Tuesday, April 7, 2026

Bhimavaram - Somaram (Bhimaram) - భీమవరం - సోమారామం (భీమారామం)

భీమవరం - సోమారామం (భీమారామం)

పంచారామాల్లో ఒకటైన సోమారామం - 
భీమారామం

చంద్ర ప్రతిష్ఠ భీమారామం, భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరం గునుపూడి లో ఉంది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో ఉత్సవాలు జరుగుతాయి.

స్థలపురాణం:
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగగొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని, అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయిందని పురాణ కథనం. ఈ లింగం చంద్రప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా చంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసిస్తారు.

చరిత్ర:
చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్నినిర్మించాడనటానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలుస్తున్నారు.ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలుస్తారు.

ఆలయ విశేషాలు:
దేవాలయంలో శ్వేతవర్ణంలో కనిపించే శివలింగం క్రమంగా అమావాస్య వచ్చే సరికి బూడిద లేదా గోధుమ వర్ణానికు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు.. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన ఉన్న రెండవ అంతస్తులోని గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

ఆలయపు ముందు కోనేరు ఉంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది.

దేవాలయం ముందు భాగంలో రెండు నందులు ఉన్నాయి.మరో రెండు నందులు ఒకటి ధ్వజస్తంభం వద్ద, ఇంకో నంది ఆలయ ప్రాంగణంలో ఉంది. దేవాలయం ఎదురుగా ఉన్న చంద్రపుష్కరిణిలో మరో నంది ఉంది.ఆలయం ప్రాంగణంలో మొత్తం ఐదు నందులు ఉండడం వల్ల పంచ నందీశ్వరాలయంగా ఈ ఆలయానికి మరో పేరు ఉంది. దేశంలో ఉన్న స్పటికలింగాల్లో ఇది ఒకటి.

ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Description of the monsoon - వర్షర్తు వర్ణనము

వర్షర్తు వర్ణనము

చేలు దున్నుకొంటూ జీవించే రైతులకు ఆనందం కలిగిస్తూ వానాకాలం వచ్చింది. తూరుపు గాలులు ఎక్కువయ్యాయి. ఇంద్రధనుస్సు కనిపించింది. సూర్యునిచుట్టూ ఆవరించిన గాలి గుడి కట్టింది. ఉత్తరాన మెరుపులు మెరుస్తున్నాయి. మబ్బులు దక్షిణంగా సాగుతున్నాయి. నీటి చేరికచేత చేపలు మొదలయిన జలచరాలకు సంతోషం కలిగింది. వానకోయిలల దప్పిక తీరింది. కార్చిచ్చులు కనబడకుండా పోయాయి. ఎండాకాలంలో సూర్యుడు తన కిరణాలతో త్రాగిన నీటినంతా వానాకాలంలో తిరిగి ఇచ్చేస్తున్నాడు.

అడవులచివర చెట్టూ పుట్టా లేకుండా సమతలంగా ఉండే చేలను దున్ని రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. ఆ చేలలోని నాగటిచాళ్లు, వర్షఋతువు అనే రసికుడు భూమి అనే పడతిమీద చేసిన కొత్త గోళ్లగీతలా! అన్నట్లుగా ఉన్నాయి.

ఓ పరీక్షిన్మహారాజా! వర్షాకాలమనే ప్రియుడు సమీపించడంచేత, పుడమిపడతికి కల్గిన గగురుపాటు అనునట్లుగా మొలచి తలలెత్తి పెరుగుచున్న పైరులు అందగించాయి.

ఆ వానాకాలంలో తీవ్రమయిన గాలుల తాకిడికి కదలివచ్చిన మబ్బులు ఆకాశం నిండా అలముకొన్నాయి. లెక్కకు మిక్కిలిగా వచ్చిన ఆ మబ్బులు రెక్కలుగల కాటుక కొండలా అన్నట్లు ఎడం లేకుండా దట్టంగా కమ్ముకొన్నాయి. సూర్యచంద్రుల కాంతుల్ని అడ్డుకొన్నాయి. వర్షఋతువు అనే ప్రియుడు మదించి భూకాంతవక్షస్థ్సలం మీద నేర్పుగా జల్లిన కర్పూరపు పలుకులా అన్నట్లు గా మబ్బులనుండి వడగళ్లు రాలిపడ్డాయి. ఆ వడగళ్ల వెంబడి నల్లత్రాచుల తీరున, ఇంద్రనీల హారాలవిధంగా ఎడతెరపిలేకుండా వర్షధారలు కురిశాయి. ఆ జలధారలతో తడిసినకొండలు మద జలధారలతో నిండుగా తడిసిన మత్తగజాలవలె కనబడుతున్నాయి. కొండకొమ్ములనుండి బండ రాళ్లమీద పడుతున్న సెలయేటి నీటిధారలు చెల్లాచెదురయిన నీటితుంపరలు నలుగడలా పడుతున్నాయి. ఆ తుంపరలకు చెమ్మగిలిన నేల చిత చితలాడుతూ అడుసు అయింది. అందులో నడిచేటప్పుడు చితుకు చితుకుమని చప్పుడవుతోంది. ఆ బురదల మీదుగా పారిన నీరు వరద గట్టింది. వాగులు వంకలు ఏకమై ప్రవహించాయి. గుంపుగట్టిన రెక్కల చేపలు ఆ వరదనీటికి ఎదురీదాయి. చేపలవంటి కన్నులుగల చెలువల నెమ్మేని తళుకుబెళుకులకు తాళలేక, కళవళపడి, వణుకుతూ పారిపోతున్నవా అన్నట్లుగా మెరుపులు మేఘాలమధ్య మెరసి మాయమై పోయాయి. మెరపులవలె చపలచిత్తలయిన చెలువలు పురుషులచెంత నిలుకడగా నిలువరు సుమా అని ప్రజలకు వినబడేలాగున బ్రహ్మదేవుడు ఎలుగెత్తి చాటుతున్నాడా అన్నట్లుగా ఉరుములు ఉరిమాయి. ఆ ఉరుముల చప్పుళ్లకు నెమళ్లు జంకులేక పురులు విప్పుకొని నాట్యం చేశాయి. కేకలు పెట్టాయి. భయంకరమైన ఆ కేకలకు తాళలేక ప్రణయకలహంవల్ల విరహంతో వేగుతున్న దంపతులు పట్టుదలలు మాని ఒకరికొకరు దాసులై దగ్గరయ్యారు. కారుమబ్బులు కమ్మినందువల్ల ఇదిరేయి; ఇదిపగలు అని గుర్తించడానికి వీలులేకుండా పోయింది. అయినప్పటికి జాజిపూలు పూసి సాయంసమయాన్ని తెలియజేశాయి. చీకటి పడేటప్పటికి మిణుగురుపురుగులు మినుకుమని మెరుస్తూ మింట తారట్లాడాయి. ఎడతెరిపిలేకుండా కురిసే జడివానలో చలికి వణుకుతూ, ఎప్పుడు సూర్యోదయం అవుతుందో అని ఎదురుచూస్తూ, వంటను వండుకొని తినే వీలులేక, ఖర్జూరపుపండ్లు నేరేడుపండ్లు తిని ఆటవికులు ఆకలి తీర్చుకున్నారు. విటులపొత్తు వీడని వేశ్యవిధంగా మిన్నాగు పాములపొత్తు వీడని మొగలిపూగుత్తులు ఆటవికులకు సంతోషం కలిగించాయి. అడవిదారులు విరబూచిన మొగలి కడిమి అడవిమొల్ల కొండమల్లె పూలతావులతో నిండిపోయాయి. గరుడపచ్చల కాంతులు వెలిగ్రక్కుతూ పచ్చిక అంతటా గుబురుగా పెరిగింది. ఆ పచ్చికలు మేసిన ఆవులు బలిసి మిసమిస లాడుతున్నాయి. పాలతో నిండిన పొదుగుల బరువు వల్ల ఇటూ అటూ తిరగలేక నిలబడి నెమరు వేస్తున్నాయి. వర్షఋతువు క్షీరసమృద్ధిగల ఆవుల మందలాగ జలసమృద్ధ మయ్యింది. జింకతో నిండుగా కనబడే శివునిచేతిలాగ వానకోయిలలతో నిండుగా కనబడింది. విష్ణువనే బాణానికి ఆసనం (విల్లు) అయిన మేరుపర్వతంలాగ ఇంద్రధనుస్సుతో ప్రకాశించింది. ఎడతెగకుండా హరినామాన్ని సంకీర్తించే విభీషణుని హృదయంలాగ కప్పల బెకబెకల ధ్వనులతో కూడుకొని ఉంది. ఇంద్రోపేంద్రాదులకుగూడా ఐశ్వర్యాన్ని అనుగ్రహించే శివపూజలాగ ఆరుద్రపురుగులతో అలరారింది. సీతాదేవి చరిత్రతో జనకచక్రవర్తియాగంలాగున నాగలిచాళ్లతో అందగించింది. బహుసంవత్సరాలు కలిగిన కృతయుగంలాగ అధికమైన వర్షలతో నిండిపోయింది.

