Sunday, January 4, 2026

Kundeti Amavasya Nomu Katha - కుందేటి అమావాస్య నోము కథ

కుందేటి అమావాస్య నోము కథ

ఒక కుందేలు చాకలి బానలో పిల్లలను పెట్టి మెతకొరకు ఎక్కడికోపోయినది. చాకలిదివచ్చి పొయ్యిమీద నా చాకలిబాననుంచి మంట పెట్టుచున్నది. అంతట మేతకొరకు పోయిన కుందేలు తన పిల్లలయొద్దకు వచ్చిచూచేసరికి పొయ్యిమీద నా చాకలిబానలో పిల్లలు ఉడికిపోతూ ఉడికిపోవుచున్నామమ్మా! అని యరుచుచున్నవి. తల్లియు నా బానచుట్టు తిరుగుచు నుడకకండి బిడ్డలారా! ఉడకకుండా ఉండ్రాళ్ళవాయనము నిచ్చినాను, అని తల్లి చెప్పినది. పిమ్మట పిల్లలు చచ్చిపోయేమమ్మా అని అరచినవి. చావకండి బిడ్డలారా! చావకుండా! చలిమిడి వాయనమిచ్చితి
నని తల్లిపలికెను. అంత చిమిడితిమే యమ్మా! యని పిల్లలరచినవి. చిమడకండి బిడ్డలారా! చిమడకుండా చిమ్మిలి వాయనమిచ్చినానని తల్లి యనెను. తరువాత పిల్లలు వేగితిమేయమ్మా! అని యరచినవి. వేగకండి బిడ్డలారా! వేగకుండా వేపుడు బియ్యం వాయనమిచ్చినాని పలికెను. పేలిపోయితిమేయమ్మా యని పిల్లలరచినవి. పేలకండి బిడ్డలారా! పేలకుండా పేలాలు వాయనమిచ్చానని తల్లి చెప్పెను. అడుగంటి తిమేమ్మ అని అరచినవి అడుగంటకండి బిడ్డలారా! అడుగంటకుండా అట్లు వాయనమిచ్చినానని తల్లిపలికెను. కాలిపోతిమేయమ్మాయని పిల్లలరచినవి. కాలకండి బిడ్డలారా! కాలకుండా కర్రలు వాయనమిచ్చినానని తల్లిపలికెను.
పాకితిమేయమ్మా! యని పిల్లలరచినవి. పాకకండి బిడ్డలారా! పాకకుండా పరమాన్నము వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. పొంగితిమేయమ్మా! యని పిల్లలరచినవి. పొంగకండి బిడ్డలారా! పొంగకుండా పోలులు వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. నానితిమేయమ్మా! యని పిల్లలరచినవి, నానకండి బిడ్డలారా! నానకుండా నానబియ్యరి వాయనమిచ్చితినని తల్లి పలికెను. మాడిమితేయమ్మా! యని పిల్లలరచినవి. మాడకండి బిడ్డలారా! మాడకుండా మాడలు వాయనమిచ్చినానని తల్లిపలికెను. కందితిమేయమ్మా ! అని పిల్లలరచినవి. కందకండి బిడ్డలారా!
కందకుండ గారెలు వాయనమిచ్చినానని తల్లిచెప్పెను. ఇట్లు చెప్పుచు తల్లి బానచుట్టు  తిరుగునప్పటికి పిల్లలన్నియు పైకివచ్చి తల్లిదగ్గరకు వెళ్ళిపోయినవి. ఇదియంతయు  చూచుచున్న చాకలిది ఆశ్చర్యమునొంది కుందేలుని ఎట్లు నీపిల్ల లన్నియు బ్రతికి వచ్చినవని యడిగెను. అప్పుడా కుందేలు చాకలిదానితో - నీవు నా పిల్లలున్న బాన పొయ్యిమీద పెట్టి ఉడికించుచున్నావు. నా పిల్లలన్నియు అరచు చున్నవి. ఆ యేడుపువిని సహించలేక శోకముతో బానచుట్టు తిరిగినాను. అంతకన్న నేనేమి యెరుగనని చెప్పెను. అప్పుడు చాకలిది, ఈ రోజున అమావాస్య, ఈరోజు మొదలుకొని కధచెప్పి అక్షింతలు వేసికొని దీనికి, కుందేటి అమావాస్య అని పేరు పెట్టుకొని నోము పట్టెదనని నోముపట్టి కథచెప్పుకొని అక్షింతలు వేసుకొనెను. ఈ ప్రకారం పదమూడు అమావాస్యములు నోచుకొని అమావాస్య కొక్కరకము చొప్పున చలిమిడి మొదలైనవి చేసికొని దక్షణ తాంబూలము పెట్టి ముత్తయిదువులకు వాయనమిచ్చెను.

ఉద్యాపనము: మూడు మానికెలబియ్యము చలిమిడిచేసి అది కుందేటి. తల్లిపిల్లలుగాచేసి, చాకలిబానలోని దానిలో పెట్టి చీర రవికెలగుడ్డ, నల్లపూసలు, లకృజోడు, దక్షణ తాంబూలములతో ముత్తయిదువునకు వాయనము యియ్యవలెను.

కథలోపమైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినను ఫలముతప్పదు.

No comments:

Post a Comment

Shani Shingnapur Maharashtra - శని శింగనాపూర్ మహారాష్ట్ర

శని శింగనాపూర్,  మహారాష్ట్ర మహారాష్ట్రలోని అహ్మద నగర్ జిల్లా నేవాస  తాలూకా లో   ఉన్న శ్రీ శనైశ్వరుని దేవస్థానం శని శింగనాపూర్ ఆలయం పుణ్యక్షే...