Friday, January 2, 2026

Vishnu Kranta Katha - విష్ణుక్రాంత కథ

విష్ణుక్రాంత కథ

ఒక బ్రాహ్మణుని భార్య తన తోడబుట్టినవారికి పెండ్లి తల పె
ట్టినప్పుడెల్ల భర్తకు వ్యాధి సంభవించుచుండెను. ఈ యాటంకముచేత అనేక పర్యాయములు సిద్ధమైన పెండ్లికార్యము మానివేయుచువచ్చిరి. కొన్నాళ్ళకు బంధువులందరు ప్రాణము విసిగినవారై ఎన్నాళ్ళిలాగున పెండ్లికార్యము మానుదుమ”ని పెండ్లి ముహూర్తము నిశ్చయించిరి. అంత నా బ్రాహ్మణునికి ప్రాణముమీదికి వచ్చెను. అతని భార్య ఆ జబ్బు సరకు సేయక వానిని యింటిలో నుంచి తలుపుగొళ్లెము పెట్టి తోడబుట్టినవాని వివాహమునకు వెళ్లిపోయెను. ఆమె చెరుపుగట్టు వద్దకు వెళ్లుసరికి యచ్చట విష్ణుక్రాంత పువ్వులు విడిచియుండెను. ఆ పువ్వుల నామె కాలదన్నుకొని చక్కాపోవు చుండెను. అంత విష్ణుక్రాంత "నోచినదివిను కాంత నోచినది నోచినపువ్వులు 
కాలదన్నుకొని పోవుచున్నది. చెరువులోనున్న చామంతులారా! చూచితిరా?" అని యొక ధ్వని వినపడెను. "ప్రేమగల ప్రాణేశ్వరునకు ప్రాణము మీదకురాగా చాపనిచుట్టి నట్టింటపెట్టి దయగల తమ్ముని పెళ్ళికి వెళ్లుచున్నది. ఊరకొందు విష్ణుక్రాంతా!" అని మరల ప్రత్యుత్తర మిచ్చెను. ఈ మాటలా బ్రాహ్మణుని భార్యవిని యేమి మాట్లాడకుండ వెళ్లిపోయెను. ఆమె తమ్ముని పెండ్లి అయిన తరువాత తిరిగి యా మార్గమున వచ్చుచుండెను. వెళ్లబోయే సమయమున తానా పువ్వులనెచ్చట చూచెనో యాచోటికి బోయి "విను విష్ణుక్రాంతా! మీరందరు ఏమి చెప్పుకున్నార" ని యడిగెను. "విన్నప్పుడు మానినావు .గనకనా? యిప్పుడు నీకెందుకు వెళ్లుమ" ని విష్ణుక్రాంత చెప్పగా నా 
బ్రాహ్మణభార్య "ఆ మాటలు చెప్పినగాని వల్లగాదు నేను వెళ్లన" ని చెప్పెను. "ఓ బ్రాహ్మణ కాంతా! ప్రేమగల ప్రాణేశ్వరునకు ప్రాణముమీదికిరాగా నట్టింట దయగల తమ్మునిపెండ్లికి వెళ్లవద్దన్నాన" ని చెప్పెను. "నీవెందుచేత నీలాగు చెప్పినావ" ని యడుగగా నా బ్రాహ్మణ స్త్రీకి విష్ణుక్రాంత యిట్లని చెప్పెను- "నీవు ముందు జన్మమున విష్ణుక్రాంత నోముపట్టి ఉల్లంఘనము చేసినావు. అందుచేత నీ తమ్మునికి పెండ్లి తలపెట్టినప్పుడు నీ పెనిమిటికి ప్రాణముమీదకి వచ్చుచుండెను. ఇప్పుడు నీవా
నోముపట్టి ఉద్యాపనచేసుకొని అక్షింతలు వేసుకొన్నయెడల నీకు సిరిసంపద, అయిదవ తనము వృద్ధియగునాని చెప్పెను.

ఉద్యాపనము: 
విష్ణుక్రాంత కు  పదమూడు జోడుల నేతిగారెలు వాయనము, పదమూడు జోడుల నైవేద్యము పెట్టి విష్ణుక్రాంత పువ్వులతో పూజలు చేసుకొని దక్షిణ తాంబూలము ముత్తయిదువుకు యియ్యవలయును.

ఆమె అట్లేయని నోము నోచుకొని ఏడాది ఐన తర్వాత ఉద్యాపనము చేసుకొని నిత్యకల్యాణము పచ్చతోరణముతో నుండెను.

