Friday, April 3, 2026

Devaki Vasudeva's Predecessor Story - దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

ఈ విధంగా దేవకీదేవి విన్నవించుకోగా శ్రీకృష్ణుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! పూర్వం నీవు స్వాయంభువ మనువుకాలంలో పృశ్ని అనుపేరుగల పరమపతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే ప్రజాపతి. మీరిద్దరు సృష్ట్యాదియందు బ్రహ్మదేవుని ఆజ్ఞతో ఇంద్రియాలను నిగ్రహించి, తెగించి, ఎండకు, వానకు, గాలికి, మంచుకు ఓర్చుకొని, ఒంటరిగా, ఆకులలములను భక్షిస్తూ పండ్రెండువేల దివ్యసంవత్సరాలు కఠోరతపస్సు చేశారు. మీ దేహాలు తేజస్సుతో ప్రకాశించాయి. నా జపంచేసి, నా మీద మనస్సు నిలిపి, నన్నే పూజించారు. నేను ప్రత్యక్షమై స్థిరమైన వరాలు కోరుకొమ్మంటే నా మాయవలన, బిడ్డలు లేరనే బాధతో, అతికష్టసాధ్యమైన మోక్షాన్ని కోరుకోకుండా, నాకు సాటిరాగల కొడుకు నిమ్మని కోరుకొన్నారు. నేను మెచ్చి, ఆ వరమిచ్చి, పృశ్నిగర్భుడనే పేరుతో మీ కిప్పుడు జన్మించాను. అంతే కాదు

(లోకంలో ధర్మపాలనకొరకు బ్రహ్మ మనువులను సృజించినవాడు. మనువులు పద్నాలుగుమంది. అందులో మొదటివాడు స్వాయంభువుడు.

అదితి కశ్యపులనే పేర్లతో ప్రసిద్ధులైన మీకు పొట్టివాడి రూపంలో వామనుడనే పేరుతో ఇంద్రుడితమ్ముడిగా మీకు పుట్టాను. అదినా రెండవజన్మ.

మీ కిచ్చిన వరం తప్పకుండ ఇప్పుడు ఈ మూడవజన్మలో మీకిద్దరికి కుమారుణ్ణి అయ్యాను. జరిగిన పూర్వవృత్తాంతమంతా మీకు చెప్పాను. ఇకపై మీ యందు నాకు జన్మ లేదు.

మీరు నన్ను కుమారుడిగా, బ్రహ్మానందస్వరూపుడనైన పరబ్రహ్మంగా భావిస్తూ, నా మీది ప్రేమవల్ల పునర్జన్మ లేని పరమపదాన్ని పొందుతారు. అనీ ఈ విధంగా చెప్పి, జగత్రభువైన శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాఖడ్గాదులను ధరించిన చతుర్చాహు స్వరూపాన్ని వదలి

ఓ పరీక్షిన్మహారాజా! తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులు రెప్ప లార్పకుండ అట్టె తనను చూస్తూ ఉండగా; మాయతో అప్పుడే పుట్టిన సుకుమార శిశువుగా మారిపోయాడు. కాలు సేతులు కదలించడం, కన్నులు మూసి తెరవడం, కేవు కేవు మని ఏడవడం మొదలైన వేడుకలను చేశాడు (చూపాడు).

తరువాత వసుదేవుడు సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరునివల్ల తాను ఆ బాలునికి చేయవలసిన పనులను తెలిసికొన్నాడు కాబట్టి

ఓ పరీక్షిన్మహారాజా! వసుదేవుడు ఆ బిడ్డను పురిటి ఇంటినుంచి దాటించి తీసుకొని పారిపోవాలని నిశ్చయించుకోగా అక్కడ గోకులంలో నందునిభార్య యశోదాదేవికి, యోగమాయాశక్తి కూతురై జన్మించింది.

అదే సమయంలోనే, వసుదేవుడు చంటి బీడ్డడైన శ్రీకృష్ణుని చేతులతో ఎత్తుకొని, ఎదకు అడ్డంగా అదిమిపట్టుకొని, శబ్దం కాకుండ మెల్లగా అడుగులు వేసుకొంటూ, ఒక్క ఊపున కావలివాళ్ల అడ్డుపాటును జాగ్రత్తగా దాటుకొని, పురిటి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు.

అంత, ఆ స్థలంలో నందునిభార్య యశోదాదేవికి యోగమాయ జన్మించగానే ఒక విధమైన ఏమీ తెలియని మైకం వ్రేపల్లె ప్రజలనూ, పురిటింటికి కావలియున్న భటులనూ ఆవరించింది.

అప్పుడు వసుదేవుడు పురిటి బిడ్డడైన శ్రీకృష్ణుణ్లి ఎత్తుకొని శబ్దం కాకుండ, అడుగులను నేలమీద ఆనీ ఆననట్లుగా మోపుతూ బయలుదేరాడు. ఆయనకు సంకెళ్ళుగా ఉన్న ఇనుప గొలుసుల మెలికలు వాటి అంతట అవే ఊడిపోయాయి. మహాపురుషుడైన బాలకృష్ణునికి అడ్డుగా ఉండే తాళాలు వాటి అంతట అవే ఊడిపడగా, తలుపులు వాటి అంతట అవే తెరుచుకొని, మార్గాన్ని సుగమం చేశాయి. వసుదేవుడు తలవాకిటిని, చావళ్ళను దాటగానే, ఆదిశేషుడు తన పడగలను ఆ బాలుడికి పైన ఆచ్చాదనంగా కప్పి కాపాడుకొంటూ వెంటరాగా, ఆయన నడువసాగాడు. ఆ సమయంలో

పూర్వం శ్రీరామునికి సముద్రం త్రోవ ఇచ్చినట్లుగానే, స్పష్టంగా కన్పిస్తూ, మిక్కిలి పొడవైన అలలతో నేలను, దిక్కులను, నింగిని ఆక్రమించిన యమునానది ఆ వసుదేవునికి మార్గమిచ్చింది.

ఈ విధంగా వసుదేవుడు యమునా నదిని వేగంగా దాటివెళ్ళి, నందుని వ్రేపల్లేలో ప్రవేశించి, గాఢనిద్రలో ఉన్న ఆ పల్లెవాసులైన గొల్లల్ని మేల్కొల్పుటకు ఇష్టపడక, ఎల్లప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవిపడకమీద నల్లని ఈ చిన్నబాలుణ్ణి పడుకో పెట్టాడు. త్వర త్వరగా యశోదాదేవికూతురిని ఎత్తుకొని, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన యింటికి వచ్చాడు. ఆ పాపను దేవకీదేవి ప్రక్కన పడుకోపెట్టాడు.

(వసుదేవుడు తనయింటికి తిరిగి రావటం అంటే, మధురలో కంసుడు అతణ్ణి బంధించిన కారాగారానికి తిరిగి రావటమే.)

శూరసుతుడైన వసుదేవుడు కాళ్ళకు ఇదివరకున్నట్లుగానే సంకెళ్ళను తగించుకొని, మనస్సులో కలతపడుతూ ఏమీ తెలియనివానివలె భయపడుతున్నట్లు శరీరాన్ని వణికిస్తూ గంభీరంగా ముడుచుకొని కూర్చున్నాడు.

ఓ పరీక్షిన్మహారాజా! పద్మంవంటి కన్నులుగల యశోదాదేవి, వసుదేవుడు తన దగ్గరికి బాలకృష్ణుణ్ణి తేవడం గానీ, తన బిడ్డను తీసుకొని పోవడంగానీ తెలియక గాఢనిద్రలో మైమరచి ఉండింది.

తరువాత ఆ బాలిక ఆవుర మని ఏడ్చింది. ఆ శబ్దం విని చెరసాల కావలివారు నిద్రలేచారు. అటు ఇటు తిరిగి చూచారు. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. తరువాత సరాసరి కంసునిదగ్గరకు వెళ్లారు. దేవకీదేవి ప్రసవించింది వెంటనే రండని అన్నారు. కంసుడు తొట్రుపాటుతో పడకమీది నుండి లేచాడు. భయంతో కంపింపసాగాడు. ముడిచిన అతని వెండ్రుకలు చెదరిపోయాయి. పైనున్న ఉత్తరీయం జారిపోయింది. ధైర్యం సడలిపోయింది. కోపాగ్ని ఎగసిపడి మిక్కిలి వైరంతో కంసుడు దేవకీదేవి ప్రసవించిన ఇంటికి వచ్చి ఆ ఆడబిడ్డను చంపాలని దగ్గరకి వచ్చేసరికి

అంతటిలోనే దేవకిదేవి కంసునికి అడ్డంగా వస్తూ ఇలా పలికింది.

అన్నా! శాంతించు మన్నా! వీడు నీ మేనల్లుడు కాడు. నీ మేనకోడలు. ఆడపిల్ల. దీన్ని ఆదరించు. స్త్రీని చంపటం రాజధర్మం కాదు. మంచిపేరు తెచ్చుకో. మహాత్ములు నడిచే మార్గంలో నడువు. నేను నీ తోడబుట్టినదాన్ని కదా. నిన్ను శరణు వేడుతున్నానన్నా!

(అన్నా! ఆకాశవాణి మాటప్రకారం అష్టమసంతానం, కొడుకైతే నీకు ప్రమాదకారి అవుతాడేమో కాని, ఇది ఆడపిల్ల! నిన్నేమి చేయగలదు - అందువల్ల చంపవద్దు అని దేవకీదేవి ప్రార్ధన.)