ఎండక, నేలమీద వ్రాలిపోక, చీడపీడలు సోకక, బలుపునకు గుర్తుగా నల్లనిచారలు గలిగి, చక్కగా పైరులు పెరిగాయి. జనులకు కష్టాలు గట్టెక్కాయి.

ఓ పరీక్షిన్మహారాజా! ఎంత సంపదగలిగి ఉన్నప్పటికీ గొప్పవాడు గర్వంతో మిడిసి పడడు. ఆ తీరుగా నదులలోని నీరంతా వచ్చి తనలో చేరుతున్నా సముద్రుడు హద్దు మీరక అణగి ఉన్నాడు.

ఆ వర్షాకాలంలో శ్రీకృష్ణుడు అడవుల చివరలలో ఆవులను మేపుతూ, బలరామునితోను, గోపాలకులతోను గూడినవాడై కందమూలఫలాలు తింటూ, మడుగులగట్లమీద, రాతిచట్టులమీద కూర్చుండి ప్రీతిగా చలుదులు భుజించాడు.

అలాంటి వేళలో, బృందావనం అనే ఆకాశంలో శ్రీకృష్ణుడనే మేఘం అందగించింది. లోకాలకు మైమరపుకలిగించె పిల్లనగ్రోవి పాటయే ఆ మేఘానికి రసవంతమయిన గంభీరమైన ఉరుము అయ్యింది. చక్కనైన చిరునవ్వు కాంతియే మెరుపుతీగ అయింది. తలచుట్టు చక్కగా ఉన్న నెమలిపురి దండయే ఇంద్రధనుస్సు అయ్యింది. దయతోగూడిన కడకంటి చూపులనుండి వెల్లిగొనే అమృతవర్షమే జలధారల జడివాన అయింది. ఈ విధంగా భాసించిన శ్రీకృష్ణుడు అనే నీలమేఘం తన వెన్నంటివచ్చే గోపాలురు, మునులు అనే చాతకపక్షుల తాపాలు తొలగించింది.

ఓ రాజా! శ్రీకృష్ణుడు తాను లక్ష్మీదేవికి భర్తయగు విష్ణువే అయినా, లోకమర్యాదను అనుసరించి, ముందుగా ఆవులను, ఎద్దును, దూడలను పూజించి, తరువాత వర్షాకాలసంపదకు అధిదేవత అగు లక్ష్మీదేవిని పూజించాడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు వర్షాకాలానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ కాలం గడిపాడు. అపుడు

శరదృతు వర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Lord Krishna swallowing a fire (Karchichu) and saving the cows and cowherds - శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

ఈ విధంగా గోపాలురు ఆటల సందడిలో మునిగి ఉండగా, ఆవులు ఆ అడవిలో ఉన్న రకరకాల పచ్చికలు మెస్తూ మేస్తూ దూరంగా ఉన్న మరొక అడవిలో ప్రవేశించాయి. అంతలో అక్కడ కార్చిచ్చు చెలరేగింది. ఆ వేడికి అవి తట్టుకోలేక వణికిపోయి, దాహంతో అంబారవాలు చేస్తూ ఆక్రోశించగా

ఆ గొల్లకుఱ్ఱవాళ్లు అందరూ ఆర్తిగావున్న ఆవుల మొరలను ఆలకించారు. కుఱ్ఱతనంచేత నిమగ్నమైన ఆటలలోని ఆసక్తిని విడిచిపెట్టి, ఆవులున్న చోటుకి వేగంగా బయలుదేరారు. ఆవుల కాళ్లగిట్టల చేత నలిగి, దంతాలచేత కొరకబడి దారిలోపడి ఉన్న గడ్డి తునుకల ఆనవాళ్లనుబట్టి వెంటనే ఆ ఆవులు వెళ్లినదారిలో వెళ్లి, దావాగ్ని అంటుకున్న అడవినుండి మంచిచోటుకి ఆవుల్ని నేర్పుతో మళ్లించారు.

శ్రీకృష్ణుడు ఉరుమువంటి గంభీర ధ్వనితో ఆవుల్ని పేరుపేరున పిలిచాడు. ఆ పిలుపులకు 'అంబా' అని మారుపలుకుతూ ఆ ఆవులన్నీ వెనక్కు మళ్లాయి.

ఆ అడవిలో విధివశంవల్ల పుట్టిన కార్చిచ్చు, గాలితీవ్రతకు ప్రజ్వరిల్లి ఆకాశాన్ని అంటుతోంది. కొండలు చెట్లు అనే తేడా లేకుండా అన్నింటినీ కాల్చివేస్తూ అన్ని వైపులా అలము కొంది. అది చూచి గొల్లపిల్లల గుండెలు గుభిల్లుమన్నాయి. చచ్చిపోతామేమో అని భయం పట్టుకున్నది. బలరామునితో కలిసి ఉండే శ్రీకృష్ణునికి సాష్టాంగపడుతూ నమస్కరించి, వారు ఈ విధంగా విన్నవించారు.

ఓ కృష్ణా! చూడు. ఆ కార్చిచ్చు తన పొగలతో ఆకాశాన్ని ఆవరించింది. భయంకరంగా పెద్ద పెద్ద నిప్పురవ్వల్ని విరజిమ్ముతోంది. పెద్ద పెద్దమంటలు పైపైకి ఎగసి లోకాలన్నిటినీ కాల్చి పారేస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి.

చంద్రునివలె చల్లనివాడవయి ఆహ్లాదం కలిగించె కృష్ణా! తండ్రీ! నీ బంధువులకు కష్టాలు కలుగవు కదా! మేమంతా నీ బంధువులమే కదా! నీ సేవ చేయడం తప్ప మాకు ఇంకేమీ తెలియదే. కానీ నేడేమిటి ఈ దురవస్థ? ఈ కార్చిచ్చు నుండి ఎలా బయటపడగలం? అన్నివైపులా మంటలు కమ్ముకొనడంచేత ఆపదనొంది అలమటించే మమ్మల్ని చూచి రక్షించుము.

ఈ విధంగా గొల్లపిల్లలంతా కృష్ణుని ప్రార్ధించారు. ఆ తర్వాత

చుట్టాలయిన గొల్లవారందరు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు. విశ్వమంతా తన రూషమే అయిన శ్రీకృష్ణుడు వారితో 'బంధువులార మీరు మీ కళ్లు మూసుకోండి. తిరిగి తెరిచే లోపున ఈ కార్చిచ్చును అణచివేస్తాను' అని అన్నాడు. గొల్లలంతా అలాగే చేశారు. శ్రీకృష్ణుడు పెచ్చుపెరిగిన కార్చిచ్చును పట్టుకొని వేడుకగా నోటితో త్రాగేశాడు.

శ్రీకృష్ణుడు ఈ విధంగా తన యోగమహిమచేత కార్చిచ్చును త్రాగివేసి ఆ గొల్లవారందరిని నిమిషంలో భాండీరకమనే పేరుగల వటవృక్షం క్రిందికి చేర్చాడు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రదేశాన్ని కళ్లారా చూస్తూ వారు శ్రీకృష్ణునియోగశక్తివల్ల కార్చిచ్చు అణగిపోయింది గదా! అని అతణ్ణి ప్రశంసిస్తూ, తమ మనస్సులలో...

'ఒక సామాన్య మానవునికి ఇటువంటి దావాగ్నిని ఆర్పివేసే శక్తి ఉంటుందా? ఈ వేళ శ్రీకృష్ణుడు ఈ కార్చిచ్చును ఆర్పివేసి మనల్ని అందరినీ రక్షించాడు. ఇతడు మామూలు గొల్లపిల్లవాడు కాదు. బ్రహ్మగాని విష్ణువుగాని, రుద్రుడుగాని అయ్యుంటాడు' అని ఆ గొల్లపిల్లలందరు తమ తమ మనస్సులలో

ఈ విధంగా గొల్లపిల్లలు ఊహించారు. సాయంకాలం శ్రీకృష్ణుడు బలరామునితో కలిసి, వేణువు ఊదుతూ, వారిచే ప్రశంసలు అందుకొంటూ మందలో ప్రవేశించాడు. ఆ సమయంలో

శ్రీకృష్ణుడు దగ్గరగా లేని ఒక నిముషం అయినా గోపికలకు నూరు యుగాలుగా అనిపించింది. అందువల్ల వారు గబ గబా వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూచి, పరమానందం పొందారు.

అప్పుడు అడవినుండి వచ్చిన గోపాలకులు ఇళ్ల దగ్గరున్న పెద్దవారితోను, ఆడవారితోను బాలరామకృష్ణుల రాక్షస సంహారాది మానవాతీత చేష్టలను గురించి చెప్పగా, వారు ఆ బలరామకృష్ణులు అనేక ఘనకార్యాలు చేయడానికి భూమిమీద అవతరించిన దేవతా శ్రేష్ఠులు అనీ, సామాన్య మానవులు కారనీ భావించారు.

వర్షర్తు వర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Balabhadra (Balarama) killing the demon Pralambasura - బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

ఈ విధంగా బలరామకృష్ణులు నదీనదాలు, సరస్సులు, కొండలు, సెలయేళ్లు, మడుగులు, పొదలు మొదలయినవానికి సమీపంలో ఎక్కడెక్కడ చిక్కని పచ్చికబయళ్లు ఉన్నాయో అక్కడంతా ఆవులను మేపుతున్నారు. అపుడు ప్రలంబుడు అనే పేరుగల బలవంతుడయిన రాక్షసుడు వారిని బాధించడం కోసమని గోపబాలునిరూపంలో వచ్చి, వారిలో కలిసిపోయాడు. సర్వజ్ఞుడయిన శ్రీకృష్ణుడు ఈ సంగతి తెలిసికూడ తెలియనట్టుగా

అపుడు శ్రీకృష్ణుడు ప్రలంబాసురుణ్ణి నమ్మించి చంపడంకోసం, వానితో రమ్మని, పొమ్మని ఆటలు ఆడుతూ విడవలేనట్లుగా స్నేహం చేశాడు.

శ్రీకృష్ణుడు ప్రలంబాసురునితో ఈ విధంగా స్నేహం చేస్తూ, మిగిలిన గొల్లవారితో ఈ విధంగా అన్నాడు.

మనకు కాలక్షేపం అవడం లేదు. అందుకని మనమందరం ఒకచోట చేరి, రెండు పక్షాలుగా విడిపోయి, రాళ్లను లక్ష్యాలుగా ఏర్పరచుకొని బంతు లాడుదాం. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తేల్చుకొందాం రాండి.

ఈ రీతిగా అనుకొని శ్రీకృష్ణుడు బలరాముడు చెరొక పక్షానికి ముఖ్యనాయకులుగా నిలబడ్డారు. మిగిలిన గొల్లపిల్లలందరు రెండు చిన్న జట్లుగా చీలి, ఆ యిద్దరివైపు చేరారు. గడ్డితో, కొయ్యలతో, రాళ్లతో లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిల్ని బంతులతోను, రాళ్లతోను కొడుతూ, కొట్టినవారు నెగ్గినట్లు, కొట్టలేనివారు ఓడినట్లు నిర్ణయం చేసికొన్నారు. ఓడినవారు నెగ్గిన వారిని భుజాలమీదికి ఎక్కించుకొని మోయాలి. ఇదే ఆటతీరు! ఈ విధంగా ఆడుతున్నారు. అపుడు శ్రీకృష్ణుడు బలరాముడికి ప్రలంబాసురుడు మారువేషంతో వచ్చి తమలో ఒకడుగా చేరిన విషయం రహస్యంగా చెప్పాడు. గొల్లలంతా ఆవుల్ని తోలుకొంటూ వెళ్లి 'భాండీరకము' అనే పేరుగల మఱ్ఱిచెట్టు క్రిందికి చేరారు. ఆటలో ఓడిన శ్రీదాముడు నెగ్గిన శ్రీకృష్ణుణ్ణి, అలాగే భద్రసేనుడు వృషభుణ్ణి, ప్రలంబాసురుడు బలరాముణ్ణి భుజాలమీది కెక్కించుకొని మోస్తున్నారు. ఆ సమయంలో

పూర్వం మహాబలవంతుడయిన తృణావర్తుడు శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని వచ్చి అతణ్ణి ఆకాశంలోనికి ఎత్తుకొనిపోయి, భరించలేక చివరికి అతనిచేతిలోనే ప్రాణాలు విడిచిపెట్టాడు. కాబట్టి శ్రీకృష్ణుణ్ణి ఎత్తుకొనిపోవడం తెలివైన పని కాదని భావించి, రాక్షసాంతకుడైన బలరాముణ్ణి తేలికగా చంపవచ్చని ప్రలంబాసురుడు అనుకొని అతణ్ణి కొండ దాటించి తీసుకొనిపోయాడు.

ఈ విధంగా ఆటకోసం వాహనంగా మారిన ప్రలంబాసురుడు బలరాముణ్ణి తీసుకొనిపోతూ ఉండగా

ప్రలంబాసురుడు బలరాముణ్ణి మోసికొని పోతూ ఉండగా బలరాముడు మహాపర్వతమంత బరువు పెరిగినాడు. బలరాముణ్ణి మోయలేక రాక్షసుని గమనవేగం తగ్గింది. దానితో ఇంక లాభం లేదని వాడు మానవరూపం విడిచిపెట్టి తనదైన భయంకరమైన రాక్షసరూపం ధరించాడు. బంగారు కడియాలతో అలంకరింపబడి, మెరుపుతీగలతోకూడిన చంద్రబింబంలాగా ప్రకాశిస్తున్న బలరాముణ్ణి ఎత్తుకొని, ఆ రాక్షసుడు నీలిమేఘంలాగా కన్పిస్తూ వెళ్లాడు.

ఆ ప్రలంబాసురుని మూపుమీద బలరాముడు ఏమరుపాటుకు లేకుండ కూర్చుండి, వాణ్ణే గమనిస్తున్నాడు. బంగారంతో చేసిన రత్నాలు పొదిగిన కిరీటంతోను, చెవులకు పెట్టుకొన్న కుండలాలతోను వాని శిరస్సు ప్రకాశిస్తోంది. బొమముడితో కూడిన కళ్లు, నోటిలో కోరలు భయంకరంగా కనబడుతున్నాయి. పొగరెక్కి పరాక్రమానికి నిలయమా అన్నట్లుగా ఉన్నాడు.

బలరాముడు చూశాడు. వీడు రాక్షసుడా అని సందేహించాడు. అయినా భయపడకుండా

ఆ బలరాముడు తనను ఆకాశంలో వేగంగా తీసికొనిపోయే ప్రలంబుడితల పగిలేలా వెంటనే గట్టిగా వేగంగా బలంగా పిడికిలితో పొడిచాడు.

బలరాముని పిడికిటిపోటుతో ప్రలంబాసురుని తల పగిలింది. శరీరంలో ఉన్న కన్ను ముక్కుమొదలయిన నవరంధ్రాలనుండి నెత్తురుకారింది. చివరకు వాడు మొర్రో అని అరుస్తూ - దేవేంద్రుడు వజ్రాయుధంతో కొట్టడంచేత కూలిన పర్వతంలాగ నేలకూలాడు.

ఆ గొల్లవారు ఈ సంఘటన చూచి 'బలే! బలే! మన బలరాముడు ఒంటరిగా చాలా బలవంతుడైన రాక్షసుణ్ణి ఒక్కదెబ్బతో చంపేశాడు. ఇది ఎంత ఆశ్చర్యకరం' అనుకున్నారు. ఏ దెబ్బ తినకుండా వచ్చిన బలరాముణ్ణి చూచి, చచ్చిన తమ తోబుట్టువు బ్రతికి వస్తే ఎలా సంతోషిస్తారో అలా సంతోషించారు. అతణ్ణి సత్కరించి ఎన్నో దీవెనలిచ్చారు.

బలవంతుడయిన ప్రలంబాసురుడు బలరాముని పిడికిలిపోటుతో చచ్చాడు. ఇంక మనం సుఖంగా బ్రతుకవచ్చు నని ఇంద్రాది దేవతలందరూ సంతోషంతో బలరాముని మీద పూలవాన కురిపించారు.

శ్రీ కృష్ణుండు దావాగ్నిని మ్రింగి గో గోపకసంఘమును కాపాడుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Grishamarthu Varnana - గ్రీష్మర్తువర్ణనము

గ్రీష్మర్తువర్ణనము

గ్రీష్మ ఋతువులో పగళ్లు పొడవవుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలో సాగుతున్నాడు. అంతకంతకు ఎండ చుఱ్ఱుమనిపిస్తోంది. వేడిగాడ్పులు వీస్తున్నాయి. నేలమీదనుండి దుమ్ములేచి ఆకాశంలో వ్యాపిస్తోంది. నదులు, సరస్సులు ఎండిపోయాయి. బాటసారులు చలివేంద్రాలలో చతికిలబడుతున్నారు. పాములు పందిళ్ల చాటుకు చేరి దాగుకొంటున్నాయి. చెట్లనుండి పూవులు, ఆకులు రాలిపోతున్నాయి. దంపతులకు రతిమీద ఆసక్తి పెరిగింది. సమస్తప్రాణికోటికి బాధ కలిగించే వేసవిరాకవల్ల అడవులు అంటుకొని కాలిపోతున్నాయి.

బ్రహ్మదేవుడు వేసవికాలంలో బ్రహ్మాండమనే కుండను సలసలమరిగే నీటితో నింపాడా అన్నట్లుగా ప్రజలు ఉష్ణబాధతో కలగుండు పడిపోతున్నారు.

ఈ విధంగా భయంకరమైన వేసవికాలం వచ్చింది. మహానుభావులయిన బలరామకృష్ణులు అక్కడ నివసిస్తూ ఉండడంవల్ల వేడిగాడ్పులు లేకుండా చల్లగా ఉంది. కొండలమీదనుండి ఎడతెగకుండ సెలయేళ్లు ప్రవహిస్తున్నాయి. వాటినుండి పుట్టే నీటితుంపరలు తెరలు తెరలుగా వస్తూ ఉంటే అక్కడి చెట్టు, తీగలు, చిగురించి, పూలు పూస్తున్నాయి. ఆ పూలవాసనలు గాలులతో కలిసి అన్నివైపులా వ్యాపిస్తున్నాయి. అచటి చెరువులలోను, నదులలోని లోతైన మడుగులలోను పూచిన తామరపువ్వులు, కలువలు పిల్లగాలులకు ఇటూ అటూ తలలూపుతున్నాయి. నదుల మడుగులలోని అలలనుండి జలకణాలు ఎగిరివచ్చి, సమీపప్రదేశాల్ని బురదబురదగా మారుస్తున్నాయి. ఆ బురదలో పచ్చికలు, పొదరిళ్ళు పెరుగుతున్నాయి. అక్కడ అందమైన మృగాలు, పక్షులు సంచరిస్తున్నాయి. ఆ బృందావనం అంతా జనమనోహరంగా ఉండి, ఇది వేసవికాలం కాదు, వసంతకాలమే అన్న భావనను కలిగిస్తోంది. అట్టి వేసవిలో

ఆ బృందావనంలో కోకిలల కూతలు, చిలుకల కలకలాలు, నెమళ్ల కేకలు, తుమ్మెదల ఝంకారాలు వినసాంపుగా ఉన్నాయి.

ఆ యమునా నదిలోను, ఆ వనంలోని అక్కడి చెరువులలోను రేగిన కెరటాలు అక్కడి తామరపూలను తడుపుతున్నాయి. తడిసినవి, సువాసనలను వెదజల్లేవి అయిన ఆ తామరపూల మీదనుండి వీచినగాలులు ఆ చల్లదనాన్ని పరిమళాన్ని మోసికొనివచ్చి అక్కడివారికి అడవి వేసవిలో అంటుకొనడంవల్ల కలిగిన తాపాన్ని పోగొట్టాయి.

ఈ విధంగా వసంతఋతుశోభతో మనోహరంగా ఉన్న బృందావనానికి బలరామకృష్ణులు ఆవులను తోలుకొని వెళ్లారు. మిగిలిన గొల్లపిల్లవాళ్లతో కలిసి, పరిహాసాలాడుకుంటూ, ఎగతాళి చేసుకుంటూ, పెద్ద పెద్ద కేకలువేస్తూ, ఎవరయినా మీదికి వస్తూ ఉంటే ప్రక్కకు తప్పుకొనిపోతూ, గిరగిర తిరుగుతూ, చెట్లసందులలో దూరుతూ, దాగుడుమూత లాడుతూ, పాటలు పాడుతూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, నాట్యంచేస్తూ, కాళ్లు తడబడినట్లుగా ప్రక్కకు ఒరుగుతూ, కుప్పిగంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ, పైకెగిరి కప్పల్లా దూకుతూ, ఉసిరికాయలను మారేడుకాయలను పైకి ఎగురవేస్తూ, చెట్లకొమ్మలు ఊపుతూ, జంతువుల్ని బెదిరిస్తూ, తేనెపట్టులను చిందరవందర చేసి తేనెటీగలను ఎగురగొడుతూ, తేనెలు త్రాగుతూ, సోలిపోతూ, గురుశిష్యుల్లా నటిస్తూ వారికి తగిన చేష్టలు చేస్తూ, పిల్లజుట్లు ముందుకు వేసికొని పిడికిళ్లతో పొడుచుకొంటూ, పందేలు కాసుకొంటూ, పిట్టల్లా అరస్తూ, చాలావిధాల వేషాలు వేస్తూ, పైకెగిరి తన్నుతూ, యజమానుడు సేవకుడు, మిత్రుడు శత్రువు అనేవిధంగా కల్పించుకుంటూ, ఉత్సాహంతో ఎన్నోవిధాలుగా వినోదించారు. ఆ ఆటల సందర్భంలో

మా పక్షానికి బలరామకృష్ణులే రాజులు అనీ ఎగిరి గంతులువేస్తూ, కేకలుపెడుతూ, బలరామకృష్ణులకు సంతోషం కలిగిస్తూ వారిని తీగలతో చేసిన అందలాల మీద కూర్చుండ బెట్టుకొని మోస్తున్నారు.

ఆ గొల్లపిల్లలంతా ఉత్సాహంగా, ఆడుతూ బలరామకృష్ణుల వెనుక నడుస్తూ వారిని వందిమాగధులవలె స్తుతిస్తున్నారు.

ఆ ఆడవిలో చెట్ల నీడలలో గొల్లపిల్లలందరు గానం చేస్తూ ఉంటే, యశోదకొడుకయిన శ్రీకృష్ణుడు వారి పాటల కనుకూలంగా నవ్వుతూ చేతులు త్రిప్పుతూ నర్తిస్తున్నాడు.

ఆదిశేషుడు బలరాముడుగాను, శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడుగాను భూమిమీద అవతరించారు. వారిని సేవించడం కోసం దేవతలు గోపకులుగా అవతరించారు. బలరామకృష్ణులు నాట్యం చేస్తూండగా గోపకులరూపంలో ఉండే దేవతలు సంతోషించి, వేణువులు, కొమ్ముబూరాలు ఊదుతూ, తలలు త్రిప్పుతూ నటులవలె అభినయిస్తూ బలరామకృృష్ణుల్ని స్తుతిస్తారు.

బలభద్రుండు ప్రలంబాసురుని వధించుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Kali's Preface - కాళియుని పూర్వకథ

కాళియుని పూర్వకథ

శుకునిమాటలు విన్న పరీక్షిన్మహారాజు 'కాళియుడు ఏ కారణంచేత పాములకు నివాసస్థానమయిన రమణక ద్వీపాన్ని విడిచిపెట్టి వచ్చాడు? అక్కడ ఇంకా ఎన్నో పాములు ఉంటూ ఉండగా కాళియుడొక్కడే గరుత్మంతునివిషయంలో ఏమి అపరాధం చేశాడు?' అని ప్రశ్నించాడు. అందుకు శుకుడు ఈవిధంగా సమాధానం చెప్పాడు.

పూర్వం పాములకు భయపడిన ప్రజలు, అవి తమజోలికి రాకుండా ఉండడంకోసం, రుచికరంగా ఉండే పదార్దాలు పాముల పుట్టలున్న చెట్ల మొదళ్లవద్ద, వాటికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండేవారు. ఆ పాములు తమను చంపి తినే గరుత్మంతుడు తమజోలికి రాకుండా ఉండడంకోసం ఆ నైవేద్యంలో తలకొక కొంత గరుత్మంతునికి సమర్పిస్తూ ఉండేవి. కానీ కాళియుడుమాత్రం 'విషబలం అధికంగా ఉన్న తనను ఎవరు ఏమి చేయగలరులే' అనే పొగరు తలకెక్కి తనవంతులో కాంచెంకూడ గరుత్మంతునికి సమర్పించకుండా తానే తినేస్తూ ఉండేవాడు. అది తెలిసిన గరుత్మంతుడు కోపంతో వీణ్ణి పట్టుకొని, వీని పడగలు, శరీరం చీల్చి చెండాడి, ప్రాణాలు తీస్తానని బయలుదేరాడు.

గరుత్మంతుడు తన బంగారు రెక్కలను ఆడిస్తూ, కాళియుణ్ణి దండించడానికని బయలుదేరి వస్తూండగా, అతని రెక్షలనుండి వేగంగా బయలు వెడలిన గాలి తీవ్రతకు మహాపర్వతాలు కంపించిపోయాయి.

ఈ విధంగా వచ్చిన గరుత్మంతుణ్ణి చూచి, కాళియుడు తలవంచలేదు. సరికదా తన పెద్దపడగలను బాగా విస్తరింపజేశాడు. గరుత్మంతుని రాక చూచి, అప్పటికే తనలో ఉన్నదానికి తోడుగా కొత్తగా విషం ఊరింది. అది కనుకొనలనుండి బయటకు ప్రవహిస్తూ నిప్పురవ్వల్ని రాలుస్తోంది. కాళియుడు నాలుకలను తీవ్రంగా అల్లల్లాడిస్తున్నాడు. ముక్కులనుండి అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. తానే ముందుకు పరుగెత్తుకొని వెళ్లి, గరుత్మంతుణ్ణి గట్టిగా కాటువేశాడు.

కాళియుడు కాటు వేయడంతో గరుత్మంతుడు రెచ్చిపోయాడు. కాళియుణ్ణి తరుముకొని వెళ్లి, బంగారుచాయలు విరజిమ్మే తన ఎడమరెక్కతో అణగగొట్టాడు. దానితో కాళియుని కోరలు విరిగిపోయాయి. నోళ్లనుండి రక్తం కక్కుకొన్నాడు. పడగలు చీలికలు పేలికలు అయిపోయాయి.

ఈ విధంగా గరుత్మంతుని దెబ్బతిన్న కాళియుడు భయంతో పారిపోయివచ్చి, ఈ లోతైన మడుగులో దాగుకొన్నాడు. ఈ సందర్భంలో చెప్పవలసిన వృత్తాంతం మరొకటి ఉంది.

పూర్వం సౌభరి అనే ముని ఈ మడుగులో తపస్సు చేసికొంటూ ఉండేవాడు. ఒకనాడు గరుత్మంతుడు ఆకలితో వచ్చి, ఈ మడుగులో ఉన్న చేపలరాజును ఒడిసి పట్టుకొని, భక్షించాడు. అది చూచిన మిగిలిన చేపలన్నీ దుఃఖంతో ఉసూరుమంటూ ఉండడం చూచిన సౌభరికి దుఃఖం కలిగింది. వెంటనే కోపం వచ్చింది. 'ఇక మీదట ఎప్పుడయినా గరుత్మంతుడు ఈ మడుగులోకి వచ్చి, ఇందులో ఉన్న చేపలను తినాలని అనుకొన్నాడో, వెంటనే మరణిస్తాడు' అని శపించాడు. అందువల్ల కాళియుడు గరుడునిబాధ లేకుండా చేసుకొనడంకోసం ఈ మడుగులోనికి వచ్చి, దాగుకొన్నాడు. ముని శపించిన విషయం ఒక్క కాళియునికి మాత్రమే తెలుసు. మిగిలిన పాములకు తెలియదు. అందువల్లనే అవేవీ ఈ మడుగులోనికి రాలేదు.

సౌభరిముని ఇచ్చిన శాపంవల్ల గరుత్మంతుడు ఆ మడుగులోనికి రాలేడు అనే ధైర్యంచేత, కాళియుడు ఆ మడుగులోనికి ప్రవేశించాడు. అతని మూలంగా ఆవులకు, మనుష్యులకు ఉపద్రవం కలుగకుండా ఉండడంకోసం, శ్రీకృష్ణుడు అతణ్జి మడుగునుండి బయటకు వెళ్లగొట్టాడు. కాళియుడు సమర్పించిన దివ్యమైన గంధాలు, వస్త్రాలు, రత్నాభరణాలు ధరించిన శ్రీకృష్ణుడు మడుగులోనుండి బయటకు వచ్చాడు. పోయిన ప్రాణం తిరిగివస్తే ఇంద్రియాలకు చైతన్యం కలిగినట్లుగా, మరణించాడనుకొన్న శ్రీకృష్ణుడు తిరిగి రాగానే యశోద, రోహిణి మొదలయిన ఆడువారు, నందుడు, సునందుడు మొదలయిన మగవారు, తేరుకొని, తెప్పరిల్లి, పరమానందాన్ని పొందారు. బలరాముడు సంతోషంతో శ్రీకృష్ణుణ్ణి కౌగిలించుకొన్నాడు. అప్పుడు

శ్రీకృష్ణుడు తిరిగి రావడంతో ఆబోతులు గర్వంతో రంకెలు వేశాయి. లేగదూడలు అటూ ఇటూ చెంగుచెంగున దూకాయి. ఆవులు సంతోషంతో పొంగిపోయాయి. చెట్లు చిగురించాయి.

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు బ్రాహ్మణదంపతులు నందుణ్ణి చూచి, 'నీ కొడుకు పామునుండి విడుదల పొందాడు, నీ భాగ్యం స్థిరమైంది. గొప్పది. దానికి తిరుగులేదు' అని ఆశీర్వదించారు.

యశోద కృష్ణుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని, తలను ప్రేమతో నిమురుతూ, నాయనా! నిన్ను ఆ భయంకరమైన పాము కరచినపుడు నన్ను ఏమని పిలిచావో గదా! భయపడిపోలేదు గదా! రా నాయనా! అని ప్రేమతో కన్నీరు కారుస్తూ శ్రీకృష్ణుని శిరస్సును మూర్కొంటూ ప్రేమతో అతణ్ణి కౌగిలించుకొంది.

ఈ విధంగా జరిగినదానికి సంతోషించి ఆ సాయంకాలం గొల్లలంతా ఆ యమునానది ఒడ్డు మీదే ఉండిపోయారు. ఆకలిదప్పికలకు తట్టుకోలేక అలసి, సాలసి అక్కడే ఆలమందలతో పరుండిపోయారు. అర్ధరాత్రంలో కార్చిచ్చు పుట్టి విశాలమైన ఆ అడవిని అన్నివైపులా దహిస్తూ వచ్చింది. గొల్లల ఒళ్లు కాలాయి, దానితో ఉలిక్కిపడి, లేచి, వారు మాయా బాలకుడుగా అవతరించిన శ్రీకృష్ణుణ్ణి శరణువేడి ఈ విధంగా అర్ధించారు.

కమలాలవంటి కన్నులు గల కృష్ణా! మహాపరాక్రమా బలరామా! ఈ కార్చిచ్చు చుట్టుముట్టి మమ్మల్ని అందరినీ కాల్చివేయడానికి దూసుకొని వస్తోంది. పొగలతో, నిప్పురవ్వలతో, మంటలతో భయంకరంగా ఉంది. మాకు మీరు తప్ప వేరుదిక్కు లేదు. ఈ కార్చిచ్చును అణచి, మమ్మల్ని రక్షించండి.

ఓ కృష్ణా! నిన్ను నమ్మినవారికి ఆపదలు కలుగవు. భయంకరంగా అన్నివైపుల నుండి కమ్ముకొని వచ్చే ఈ కార్చిచ్చు మా జోలికి రాకుండా చెయ్యి.

ఈ విధంగా మొర పెట్టుకుంటున్న గొల్లలందరిమీద శ్రీకృష్ణుడు జాలి చూపించాడు. సర్వలోకాలకు ప్రభువయినవాడూ అనంతమైన సామర్థ్యం కలవాడూ, కనుక ఆ కార్చిచ్చును మంచినీళ్లప్రాయంగా తాగేశాడు. గొల్లలంతా పదిదిక్కులు పిక్కటిల్లేలాగ అతని గొప్పతనాన్ని వర్ణిస్తూ పాటలు పాడారు. పిమ్మట కృష్ణుడు ఆవులమందలతోను, బంధువులతోను కలిసి నెమ్మదిగా నడచుకొంటూ వ్రేపల్లెకు వెళ్లాడు. ఈ విధంగా బలరామకృష్ణులు మాయామానుషరూపంతో వినోదిస్తూ ఉండగా

గ్రీష్మర్తువర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Kaliya's wives Nagaamganalu praying to Lord Krishna - కాళియుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

కాళయుని భార్యలైన నాగాంగనలు శ్రీకృష్ణుని నుతించుట

ఈ విధంగా శ్రీకృష్ణుడు కాళియుని పడగలమీద తాండవం చేయడంచేత, తీవ్రమైన ఆతని కాలితాపులకు కాళియుని పడగలన్నీ చితికిపోయాయి. కాళియుడు బాధతో కదలిక లేక శవంలాగ పడి ఉన్నాడు. అటువంటి దీనావస్థలో ఉన్న తమభర్తను చూచి, కాళియునిభార్యలమనస్సులు శోకంతో కలవారపాటుకు లోనయ్యాయి. 

కాళియుని భార్యలు శ్రీకృష్ణుణి దర్శించడానికి బయలుదేరారు. ఆ తొందరలో ముడుచుకొన్నవారి కొప్పులు విడివడి పోయాయి. అలంకారాలు చెదరిపోయాయి. పాలిండ్లబరువుకు తీగలాగ సన్నంగా సుకుమారంగా ఉన్న నడుములు అల్లాడిపోయాయి. పైటకొంగులు జారిపోయాయి. దిక్కుతోచక, భ్రాంతితో కలవరపడిపోయారు. ఏడుస్తూ ఉండే తమ పిల్లల్ని ముందుంచుకొని, జంకుగొంకులకు లోనవుతూ, భక్తిభావంతో, మంచి గుణాలు కలవాడయిన శ్రీకృష్ణుణ్ణి దర్శించారు.

కాళియునిభార్యలు శ్రీకృష్ణుణ్ణి దర్శించి, సాష్టాంగనమస్కారాలు చేసి, నుదుటిమీద చేతులు జోడించి, ఈ విధంగా విన్నవించుకొన్నారు.

సకలసద్గుణసంపన్నుడవైన ఓ శ్రీకృష్ణా! దుష్టశిక్షణ చేయడంకోసం భూమిమీద అవతరించినవాడివి నువ్వు, దుర్మార్గుడయిన ఈ కాళియుణ్ణి శిక్షించడం గుణమే కాని దోషం కాదు.

సర్వలోకాలకు ఆధారభూతుడవయిన ఓ పరమేశ్వరా! శత్రువుల కొడుకులయందు గూడ సమభావంతో దయ చూపే వాడవు. అట్టి నీకు ఎవరిమీదను పగ ఉండదు. దుష్టుల్ని శిక్షించడం లోకసంరక్షణంకోసం తప్ప మరేమీ కాదు.

విషం నోట్లోను, మనస్సులో కోపం ఉంచుకొని తిరిగేవారం అయిన మమ్మల్ని శిక్షించడం వాస్తవానికి దండనం కాదు. ఒకవిధంగా మాకు మేలు కలిగించడమే. నీవు చేసిన ఈ పనితో మాకు విషం కలవారమనే పొగరు దిగిపోయింది.

ఈ కాళియసర్పరాజు పూర్వజన్మంలో ఎంతగొప్పతపస్సు చేశాడో? ఎటువంటి పుణ్యకార్యాలు ఆచరించాడో? ఎటువంటి సత్యవాక్యాలు పలికాడో? ఎంతటి మహానుభావులకయినా ఒనగూడని పరమేశ్వరుడవైన నీవు వేడుకతో ఈతని పడగలమీద నాట్యం చేశావంటే అదెంతటి అదృష్టమో గదా!

ఓ పరమేశ్వరా! స్త్రీలందరిలోను శ్రేష్ఠురాలయిన లక్ష్మీదేవి నిన్ను పొందడంకోసం, చాలకాలం తపస్సుచేసి, ఎన్నో గొప్ప గొప్ప నోములు నోచి, మహాతేజస్సుతో ప్రకాశించే నీ పాదాల ధూళిలో ఒక కణాన్ని మాత్రమే స్పృశించే అర్హతను సంపాదించుకొనింది. ఈ కాళియుడు ఏ తపస్సు చేయకుండానే, ఏ నోములు నోచకుండానే, నీ పాదాల పూర్ణస్పర్శకు నోచుకొన్నాడంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం!

ఓ శ్రీకృష్ణా! మంచివీ, చక్కనివీ అయిన నీపాదాల ధూళికణాలు సోకాయి అంటే, ఇంక వారికి పుట్టుక ఉండదు. అట్టివారు పూర్ణకాములయి, ఇంక కోరదగినదేదీ లేని కృతార్థులౌతారు. అందువల్ల వారు దేవేంద్రపదవిని గాని, బ్రహ్మపదవినిగానీ, మహారాజపదవినిగానీ, పాతాళలోకాధిపత్యాన్ని గాని, హఠయోగ రాజయోగ సిద్ధులను గాని వేటినీ అంగీకరింపరు.

ఈ కాళియుడు తమోగుణం కలవాడు. క్రోధం కలవాడు. అయినప్పటికిని, చావుపుట్టుకలకు, కామక్రోధాదులకు, సుఖదుఃఖాలకు లోనవుతూ ఆలుబిడ్డలతో జీవించే సంసారు లెవ్వరికీ కోరడానికి కూడ శక్యం కానట్టి శ్రీకృష్ణపాదస్పర్శరూపమైన ప్రయోజనాన్ని ప్రత్యక్షంగా పొందింది.

దేవా! నీవు నశించే స్వభావంగల జీవులందరిలోనూ నశింపనివాడివై, అక్షరరూపుడవయి అంతర్యామి అనే పేరుతో ఉన్న పరమపురుషుడివి. దేశకాలవస్తువుల పరిమితులకు లోబడని మహాత్ముడవు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలకును, వానిచే నేర్పడిన సకలవస్తు సముదాయాలకును ఆధారమైనవాడగుటవలన భూతావాసుడివి. పంచభూతాలే రూపంగా గలవాడవగుటచే భూతశబ్దమునకు అర్థమైనవాడివి. అన్ని కారణములకు కారణమయిన మూలప్రకృతికి గూడ అతీతమైన పరమాత్ముడవు. ఆత్మజ్ఞానం, ప్రాపంచికజ్ఞానంకూడ పరిపూర్ణంగా కలవాడివి. సత్త్వరజస్తమోగుణసంబంధం లేనివాడివి. పుట్టుట, పెరుగుట, రూపం మారుట, ముదురుట, తరుగుట, చచ్చుట అను ఆరువిధాలయిన వికారాలు లేని పరబ్రహ్మవు. మాయాశక్తిని అధీనంలో ఉంచుకొని, సృష్టి స్థితిలయాలు కొనసాగిస్తూ అనంతమైన సామర్థ్యం కలవాడవయి, ఆ మాయతో కొంచెంకూడ సంబంధం లేనివాడివి. అఖండమైన కాలాన్ని సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు మొదలయిన భేదాలతో చక్రంలాగ త్రిప్పుతూ ఉన్నవాడివి. కాలస్వరూపుడవు. కాలశక్తికి ఆధారమైనవాడివి. సృష్టిస్థితి సంహారాలనే, కాలవిభాగాలయిన సంవత్సరాదులను గమనిస్తూ కూడ వానితో ఏ విధమైన సంబంధంలేకుండా ఉండే సర్వసాక్షివి. నీకు నమస్కరిస్తున్నాము. ఇంకా

మాయాతీతుడవైన ఓ శ్రీకృష్ణా! ఈ ప్రపంచం అంతా నీ రూపమే. దీనికి సృష్టికర్తవు నువ్వే, ఉదాసీనంగా ఉండి, దీనినంతనూ గమనిస్తూ ఉన్నవాడివీ నువ్వే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే పంచభూతాలు, వానికి విషయాలయిన శబ్దస్పర్శరూపరసగంధాలు, ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్తం అనే అంతఃకరణ భేదాలు అన్నీ నీ రూపమే. సత్త్వరజస్తమోగుణాలచేత ఆవరింపబడుతూ, నీ అంశలుగా పుట్టిన ప్రాణులకు సుఖదుఃఖానుభవం కలిగించేవాడివి నువ్వే, వాస్తవానికి సత్త్వరజస్తమోగుణాలకు లోబడక, ఏ విధమైన వికారాలు పొందకుండగా, ఇంద్రియాలకు గోచరించకుండా, సూక్ష్మరూపంలో ఏకరూపంగా ఉన్నవాడివి, సర్వజ్ఞుడవు. నీకు నమస్కరిస్తున్నాము. మా మనవి చిత్తగించు.

(కూటస్థుడు - పంచభూతాత్మకమైన శరీరంలోని జీవుణ్ణి నడిపించేవాడు = పరమాత్మ. అంటే ఏ వికారాలూ లేక నిశ్చలంగా ఉండే ఆత్మ కూటము= దాగలి. దీనిపై ఎన్ని వస్తువులు పెట్టి కొట్లూ - ఏ రూపాలుగా మారుస్తున్నా - వాటిగుణం కానీ, మార్పుకానీ చెందక, తన స్థితిలోనే నిర్వికారంగా ఉంటుంది. ఆత్మకూడా - దాగలి వంటిదే.)

ఓ శ్రీకృష్ణా! మాయకు లోబడిన ప్రజలు నిన్నుగురించి అనేకవిధాలవాదాలకు లోనవుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడని భక్తులు మొదలయినవారివాదం. అసలే లేడని చార్వాకులు మొదలయినవారి వాదం. ఏకరూపుడు-కాదు అనేక రూపుడు, అన్నీ తెలిసినవాడుకాదు, కొంచెమే తెలిసిన జీవరూపుడు, మాయకు లోబడినవాడు కాదు, మాయకు అతీతుడు. ఈ విధంగా నీ మాయాప్రభావంవల్ల ఎందరో ఎన్నో విధాలుగా వాదిస్తూ ఉంటారు. అన్నివాదాలకు అనుకూలంగా ఉన్నట్లే కనబడుతూ ఉంటావు. పదాలు(సంకేతాలు), వాని అర్ధాలు, వాని స్వభావాలు, వానిలోని తారతమ్యాలు మొదలగువానిచేత సర్వజ్ఞత్వం, అల్పజ్ఞత్వం మొదలయిన మహిమలతో గూడినవాడివి. జ్ఞానసాధనాలయిన చక్షురాదులు అయిన ఇంద్రియాలు నీరూపమే. ఇంద్రియా పేక్షలేని జ్ఞానం ఉన్నవాడివగుటచే పరమాత్మవు. వేదాలను నిశ్శ్వాసరూపంగా వెలువరించావు కనుక వేదాలకు జన్మస్థానం నువ్వే ('శాస్త్రయోనిత్వాత్' - బాదరాయణుని వేదాంతసూత్రం) (యస్య ని
శ్శ్వాసితం వేదాః శ్రుతి). అంతఃకరణ దశా భేదాలయిన అహంకారం - బుద్ధి - మనస్సు- చిత్తం అనే వానికి అధిదేవతలయిన సంకర్షణుడు - వాసుదేవుడు - ప్రద్యుమ్నుడు - అనిరుద్దుడు అను నలుగురు నీ వ్యూహరూపాలవారే. భక్తజనుల్ని రక్షించేవాడివి నువ్వే. జీవులఅంతఃకరణాన్ని ఇంద్రియాలద్వారా విషయాలమీదకు మళ్లిస్తూ ఉంటావు. నిన్ను సేవించేవారికి తగిన ఫలాలు ఇవ్వడంకోసం సత్త్వరజస్తమోగుణాలతో ప్రపంచాన్ని ఆవరించి ఉన్నావు. సాత్త్విక - రాజసిక - తామసిక కర్మలకు తగిన సాత్త్విక - రాజసిక - తామసిక ఫలాలు ఇస్తూ ఉంటావు. జీవుల అంతఃకరణవృత్తులద్వారా తెలియదగిన సత్త్వరజస్తమో గుణాలకు సాక్షివిగా ఉంటూ, జనులకు గోచరించకుండా ఉంటావు. ఊహకందని అభివృద్ధి కలవాడివి కనుక బ్రహ్మవు. నిరాఘాటమైన ప్రవర్తన కలవాడవు. అవ్యక్తం మొదలుకొని సకలస్థావర జంగమ సృష్టికి కారణమైనవాడివి. మనస్సును ఇంద్రియాలద్వారా ప్రవర్తింపజేయడంవల్ల జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు నీవే అధిపతివి. జప మంత్ర యోగాదులచేత స్వాధీనంకాని ఆత్మయందే క్రీడిస్తూ ఉంటావు కనుక ఆత్మారాముడవు. మౌనాన్ని ఆశ్రయించిన వాడవు. స్థూల సూక్ష్మభూతాల గతులు గుర్తిస్తూ, దేనితోనూ సంబంధం లేకుండా ఉంటావు. ఈ ప్రపంచం నీ రూపం కాదు. కానీ సమస్తమూ నీవే. ఈ ప్రపంచంయొక్క స్థితిలయాలకు సాక్షివి నీవే. జ్ఞానాజ్ఞానాలకు నీవేకారణం. నీకు నమస్కారం.

సమస్త జగత్తులకు ప్రభువైన శ్రీకృష్ణా! నీవు యశస్సు, వీర్యం మొదలగు ఆరువిధాలయిన ఐశ్వర్యం కలవాడివి. కాలస్వరూపుడివి. ఏ విధమయిన కోరిక లేకుండానే లీలామాత్రంగా చతుర్ముఖబ్రహ్మ రూపం ధరించి విశ్వసృష్టినీ, విష్ణురూపం ధరించి స్థితినీ, రుద్రరూపం ధరించి నాశాన్నీ చేస్తూ ఉంటావు.

ఓ పరమేశ్వరా! ఈ శరీరాలు ఎంతకూ శాంతిలేనివి. అంతేకాక అజ్ఞానంతో కూడుకొన్న మూర్ఖమైన జన్మలు ఇవి. కాని నీవు ప్రశాంతతను అనుభవిస్తున్న మంచివాళ్లలోమాత్రమే ధర్మానికి మేలు కలిగించేందుకు అనుభవానికి వస్తూ ప్రకాశిస్తూ ఉంటావు.

కృపానిధీ! శ్రీకృష్ణా! నీలో ఏ తప్పు లేదు. తప్పు చేసిన మా భర్తను శిక్షించడం నీ తప్పు కాదు. మా పెనిమిటి ఆలోచనలలోను, చేతలలోనే పొరపాట్లు ఉన్నాయి. లోకంలో కుమారులు ఎటువంటి తప్పు చేసినా తల్లిదండ్రులు క్షమిస్తూ ఉంటారు గదా! రాజులు కూడ తప్పు చేసినవారిని ఒక్కొక్కసారి దండించకుండా విడిచిపెడుతూ ఉంటారు. నీవు జగత్తునకే ఈశ్వరుడవు. దయకు గనివంటివాడవు. అటువంటి నీవు మా భర్తను దయ తలచి కాపాడుమయ్యా!

మా పెనిమిటి మంచివాడని సమర్ధించలేము. ముమ్మాటికీ ఇతడు మూర్ఖుడు. ముక్కోపి,దుర్మార్గుడు. అయినప్పటకీ ఇతణ్ణి నీవు సంహరిస్తే మేము వైధవ్యదుఃఖం అనుభవించవలసి వస్తుంది. దాన్ని మేము భరించలేము. నీవు తప్ప మాకు మరొక దిక్కులేదు. కాబట్టి దయతో మా భర్తను మన్నించి, మా భర్త పడగలమీద కాళ్లతో త్రోక్కడం చాలించి, మాకు పతిభిక్షను ప్రసాదించు స్వామీ!

సర్వలోకాలవారు తమకు ఏ ఆపద వచ్చినా నిన్ను ఆశ్రయించవలసిందే. నీవు భక్తులకు అభయ మిచ్చేవాడివి. లక్ష్మీదేవికి భర్తవు. ఓ కృష్ణా! ఇదిగో చూడు. ఇప్పటికే మా భర్త శరీరం అంతా నలిగిపోయింది. పడగలన్నీ పగిలి పోయాయి. ప్రాణాలు వస్తూ పోతూ ఉన్నట్టుగా సొమ్మసిల్లి పోయాడు. ఇతణ్లి దయతో చూచి, ఇంక బాధించక విడిచి పెట్టవయ్యా!

భక్తులకు కోరిన వరాలిచ్చి అనుగ్రహించే ఓ శ్రీకృష్ణా! మా ప్రాణనాథుని ప్రాణాలు ప్రసాదించి, ఆతనితో మళ్లీ మాకు వివాహం జరిపించు. నీవు జరిపించే ఈ పెండ్లియే శాశ్వతంగా నిలిచేది. శుభాలు కలిగించేది. అంతేగాని మాకు చిన్నప్పుడు జరిగిన పెండ్లి పెండ్లే కాదు. (నిజమే కదా! మనం చేసే పెండ్లికంటే సర్వమంగళప్రదుడైన భగవంతుడు చేసేపెండ్లి శుభప్రదం, శాశ్వతం అవుతుంది. దంపతులు చిరకాలం వర్ధిల్లుతారు)

నీ మీద ఒట్టు పెట్టి మరీ చెబుతున్నాము. ఈనాటినుండి ఇంక ఎవ్వరినీ బాధించడు. ఇంతకు ముందులాగ భయపెట్టి పాపపు పనులు చేయడు. నీ చెప్పుచేతలలో ఉంటాడు. కాబట్టి మా పెనిమిటి ప్రాణాలు మాకు ప్రసాదించవయ్యా!

శరణుచొచ్చినవారిని రక్షించే స్వభావంకల శ్రీకృష్ణుడు - తమ భర్త జీవితాన్ని కోరే కాళియునిభార్యలను అనుగ్రహించాడు. కాళ్లతో తొక్కడం చాలించి, పక్కకు తప్పుకొన్నాడు. దాంతో కాళియుడు తన ప్రాణాల్ని, ఇంద్రియాల్ని పగిలిన పడగల్నీ చాలా కష్టంమీద కూడ తీసికొని, ఆయాసపడుతూ శ్రీకృష్ణునికి నమస్కారం చేసి, పశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నాడు.

తామరరేకులవంటి కళ్లు గలవాడివి పరమేశ్వరుడివి, అయిన శ్రీ కృష్ణా! మా నడకలు తిన్ననైనవి కావు. మా నోళ్లలో భయంకరమైన విషం ఉంటుంది. దుర్మార్గులం. కోపం గర్వం కలిగి ఉంటాం. ఇటువంటి మేము మంచివాళ్లం ఎందుకు అవుతాం? ప్రాణులు పుట్టుకతో వచ్చినగుణాలను ఎక్కడయినా విడిచిపెడతాయా? మా మనోవికారాలు అందరికీ తెలిసినవే! సర్వజ్ఞుడవైన నీకు ఇవి వింతగా ఎందుకు కనబడతాయి? మాలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ దయతలచి మాకు ఉపకారం చేశావు.

సమస్తలోకాలకు ప్రభువయిన శ్రీకృష్ణా! అనేకవిధాలయింది ఈ ప్రపంచం. దీనికి నీవు సృష్టికర్తవు. జన్మ మొదలయిన షడ్భావవికారాలు, రూపాలు, శక్తులు, బీజరూపాలయిన సంస్కారాలు, ఆలోచనలు నీవు నిర్మించిన ఈ ప్రపంచంలోని అంశాలే - అన్నీ కూడా నీవే!. మేము కూడ ఆ ప్రపంచంలోని వాళ్లమే. మేము సహజంగా కోపస్వభావం కలవాళ్లం. ఎలాపడితే అలాగ ప్రాకులాడే స్వభావం కలవాళ్లం. మహాయోగులకు గూడ అంతుబట్టనిది నీ మాయ. అటువంటి దాన్ని మేము ఏవిధంగా దాటగలం? నువ్వు సర్వజ్ఞుడివి. మమ్మల్ని రక్షించాలి అనిపిస్తే రక్షించు. శిక్షించాలి అనిపిస్తే శిక్షించు. ఈ సమస్త విశ్వం నీదే. మాది అంటూ ఒకచోటు లేదు. నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాము.

(పుట్టుట, ఉండుట, మారుట, పెరుగుట, తరుగుట, నశించుట అనేవి షడ్భావవికారాలు.)

ఓ శ్రీకృష్ణా! సనకాది మహాయోగీశ్వరులకు కూడా దుర్లభమైన నీ పాదధూళి నాకు లభించింది. నా భాగ్యం ఎంతటిదో కదా! ఇంక నేను ఎక్కడ ఉన్నా నాకు మంచే జరుగుతుంది.

ఈ విధంగా మనవి చేసిన కాళియునిమాటలు విన్న శ్రీకృష్ణుడు, కరుణతో స్థిరనిశ్చయానికి వచ్చి, అతనితో ఇలాగ అన్నాడు.

ఓ కాళియుడా! ఈ మడుగులోని నీటిని ఆవులమందలు, మనుష్యులు త్రాగుతూ ఉంటారు. నీవు ఇంక ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ వేళే నీవు -నీ భార్యలు, బిడ్డలు, బంధువులతో కలిసి సముద్రంలోకి వెళ్లిపొండి.

ఓ కాళియుడా! ఎవరైతే నేను నిన్ను శిక్షించిన ఈ కథను, నన్ను మనస్సులో ధ్యానం చేస్తూ ఉదయమూ, సాయంకాలమూ, పారాయణ చేస్తూ, స్తుతిస్తూ ఉంటారో, వారికి ఎప్పుడైనా, ఎక్కడైనా మీ సర్పజాతివల్ల భయం కలుగదు. మీ విషం వారికి ఏవిధమైన హానీ కలిగించదు.

ఈ క్షణంనుండి ఏ మానవులు ఈ యమునలోని కాళిందీ మడుగులో స్నానంచేసి, ఉపవాసం ఉండి, స్థిరభక్తితో నన్నే ధ్యానిస్తూ పూజిస్తూ దేవతలకు, పితరులకు, ఋషులకు తర్పణాలు విడుస్తూ ఉంటారో, వారు సర్వపాపాలనుండి విముక్తులయి, నిర్మలమైన మనస్సు కలవారయి మేలు పొందుతారు.

ఇంతకుమునుపు నీవు రమణక ద్వీపంలో ఉండేవాడవు. గరుత్మంతుడు నిన్ను పట్టుకొని తింటాడేమోననే భయంతో వచ్చి, అతనికి కనబడకుండా ఉండడంకోసం లోతైన ఈ మడుగులో దాగుకొన్నావు. నేను నీ మీద నాట్యం చేయడంవల్ల నా పాదాల ముద్రలు నీ పడగలమీద పడ్డాయి. వాటిల్ని చూచి, గరుత్మంతుడు ఇంక నీ జోలికి రాడు. నిర్భయంగా ఉండు.

ఎవరికీ అంతు చిక్కకుండా విహరించే శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే, కాళియుడు అలా చేయడానికి అంగీకరించాడు. తన భార్యలతో కలిసి తాను క్రొత్తవి, దేవలోకంలో మాత్రమే లభ్యమటయ్యేవి అయిన వస్త్రాలు, ఆభరణాలు, మణిసరాలు బహుమతిగా ఇచ్చాడు. తుమ్మెదలకు ఆశ్రయమై, తేనెలు వెల్లివిరిసే నల్లకలువల దండను భక్తితో సమర్పించాడు. భార్యలు, కొడుకులు, స్నేహితులతో కలసి శ్రీ కృష్ణుణ్ణి చాలా పర్యాయాలు స్తోత్రం చేసి, సాష్టాంగ దండప్రణామ ప్రదక్షిణలుచేసి, లేచి నమస్కరించి, శ్రీకృష్ణునివద్ద సెలవు తీసుకొని, సముద్రంలోని ద్వీపానికి వెళ్లిపోయాడు. ఈ ప్రకారంగా

కాళియుణ్ణి యమునానదినుండి దూరంగా సముద్రంలోకి వెళ్లగొట్టడం ఎంతటి గొప్పవారికీ సాధ్యంకాని పని. అటువంటి పనిని శ్రీకృష్ణుడు అలవోకగా చేశాడు. దానితో యమునానది అమృతంవంటి నీటితో అందరికీ ప్రీతిపాత్రమై వెలుగొందింది.

కాళియుని పూర్వకథ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...