Chitra Gupthuni Nomu - చిత్రగుప్పని నోము కథ

చిత్రగుప్పని నోము కథ

ఒకరాజుభార్య, ఒక మంత్రిభార్య, బ్రాహ్మణముత్తయిదువులను పెట్టుకొని నోములు వ్రతములు చేయుచుండెడివారు. ఆ వ్రతములలో మరువకుండ మంత్రిభార్య చిత్రగుప్తునినోము నోచెను. రాజుభార్య ఆ వ్రతమును పట్టుట మానివేసెను. కొన్నాళ్ళకు మంత్రిభార్య చచ్చిపోయెను. చిత్రగుప్తుడు ఆమె పాపములు విడిచిపెట్టి ఆమె యంతయు పుణ్యమే చేసినదిని చెప్పి యామెకు పుణ్యలోకప్రాప్తి కలిగించును. పిమ్మట రాజుభార్య చచ్చిపోయి చిత్రగు
ప్తునియొద్దకు వెళ్లగా ఈమె అంతయు పాపమే చెసినదని చెప్పెను. అందుకామె దుఃఖించుచు 'నేనును, మంత్రిభార్యయు సమముగా వ్రతములు నోచుకున్నాము. రాజు భార్య చిత్ర గుప్తుడిని తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను. ఎందువల్ల ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది. అందుకు చిత్ర గుప్తుడు సమాధాన మిస్తూ ఓ తరునీమనీ! నువ్వు మంత్రి భార్య తోపాటు అన్ని నోములను నోచినను ఒక్క చిత్ర గుప్తుని నోమును మరచితివి ఆ నోమును మరచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్పెను. అప్పుడామే చిత్ర గుప్తా నీ మాట నిజము నేను గుర్తు తప్పి నేనే నీ వ్రతమును మరచినాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపినా నేనూ చిత్ర గుప్తుని నోమును నోచుకోని వచ్చెదనని బ్రతిమిలాడెను. అందుకా చిత్ర గుప్తుడు అంగీకరించినవాడై ఆమెను భూలోకమునకు పంపించెను. భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్దలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్ర గుప్తుని వద్దకు వచ్చెను. అందుకా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గ లోక ప్రాప్తి నిచ్చెను.

కధలోపమైనా వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు.

ఉద్యాపన: ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను. అనంతరం ఉద్యాపన చేసుకోవలెను. ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను. ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను. అడ్డెడు తవ్వాడు (2-1/2) బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను.


చిత్రగుప్త నోము పూజా విధానం:

ఈ వ్రతము స్త్రీలు, పురుషులు లేక ఇద్దరూ చేసుకొనవచ్చును. స్త్రీలు చేసుకొనుట విశేషముగా చెప్పబడినది. ఈవ్రతము చేసుకొనుట వలన సమస్త పాపములు తొలగి, సమస్త సంపదలు లభించును. దేహానంతరము నరకలోక ప్రాప్తి కలుగకుండుటకు, యమబాధలు తొలగుటకు ఈ వ్రతమును చేసెదరు. ఎన్ని వ్రతములు చేసినను ఈ చిత్రగుప్త వ్రతము చేయనిదే అవి ఫలవంతములు కావని ఈవ్రతములో తెలుపబడినది.

చిత్రగుప్తుడు అనగా గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించువాడు. అంటే మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసిననూ చిత్రగుప్త వ్రతమును చేయకపోవుట అనగా ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమము లేకుండుట. మనోనియమము చేయకుండుట వలన అవి అన్నియు వ్యర్థములగును. కనుక ఈవ్రతమును చేయుట వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేయు శక్తి చేకూరునని గూఢార్థము. ఇది తెలుసుకుని ఆచరించిన నాడు వ్రతము ఫలవంతమగును.

చిత్రగుప్తుని పూజ ఆచరించు వారికి సలహాలు:
మెదటి సారి మాఘ సప్తమినాడు లేదా మహా శివరాత్రి నాడు ప్రారంభించవలెను.

ప్రతి సంక్రమణమునాడు పూజించ వలెను.

చివరికి మకరసంక్రమణము నాడు ఉద్యాపన చేసుకున్నచో బాగుండును.

మొదటి నెలనే కానీ, మధ్యలో కానీ చివరన కానీ ఎవరి వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకొనవచ్చును.

బంగారు ప్రతిమలు, సువర్ణాలంకృతమైన గోదానం, వస్త్రదానాదులు, దశదానాలు, షోడశ మహాదానాలు, 30 మంది బ్రాహ్మణులకు భొజనం అంటే భారీఖర్చుకదా మరి పేదవారి సంగతి ఏమిటి? అని సందేహ పడనవసరం లేదు. ఎవరి వైభవాన్ని అనుసరించి వారు చేయవచ్చును. కానీ శక్తి ఉండికూడా లోభగుణముతో చేయవలసినవి చేయకుండ ఉండరాదు.

ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే! శక్తిలేనివారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకొనవలెను.

దానం అన్నదమ్ములకు, గ్రామ కరణానికి ఇవ్వాలా? అనగా.. నిజానికి కల్పములో అలా లేదు. గృహస్థుడైన బ్రాహ్మణునకు దానమిమ్మని తెలిపిరి కనుక ఆవిధంగానే జేయవలెను. 

ప్రతినిత్యమూ భుజించు అన్నమును ముందుగా “చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః, యమాయ నమః” అనుచూ మూడు బలులను సమర్పించుట వలన చిత్రగుప్తుడు,యముడు ప్రీతి చెందుదురు.

ఉపనయనమైన వారు ఔపోసనుము చేసినప్పుడు ఈవిధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును పెట్టుట నేటికీ కలదు.

