Saturday, April 4, 2026

killing of Vatsasura and Bakasura - వత్పాసుర బకాసురులవధ

వత్పాసుర బకాసురులవధ

అలా దూడరూపంలో వచ్చిన రాక్షసుడు మిగిలినమందలోని దూడల మెడలు నాకుతూ దూడల్లో కెల్లా ఇదే మంచి దూడ అనుకునేలా కనబడుతూ, భక్తజనాలవెంట దూడై సంచరించే శ్రీకృష్ణుని ఎదుట దూడగా తిరిగాడు.

శ్రీకృష్ణుడు దూడరూపంలో వచ్చినవాణ్ణి రాక్షసుడుగా గుర్తించి బలరామునికి ఆ విషయం చెప్పి,

శ్రీకృష్ణుడు - దూడరూపంగా వత్సాసురుడు వచ్చాడని బలరామునితో చెప్పాడు. గోపబాలురతో చూడండి ఇదొక మంచిదూడ, ఎంతోబాగుంది అంటూ దానికాళ్ళు తోక పట్టుకొని గిరగిరా తిప్పుతూ ఒక్క దెబ్బకొట్టి, కదిలిపోయేలా వెలగచెట్టుకు కొట్టి, గోపబాలురు కోయంటూ కేకలు వేస్తుండగా అవలీలగా ఆ వత్సాసురుణ్ణి చంపాడు.

శ్రీకృష్ణు డెప్పుడైతే దాని కాళ్ళు, తోక పట్టుకొని గట్టిగా వెలగచెట్టుకు వేసి కొట్టాడో ఆ దెబ్బతో వత్సాసురుడు ఆ చెట్టుతో సహా నేలమీద కూలిపోయేడు. ఆ సమయంలో

రాక్షసుడు చనిపోవడంతో, కంబళ్ళు ఎగురవేసుకుంటూ, చెంగున ఎగురుతూ, చప్పట్లు కొడుతూ, పొంగిపోతూ శ్రీకృష్ణుణ్ణి పొగడుతూ, చచ్చిన రాక్షసుణ్ణి చూస్తూ గోపకుమారులు గెంతులు వేశారు.

ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. ఈ విధంగా

ఓ పరీక్షిన్మహారాజా! భక్తుల విషయంలో ఎంతో వాత్సల్యంగల శ్రీకృష్ణుడు, లోకంలో ఎల్లజనులను ఆవు దూడలను కాపాడేలా కాపాడుతూ, దూడలను మేపుకుంటూ, దూడరూపంలో వచ్చిన వత్సాసురుని సంహరించాడు.

వత్సాసురుణ్ణి సంహరించిన తరువాత, ఒకనాడు పొద్దున్నే గొల్లబాలురు దూడలతో అడవికి వెళ్లారు. ఎండ తీవ్రం కావడంతో దాహం ఎక్కువయింది. దాహంతో నీరసించిన తమతమ దూడలను విడివిడిగా నిలిపి, నిర్మలమైన ఒక సరస్సులోని నీటిని తాగించారు. వారుకూడా దాహం తీర్చుకొని వస్తుండగా అక్కడ

ఆ గోపబాలురు ఒక తెల్లకొంగను చూశారు. అదెలా ఉందంటే పదునైన అంచులుగల వజ్రాయుధంతో కొట్టిన వెండికొండ శిఖరమో అన్నట్లుంది. పెద్దగా భయంకలిగించే కళ్ళతో కృష్ణుణ్ణి హింసించే ప్రయత్నంతో ఉన్నట్లుంది.

ఆ కొంగను చూశారు. ఎంతో పొడవైన దాని శరీరాన్ని చూచి, ఆశ్చర్యంతో అలా చూస్తూనే ఉండగా

మునీశ్వరు లెలాగైతే పనులన్నీ విడిచి, ధ్యానమార్గమందే మనసుంచి, ఇతరమైన కోరికలులేకుండా, భగవంతునిమీదే దృష్టితో ఉంటారో, అలాగే బకాసురుడుకూడా ఇంకే పనీ ఆలోచించకుండా, కృష్ణుణ్ణి హింసించే దృష్టితో మరో అభిమానం లేక, నీటి ఒడ్డున నిలిచి, పద్మదళాయతనేత్రుడైన శ్రీకృష్ణునిమీదే చూపుంచి ఒక తాపసివలె ఉన్నాడు.

పై రీతిని తపస్విగా నిలిచి పొంచి ఉన్నవాడై సమయంకోసం కనిపెట్టుకొని

బకాసురుడు ఒకసారి ముక్కును సరిచేసి, రెక్కలు విప్పి, కాళ్ళెత్తి నేలపైనుండి శరీరాన్ని కుదిపి, ఆకాశంమీదికి ఎగిరాడు. భయంకరంగా ధ్వనిచేస్తూ నోరువిప్పి, తన రెక్కల గాలికి చెట్లు విరిగి వరుసగా నేలకూలగా, ఏ పనైనా ఓర్మితో భరించే ఆ చిన్ని కృష్ణుణ్ణి లాగిపట్టి మింగేశాడు.

రాజా! లోకాలన్నింటినీ ఒకటిగా చేర్చి, వాటిల్ని లయంచేస్తూ, సృష్టిస్తూ, బాహ్యంగా సంచరించేలా చేస్తూ సంతోషించే లీలావిలాసరూపుడైన శ్రీకృష్ణపరమాత్మ ముందు ఏం జరుగుతుందో ఊహించి అలా బకాసురునిచేత మింగబడ్డాడు.

ఆ విధంగా బకాసురుడు కృష్ణుణ్ణి మింగేసరికి, బలరామునితోపాటు ఆ గోపబాలురంతా కృష్ణుణ్ణి కానకపోవడంతో ఒక్కసారిగా చేష్టలులేనివారై, జీవంలేని ఇంద్రియాలవలె నిశ్చేష్టులయ్యారు.

కృష్ణుణ్ణి బకాసురుడు మింగాడు. అయినా కృష్ణుడు బకుని కడుపులోకి వెళ్లకుండా

బకుడు కృష్ణుణ్ణి మింగేసరికి అతని అంగిలి దవడలు అటూ ఇటూ మెదుపుతూ ప్రళయకాలంలో అగ్నిలా శ్రీకృష్ణుడు మొక్కవోని పరాక్రమంతో తీవ్రతాపాన్ని కలుగజేస్తూవుంటే అలా విజయం పొందాలనుకుంటున్న బ్రహ్మకే తండ్రియైన అణిమాదిమహిమలతో నిండియున్న ఆ బాలకృష్ణుణ్ణి మింగడం సాధ్యంకాదని తలచి, కృష్ణుణ్ణి నిందిస్తూ లోకాన్ని సుఖమయం చేసేలా బకుడు కృష్ణుణ్ణి బయటికి కక్కాడు.

గొంతుకలో ఉన్న కృష్ణుణ్ణి భరించలేక బయటికి కక్కి పెద్దగా అరుస్తూ కృష్ణుణ్ణి ముక్కుతో పొడుద్దామని వస్తున్న ఆ కొక్కెర రక్కసియొక్క ముక్కుపుటాలు రెండూ ముడుచుకొనేట్లుగా పట్టుకొని, కృష్ణుడు గడ్దిపోచను నిలువునా చీల్చినట్లు తనపై కయ్యానికి కాలు దువ్వేలా వస్తున్న ఆ రక్కసుణ్ణి రెండుగా చీల్చివేశాడు.

ఇలా ఎప్పుడైతే శ్రీకృష్ణుడు బకాసురుణ్ణి చీల్చి చంపాడో, అప్పుడు దేవతలు కృష్ణునిమీద పంక్తులు పంక్తులుగా నందన వనంలోని మల్లెలు మొదలగు పూలవానలు కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. బకాసురుడు కృష్ణుని మింగడం చూచి, ప్రాణంలేని ఇంద్రియాలతో అచేతనులైపోయిన బలరామాదులు మళ్ళీ జీవం నిండిన ఇంద్రియాలతో కృష్ణుణ్ణి దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. అందరూ దూడలగుంపులు తోలుకుంటూ తిన్నని నడకలు నడుస్తూ బృందావనానికి వచ్చి, అక్కడి గోపకులకు, గొల్లస్త్రీలకు అందరికీ విషయమంతా చెప్పగా, విన్నవారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు.

