Friday, April 3, 2026

King Kansa sent the demoness Putana to Vrepalle - కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

వసుదేవుడు ఆ విధంగా చెప్పి నందుడు మొదలైన గోపకులను సాగనంపగా, వారు వడిగా నడువగల ఎద్దులను కట్టిన బండ్లెక్కి అందరు చూస్తూ ఉండగ తమ తమ గ్రామాల త్రోవన వెళ్ళారు. నందుడు తన ముందర చెడు జరిగే సూచనలను స్పష్టంగా చూస్తూ, వసుదేవుడు తనతో చెప్పిన మాటలు తప్పవని అనుకొంటూ, ఆలోచిస్తూ వెళ్ళాడు. తరువాత

పసిబిడ్దల్ని చంపే పూతన అనే రాక్షసి, కంసుని ఆదేశానుసారం పల్లెల్లో, గొల్లపల్లెల్లో, పట్టణాల్లో పసిబిడ్డల్ని చంపుతూ ఎవరి పేరు చెపితే సర్వభయాలు తొలగిపోతాయో, ఆలాంటి రాక్షసాంతకుడు జన్మించి ఉన్న వ్రేపల్లెకు ఒకరోజు ఆకాశమార్గంలో వచ్చింది. మాయతో తాను కోరుకొన్న రూపాన్ని ధరించింది. ఎవ్వరికి అగుపించకుండ ఇల్లిల్లు తిరిగింది. నందుని ఇంట్లో ఒక పసిబిడ్డ చేసే శబ్దం వినింది. చాలా సంతోషించింది. అందమైన స్త్రీ వేషం ధరించి,

చలించే కన్నులతో, మిక్కిలి ఎత్తై మొనదేలిన గుండ్రనిచన్నులతో, మచ్చలేని నిండైన చంద్రునివంటి ముఖంతో, ఉన్నదా లేదా అని బుద్ధికి అందని సన్ననినడుముతో, పెద్ద పిరుదులతో, చిగురుటాకువంటి లేత ఎరుపురంగుగల కాలు సేతులతో; పెద్దకొప్పుతో అందరికీ మోహాన్ని కలిగించే రూపంతో

(కామరూపులైన రాక్షసులు కోరినరూపం ధరిస్తారు. అందుకే పూతన ఇలాంటి రూపాన్ని ధరించింది)

చెవులకు అలంకరించుకొన్న బంగారుకుండలాల కాంతులు చెక్కిళ్ళమీద చిందులాడుతుండగా, జడలో దండిగ అలంకరించుకొన్న మల్లెపూల సువాసనలకు గండుతుమ్మెదలు పైనుండి ముసురుతుండగా, కంకణాల కాంతులు, హారాల వెలుగులు అందంగా అగుపిస్తుండగా, వల్లెవాటుగా మీదవేసుకొన్న పైట కొద్దిగా ప్రక్కలకు జారుతూ ఉండగా, చంద్రునివంటి అందమైన ముఖంతో ఆ పూతన బాలకృష్ణుడుండే నందుని ఇంటికి వెళ్ళింది.

పూతన నందునిఇంటికి వెళ్లిన సమయంలో

పూతన లోపలికి వెళ్ళుతూ ఉంటే గోపికలందరు మాకు గొప్ప బ్రతుకు ప్రసాదించటానికే లక్ష్మీదేవి ఈ అందమైన వేషం ధరించి వచ్చిందేమో అనే, భ్రాంతితో ఏమీ మాట్లాడటానికి నాలుకలు రాక; తదేకదృష్టితో ఆమెను చూస్తూ నిలబడ్డారు. అందమైనరూపంతో ఆ పూతన లోనికి వెళ్ళి, బూడిదలో నిప్పుకణికవలె వెలుగుతున్నవాడూ, దుష్టశిక్షణ మొదలు పెట్టుటకు సిద్ధంగా ఉన్నవాడూ, పరమాత్ముడూ అయిన బాలునిగా ఉండేవాణ్ణి మంచం మధ్యలో పరుండి ఉండగా చూచింది.