Thursday, January 1, 2026

Mogadhosilla Nomu Katha - మొగదోసిళ్ళ నోము కథ

మొగదోసిళ్ళ నోము కథ

ఒక బ్రాహ్మణుని కూతురు మొగదోసిళ్ళ నోముపట్టి యది యుల్లంఘనచేసి చనిపోయెను. ఆమె మరుజన్మమున మరియొక బ్రాహ్మణుని యింట పుట్టెను. అల్పకాలములోనే తల్లి చనిపోవుటచేత నామెకు సవతితల్లి వచ్చెను. ఆమె దరిద్రబాధ కలిగినదై యది సహింపజాలక యొకనాడు దేవాలయములోనికి వెళ్ళి ధ్వజస్థంభము వద్ద కూర్చుండి యెండనక వాననక విచారించుచు పరమేశ్వరుని ప్రార్థించుచుండెను. కొంతకాలమునకు ఆమెయందు దయగలవాడై ఈశ్వరుడు ప్రత్యక్షమై "ఏమి యో చిన్నదానా! యిట్లు విచారించుచున్నా" విని యడిగెను. బ్రాహ్మణరూపముచే ప్రత్యక్షమైన యా ఈశ్వరుని నామె సామాన్య మనుజునిగనెంచి "నాయనా! మీకెందుకు వెళ్లండని"
ప్రత్యుత్తరమిచ్చెను. అది విని భగవంతుడు "ఓ కాంతా! నీవు తలంచు కార్యము నేను దీర్చువాడను చెప్పు" మని యడిగెను. అంత నామె- "నేనొక బ్రాహ్మణుని కుమార్తెను నాకు సవతితల్లి యున్నది. దరిద్రముచేత సవతితల్లిచేత బాధపడలేక యిట్లు విచారించుచున్నన" ని చెప్పెను. అంత నీశ్వరుండు- "ఓ యింతీ! నీవు పూర్వజన్మమున మొగదోసిళ్ళనోముపట్టి యుల్లంఘన జేసినావు కాబట్టి నీకీ దరిద్రబాధ, సవతితల్లిపోరు సంప్రాప్తమైనవి. నీవిప్పుడా నోముపట్టి ప్రతిదినము నొడలికి నీళ్లుపోసుకొని, పసుపు కలిపి యొక పళ్లెములో రోజూమూడు దోసిళ్ళనీళ్ళు లెక్కచూచి పోసికొని, అది అయిన తరువాత మూడు దోసిళ్లు ముత్యములు, మూడుదోసిళ్లు పగడములు, శివుని
యాలయములోనికి పట్టుకొనివెళ్ళి శివుని రుద్రపాదములమీద పూజచేసి యధాశక్తి దక్షిణ తాంబూలాదుల నియ్యవలెను" అని చెప్పి యీశ్వరుండంతర్జానము నొందెను.

ఆ బ్రాహ్మణ చిన్నదియు భగవంతుడు చెప్పినరీతి నాచరించి సకలైశ్వర్య సంపన్నురాలై
సుఖంబుగ నుండెను.

Pasupu Gowri Katha - పసుపు గౌరీ కథ

పసుపు గౌరీ కథ

నూరు పసుపునోచిన చానకు నూరువేలేండ్లు అయిదవతనము, కొట్టపసుపు నోచిన చానకు కోటివేలేండ్లు అయిదవతనము. ఈకథచెప్పి అక్షింతలు వేసుకొని యేడాది అయిన తరువాత మానెడు సోలెడు పసుపు వెదురుపెట్టెలోపోసి రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు తోడ ముత్తయిదువునకు వాయనము యివ్వవలెను. పసుపు నరగదీసి గిన్నెలో పెట్టి రవికెలగుడ్డ, దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు పెట్టి ముత్తయిదువుకు నివ్వవలెను. 

Chitti Bottlu Katha - చిట్టిబొట్టు కథ

చిట్టిబొట్టు కథ

చిట్టి బొట్టు పెట్టవలె - సిరిగండలయింట పుట్టవలె
యేడుగురన్నలతోడ బుట్టవలె - ఏకచక్రముగా నేలవలె
పదుగురన్నలతోడ బుట్టవలె - పట్టభద్రుని చేపట్టవలె


మాఘపూర్ణిమయందు రథసప్తమినాడు ఈకధచెప్పి అక్షతలు వేసికొని, ఏడాదిదాకా అయిదుగురు ముత్తయిదువులకు ప్రతిదినమున బొట్టు పెట్టుకొనుచు, ఎడాది నిండిన తరువాత ఉద్యాపనము చేసికొనవలయును.

ఉద్యాపనము: అయిదుగురు ముత్తయిదువులకు తలంటి నీళ్ళుపోసి పిండివంటలతో భోజనముపెట్టి బంగారపు బొట్టుచేయించి ఐదుగురు ముత్తయిదువులకు అయిదుచుట్లు, అయిదు రవికలగుడ్డలు, దక్షణతాంబూలములిచ్చి నల్లపూసలు, లక్కజోళ్లు యివ్వవలెను. 