ఆ గోపాలురు గోపకాంతలు ఇలా అనుకుంటున్నారు. ఈ చిన్నికృష్ణునికి ఆపదల మీద ఆపదలు వచ్చిపడి తప్పుతున్నాయి. ఈ బాలుడిపై వరుసగా పడ్డ దుర్జనులందరూ అగ్నిమీదకి వెళ్ళి మాడి రాలిన మిడతల్లా భూమ్మీద పడిపోతున్నారు.

ఇలా వారంతా అన్నారు. ఆ పై రామకృష్ణులు దూడలను మేపుకుంటూ ఉన్న సమయంలో

మనం వానరుల్లా సముద్రానికి సేతువు కడదామా అంటూ అక్కడున్న కాలువలపై అడ్డకట్టలు కడతారు. మునీశ్వరుల్లా తపస్సు చేసుకుందామా అంటూ, మాటలు మాని, మౌనుల్లా ఉంటారు. గానం చేసే గంధర్వుల్లా మనంకూడా పాడుదామా అంటూ పాడడం ప్రారంభిస్తారు. అచ్చరకాంతల్లా మనంకూడా నృత్యం చేద్దామా అంటూ ఆడవేషం ధరించి నర్తిస్తారు. దేవతలు, రాక్షసులు ఎలాగైతే సముద్రాన్ని చిలికారో మనమూ అలాచేద్దాం అంటూ తమ ఈడుగల గోపబాలురంతా కలిసిరాగా ఎంతో అందంగా తమ చేతులనే కర్రలుగా భావించి, అక్కడిసరస్సులను చిలుకుతారు.

శ్రీకృష్ణుడు గోపకులతో బంతి చల్దులు గుడువ వనమున కేగుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Nandas leave Vrepalle (Gokulam) and move to the safer and more beautiful Vrindavan - నందాదులు బృందావనంబునకు నరుగుదెంచుట

నందాదులు బృందావనంబునకు నరుగుదెంచుట

ఓ రాజా! ఇలా లీలామానుషధారియైన శ్రీకృష్ణుడు అనేకవిధాలుగా బాల్యచేష్టలతో ఆనందింపగా, బృహద్వనమనే ఓ పెద్దతోటలో నందుడు మొదలగు పెద్దవారైన గొల్లవారు ఇలా వరుసగా అరిష్టాలు (పూతన, శకటుడు, గుహ్యకులు మద్దిచెట్లు కూలడం) సంభవించడం, మెల్లగా బాలకృష్ణుడు బైటపడడం ఇవన్నీ ఆలోచించి, ఓ రోజు ఏకాంతంలో అందరూ కూర్చుని విచారిస్తూవుండగా, ఉపనందుడనే ఒక వృద్ధుడు తనకు గల తెలివితో ఆలోచించి ఇలా అన్నాడు.

కృష్ణుడిలా లీలావినోదాలు చూపుతుండగా ఆ వ్రేపల్లెలోని బృహద్వనంలో వృద్ధగోపాలులందరూ నందునితో కూడివుండగా ఓ వృద్ధగోపాలుడిలా అన్నాడు. ఏ మర్రా వింటున్నారా! ఎవరైనా మనుష్యులనేవారు ఇక్కడ ఉంటారా! మన చిన్ని కృష్ణునికి కీడు చెయ్యడంకోసం ఓ రాక్షసస్త్రీ వచ్చి చనుబాలు ఇచ్చింది. రాళ్ళ సుడిగాలి వీచింది. ఇప్పుడు ఈ మద్దిచెట్లు కృష్ణునికి చాలా దగ్గరలోనే నేలకూలాయి. ఈ ఆపదలన్నీ ఆ నారాయణుని దయవల్లే తప్పిపోయాయి. ఇంక ఇక్కడ ఉండడం మంచిదికాదు. ఎక్కడికైనా పోదాం అన్నాడు.

'బృందావనం' పశువులమేతకు మంచిగడ్డితో సరియైనస్థలం. అక్కడ చిక్కగా కొండలు, నదీజలాలు, చెట్లు తీగల పంక్తులతో మనం నివాసం ఉండడానికి ఎంతో అనువుగా ఉంటుంది. కాబట్టి అక్కడికి పోదాం పదండి.

ఇలా ఉపనందుడు బృందావనానికి పోదాం అన్న మాటకు పెద్దలందరూ ఇదే మనం చెయ్యవలసిన కార్యం అంటూ ఏమాత్రం సంకటపడకుండా, గోవుల మందలను త్వరగా వెళ్ళేటట్లు ముందర నిలిపి, ఆ వెనుక పిల్లలను, వృద్దులను, స్త్రీలను, రథాలపై (బండ్లపై) ఎక్కించి, తాము కవచాలు, అమ్ములపొదులు, బాణాలతో విండ్లు పుట్టుకొని నడుస్తూ, కూడి బండ్ల వెనుకగా 'కొమ్ము' వంటి వాద్యాలను ఊదుతూ, ఆ వాద్యధ్వనులు అంతటా వ్యాపించగా, పెద్దలు, పురోహితులతో ఉత్సాహంతో ముందుభాగంలో గుంపులుగా ఏర్పడి పవిత్రమైన బృందావన ప్రదేశానికి వెళ్లారు ఆ సమయంలో,

గోపకాంతలు చక్కగా పసుపు రాసుకొని స్నానాలుచేసి, వక్షఃస్థలంపై కుంకుమాదిపూతలు పూసుకొని, మంచి వస్త్రాలు ధరించి, పెద్దపెద్దకొప్పుల్లో సంపెంగదండలు అలంకరించుకొని, నుదుట తిలకం ధరించి, బంగారు ఆభరణాల కాంతులు వారికంఠాలపై వ్యాపిస్తుండగా, రథాలపై వెళుతూ, శ్రీహరిలీలల్ని ఏలలుగా గానం చేశారు.

అప్పుడు రోహిణీయశోదాదేవులిద్దరూ ఒకే రథంపై కూర్చున్నవారై ఆనందంతో తమ ముందున్న బలరామకృష్ణులు వినోదాలు చేస్తూవుంటే ఆనందిస్తూ వెళ్లారు. ఇలా ఆ గోపకులందరూ, బృందావనంలో ప్రవేశించి, బండ్లనన్నిటినీ అర్ధచంద్రాకారంగా ఉంచి, ఆవులమందలను చక్కగా నిలిపి అక్కడ నివసించారు.

బలరామ శ్రీకృష్ణులిద్దరూ మిక్కిలి పవిత్రమూ, యమునా నదీప్రవాహ జలంతో నిండిందీ, ఋషిబృందాన్ని రక్షించేది అయిన బృందావనాన్ని పొగడుతూ అందులో ప్రవేశించారు.

ఇలా బృందావనంలో చేరాక, కొన్నాళ్ళకు రామకృష్ణులు తమ ఈడుగల గొల్లపిల్లలతో కలసి ఉత్సాహంగా దూడలను మేపుకుంటూ

బలరామశ్రీకృష్ణులు తమ తమ ఈడు గోపబాలురతో కూడి పిల్లలాడుకునే ఆటలాడుతూ, పిల్లన గ్రోవులు ఊదుతున్నారు. నానావిధాలుగా నృత్యరీతులతో గెంతులు వేస్తున్నారు. ఉత్సాహంతో పెద్ద పెద్ద కంబళులతో ఆబోతుల రూపాలను తయారుచేసి అవి శత్రువుల లేదా ఇతరుల ఆబోతులంటూ వాటితో పోరుతున్నారు. గుడ్డలతో బొమ్మలుచేసి వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే కాలిగజ్టెలు మోగుతున్నాయి. పందేలు వేసుకుని పండ్ల పూల గుత్తులను కొట్టినేల పడేటట్లు చేసి నేర్పుతో వాటితో కొట్టుకుంటున్నారు. అడవిజంతువుల అరుపులను అనుకరిస్తూ వాటిని మోసపుచ్చి పట్టుకునేలా ప్రయత్నిస్తున్నారు. తామర కొలనుల్లో ఒకరిపై ఒకరు నీళ్ళు చిమ్ము కుంటూ ఈదుతూ ఆడుకుంటున్నారు.

