుపేడను పండ్రెండునామాలను స్మరిస్తూ పండ్రెండు అవయవాల్లో పూశారు.

(ద్వాదశనామంబులు = కేశవాదిగా వున్న 24 నామాల్లో, మొదటి పండ్రెండునామాలను ఉచ్చరిస్తూ “లలాటం” మొదలు చివరగా “మెడమీద” ఊర్ధ్వపుండ్రాలు ధరించడం సంప్రదాయం. అలాగే గోపికలు కృష్ణునికి గోమయాన్ని పండ్రెండు అవయవాలకూ పూశారు.)

అంతేకాదు, గోపికలు బాలకృష్ణునికి తాముపెట్టిన రక్ష చాలునని తృప్తి పొందక ఆచమనం చేసి, ఆయా బీజాక్షరాలను తమ శరీరమందలి ఆ యా భాగాలలో న్యాసం గావించుకొని, తమ దేహాలను తాము ముందుగ సంరక్షణ చేసుకొని ఓ ముద్దులబిడ్దా! నీ పాదాలను బ్రహ్మదేవుడు, మోకాళ్ళను వాయుదేవుడు, తొడలను అగ్నిదేవుడు, నడుమును అచ్యుతుడు, పొట్టను హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, రొమ్మును ఈశానుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాలను చతుర్బుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరస్సును ఈశ్వరుడు కాపాడుదురు గాక! అంతేకాదు. ముందు భాగాన్ని చక్రాయుధుడు, వెనుక భాగాన్ని గదాయుధుడు, ప్రక్కభాగాలను మధుసూదనుడు మరియు ఖడ్గధారి అజనుడు, మూలలను శంఖచక్రగదాధరుడైన ఉరుగాయుడు, పై భాగాన్ని ఉపేంద్రుడు, క్రింది భాగాన్ని గరుడుడు, అన్ని భాగాలను హలధరుడైన మహాపురుషుడు రక్షింతురుగాక!

నీ ఇంద్రియాలను హృషీకేశుడు, పంచప్రాణాలను శ్రీమన్నారాయణుడు, హృదయాన్ని శ్వేతద్వీపప్రభువైన శ్రీహరి, మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధిని పృశ్నిగర్భుడు, అహంకారాన్ని పరబ్రహ్మ పాలన చేయుదురు గాక! నీవు ఆడుకొనేటప్పుడు గోవిందుడు, పడుకొన్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భుజించేటప్పుడు యజ్ఞభుజుడు ఏ మాత్రం ఏమరుపాటులేక నీకు రక్షగా ఉంటారు. నీ పేరు చెపితే చాలు దుస్స్వప్నాలు, వృద్ధబాలగ్రహాలు, కూశ్మాండగ్రహాలు, డాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్టరాక్షసులు, భూతాలు, ప్రేతాలు, యక్షరాక్షస పిశాచాలు, వినాయకులనే విఘ్నకారక గ్రహాలు, పెద్దమ్మ, పూతన, మాతృకలు మొదలైన దుష్టగణాలు నాశనమైపోతారు. నీ ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని అడ్డుకొని చిత్తచాంచల్యాన్ని, అపస్మారక స్థితిని కలిగించే ప్రవృత్తులు, మహోత్పాతాలు కలుగకుండుగాక! అని దీవించారు. తరువాత

(సర్వలోకాలకు “రక్ష"కుడైన చిన్ని కృష్ణుడు “పూతనను” సంహరించినా, గుర్తించక మాయకు లోనై అమాయకలైన గోపికలు, అత్యంతప్రేమతో “చిన్నిశిశువు”గా భ్రమించి, బాలకృష్ణునికి ఎలాంటి గ్రహదోషాలు సోకకుండా లోక నియమానుసారం 'రక్షలు' కట్టి దీవించారు.)

ఆ పెనుమాయల గోపాల బాలుడికి యశోద చన్నిచ్చి పాలుత్రాపి, పడకమీద చక్కగ పరుండబెట్టి, పైన గుడ్డకప్పి, 'బిడ్డా! నిద్రపొమ్ము' అని అల్లన జోలపాట పాడింది.

తరువాత నందుడు మొదలైన గోపకులు మధురనుండి వచ్చి, పూతన కళేబరాన్ని చూచి, ఆశ్చర్యపడి, 'వసుదేవుడు ముందే రానున్న ప్రమాద చిహ్నాలు తెలుసుకొని మనల్ని హెచ్చరించాడు. అతడు మహాయోగి' అని పొగడి, ఎంతో కఠినమైన ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్ళతో నరికి, తమ యిండ్లకు దూరంగా చండ్రకట్టెలు పేర్చి దహించారు.

పరీక్షిన్మహారాజా! పూతన దేహమందలి కల్మషాలను బాలకృష్ణుడు ఆమె చనుబాలతో పాటు పీల్చివేసినందున, మిక్కిలి రాజుకొంటూ కాలుతున్న ఆమె శరీరంనుండి సుగంధపు సువాసనల పొగలు వెలువడినాయి.

శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడు, తన శరీరంమీద కాళ్ళు, చేతులు ఆడిస్తూ, చనుబాలు త్రాగుతూ, బాగా స్పృశించిన కారణంగా, ఆ రాక్షస స్త్రీ పూతన పాపాలు తొలగి, శ్రీకృష్ణునితల్లి పొందదగిన ఉన్నతోన్నత స్థానమైన పరమపదాన్ని పొందింది.

విష్ణుమూర్తికి ఒక్కసారి విషంతో కూడిన చనుబాలిచ్చిన పసిపిల్లల హంతకురాలే స్వర్గానికి వెళ్ళితే, విష్ణుమూర్తిని కని, చనుబాలిచ్చి పెంచి పెద్దచేసిన తల్లి యశోదమ్మకు మరొకజన్మ ఉంటుందా? ఆమెకు మోక్షమే ప్రాప్తిస్తుంది కదా!