Vara Lakshmi Vrata Katha - వరలక్ష్మి వ్రత కథ

వరలక్ష్మి వ్రత కథ

సకల మహర్షులుగాంచి సూతుండిట్లనియె మునీశ్వరులారా ! స్రీలకు సకల సౌభాగ్యముల నొసంగునల్ట వ్రతరాజమును పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పియున్నాడు. దానిని చెప్పెద వినుండు. కైలాసమున మణిగణ ఖచితమగు సింహాసనమున, పరమేశ్వరునిగాంచి పార్వతీదేవి నమస్కరించి “దేవా! లోకములో స్త్రీలు ఏ వ్రతమాచరించిన సకల సౌభాగ్యములును, పుత్రపౌత్రాదులం గలిగి సుఖంబుగ నుందురో, యా వ్రతంబు చెప్పవలెననిన పరమేశ్వరుండు సంతసంబున నిట్లనియె "ఓ మనోహరిణీ! స్రీలకు అట్టి సౌభాగ్యాది సంపత్తి గలుగుజేసెడు వ్రతము
వరలక్ష్మీ వ్రతం బనునది కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందువచ్చు శుక్రవారమునాడు జేయవలయు" ననిన పార్వతీదేవి యిట్లనియె "ఓ లోకవంద్యా! నీవానతిచ్చిన వరల
క్ష్మీ వ్రతంబు నెట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు .విధియేమి? -ఏ దేవతను పూజింపవలయును? పూర్వమెవరిచే యావ్రతమాచరింపబడియె? వివరంబుగ తెలుపవలయు" ననిన పార్వతికి పరమేశ్వరుడు చెప్పుచున్నాడు. "ఓ గౌరీ! వరలక్ష్మీ వ్రతము సవిస్తరముగ చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబను నొక పట్టణంబు గలదు. ఆ పట్టణము బంగారు గోడల
చేతను, బంగారు యిండ్లతోడను ప్రకాశించుచుండెను. అట్టి పట్టణమున చారుమతి యను నొక బ్రాహ్మణసాధ్వి కలదు. ఆ మానినీ మణి భర్తను దేవునితో సమానునిగా దలంచి ప్రతిదినము నుదయమున మేలుకొని స్నానముచేసి పూవులచే భర్తపాదంబులు పూజించుచు పిదప నత్తమామలకు వివిధోపచారంబులొనర్చి యింటి పనులు చక్కజేసుకొని గయ్యాలికాక మితముగాను ప్రియముగాను భాషింపు చుండెను. ఇట్లుండ ఆ పతివ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగియొకనాడు స్వప్నమున కనపడి "ఓ చారుమతీ! నేను వరలక్ష్మి దేవిని, నీయందు నాకు దయవచ్చి ప్రత్యక్షమైతిని, శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగావచ్చెడు శుక్రవారంనాడు నన్ను పూజించిన నీ కోరికలు నెరవేర్చుదన" ని యానతిచ్చిన, చారుమతి స్వప్పములోనే వరలక్ష్మి దేవికి
ప్రదక్షిణ నమస్సారముచేసి -

నమస్తే సర్వలోకానాం జననై పుణ్యమూర్తియే
శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణువక్షస్థలాస్తయే


అని యనేక విధంబులుగ స్తుతించి "ఓ తల్లీ! నీ కటాక్షంబు కలిగెనేని మనుజులు ధన్యులుగను, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను పూర్వజన్మమున చేసిన సుకృత విశేషమున నీపాద దర్శనము నాకు లభీంచెను" అనిస్తుతించిన మహాలక్ష్మి సంతోషము జెంది చారుమతి కనేక వరంబులొసంగి యంతర్జానమొందెను. చారుమతి వెంటనే నిదుర మేల్కొని గృహము నాలుగు తట్టులను కలయంజూచి వరలక్ష్మీ దేవిని గానక "ఓహో! నేను కలగంటిననీ యా స్వప్న వృత్తాంతమును భర్త మొదలగు వారితో జెప్పవారు, 'ఈ స్వప్నము మిగుల నుత్తమమైనది. శ్రావణమాసంబు వచ్చినతోడనే వరలక్ష్మి వ్రతమును తప్పక జేయవలెన'ని చెప్పిరి. తరువాత చారుమతియు స్వప్పంబువిన్న స్త్రీలును శ్రావణమాస మెప్పుడు వచ్చునని యెదురు చూచుచుండిరి. ఇట్లుండ వారి భాగ్యమున శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును “ఈ దినమేగదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబ”ని స్నానాదుల నాచరించి చీనిచీనాంబరములు అలంకరించి చారుమతి గృహమున నాకచోట గోమయంబుచే నలికి మంటప మెర్పరచి యందాసనమువైచి దానిపై క్రొత్త్రబియ్యము పోసి మర్రిచిగుళ్లు మొదలగు పంచపల్లవములచే కలశంబు నేర్చరచి, యందు వరలక్ష్మీదేవి
ఆవానముచేసి వారందరును మిగుల భక్తియుక్తులై సాయంకాలమున