పరీక్షిన్మహారాజా! ఆ బాలకులచేష్టలు ఇంకా వినండి. వంచించుకొంటూ, పోరాడుతూ ఉంటారు. ఏ భయమూ లేకుండా పెద్ద పెద్ద గుబురుగా ఉండే స్థలాలలోకి ప్రవేశిస్తూ ఉంటారు. పెద్దబండరాళ్ళ మీదనుండి కిందకి జారుతూ ఉంటారు. చెప్పరాని నేర్చరితనంతో ఒకరి నొకరు మించిపోతూ ఉంటారు.

ఇలా బలరామకృష్ణులు, గోపబాలురు ఇష్టం వచ్చినట్లుగా ఆడుకుంటూ ఉండి, ఒకనాడు యమునానదితీరంలో దూడలను మేపుతూ ఉండగా, ఒక రాక్షసుడు దూడరూపంలో అక్కడికి వచ్చి వాళ్ళను బాధించాలనుకున్నాడు.

వత్పాసుర బకాసురులవధ

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The young Krishna uproots sycamore trees - చిన్నికృష్ణుడు మద్దిచెట్లను కూల్చుట

చిన్నికృష్ణుడు మద్దిచెట్లను కూల్చుట

ఆ కపట బాలుడైన కృష్ణుడు మద్దిచెట్లను కూల్చి, నలకూబర మణిగ్రీవులను శాపంనుండి విముక్తులను చేసేలా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ మద్దిచెట్లున్న చోటికి రోటిని ఈడ్చుకుంటూ ఒక ప్రయత్నంగా వెళ్లాడు.

సహజ సిద్ధంగా మహాబల సంపన్నుడైన ఆ బాలకృష్ణుడు తన పొట్టకు కట్టిన తాడును లాగడంవల్ల అడ్డంగా తిరిగిన రోటితో ఆ రెండు మద్దిచెట్లమధ్యలో ప్రవేశించి ముందుకు సాగుతూ

ఎప్పుడైతే శ్రీకృష్ణుడు చెట్లకు అడ్డంగా తిరిగిన రోటిని ముందుకు ఈడ్చుకుంటూ వెళ్తున్నాడో, నారదుడు చెప్పిన ప్రకారం శ్రీకృష్ణునిపాదారవిందస్పర్శ కలగడంతో, శాపావసానాన్ని పొందిన ఆ జంటమద్దిచెట్లు మూలం పెల్లగిలి కొమ్మలు విరిగిపడుతూండగా గొప్ప భయంకరధ్వని చేస్తూ నేల కూలాయి.

ఈ విధంగా వేళ్ళతో సహా పెకలింపబడిన ఆ మద్దిచెట్లు నేలకూలగా, ఆ చెట్లలో నుండి అగ్నిశిఖలు వెలువడినట్లు మిక్కిలి ప్రకాశంతో దిక్కులు పిక్కటిల్లేలా ప్రసిద్ధులైన ఇద్దరు దేవజాతికి చెందిన సిద్దులు బయటకు వచ్చారు. అలా వచ్చి, ముందటి జ్ఞానంతో భక్తుల పాలిట రక్షకుండైన ఆ బాలకృష్ణమూర్తికి నమస్కరించి, లేచి, హస్తపద్మాలను జోడించి, అంజలి ఘటిస్తూ ఇలా అన్నారు.

నారదశాపంనుండి విముక్తిపొందిన వారిద్దరూ, శ్రీకృష్ణుణ్ణి ఇలా స్తూతిస్తున్నారు. ఓ కృష్ణా! నీవు బాలుడివి కావు. అణువుకంటె అణువుగా, మహత్తుకంటె మహత్తుగా ఉండే పరబ్రహ్మవు. నీకు నీవే కాని వేరే ఆధారం అక్కరలేనివాడివి. విశ్వస్థితికి నీవే మూలపురుషుడివి. ఈ సూక్ష్మస్థూల రూపమైన, చరాచరమైన ఈ జగత్తు నీ విలాసరూపమని జ్ఞానులైనవారు భావిస్తారు.

ఓ కృష్ణా! ఈ సృష్టిలో అన్ని జీవరాసులకూ, సర్వేంద్రియ, అహంకార, ప్రాణాలకూ అధిపతివి నీవే! ప్రకృతి స్వరూపుడవు నీవే! దానినుండి పుట్టిన మహత్తత్త్వానివీ నీవే! వీటన్నిటికీ అధిపతివీ నీవే! ప్రకృతి సంబంధ గుణాలవల్ల ఏ వికారాన్నీ పొందక వాటి కన్నింటికీ ముందే ఉన్నవాడివి నీవు. ప్రాకృతగుణాలతో కూడినవాడు వాటికతీతుడవైన నిన్నేవిధంగా ధ్యానం చేయగలడు? నీవు గుణాతీతుడవు. నీలో ఉన్న గుణాలతో నీవు కప్పబడి రహస్యంగా వుంటావు. శరీరాలు ధరించిన ఎవరూ నీ మత్స్యకూర్మాది అవతారవైభవాలకు సాటిరారు. ఈ జీవులంతా నీ తేజస్సుతో పుడతారు. కనుక నీవు వాళ్లకు అంతు చిక్కవు. సాటిలేని ప్రభావం కలవాడవగుటచే వారిలా చిక్కులలోపడి, సంకటపడక చరించే సర్వోత్కృష్టుడవైన నీకు నమస్కరిస్తున్నాము.

ఈ లోకాలన్నింటిని స్పష్టించడానికి, రక్షించడానికి అవతరించావు. నీవు అంతటికీ ఈశ్వరుడవు. యోగిగణాలలో శ్రేష్ఠుడవు. లోకకల్యాణకారకుడివి. కవీశ్వరులచే సన్నుతింపబడేవాడివి. సకలలోకాలూ నీలో, సకల లోకాల్లో నీవూ ఉన్నావు. జగత్కల్యాణకారక గుణాలకు ఆధారభూతుడివి.

భుక్తులపాలిట మిత్రుడా! ఓ శ్రీకృష్ణా! నారదమహాముని మాటలు (శాపవాక్యాలు) తప్పకుండా నిజమే అయ్యాయి. ఆ శాపం నిమిత్తంగానే నిన్ను దర్శింపగలిగాం. మేము నీ కోసం చేసిన తపస్సు ఫలించింది. మా యిద్దరినీ నీయందు ప్రపత్తి గల భక్తులుగా అనుగ్రహించు.

ఓ కృష్ణమూర్తీ! నీవు మాయందు కరుణతో - మా చెవులెప్పుడూ నీ స్తోత్రాలే వినెేటట్లుగా, మా వాక్కులు నీకు సంబంధించిన మాటలే మాట్లాడేటట్లుగా, చేతులు రెండూ నీకు సంబంధించిన కైంకర్యాదులే పనులే చేసేటట్లుగా, నీ దివ్యమంగళ మూర్తిపైనే మా చూపులుండేటట్లుగా, నీ చరణాల చెంతనే మా శిరస్సులెప్పుడూ మొక్కేలా, మా మనస్సులు నిన్నే సేవించేలా, నీపైనే మా బుద్ధులుండేలా, మమ్ములను అనుగ్రహించు.

పై రీతిగా తనను సోత్రం చేసిన ఆ నలకూబరమణిగ్రీవులతో రోటికి కట్టబడే ఉన్న శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు.

లోకంలో తమ తమ వర్ణాశ్రమాలకు విధింపబడిన ధర్మాన్ని వీడకుండా అందరియందునూ, సమదృష్టి కలిగి నన్నే నమ్మివుండే యోగ్యతగలవారికి, సూర్యోదయంకాగానే ఎంత దట్టమైన చీకటైనా ఎలా పటాపంచలవుతుందో అలాగే నన్ను దర్శించగానే వారి బంధాలన్నీ తొలగిపోతాయి. అంటే ముక్తులవుతారు.