(మాటకు, మనస్సుకు అందనివాడు, అన్నింటికి అతీతమైనవాడు, ఎన్ని ప్రళయాలు వచ్చినా చివరకు మిగిలేవాడు కనుక పరమాత్మ - పరుడు.

శ్రీకృష్ణావతారంలో దుష్టశిక్షణ పూతన సంహారంతోనే కదా ప్రారంభమౌతుంది. అందుకే ఆ బాలకృష్ణుడు దుర్జనవధ ప్రారంభకుడయ్యాడు.)

(పడక మధ్యలో పవళించిన చిన్ని కృష్ణుని) చూచి దగ్గరికి వచ్చే సమయంలో

లోకాలన్నింటికీ ప్రభువూ, చరాచరాలను పాలించేవాడూ, గోపాలబాలుడు అయిన శ్రీకృష్ణుడు, పసిపిల్లలను చంపేది, దుష్టురాలు అయిన పూతన, బాలింతరాలివలె పాలిండ్లలో విషాన్ని నింపుకొని త్వరత్వరగ రావటాన్ని తెలుసుకొని, తనలో తాను నవ్వుకొంటూ, కాలేదో చేయ్యేదో తెలుసుకోలేనంతగా నిద్రపోతున్నవాడిమాదిరిగా గురకలుపెట్టసాగాడు.

పాపాత్ముల జాతికి చెందిన ఆ అందమైన పూతన, పసిబిడ్డడి పడకదగ్గరికి వెళ్లి, చేతులతో బిడ్డనెత్తుకొని, తన చన్నుల మీద ఆనించుకొని, ముద్దు పెట్టుకొని, తలను వాసన చూచి ఈ విధంగా అనింది.

నీకు చనుపాలు త్రావించటానికి తగినవారు ఇక్కడ ఎవ్వరు లేరు. నీవు చావాలి. నీకు చనుపాలు త్రాగించిన తరువాత నిదానంగా నేను వెళ్ళుతాను అన్నట్లుగ రెండు చళ్ళు త్రావించింది.

(“చను గుడిపి మీంద నిలుకడం జనుదాన” అనుటలో మరొక అర్ధం కూడ స్ఫురిస్తుంది. నీకు చనుబాలు తావించి, నిన్ను చంపి, తరువాత నిదానంగా నేను కూడా చస్తానులే అనేదే మరోఅర్థం. ఈ 'చనుటు' చనిపోవుట, పూతన ఆశించినట్లు కృష్ణుని విషయంలో జరుగలేదు గాని పూతనవిషయంలో మాత్రం జరిగింది.)

పద్మపత్రాలవంటి కన్నులు కలవాడా! ఓ చిన్నికుమారా! నా చనుబాలు ఒక గ్రుక్కెడు తాగవయ్యా! అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుస్తుంది. నేను చేసిన పనికూడా ఫలిస్తుంది.

అని ఆ బాలకృష్ణుణ్ణి ఉద్దేశించి ముద్దుపెట్టుకొనే విధంగా మాట్లాడుతున్న కాంతను (పూతనను) చూచి,

యశోదారోహిణులు 'మా బిడ్డను తాకవద్దు. నీ చనుబాలు ఇవ్వవద్దు. మా కొడుకు నీ చనుబాలు త్రాగడు. బిడ్డను వదలి వెళ్ళిపో' అని పూతనను దగ్గరికి పిలిచి చెప్పినా, ఆ రాక్షసి వాళ్ళమాటలు లెక్క పెట్టకుండ వాళ్ళవైపు సూటిగా చూస్తూ మాయతో, ఒరలోని క్రూరమైన కత్తిలా మాటల్లో మెత్తదనం, మనసులో క్రూరత్వం ఉట్టిపడుతుండగా