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియేదేవీ సుప్రీతాభవ సర్వదా


అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలుచేసి తొమ్మిది సూత్రంబులుగల తోరణంబును దక్షిణహస్తంబునకు గట్టుకొని వరలక్ష్మిదేవికి భక్ష్య భోజ్యంబులచే నైవేద్యమొనర్చి ప్రదక్షిణంబు చేసిరి. యిట్లు ప్రదక్షిణము చేయగనే యా స్త్రీల గాళ్ళయందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము కలిగెను. అంత కాళ్ళను 'జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణంబులు కనపడెను. వారందరు- “ఓహో! వరలక్ష్మీదేవి దయవలన కలిగినవని పరమానందంబు నొంది మరి ఒక ప్రదక్షిణము చేయగా హస్తంబుల దగద్ధగాయ మ్రానంబుగా వెలుగుచు రత్నమణి కంకణములు
మొదలగు నాభరణంబులు కనపడెను. ఇంతయేల! మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా 
స్త్రీలందరు సర్వభూషణాలంకృతులైరి. వారి గృహంబులు సువర్ణమయంబులై రధ గజ తురగాది వాహనంబులతో నిండి యండెను. అంత నా స్త్రీలందోడ్కొని పోవుటకు వారివారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు నా వరలక్ష్మి పూజచేయు స్థలమునకు వచ్చి నిలిచియుండెను. తరువాత చారుమతి మొదలగు స్త్రీలు తమకు కల్పోక్త ప్రకారంబుగ పూజచేయించిన బ్రాహ్మణుని పూజించి పండ్రెండు కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలము లొసంగి నమస్కరించి యా బ్రాహ్మణునిచే నాశీర్వాదము నొంది వరలక్ష్మీ దేవికి నైవేద్యము గావించిన భక్ష్యాదులను బందుమిత్ర బృందముల భుజించి తమతమ వాహనముల నెక్కి తమ తమ గృహములకు జనుచు, నొకరితో నొకరు "ఓహో! చారుమతీదేవి భాగ్యమేమని చెప్ప నొప్పును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో దర్శనమిచ్చెను. ఆ చారుమతీదేవి వలననే
కదా మనకిట్టి భాగ్యము గలిగె!" అవి చారుమతీదేవి మిక్కిలి కొనియాడిరి, తరువాత చారుమతీదేవి మొదలగు కాంతలెల్లరును నీ వ్రతంబును ప్రతిసంవత్సరమును జేయుచు, పుత్రపౌత్రాభివృద్ధి గలిగి ధన కనక వస్తు వాహన సమృద్దింగాంచి సుఖంబుగనుండిరి. కావున "ఓ పార్వతీ! ఈ యుత్తమ వ్రతమును బ్రాహ్మణులు మొదలగు నాలుగు జాతులువారును జేయవచ్చును. అట్లు చేసిన సర్వసౌభాగ్యంబు గలిగి సుఖీంతురు. ఈ కధ వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ  ప్రసాదమువలన సకలకార్యసిద్ది కలుగునని పార్వతీదేవితో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతము జెప్పెను.

పూజా విధానం

Sravana Mangala Varamu Katha - శ్రావణ మంగళవారము కథ

శ్రావణ మంగళవారము కథ

ఒక బ్రాహ్మణుడు సంతానములేక చింతిల్లుచు తపస్సు చేయదొడగెను. ఆ సమయమున పార్వతీ పరమేశ్వరులు భూమిపాలింప వచ్చి యా బ్రాహ్మణునిగాంచి - “ఓ బ్రాహ్మణుడా ! ఎందువలన నీవీ తపస్సు చేయుచుంటివి?” అని యడిగిరి. అందుల కాతండు “మీరేమి ఆర్చేవారా, తీర్చేవారా! మీకెందుకు? మీ త్రోవను బొండ”ని చెప్పెను అంతవారు ఆర్చేవారము మేమే, తీర్చేవారము మేమే. కారణమేమో చెప్పు మనిరి. “సంతానహీనుడవై యిట్లు తపస్సు చేయదొడగితిని. నాకీ కోరికదీర్చి
నన్ను రక్షింకపవలయునని దీనుండై యా బ్రాహ్మణుడు వారల వేడుకొనెను. వారు "ఆయువులేని మగవాడు కావలెనా? అయిదవతనములేని ఆడుదికావలెనా?" యని యడిగిరి. అప్పుడా బ్రాహ్మణుడు. ఇంటికివోయి నాభార్యనడిగి వచ్చెదనిని చెప్పెను. వారు అట్లానే కానిమ్మనిరి. బ్రాహ్మణుడు ఇంటికిపోయి భార్యనుచూచి, ఆయువు మాలిన మగవాడు కావలయునా? అయిదవతనములేని ఆడుది కావలయునా!” యని అడిగెను. పుట్టి చచ్చినను పుత్రుడేమేలు. పుత్రనియిమ్మని యా సాధ్వి యుత్తరమిచ్చెను. అంత నా బ్రాహ్మణుండతివేగమున దానుతపస్సు చేయు చోటికిబోయి "పుట్టిచచ్చినను పుత్రుడేమేలు. కాబట్టి పుత్రునేకోరమని నాభార్య వేడుకొనెన" ని చెప్పెను.