శ్రీకృష్ణుని కొడుకుగా కని చనుబాలిచ్చిన స్త్రీలు దేవకీ యశోదలవంటివారు, పొందే మహోన్నతపదం ఇట్టిది అట్టిది అని చెప్పటం సాధ్యమా? ఆ హరికి త్రాగుటకు పాలిచ్చిన ఆవులు కూడ మోక్షాన్ని తప్పక పొందుతాయి.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ పూతనదేహం కాలుతుండగా అందుండి వెలువడిన సువాసనను పీల్చుతూ, అంతటి దుర్మార్గురాలి శరీరంనుండి ఇంతటిమంచి వాసన రావటమా! అని అందరు ఆశ్చర్యంగా అనుకుంటూ తమతమ పల్లెలకు వెళ్ళారు.

ఆ తరువాత నందుడు పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళి, గోపకాంతలవల్ల ఆ రక్కసి చేసిన పనులన్నీ తెలుసుకొని, ఆశ్చర్యపడి, బాలకృష్ణుణ్ణి మేల్కొల్పి, తలను మూర్కొని, ముద్దాడి సంతోషంతో ఉండినాడని శుకమహర్షి చెప్పగా విని, పరీక్షిన్మహారాజు ఈ విధంగా అన్నాడు.

సర్వేశ్వరుడైన విష్ణుమూర్తి ఏ యే అవతారాల్లో ఏ యే పనులు చేశాడో, శుభాలకు నిలయాలైన వాటినన్నింటిని వింటూ ఉంటే, మనస్సు వాటిల్ని వదలిపోదు, చెవులకు అవి పండువులుగా ఆనందం కలిగిస్తాయి.

బాలకృష్ణుణ్ణి తలంచడాలు సంసార మహాసముద్రాన్ని దాటించే ఓడలు. అవి పాపసమూహాల్ని నశింపచేసే సాధనాలు. సంపదలను సమకూర్చే ఉపాయాలు. ముక్తిని ప్రసాదించే మంచిఆభరణాలు.

అని శ్రీకృష్ణునిసంస్మరణలవల్ల కలిగే ఫలాలు విన్న పరీక్షిత్తుడు ఆ తరువాత ఆ బాలకృష్ణుడు ఏమేమి చేశాడో ఆ విశేషాలను నా మీద దయపెట్టి చెప్పండని పరీక్షిన్మహారాజు అడుగగా, శుకమహర్షి ఈ విధంగా చెప్పాడు.

బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Devaki Vasudeva's Predecessor Story - దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

ఈ విధంగా దేవకీదేవి విన్నవించుకోగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! పూర్వం నీవు స్వాయంభువ మనువుకాలంలో పృశ్ని అనుపేరుగల పరమపతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరు సృష్ట్యాదియందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి, తెగించి, ఎండకు, వానకు, గాలికి, మంచుకు ఓర్చుకొని, ఒంటరిగా, ఆకులలములను భక్షిస్తూ పండ్రెండువేల దివ్యసంవత్సరాలు కఠోరతపస్సు చేశారు. మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి. నా జపంచేసి, నా మీద మనస్సు నిలిపి, నన్నే పూజించారు. నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకొమ్మంటే నా మాయవలన, బిడ్డలు లేరనే బాధతో, అతికష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా, నాకు సాటిరాగల కొడుకు నిమ్మని కోరుకొన్నారు. నేను మెచ్చి, ఆ వరమిచ్చి, పృశ్నిగర్భుడనే పేరుతో మీ కిప్పుడు జన్మించాను. అంతే కాదు

(లోకంలో ధర్మపాలనకొరకు బ్రహ్మ మనువులను సృజించినవాడు. మనువులు పద్నాలుగుమంది. అందులో మొదటివాడు స్వాయంభువుడు.

అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడితమ్ముడిగా మీకు పుట్టాను. అదినా రెండవజన్మ.

మీ కిచ్చిన వరం తప్పకుండ ఇప్పుడు ఈ మూడవజన్మలో మీకిద్దరికి కుమారుణ్ణి అయ్యాను. జరిగిన పూర్వవృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు.

మీరు నన్ను కుమారుడిగా, బ్రహ్మానందస్వరూపుడనైన పరబ్రహ్మంగా భావిస్తూ, నా మీది ప్రేమవల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు. అనీ ఈ విధంగా చెప్పి, జగత్రభువైన శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాఖడ్గాదులను ధరించిన చతుర్చాహు స్వరూపాన్ని వదలి

ఓ పరీక్షిన్మహారాజా! తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్ప లార్పకుండ అట్టె తనను చూస్తూ ఉండగా; మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు. కాలు సేతులు కదలించడం, కన్నులు మూసి తెరవడం, కేవు కేవు మని ఏడవడం మొదలైన వేడుకలను చేశాడు (చూపాడు).

తరువాత వసుదేవుడు సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునివల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలిసికొన్నాడు కాబట్టి

ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవుడు ఆ బిడ్డను పురిటి ఇంటినుంచి దాటించి తీసుకొని పారిపోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందునిభార్య యశోదాదేవికి, యోగమాయాశక్తి కూతురై జన్మించింది.

అదే సమయంలోనే, వసుదేవుడు చంటి బీడ్డడైన శ్రీకృష్ణుని చేతులతో ఎత్తుకొని, ఎదకు అడ్డంగా అదిమిపట్టుకొని, శబ్దం కాకుండ మెల్లగా అడుగులు వేసుకొంటూ, ఒక్క ఊపున కావలివాళ్ల అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకొని, పురిటి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు.