చాలదగ్గరగా వచ్చి, తీయగా మాట్లాడుతూ, భయపడకుండ, తడబడకుండ, నిద్రపోతున్న బిడ్డను, నిద్రపోతున్న నాగుబాము అని తెలియక, త్రాడు అనే భావంతో బుద్ధిహీనుడు తనవైపు లాగుకొన్న విధంగా, మోసగత్తె, దుర్మార్గురాలు అయిన పూతన నేర్పుగ, పరుపుమీద చక్కగా ప్రకాశిస్తూ, కళ్ళు మూసుకొని నిర్భయంగా నిద్రపోతున్నట్లున్న అందాల బాలకృష్ణుణ్ణి ఎత్తి తన తొడల మధ్య ఉంచుకొన్నది. శరీరం నిమురుతూ ప్రేమను ఒలకపోస్తూ 'ఆకలితో ఉన్న నా ముద్దు బిడ్డా! నా చనుబాలు త్రావు' అని తన చన్నుకుడిపే సమయంలో

బాలకృష్ణుడు అప్పుడే మేలుకొన్నట్లు నిదానంగా కళ్ళు విప్పి, ఓరగంట చూస్తూ, ఒడలు విరుచుకొంటూ మూల్గి, నిక్కి ఆవులిస్తూ, చేతులు చాచి, ప్రక్కకు తిరిగి, ఆకలితో ఉన్నవానివలె, పూతన బిగి చన్నులను చేతులతో గట్టిగా ఒత్తిపట్టుకొని నోటపెట్టుకొన్నాడు. గుటుకు గుటుకుమని శబ్దం చేస్తూ రెండుగ్రుక్కలు తాగాడు. ఆ రాక్షస స్త్రీ ప్రాణాల్ని దేహబలాన్ని ఆ పాలతో పాటు పీల్చివేశాడు. పూతన గుండెలు తల్లడిల్లగా వేగంగా, గిరగిరా తిరుగుతూ, నిలబడలేక తలవాల్చి, 'నీవు నా దగ్గర పాలు తాగిన తక్కిన బాలుర వంటివాడివి కాదు. ఇపుడు పాలు తాగినంతవరకు చాలు. నా చన్ను విడిచిపెట్టు, విడిచిపెట్టు అని అంటూ

అధికమైన దప్పిక, మంటలు శరీరమంతా వ్యాపింపగా, ధైర్యాన్ని కోల్పోయి, కళ్ళు విచ్చుకొని, కాళ్ళు, చేతులు చాచుకొని, గుండెలదరే గుబ్బనే శబ్దంతో అరుస్తూ నేలమీద కూలింది.

దేవతలను నాశం చేసేదైన పూతన, వజ్రాయుధంతో భేదింపబడిన పర్వతంవలె, తన తొలుతటి రాక్షసశరీరంతో నేలమీద కూలి, పెద్ద కేకపెట్టగా ఆ ధ్వనికి భూమి కొండలతోకూడ కదలాడింది. గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో బెదిరిపోయాయి. అన్నిదిక్కులా ఆ కేకప్రతిధ్వనులు అతిశయిల్లాయి. అన్నిలోకాలు కంపించాయి.

అప్పుడు సహింపశక్యం గాని ఆ శబ్దం తమగుండెల్లో ప్రవేశించి, భయపెట్టగా, గొల్లవాళ్ళందరూ, చలించినవాళ్లై, స్పృహ కోల్పోయి మెలికలు తిరిగి భూమిమీద పడ్డారు.

ఓ పరీక్షిన్మహారాజా! దుష్టురాలు, రంకుటాలు, రాక్షసి అయిన ఆ పూతన సహజదేహం నలిగిపోయేట్టుగా నేలమీద పడగానే, దాని దెబ్బకు ఒకటిన్నర ఆమడల దూరందాకా ఉన్న చెట్లన్నీ నుగ్గు నుగ్గు అయ్యాయి.