అంతవారు-"ఊరి వెలుపల నొక మామిడి చెట్టున్నది. దానినొక పండు కోసికొనిపోయి నీభార్యకిమ్మని వారంతర్జానము నొందిరి అప్పుడు బ్రాహ్మణుడొక ముంతమామిడి చెట్టుదగ్గరకు పోయి చాలపండ్లు కోసికొని వడిలో వేసుకొని యింటికివచ్చి చూచుకొనేసరికి నావడిలో నొక్కపండు మాత్రమే యుండెను. అతడాపండును తినుమని భార్యకిచ్చెను. ఆ పండు నామె భక్షించి గర్భముదాల్చి, యంత తొమ్మిది నెలలు నిండిన వెనుక నొక కొడుకును గనియెను. ఆ శిశువు పుట్టి పుట్టక పూర్వమే 
యమభటులువచ్చి “వానిని మాకిమ్మ'ని తల్లి నడిగిరి. ఆమెయు నాయనలారా! ఈ శిశువునకు పురుడుబోసి నామా!” యని దీనవదనయె పలికెను: అంత నా యమభటులు వెళ్ళిపోయి పురుడు పుణ్యములైన తరువాత వచ్చి ఎప్పటి యట్ల “పిల్లవాని నియమిని అడిగిరి. అందులకామె “ఈ కన్నకొడుకు బారసాలను చూచినామా? ఆటపాటలు చూచినామా?” అని పలికెను. అంతట వారేగి తిరిగి బారసాల అయిన పిమ్మట వచ్చిరి. వారినిచూచి “పుట్టు, వెండ్రుకలు చూచినామా? నడుగు చూచినామా నాయనలారా! అని బ్రతిమాలెను. వారును యప్పటియట్లు మరలిపోయిరి. అంత
గొన్నాళ్ళకా పిల్లవానికి తల్లిదండ్రు ఉపనయన మహోత్సవము గావించిరి. తరువాత ఒకనాడు తల్లి కొడుకునకు తలంటుచు నేడ్చెను. ఆమె కంటినీళ్ళా పిల్లవానిపై పడుటచేత దెలిసికొని- "ఏమి? అమ్మా ఇట్లు దుఃఖించుచున్నాని" ని యడుగగా ఆమె "నాయనా! నీవు పుట్టినది మొదలుకొని యమభటులు నీకొరకు వచ్చుచున్నారు” నీ వడుగయినదాకా జరుపుకొని వచ్చినాము. ఇకనెట్లు జరుపవచ్చునాయని యెడ్చుచున్నా" నని యెడ్చుచున్నానని చెప్పెను. అంత నాపిల్లవాడు ధైర్యమవలంబించి "అమ్మా? నాకువచ్చిన భయములేదు. మా మామను జతయిచ్చి నన్ను కాశీకి బంపు" మని చెప్పెను. అందుకామె సమ్మతించి మేనమామకు కబురంపి కొడుకున కాతని జత యిచ్చి పంపుచు నేమియు బలుకలేక కన్నులనీరు బెట్టసాగెను. "అమ్మా! ఎందులకేడ్చెదవు. నేను తులసిమొక్క నొకదాని నింటవేసి వెళ్లెదను. దాని బాగోగులంబట్టి నా స్థితిగతులు నీకు తెలియుచుండును. అది చచ్చినయెడల నేను నట్లే యగుదునని తెలిసికొనుము” అని చెప్పి చాలినంత ధనము పుచ్చుకొని కాశీకి ప్రయాణమై పోవుచుండెను. వారికి త్రోవలో నొక పూలతోట గనబడగా ఆ రోజున నచ్చట బసదిగిరి. అంత నాపట్టణపు రాకుమార్తెయును, పురోహితుని కూతురును, శెట్టికూతురును, పెత్తందారు కూతురును కలిసి పూవులు కోసికొనుటకు వనమునకు వచ్చిరి. వారు పువ్వులను కోసికొని తిరిగి వెళ్ళుచు మాటపట్టింపులచే పోట్లాడి- “నీవు ముండవు
అంటే నీవు ముండవు” అని తిట్టుకొనిరి. ఆ తిట్లకు రాచవారిపిల్ల కోపగించుకొని “నాకీరాత్రి పెండ్లి మాఅమ్మగారు శ్రావణమంగళవారం నోము నోచుకొని నాకు వాయనమిచ్చును. నన్ను ముండా అని తిట్టకంటి' అని పువ్వులు పారపోసెను. చూచువారికి ఆశ్చర్యముగ నా పువ్వు లేకొమ్మవి ఆకొమ్మకు అంటుకొనెను. ఆ చిత్రము నాబ్రాహ్మణ కుమారుడుచూచి యాశ్చర్యపడి “ఆహా! ఈ చిన్నది యెంత సత్యవాదియో!” అని పొగడుకొని- “యీమె నాకు భార్యయైనయెడల బాగుండును గదా!” యని మనస్సులో ననుకొనెను. ఆ సంగతులను ప్రక్కనున్న మేనమామ గ్రహించి, “అబ్బాయీ! మనము కాశీకి వెళ్లుచున్నాము. మనమట్టి తలంపులను తలపెట్టరాదు” అని పలికెను. ఇంతలో ప్రొద్దు గ్రుంకు సమయముకాగా నాపిల్లలువారి వారి యిండ్లకేగిరి. రాజకుమార్తెను పెండ్లికుమార్తెనుజేసి ముహూర్తము సమీపించుచున్నందున పెండ్లికుమారుని రాకకై రాజు మొదలైనవారెదురు చూచు
చుండిరి. ఇంతలో పెండ్లికుమారునకు మూర్చవచ్చి పడివోయినాడు. “ఇప్పుడు పెండ్లికి రావీలు లేదిని యొక జాబు రాజుగారికి అందెను. ముహూర్తము సమీపించుటచే “ఆహా! వేళమిగిలి పోవును ఎరువు పెండ్లికొడుకు ఎవరు దొరుకునాయుని యాతడు పట్టణమందరిని అడిగెను. ఎరువు పెండ్లికొడుకున కెవ్వరును వప్పుకోరైరి. నగ యెరువుండును, బట్ట యెరువుండును గానీ పెండ్లికొడుకు ఎరువేమిటి?” అని నవ్వనాగిరి. అంత నాతండూరంతయు తిరిగి బ్రాహ్మణ కుమారుడున్న తోటలోనికివచ్చి యిక్కడయెవరో మనుష్యులున్నారని వారిదగ్గరకేగి వారినిలేపెను. వారు ఉలికిపడి లేచిరి. రాజా పిల్లవాని మేనమామనుచూచి, “అయ్యా ఈ పిల్లవానికొకసారి 