అంత, ఆ స్థలంలో నందునిభార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియని మైకం వ్రేపల్లె ప్రజలనూ, పురిటింటికి కావలియున్న భటులనూ ఆవరించింది.

అప్పుడు వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుణ్లి ఎత్తుకొని శబ్దం కాకుండ, అడుగులను నేలమీద ఆనీ ఆననట్లుగా మోపుతూ బయలుదేరాడు. ఆయనకు సంకెళ్ళుగా ఉన్న ఇనుప గొలుసుల మెలికలు వాటి అంతట అవే ఊడిపోయాయి. మహాపురుషుడైన బాలకృష్ణునికి అడ్డుగా ఉండే తాళాలు వాటి అంతట అవే ఊడిపడగా, తలుపులు వాటి అంతట అవే తెరుచుకొని, మార్గాన్ని సుగమం చేశాయి. వసుదేవుడు తలవాకిటిని, చావళ్ళను దాటగానే, ఆదిశేషుడు తన పడగలను ఆ బాలుడికి పైన ఆచ్చాదనంగా కప్పి కాపాడుకొంటూ వెంటరాగా, ఆయన నడువసాగాడు. ఆ సమయంలో

పూర్వం శ్రీరామునికి సముద్రం త్రోవ ఇచ్చినట్లుగానే, స్పష్టంగా కన్పిస్తూ, మిక్కిలి పొడవైన అలలతో నేలను, దిక్కులను, నింగిని ఆక్రమించిన యమునానది ఆ వసుదేవునికి మార్గమిచ్చింది.

ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటివెళ్ళి, నందుని వ్రేపల్లేలో ప్రవేశించి, గాఢనిద్రలో ఉన్న ఆ పల్లెవాసులైన గొల్లల్ని మేల్కొల్పుటకు ఇష్టపడక, ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవిపడకమీద నల్లని ఈ చిన్నబాలుణ్ణి పడుకో పెట్టాడు. త్వర త్వరగా యశోదాదేవికూతురిని ఎత్తుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన యింటికి వచ్చాడు. ఆ పాపను దేవకీదేవి ప్రక్కన పడుకోపెట్టాడు.

(వసుదేవుడు తనయింటికి తిరిగి రావటం అంటే, మధురలో కంసుడు అతణ్ణి బంధించిన కారాగారానికి తిరిగి రావటమే.)

శూరసుతుడైన వసుదేవుడు కాళ్ళకు ఇదివరకున్నట్లుగానే సంకెళ్ళను తగించుకొని, మనస్సులో కలతపడుతూ ఏమీ తెలియనివానివలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! పద్మంవంటి కన్నులుగల యశోదాదేవి, వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుణ్ణి తేవడం గానీ, తన బిడ్డను తీసుకొని పోవడంగానీ తెలియక గాఢనిద్రలో మైమరచి ఉండింది.

తరువాత ఆ బాలిక ఆవుర మని ఏడ్చింది. ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్రలేచారు. అటు ఇటు తిరిగి చూచారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తరువాత సరాసరి కంసునిదగ్గరకు వెళ్లారు. దేవకీదేవి ప్రసవించింది వెంటనే రండని అన్నారు. కంసుడు తొట్రుపాటుతో పడకమీది నుండి లేచాడు. భయంతో కంపింపసాగాడు. ముడిచిన అతని వెండ్రుకలు చెదరిపోయాయి. పైనున్న ఉత్తరీయం జారిపోయింది. ధైర్యం సడలిపోయింది. కోపాగ్ని ఎగసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన ఇంటికి వచ్చి ఆ ఆడబిడ్డను చంపాలని దగ్గరకి వచ్చేసరికి

అంతటిలోనే దేవకిదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది.

అన్నా! శాంతించు మన్నా! వీడు నీ మేనల్లుడు కాడు. నీ మేనకోడలు. ఆడపిల్ల. దీన్ని ఆదరించు. స్త్రీని చంపటం రాజధర్మం కాదు. మంచిపేరు తెచ్చుకో. మహాత్ములు నడిచే మార్గంలో నడువు. నేను నీ తోడబుట్టినదాన్ని కదా. నిన్ను శరణు వేడుతున్నానన్నా!

(అన్నా! ఆకాశవాణి మాటప్రకారం అష్టమసంతానం, కొడుకైతే నీకు ప్రమాదకారి అవుతాడేమో కాని, ఇది ఆడపిల్ల! నిన్నేమి చేయగలదు - అందువల్ల చంపవద్దు అని దేవకీదేవి ప్రార్ధన.)

అన్నా! ఆరుగురు కొడుకులను చంపావు. ఇది ఆడుబీడ్డ. నీకు మేనకోడలు. తప్పనిసరి అన్నట్లు ఈ పాపనుకూడా చంపాల్నా! అన్నా! నీవు కఠినాత్ముడివి. అన్నా! నీవు దయచూపరాదా!

నా కొడుకు గదా, నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణివల్ల విన్నావు. అందువల్ల పుట్టింది కొడుకైతే నీవు చంపవచ్చు. కాని, ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ. నేను కొడుకులకు నోచుకోలేదు. ఈ కూతురినైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో.