తోకలవలె వంకరగా, కఱ్ఱలవలె నిడుపుగా కానవచ్చు పండ్లు, కొండగుహవంటి ముక్కు పెద్ద బండలవలె ఉన్న చన్నులు, చెదిరి చలిస్తున్న ఎర్రని జుట్టు, చీకటి క్రమ్ముకొన్న చేదబావులవంటి కళ్ళు, పెద్ద మట్టిదిబ్బవంటి పిరుదులు, పొడవైన కట్టలవంటి కాళ్ళు, తొడలు, చేతులు, నీళ్ళు ఎండిపోయిన మడుగులాంటి కడుపు, ఆరుకోసుల పొడవు కలదై, దగ్గరకు వెళ్ళి చూస్తే భయాన్ని కలిగించే పూతన శవాన్ని చూచి, గోపకులు, గోపికలు అందరు గుమికూడి భయపడ్డారు.

ఇలాగా పూతన నేలకూలిన ఆ సమయంలో, కొత్తగా పూచిన తామరపువ్వువంటి కన్నులుండే ఆ బాలకృష్ణుడు పసిపిల్లలను చంపేది, మునులను బాధించేది, అయిన ఆ పూతనసంగతి తెలుసుకొని, తన బాలక్రీడావిలాసంతో, పాలు త్రాగటానికని ఆ రాక్షసి రొమ్ముమీద ప్రాకసాగాడు.

విషసర్పాలను భక్షించే గరుత్మంతుడినే వాహనంగా కలవాడు, కంఠమందే విషముంచుకొన్న శివుడికి సుఖుడైనవాడు, విషం (నీళ్ళ)మీద శయనించేవాడు, విషం (నీటి)నుండి ఉద్భవించిన పద్మంనుండి పుట్టిన బ్రహ్మదేవునికి తండ్రి అయినవాడు విషపు చన్నుల పూతన చనువిషం త్రాగడం ఒక పెద్ద విషమా?

ఈ సంఘటన నుండి తేరుకొన్న గోపీగోపకులు రోహిణీ, యశోదాదేవులను కలిసి, భయపడకుండా దగ్గరికి వచ్చి

నేలమీద కూలిన రక్కసి అయిన పూతన పెద్ద రొమ్ముమీద ఏ భయమూలేకుండా ఆడుకొనే ఆ బాలకృష్ణుణ్ణి 'రా బిడ్డా! అని భుజాలమీదికి ఎత్తుకొని, దేహమంతా, నిమిరి లాలించి, దోషపరిహారార్థం పవిత్రమైన ఆవుతోకతో దిగదుడిచి, ఆవు కాలిదుమ్మును, పంచితాన్ని పైనచల్లి, ఆవుపేడను పండ్రెండునామాలను స్మరిస్తూ పండ్రెండు అవయవాల్లో పూశారు.

(ద్వాదశనామంబులు = కేశవాదిగా వున్న 24 నామాల్లో, మొదటి పండ్రెండునామాలను ఉచ్చరిస్తూ “లలాటం” మొదలు చివరగా “మెడమీద” ఊర్ధ్వపుండ్రాలు ధరించడం సంప్రదాయం. అలాగే గోపికలు కృష్ణునికి గోమయాన్ని పండ్రెండు అవయవాలకూ పూశారు.)

అంతేకాదు, గోపికలు బాలకృష్ణునికి తాముపెట్టిన రక్ష చాలునని తృప్తి పొందక ఆచమనం చేసి, ఆయా బీజాక్షరాలను తమ శరీరమందలి ఆ యా భాగాలలో న్యాసం గావించుకొని, తమ దేహాలను తాము ముందుగ సంరక్షణ చేసుకొని ఓ ముద్దులబిడ్దా! నీ పాదాలను బ్రహ్మదేవుడు, మోకాళ్ళను వాయుదేవుడు, తొడలను అగ్నిదేవుడు, నడుమును అచ్యుతుడు, పొట్టను హయగ్రీవుడు, హృదయాన్ని కేశవుడు, రొమ్మును ఈశానుడు, కంఠాన్ని సూర్యుడు, భుజాలను చతుర్బుజుడు, ముఖాన్ని త్రివిక్రముడు, శిరస్సును ఈశ్వరుడు కాపాడుదురు గాక! అంతేకాదు. ముందు భాగాన్ని చక్రాయుధుడు, వెనుక భాగాన్ని గదాయుధుడు, ప్రక్కభాగాలను మధుసూదనుడు మరియు ఖడ్గధారి అజనుడు, మూలలను శంఖచక్రగదాధరుడైన ఉరుగాయుడు, పై భాగాన్ని ఉపేంద్రుడు, క్రింది భాగాన్ని గరుడుడు, అన్ని భాగాలను హలధరుడైన మహాపురుషుడు రక్షింతురుగాక!