ఎరువిచ్చెదరా? యని యడిగెను. “అయ్యా! ఎరువేమిటి? మేము తెల్లవారురూమున లేచి కాశీకి పోవనున్నాము. కావున వీలులే" దని చెప్పెను. రాజుగారు ముహూర్తము దాటిపోవుచున్నదని, కాదు కూడదని 'బలవంతముచేసి మేనమామను ఒప్పించి యాపిల్లవానిని తన యింటికి దిసికొనిపోయెను. అట్లు తీసుకొనివెళ్ళి మంగళస్నానాదుల నాచరింపజేసి యాపిల్లతో గూడపెండ్లి అరుగుపైకి దీసికొనిపోయి సంతోషముతో వివాహకార్యము జరిగించెను. తరువాత నా పిల్లవానికి బంగారుగిన్నెలో ఫలహారము లుంచగా నాతండవి తినుచుండ వైలియుంగరముజారి యాగిన్నెలో పడిపోయెను. ఆ యుంగరము నాచిన్నది పదిలముగ దిసికొని తనవేలిని బెట్టుకొని యా రాత్రి
నిద్రించుచుండగా కలలో పార్వతీదేవి యామెకు కనిపించి "నీపెనిమిటికి సర్పగండమున్నది కాచుకొమ్మ" ని యానతిచ్చెను. అందులకా రాజకుమార్తె అమ్మా! ఏమిచేస్తే అదితప్పునో సెలవియ్యవలయుననని ప్రార్థించెను. నీ తల్లి శ్రావణమంగళవారము నోముపట్టిన కుండను పామురాగానే పట్టుము. అందులో నదిపడునిని చెప్పెను. ఆ రాత్రి భర్త నిద్రించుచుండగా బుస్సుమని బుసకొట్టుచు పాము వచ్చుచుండెను. అది కనిపెట్టి యాచిన్నది భయపడక పైనున్న కుండకై చేయిచాచెను. అది అందక పోయెను. ఓహో! కార్యము తప్పవచ్చుచున్నదే!” యని చెప్పి భర్తతొడపై కెక్కి యాకుండ నందుకొని చప్పున పాముదిక్కునకు ఒగ్గెను. ఆ పామువచ్చి యాకుండలోపడగా ఆ చిన్నది యొక రవికె గుడ్డచే నా కుండకు వాసినకట్టి యొకచోట దాచిపెట్టి
నిద్రపోయెను. అంత తెల్లవారుజాముకూడా పిల్లవాని మేనమామవచ్చి యాతని లేపుకొని తీసుకొని వెళ్ళెను. అంత తెల్లవారెను. మరల పెండ్లి ప్రయత్నములుచేసి పెండ్లికొడుకును దీసుకొనిరాగా- "నాకాతడు భర్తగాడు కాశీవెళ్ళిన యాతడే కాని" యని యామె చెప్పెను. దానికేమి యానవాలు? అని యందరు నడిగిరి. అప్పుడా చిన్నది తండ్రినిచూచి “తండ్రీ! నీవు యేడాది అన్నదానము చేయుము. నేను తాంబూలదానం చేయుదునని చెప్పి ఆ ప్రకారం జరిగించు చుండెను. అంత
యేడాది పూర్తికాగానే కాశీకిబోయిన అల్లుడు మామూలు కాశీనుండి తిరిగివచ్చుచు మునపటి పూలతోటలోనేదిగిరి. అక్కడవారు పడుకొనబోతే వారిని జూచినవారు "అయ్యా! మీరు ఇక్కడయేల పడుకొనెదరు? ఈ పట్టణపు రాజుగా రన్నదానము చేయుచున్నారు, ఆయన కుమార్తె తాంబూల దానము చేయుచున్నది. మీరక్కడికి బోవు" డని తెల్పిరి. ఆ ప్రకారము వారు వెళ్ళి భోజనమొనర్చి తాంబూలనిమిత్తమై యా చిన్నదియున్న చోటికిబోయిరి. బ్రాహ్మణకుమారుని మేనమామకును వానికిని తాంబూలమిచ్చి ఇదిగో నాపతి యని యా చిన్నది వానిచేయి పట్టుకొనెను. నీపెనిమిటి
యగుటకేమి యాధారమున్నదిని యందరు నడిగిరి. అప్పుడు భర్తవంక దిరిగి- మీరు పెండ్లినాడు భోజనమొనర్చువేళ, బంగారుగిన్నెలో మీవ్రేలి యుంగరము జారిపండింది. అది యిదిగో!’ యని యాతని వ్రేలినుంచెను. అది సరిగా సరిపోయెను. తరువాత పెండ్లినాడు పార్వతీదేవి వచ్చి నీభర్తకు సర్పగండ మున్నదని చెప్పెను. దానికి "నేనేమి చేయవలెనిని అడిగినాను, మీయమ్మ శ్రావణమంగళవారము నోము నోచుకున్నది, ఆ కుండ నొగ్గవలసినదని చెప్పి యంతర్జాన మొందగా నేనాకుండను వగ్గుటకు పాము వచ్చినప్పుడు ప్రయత్నించినాను, అందినదికాదు. అప్పుడు నా పెనిమిటి తొడలపై కాలువైచి అందుకున్నాను. అదిగో చూడండి ఆ పసుపు పారాణి
కాలు తొడమీదనున్నది” అని చూపించెను. పరీక్షించిచూడగా ఆ యానవాలా తొడలపై కనిపించెను. కుండు పట్టుకొనివచ్చి విప్పచూడగా బంగారు సర్పమైవుండెను. అందుల కందరును ఆమోదించిరి. అప్పుడు అబద్ధము ఇప్పుడు నిజమని ఆకాశమంత పందిరివేసి భూదేవియంత అరుగువేసి గుచ్చిన ముత్యాల తోరణాలుకట్టి గుచ్చని ముత్యాలు తలంబ్రాలుపోసి డెబ్బదియోగముల వారిరువురకు నారాజు పెండ్లిచేసెను. అటు పిమ్మట నా చిన్నది శ్రావణ మంగళవారము నోమునుపట్టి ఆ కాటుక పెట్టుకొని వానితో నత్తవారింటికి వెళ్ళెను. అట్లు వెళ్ళుసరికి అత్తగారును, మామగారును, కుమారుని వియోగ దుఃఖముచేత కండ్లు కాళ్ళులేనివారైయుండిరి. ఊరివారందరు పరుగు పరుగునవచ్చి “సోమయాజులుగారు! సోమిదేవమ్మగారూ! మీ కొడుకు కోడలు వచ్చుచున్నారిని చెప్పిరి. “అయ్యో! మాకెక్కడ కోడలు? మా కెక్కడ కొడుకును? నాడే పోయినారు” అని వగచు చుండిరి. అప్పుడు బాజాచప్పుడు చెవులలో ప్రవేశించి వారికి చెవులు వచ్చెను. కోడలువచ్చి అత్తమామలకు నమస్మారముచేయగా వారికి కాళ్లు వచ్చెను. కౌగలించుకొనగా నడమువచ్చినది. కాటుక పెట్టగా కన్నులు వచ్చెను. 'ఏమి నోము పట్టినావు? ఏమివ్రతము పట్టినావు? అని అందరు అడిగిరి. నేను
శ్రావణ మంగళవారము నోము పట్టినానిని వారికి జవాబు చెప్పెను. ఆమె నోచిన నోము కలియుగములో నందరు నోచి యామెవలెనే సౌభాగ్యవంతులై భూలోకమున ప్రసిద్ధిగాంచిరి. 

కథ లోపమైనా వ్రతలోపము కారాదు. భక్తి తప్పినా ఫలము తప్పదు.

ఉద్యాపనము: తొలియెట ఐదుగురు, మలియేట పది మంది ముత్తయిదువులకు, మూడవయేట పదిహేను మంది ముత్తయిదువులకు, నాలుగవయేట యిరువదిమంది ముత్తయిదువులకు, అయిదవయేట ఇరువది అయిదు ముత్తయిదువులకు వాయనములు ఇచ్చుకొని అయిదు
యేళ్లు అయిన తరువాత పెండ్లినాడు పెండ్లికూతురునకు మట్టెలు, మంగళసూత్రములు క్రొత్తకుండలో ముప్పది మూడు జోడుల అరిసెలు పెట్టి క్రొత్తరవికలగుడ్డచే వాసెనగట్టి పెండ్లికూతురు నకు
అందియ్యవలయును.

పూజా విధానం:

ప్రాథమిక శుద్ధి: స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి.

సంకల్పం: మంగళ గౌరీ దేవిని ఉద్దేశించి, సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తున్నట్లు సంకల్పం చెప్పుకోవాలి.

గణపతి పూజ: ముందుగా హరిద్రా గణపతి పూజ చేసి, ఆ తర్వాత మంగళ గౌరీ పూజ ప్రారంభించాలి.

మంగళ గౌరీ ప్రతిష్ఠ: మట్టితో చేసిన గౌరీ విగ్రహాన్ని లేదా పసుపుతో చేసిన గౌరీ దేవి రూపాన్ని పీఠపై ఉంచి, షోడశోపచారాలతో పూజించాలి.

పూజా సామగ్రి: పువ్వులు (ముఖ్యంగా మందార, గులాబీ), పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, దీపం, ధూపం, నైవేద్యం (అరటిపండు, బెల్లం, బియ్యం పిండితో చేసినవి) సమర్పించాలి.

మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం కథను భక్తితో చదవాలి లేదా వినాలి.

తాంబూలం: కనీసం ఐదుగురు స్త్రీలకు (ముఖ్యంగా కొత్తగా పెళ్లయినవారు) పండ్లు, ఆకు, తమలపాకు, పూలు, పసుపు, కుంకుమ, మొలకలు, బియ్యం పిండితో చేసిన తంతులతో కూడిన తాంబూలం ఇవ్వాలి.

నైవేద్యం: బియ్యం పిండితో చేసిన వడలు, అరటిపండు, బెల్లం వంటివి సమర్పించి, హారతి ఇవ్వాలి.

ముగింపు: పూజ పూర్తయ్యాక, గౌరీ దేవికి సమర్పించిన అక్షతలు, కుంకుమను నుదుట పెట్టుకోవాలి.

ముఖ్య గమనిక: ఈ వ్రతం శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం రోజు, ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన మహిళలు తమ మాంగల్యం నిలబడాలని కోరుకుంటూ ఐదు సంవత్సరాల పాటు ఆచరిస్తారు.

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....