దేవకీదేవి ఆ విధంగ పలికి, పైటను సవరించుకొని, ఏదేదో మాట్లాడుతూ భ్రాంతికి లోనై తన కూతురిని త్వరత్వరగ ఎత్తుకొని ఎదకు ఒత్తుకొంటూ, తన చెక్కిలిని ఆ పాప చెక్కిలికి ఆనించి భయంతో కంపిస్తూ తటాలున తన పైటచెరగుతో ఆ బిడ్డను కప్పివేసింది. బావురుమని ఏడ్చింది. అప్పుడు కంసుడు అతిశయించిన కోపంతో ఔచిత్యాన్ని వదలి, తోబుట్టువని కూడా చూడకుండా దేవకీదేవిని తిట్టి, కెవ్వుమని ఏడుస్తున్న ఆ పసిపాపకాళ్ళు రెండూ ఎగసి పట్టుకొని లాగి నేలమీద ఎత్తి కొట్టాడు. కాని, ఆ పాప నేలమీద పడలేదు. అవలీలగా పై కగిరింది. దేవలోక పుష్పమాలల పరిమళాలతో, కిరీటంతో, మణిహారాలతో, దివ్యాంబరాలతో అలంకృత అయి మనోహరంగా అగుపించింది. గద, శంఖ, చక్ర, పద్మ, బాణ, ధనుస్సు, ఖడ్గ, శూలాల్ని ధరించి, ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాదిదేవగణాలూ, విమానసంచారులూ కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తుండగా, అప్సరసల ఆటపాటలను మెచ్చుకొంటూ, ఆకాశంలో అగుపించి, కంసునితో కసిగా ఇలా పలికింది.

ఓ దుర్శార్డుడా! పెద్ద తెగింపుతో వెంట వెంటనే దేవకీదేవి బిడ్డల్ని పసిపిల్లల్ని చంపావు. ఇకనైనా శాంతించకుండా, నన్ను బండమీద కొట్టి చంపాలనుకొన్నావు. ఛీ! ఛీ! ఇది కూడా శూరత్వమా? నిన్ను చంపటానికి నాతోపాటు పుట్టిన వీరుడు ఒకచోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు.

అని అంటూ, ఇంకా ఆ యోగమాయాదేవి మహనీయగుణాలు కలిగి, భక్తులకు శుభాలను కల్గిస్తూ, సకలజనులు పూజిస్తుండగా, వివిధ ప్రదేశాల్లో, వివిధనామాలతో దర్శనమిస్తూంది.

ఆ యోగమాయ పలికిన ముచ్చటైన మాటలు ములుకులవలె తన చెవిని సోకగా, కంసుడు అదరిపడి, బెదరిన మనస్సుతో మిక్కిలి ఆశ్చర్యపడి, బాధపడ్డాడు. పిదప దుఃఖీస్తున్న దేవకీ వసుదేవులను రప్పించి, ఆదరంగా, గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు.

సాధుజనులైన దేవకీవసుదేవులారా! నేను పాపాత్ముణ్ణి; పసిపాపల చంపినవాణ్ణి; బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి; చెడుబుద్ధి కలవాణ్ణి; కోపస్వభావం ఉండేవాణ్ణి; బతికికూడా చచ్చినవాడితో సమానమైనవాణ్ణి. బ్రహ్మహత్య చేసినవానివలె మీ బిడ్డలను చంపాను. ఆకాశవాణిమాటలు నమ్మాను. నా పాపాలు ఏకరువుపెట్టక నన్ను దయతో చూడండి. శాంతించండి

జీవులంతా తాము చేసిన కర్మల ననుసరించి, ఒక్కొక్కరు ఒక్కొక విధమైన శరీరంతో జన్మించి, ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. కష్టాలు అనుభవిస్తుంటారు. ఏ జన్మ స్నేహ సంబంధాలను ఆ జన్మతో వదలుకోరు. ఆలాంటప్పుడు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి? వాళ్ళు నాచేత చావడం ఏమిటి? మీరు నన్ను నిందించడం దేనికి?

అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని, లేదా శత్రువులచేత నాశనమయ్యానని అనుకొంటాడు. కాని, ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు. మిత్రత్వ శత్రుత్వాల సంబంధం కర్మబంధంతో ముడివడి ఉంటుంది సుమా!

అని చెప్పి, కంసుడు కన్నీరు కార్చి, దుఃఖించి, భయపడుతూ దేవకీవసుదేవుల పాదాలకు నమస్కరించి, సంకెళ్ళు విప్పించి, ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తప్తుడైన ఆ కంసుణ్ణి చూచి, దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు. తరువాత వసుదేవుడు తనబావ కంసునితో ఇలా అన్నాడు.

బావా! కంసా! నీవు చెప్పినమాట నిజం. అజ్ఞానానికి, భ్రమకు లోనై, ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక - నీవూ, నేనూ అనే భేదభావంతో; లోభ, మోహ, మద, భయ, శత్రుత్వభావాలకు, సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకొంటున్నారు. (ఇది జ్ఞాని లక్షణంకాదు. జ్ఞాని సర్వత్ర సమదర్శనుడు,)

అని ఆ విధంగా ప్రశాంతచిత్తులైన దేవకీవసుదేవుల అనుమతిని పొంది, కంసుడు తన అంతఃపురానికి వెళ్ళి, ఆ రాత్రిగడపి, మరునాటి ఉదయం తనకు పూర్తిగా విధేయులైన మంత్రుల్ని వెంటనే రప్పించి, యోగమాయాదేవివల్ల తాను విన్న వృత్తాంతమంతా ఏకాంతంలో వారికి చెప్పాడు. అది విన్న మంత్రులు కంసునితో ఇలా అన్నారు.

ఓ కంసరాజా! యోగమాయాశక్తి చెప్పింది నిజమైతే, ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో, పల్లెల్లో, గొల్లపల్లెల్లో పుట్టే పిల్లల్ని పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాము.

ప్రభూ! భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనుస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతాధిపతులు ఏమై పోయారో? ఎక్కడ తల దాచుకొన్నారో? (కైలాసంలో) శివుణ్ణి శరణు జొచ్చారో! (సత్యలోకంలో) బ్రహ్మను ఆశ్రయించారో! (వైకుంఠంలో); విష్ణుమూర్తిని సేవిస్తున్నారో! అదీ కాకపోతే మునివృత్తిని స్వీకరించి, అడవుల నడుమ ఉన్నారో! మనం వెంటనే వాళ్లందర్నీ వెదకడం మంచిది.