అన్నా! ఆరుగురు కొడుకులను చంపావు. ఇది ఆడుబీడ్డ. నీకు మేనకోడలు. తప్పనిసరి అన్నట్లు ఈ పాపనుకూడా చంపాల్నా! అన్నా! నీవు కఠినాత్ముడివి. అన్నా! నీవు దయచూపరాదా!

నా కొడుకు గదా, నీ ప్రాణానికి శత్రువని ఆకాశవాణివల్ల విన్నావు. అందువల్ల పుట్టింది కొడుకైతే నీవు చంపవచ్చు. కాని, ఇప్పుడు పుట్టింది ఆడుబిడ్డ. నేను కొడుకులకు నోచుకోలేదు. ఈ కూతురినైనా నాకు దానంగా ఇచ్చి పుణ్యం కట్టుకో.

దేవకీదేవి ఆ విధంగ పలికి, పైటను సవరించుకొని, ఏదేదో మాట్లాడుతూ భ్రాంతికి లోనై తన కూతురిని త్వరత్వరగ ఎత్తుకొని ఎదకు ఒత్తుకొంటూ, తన చెక్కిలిని ఆ పాప చెక్కిలికి ఆనించి భయంతో కంపిస్తూ తటాలున తన పైటచెరగుతో ఆ బిడ్డను కప్పివేసింది. బావురుమని ఏడ్చింది. అప్పుడు కంసుడు అతిశయించిన కోపంతో ఔచిత్యాన్ని వదలి, తోబుట్టువని కూడా చూడకుండా దేవకీదేవిని తిట్టి, కెవ్వుమని ఏడుస్తున్న ఆ పసిపాపకాళ్ళు రెండూ ఎగసి పట్టుకొని లాగి నేలమీద ఎత్తి కొట్టాడు. కాని, ఆ పాప నేలమీద పడలేదు. అవలీలగా పై కగిరింది. దేవలోక పుష్పమాలల పరిమళాలతో, కిరీటంతో, మణిహారాలతో, దివ్యాంబరాలతో అలంకృత అయి మనోహరంగా అగుపించింది. గద, శంఖ, చక్ర, పద్మ, బాణ, ధనుస్సు, ఖడ్గ, శూలాల్ని ధరించి, ఎనిమిది చేతులతో ప్రకాశిస్తూ, సిద్ధ చారణ కిన్నర గరుడ గంధర్వాదిదేవగణాలూ, విమానసంచారులూ కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తుండగా, అప్సరసల ఆటపాటలను మెచ్చుకొంటూ, ఆకాశంలో అగుపించి, కంసునితో కసిగా ఇలా పలికింది.

ఓ దుర్శార్డుడా! పెద్ద తెగింపుతో వెంట వెంటనే దేవకీదేవి బిడ్డల్ని పసిపిల్లల్ని చంపావు. ఇకనైనా శాంతించకుండా, నన్ను బండమీద కొట్టి చంపాలనుకొన్నావు. ఛీ! ఛీ! ఇది కూడా శూరత్వమా? నిన్ను చంపటానికి నాతోపాటు పుట్టిన వీరుడు ఒకచోట కీర్తింపబడుతూ పెరుగుతున్నాడు.

అని అంటూ, ఇంకా ఆ యోగమాయాదేవి మహనీయగుణాలు కలిగి, భక్తులకు శుభాలను కల్గిస్తూ, సకలజనులు పూజిస్తుండగా, వివిధ ప్రదేశాల్లో, వివిధనామాలతో దర్శనమిస్తూంది.

ఆ యోగమాయ పలికిన ముచ్చటైన మాటలు ములుకులవలె తన చెవిని సోకగా, కంసుడు అదరిపడి, బెదరిన మనస్సుతో మిక్కిలి ఆశ్చర్యపడి, బాధపడ్డాడు. పిదప దుఃఖీస్తున్న దేవకీ వసుదేవులను రప్పించి, ఆదరంగా, గౌరవంగా వారి దగ్గరకు వెళ్ళి ఈ విధంగా అన్నాడు.

సాధుజనులైన దేవకీవసుదేవులారా! నేను పాపాత్ముణ్ణి; పసిపాపల చంపినవాణ్ణి; బంధువుల మీద ప్రేమ లేనివాణ్ణి; చెడుబుద్ధి కలవాణ్ణి; కోపస్వభావం ఉండేవాణ్ణి; బతికికూడా చచ్చినవాడితో సమానమైనవాణ్ణి. బ్రహ్మహత్య చేసినవానివలె మీ బిడ్డలను చంపాను. ఆకాశవాణిమాటలు నమ్మాను. నా పాపాలు ఏకరువుపెట్టక నన్ను దయతో చూడండి. శాంతించండి

జీవులంతా తాము చేసిన కర్మల ననుసరించి, ఒక్కొక్కరు ఒక్కొక విధమైన శరీరంతో జన్మించి, ఒక్కొక్క మార్గంలో రాకపోకలు సాగిస్తుంటారు. కష్టాలు అనుభవిస్తుంటారు. ఏ జన్మ స్నేహ సంబంధాలను ఆ జన్మతో వదలుకోరు. ఆలాంటప్పుడు నేను మీ బిడ్డల్ని చంపడం ఏమిటి? వాళ్ళు నాచేత చావడం ఏమిటి? మీరు నన్ను నిందించడం దేనికి?

అజ్ఞాని తాను శత్రువులను నశింపచేశానని, లేదా శత్రువులచేత నాశనమయ్యానని అనుకొంటాడు. కాని, ఆత్మకు మిత్రత్వ శత్రుత్వాలు లేవు. మిత్రత్వ శత్రుత్వాల సంబంధం కర్మబంధంతో ముడివడి ఉంటుంది సుమా!

అని చెప్పి, కంసుడు కన్నీరు కార్చి, దుఃఖించి, భయపడుతూ దేవకీవసుదేవుల పాదాలకు నమస్కరించి, సంకెళ్ళు విప్పించి, ప్రీతిగా కలుపుగోలు మాటలు మాట్లాడేసరికి పశ్చాత్తప్తుడైన ఆ కంసుణ్ణి చూచి, దేవకీ వసుదేవులు తమ కోపాన్ని విడనాడారు. తరువాత వసుదేవుడు తనబావ కంసునితో ఇలా అన్నాడు.

బావా! కంసా! నీవు చెప్పినమాట నిజం. అజ్ఞానానికి, భ్రమకు లోనై, ప్రాణులు అందరిలో అంతర్లీనంగా ఉండే పరమాత్మను దర్శించలేక - నీవూ, నేనూ అనే భేదభావంతో; లోభ, మోహ, మద, భయ, శత్రుత్వభావాలకు, సంతోష దుఃఖావేశాలకు లోనై ఒకరినొకరు చంపుకొంటున్నారు. (ఇది జ్ఞాని లక్షణంకాదు. జ్ఞాని సర్వత్ర సమదర్శనుడు,)

అని ఆ విధంగా ప్రశాంతచిత్తులైన దేవకీవసుదేవుల అనుమతిని పొంది, కంసుడు తన అంతఃపురానికి వెళ్ళి, ఆ రాత్రిగడపి, మరునాటి ఉదయం తనకు పూర్తిగా విధేయులైన మంత్రుల్ని వెంటనే రప్పించి, యోగమాయాదేవివల్ల తాను విన్న వృత్తాంతమంతా ఏకాంతంలో వారికి చెప్పాడు. అది విన్న మంత్రులు కంసునితో ఇలా అన్నారు.

ఓ కంసరాజా! యోగమాయాశక్తి చెప్పింది నిజమైతే, ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే మమ్మల్ని పంపండి. పట్టణాల్లో, పల్లెల్లో, గొల్లపల్లెల్లో పుట్టే పిల్లల్ని పెరిగే పిల్లల్ని పట్టి వధిస్తాము.

ప్రభూ! భయంకరంగా ప్రకాశించే మీ చేతి ధనుస్సులో వెలుగుతున్న బాణాల దెబ్బలు తిని దేవతాధిపతులు ఏమై పోయారో? ఎక్కడ తల దాచుకొన్నారో? (కైలాసంలో) శివుణ్ణి శరణు జొచ్చారో! (సత్యలోకంలో) బ్రహ్మను ఆశ్రయించారో! (వైకుంఠంలో); విష్ణుమూర్తిని సేవిస్తున్నారో! అదీ కాకపోతే మునివృత్తిని స్వీకరించి, అడవుల నడుమ ఉన్నారో! మనం వెంటనే వాళ్లందర్నీ వెదకడం మంచిది.

శత్రువులు దెబ్బతిన్నారులే అని విచ్చలవిడిగా తిరుగ కూడదు. వాళ్ళు అనేకరూపాల్లో మోసగించి దండెత్తి వస్తారు. అందువల్ల శత్రువులు చచ్చేదాకా రాజు వాళ్ళఉనికిని మరువ కూడదు.

విజృంభించిన రోగాల్నీ శత్రువుల్నీ, ఇంద్రియాల్నీ బలపడ నీయకూడదు. అవి పుట్టినపుడే వాటిని అణచి వేయాలి గాని, మెతకదనం వహించకూడదు. ఆ తరువాత వాటిని జయించటం సాధ్యం కాదు.

దేవతలందరికీ చక్రాయుధుడైన శ్రీమహావిష్ణువే ముఖ్యుడు. ఆ విష్ణువు ధర్మమందు చక్కగా నిలిచి ఉంటాడు. ఆవులు, బ్రాహ్మణులు, ఓర్పు, వేదాలు, దయ, సత్యం, యాగాలు, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శ్రద్ధ, శాంతి - ఇవి విష్ణుస్వరూపాలు. వీటి నన్నింటినీ సంహరిస్తే ఆ విష్ణుమూర్తి అంతమౌతాడు.

కనుక, ఓ కంసరాజా! దేవతల్ని హతమార్చ మంటావా? మహర్షుల్ని బెదరింపులతో, అరపులతో యమధర్మరాజు దగ్గరికి పంప మంటావా? దూడలతో కూడా ఆవుల్ని చంప మంటావా? బ్రాహ్మణుల్ని తరిమి వేయమంటావా? వేదాలను ధ్వంసం చేయ మంటావా? భూమిని అణచివేయ మంటావా? ఆజ్ఞాపించి, మమ్మల్ని పంపండి.

కంసుడు ఆ విధంగా చెపుతున్నమంత్రులఆలోచనలకు లొంగినవాడై, బ్రాహ్మణుల్ని హింసించడం మంచిది కాదని యెంచక, కాలమనే పాశానికి బద్దుడై బ్రాహ్మణులు మొదలైన సజ్జనుల నందరిని చంపటానికి రాక్షసుల్ని పంపించి, తన అంతఃపురానికి వెళ్ళాడు. తరువాత ఆ రాక్షసులు క్రూరంగా మాట్లాడుతూ సజ్జనుల్ని వెంటాడి, బెదిరించి, గర్జించి, వేయించి, అనేక దుష్టచేష్టలతోవాళ్ళను హింసించడంలో విజయం సాధించారు. పాపాలు మూటగట్టుకొన్నారు.

రాక్షసవీరులు వెదకి వెదకి సజ్జనుల్ని అణచివేయగా, ఆ రాక్షసుల శక్తులుకూడా అణగిపోయాయి. సాధువుల్ని బాధిస్తే కీర్తి సంపద, ధర్మం, ఆయుస్సు, క్షేమం అన్నీ నశిస్తాయి కదా!

తరువాత వ్రేపల్లెలో నందుడు తనకు కొడుకు పుట్టిన విషయం తెలుసుకొని, మహానందభరితుడై సమర్ధులైన వేదపండితుల్ని రావించి, తాను స్నానంచేసి పరిశుద్దుడై, చక్కగా అలంకరించుకొని, స్వస్తివాచక పుణ్యాహవచన మంత్రాలను చదివించి, వేదవిహితజాతకర్మలు చేయించి, పితృదేవతలను పూజించి, అలంకరించిన రెండులక్షల పాడిఆవుల్ని దూడలతోకూడ బ్రాహ్మణుల కిచ్చాడు. అంతేకాదు - బంగారుకలశాల్నీ మణుల్నీ వస్త్రాల్నీ కొండలవంటి ఏడునువ్వల రాసుల్నీ బ్రాహ్మణులకు దానం చేయగా

పుట్టిన బిడ్డకు నందుడు జాతకర్మాది వైదిక కార్యక్రమాలు జరిపించి, బ్రాహ్మణులకు ఎక్కువగా దానాలిచ్చిన తరువాత, ఆ బ్రాహ్మణులందరూ, ఈ నందగోపుని కుమారుడు ఐశ్వర్యవంతుడు, శత్రువీరులను జయించేవాడు, పూర్ణాయువు కలిగినవాడు అవుతాడని ఆశీర్వదించారు.

నగారాలు మ్రోగాయి. గాయకులు పాడారు. సూతులు, వందిజనులు కీర్తించారు. మంగళకరాలైన బాకాల ధ్వనులు ముమ్మరంగా వినిపించాయి.

యాదవనాయకుల ఇళ్ళవాకిళ్ళన్నీ చిగురుటాకుల తోరణాలతో, అందమైన తీవలతో, ఎత్తెన జెండాలతో, పరిమళ ధూపాల సువాసనలతో చూడముచ్చటగా ప్రకాశించాయి.

ఓ పరీక్షిన్మహారాజా! మందల్లోని ఆవులకు పసుపు, కుంకుమ, నూనె పూయగా అవి మెరుగైన కాంతితో బంగారు నెమళ్ళ పింఛాల కాంతివంటి కాంతిగల పసిమిరంగుతో ప్రకాశిస్తూ తిరుగాడాయి.

బాలకృష్ణుడు పుట్టగానే లేగదూడలు చెంగు చెంగున గంతులేశాయి. మదించిన వృషభాలు రంకెలు వేశాయి. ఆవులు పొదుగులనుండి పాలు వర్షించాయి. (అనగా వ్రేపల్లెలో పశువులు కూడా ఆనందంతో పరవశించాయి.)

నందరాజు పుత్రుడు పుట్టినాడనే ఆనందంతో వేదమంత్రాలు, పురాణాలు చదివే బ్రాహ్మణులకు, స్తోత్రాలు చేసే వందిమాగధులకు, ఇంద్రజాలాలు, గారడీలు, పగటివేషాలు మొదలైన విద్యలతో బ్రతికేవారికి, దారిద్యంతో బాధపడేవారికి, వాళ్ళు కోరకముందే గోవులను, ధనరాసులను దానమిచ్చాడు.

శ్రీకృష్ణుడు పుట్టిన ఆ వేళలో, గోపకులందరు అంగీలు తొడుగుకొని, తలపాగాలు చుట్టుకొని, బంగారు ఆభరణాలు, అందమైన దుస్తులు ధరించి ప్రకాశిస్తూ, మంచి పదార్థాలు కానుకలుగా తీసుకొని బాలకృష్ణుణ్ణి చూడడానికై వచ్చారు.

వ్రేపల్లెలోని గొల్లలంతా వచ్చి, బాలకృష్ణుని చూచి, సంతోషంతో చెలరేగి, సరసాలాడుకొంటూ నేతులతో, పెరుగులతో, పాలతో, నీళ్ళతో, వెన్నతో ప్రియమార వసంతా లాడుకొన్నారు.

ఆ తర్వాత, ఓ అమ్మలారా! ఏ నోము నోచిన ఫలమో గాని ఇప్పుడు ఒక శుభవార్త విన్నాం. మన యశోదమ్మ ఒక చిన్ని మగబిడ్డను కనిందట! వెళ్ళి చూచి వస్తా రండి.

ఆ విధంగా గోపికలు అనుకొని, ఒకరినొకరు పిలుచుకొని చిన్ని కృష్ణుని చూడాలనే తహ తహ త్వర పెట్టగా, లెస్సగా అలంకరించుకొని తమ యిండ్ల నుండి బయలుదేరి

మెల్లని నడకలతో, పెద్దపిరుదులతో, సన్ననినడుములతో, లావుగ, బిగువుగా ఉన్న చన్నులతో; విశాలమైన నేత్రాలతో; లక్ష్మీకూడా తడబడే కళలతో కూడుకొన్న ముఖాలతో; తుమ్మెదలవంటి నల్లని వెంట్రుకల కొప్పులతో ఒప్పుగా

గోపస్త్రీలందరు సంతోషంతో వడివడిగా తమ కొప్పులముడులు వీడగా, రొమ్ములమీది హారాలవరుసలు అటూ ఇటూ ఊగిసలాడగా, చెక్కిళ్ళమీది బంగారుమకరికాపత్రాలకాంతులు వేడుక చేయగా, పైటకొంగులు కదలాడగా - అందరు ఒకటిగా చేరి, యశోదయింటికి వెళ్లి జయశీలుడు, సర్వవ్యాపకుడు అయిన చిన్నికృష్ణుణ్ణి వరుసగా చూచారు.

గోపికలు చిన్ని కృష్ణుని చూచి, ఎంతో సంతోషించి, తాము తెచ్చిన కానుకలు ఇచ్చి

ఆ గోపస్త్రీలందరు బాలకృష్ణుడికి నూనెతో తల అంటి, శరీరానికి పసుపు పూసి, స్నానం చేయించారు, శ్రీహరి నీకు రక్షపో! అని అంటూ చుట్టూరా కొన్ని నీళ్లు పడునట్లు చల్లి, రక్ష పెట్టి, ఉయ్యాలలో పడుకో పెట్టి, ఆశీర్వదిస్తూ జోలపాటలు పాడారు.

జో!జో! తామరరేకువంటి కన్నులు కల ఓ కృష్ణా నిద్రపోవయ్యా! సింహం నడుంవంటి నడుంగల కృష్ణయ్యా జో జో! చిగురుటాకులవల మృదువైన చేతులు, పాదాలు వున్న కన్నయ్యా జో జో! నిండు చందురునివలె నిండైన ముఖంతోవున్న కృష్ణా జో జో అంటూ జోకొడతాము నిద్రించవయ్యా కృష్ణా!

('జో' అంటే - పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మెల్లగా అరచేతితో వీపుమీద తడుతూ చెప్పే పదం - నిద్రించు అని తాత్పర్యం. 'జో, జో' అనేది 'జో' శబ్దంయొక్క ఆమ్రేడితం (రెండుమార్లు వచ్చిన పదం,)

అంటూ ఇలా జోలపాట పాడుతుండగా, పెక్కుమార్లు ప్రళయకాల సముద్రజలాల్లో ముంచి, ప్రకాశించే ఆ బహురూపధారి, కృష్ణుడు ఇప్పుడు గోపస్త్రీల చేతుల నుండి పోసే నీళ్ళలో సంతోషంగా తడుస్తున్నాడు (స్నానం చేస్తున్నాడు).

(ప్రళయకాలంలో “వట పత్రశాయి” అయిన ఈ తోయగాడు, ఒకప్పుడు మహామత్స్యంగా, మరొకప్పుడు కూర్మంగాను, ఇంకొకప్పుడు ఆదివరాహంగాను ఇలా వివిధరూపాల్లో జలాల్లో సంచరించిన వీడు, ప్రస్తుతం గోపికలు నీళ్లు పోస్తుండగా కేరింతలు కొడుతూ ఆనందిస్తున్నాడట - చిన్ని కృష్ణుడు. అంటే నీళ్ళలో (నారములు) తిరుగాడడం, మునగడం 'ఈ తోయగాడికి కొత్తేమీ కాదు'. అని విశేషాంశం.)

లోకాలన్నింటినీ జోకొట్టి నిద్రపుచ్చుతూ, తానుమాత్రం మెలకువగా ఉండే అందగాడు, గోపికలు జోకొట్టుతూ ఉంటే నిద్రపోయిన వానివలె కళ్ళు మూసికొని కదలకుండా పడుకున్నాడు.

పుట్టుకే లేని పరమాత్మ ఇప్పుడొక గొల్లయింట్లో పుట్టాడు. ఏ కర్మలూ ఎరుగనిఒంటరికి ఇప్పుడు జాతకర్మలు జరిగాయి. ఏ తల్లి చనుబాలూ త్రావని గడుసరి ఇప్పుడు యశోదచనుబాలరుచి మరిగాడు. ఏ హాని వృద్ధులు లేని పరమాత్మ ఇప్పుడు యశోదపొత్తిళ్ళలో వృద్ధి పొందుతున్నాడు. ఏ తపస్సులకూ పండనిపంట ఇప్పుడు గోపకాంతుల వీథిలో పండాడు. ఏ విద్యలవల్లా ఇట్టిదిట్టిదని చెప్పసాధ్యం కాని అర్ధం, ఇప్పుడు ఈ బాలకృష్ణునిఅందమైన అవయవాల్లో అగుపిస్తూ ఉంది.

(పరమాత్మకు ఏ రూప, గుణ, వికారాలుగాని, కర్మలు గాని, సంబంధ బాంధవ్యాలు గాని ఉండవు. కానీ ఒక కార్యార్థమై అవతరించినపుడు రూపగుణాలు ఏర్పడతాయి.)

చిన్నికృష్ణుడు బాల్యచేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలె, సంతోషం నిండినచూపులతో నవ్వేటప్పుడు విష్ణుమూర్తివలె; రోషంతో ఉన్నప్పుడు రుద్రునివలె, ఆనందతన్మయత్వంలో ఉన్నప్పుడు పరబ్రహ్మవలె కన్పిస్తున్నాడు.

(పరమాత్మ మనం అనుకొనే బ్రహ్మ కాదు; విష్ణువు కాదు; శివుడు కాదు. ఆయన ఈ త్రిమూర్తులకు అతీతుడైన తేజోమయుడు; విశ్వచైతన్యస్వరూపుడు.)

ఇలా ఉండే ఆ సమయంలో, నందుడు తనకు కొడుకు పుట్టాడన్న సంతోషాతిశయంలో రోహిణీదేవిని పిలిపించి, ఆమె తృప్తి చెందేటట్లు రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి గౌరవించాడు.

శ్రీకృష్ణుడు జన్మించింది మొదలు ఆలమందలు పొదుగులనిండ పాలతో కనువిందు చేశాయి. నందుడు వ్రేపల్లె రక్షణకు దక్షులైన పెక్కుమంది గోపకులను నియమించాడు. తరువాత మథురకు వెళ్ళి ప్రతిసంవత్సరం కట్టవలసిన కప్పాన్ని కంసునికి అర్పించి, అతని దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి, తగురీతిగ వసుదేవుని దర్శించి,

వసుదేవుడు నందుణ్ణి చూడగానే ప్రాణంలేని శరీరానికి ప్రాణం వచ్చినట్లు ఉత్సాహవంతుడై, ఆనందబాష్పాలు కనుకొలకులు నిండగా, చేతులు చాచి కౌగిలించుకొన్నాడు.

వసుదేవుడు మరొకసారి నందుజణ్ణి కౌగిలించుకొని, సుఖంగా అతణ్ణి కూర్చుండపెట్టి, తన కుమారుడైన బాలకృష్ణుని మీది ప్రేమ ప్రకటమయ్యేటట్టుగా ఆయనతో ఇలా అన్నాడు.

సంతానం లేదని ఇదివరలో ఎంతో చింతిస్తూ, ముసలితనం మీదపడిన ఇప్పుడు నీకు సంతతి కలగడం చాల అదృష్టం. సంతానం లేనివారికి సుఖాలు ఉండవు కదా.

ఓ నందుడా! నిన్ను చూచాను కనుక బ్రతికాను. ఇకమీద నాకు కష్టాలుండవు. చేసే పనులలో ఏవిధమైన అరమరికలు లేని ఒక మంచిమిత్రుణ్ణి చూడటం, చచ్చి, మళ్ళీ పుట్టడమే కదా!

జీవితంలో అనేకవిధాలైన కష్టాలుపడే మానవులంతా ఈ నేలమీద ఒకేచోట ఉండటం వీలు పడుతుందా? నదీప్రవాహాల్లో పడి కలిసి వెళ్ళే మ్రాకులు విడివడకుండా ఉంటాయా? వేర్వేరు మార్గాల్లో వెళ్ళకుండా ఉంటాయా?

'నందరాజా! గోవులు వివిధరోగాలకు గురి కాకుండా ఉన్నాయి కదా? పాడిఆవులు పుష్కలంగా పాలు ఇస్తున్నాయి కదా? గుంటల్లో, వాగుల్లో నీళ్ళు నిండి ఉన్నాయి కదా? ఆలమందలు ఉండే ప్రదేశాల్లో పులులు, దుప్పులు తిరుగాడటం లేదు కదా? గొల్లపల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి గదా? ఆ పల్లెల ప్రక్కనున్న అడవుల్లో పచ్చగడ్డి మెండుగా ఉందికదా? అని వసుదేవుడు అనేక కుశల ప్రశ్నలడిగాడు.

తన కొడుకులను, స్నేహితులను, తనకు ముఖ్యులైనవారిని తృప్తిపరచకుండా, వారిబాగోగులు చూడకుండా, వారు అంతకంతకు క్షీణించి నశిస్తుంటే-తాను బాగా బ్రతుకుతూ గృహస్థాశ్రమంలో ఉండేవాడికి ఏ విధమైన సంతోషమైనా ఉంటుందా?

నందా! నీవు, నీ భార్య ప్రేమతో చూస్తుండగా, నిన్ను తండ్రిగా చూస్తూ, వ్రేపల్లెలో నా కొడుకు ఆనందంగా ఉన్నాడు కదా?

అని వసుదేవుడు పలుకగా, దానికి నందుడు ఇట్లన్నాడు.

ఇదివరలో నీకూ, దేవకీదేవికీ పుట్టిన కొడుకులందరినీ, వెంటవెంటనే కంసుడు వధించాడు. చివరకు మీ కుమార్తెను కూడా చంపబోగా, ఆ బాలిక అతని చేతినుండి తప్పించుకొని, ఆకాశాని కెగిరిపోయింది. విధివశాన ఆపద ఏర్పడినపుడు వివేకవంతుడు దుఃఖించ వచ్చునా? వసుదేవా! ఊరట చెందు. నా కొడుకునే నీ కొడుకని అనుకో.

అని పలికిన నందమహారాజుతో, వసుదేవుడు మళ్లీ ఈ విధంగా అన్నాడు.

ఓ నందరాజా! కంసునికి కప్పం కట్టావు. మమ్మల్ని చూడటానికి వచ్చావు. మేముకూడా మిమ్మల్ని చూచాం. చాల సంతోషం. వ్రేపల్లెలో ఉపద్రవాలు కలిగే సూచనలు కన్పిస్తున్నాయి. వాటిల్ని ముందు జాగ్రత్తతో ఎదుర్కోవాలి. నీ విక వెళ్ళు.

కంసుడు పంపిన బూతన యను రాక్షసి వ్రేపల్లెకుంజనుదెంచుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Thursday, April 2, 2026

Devaki Devi Stuti to Lord Vishnu - దేవకీదేవి స్వామిని స్తుతించుట

దేవకీదేవి స్వామిని స్తుతించుట

ఈ విధంగా పుట్టిన బిడ్డతో వసుదేవుడు అంటూ ఉండగా, దేవకీదేవికూడా, మహాపురుషలక్షణాలు కలవాడు, గొప్ప సదసద్వివేకజ్ఞానం కలవాడు, మిగుల కోమలమైన దేహం కలవాడు అయిన తన కుమారుణ్ణి చూచి, కంసునిభయంతో స్వచ్చమైన ఒక నవ్వునవ్వుతూ ఈ విధంగా అనింది.

అటువంటి, ఇటువంటిది అని వివరించటానికి సాధ్యం కానిది, సమస్తానికి మూలమై ఉండేదీ, సర్వత్ర వ్యాపించింది, ప్రకాశిస్తూ ఉండేదీ, త్రిగుణాలలో ఏ గుణమూ లేనిది, ఒకే విధమైంది, సత్యమైంది. తాను తప్ప మరేదీ లేనిది, కర్మలు లేనిది, వాక్కుకు అందనిది అయిన ఏ రూపాన్ని వేదాలు ఎల్లప్పుడు చెపుతున్నాయో ఆ రూపాని వౌతూ, ఆత్మజ్ఞానానికి దీపానివై, బ్రహ్మదేవుని ఆయుస్సులో రెండవసగభాగం పూర్తి అయిన తరువాత, లోకాలు నశించినవేళ, పంచమహాభూతాలు సూక్ష్మభూతంలో కలిసిపోగా, ఆ సూక్ష్మభూతం మూలప్రకృతిలో, మూలప్రకృతి వ్యక్తతత్త్వంలో లీనంకాగా, చివరకు ఆ వ్యక్తతత్త్వం కూడా లయం కాగా - శేషసంజ్ఞచేత స్వయంజ్యోతివై సుందర స్వరూపమై ఉంటావు.

(దేవకీదేవి తనకు జన్మించిన కుమారుణ్ణి మానవమాత్రునిగ కాకుండా పరమాత్మునిగానే భావించి, పరమాత్మతత్త్వాన్ని తలచుకొంటూ చేసిన స్తోత్రం ఇది. పరమాత్మ “సత్యం, శివం, సుందరం” కనుక సర్వమూ లయించినా ఆయన మాత్రం సత్యశివసుందరాత్మకంగానే ఉంటాడు.)

ఓ మాధవా! నీవు పరిపూర్ణ జ్ఞానస్వరూపుడివే అయినా, ఈ జగత్తును సృష్టి స్థితిలయాలతో విలాసంగా త్రిప్పుతూ ఉంటావు. కనుక, అవిద్య అనే మాయకు నీవు చుట్టానివి. కాలాతీతుడవైన నీకు శాశ్వతమైన కాలమంతా మాయ మాత్రమే. జగన్నాథా! నీవు శుభాలరాశివి. కోరి నిన్నెవ్వడు ఆరాధిస్తాడో అతడు శాశ్వతసంపద గలిగి, మృత్యువును జయించి, సుఖసంతోషాలతో భయం లేనివాడై ఉంటాడు.

(పరమాత్మ పరిపూర్ణ జ్ఞానస్వరూపుడు. ఆలాంటప్పుడు ఆయన అవిద్యకు బంధువు ఎలా అవుతాడు? పరమాత్మ పరిపూర్ణజ్ఞానస్వరూపుడే. కాని, ఈ జగత్తు మాయ. జగత్తే మాయ అయినపుడు సృష్టి స్థితి, లయాలు కూడ మాయయే! మాయయే అవిద్య. ఈ మాయామేయ జగత్తును సృజించి, దాన్ని పోషించి, లయం చేస్తున్నప్పుడు పరమాత్మ అవిద్యకు చుట్టమౌతాడు కదా!)

ఓ పద్మనయనా! పురాతనులైన మహాయోగులు (సనక సనందనాదులు) యోగమార్గంలో అత్యంతదీక్షతో ఒంటరిగా తమకు తాము సాధన చేసి, ఇప్పుడు అగుపిస్తున్న నీ దివ్యరూపాన్ని చూచామంటారు గానీ; నిజంగా వారు చూచి ఉండరు. ఇప్పుడు నేను చూచాను. శుభాన్ని పొందాను. ఈ భౌతిక నేత్రాలతో ఇక చూడలేను. అనాది అయిన నీ దివ్యస్వరూపాన్ని ఉపసంహరించుకో. నమస్కరిస్తున్నాను.

ఓ పురుషోత్తమా! ప్రళయకాలంలో ఈ జగత్తునంతా ఎంతో పెద్దదైన కడుపులో దాచుకొనే గొప్పనటుడివి నీవు. ఆలాంటి నీవు, ఇప్పుడు నా కడుపున పుట్టడం ఒక పెద్దమాయే కదా!

తామరులవంటి కన్నులు కలవాడా! నీవు నాకు తప్పక జన్మిస్తావని ఆ దుర్మార్గుడైన కంసుడు చాలకాలంగా నన్నూ నీ తండ్రినీ, ఈ చెరసాలలో బంధించి ఉంచాడు. ఆ దుర్మార్గుణ్ణి శిక్షించి, మమ్మల్ని కాపాడు. నేను నోచిన నోములన్నీ ఏ కొరత లేకుండా నీ రూపంలో ఫలించాయి.

దేవకీవసుదేవాల పూర్వజన్మముల వృత్తాంతము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Hanuman Mandala Initiation Rules - హనుమాన్ మండల దీక్ష – నియమములు

హనుమాన్ మండల దీక్ష – నియమములు

దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి 41 రోజుల పాటు కలశ ఆరాధన చేసి కఠినమైన మండలదీక్ష ను ప్రారంభించాలి. 
బ్రహ్మచర్యం, సాత్వికాహారం, నిత్య హనుమాన్ చాలీసా పారాయణం, కాషాయ వస్త్రధారణ, మరియు గుడిలో ప్రదక్షిణలు చేయడం ఈ దీక్షా నియమాలలో ముఖ్యాంశాలు. భక్తులు చెప్పులు ధరించకుండా, దురుసు మాటలకు దూరంగా ఉంటూ, ఉదయం-సాయంత్రం స్నానాచరణతో హనుమంతుని స్మరిస్తూ దీక్షను పూర్తి చేయాలి

సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట పూజను నిర్వహించాలి. అనంతరం దీక్షా స్వాములు వారి వారి ఇండ్లలో పీఠపూజను చేసుకొని భజన కార్యక్రమాన్ని నిర్వహించాలి .

హనుమాన్ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి మండలదీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది.

హనుమాన్ దీక్ష వహించిన భక్తులు భక్తితో పూజ, పీఠానికి హారతి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి హనుమంతుని నామస్మరణం రామనామ స్మరణం చేయటం, దీని ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని నమ్మకం.

అంతేకాక రోగనివారణకు, శత్రునాశనముకు, ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది.

దీక్ష విరమణ అయినంత వరకు కల్షంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కట్టుతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని అన్నప్రసాదంగా స్వీకరిస్తారు

హనుమాన్ మండల దీక్షా నియమాలు - విధివిధానాలు:
దీక్షా కాలం: సాధారణంగా 41 రోజులు (మండల దీక్ష) లేదా 21, 11, 5 రోజుల పాటు దీక్ష చేస్తారు.

దీక్షా స్వీకరణ: గురుస్వామి సమక్షంలో లేదా హనుమాన్ ఆలయంలో, చైత్ర పౌర్ణమి (హనుమజ్జయంతి) వంటి పవిత్ర దినాలలో మాలాధారణ చేస్తారు.

దుస్తులు: కాషాయ వస్త్రాలను మాత్రమే ధరించాలి.

ఆహార నియమాలు: శాకాహారం (సాత్వికాహారం) మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

నిత్య ఆచరణ:ఉదయాన్నే (బ్రహ్మ ముహూర్తంలో) స్నానం చేసి, కాషాయ వస్త్రాలు ధరించాలి.
రోజూ హనుమాన్ ఆలయాన్ని సందర్శించి, కనీసం 40 లేదా 108 ప్రదక్షిణలు (ప్రదక్షిణలు) చేయాలి.

హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం ప్రతిరోజూ 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చదవాలి.

నుదుట సింధూరం ధరించాలి.

దీక్షా నిష్ఠ:

బ్రహ్మచర్యం కచ్చితంగా పాటించాలి.

నేలపై పడుకోవాలి (భూశయనం).

పాదరక్షలు (చెప్పులు) ధరించకూడదు.

క్షౌర కర్మ (కటింగ్, షేవింగ్) చేయించుకోకూడదు.

మగవారిని 'స్వామి' అని, ఆడవారిని 'అమ్మ' అని పిలవాలి.

దీక్షా విరమణ (ఇరుముడి): 41వ రోజున హనుమాన్ ఆలయంలో అభిషేకం, వడమాల సమర్పణ చేసి, గురుస్వామి చేతుల మీదుగా మాల విరమణ (తీసివేయడం) చేస్తారు.

ఈ కఠినమైన నియమాలను పాటిస్తూ చేసే హనుమాన్ దీక్ష వల్ల శారీరక, మానసిక రుగ్మతలు తొలగి, ఆత్మవిశ్వాసం, విజయం కలుగుతాయని నమ్ముతారు.


హనుమాన్

విష్ణు

శ్రీరామ

శ్రీకృష్ణ

శ్రీ వెంకటేశ్వర

నిత్య స్తోత్రావళి

పంచాంగం

Nettikanti Anjaneyaswamy Kasapuram - నెట్టికంటి ఆంజనేయస్వామి - కసాపురం

నెట్టికంటి ఆంజనేయస్వామి - కసాపురం

అందరి భయాలను పోగొట్టే శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్ బ్రహ్మ. ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు. శ్రీరామ నామ జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడు అవుతాడు. 

అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తులు కోరికలను తీర్చుతూ వారిపై చల్లని చూపును ప్రసరిస్తున్నాడు. దేశం నలు మూలల నుంచి ఇక్కడకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతే కాకుండా వారి కష్టాల నుంచి గట్టెక్కిస్తుంటాడు.

స్థల పురాణం:16వ శతాబ్దంలో విజయ నగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణ దేవరాయలు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఒకసారి ఆయనకు గండం ఏర్పడింది.ఆ సమయంలో రాజ్య పాలన చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెప్పడంతో కొన్ని ఘడియలు రాజ్యపాలన చేసేందుకు కృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలు సింహాసనం అధిష్టించారు.

తరువాత తిరిగి కృష్ణదేవరాయలు రాజ్యాధికారాన్ని చేపట్టారు. కొన్ని ఘడియలు రాజ్యాధికారం చేసిన వ్యాసరాయలు విజయనగరాన్ని వదలి తీర్ధ యాత్రకు బయలు దేరుతాడు. ఆయనకు ఆంజనేయస్వామి మీద భక్తి ఎక్కువ యాత్రలో భాగంగా ఆయన కర్నూలు జిల్లాలోని చిప్పగిరి (శిల్పగిరి) చేరుకుంటాడు.

అయితే ఒక నాటి రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి. సమీపంలోని నెట్టికల్లు (కసాపురం) గ్రామంలో ఎండుపుల్ల చిగురించిన చోట గుడి కట్టించమని ఆజ్ఞాపించాడట.మరుసటి దినం రాయలవారు నెట్టికల్లు గ్రామాన్ని సందర్శించి స్వామికి ప్రీతికరమైన స్థలం కనుగొని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. నెట్టికల్లు గ్రామం వద్ద గుడి ఉండడం వల్ల నెట్టికంటి ఆంజనేయస్వామి అని స్వామికి పేరు వచ్చింది.

నెట్టికల్లు గ్రామం కాలగర్భంలో కలిసిపోయిందని చెప్పడానికి ఆనవాళ్లు కూడా ఉన్నాయి.ఆ గ్రామానికి అనుకునే కసాపురం ఉంది. దీంతో స్వామిని కసాపురం ఆంజనేయ స్వామి అని పిలుస్తారు.


నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు.భక్తులకు ఈయనే "కల్పతరువు", "వరప్రదాత". ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకీ పెద్దది.

శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకల్లు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చెబుతారు. కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామివార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రావణమాసం శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా గుంతకల్లు నుండి నడుపుతారు. లేదా స్వంత వాహనాల్లో గానీ, ఆటోల్లో గానీ కూడా అనేకమంది యాత్రికులు ఈమూడు క్షేత్రాలలోని స్వామివారిని దర్శించుకొంటూ ఉంటారు. ఆ క్షేత్రాల్లో ఒకటైన కసాపురం వివరాలను తెలుసుకొందాం.

ఇంకొక కథ, విజయనగర సామ్రాజ్య కాలంలో సా.శ.1521 లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలవారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.

ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి, "నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు -"దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుంది, అక్కడ భూమిలో తాను ఉంటాను". మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఆ ఎండిన వేపచెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏక భుక్తం ఉంటూ, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపించటం విశేషం. స్వామి ఆ చెప్పులు ధరించి రాత్రి పూట విహారానికి వెళ్ళి వస్తూంటాడని భక్తుల నమ్మకం. స్వామి వారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.

ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.

రవాణా సౌకర్యాలుసమీప విమానాశ్రయం 60 కిమీ దూరంలో ఉన్న బళ్లారిలో ఉంది. గుంతకల్ రైల్వే జంక్షన్ సమీప రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని పెద్ద నగరాలతో, పట్టణాలతో అనుసంధానించబడి ఉంది. గుంతకల్ నుండి ప్రభుత్వ బస్సులు, ఆటోల ద్వారా కసాపురం చెరుకోవచ్చు.

ఇతర ప్రదేశాలుభక్తులు మొదట నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని దర్శించుకొన్న తర్వాత, ఆలయానికి దగ్గరలోని గుట్టపై వెలిసిన బాల ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు దర్శిస్తారు. ఇంకా కసాపురం నుండి తిరుగు ప్రయాణంలో గుంతకల్ వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం కూడా చూడవచ్చు. 14 కిలోమీటర్ల దూరంలోని చిప్పగిరిలో గల శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయం కూడా దర్శించవచ్చు.కసాపురం నుంచీ మద్దికెరకు పోయే దారిలో 5కిలోమీటర్ల దూరంలో తప్పనిసరిగా దర్శించుకోవలిసిన బుగ్గ రామలింగేశ్వరాలయము కూడా ఒక ముఖ్యమైన దర్శనీయ స్థలము.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Anjanadri Hill - అంజనాద్రి కొండ

అంజనాద్రి కొండ

కొప్పల్ జిల్లాలో ఉన్న, హంపి నుండి తుంగభద్ర నదికి ఆవల ఉన్న ఆనెగుండికి దగ్గరగా, అంజనాద్రి కొండలు హనుమంతుని జన్మస్థలంగా నమ్ముతారు.

అంజనకు జన్మించిన హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు, అందుకే ఈ కొండను అంజనాద్రి కొండలు అని పిలుస్తారు, దీనిని 
హనుమంతుని జన్మస్థలం అని నమ్ముతారు.

మంత్రముగ్దులను చేసే ప్రకృతి దృశ్యాల విశాల దృశ్యాలు, ఆశ్చర్యపరిచే సూర్యాస్తమయ దృశ్యాలు మరియు పర్వతాలు మరియు రాళ్ల మధ్య తుంగభద్ర నది ప్రవహించే సుందర దృశ్యాలు మీ ఒత్తిడిని లేదా అలసటను దూరం చేస్తాయి. హంపి శిథిలాలు మరియు పరిసరాల్లోని ఇతర గంభీరమైన కొండలను కూడా చూడవచ్చు.

ఇది సుమారు 516 మీటర్ల ఎత్తులో ఉండి, చుట్టూ తుంగభద్ర నది మరియు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన రాతి కొండల మధ్య ఉంది. ఇక్కడ 575 (లేదా సుమారు 462) మెట్లు ఎక్కి, కొండపైన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

వరి పొలాలు, కొబ్బరి తోటలు,  రాకీ పర్వతాలు ఒక వైపు మరియు మరోవైపు తుంగభద్ర కొండపై నుండి అద్భుతమైన దృశ్యాలు అధిరోహించదగినవి. హనుమంతుని జన్మస్థలమైన ఆలయ సారాన్ని సందర్శించడమే కాకుండా కొండను ఎక్కడానికి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది .

అంజనాద్రి కొండల అభివృద్ధిని ప్రకటించి, 'విశ్వాసానికి నిదర్శనం' అని ప్రకటించారు. అంజనాద్రి కొండలు హనుమంతుని జన్మస్థలం అనే చెప్పటానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. పురాణాల ప్రకారం కిష్కింద అని పిలువబడే ఈ ప్రదేశాన్ని హనుమాన్ భక్తులు సందర్శిస్తారు.

ఆంజనేయ స్వామి తల్లి అంజనా దేవి తపస్సు చేసిన ప్రదేశం, ఇక్కడే హనుమంతుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఈ ప్రదేశం రామాయణ కాలంలోని కిష్కింధగా భావిస్తారు. కొండపై రామ, సీత మరియు అంజనా దేవి ఆలయాలు కూడా ఉన్నాయి.

కొండ పైనుండి హంపిలోని రాతి కట్టడాలు, తుంగభద్ర నది మరియు ఆనెగుంది పరిసరాల యొక్క అద్భుతమైన సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలను చూడవచ్చు.

అక్టోబర్ నుండి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

రోడ్డు మార్గం: హంపి నుండి ఆనెగుంది మీదుగా ఆటోలు లేదా టాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

ఆనెగుంది నుండి 4 కి.మీ, హంపి నుండి 23 కి.మీ, హోస్పేట్ నుండి సుమారు 25-30 కి.మీ దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Wednesday, April 1, 2026

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము

దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది.

దేవకీదేవి దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రసవించగానే, సప్తసముద్రాలు స్వచ్చజలాలతో ఉప్పాంగాయి. మేఘాలు మనోహరధ్వనులతో గర్జించాయి. ఆకాశం గ్రహాలతో, నక్షత్రాలతో ప్రకాశించింది. దిక్కులు మిక్కిలి కాంతితో వెలిగాయి. చల్లనిగాలి కమ్మనివాసనలతో అల్లన వీచింది. హోమాగ్నులు చూడముచ్చటగ వెలిగాయి. కొలనులు తామరలతో, తుమ్మెదలతో శోభాయమానంగా కళకళలాడాయి. నదులు మిక్కిలి నిర్మలమైన నీటితో ప్రవహించాయి. భూమి శ్రేష్ఠాలైన నగరాలతో, పల్లెలతో, ఆలమందలుగల ఊళ్లతో అలరారింది. అడవులు, ఉద్యానవనాలు పక్షుల కిలకిలారావాలతో, పూలతో, పండ్లతో శోభిల్లాయి. దేవతా శ్రేష్ఠులందరు పూలవానలు కురిపించారు.

(దుష్టులను శిక్షించటానికి, శిష్టులను రక్షించటానికి, భూభారం తగ్గించటానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది.)

గంధర్వ శ్రేష్ఠులు(విశ్వావస చిత్రసేనాదులు) ఆనందంతో గానం చేశారు. రంభ మొదలైన అప్పరసలు నాట్యం చేశారు. సిద్దులు సంతోషంతో సమావేశ మయ్యారు. చారణులు నిర్భయులయ్యారు. దేవతల భేరులు మ్రోగాయి.

ఆ వేళలో, అశ్విని మొదలైన నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు మిక్కిలి శుభఫలాల నిచ్చేరీతిగ సంచరిస్తుండగా, రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు, భక్తులముఖాలకు వికాసం కలిగించేవాడు, శత్రువులను గెల్చే స్వభావం కలవాడు, అన్నిలోకాల వెలుపల, లోపల వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారునిగ దేవకీదేవి అర్ధరాత్రిసమయంలో ప్రసవించింది.

ఓ పరీక్షిన్మహారాజా! మెరపు తీగవంటి దేవకీదేవి భక్తులపట్ల అపారదయగల విష్ణుమూర్తిని సునాయాసంగా ప్రసవించి, పున్నమినాటిచంద్రుణ్ణి కన్న తూర్పుదిక్కువలె ఎంతో ప్రకాశించింది.

ఆ వేళలో, మేఘంవంటినల్లనిదేహకాంతి కలవాడు, మోకాళ్ళను తాకే పొడవైన నాలుగుచేతులు కలవాడు, పద్మాలవంటి పెద్దకన్నులు కలవాడు, విశాలమైనవక్షఃస్థలం కలవాడు, అందమైన గదాశంఖచక్ర పద్మాలతో శోభిల్లేవాడు, మెడలోని కౌస్తుభమణి కాంతితో వెలిగేవాడు, మనోహరాలైన మొలత్రాడు, కడియాలు, బాహుపురులు కలవాడు; వక్షఃస్థలంమీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు, గొప్పమకరకుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులుగల నుదురు కలవాడు; వైడూర్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్ఠమైన కిరీటం ధరంచినవాడు, నిండుచంద్రునివలె వెలుగువాడు, భక్తులను కాపాడువాడు, సుగుణాలకు ఉనికిపట్టయినవాడు, అపారకరుణ గలవాడు అయిన బాలకుణ్ణి చూచి వసుదేవుడు ఆనంద పరవశుడయ్యాడు. ఆశ్చర్య చకితుడయ్యాడు. ఉప్పాంగిపోయాడు. మహోత్సాహభరితుడయ్యాడు.

వసుదేవుడు కారాగారంలో ఉన్నందువల్ల స్నానం చేయటానికి అవకాశం లేక ఆనందరససాగరంలో మునిగి, బ్రాహ్మణులకు పదివేలగోవులను దానం ఇవ్వాలని సంకల్పించి, తన మనస్సులోనే వాటిల్ని ధారపోశాడు.

ఇంకా, ఆ వసుదేవుడు ఈ పురిటింటికి ఎంతో కాంతిగల దీపంలా వెలుగుతున్న ఈ బాలుడు, ఆ నాలుగుముఖాల పాపడైన బ్రహ్మను కన్న మహానుభావుడే ఈ శ్రీమహావిష్ణువని భక్తితో భావించి
సాష్టాంగ నమస్కారంచేసి, లేచి నిలబడి, వెంటనే రెండు చేతులు జోడించి నొసట నిలుపుకొని, పసిబాలుడనీ, తన కుమారుడనీ, వెనుకాడకుండ ఆ బాలుని పూర్వచర్యలన్నీ గుర్తుకు తెచ్చుకొని పొగడడానికి పూనుకొన్నాడు.

సాక్షిభూతుడవై సకలలోకాలను చూస్తున్నవాడవు, జ్ఞానానందస్వరూపుడవు, శాశ్వతుడవు, సర్వతంత్రస్వతంత్రుడవు, మాయామయాలైన జననమరణాదులు లేనివాడవు. ఆలాంటి నిన్ను పుత్రునిగా పొందాను. ఇంతకంటే వింత లోకంలో ఇంకొకటి ఏముంటుంది?

(భగవంతుడు జ్ఞానానందస్వరూపుడు. అందుకే 'విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్‌', 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌' అని తైత్తిరీయ ఉపనిషత్తు ప్రవచించింది.)

సృష్టికి ముందు ఏదీ లేని స్థితిలో, స్పష్టంగా నీ మాయతో నీవు ఈ త్రిగుణాత్మకమైన జగత్తును సృజించావు. ఇందులో నీవు ప్రవేశించినా, ప్రవేశించనట్లే ఉంటావు. అందువల్ల ఇందులో నీ ప్రవేశం లేదు; నీ ప్రవేశం లేకుండడమూ లేదు.

నీ చేత సృజింపబడిన ఈ జగత్తులో నీవు ఉండికూడా - ఉండకుండడం, ఎట్లంటే మహత్తత్త్వం మొదలగువాటిల్ని సరిపోలినట్టిదై, దేనికది ప్రత్యేకమైన సూక్ష్మశక్తులు అయిదు, వికారాలు పదహారు కూడి పరమాత్ముడివైన నీవు విరాట్టను పేరుతో విశాలమైన జగత్తును ఏర్పాటు చేసుకొని, అందులో ఉండికూడ, ఉండకుండా ఉంటావు. ఈ సృష్టికి ముందే నీవు ఉన్నావు కనుక సూక్ష్మభూతాలకు, వికారాలకు లోనైన పుట్టుక నీ కేర్పడదు. ఇది తెలుసుకొనడానికి, అనువైన ఇంద్రియాల్లో నీవు ఉన్నాా వాటి అధీనంలో నీవుండవు. ఇంద్రియాలకు అతీతుడవై ఈ లోకాల్లో అంటే, నీ విరాట్‌శరీరంలో ఉన్నట్లే ఉంటావు గాని ఉండవు.

('విశేషేణ రాజత ఇతి విరాట్'  - అనగా అత్యుత్తమంగా ప్రకాశించునది.)

సర్వానికీ ప్రభువువైనవాడా! ఈ జగత్తు మొత్తం నీ లోనే ఉంది. కనుక నీవు జగత్స్వరూపుడివి. ఆత్మస్వరూపుడవైన సర్వం నీవే కనుక, నీకు లోపల, మధ్య, వెలుపల అనేవి ఏవీ లేనే లేవు.

ప్రభూ! పరమాత్మవల్ల ఏర్పడిన దేహాదులను పరమాత్మకంటె వేరైనవని అనుకొనే వాడు మహామూర్తుడు. అందువల్ల ఈ విశ్వమంతా నీవే! నీవు కాని దేదీ లేదు.

అంతేకాక, ఇంకా ఓ స్వామీ! ఏ గుణం, ఏ మార్పు, ఏ కోరిక లేని నీ వల్లనే ఈ జగత్తు పుట్టడం, పెరగడం, నశించడం జరుగుతూందని చెప్పటం తప్పు కాదు. జగత్తుకంతా ప్రభుడివి. పరబ్రహ్మానివి నీవే. అయినా, నిన్ను సేవించే సత్త్వాదిగుణాలు నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక, భటుల శౌర్యాలు ప్రభువుకు చెందినట్లుగా, నీ మాయతో కూడి ప్రవర్తిల్లే గుణాల విధాలు నీకు చెందినవే అని అనిపిస్తాయి. నీవు రక్తవర్ణంతో రజోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును సృజిస్తావు. తెలుపురంగుతో సత్త్వగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును రక్షిస్తావు. నలుపురంగుతో తమోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును నశింపచేస్తావు. అదేవిధంగా రాక్షసుల్ని శిక్షించటానికి, భూమిని కాపాడటానికి ఈ రోజు అవతరించావు.

(పరమాత్మ నిర్గుణుడు; నిర్వికారుడు; నిత్యతృప్తుడు. మాయవల్లనే ఆయనకు గుణాలు, వికారాలు, కోరికలు ఏర్పడతాయి. ఈ మాయకూడా ఆయన సృష్టే తాను సృష్టించిన ఆ మాయకు ఒకమారు లోబడతాడు, మరోమారు లోబడడు. అదే పరమాత్మ వైచిత్రి!

ఇంతకు మునుపు తాను ఆకాశవాణివల్ల విన్న మాటల కారణంగా కంసుడు ధైర్యాన్ని కోల్పోయి, నీవు నాయింట జన్మిస్తావని, నీ కంటే ముందు పుట్టిన నీ అన్నల్ని చంపివేశాడు. కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఈ చెరసాల భటులు నీవు జన్మించావని చెప్పగానే అతడు ఆలస్యం చేయకుండ నిన్ను చంపటానికి సన్నద్ధుడై వస్తాడు.


దేవకీదేవి స్వామిని స్తుతించుట



The praise of Lord Krishna, who is in the womb of Devaki, by the gods Brahma, Shiva and other deities - బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

బ్రహ్మాది దేవతలు దేవకీ గర్భస్థుండగు శ్రీకృష్ణుని స్తుతించుట

సత్యాన్నే వ్రతంగా కలవాడివి. మోక్షప్రాప్తికి సాధనరూపమైనవాడివి. భూత భవిష్య ద్వర్తమానాలు మూడింటిలో ఉండేవాడివి, పంచభూతాలకు పుట్టుక స్థానమైనవాడివి, అయిదు భూతాలలో అంతర్యామిగా ఉండేవాడివి, అయిదుభూతాలు అంతరించిన తరువాత కూడా మిగిలి ఉండేవాడివి, సత్యాన్ని మాట్లాడేవాడివి, అన్నింటినీ, అందరినీ సమానంగా చూచేవాడివి ఇట్టి నిన్ను శరణు వేడుతున్నాం. నీ మాయాశక్తిచేత జ్ఞానశూన్యులైనవారు నిన్ను అనేకవిధాలుగా అనుకొంటున్నారు. కాని జ్ఞానులుమాత్రం ఏకచిత్తంతో అన్నీ నీవే అని అంటారు.

(సమదర్శనం - అన్నింటిని, అందరిని సృష్టించింది, అన్నింటిలో, అందరిలో ఉన్నది పరమాత్మే కనుక ఆయన అన్నింటిని, అందరిని సమానంగా చూస్తాడు. ఆయనది సదా సమదర్శనమే! పరమాత్మతత్త్వాన్ని సృష్టి తత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానిదికూడా సమదర్శనమే!)

అంతేకాకుండా, ఇంకా మూలప్రకృతి పాదుగా, సుఖదుఃఖాలు రెండు ఫలాలుగాా; సత్త్వరజస్తమోగుణాలు మూడు వేళ్ళుగా, ధర్మార్థకామమోక్షాలుగా చెప్పబడే పురుషార్థాలు నాలుగు రసాలుగా, శబ్దస్పర్శరూపరసగంధాలను తెలుసుకొనే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు - అయిదు ఇంద్రియాలుగా - జ్ఞానేంద్రియాలుగా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే ఆరు స్వభావాలుగా, ఆకలి, దప్పిక, శోకం, మోహం, ముసలితనం, మరణం అనే ఆరు ఊర్ములుగా, రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడుధాతువులు పైపొరలుగా, భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే భూతాలు అయిదు, బుద్ధీ, మనస్ఫూ, అహంకారం అనేవి మూడు - మొత్తం ఎనిమిది కొమ్మలుగా, రెండుకళ్ళు, రెండుచెవులు, ముక్కురంధ్రాలు రెండు, నోరు, మలమూత్రద్వారాలు రెండు - మొత్తం తొమ్మిది రంధ్రాలు చెట్టుతొర్రలుగా, ప్రాణాపానవ్యానోదానసమానాలనే పంచప్రాణాలు, నాగ, కూర్మ, కృకర, దేవదత్త ధనంజయాలనే అయిదు ఉపప్రాణాలు మొత్తం పదిప్రాణాలు - ఆకులుగా, జీవుడు, ఈశ్వరుడు పక్షులజంటగా ఉండే సంసారవృక్షాన్ని - పుట్టించటానికీ, రక్షించటానికీ, నశింపచేయటానికీ ప్రభువవు నీ వొక్కడివే!

(సామాన్య దృష్టికి ఇంత అద్భుతమైన ఈ సంసారమహావృక్షాన్ని సృష్టించేది బ్రహ్మ అనీ, రక్షించేది విష్ణువనీ, లయం చేసేది శివుడనీ అనిపిస్తుంది. కాని, తాత్త్వికంగా / లోతుగా చూస్తే ఉన్నది ఒక్కపరమాత్మే - "ఏకం సత్‌" పరమాత్మ నామరూప గుణాలు లేనివాడు. ఆయన తనంత తానుగా గుణాత్మకుడు - త్రిగుణాత్మకుడు - అయినపుడు సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. అందుకే "సంసారవృక్షంబు గలుగంజేయం, గావ, నడంగింప రాజ వొక్కరుండ వీవ” అని చెప్పటం జరిగింది)

జ్ఞానులైనవారు ఏది సత్యమో, ఏది నిత్యమో తెలిసినవారు ఏ వైపునకు వెళ్ళకుండా, తమ దేహాన్ని మనస్సును నీయందే నిలిపి, సంసారమనే సముద్రాన్ని నీ పాదమనే నావ ఆధారంగా, ఆవుదూడ అడుగును దాటినంత సులభంగా దాటగలుగుతారు.

(మనస్సును అన్యమైన వానివైపు పోనీయకుండా, పరమాత్మయందే లగ్నం చేయుట - అనన్య భక్తి. సంసారసాగరాన్ని దాటటానికి, మోక్షాన్ని పొందటానికి ఈ అనన్యభక్తే అద్భుతసాధనం.)

నీవు సజ్జనులకు మేలు, దుర్జనులకు కీడు కలిగించే అనేకశరీరాలు ధరించి, అన్నివేళల్లో లోకానికి క్షేమాన్ని కలుగ చేస్తూనే ఉంటావు.

కొందరు తాము అన్నీ తెలిసినవాళ్ల మనుకొని, పనికిమాలిన విషయాలు తెలుసుకొని, నీ నామమాహాత్యం తెలిసికూడ నామసంకీర్తనం చెయ్యరు. అధోగతిపాలైనవారిమార్గంలోనే తామూ పరుగులు పెడతారు. (నీచజన్మ లెత్తి మహాదుఃఖాల పాలవుతారని భావం)

ప్రభూ! గొప్పవారు నీవారై, తమ హృదయాల్ని నీయందే నిలిపి, జననమరణ భయం లేనివాళ్లై, ఏ అడ్డంకులూ లేక, ఉన్నతోన్నత స్థానమైన పరమపదంలో వర్ధిల్లుతూ ఉంటారు.

ఓ విష్ణుమూర్తి! బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్న్యాసులు అనే నాలుగుఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తుండగా, అన్నిలోకాల్లో సత్త్వమయం, పరిశుద్ధం, క్షేమంకరం అయిన దేహాన్ని నీవు పొందుతావు.

(హరి అంటే భక్తుల పాపాలను హరించువాడు. "హరి యను రెండక్షరములు, హరియించును పాతకంబు అని కదా కృష్ణశతక పద్యం చెపుతూ ఉంది!)

శ్రీహరీ! నీవు సత్త్వస్వరూపుడివి. అలా కాకుంటే నీ దేహం విజ్ఞానాన్ని కలిగించేది, అజ్ఞానాన్ని తొలగించేది ఎలా అవుతుంది? రజస్తమో గుణాల్లోకూడ నీవు ప్రకాశిస్తుంటావు. కాని, సత్త్వమయమైన నీ సహజస్వరూపాన్ని సేవిస్తేనే సాక్షివై నీవు సాక్ష్యాత్కరిస్తావు. మాటకు, మనస్సుకు అతీతమైన మార్గంలో- గుణాలు, జన్మలు, కర్మలు లేనట్టి నీ రూపాన్ని నీ నామాన్ని మహాత్ములు తెలుసుకొంటారు. నిన్ను భావించుకొంటూ, నిన్ను గూర్చి వింటూ, నిన్ను ధ్యానించుకొంటూ, నిన్ను స్తుతించుకొంటూ ప్రకాశించే వ్యక్తి జన్మరాహిత్యాన్ని పొందుతాడు. నీ పాదభక్తుడౌతాడు.

ఓ పురుషోత్తమా! ఓ ఈశ్వరా! నీవు జన్మించటంవల్ల భూభారం తొలగిపోయింది. నీ పాదపద్మాలు ఆదరువుగా నీ దయతో భూమ్యాకాశాలను పూర్తిగా చూడగలం.

(ద్వాపరం నాటికే దుష్టులసంఖ్య భూమిమీద పెరిగింది. భూదేవి వాళ్ళను భరించలేని స్థితి ఏర్పడింది. దుష్ట సంహరణారం శ్రీహరి అవతరణ జరగాలి. అప్పుడే భూభారం తగ్గుతుంది.)

పుట్టడం, పెరుగడం, మరణించడం, మొదలైన వికారాలు ఏవీ లేని నీవు పలుమార్లు పుట్టటం అంటే, అది కేవలం నీకు ఒక క్రీడేగాని, నిజంగా నీవు పుట్టటమా? పుట్టడం, పెరుగడం, మరణించడం మొదలైన దశలన్నీ మాయ. ఆ మాయ జీవులనన్నింటినీ ఆవరించి ఉంటుంది. కానీ, ఆ మాయ నిన్ను కూడా చుట్టుకొన్నట్లు నీ చెంతనే ఉన్నా, నిన్ను ఆవరించే శక్తి దానికి లేదు. సర్వేశ్వరా! ఆ మాయామయాలైన క్రియల్లో ఏ వ్యామోహం లేని- 'ఏకో నారాయణో హరిః' అన్నట్లు ఒంటరివాడవు నీవు మాత్రమే!

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, హయగ్రీవ, పరశురామ, శ్రీరామావతారాలెత్తి, దుష్టులబారినుండి దయతో లోకాలను కాపాడిన నీకు మ్రొక్కుతాము. ఇప్పుడు భూభారాన్ని తొలగించు స్వామీ!

ముకుందా! దయలేని దుర్మార్గులు కంసాదులు విజృంభించి ఎల్లప్పుడు బాధించటంవల్ల లోకం దుఃఖంలో మునిగి ఉంది. ప్రీతితో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. తల్లి కడుపునుండి వెడలిరా స్వామీ!

అని పలికిన తర్వాత దేవకీదేవిని చూస్తూ

అమ్మా! దేవకీదేవీ! నీ గర్భంలో ఆదిపురుషుడైన శ్రీమహావిష్ణువు ఉన్నాడు. రేపు జన్మిస్తాడు. కంసునివల్ల ఏ మాత్రం భయం లేదు. ఇది నిజం. ఇకముందు మా అందరికి శుభం కలుగుతుంది. యాదవులంతా సంతోషంతో పొంగిపోగా ఎల్లప్పుడు నీ కడుపు చల్లగా ఉండాలి (నీవు సుఖంగా ప్రసవించాలి - అని భావం)

అని ఈ విధంగా దేవతలు విష్ణుమూర్తిని స్తుతించి, దేవకీదేవిని దీవించి, శివుడు, బ్రహ్మ ముందు నడువగా తమ తమ స్థానాలకు వెళ్ళారు. తరువాత.




Vishwamitra Vasista Naaradaadi Maharshulu Srikrishna Sandarsanambuku Vacchuta - విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట సాటిలేని అందమైన శరీరం ధరించి, అన్ని పనులూ చ...