Friday, April 3, 2026

Sri Krishna and Balarama’s childhood Plays Discription - శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

శ్రీ కృష్ణబలరాముల బాల్యక్రీడాభివర్ణనము

బలరాముడు, శ్రీకృష్ణుడు బాల్య క్రీడలతో అందరినీ ఆనందపరుస్తున్నారు. పిల్లలు వచ్చీ రాని అడుగులు వేసుకుంటూ మోకాళ్లపై వచ్చి పడిపోతూ, మళ్లీ లేస్తూ అటూ ఇటూ తిరగడం, తల్లులపైటలు లాగిపట్టుకుని ఉయ్యాలలూగడం, ఆవుదూడలతోకలు పట్టుకొని అవి ముందుకు పరుగిడడంతో తోకలు వదలలేక వాటితోపాటు వీళ్లూ పరుగెత్తడం, అలా పరుగెత్తి బురదలో పడడం, తల్లులు ఎత్తుకొని చనుబాలిస్తున్నప్పుడు రెండుచేతులతో పాలిండ్లను తడుముతూ, మూతితో పొడుస్తూ, పాలు ఎక్కువగా చేపడంతో గుక్క గుక్కకూ తాగడం, వచ్చీ రాని ముద్దు మాటలాడుతూ చేతులను, పాదాలను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకోవడం - ఇవన్నీ అంతటా చిన్న పిల్లలు చేసే చేష్టలే. బలరామకృష్ణులు కూడా అలాగే బాల్యచేష్టలుచేస్తూ చూసేవారికి ఆనందం కలిగిస్తున్నారు.

ఇలా వ్రేపల్లెలో బలరామశ్రీకృష్ణులు బాల్యచేష్టలు చేస్తూవుంటే పై లోకంలో వున్న రంభ ఊర్వశి మొదలగు అప్సరసలు ఆ బాలురచేష్టలకు ముచ్చటపడి వారూ తమకిష్టమైన నృత్యం చేయడం ప్రారంభించారు. ఇక శత్రువులు అప్పటికే పూతనాది రాక్షససంహారం చేసిన బాలునిగా శ్రీకృష్ణుణ్ణి గురించి వినడంవల్ల భయంతో తడబడ్డారు. మహర్షులు దుష్టశిక్షణం, శిష్టరక్షణం జరిగే సమయం ప్రారంభమయిందన్న సంతోషంతో వాళ్లలో వాళ్లు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు.

చిన్నపిల్లలు బోర్లాపడుకొని తలలు పైకి నిలుపుతారు. అలా రామకృష్ణులు తలలు పైకెత్తి ఆదే సమయంలో ఆదిశేషుడు మొదలైన సర్పరాజులు పడగలెత్తినట్లు ఉన్నారు. ఏనుగులకు ఒంటిపై మట్టి జల్లుకోవడం సరదా. దానిని 'వప్రకీడ' అంటారు. అలాగే ఈ బాలురు శరీరానికి బురద అంటించుకోగా ఒళ్ళంతా మట్టి జల్లుకున్న పిల్లఏనుగుల్లా కనబడుతున్నారు. ఉత్సాహంతో ముందుకు ఉరుకుతూఉంటే సింహంపిల్లలు దూకుతున్న శోభను వహిస్తున్నారు. రోజు రోజుకూ ముఖకాంతులు పెరుగుతూవుంటే ఉదయిస్తున్న బాలసూర్యచంద్రులవలె ప్రకాశిస్తున్నారు. తల్లుల చనుబాలు తాగుతూ జోగుతూవుంటే ఎంతో సాధనచేసి మోక్షానందమనే అమృతం గ్రోలి పరవశిస్తున్న యోగీశ్వరులవలె ముచ్చట గొలుపుతున్నారు. ఇలా చూచే జనులందరికీ ఒక్కొక్కసమయంలో వారిచేష్టలనుబట్టి ఆయా రూపాలుగా రామకృష్ణులు కనబడుతూ చూపరులకు ఆనందం కలిగిస్తున్నారు.

తనవైపు చూడనివారిని ఎప్పుడూ తాను చూడకుండా, తనచూపులతో ముల్లోకాలనూ తిరిగేటట్లు చూచే ఆ బాలకృష్ణుడు తనను చూస్తున్నవారిని క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. (ఇక్కడి నుండి కేవలం బాలకృష్ణుని రూపాన్ని చేష్టలను వర్ణిస్తున్నాడు పోతన. ఒక వైపు పరమాత్మతత్త్వం, ఒక వైపు సామాన్య బాలకుల లక్షణాన్ని చూపుతున్నాడు. విష్ణువు తన నెవరైతే భావిస్తారో వాళ్లకు సులభుడు. అలా కానివారికి ఆయన కానరాడు)

బాలకృష్ణుడు లీలామానుష విగ్రహుడు. ఆయన నవ్వితే జ్ఞానం ప్రకాశించి, అజ్ఞానం పటాపంచలైపోతుంది. అట్టి బాలకుడు తన వద్దకు వచ్చి నవ్వుతున్న ముఖాలుగల గోపకాంతల్ని చూచి తానూ నవ్వసాగాడు.

త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు గనుక “అమ్మ” అంటూ ఆయన కెవరూ లేరు. ఆ పరమపురుషు డిప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్లు “అమ్మా” “అమ్మా” అని పిలవడం నేర్చుకున్నాడు.

సహస్రాక్షుడైన పరమాత్ముడు సహస్రపాదుడు కూడా. అట్టివేయి అడుగుల శ్రీమహావిష్ణువు వామనావతారంలో ఒక అడుగుతో భూలోకాన్ని మరో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అతడే బాలకృష్ణుడై అడుగులు వేయటం ప్రారంభించడంతో, వామనునిమూడవపాదంతో బలి పాతాళానికేగినట్లు ఇప్పుడు శత్రువులు కూడా నేలకూలి పాతాళానికి వెళ్తున్నారు.

అంతేకాదు, బాలకృష్ణునిఒంటికి పట్టిన దుమ్ముతోపాటు, పెట్టిన అలంకారాలు అన్నీ అతనిలో శివస్వరూపాన్నికూడా స్పురింపజేస్తున్నాయి. శరీరాని కంటిన నేలధూళి శివునిశరీరంపై నిండిన విభూతిలాగా తల్లి బాలుని ముంగురులెత్తి పట్టి ఓ ముత్యాలహారాన్ని చుట్టగా, అది శివుని బాలచంద్రరేఖరూపం దాల్చగా, నుదుట పెట్టిన ఎర్రనితిలకం మన్మథుణ్ణి బూడిద చేసిన శివుని చిచ్చర కన్నులా ఉండగా; మెడలోనిహారం మధ్యలో నల్లగా ప్రకాశించే నాయకమణిగా వెలుగొందే నీలం శివునికంఠంమీది హాలాహలంమచ్చవలె కనబడగా; మెడలోని హారాలు శివుని సర్పభూషణాలుగా ప్రకాశించగా; బాలునిరూపంలో ఉన్న ఆ విష్ణుస్వరూపుడైన బాలుడు (కృష్ణుడు) తనకూ శివునికీ భేదం లేదని తెలియజేస్తున్నాడా అన్నట్లు శివస్వరూపంతో ప్రకాశించాడు.

బలరామకృష్ణుల విలాసచేష్టలను చూస్తూవుంటే ఆ గోపకాంతలకు ఎంతమధురంగా అనిపిస్తోందో! అందుకే ఏ రకమైన భయం, సంకోచం లేకుండా చేయవలసిన పనులన్నీ మరచి కేవలం ఆ బాలురనే చూస్తూ ఉండిపోయారు.