శత్రువులు దెబ్బతిన్నారులే అని విచ్చలవిడిగా తిరుగ కూడదు. వాళ్ళు అనేకరూపాల్లో మోసగించి దండెత్తి వస్తారు. అందువల్ల శత్రువులు చచ్చేదాకా రాజు వాళ్ళఉనికిని మరువ కూడదు.

విజృంభించిన రోగాల్నీ శత్రువుల్నీ, ఇంద్రియాల్నీ బలపడ నీయకూడదు. అవి పుట్టినపుడే వాటిని అణచి వేయాలి గాని, మెతకదనం వహించకూడదు. ఆ తరువాత వాటిని జయించటం సాధ్యం కాదు.

దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీమహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. ఆవులు, బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శ్రద్ధ, శాంతి - ఇవి విష్ణుస్వరూపాలు. వీటి నన్నింటినీ సంహరిస్తే ఆ విష్ణుమూర్తి అంతమౌతాడు.

కనుక, ఓ కంసరాజా! దేవతల్ని హతమార్చ మంటావా? మహర్షుల్ని బెదరింపులతో, అరపులతో యమధర్మరాజు దగ్గరికి పంప మంటావా? దూడలతో కూడా ఆవుల్ని చంప మంటావా? బ్రాహ్మణుల్ని తరిమి వేయమంటావా? వేదాలను ధ్వంసం చేయ మంటావా? భూమిని అణచివేయ మంటావా? ఆజ్ఞాపించి, మమ్మల్ని పంపండి.

కంసుడు ఆ విధంగా చెపుతున్నమంత్రులఆలోచనలకు లొంగినవాడై, బ్రాహ్మణుల్ని హింసించడం మంచిది కాదని యెంచక, కాలమనే పాశానికి బద్దుడై బ్రాహ్మణులు మొదలైన సజ్జనుల నందరిని చంపటానికి రాక్షసుల్ని పంపించి, తన అంతఃపురానికి వెళ్ళాడు. తరువాత ఆ రాక్షసులు క్రూరంగా మాట్లాడుతూ సజ్జనుల్ని వెంటాడి, బెదిరించి, గర్జించి, వేయించి, అనేక దుష్టచేష్టలతోవాళ్ళను హింసించడంలో విజయం సాధించారు. పాపాలు మూటగట్టుకొన్నారు.

రాక్షసవీరులు వెదకి వెదకి సజ్జనుల్ని అణచివేయగా, ఆ రాక్షసుల శక్తులుకూడా అణగిపోయాయి. సాధువుల్ని బాధిస్తే కీర్తి సంపద, ధర్మం, ఆయుస్సు, క్షేమం అన్నీ నశిస్తాయి కదా!

తరువాత వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకొని, మహానందభరితుడై సమర్ధులైన వేదపండితుల్ని రావించి, తాను స్నానంచేసి పరిశుద్దుడై, చక్కగా అలంకరించుకొని, స్వస్తివాచక పుణ్యాహవచన మంత్రాలను చదివించి, వేదవిహితజాతకర్మలు చేయించి, పితృదేవతలను పూజించి, అలంకరించిన రెండులక్షల పాడిఆవుల్ని దూడలతోకూడ బ్రాహ్మణుల కిచ్చాడు. అంతేకాదు - బంగారుకలశాల్నీ మణుల్నీ వస్త్రాల్నీ కొండలవంటి ఏడునువ్వల రాసుల్నీ బ్రాహ్మణులకు దానం చేయగా

పుట్టిన బిడ్డకు నందుడు జాతకర్మాది వైదిక కార్యక్రమాలు జరిపించి, బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలిచ్చిన తరువాత, ఆ బ్రాహ్మణులందరూ, ఈ నందగోపుని కుమారుడు ఐశ్వర్యవంతుడు, శత్రువీరులను జయించేవాడు, పూర్ణాయువు కలిగినవాడు అవుతాడని ఆశీర్వదించారు.

నగారాలు మ్రోగాయి. గాయకులు పాడారు. సూతులు, వందిజనులు కీర్తించారు. మంగళకరాలైన బాకాల ధ్వనులు ముమ్మరంగా వినిపించాయి.

యాదవనాయకుల ఇళ్ళవాకిళ్ళన్నీ చిగురుటాకుల తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తెన జెండాలతో, పరిమళ ధూపాల సువాసనలతో చూడముచ్చటగా ప్రకాశించాయి.

ఓ పరీక్షిన్మహారాజా! మందల్లోని ఆవులకు పసుపు, కుంకుమ, నూనె పూయగా అవి మెరుగైన కాంతితో బంగారు నెమళ్ళ పింఛాల కాంతివంటి కాంతిగల పసిమిరంగుతో ప్రకాశిస్తూ తిరుగాడాయి.

బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగు చెంగున గంతులేశాయి. మదించిన వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు పొదుగులనుండి పాలు వర్షించాయి. (అనగా వ్రేపల్లెలో పశువులు కూడా ఆనందంతో పరవశించాయి.)

నందరాజు పుత్రుడు పుట్టినాడనే ఆనందంతో వేదమంత్రాలు, పురాణాలు చదివే బ్రాహ్మణులకు, స్తోత్రాలు చేసే వందిమాగధులకు, ఇంద్రజాలాలు, గారడీలు, పగటివేషాలు మొదలైన విద్యలతో బ్రతికేవారికి, దారిద్యంతో బాధపడేవారికి, వాళ్ళు కోరకముందే గోవులను, ధనరాసులను దానమిచ్చాడు.