ఓ నలకూబరమణిగ్రీవులారా! దయామయుడైన నారదుడు శపించినా, మీయందు అనుగ్రహించిన కారణంగా, మీరు నన్ను చూడడంతో శాపంనుండి తొలగినవారయ్యారు. నన్ను భావించే బుద్ధికూడా మీకు లభించింది. ఇది యథార్థం.

పై రీతిగా చెప్పిన పిమ్మట శ్రీకృష్ణుడు నలకూబర మణీి(గ్రీవులతో మీరు మీస్థానాలకు వెళ్ళండి అని ఆజ్ఞాపించగా, గొప్ప అనుగ్రహం అంటూ, వారిరువురూ స్వామికి ప్రదక్షిణం చేసి, ఎన్నో నమస్కారాలుచేసి, తమ తండ్రి వుండే ఉత్తర దిక్కునగల తమ నివాసస్థానాలకు వెళ్ళిపోయారు. ఇదంతా జరిగిన పిమ్మట నందునితో పాటు అక్కడున్న గొల్లలందరూ మూలంతోసహా పెల్లగిలి పడిన ఆ మద్దిచెట్ల ధ్వనిని విని, పిడుగు పడిన చప్పుడుగా భావించి, అక్కడకి వచ్చి చూశారు.

అక్కడకు వచ్చి చూచి, నందాదులు ఇలా అంటున్నారు. ఈ మద్దిచెట్లు నేలకూలగా, ఈ చిన్ని కృష్ణుడు రోటికి కట్టబడివున్నవాడై ఎలా బ్రతికిపోయాడో! ఇతడెట్టివాడో! ఇంత చిన్నవాడైనా ఈ సంఘటనకు ఏడవలేదు, భయపడలేదు, చూశారా?

కూలిన చెట్లను చూచి వారిలా అనుకుంటున్నారు. పిడుగేమో పడలేదు, పోనీ పెద్దగా గాలి వీచిందా అంటే అదీ లేదు. ఎవరైనా చెట్లను నరికి వేసినట్లూ లేదు. వీడు చూస్తే చిన్న పిల్లవాడు, ఆ చెట్లను పట్టుకొని నేలకూల్చే శక్తి లేనివాడు, మరి ఆ చెట్లు భూమిమీద ఎలా కూలిపడ్డాయి?

పైవిధంగా అక్కడున్న అందరూ తలోరకంగా ఇవేవో అపశకునాలని అనుమానించగా, అక్కడే ఉన్న చిన్న పిల్లలు వాళ్ళతో ఇలా అన్నారు.

ఈ నందకుమారుడైన బాలకృష్ణుడు మద్దిచెట్ల మధ్యలో దూరి, తనకు కట్టిన రోటిని సరిగ్గా ఆ చెట్ల మధ్యలో అడ్డంగా వచ్చేటట్లుచేసి ముందుకు లాగగా ఈ చెట్లు పెద్దధ్వనితో అట్టహాసంగా విరిగిపడ్డాయి. అక్కడ ఇద్దరు మనుష్యులను మేము చూశాం. మామాట వినండి అన్నారు.

చెట్లు కూలిన సమయంలో అక్కడ వున్న బాలకులు అలా చెప్పగా, అక్కడున్నవారిలో కొందరు ఇదంతా అబద్ధం అన్నారు. మరికొందరు అనేక విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు వికసించిన పద్మంలా ముఖాన్ని సంతోషంతో నింపుకొని, కొడుకైన కృష్ణుని నడుముకు, రోటికి కట్టిన ఆ కట్టును విప్పాడు. ఇదంతా చూస్తున్న ఆ మాయాబాలకృష్ణుడు తన ఈ అద్భుతకార్యం సంగతి ఎవరూ తెలుసుకోకూడదని

తన మాయారూపాన్ని ఎవరూ గుర్తించకుండా, ఆ బాలకృష్ణుడు ఏమీ తెలియని అమాయకుడిలా పాటలు పాడతాడు. గోపికలు చప్పట్లు కొడుతూవుంటే కీలుబొమ్మలా ఒళ్ళు తెలియనట్లు తానూ చేతులు తిప్పుతూ ఆడతాడు. చూడడం తెలియనివాడిలా చుట్టూవున్నవాళ్ళను చూస్తాడు. ఊరకే నవ్వుతాడు, తన తోటి బాలకులతో చేరతాడు, పెద్దలు చెప్పిన పనులన్నీ చేయడానికి వెళతాడు, మట్టిలో గంతులువేస్తూ, దాగుకుంటాడు.

సాధారణంగా పిల్లలు పాలు తాగడానికి, అన్నం తినడానికి అల్లరి చేస్తుంటారు. అలాగే కృష్ణుడు పాలుతాగడానికి అల్లరి చేస్తుంటే తల్లి యశోద పాలు నీవు తాగావంటే జుట్టు బాగా పెరుగుతుంది అంది. దాంతో పిల్లవాడు పాలు తాగి 'ఏదీ జుట్టు పెరగలేదే' అంటూ కొంటెగా తన జుట్టు చూపాడు.

బాలకృష్ణుడొక రోజు పశులను తోలే ఒక సెలగోల పట్టుకొని, నీళ్ళకుండలో తన నీడను చూపుతూ, అమ్మా! అవడో బాలుడు సెలగోలపట్టుకొని నన్ను కొడదామనుకుంటున్నాడు అంటూ తల్లికి తన ప్రతిబింబాన్ని చూపి, చెప్పాడు.

ఓ పరీక్షిన్మహారాజా! చిన్ని కృష్ణుడు అల్లరి, మారాంచేస్తూ, ఏడుస్తూ వుంటే ఇలా చేస్తే బిచ్చగాండ్రు వచ్చి నిన్ను వాళ్ళ బిచ్చం పట్టే జోలిలో వేసుకొని భయపెట్టి దండిస్తారు సుమా! అనగానే బిచ్చగాండ్రను, యశోదనూ చూస్తూ బాలుడు భయపడ్డాడు.

నందాదులు బృందావనంబునకు నరుగుదెంచుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

The Ulukhalabandhana - Yamalarjuna Bhanjana Discription - ఉలూఖలబంధన యమళార్జున భంజనాద్యభివర్ణనము

ఉలూఖలబంధన యమళార్జున భంజనాద్యభివర్ణనము

ఈ విధంగా కృష్ణుడి దుడుకు చేష్టల రహస్యాలను వ్యంగ్యంగా పేర్కొని, వెన్న దొంగతనం లీలగా చేసేవాడు, చక్కగా మాట్లాడే స్వభావంగలవాడు, తల్లి చేస్తున్న పనులను ఎంతో ఆశ్చర్యంగా చూస్తున్నవాడు, నుదుట ముత్యాల చేర్చుక్క గలవాడు అయిన చిన్ని కృష్ణుణ్ణి యశోద ఒక రోటికి కట్టివేసింది.

శుకమహర్షి పరీక్షిన్మహారాజును సంబోధిస్తూ ఓ రాజా! అలా ఆ చిన్ని కృష్ణుడు రోలుకు కట్టబడినప్పటికీ, భక్తులకు వశమైనవాడు కాబట్టి అతడు స్తంభానికి కట్టుబడి అధికమదంతో ఒప్పే ఒక ఏనుగుగున్నలా ఎంతో కాంతితో ప్రకాశించాడు.

(భద్రజాతి ఏనుగులకు గండస్థలంనుండి పాదాలవరకు ఎనిమిది స్థానాలలో మదజలం ఉంటుందని చెప్పబడింది. మదపుటేనుగులు అంటాం కదా! బాలకృష్ణుడు అటువంటి మదజలంతో కూడిన ఏనుగుగున్నలా వున్నాడట.)

ఓ రాజా! వెలుపల లోపల అనేది లేకుండా, ఆది మధ్యాంతాలు లేని విశ్వానికి తానే తుది, మొదలు, నడుమ, బయట, లోపల అయిన ఆ సర్వేశ్వరుణ్ణి యశోద భక్తురాలు కాకపోతే రోటికి కట్టడం సాధ్యమయ్యేదా?

యశోద తన చిన్ని కుమారుడు అందరి పిల్లల్లాంటి పిల్లవాడే అనే నిశ్చయంతో ఉంది కాబట్టే అతణ్ణి కట్టివేసింది కాని, ఆ చిన్నికృష్ణునిపొట్టలో సకలలోకాలూ ఉన్నాయని తెలిసినట్లయితే ఎందుకు కట్టివేస్తుంది?