నీ ఇంద్రియాలను హృషీకేశుడు, పంచప్రాణాలను శ్రీమన్నారాయణుడు, హృదయాన్ని శ్వేతద్వీపప్రభువైన శ్రీహరి, మనస్సును యోగీశ్వరుడైన కపిలుడు, బుద్ధిని పృశ్నిగర్భుడు, అహంకారాన్ని పరబ్రహ్మ పాలన చేయుదురు గాక! నీవు ఆడుకొనేటప్పుడు గోవిందుడు, పడుకొన్నప్పుడు మాధవుడు, నడిచేటప్పుడు వైకుంఠుడు, కూర్చున్నప్పుడు శ్రీపతి, భుజించేటప్పుడు యజ్ఞభుజుడు ఏ మాత్రం ఏమరుపాటులేక నీకు రక్షగా ఉంటారు. నీ పేరు చెపితే చాలు దుస్స్వప్నాలు, వృద్ధబాలగ్రహాలు, కూశ్మాండగ్రహాలు, డాకినీ పిశాచాలు, యాతుధానులనే దుష్టరాక్షసులు, భూతాలు, ప్రేతాలు, యక్షరాక్షస పిశాచాలు, వినాయకులనే విఘ్నకారక గ్రహాలు, పెద్దమ్మ, పూతన, మాతృకలు మొదలైన దుష్టగణాలు నాశనమైపోతారు. నీ ప్రాణాలను, ఇంద్రియాలను, శరీరాన్ని అడ్డుకొని చిత్తచాంచల్యాన్ని, అపస్మారక స్థితిని కలిగించే ప్రవృత్తులు, మహోత్పాతాలు కలుగకుండుగాక! అని దీవించారు. తరువాత

(సర్వలోకాలకు “రక్ష"కుడైన చిన్ని కృష్ణుడు “పూతనను” సంహరించినా, గుర్తించక మాయకు లోనై అమాయకలైన గోపికలు, అత్యంతప్రేమతో “చిన్నిశిశువు”గా భ్రమించి, బాలకృష్ణునికి ఎలాంటి గ్రహదోషాలు సోకకుండా లోక నియమానుసారం 'రక్షలు' కట్టి దీవించారు.)

ఆ పెనుమాయల గోపాల బాలుడికి యశోద చన్నిచ్చి పాలుత్రాపి, పడకమీద చక్కగ పరుండబెట్టి, పైన గుడ్డకప్పి, 'బిడ్డా! నిద్రపొమ్ము' అని అల్లన జోలపాట పాడింది.

తరువాత నందుడు మొదలైన గోపకులు మధురనుండి వచ్చి, పూతన కళేబరాన్ని చూచి, ఆశ్చర్యపడి, 'వసుదేవుడు ముందే రానున్న ప్రమాద చిహ్నాలు తెలుసుకొని మనల్ని హెచ్చరించాడు. అతడు మహాయోగి' అని పొగడి, ఎంతో కఠినమైన ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్ళతో నరికి, తమ యిండ్లకు దూరంగా చండ్రకట్టెలు పేర్చి దహించారు.