శ్రీకృష్ణుడు పుట్టిన ఆ వేళలో, గోపకులందరు అంగీలు తొడుగుకొని, తలపాగాలు చుట్టుకొని, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి ప్రకాశిస్తూ, మంచి పదార్థాలు కానుకలుగా తీసుకొని బాలకృష్ణుణ్ణి చూడడానికై వచ్చారు.

వ్రేపల్లెలోని గొల్లలంతా వచ్చి, బాలకృష్ణుని చూచి, సంతోషంతో చెలరేగి, సరసాలాడుకొంటూ నేతులతో, పెరుగులతో, పాలతో, నీళ్ళతో, వెన్నతో ప్రియమార వసంతా లాడుకొన్నారు.

ఆ తర్వాత, ఓ అమ్మలారా! ఏ నోము నోచిన ఫలమో గాని ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం. మన యశోదమ్మ ఒక చిన్ని మగబిడ్డను కనిందట! వెళ్ళి చూచి వస్తా రండి.

ఆ విధంగా గోపికలు అనుకొని, ఒకరినొకరు పిలుచుకొని చిన్ని కృష్ణుని చూడాలనే తహ తహ త్వర పెట్టగా, లెస్సగా అలంకరించుకొని తమ యిండ్ల నుండి బయలుదేరి

మెల్లని నడకలతో, పెద్దపిరుదులతో, సన్ననినడుములతో, లావుగ, బిగువుగా ఉన్న చన్నులతో; విశాలమైన నేత్రాలతో; లక్ష్మీకూడా తడబడే కళలతో కూడుకొన్న ముఖాలతో; తుమ్మెదలవంటి నల్లని వెంట్రుకల కొప్పులతో ఒప్పుగా

గోపస్త్రీలందరు సంతోషంతో వడివడిగా తమ కొప్పులముడులు వీడగా, రొమ్ములమీది హారాలవరుసలు అటూ ఇటూ ఊగిసలాడగా, చెక్కిళ్ళమీది బంగారుమకరికాపత్రాలకాంతులు వేడుక చేయగా, పైటకొంగులు కదలాడగా - అందరు ఒకటిగా చేరి, యశోదయింటికి వెళ్లి జయశీలుడు, సర్వవ్యాపకుడు అయిన చిన్నికృష్ణుణ్ణి వరుసగా చూచారు.

గోపికలు చిన్ని కృష్ణుని చూచి, ఎంతో సంతోషించి, తాము తెచ్చిన కానుకలు ఇచ్చి

ఆ గోపస్త్రీలందరు బాలకృష్ణుడికి నూనెతో తల అంటి, శరీరానికి పసుపు పూసి, స్నానం చేయించారు, శ్రీహరి నీకు రక్షపో! అని అంటూ చుట్టూరా కొన్ని నీళ్లు పడునట్లు చల్లి, రక్ష పెట్టి, ఉయ్యాలలో పడుకో పెట్టి, ఆశీర్వదిస్తూ జోలపాటలు పాడారు.

జో!జో! తామరరేకువంటి కన్నులు కల ఓ కృష్ణా నిద్రపోవయ్యా! సింహం నడుంవంటి నడుంగల కృష్ణయ్యా జో జో! చిగురుటాకులవల మృదువైన చేతులు, పాదాలు వున్న కన్నయ్యా జో జో! నిండు చందురునివలె నిండైన ముఖంతోవున్న కృష్ణా జో జో అంటూ జోకొడతాము నిద్రించవయ్యా కృష్ణా!

('జో' అంటే - పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మెల్లగా అరచేతితో వీపుమీద తడుతూ చెప్పే పదం - నిద్రించు అని తాత్పర్యం. 'జో, జో' అనేది 'జో' శబ్దంయొక్క ఆమ్రేడితం (రెండుమార్లు వచ్చిన పదం,)

అంటూ ఇలా జోలపాట పాడుతుండగా, పెక్కుమార్లు ప్రళయకాల సముద్రజలాల్లో ముంచి, ప్రకాశించే ఆ బహురూపధారి, కృష్ణుడు ఇప్పుడు గోపస్త్రీల చేతుల నుండి పోసే నీళ్ళలో సంతోషంగా తడుస్తున్నాడు (స్నానం చేస్తున్నాడు).

(ప్రళయకాలంలో “వట పత్రశాయి” అయిన ఈ తోయగాడు, ఒకప్పుడు మహామత్స్యంగా, మరొకప్పుడు కూర్మంగాను, ఇంకొకప్పుడు ఆదివరాహంగాను ఇలా వివిధరూపాల్లో జలాల్లో సంచరించిన వీడు, ప్రస్తుతం గోపికలు నీళ్లు పోస్తుండగా కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నాడట - చిన్ని కృష్ణుడు. అంటే నీళ్ళలో (నారములు) తిరుగాడడం, మునగడం 'ఈ తోయగాడికి కొత్తేమీ కాదు'. అని విశేషాంశం.)

లోకాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుతూ, తానుమాత్రం మెలకువగా ఉండే అందగాడు, గోపికలు జోకొట్టుతూ ఉంటే నిద్రపోయిన వానివలె కళ్ళు మూసికొని కదలకుండా పడుకున్నాడు.

పుట్టుకే లేని పరమాత్మ ఇప్పుడొక గొల్లయింట్లో పుట్టాడు. ఏ కర్మలూ ఎరుగనిఒంటరికి ఇప్పుడు జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి చనుబాలూ త్రావని గడుసరి ఇప్పుడు యశోదచనుబాలరుచి మరిగాడు. ఏ హాని వృద్ధులు లేని పరమాత్మ ఇప్పుడు యశోదపొత్తిళ్ళలో వృద్ధి పొందుతున్నాడు. ఏ తపస్సులకూ పండనిపంట ఇప్పుడు గోపకాంతుల వీథిలో పండాడు. ఏ విద్యలవల్లా ఇట్టిదిట్టిదని చెప్పసాధ్యం కాని అర్ధం, ఇప్పుడు ఈ బాలకృష్ణునిఅందమైన అవయవాల్లో అగుపిస్తూ ఉంది.

