ఒకనాడు బలరామకృష్ణులకు వనభోజనంలో చద్ది బంతిగా కూడి తిందామన్న ఆలోచన కలిగింది. దాంతో పొద్దున్నే లేచి వెంటనే తమ ఇంట్లో వున్న దూడలన్నింటిని తోలుకొని వెళ్ళి, పెద్ద కొమ్ముబూరాలను ఊదారు. అది విన్న గోపబాలురందకూ లేచి, చల్దికావళ్ళు భుజాలపై పెట్టుకొని, మంచి రుచిగా వుండే కజ్జకాయల్లాంటి మధురపదార్థాలను మూటలు కట్టుకొని, కాళ్ళకు చెప్పులతో, చేతిలో బెత్తాలతో ఎక్కువగా వుండే తమ దూడల గుంపులను లేపి, కూడదీసి తోలుకుంటూ అడవిలో ప్రవేశించారు. బంగారంతో, మణులతో, గురిగింజలు మొదలైన వస్తువులతో తయారైన సొమ్ములు వాళ్ళకున్నా, అడవిలోని పళ్ళు, పూలు, మొగ్గలు, చివుళ్లు తీగలతో అలంకారాలు చేసుకొని ధరించారు. ఇక అక్కడ నుండి వాళ్ళ ఆటపాటలు గెంతులు అన్నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. పెద్దపెద్ద కొమ్ముబూరలను పూరిస్తూ, పిల్లనగ్రోవులను ఊదుతూ, తుమ్మెదల్లా ఝం అంటూ పాడుతూ, నెమళ్ళతో కలసి నృత్యం చేస్తూ కోకిలల్లా కూస్తూ, చిలకల్లా అరుస్తూ, పైన పక్షులెగురుతూ ఉంటే వాటి నీడనుబట్టి కింద పరిగెడుతూ, చక్కనైన సెలయేళ్ళను దాటుకుంటూ, హంసలతో కలిసి వాటితో నడుస్తూ, కొంగలు ఒంటికాలుపై నిలుచున్నట్లు వీళ్ళూ కొంగల్లా నిలుస్తూ, నీటిపక్షులను అదలిస్తూ, ఏటినీట్లో మునుగుతూ, చెట్లకు అల్లుకునివున్న తీగెలను ఉయ్యాల్లా చేసికొని ఊగుతూ, గోతుల్లో దాక్కుంటూ, ఒక్కొసారి దూరంగా వెళ్తూ, చెట్లపైనున్న కోతులను చూచి, వాటివలె చెట్లెక్కుతూ, మంచిపండ్లు తింటూ, రసాన్ని ఆస్వాదించి పరవశిస్తూ, ఆకాశంపైకి ఎగురుతూ, తమ తమ నీడల ఆకారాలను చూచి నవ్వుకుంటూ, దెబ్బలాటలకు దిగుతూ, చెలరేగుతూ అంతటా తిరుగుతూ, నేలపైవాలుతూ, అలసిపోతూ నానావిధాల వికారాలు చేస్తూ తిరుగుతున్నారు. ఇంకనూ
ఓ రాజా! ఇంకా ఆ గొల్లబాలురు ఎలా ఆటలాడుతూ ఆనందిస్తున్నారంటే - ఒకడు తెచ్చుకున్న చల్దిమూటను ఇంకొకడు దాచి వేస్తాడు. మరొక డది చూచి, దాన్ని వేరొకనికి అందిస్తే వాడు దాన్ని దాచి ఉంచుతాడు. అప్పుడు ఇంకో గొల్లడు దాన్ని తెచ్చి అసలువానికి ఇస్తాడు.
ఆ గొల్ల బాలురలో ఒకడు ఏదో పరధ్యానంలో ముందుకు వెళ్తూవుంటే, ఇంకొకడు వెనకనుంచి వచ్చి పెద్దగా అరచి భయపడేలా చేస్తాడు. మరొకడు, ఒక్కసారిగా వచ్చి వాణ్ణి తట్టి, పక్కవాడు చూచి నవ్వుతూ ఉంటే వాడిరెండు కళ్ళూ మూస్తాడు.
ఒకనిచేతిలో ఉండే తీపి పదార్థాన్ని ఇంకొకడు వాడికి కోపం వచ్చేలా చేత్తో తీసికొని, పైకి వేయగా దాన్ని ఇంకొకడు తీసుకొని, దొరక్కుండా దూడల గుంపులో ఇటూ అటూ దాక్కుంటూ తిరుగుతాడు.
ఆటల్లో ఇదోరకం. కృష్ణుడు ముందుగా వెళ్తూంటే గోపబాలురు అతణ్ణి నేనే ముందు ముట్టుకుంటాను అంటూ వెళ్లారు. అలా వెళ్ళినవాళ్ళల్లో ఎవడైతే ముందుగా తాకలేక పోయాడో వాణ్ణి చూచి ముందుగా తాకినవాడు కావాలనే ఎగతాళిగా నవ్వుతాడు (ఇది ఇప్పటి కబడ్డీ ఆటలాంటిది).
ఇలా పైన చెప్పిన రీతిగా గోపబాలురందరూ పంక్తి భోజనాలకై అడవికి వెళ్ళి, ఎంతో సంతోషంగా ఆటలాడుతూ ఉన్నారు.
ఎంతో తపస్సు చేసి మహిమలు పొందిన యోగీశ్వరులైనా సరే ఎప్పుడూ ఏ పరమాత్మ పాదధూళిని కూడా కళ్ళారా చూడలేరో అటువంటి ఆ విష్ణుమూర్తిని కౌగిలించుకుంటూ, చేతులు పట్టుకుంటూ, తంతూ, గుద్దుతూ, నవ్వుతూ, మీదపడి, చేరి ఆడుతూ, ఆదరిస్తున్న ఈ గోపబాలుర అదృష్టం ఎంత గొప్పదో కదా!
బ్రహ్మవేత్తలకు, చక్రవర్తినుండిచతుర్ముఖ బ్రహ్మవరకు గల ఏ ఆనందం అయితే ఉందో, దాన్ని మించిన ఆనంద స్వరూపుడై, భక్త జనానికి ఆరాధ్యదేవుడై, అజ్ఞానులైన సామాన్యజనానికి బాలుడనిపించేలా కనిపించే, ఆ శ్రీకృష్ణునియొక్క కలయికను, స్నేహాన్ని ఈ గొల్లవారందరూ పొందారంటే, వీళ్ళవంటి పుణ్యాత్ములు మరెవరైనా ఉన్నారా!
పై విధంగా గోపాలురభాగ్యాన్ని భగవతత్త్వాన్ని శుకమహర్షి పరీక్షిన్మహారాజుతో చెప్పి ఇంకా ఇలా అంటున్నాడు.
No comments:
Post a Comment