పరీక్షిన్మహారాజా! పూతన దేహమందలి కల్మషాలను బాలకృష్ణుడు ఆమె చనుబాలతో పాటు పీల్చివేసినందున, మిక్కిలి రాజుకొంటూ కాలుతున్న ఆమె శరీరంనుండి సుగంధపు సువాసనల పొగలు వెలువడినాయి.

శ్రీహరి అవతారమైన శ్రీకృష్ణుడు, తన శరీరంమీద కాళ్ళు, చేతులు ఆడిస్తూ, చనుబాలు త్రాగుతూ, బాగా స్పృశించిన కారణంగా, ఆ రాక్షస స్త్రీ పూతన పాపాలు తొలగి, శ్రీకృష్ణునితల్లి పొందదగిన ఉన్నతోన్నత స్థానమైన పరమపదాన్ని పొందింది.

విష్ణుమూర్తికి ఒక్కసారి విషంతో కూడిన చనుబాలిచ్చిన పసిపిల్లల హంతకురాలే స్వర్గానికి వెళ్ళితే, విష్ణుమూర్తిని కని, చనుబాలిచ్చి పెంచి పెద్దచేసిన తల్లి యశోదమ్మకు మరొకజన్మ ఉంటుందా? ఆమెకు మోక్షమే ప్రాప్తిస్తుంది కదా!

శ్రీకృష్ణుని కొడుకుగా కని చనుబాలిచ్చిన స్త్రీలు దేవకీ యశోదలవంటివారు, పొందే మహోన్నతపదం ఇట్టిది అట్టిది అని చెప్పటం సాధ్యమా? ఆ హరికి త్రాగుటకు పాలిచ్చిన ఆవులు కూడ మోక్షాన్ని తప్పక పొందుతాయి.

ఓ పరీక్షిన్మహారాజా! ఆ పూతనదేహం కాలుతుండగా అందుండి వెలువడిన సువాసనను పీల్చుతూ, అంతటి దుర్మార్గురాలి శరీరంనుండి ఇంతటిమంచి వాసన రావటమా! అని అందరు ఆశ్చర్యంగా అనుకుంటూ తమతమ పల్లెలకు వెళ్ళారు.

ఆ తరువాత నందుడు పరమానంద భరితుడై ఇంటికి వెళ్ళి, గోపకాంతలవల్ల ఆ రక్కసి చేసిన పనులన్నీ తెలుసుకొని, ఆశ్చర్యపడి, బాలకృష్ణుణ్ణి మేల్కొల్పి, తలను మూర్కొని, ముద్దాడి సంతోషంతో ఉండినాడని శుకమహర్షి చెప్పగా విని, పరీక్షిన్మహారాజు ఈ విధంగా అన్నాడు.

సర్వేశ్వరుడైన విష్ణుమూర్తి ఏ యే అవతారాల్లో ఏ యే పనులు చేశాడో, శుభాలకు నిలయాలైన వాటినన్నింటిని వింటూ ఉంటే, మనస్సు వాటిల్ని వదలిపోదు, చెవులకు అవి పండువులుగా ఆనందం కలిగిస్తాయి.

బాలకృష్ణుణ్ణి తలంచడాలు సంసార మహాసముద్రాన్ని దాటించే ఓడలు. అవి పాపసమూహాల్ని నశింపచేసే సాధనాలు. సంపదలను సమకూర్చే ఉపాయాలు. ముక్తిని ప్రసాదించే మంచిఆభరణాలు.

అని శ్రీకృష్ణునిసంస్మరణలవల్ల కలిగే ఫలాలు విన్న పరీక్షిత్తుడు ఆ తరువాత ఆ బాలకృష్ణుడు ఏమేమి చేశాడో ఆ విశేషాలను నా మీద దయపెట్టి చెప్పండని పరీక్షిన్మహారాజు అడుగగా, శుకమహర్షి ఈ విధంగా చెప్పాడు.

బాలకృష్ణుడు శకటముం దన పాదమున గూల దన్నుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

No comments:

Post a Comment

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట...