Wednesday, April 1, 2026

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము

దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది.

దేవకీదేవి దేవదేవుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రసవించగానే, సప్తసముద్రాలు స్వచ్చజలాలతో ఉప్పాంగాయి. మేఘాలు మనోహరధ్వనులతో గర్జించాయి. ఆకాశం గ్రహాలతో, నక్షత్రాలతో ప్రకాశించింది. దిక్కులు మిక్కిలి కాంతితో వెలిగాయి. చల్లనిగాలి కమ్మనివాసనలతో అల్లన వీచింది. హోమాగ్నులు చూడముచ్చటగ వెలిగాయి. కొలనులు తామరలతో, తుమ్మెదలతో శోభాయమానంగా కళకళలాడాయి. నదులు మిక్కిలి నిర్మలమైన నీటితో ప్రవహించాయి. భూమి శ్రేష్ఠాలైన నగరాలతో, పల్లెలతో, ఆలమందలుగల ఊళ్లతో అలరారింది. అడవులు, ఉద్యానవనాలు పక్షుల కిలకిలారావాలతో, పూలతో, పండ్లతో శోభిల్లాయి. దేవతా శ్రేష్ఠులందరు పూలవానలు కురిపించారు.

(దుష్టులను శిక్షించటానికి, శిష్టులను రక్షించటానికి, భూభారం తగ్గించటానికి పరమాత్మ అవతరించగానే ప్రకృతి మొత్తం ఆనందంతో ఉప్పొంగింది.)

గంధర్వ శ్రేష్ఠులు(విశ్వావస చిత్రసేనాదులు) ఆనందంతో గానం చేశారు. రంభ మొదలైన అప్పరసలు నాట్యం చేశారు. సిద్దులు సంతోషంతో సమావేశ మయ్యారు. చారణులు నిర్భయులయ్యారు. దేవతల భేరులు మ్రోగాయి.

ఆ వేళలో, అశ్విని మొదలైన నక్షత్రాలు, సూర్యచంద్రాది గ్రహాలు మిక్కిలి శుభఫలాల నిచ్చేరీతిగ సంచరిస్తుండగా, రాక్షసులను తల్లడిల్ల చేసేవాడు, భక్తులముఖాలకు వికాసం కలిగించేవాడు, శత్రువులను గెల్చే స్వభావం కలవాడు, అన్నిలోకాల వెలుపల, లోపల వ్యాపించి ఉండేవాడు అయిన విష్ణుమూర్తిని కుమారునిగ దేవకీదేవి అర్ధరాత్రిసమయంలో ప్రసవించింది.

ఓ పరీక్షిన్మహారాజా! మెరపు తీగవంటి దేవకీదేవి భక్తులపట్ల అపారదయగల విష్ణుమూర్తిని సునాయాసంగా ప్రసవించి, పున్నమినాటిచంద్రుణ్ణి కన్న తూర్పుదిక్కువలె ఎంతో ప్రకాశించింది.

ఆ వేళలో, మేఘంవంటినల్లనిదేహకాంతి కలవాడు, మోకాళ్ళను తాకే పొడవైన నాలుగుచేతులు కలవాడు, పద్మాలవంటి పెద్దకన్నులు కలవాడు, విశాలమైనవక్షఃస్థలం కలవాడు, అందమైన గదాశంఖచక్ర పద్మాలతో శోభిల్లేవాడు, మెడలోని కౌస్తుభమణి కాంతితో వెలిగేవాడు, మనోహరాలైన మొలత్రాడు, కడియాలు, బాహుపురులు కలవాడు; వక్షఃస్థలంమీద శ్రీవత్సమనే పుట్టుమచ్చ శోభిల్లగా విహరించేవాడు, గొప్పమకరకుండలాల కాంతులతో విరాజిల్లే ముంగురులుగల నుదురు కలవాడు; వైడూర్యాది వజ్రాలు పొదిగిన శ్రేష్ఠమైన కిరీటం ధరంచినవాడు, నిండుచంద్రునివలె వెలుగువాడు, భక్తులను కాపాడువాడు, సుగుణాలకు ఉనికిపట్టయినవాడు, అపారకరుణ గలవాడు అయిన బాలకుణ్ణి చూచి వసుదేవుడు ఆనంద పరవశుడయ్యాడు. ఆశ్చర్య చకితుడయ్యాడు. ఉప్పాంగిపోయాడు. మహోత్సాహభరితుడయ్యాడు.

వసుదేవుడు కారాగారంలో ఉన్నందువల్ల స్నానం చేయటానికి అవకాశం లేక ఆనందరససాగరంలో మునిగి, బ్రాహ్మణులకు పదివేలగోవులను దానం ఇవ్వాలని సంకల్పించి, తన మనస్సులోనే వాటిల్ని ధారపోశాడు.

ఇంకా, ఆ వసుదేవుడు ఈ పురిటింటికి ఎంతో కాంతిగల దీపంలా వెలుగుతున్న ఈ బాలుడు, ఆ నాలుగుముఖాల పాపడైన బ్రహ్మను కన్న మహానుభావుడే ఈ శ్రీమహావిష్ణువని భక్తితో భావించి
సాష్టాంగ నమస్కారంచేసి, లేచి నిలబడి, వెంటనే రెండు చేతులు జోడించి నొసట నిలుపుకొని, పసిబాలుడనీ, తన కుమారుడనీ, వెనుకాడకుండ ఆ బాలుని పూర్వచర్యలన్నీ గుర్తుకు తెచ్చుకొని పొగడడానికి పూనుకొన్నాడు.

సాక్షిభూతుడవై సకలలోకాలను చూస్తున్నవాడవు, జ్ఞానానందస్వరూపుడవు, శాశ్వతుడవు, సర్వతంత్రస్వతంత్రుడవు, మాయామయాలైన జననమరణాదులు లేనివాడవు. ఆలాంటి నిన్ను పుత్రునిగా పొందాను. ఇంతకంటే వింత లోకంలో ఇంకొకటి ఏముంటుంది?

(భగవంతుడు జ్ఞానానందస్వరూపుడు. అందుకే 'విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్‌', 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌' అని తైత్తిరీయ ఉపనిషత్తు ప్రవచించింది.)

సృష్టికి ముందు ఏదీ లేని స్థితిలో, స్పష్టంగా నీ మాయతో నీవు ఈ త్రిగుణాత్మకమైన జగత్తును సృజించావు. ఇందులో నీవు ప్రవేశించినా, ప్రవేశించనట్లే ఉంటావు. అందువల్ల ఇందులో నీ ప్రవేశం లేదు; నీ ప్రవేశం లేకుండడమూ లేదు.

నీ చేత సృజింపబడిన ఈ జగత్తులో నీవు ఉండికూడా - ఉండకుండడం, ఎట్లంటే మహత్తత్త్వం మొదలగువాటిల్ని సరిపోలినట్టిదై, దేనికది ప్రత్యేకమైన సూక్ష్మశక్తులు అయిదు, వికారాలు పదహారు కూడి పరమాత్ముడివైన నీవు విరాట్టను పేరుతో విశాలమైన జగత్తును ఏర్పాటు చేసుకొని, అందులో ఉండికూడ, ఉండకుండా ఉంటావు. ఈ సృష్టికి ముందే నీవు ఉన్నావు కనుక సూక్ష్మభూతాలకు, వికారాలకు లోనైన పుట్టుక నీ కేర్పడదు. ఇది తెలుసుకొనడానికి, అనువైన ఇంద్రియాల్లో నీవు ఉన్నాా వాటి అధీనంలో నీవుండవు. ఇంద్రియాలకు అతీతుడవై ఈ లోకాల్లో అంటే, నీ విరాట్‌శరీరంలో ఉన్నట్లే ఉంటావు గాని ఉండవు.

('విశేషేణ రాజత ఇతి విరాట్'  - అనగా అత్యుత్తమంగా ప్రకాశించునది.)

సర్వానికీ ప్రభువువైనవాడా! ఈ జగత్తు మొత్తం నీ లోనే ఉంది. కనుక నీవు జగత్స్వరూపుడివి. ఆత్మస్వరూపుడవైన సర్వం నీవే కనుక, నీకు లోపల, మధ్య, వెలుపల అనేవి ఏవీ లేనే లేవు.

ప్రభూ! పరమాత్మవల్ల ఏర్పడిన దేహాదులను పరమాత్మకంటె వేరైనవని అనుకొనే వాడు మహామూర్తుడు. అందువల్ల ఈ విశ్వమంతా నీవే! నీవు కాని దేదీ లేదు.

అంతేకాక, ఇంకా ఓ స్వామీ! ఏ గుణం, ఏ మార్పు, ఏ కోరిక లేని నీ వల్లనే ఈ జగత్తు పుట్టడం, పెరగడం, నశించడం జరుగుతూందని చెప్పటం తప్పు కాదు. జగత్తుకంతా ప్రభుడివి. పరబ్రహ్మానివి నీవే. అయినా, నిన్ను సేవించే సత్త్వాదిగుణాలు నీ ఆజ్ఞల ప్రకారం ప్రవర్తిస్తున్నాయి కనుక, భటుల శౌర్యాలు ప్రభువుకు చెందినట్లుగా, నీ మాయతో కూడి ప్రవర్తిల్లే గుణాల విధాలు నీకు చెందినవే అని అనిపిస్తాయి. నీవు రక్తవర్ణంతో రజోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును సృజిస్తావు. తెలుపురంగుతో సత్త్వగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును రక్షిస్తావు. నలుపురంగుతో తమోగుణరూపుడివై ఉన్నప్పుడు జగత్తును నశింపచేస్తావు. అదేవిధంగా రాక్షసుల్ని శిక్షించటానికి, భూమిని కాపాడటానికి ఈ రోజు అవతరించావు.

(పరమాత్మ నిర్గుణుడు; నిర్వికారుడు; నిత్యతృప్తుడు. మాయవల్లనే ఆయనకు గుణాలు, వికారాలు, కోరికలు ఏర్పడతాయి. ఈ మాయకూడా ఆయన సృష్టే తాను సృష్టించిన ఆ మాయకు ఒకమారు లోబడతాడు, మరోమారు లోబడడు. అదే పరమాత్మ వైచిత్రి!

ఇంతకు మునుపు తాను ఆకాశవాణివల్ల విన్న మాటల కారణంగా కంసుడు ధైర్యాన్ని కోల్పోయి, నీవు నాయింట జన్మిస్తావని, నీ కంటే ముందు పుట్టిన నీ అన్నల్ని చంపివేశాడు. కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నాడు. ఇప్పుడు ఈ చెరసాల భటులు నీవు జన్మించావని చెప్పగానే అతడు ఆలస్యం చేయకుండ నిన్ను చంపటానికి సన్నద్ధుడై వస్తాడు.


దేవకీదేవి స్వామిని స్తుతించుట



No comments:

Post a Comment

The incarnation of Lord Krishna - శ్రీ కృష్ణావతార ఘట్టము

శ్రీ కృష్ణావతార ఘట్టము దేవకీదేవి ప్రసవవేదన పడుతుండగా దుర్జనుల మనస్సుల్లో బాధ కలగటం, సజ్జనుల్లో బాధలు తొలగటం అగుపించింది. దేవకీదేవి దేవదేవుడై...