భగవంతుడైన విష్ణువు నిత్యానపాయినిగా తననే అంటిపెట్టుకొని ఉన్న లక్ష్మీదేవి కౌగిలిలో చిక్కడు. యోగిగణములపాల కలడందురన్నట్లుగా బ్రహ్మమానసపుత్రులు పరమపవిత్రులు అయిన సనకాదియోగీశ్వరుల హృదయపద్మాల్లోనూ చిక్కడు. వేదపురుషుడంటున్నా ఆ వేదా లనేతీవలలోనూ చిక్కడు. అటువంటి ఆ సర్వేశ్వరుడు లీలగా తన తల్లిచేతికి చిక్కి రోటికి బంధింపబడ్డాడు.

యశోద వెంటనే తన ప్రియపుత్రుడైన శ్రీకృష్ణుణ్ణి రోలుకు కడదామన్న నిర్ణయంతో అతనిపొట్టకు ఒకతాడు తెచ్చి చుట్టగా అది రెండంగుళాలు తక్కువయింది. మరో తాడును చేర్చి చుట్టినా, అదీ రెండంగుళాలు తక్కువ కావడంతో, ఇంకో తాడును తెచ్చి దానితో చేర్చగా, అదికూడా రెండంగుళాలు తక్కువే అయింది. బాలుని కడుపు ఈ విధంగా--

యశోద ఇంట్లో వున్న తాళ్ళనన్నిటినీ కలిపి కృష్ణుని బొజ్జచుట్టూ చుట్టి పెట్టినా చాలలేదు. ఎల్లలోకాలనూ తన కడుపులో ఉంచుకున్న ఆ పరమాత్ముని పొట్టను కట్టడానికి సాధ్యమవుతుందా?

అలా ఎన్ని తాళ్ళు చేర్చినా బాలకృష్ణుని కడుపు చుట్టి రావడానికి చాలకపోవడంతో యశోద, దీన్నంతటినీ చూస్తున్న గోపకాంతలు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. తరువాత

కొడుకు కనుక శిక్షించి బాగుచేయాలనే ప్రేమతో ప్రయత్నిస్తోంది - యశోద. ఆమె పడుతున్న శ్రమవల్ల ఒళ్ళంతా చెమట పట్టింది. పైట జారిపోయింది. కొప్పులో తురుముకున్న పూలు జలజల నేలమీద రాలిపోతున్నాయి. కట్ట శక్యం కాని తనను కట్టే ప్రయత్నంతో చింతిస్తున్న తల్లి యశోదమ్మను చూసి, పాపం కన్నయ్య కొంత జాలి చూపించి

రాజా! భగవంతుడు భవబంధాలను పోగొట్టేవాడు. అట్టివాణ్ణి బంధించే ప్రయత్నం శ్రమతో చేస్తున్న తల్లికష్టాన్ని గమనించి, తన ఆప్తులకు తాను బంధువు కాబట్టి, తల్లి కాబట్టి, తల్లి కట్టిన ఆ బంధానికి కట్టుబడ్డాడు.

విష్ణుమూర్తికి శివుడు స్నేహితుడైనా ఆ శివుడుకానీ, నిత్యానపాయినియై దేహన్నే అంటి పెట్టుకుని వక్షఃస్థలంపై అధివసించి ఉండే శ్రీమహాలక్ష్మికానీ, తన నాభికమలంనుండి పుట్టిన కుమారునిగా సంతోషించే ఆ బ్రహ్మకానీ, నందుని ఇల్లాలైన యశోదలా పరమేశ్వరుని దయకు పాత్రులు కాలేదు.

సర్వేశ్వరుడు తన భక్తులకు ఆధీనుడైనట్లు శ్రుతి, స్మృతి పురాణాది విజ్ఞానం కలవారిచేగానీ, మునీశ్వరులచే గానీ, దానగుణముండే దాతలైన ప్రసిద్ధి చెందినవారిచే గానీ, యమనియమాది అష్టాంగయోగమార్గాన్ననుసరించి ఉండేవారిచే గానీ పట్టుబడతాడా? పడడు.

అలా కృష్ణుని పొట్టకూ, రోలుకూ కలిపి కట్టిన తరువాత యశోద ఇంట్లో చేయవలసిన పనులలో మునిగిపోయింది. పూర్వం నారదుడు ఇచ్చిన శాపంవల్ల రెండుమద్దిచెట్లుగా నిలిచిపోయిన యక్షులైన నలకూబర మణిగ్రీవులను చూచి, ఆ చెట్ల సమీపానికి కృష్ణుడు తనకు కట్టబడిన రోటిని లాగుకుంటూ వెళ్లాడు - అని శుకమహర్షి చెప్పగా విని, పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

నారదుడు శపించాడన్నారు, నారదుడు ఎందుకు శపించాడు! ఆ నలకూబరమణిగ్రీవులిద్దరూ మద్దిచెట్లుగా రాపొందాల్సిన కారణం ఏమిటి? పరమయోగులకును పూజ్యుడవైన ఓ శుకయోగీంద్రా! నాకు ఈ విషయాన్ని తెలియజేస్తే వింటాను అని అడిగాడు - పరీక్షిన్మహారాజు.

పరీక్షిత్తుతో శుకమహర్షి ఇలా చెపుతున్నాడు. పూర్వం ఒకనాడు కుబేరుని కుమారులైన నలకూబరమణిగ్రీవులనే వారు శివునిసేవకులై సేవిస్తూ ఆ గర్వంతో కైలాసపర్వతంపై ఉన్న ఒక పూలతోటలో గానంచేసే గంధర్వకాంతలతో కలిసి, ఆడేనుగులతో కలిసిన మగఏనుగులవలె చక్కని ఆకాశగంగాతరంగాలలో క్రీడిస్తూ ఉండగా, నారదమహర్షి అక్కడకు వచ్చాడు. అప్పుడు ఆ కాంతలు గబగబా తమ తమ వస్త్రాలను ధరించారు. కానీ మద్యపానంవల్ల కలిగిన మత్తున్న వారు కాబట్టి ఆ ఇద్దరూమాత్రం దిగంబరులుగానే కనిపించారు. నారదమహర్షి వారిద్దరినీ శపించాలనుకొని ఓ ప్రసిద్ధమైన గీతాన్ని గానంచేశాడు. ఆ గీతం విను.

లోకంలో ధనవంతుడైనవాడు ఎదుటివారిని ఏ మాత్రం గుర్తించడు, గౌరవించడు. తన దేహం, తన కుటుంబం అంటూ అవే శాశ్వతమనుకుని, ఎదుటివారిని బాధిస్తాడు. పేదవాడైతే ఎండిన, నీరసించిన శరీరంతో కృశిస్తూ అయినా సరే ఎవరినీ హింసించకుండా ఇతరులందరూ తనతో సమానులే అనే భావంతో చూస్తాడు. కనుక ధన మదాంధులైనవారికి దారిద్య్రమే చక్కని అంజనం అవుతుంది.

పైవిధంగా సంపన్నునికి, పేదవానికీ గల భేదాన్ని తెలిపే పాటను పాడిన తరువాత నారదుడు తన మనస్సులో

ఈ నలకూబరమణిగ్రీవులిద్దరూ ధనపతియైన కుబేరునికొడుకులమనే గర్వంతో, ప్రేయసులతో గూడి స్వప్నంలో సైతం ఎవరినీ లక్ష్యపెట్టడం లేదు. కాబట్టి వీరికేర్పడిన ఈ మదాన్ని పోగొట్టి, ఉత్తములగువారితో కలిసేటట్లు చేయడమే యుక్తమనుకున్నాడు - నారదుడు.

(లోకంలో సాధారణంగా 'మత్తు'కలిగించే వాటిలో ధనం ప్రధానం. అందుకే ధనమదాంధులంటారు.

యౌవనం ధనసంపత్తిః ప్రభుత్వం అవివేకితా ।
ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌? 
 అన్నది హితోపదేశం

యౌవనం, ధనం, అధికారం, అవివేకం ఒక్కొక్కటే అనర్థాన్ని కల్గిస్తాయి. ఇక నాల్లూ ఒకేచోట ఉంటే చెప్పేదేముంది? సర్వనాశనం తప్పదు.)

విశేషజ్ఞాని అయిన నారదమహర్షి పైన చెప్పిన విధంగా ఆలోచించినవాడై నలకూబరమణిగ్రీవులతో 'మీరిద్దరూ స్త్రీల సంగమం అనే మత్తుచేత ఏమీ కానలేని గుడ్దివారుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు భూలోకంలో మద్దిచెట్ల రూపం పొంది, దేవతల కాలమానంలో ఒక వంద సంవత్సరాలు అలా వుండి, అనంతరం శ్రీకృష్ణపరమాత్మ పాదస్పర్శతో శాపవిమోచనం పొంది, దుర్విషయాలనుండి దూరమై శ్రీమన్నారాయణుని భక్తులుగా, చక్కని స్వభావరూపసంపదకలవారై తిరిగి దేవలోకనివాసులవుతారు'.

వారిద్దరినీ శపించి, శాపావసానవిషయంకూడా చెప్పి, నారదమహర్షి నారాయణాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ నలకూబరమణిగ్రీవులిద్దరూ రెండుమద్దిచెట్లుగా మారారు. భగవద్భక్తులలో శ్రేష్ఠతముడైన నారదుడన్న మాటలను వ్యర్థమైనవిగా భావించకుండా, వాటినెంతో ఆదరించి

చిన్నికృష్ణుడు మద్దిచెట్లను కూల్చుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Friday, April 3, 2026

The story of Yashodamma catching and punishing Balakrishna for breaking butter pots - యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

యశోద శ్రీకృష్ణునిపై పాటలు పాడుతూ, పెరుగును చిలకడం ప్రారంభించింది. ఆమె గాన మాధుర్యానికి చెట్లు చిగురిస్తున్నాయి. పద్నినీజాతి స్త్రీ అయిన ఆమెఅరచేతులు ఎర్రతామరలవలె వున్నాయి. ఆ ఎర్రనికాంతులు కవ్వం తాడును పగడపు తీగలా చేస్తున్నాయి. తాడును కుడిచేత్తో ఎడమచేతో క్రమంలో లాగుతూవుంటే ఆమె స్తనాలు విడివడి, ఒకదానితో ఒకటి ఒరుసుకుంటున్నాయి. అలా చేయడంతో ఆమె ఎదపై, స్తనాలపైనున్న పై కొంగు తొలగిపోవడంతో మెడలోనున్న హారాలన్నీ చిక్కుపడి బయటపడ్డాయి. చిలకడం అనే శ్రమవల్ల చిరుచెమట బిందువులతో ఒప్పే ఆమెముఖం మంచు బిందువులు చిందిన తామరపూవుకన్నా మనోహరంగా ఉంది. సన్ననినడుము కదలాడగా, గాజుల గలగలలతో, కొప్పువదులు కాగా, చెవిఆభరణాల కాంతులు ఒప్పగా, పాడుతూ యశోద పెరుగు చిలుకుతోంది.

అలా యశోద పెరుగు చిలుకుతూ వుండగా, బాలకృష్ణుడు తిరుగుతూ, లేచిపడుతూ, చిన్నగా మూలుగుతూ కోపంతో నిందిస్తూ, అల్లరి చేస్తూ యశోదతో 'అమ్మా' రా! పాలివ్వమని పిల్లిగంతులు వేస్తూ పెరుగుతోవున్న కుండ దగ్గరకు వచ్చి కవ్వాన్ని పట్టుకున్నాడు.

అలా వచ్చిన బాలకృష్ణుణ్ణి కమలాలవంటి కన్నులుగల యశోద దగ్గరగా తీసుకుంది. తొడపై కూర్చోపెట్టుకుంది. పిల్లజుట్టును వ్రేళ్ళతో దువ్వుతూ స్తన్యాన్ని అందించగా ఆ బాలుడు తన మూతితో స్తనంపై పొడుస్తూ అమ్మపాలు తాగాడు.

అలా తన ఒళ్ళో కూర్చుని పాలు పూర్తిగా తాగని కృష్ణుణ్ణి యశోద ఓ పీటపై కూర్చోబెట్టి, పొయ్యిపై పాలు పొంగుతూవుంటే ఆ పాలను దింపడానికి వెళ్ళింది. దాంతో చిన్నికృష్ణుడు తనను పూర్తిగా పాలు తాగనివ్వలేదని ఎక్కువ కోపంతో ఒక పదునుగలరాయితో ఆ పెరుగుకుండను పగులగొట్టాడు. అంతేకాదు, ధైర్యంతో ఆ కుండలోని వెన్న తిన్నాడు. తాను చేసిన దానికి అమ్మ ఎక్కడ కొడుతుందో అని ముందుగానే లేని కన్నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తున్నట్లు ఉన్నాడు.

తరువాత యశోద పొంగే పాలను దింపి వచ్చేసరికి పెరుగుకుండ పగిలిపోయి, కుండపెంకులు కనబడ్డాయి. అలా అల్లరి చిన్ని కృష్ణుడు కోపంతో కుండ పగులగొట్టి వెన్న తిన్నాడనుకొన్నదై నవ్వుతూ చూస్తే అక్కడ కృష్ణుడు కనబడలేదు. దాంతో అతడికోసం అలా వెళ్ళి వెళ్ళి

యశోద బాలకృష్ణుణ్ణి వెదుకుతూ వెళ్తే మరో ఇంట్లో రోలును తిరగవేసి ఎక్కి ఉట్టిపైనున్న వెన్నకుండను అందుకుని, ఒక పక్కభయం నటిస్తూ ఆ వెన్నను ఒక కోతికి తినిపిస్తున్న చిన్నికృష్ణుణ్ణి చూచింది.

కృష్ణుని అలా చూచి ఓ నా కుమారా! అంటూ యశోద బెత్తం చేతపట్టుకొని 'నీ వింతవరకు ఎవరిచేతికీ చిక్కలేదు. ఏ రకమైన శిక్షను పొందలేదు ఎక్కడా ఎవరిచేతా అడ్డగింపబడలేదు. భయాన్ని గాని భ్రాంతిని గాని పొందలేదు. ఇలా అనుకొని నీవు నన్ను లక్ష్యపెట్టడంలేదు. కానీ ఈ రోజుమాత్రం అలా కుదరదు'.

అలా చిన్ని కృష్ణుణ్ణి బెత్తం పట్టుకుని భయపెడుతూ, కొడుకుప్రవర్తననుగూర్చి ఆలోచిస్తూ, సన్నని నడుము గల ఆ యశోద తన మనస్సులో

ఆ అల్లరి కృష్ణుణ్ణి చూచి, ఇలా పరిపరివిధాల భావిస్తోంది. ఇతడు చిన్న పిల్లవాడు అనుకుందునా పెద్దవారెవరూ చేయలేని పని వీడిది. పోనీ భయమంటే తెలిసేలా భయ పెడదామా అంటే లేక లేక పుట్టిన ఒక్క బిడ్డడే వీడు. ఇంకొకడు లేడు. భయపెట్టి మంచి బుద్ది కలిగేలా నాలుగు మాటలు చెబుదామా అంటే తనంత తానే బుద్ధి తప్పకుండా ఉన్నట్లుంటాడు. ఏమీ తెలియనివానిలా ఇంట్లోనే వుంటాడా అంటే తాను ప్రవేశించని చోటేలేదు. తనను గురించి ఎవరైనా తెలుసుకున్నారని పారిపోవాలనే ఆలోచనా లేదు. ఏ రకమైన భయం ఎరుగడు. అలాగని ఊరకనే కూర్చోడు. అందరితో ఎత్తిపొడుపు మాటలు, వంకరమాటలు మాట్లాడతాడు. వీణ్ణి పట్టుకొని ఎలా శిక్షించాలో అర్థం కావడంలేదు.

పైన చెప్పిన విధంగా, అన్ని విధాలా ఆలోచించి

పిల్లలను ముద్దు చేయడంవల్ల ఎన్నో అనర్థాలు ఏర్పడతాయి. వాళ్ళను శిక్షించేలా కొట్టడంవంటివి చేస్తేనే వాళ్ళకు క్రమంగా మంచి జరుగుతుంది. కాబట్టి ఆలోచించి చూస్తే పిల్లల్ని కొట్టడంవంటిదే మేలు చేస్తుంది. అదే వాళ్లకు హితమైన పద్దతి.

ఎప్పుడైతే యశోద బాలుణ్ణి దండించడమే మంచిదని నిశ్చయించుకొని తన చేతిలోవున్న బెత్తాన్ని ఒక్కసారి విదిల్చి, ఓరి బాలుడా! ఆగాగు, అక్కడే వుండు అంటూ భగ్గుమన్న కోపంతో బెదిరిస్తూ బాలుణ్ణి సమీపించేసరికి, కృష్ణుడు అంతవరకూ తాను చేస్తున్న చేష్టలన్నీ వీడి, భయపడ్డవాడిలా రోలుమీదినుండి కిందికురికి

ఎప్పుడైతే యశోద బాలకృష్ణా! ఆగు ఆగుమంటూ బెత్తం ఝళిపించి వచ్చిందో వెంటనే చిన్నికృష్ణుడు కాలిగజ్జెలు ఘల్లు ఘల్లుమంటుండగా, అక్కడ చిందులేయడం మాని, చుట్టూ ఉన్న గోపకాంతలు నవ్వుతూ ఉంటే, తల్లి యశోద అతడి వెంటే

అలా కృష్ణుడు పరుగెడుతూ ఉండగా యశోద అతని వెంట వెళ్తూవుంటే

పరిగెడుతున్న కృష్ణుణ్ణి యశోద వెంబడిస్తూ ముంగిలిలో తాను తిరుగుతోంది. ఆ సమయంలో పాలిండ్ల బరువుచేత అలసి, సంకోచించిన సన్నని నడుము కదలాడుతున్నది. పరుగెత్తిన అలసటవల్ల చెమటపట్టింది. కొప్పు కదలాడుతూవుంది, పైటజారిపోతున్నది. ఎంతో గొప్పవారైన యోగీశ్వరులమనస్సులుకూడా వెంబడించి పట్టుకోలేని ఆ లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుణ్ణి పట్టుకునే ప్రయత్నంతో యశోద తిరుగాడుతోంది. ఏమి అదృష్టం!!

ఈ రీతిగా కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వెంట వెళ్ళి

యశోద కృష్ణుణ్ణి వెంబడిస్తూవుంటే తప్పించుకుంటున్న కృష్ణునికి అక్కడి స్తంభాదులు అడ్డుగా ఉంటే, వాటిమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ పట్టుకోవడానికి వీలివ్వడంలేదు. ఈ ఒక్క తప్పు క్షమించమ్మా! ఇంకెప్పుడూ దొంగతనం చేయనంటూ తనను పట్టుకోకుండానే ఏడుపు ప్రారంభించాడు. కళ్ళకు పెట్టిన కాటుక ముఖమంతా అయ్యేటట్లు కళ్ళు నలుపుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అమ్మ ఎటు వైపునుండి వచ్చి పట్టుకుంటుందో అని పదే పదే తప్పించుకుంటూ, దాగుతూ, ఓరగంట చూస్తున్నాడు. చివరకు యశోద అతనితో కూడా పరుగెత్తి పట్టుకొని, భయపెడుతూ మా చిన్న వెన్న దొంగ దొరికిపోయాడంటూ, కోపంతో కొట్టడానికి చేతులురాక, ఆమె బాలకృష్ణుణ్ణి కట్టేద్దామని భావించి

కృష్ణుణ్ణి పరిహాసం చేస్తూ యశోద ఎత్తిపొడుపుగా ఆడుతున్నమాటలు. ఎవరండీ ఈ పెద్దమనిషి? శ్రీకృష్ణమూర్తి గారేనా? పాపం వీరికి వెన్నంటే తెలియదట. ఎప్పుడూ చూడలేదట. అంతేకాదు, దొంగతనం అనేది కొంచెమైనా తెలియని వారట! లోకంలో ఇంతటి నియమవ్రతులు ఎక్కడైనా ఉన్నారా?

ఓ నా చిన్ని కృష్ణా! పట్టుకుందామన్నా పట్టుటకు దొరకని నిన్ను, పట్టుకుని తీరుతాను అని పట్టుదలగా ప్రయత్నిస్తే నిన్ను పట్టుకోవడం అదేమైనా పెద్ద ఘనకార్యమా! కాదు. నీవు ఎవరికినీ పట్టుబడవు అంటారు. అట్టి నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇంకెవరికీ సాధ్యం కాదు.

యశోద తనకు పట్టుబడిన చిన్ని కృష్ణునితో, ఓ నా బిడ్డా! నీకు ఒక చోటంటూలేదు! ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు! ఒక చోటంటూ, ఎక్కడా మంచి గుణాలు కలిగి ఉండవు కదా! నీకు నియమం, పద్ధతి ఎక్కడుంది? నీ సంగతి గనుక మరచిపోతే ఎలా పడితే అలా అనేకమార్గాలలో తిరుగుతూ పోతావు. (విష్ణువే కృష్ణుడు కనుక అన్ని మార్గాలలో, అంతటా తానే ఉంటాడు)

ఓ నా కృష్ణా! నీళ్ళంటే భయంలేకుండా అందులో దిగుతావు. కొండనైనా, బండనైనా ఎత్తడానికి చూస్తావు. మట్టితో ఆడుకుంటూ, ఒంటిపై పోసుకుంటావు. పెద్ద పెద్ద స్తంభాలను కదిపేలా ప్రయత్నిస్తావు. ఇతరులనుండి స్వల్పమైన వస్తువును యాచిస్తావు. రాచవారిలా వేటంటూ చేసి మాటపడతావు. ప్రవహించే నీటికి అడ్డుకట్ట వేద్దామనుకుంటావు, నాగలిని రోకలిలాంటిదాన్ని పట్టుకొని సేద్యం చేద్దామనుకుంటావు. కట్టుకోడానికి వస్త్రాన్నడుగకుండా దిగంబరంగా తిరుగుతావు. ఇంకా ఇట్టి నేర్పరితనంతో కూడిన చేష్టలు ఎన్ని చేస్తావో? నిన్ను నేను లొంగదీసుకోవడంలో అసమర్థురాలనని గుర్తించావేమో! ఇలా కిందా మీదా తెలియక ప్రవర్తిస్తున్నావు.

ఉలూఖలబంధన యమళార్జున భంజనాద్యభివర్ణనము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Yashodana Previous birth story - యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

ఓ పరీక్షిన్మహారాజా! అష్టవసువులలో ముఖ్యుడైనవాడు ద్రోణుడు, అతని భార్య ధర. బ్రహ్మ వారిద్దరినీ భూలోకంలో జన్మించండి అంటే వారు బ్రహ్మతో మాకు భూలోకంలో విష్ణుభక్తితో శ్రీహరిని సేవించేలా అనుగ్రహిస్తేనే మేము భూలోకంలో పుడతాం అనగానే అలాగే అవుతుంది అని బ్రహ్మ చెప్పగా వారిద్దరూ నందయశోదలుగా జన్మించారు. విష్ణుమూర్తి బ్రహ్మామాట ప్రకారం గోకులంలో యశోదానందులను తల్లిదండ్రులుగా గౌరవిస్తూవుంటే, వారిద్దరూ ఎంతో ఆనందంతో ఒప్పారు - అని శుకమహర్షి యశోదానందుల పూర్వజన్మవృత్తాంతాన్ని పరీక్షిత్తుకు తెలియజేశాడు.

కృష్ణునినోటిలో విశ్వాన్ని చూచి ఆశ్చర్యపడి, కృష్ణుని మాయచే మరల సామాన్యయశోద రూపంలోనికి వచ్చిన యశోద ఒకనాడు తనఇంటివద్దగల యువతులందరూ వాళ్లకు నిర్దేశించిన పనులకు వెళ్ళిపోగా, వెంటనే పెరుగు చిలకాలనే భావంతో ఒక పెరుగు కుండను కుదురుగా వుంచి, అందులో మెరిసిపోయే మీగడ పెరుగును పోసి, పెరుగు చిలికేలా కవ్వాన్ని ఆ స్తంభానికి తాడుతో బిగించింది.

యశోద దధిభాండ వికలనాదులు సేసిన కృష్ణుని బట్టుకొనుట

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Mridbhakshan Vishwarupa Demonstration Description - మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనాద్యభివర్ణనము

గోపకాంతలు తాను చేసిన పనులన్నీ తల్లితో చెప్పేసరికి భయపడిన చిన్ని కృష్ణుడు ఏమీ ఎరుగనట్లు ఎంతో శాంతమూర్తిలా సత్ప్రవర్తనతో సాధువులా, అమాయకునిలా, తనపై చెప్పినవన్నీ అసత్యాలన్నట్లు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడైనవాడిలా, మొహం పెట్టి, కేవలం తల్లిని తప్ప మరేవిధమైన విషయం తెలియనివాడిలా అమ్మవక్షఃస్థలం పై తలపెట్టుకొని ఆడుకుంటూ ఉన్నాడు.

ఒక రోజు బలరాముడు, మరికొంతమంది గోపబాలురు కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెప్పగా ఆమె కృష్ణుని చెయ్యిపట్టుకొని ఇలా అంటోంది.

యశోద కృష్ణుణ్ణి చేరదీసి, "నాన్నా! మన్నెందుకురా తింటావు? నే చెప్పినవన్నీ ఎందుకు పాటించవు? మీ అన్నయ్య, మీ చెలికాండ్రు వచ్చి నువ్వు మన్ను తిన్నావని చెప్పారు. మన్నెందుకురా తినడం! తినడానికి మనింట వేరే వస్తువులు లేవా?" అంటూ అడిగింది.

ఎంతో అమాయకంగా ఓ సామాన్యస్త్రీలా, మన్నెందుకు తిన్నావని అడిగిన తల్లి అయిన యశోదతో నేర్పరితనంలో ఎంతో దిట్ట అయిన కృష్ణుడు ఇలా అంటున్నాడు.

అమ్మా! మన్ను తినడానికి నేనేమైనా పసివాడినా? మరి నేనేమైనా ఆకలితో వున్నానా? లేదా తెలివిలేనివాడనా? అన్నయ్య, ఈ గోపబాలురు నీతో చెప్పిన ఈ మాటలను నమ్మకమ్మా! నన్ను నీవు కొట్టాలని వాళ్లలా చెప్పారు. ఒకవేళనా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా! అప్పుడు నేననింది తప్పైతే తప్పకుండా శిక్షించవచ్చు.

పయి రీతిని అమ్మతో అని, ఆమెకు తనపై ప్రేమ పుట్టేలా మెల్లగా తల్లిని తానన్నమాట నిజమని నమ్మేలా చేసి, సామాన్య మనిషిలా కాకుండా, లోక కల్యాణార్థం విలాసంగా, చిన్ని కృష్ణుడుగా పుట్టిన ఆ కృష్ణపరమాత్మ తల్లికి తన నోరు తెరచి ముఖాన్ని చూపగానే

తల్లితో తననోరు చూడమని చెప్పగా చూసిన యశోద ఆ బాలకృష్ణుని నోట్లో కొండలు, అడవులు, భూగోళం, అగ్ని సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు ఇలా అన్నింటికి ఆధారమైన ఒక బరణి పెట్టెలావుండే బ్రహ్మాండ స్పరూపాన్నంతా దర్శించింది.

చిన్నికృష్ణుని నోట్లో బ్రహ్మాండాన్ని చూచిన యశోద పరిపరివిధాల ఆలోచనలకు గురి అయింది. నేనేమైనా కలగన్నానా? లేదా ఇది విష్ణమాయా? మరి ఇందులో వేరే సంకల్పాలవల్ల ఏర్పడిన విషయమైందేదైనా ఉందా? నిజమేనా? ఇదీ అని ఊహించలేక పోతున్నాను. అసలు నేను యశోదనేనా? ఇది మేమున్న ప్రదేశంకాక వేరే చోటా? ఈ పసిబాలుడెంతటివాడు? ఇతనిముఖంలో కన్పించి, ప్రకాశిస్తున్న బ్రహ్మాండం ఉండడానికి కారణం ఏమో ఆలోచిస్తూవుంటే ఆశ్చర్యంగా ఉంది.

సామాన్యమైన గోపబాలుడుగా లీలారూపంలో ఉండే ఇతనిముఖంలో సమస్త చరాచర ప్రపంచం ఎలా ఇమిడి ఉంటుంది? కాబట్టి ఇతడు పసివాడులా కనబడుతున్నాడు కానీ విశాల విశ్వాన్నంతటినీ తనలో ఇముడ్చుకున్న పురాణ పురుషుడైన విష్ణుమూర్తి అయి ఉంటాడు. ఇదే వాస్తవం!

ఏ మహిమగలవానిచే ఈ విశాలవిశ్వం కన్నించి, నా బుద్ధి భ్రమించిందో అట్టి సకల లోకాధారుడైన, మహా మహిమాన్వితుడైన, విశ్వవ్యాపకుడైన, ఆ విష్ణుమూర్తినే నా బాధలన్నీ పోవడానికి ఆశ్రయిస్తాను, సేవిస్తాను.

నేనూ, నాతో పాటు నా పెనిమిటి, ఆవులు, గొల్లపల్లె, గోపాలకులు అందరూ ఈ చిన్న బాలుని అందమైన ముఖాన్ని చూస్తూ, అసలు విషయం తెలుసుకోలేక మోహంలో పడ్డాము కానీ మాకు ఇతడే ప్రభువు!

అలా యశోద యథార్థం గుర్తించి, చిన్నికృష్ణుణ్ణి జగన్నాటక సూత్రధారియెన శ్రీ మహావిష్ణువుగా ఎప్పుడైతే భావించిందో, అందులోంచి ఆమెను మళ్లీ సామాన్యలోకంలోకి మళ్ళించడానికి మళ్లీ వైష్ణవమాయను ప్రసరింపజేయగా

పరీక్షిన్మహారాజా! యశోద జడత్వం పొంది, జ్ఞానం కోల్పోయి విశ్వాధారుడు అతడని చెప్పక, ఆ కృష్ణుణ్ణి తన చిన్న కొడుకే అంటూ తొడపై కూర్చోపెట్టుకొని, ఎంతో కుతూహలంతో ముద్దులాడింది.

అని చెప్పగా పరీక్షిత్తు ఇలా అన్నాడు.

నిత్యానందాన్ని అనుభవించే శుకమహర్షీ! విశ్వాధారుడైన ఈ విష్ణుమూర్తికి తన చనుబాలిచ్చే తల్లిగా యశోద ఎలాంటి పుణ్యవ్రతాలు ఆచరించిందో! అలాగే ఆ కృష్ణుణ్ణి పోషించి పెద్దజేసేతండ్రిగా ఈ నందుడు ఏ తపస్సు చేశాడో!

ఓ మహర్షీ! లోకంలో ఆ విష్ణుభక్తితో శ్రీహరిపై కవులు కావ్యరచనలు చేసి, మోక్షలక్ష్మీ కటాక్షానికి పాత్రులవుతారట! మరి అట్టి శ్రీహరిని పోషించే తల్లిదండ్రులుగావున్న ఈ యశోదానందులకు ఇంకెంతటి మహోన్నత స్థితి కలుగుతుందో కదా?

యశోదానందుల పూర్వజనృవృత్తాంతము

శ్రీ మహా భాగవతము

శ్రీ మహా భాగవతము ద్వితీయస్కంధము

శ్రీ మహా భాగవతము తృతీయస్కంధము

శ్రీ మహా భాగవతము చతుర్ధస్కంధము

శ్రీ మహా భాగవతము పంచమస్కంధము

శ్రీ మహా భాగవతము షష్టస్కంధము

శ్రీ మహా భాగవతము సప్తమస్కంధము

శ్రీ మహా భాగవతము అష్టమస్కంధము

శ్రీ మహా భాగవతము నవమస్కంధము

శ్రీ మహాభాగవతము దశమస్కంధము - పూర్వభాగము

పంచాంగం

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -  పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న “అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన ద...