(పరమాత్మకు ఏ రూప, గుణ, వికారాలుగాని, కర్మలు గాని, సంబంధ బాంధవ్యాలు గాని ఉండవు. కానీ ఒక కార్యార్థమై అవతరించినపుడు రూపగుణాలు ఏర్పడతాయి.)

చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలె, సంతోషం నిండినచూపులతో నవ్వేటప్పుడు విష్ణుమూర్తివలె; రోషంతో ఉన్నప్పుడు రుద్రునివలె, ఆనందతన్మయత్వంలో ఉన్నప్పుడు పరబ్రహ్మవలె కన్పిస్తున్నాడు.

(పరమాత్మ మనం అనుకొనే బ్రహ్మ కాదు; విష్ణువు కాదు; శివుడు కాదు. ఆయన ఈ త్రిమూర్తులకు అతీతుడైన తేజోమయుడు; విశ్వచైతన్యస్వరూపుడు.)

ఇలా ఉండే ఆ సమయంలో, నందుడు తనకు కొడుకు పుట్టాడన్న సంతోషాతిశయంలో రోహిణీదేవిని పిలిపించి, ఆమె తృప్తి చెందేటట్లు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు.

శ్రీకృష్ణుడు జన్మించింది మొదలు ఆలమందలు పొదుగులనిండ పాలతో కనువిందు చేశాయి. నందుడు వ్రేపల్లె రక్షణకు దక్షులైన పెక్కుమంది గోపకులను నియమించాడు. తరువాత మథురకు వెళ్ళి ప్రతిసంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంసునికి అర్పించి, అతని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి, తగురీతిగ వసుదేవుని దర్శించి,

వసుదేవుడు నందుణ్ణి చూడగానే ప్రాణంలేని శరీరానికి ప్రాణం వచ్చినట్లు ఉత్సాహవంతుడై, ఆనందబాష్పాలు కనుకొలకులు నిండగా, చేతులు చాచి కౌగిలించుకొన్నాడు.

వసుదేవుడు మరొకసారి నందుజణ్ణి కౌగిలించుకొని, సుఖంగా అతణ్ణి కూర్చుండపెట్టి, తన కుమారుడైన బాలకృష్ణుని మీది ప్రేమ ప్రకటమయ్యేటట్టుగా ఆయనతో ఇలా అన్నాడు.

సంతానం లేదని ఇదివరలో ఎంతో చింతిస్తూ, ముసలితనం మీదపడిన ఇప్పుడు నీకు సంతతి కలగడం చాల అదృష్టం. సంతానం లేనివారికి సుఖాలు ఉండవు కదా.

ఓ నందుడా! నిన్ను చూచాను కనుక బ్రతికాను. ఇకమీద నాకు కష్టాలుండవు. చేసే పనులలో ఏవిధమైన అరమరికలు లేని ఒక మంచిమిత్రుణ్ణి చూడటం, చచ్చి, మళ్ళీ పుట్టడమే కదా!

జీవితంలో అనేకవిధాలైన కష్టాలుపడే మానవులంతా ఈ నేలమీద ఒకేచోట ఉండటం వీలు పడుతుందా? నదీప్రవాహాల్లో పడి కలిసి వెళ్ళే మ్రాకులు విడివడకుండా ఉంటాయా? వేర్వేరు మార్గాల్లో వెళ్ళకుండా ఉంటాయా?

'నందరాజా! గోవులు వివిధరోగాలకు గురి కాకుండా ఉన్నాయి కదా? పాడిఆవులు పుష్కలంగా పాలు ఇస్తున్నాయి కదా? గుంటల్లో, వాగుల్లో నీళ్ళు నిండి ఉన్నాయి కదా? ఆలమందలు ఉండే ప్రదేశాల్లో పులులు, దుప్పులు తిరుగాడటం లేదు కదా? గొల్లపల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి గదా? ఆ పల్లెల ప్రక్కనున్న అడవుల్లో పచ్చగడ్డి మెండుగా ఉందికదా? అని వసుదేవుడు అనేక కుశల ప్రశ్నలడిగాడు.

తన కొడుకులను, స్నేహితులను, తనకు ముఖ్యులైనవారిని తృప్తిపరచకుండా, వారిబాగోగులు చూడకుండా, వారు అంతకంతకు క్షీణించి నశిస్తుంటే-తాను బాగా బ్రతుకుతూ గృహస్థాశ్రమంలో ఉండేవాడికి ఏ విధమైన సంతోషమైనా ఉంటుందా?

నందా! నీవు, నీ భార్య ప్రేమతో చూస్తుండగా, నిన్ను తండ్రిగా చూస్తూ, వ్రేపల్లెలో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా?

అని వసుదేవుడు పలుకగా, దానికి నందుడు ఇట్లన్నాడు.

ఇదివరలో నీకూ, దేవకీదేవికీ పుట్టిన కొడుకులందరినీ, వెంటవెంటనే కంసుడు వధించాడు. చివరకు మీ కుమార్తెను కూడా చంపబోగా, ఆ బాలిక అతని చేతినుండి తప్పించుకొని, ఆకాశాని కెగిరిపోయింది. విధివశాన ఆపద ఏర్పడినపుడు వివేకవంతుడు దుఃఖించ వచ్చునా? వసుదేవా! ఊరట చెందు. నా కొడుకునే నీ కొడుకని అనుకో.

అని పలికిన నందమహారాజుతో, వసుదేవుడు మళ్లీ ఈ విధంగా అన్నాడు.

ఓ నందరాజా! కంసునికి కప్పం కట్టావు. మమ్మల్ని చూడటానికి వచ్చావు. మేముకూడా మిమ్మల్ని చూచాం. చాల సంతోషం. వ్రేపల్లెలో ఉపద్రవాలు కలిగే సూచనలు కన్పిస్తున్నాయి. వాటిల్ని ముందు జాగ్రత్తతో ఎదుర్కోవాలి. నీ విక వెళ్ళు.

కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Thursday, April 2, 2026

Devaki Devi Stuti to Lord Vishnu - దేవకీదేవి స్వామిని స్తుతించుట

దేవకీదేవి స్వామిని స్తుతించుట

ఈ విధంగా పుట్టిన బిడ్డతో వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవికూడా, మహాపురుషలక్షణాలు కలవాడు, గొప్ప సదసద్వివేకజ్ఞానం కలవాడు, మిగుల కోమలమైన దేహం కలవాడు అయిన తన కుమారుణ్ణి చూచి, కంసునిభయంతో స్వచ్చమైన ఒక నవ్వునవ్వుతూ ఈ విధంగా అనింది.

అటువంటి, ఇటువంటిది అని వివరించటానికి సాధ్యం కానిది, సమస్తానికి మూలమై ఉండేదీ, సర్వత్ర వ్యాపించింది, ప్రకాశిస్తూ ఉండేదీ, త్రిగుణాలలో ఏ గుణమూ లేనిది, ఒకే విధమైంది, సత్యమైంది. తాను తప్ప మరేదీ లేనిది, కర్మలు లేనిది, వాక్కుకు అందనిది అయిన ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడు చెపుతున్నాయో ఆ రూపాని వౌతూ, ఆత్మజ్ఞానానికి దీపానివై, బ్రహ్మదేవుని ఆయుస్సులో రెండవసగభాగం పూర్తి అయిన తరువాత, లోకాలు నశించినవేళ, పంచమహాభూతాలు సూక్ష్మభూతంలో కలిసిపోగా, ఆ సూక్ష్మభూతం మూలప్రకృతిలో, మూలప్రకృతి వ్యక్తతత్త్వంలో లీనంకాగా, చివరకు ఆ వ్యక్తతత్త్వం కూడా లయం కాగా - శేషసంజ్ఞచేత స్వయంజ్యోతివై సుందర స్వరూపమై ఉంటావు.

(దేవకీదేవి తనకు జన్మించిన కుమారుణ్ణి మానవమాత్రునిగ కాకుండా పరమాత్మునిగానే భావించి, పరమాత్మతత్త్వాన్ని తలచుకొంటూ చేసిన స్తోత్రం ఇది. పరమాత్మ “సత్యం, శివం, సుందరం” కనుక సర్వమూ లయించినా ఆయన మాత్రం సత్యశివసుందరాత్మకంగానే ఉంటాడు.)

ఓ మాధవా! నీవు పరిపూర్ణ జ్ఞానస్వరూపుడివే అయినా, ఈ జగత్తును సృష్టి స్థితిలయాలతో విలాసంగా త్రిప్పుతూ ఉంటావు. కనుక, అవిద్య అనే మాయకు నీవు చుట్టానివి. కాలాతీతుడవైన నీకు శాశ్వతమైన కాలమంతా మాయ మాత్రమే. జగన్నాథా! నీవు శుభాలరాశివి. కోరి నిన్నెవ్వడు ఆరాధిస్తాడో అతడు శాశ్వతసంపద గలిగి, మృత్యువును జయించి, సుఖసంతోషాలతో భయం లేనివాడై ఉంటాడు.

(పరమాత్మ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఆలాంటప్పుడు ఆయన అవిద్యకు బంధువు ఎలా అవుతాడు? పరమాత్మ పరిపూర్ణజ్ఞానస్వరూపుడే. కాని, ఈ జగత్తు మాయ. జగత్తే మాయ అయినపుడు సృష్టి స్థితి, లయాలు కూడ మాయయే! మాయయే అవిద్య. ఈ మాయామేయ జగత్తును సృజించి, దాన్ని పోషించి, లయం చేస్తున్నప్పుడు పరమాత్మ అవిద్యకు చుట్టమౌతాడు కదా!)

ఓ పద్మనయనా! పురాతనులైన మహాయోగులు (సనక సనందనాదులు) యోగమార్గంలో అత్యంతదీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి, ఇప్పుడు అగుపిస్తున్న నీ దివ్యరూపాన్ని చూచామంటారు గానీ; నిజంగా వారు చూచి ఉండరు. ఇప్పుడు నేను చూచాను. శుభాన్ని పొందాను. ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను. అనాది అయిన నీ దివ్యస్వరూపాన్ని ఉపసంహరించుకో. నమస్కరిస్తున్నాను.

ఓ పురుషోత్తమా! ప్రళయకాలంలో ఈ జగత్తునంతా ఎంతో పెద్దదైన కడుపులో దాచుకొనే గొప్పనటుడివి నీవు. ఆలాంటి నీవు, ఇప్పుడు నా కడుపున పుట్టడం ఒక పెద్దమాయే కదా!

తామరులవంటి కన్నులు కలవాడా! నీవు నాకు తప్పక జన్మిస్తావని ఆ దుర్మార్గుడైన కంసుడు చాలకాలంగా నన్నూ నీ తండ్రినీ, ఈ చెరసాలలో బంధించి ఉంచాడు. ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి, మమ్మల్ని కాపాడు. నేను నోచిన నోములన్నీ ఏ కొరత లేకుండా నీ రూపంలో ఫలించాయి.

దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...