అప్పుడు బలరామకృష్ణుల తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలురను పెంచుతూ వచ్చారు. గోళ్ళు, కోరలు, కొమ్ములు, ఉన్న జంతువులనుండి, నీళ్ళు, నిప్పు, ముళ్ళు మొదలైన వానినుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఆయా ఋతువులకు తగినవిధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకులపై ప్రేమానురాగాలు ఉప్పాంగిపోతూ ఉండగా ఆనందంగా కాలం గడపుతున్నారు. అంతలో

తన వయస్సే కలిగిన గోపాలబాలకులు కృష్ణుణ్ణి తమనాయకుడన్నట్లుగా భావిస్తూ కలసి మెలసి ఆడుకొంటూ ఉన్నారు. బలరామునితో కలసి చిన్నచిన్న అడుగులతో కృష్ణుడు తృప్తి పొందుతున్నాడు. అలా ఆడుతున్న కృష్ణుణ్ణి చూస్తూ గోపకాంతలు ఆనందిస్తూ ఉండగా అతడు నల్లనిశరీరకాంతితో ప్రకాశించాడు.

ఆ బాలకృష్ణుడు రోజురోజుకు ఆ ప్రాంతంలో తిరగడంలోను, మాట్లాడడంలోను సమర్థుడై

అల్లరి చేస్తున్న బాలకృష్ణునితో తల్లి అలా చేయవద్దని బెదిరిస్తే అలకతో దూరంగా పోతాడు. మళ్లీ తల్లి చేయిజాపి నా ముద్దుల బాబు వచ్చాడంటూ ప్రేమతో పిలిస్తే తల్లి దగ్గరకు వచ్చి, హత్తుకొని, మళ్ళీ ఎప్పటిలాగే అల్లరిచేస్తూ, మొలనున్న గంట చక్కగా శబ్దంచేస్తూ ఉంటే ఆనందంతో వచ్చి చిన్ని కృష్ణుడు చనుబాలు తాగుతాడు.

చిన్ని కృష్ణుడు గోపవనితల ఇళ్ళలోని వెన్నంతా మెక్కి ఏమి తెలియనివాడిలా అమ్మదగ్గరికి వచ్చి, అమ్మా! పాలివ్వమంటూ తల్లి చుట్టూ తిరుగుతాడు.

బాలకృష్ణుడు తన చుట్టూవున్న గోపబాలురతో ఆటలాడుతున్నప్పుడు వారితో 'నేను ఆబోతును మీరు ఆవులు' అంటూ పెద్దగా రంకెవేస్తూ, ఆబోతులా వంగి ఆడతాడు. 'నేను రాజును, మీరు సేవకులు. అందరూ ఇలా రండి రండంటూ తన అధికారాన్ని చూపుతూ పనులు పురమాయిస్తాడు. 'మీరు ఇంటివాళ్ళు, నేను దొంగను' అని వాళ్లందరినీ నిద్రపోయేట్లుగా చేసి వాళ్ళనగలు దొంగిలించి దాక్కుంటాడు. 'నేను మీ అందర్నీ నడిపేవాడను, మీరు నేను చెప్పినట్లుగా నడిచేవారం' టూ వారందరినీ ఆటాడిస్తాడు. మూలమూలలకు వెళ్తాడు. దాగుడు మూతలాడతాడు. ఉయ్యాల లూగుతాడు, బంతులతో ఆడతాడు, జారులరూపంతో, దొంగల రూపంతో అంతటా తిరుగుతాడు.

అలా కృష్ణుడు మాయారూపంతో ఉండినబాల్యంలో జారుడులాగా, దొంగలాగా ఆడుతూ ఉంటే గొల్లభామలు అతని ఆగడాలను సహించలేక యశోదతో ఇలా అన్నారు.

గోపికలు శ్రీకృష్ణుని దుడుకు జేతలు యశోదా దేవితో జెప్పుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట...