Tuesday, August 4, 2026

devimahima - bruhadradhudi puurvajanma sruthi - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి

నారదా! ఇక్కడ నీకొక కథ చెప్పాలి విను. పూర్వం హిమాలయపర్యతాల్లో ఒక చక్రవాకపక్షి ఉండేది. అది ఆకాశమార్గాన ఆయాదేశాలపై ఎగురుతూ వచ్చి వచ్చి కాశీపట్టణం చేరుకుంది. ప్రారబ్ధం బాగుండి అన్నపూర్ణాదేవి మందిరం దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఏవో పడిఉన్న మెతుకుల్ని ఏరుకు తినే మిషతో తనకు తెలియకుండానే ఆ మందిరానికి ప్రదక్షిణ చేసింది. ఆ తరవాత అక్కడినుంచి ఎగిరి ఎటో వెళ్ళిపోయింది.

కాలాంతరాన మరణించింది. సరాసరి స్వర్గం చేరుకుంది. దివ్యరూపం దరించి రెండు కల్పాలపాటు దివ్యభోగాలు అనుభవించింది. భూలోకంలో క్షత్రియవంశాన మగబిడ్డగా పునర్జన్మ పొందింది. బృహద్రథుడు అనే పేరుతో ఆ మగబిడ్డ ఎదిగి యువకుడై పట్టాభిషక్తుడయ్యాడు. 

అతడికి త్రికాలజ్ఞత సహజంగానే సిద్దించింది. యజ్ఞయాగాదులు చేస్తూ సత్యవాదిగా జితేంద్రియుడుగా ధార్మికుడుగా ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. అతి దుర్లభమైన పూర్వజన్మస్మృతి అతడికి ఉన్న విషయం ఎలాగో ప్రజలకు తెలిసి బాగా ప్రచారంలోకి వచ్చింది. 

మునీశ్వరులకు తెలిసింది. వారు ఆశ్చర్యచకితులై దర్శనార్థం వచ్చారు. బృహద్రథుడు భక్తిశ్రద్ధలతో అతిథిమర్యాదలు జరిపాడు. కుశలప్రశ్నలు అయ్యాక మునీశ్వరులు తాము వచ్చిన పని ఎమిటో చెప్పారు.

మహారాజా! నీకు పూర్వజన్మస్మృతి ఉంది. త్రికాలజ్ఞత ఉంది. ఏ పుణ్యవిశేషంతో నీకు ఈ శక్తులు లభించాయి? తెలుసుకుందామని వచ్చాం. కాకపోతే, చెప్పదగినదే అయితే తెలియపరిచి మమ్మల్ని ఆనందింపజెయ్యి.

మునీంద్రులారా! ఇందులో రహస్యమేమీలేదు. అంతా అమ్మవారి దయ. పూర్వజన్మలో నేను ఒక చక్రవాకపక్షిని. అల్పజీవిని. కాశీలో అన్నపూర్ణ మందిరానికి ప్రదక్షిణం చేశాను. తెలిసి చేసింది కాదు. అయినా అమోఘఫలం దక్కింది. ఆ పుణ్యవిశేషం వల్ల స్వర్గసుఖాలు రెండు కల్పాలపాటు అనుభవించాను. ఈ జన్మలో మహారాజునూ సార్వభౌముడనూ అయ్యాను.

పూర్వజన్మ స్మృతితోపాటు భూత భవిష్యద్వర్తమానాలను తెలుసుకునే శక్తి అబ్బింది. జగదంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి ఎంత ఫలం దక్కుతుందో ఎవరూ చెప్పలేరు, ఊహించలేరు. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నాకు కళ్ళు చెమ్మగిల్లి ఆనందబాష్పాలు జాలువారతాయి. 

జగన్మాతను ఉపాసించనివారి జన్మలు వ్యర్థం. వారు తల్లిని మరిచిపోయిన కృతఘ్నులు. పాపాత్ములు. హరిహరోపాసనలు నిత్యవిధులు కావు. పరాదేవతోపాసన ఒక్కటే నిత్యమనీ సత్యమనీ శ్రుతి చెబుతోంది. మీవంటి జ్ఞానులకు నేను చెప్పేదేమిటి? భగవతి పాదాంభోజాలను నిరంతరం సేవించవలసిందే. ఇంతకన్నా ఈ జగత్తులో సేవించదగిన మరొక వస్తువు నిర్గుణంగానీ సగుణంగానీ ఏదీ లేదు.

బృహద్రథుడి సమాధానం మునిశ్వరుల సంశయాలను తీర్చింది. సంతృప్తులై ఆనందబాష్పాలు ఒత్తుకొంటూ తమతమ ఆశ్రమాలకు తిరిగివెళ్ళారు.

నారదా! ఇంతటి ప్రభావం కలది దేవీపూజ. దాని ఫలం ఎంత అని ఎవరైనా అడగగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరి జన్మ సఫలమో వారికి ఈ పూజపట్ల శ్రద్ధ కలుగుతుంది. ఎవరి జన్మ సంకరమో నిష్ఫలమో వారికి శ్రద్ధ కలగదు. శ్రద్ధ కలగడానికైనా నోచుకుని ఉండాలి.

మధ్యాహ్నసంధ్య




Worship of Mahadevi - మహాదేవీ సమర్చన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - మహాదేవీ సమర్చన

దేవిపూజావిధానం సమగ్రంగా మరొక్కసారి వినాలనుకుంటున్నాను చెప్పమని నారదుడు అడిగాడు. నారాయణమహర్షి ఆరంభించాడు. 

శ్రీమాతృపూజ భుక్తిముక్తిప్రదం. సమస్త ఆపదలనూ తొలగిస్తుంది. సకల భోగభాగ్యాలనూ కలిగిస్తుంది. నారదా! మౌనంగా ఆచమించి సంకల్పం చెప్పుకుని భూతశుద్ధ్యాదికమంతా నిర్వహించాలి. మాతృకాన్యాసపూర్వకంగా షడంగన్యాసం చెయ్యాలి. సామాన్యా ప్రదానాదికంతో శంఖస్థాపన చెయ్యాలి.

పూజాద్రవ్యాలను మంత్రోదకాలతో సంపప్రోక్షించాలి. గురువు అనుమతిపాంది పూజకు ఉపక్రమించాలి. పీఠపూజ చేసి దేవిని ధ్యానించాలి. ఆవాహన చేసి ఆసనాద్యుపచారాలు సమర్పించి పంచామృతరసాదులతో స్నానం చేయించాలి. 

పౌండ్రేక్షురసపూర్ణాలైన శతకుంభాలతో స్నానం చేయించినవాడికి పునర్జన్మ ఉండదు. వేదమంత్ర పారాయణంచేస్తూ చూతఫల రసంతోగానీ చెఱకు పానకంతోగానీ (ఇక్షురసం) అమ్మవారిని స్నానం చేయించినవారి ఇంటిలో సరస్వతీదేవి స్థిరంగా నివసిస్తుంది.

ద్రాక్షాఫలరస స్నానం చేయించినవారు రసబిందువులన్ని సంవత్సరాలు దేవీలోకంలో నివసిస్తారు. కర్పూర అగురు కాశ్మీర కస్తూరీ సమ్మిశ్రితమైన జలాలతో వేదమంత్రపూర్వకంగా జగదీశ్వరిని స్నానం చేయించినవారికి నూరు జన్మల పాపాలు భస్మీపటలమై పోతాయి. 

క్షీరాభిషేకం చేయిస్తే ఆ భక్తుడు కల్పాంతంవరకూ క్షీరసాగరమధ్యంలో అమ్మవారి సాన్నిధ్యాన్ని చూరగొంటాడు. పెరుగుతో తేనెతో నెయ్యితో పంచదార పానకంతో అభిషేకించినవారు ఆయా ద్రవ్యాలకూ ద్రవ్యప్రవాహాలకూ అధిపతులవుతారు.

భక్తితో సహస్ర కలశాభిషేకం చేస్తే ఇహపరలోక సుఖాలన్నీ ఆ భక్తుడివే. అటు పైని కాశ్మీర చందనం ఇచ్చి, కస్తూరి బొట్టు దిద్ది, సీమంతంలో సిందూరం సింగారించి, పాదాలకు లత్తుకను అలంకరించినవాడు ఇంద్రపదవిని ఆధిష్ఠిస్తాడు. రకరకాల పుష్పాలను ఈ పూజకు ఉపయోగించవచ్చు. పుష్పార్చన చేసినవాడు కైలాసం చేరుకుంటాడు.

బిల్వపత్రాలతో పూజచేస్తే అతడికి ఎప్పుడూ ఎక్కడా ఏ దుఃఖమూ ఉండదు. బిల్వపత్ర దళాలమీద రక్తచందనంతో మాయాబీజాక్షర త్రయాన్ని సుస్పష్టంగా సుందరంగా లిఖించాలి. ఆ బీజాక్షరాలతో కలిపి అమ్మవారి నామాన్ని చతుర్థ్యంతంగా పలికి నమః అంటూ (ఓం మహాదేవ్యై నమః. హ్రీం జగదీశ్వర్యై నమః - ఇత్యాదిగా) బిల్వపత్రాలను అమ్మవారి పాదాలచెంత ఉంచాలి. 

ఇలా బిల్వపత్రార్చన చేసినవారికి మనుత్వం లభిస్తుంది. లేతదళాలను కోసి తెచ్చి కోటి బిల్వార్చన చేసినవాడు బ్రహ్మాండాధిపతి అవుతాడు. కోటి కుందపుష్పార్చన చేస్తే ప్రాజాపత్యం దక్కుతుంది. కోటిసంఖ్యలో మల్లికా మాలతీపుష్పాలను సుంగంధ ద్రవ్యాలతో కలిపి అమ్మవారికి పూజచేస్తే బ్రహ్మత్వం, దశకోటి చేస్తే విష్ణుత్వం, శతకోటి చేస్తే సూత్రాత్మత్వం లభిస్తాయి. 

ఇప్పుడు ఆయా పదవుల్లో ఉన్నవారందరూ ఇలా అర్చించివవారే. జపా - బంధూక - దాడిమీ కుసుమాలుకూడా ఇలాగే అనంతపుణ్య ఫలాలను ఇస్తాయి. ఆయా ఋతువుల్లొ దొరికే పువ్వులతో సంవత్సరం పాడువువా అమ్మవారికి సహస్రనామార్చవ చేస్తే సర్వమహాపాతక - ఉప పాతకాలు అన్నీ నశించి ముక్తి లభిస్తుంది.

దేహాంతంలో శ్రీదేవీపదసన్నిధికి చేరుకుంటాడు. ఇది దేవతానాయకులకుకూడా దుర్లభమైన పదవి. కృష్ణాగురు కర్పూర చందన సిల్హిక ఆజ్య గుగ్గులు సమన్వితంగా ధూపంవేస్తే దేవి ప్రసన్నురాలై ముల్లోకాలనూ తెచ్చి ముంగిట నిలుపుతుంది. కర్పూరఖండాలతో నీరాజనమిస్తే సూర్యలోకనివాసం సిద్ధిస్తుంది. శతదీపార్చన సహస్రదీపార్చన కోటి దీపార్చనలు చేసినవారికీ ఇదే పుణ్యఫలం దక్కుతుంది.

అమ్మవారి ఎట్టయెదుట పర్వతాకారంలో నైవేద్యం నిలపాలి. షడ్రసోపేతమైన లేహ్యచోష్య పేయాలతో రకరకాల పిండివంటలతో రుచికరమైన ఫలాలతో బంగారు పాత్రల్లో అన్నరాశిని నివేదన చెయ్యాలి. అమ్మవారు తృప్తి చెందితే జగృత్త్రయం తృప్తి చెందుతుంది. ఎందుకంటే రజ్జువునందు సర్పత్వంలాగా జగత్త్రయమూ అమ్మవారే కనక.

నైవేద్యం పెట్టాక సుగంధభరితమైన చల్లని గంగాజలాన్ని కలశాలలో పానీయంగా సమర్పించాలి. తర్వాత కర్పూరతాంబూలం ఇవ్వాలి. ఏలకులూ లవంగాలూ వక్కపొడి ఇత్యాదులతో లేతతములపాకులు మడిచి ముఖసౌంగంధ్యవర్థకంగా అందివ్వాలి. అటు పైని మృదంగ వీణాది వాద్యాలతో మనోహరగానాలతో వేదపారాయణలతో పురాణపఠనలతో స్తోత్రపాఠాలతో జగన్మాతను అలరించాలి.

రెండేసి ఛత్రచామరాలు సమర్పించాలి. రాజోపచారాలు అన్నీ చెయ్యాలి. ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలి. లెంపలు వేసుకుంటూ క్షమాపణలు చెప్పాలి. ఒక్కసారి ఒక్క ఉపచారం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటిది అన్ని ఉపచారాలూ నిత్యమూ భక్తితో చేస్తే అమ్మవారి ఆనందానికీ అనుగ్రహానికీ అవధులు ఉంటాయా!

ఆవిడ జగన్మాత కనక పుత్రులపట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. భక్తితో అర్చనచేసే పుత్రుడంటే అవి ఎంత విశేషంగా ప్రవహిస్తాయో వేరే చెప్పాలా!

దేవీమహిమ - బృహద్రథుడి పూర్వజన్మ సృతి




Panchayatana Puja - పంచాయతన పూజ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - పంచాయతన పూజ

సంధ్యావిధానం సమగ్రంగా తెలియజేశాను. ద్విజులందరూ ప్రాతఃకాలంలో తప్పనిసరిగా ఆచరించాలి. ఇది అయ్యాక స్వయంగా అగ్నిహోత్రం(అగ్నికార్యం) చేసుకోవాలి. అటు పైని పంచాయతన పూజ. శివ శివా గణపతి సూర్య విష్ణు పూజలు. (పురుషకృత) శ్లోకాలతోగానీ అపౌరుషేయ మంత్రాలతోగానీ(వ్యాహృతులు) ఈ పంచాయతనపూజ చేసుకోవచ్చు. హ్రీశ్చతే ఇత్యాదికమైన మూలమంత్రాలు ఉన్నాయి. వాటితోనూ చెయ్యవచ్చు. ఎవరి ఆచారాన్నిబట్టివారు చేసుకోవాలి. పార్వతీదేవిని మధ్యలోఉంచి, ఈశాన్యంలో శ్రీమహావిష్ణువునుంచి, ఆగ్నేయంలో శివుణ్ణి ఉంచి, నైరృతిదిశలో గణపతిని నిల్పి, వాయవ్యంలో సూర్యుణ్ణి నిల్పి - పంచాయతన పూజ చెయ్యాలి. ముందుగా పార్వతీదేవిని అర్చించి తరవాత తక్కిన దేవతలకు పూజలు చెయ్యాలనేది క్రమం. షోడశమంత్రాలతో షోడశోపచారాలు అందరికీ చెయ్యాలి. విష్ణుమూర్తిని అక్షతలతోనూ, గణేశ్వరుణ్ణి తులసితోనూ, దుర్గామాతను గరికపోచలతోనూ(దూర్వా) శివుణ్ణి మొగలి పువ్వులతోనూ అర్చించకూడదంటారు.

మల్లికా - జాతి - కుటజ - పనస - కింశుక - వకుళ - కుంద - లోధ్ర - కరవీరక - శింశుపా - అపరాజిత - బంధూక - అగస్త్య - మదంత - సింధువార - పలాశ - దూర్వాంకుర - బిల్వదళ - కుశమంజరికా - శల్లకీ - మాధవి - అర్క - మందార - కేతకి - కర్ణికార - కదంబ - పున్నాగ - చంపక - యూథికా - తగర ప్రముఖ పత్రపుష్పాలు జగదీశ్వరికి అత్యంతప్రీతికరాలు. గుగ్గులంతో ధూపమూ నువ్వులనూనెతో దీపమూ అమ్మవారికి ఇష్టం. వీటితో పూజించి మూలమంత్రం జపించి అటు పైని విప్రుడు వేదాభ్యాసం చెయ్యాలి. ఇక అప్పటినుంచీ కుటుంబ పోషణకు అవసరమైన పనులు చేసుకోవాలి. తృతీయ దినభాగాన్నంతటినీ వీటికి ఉపయోగించుకోవచ్చు. 

మహాదేవీ సమర్చన




Aksharanyasa and Mudras - అక్షరన్యాసమూ ముద్రలూ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - అక్షరన్యాసమూ ముద్రలూ

నారదా! గాయత్రీవర్ణాలతో చేసే అక్షరన్యాసంకూడా ఉంది. ఆది సర్వపాపహరం. కనక చెబుతాను, గ్రహించు. ముందుగా ఓంకారాన్ని ఉచ్చరించి తత్కారాన్ని పాదాంగుష్ఠాల్లో న్యాసం చెయ్యాలి. సకారం గుల్ఫాలలో, వికారం జంఘలలో, తుకారం జానువులలో, వకారం ఊరువులలో, రేకారం గుదప్రదేశంలో, ణికారం లింగదేశంలో, యకారం కటిలో, భకారం నాభిమండలంలో, గోకారం హృదయంలో, దేకారం స్తనద్వయంలో, వకారం హృదయంలో, స్యకారం కంఠకూపంలో, ధీకారం ముఖదేశంలో, మకారం తాలువులలో, హికారం నాసికాగ్రంలో, ధికారం నేత్రమండలంలో, యోకారం భ్రూమధ్యంలో, యోకారం లలాటదేశంలో, నకారం పూర్వముఖంలో, ప్రకారం దక్షిణముఖంలో, చోకారం పశ్చిమముఖంలో, దకారం ఉత్తరముఖంలో, యాకారం మూర్ధభాగంలో నిన్యసించి తకారాన్ని వ్యాపకంగా న్యాసం చెయ్యాలి. ఈ న్యాసవిధానాన్ని కొందరు జపతత్పరులు ఇష్టపడరు. అటు పైని జగదంబిక గాయత్రిని ధ్యానించాలి.

భాస్వజ్జపా ప్రసూనాభాం కుమారీం పరమేశ్వరీమ్‌ ।
రక్తాంబుజాసనారూఢాం రక్తగంధానులేపనామ్‌ ॥

రక్తమాల్యాంబరధరాం చతురాస్యాం చతుర్భుజామ్‌ ।
ద్వినేత్రాం స్రుక్‌ స్రువౌ మాలాం కుండికాం చైవ బిభ్రతీమ్‌ ॥

సర్వాభరణ సందీష్తాం ఋగ్వేదాధ్యాయినిం పరామ్‌ ।
హంసపత్రామాహవనీయమధ్యస్థాం బ్రహ్మదేవతామ్‌ ॥

చతుష్పదామష్టకుక్షిం సప్తశీర్షాం మహేశ్వరీమ్‌ ।
అగ్నివక్త్రాం రుద్రశిఖాం విష్ణుచిత్తాం తు భావయేత్‌ ॥

బ్రహ్మకవచ, సాంఖ్యాయనగోత్రసంభవ, ఆదిత్యమండల మధ్యవర్తిని గాయత్రీ మహేశ్వరిని ఇలా ధ్యానించాలి. (ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైః - ఇత్యాది ధ్యానశ్లోకమే సుప్రసిద్ధం) ధ్యానమయ్యాక దేవికి ప్రీతికరమైన సమ్ముఖ - సంపుట - వితత - విస్తృత - ద్విముఖ - త్రిముఖ - చతుష్క - పంచక - షణ్ముఖ - ఆధోముఖ - వ్యాపకాంజలిక - శకట - యమపాశ - గ్రథిత - సమ్ముఖోన్ముఖ - విలంబ - ముష్టిక - మత్స్య - కూర్మ- వరాహక - సింహాక్రాంత - మహాక్రాంత - ముద్గర - పల్లవ - చతుర్వింశతి ముద్రలను పట్టాలి. గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలున్నాయి కనక ఇరవైనాలుగు ముద్రలు. జాతవేదసమంత్రాన్ని పఠించాలి. త్య్రంబకఋక్కును ఆవర్తించాలి. అలా శతాక్షర గాయత్రిని జపించాలి. అటు పైని ఓంకారపూర్వకంగా భూర్భువస్స్వః అనే వ్యాహృతిత్రయంతో చతుర్వింశతి గాయత్రిని ఉచ్చరించాలి. విఫ్రులందరూ నిత్యమూ ఇలా గాయత్రీజపం చేస్తే సంధ్యాదేవి ఆనందించి సమగ్రపుణ్యఫలాలను అనుగ్రహిస్తుంది.

బ్రహ్మనందనా! భిన్నపాదంగా గాయత్రీమంత్రాన్ని ఉచ్చరించాలి. బ్రహ్మహత్యాది దోషాలుకూడా తొలగిపోతాయి. అభిన్న పాదంగా (పాదాలు కలిపేస్తూ) ఉచ్చరిస్తే అంతటిదోషమూ సంక్రమిస్తుంది. కోటి కల్పాలు అధోముఖులుగా ఉండిపోతారు. సంపుటైకషడోంకారాది భేదాలు చాలా ఉన్నాయనీ పంచప్రణవ సంయుక్తమైన గాయత్రినే జపించాలనీ జపసంఖ్యలో ఎనిమిదవభాగం చివర తురీయపాదాన్ని జపించాలనీ, సంపుటైక షడోంకార గాయత్రులు ఊర్ధ్వరేతస్కులకనీ, బ్రహ్మచారులకూ గృహస్థులకూ మోక్షార్ధులకూ తురీయగాయత్రి అనీ ఇత్యాదిగా అభిప్రాయాలు శాస్త్రపురాణేతిహాసాల్లో కనపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవలసిన మరొక ధ్యానశ్లోకముంది -

హృది వికసితపద్మం సార్కసోమాగ్నిబింబం
ప్రణవమయమచింత్యం యస్య పీఠం ప్రకల్ప్యమ్‌


అచల పరమసూక్ష్మం జ్యోతిరాకాశసారమ్‌
భవతు మమ ముదే
உసౌ సచ్చిదానందరూపః

త్రిశూల - యోని - సురభి - అక్షమాల - లింగ - అంబుజ - మహాముద్రలు ఏడింటినీ ప్రదర్శించాలి. సంధ్యాదేవియే గాయత్రీదేవి. కనక భక్తి శ్రద్ధలతో ఉపాసించాలి. అటుపైని పంచోపచారపూజ చెయ్యాలి. లం పృథివ్యాత్మనే నమోనమః గంధమర్పయామి. హం ఆకాశాత్మనే నమోనమః పుష్పమర్పయామి. యం వాయ్వాత్మనే నమోనమః ధూపమాఘ్రాపయామి. రం వహ్న్యాత్మనే నమోనమః దీపం దర్శయామి. వమ్‌ అమృతాత్మనే నమోనమః నైవేద్యం సమర్పయామి. యం - రం - లం - వం - హం - పుష్పాంజలిం సమర్పయామి. ఈ పూజ అయ్యాక మళ్ళీ ముద్రలు ప్రదర్శించాలి. మనస్సులో దేవిని ధ్యానించాలి.

మంత్రం ఉచ్చరించేటప్పుడుగానీ ధ్యానించేటప్పుడుగానీ శిరస్సు కదలకూడదు. మెడ వంగకూడదు. దంతాలు కనిపించకూడదు. అష్టోత్తరశతంగాని అష్టవింశతి (28)గానీ, మరీ అశక్తుడైతే కనీసం పదిసార్లుగాని గాయత్రిని జపించాలి. ఇంతకు తక్కువగా ఎప్పుడూ చెయ్యకూడదు. అంతా అయ్యాక ఉత్తమే శిఖరే జాతే అనే శ్లోకాన్ని పఠిస్తూ గాయత్రీమాతకు ఉద్వాసన చెప్పాలి. నారదా! గాయత్రీదేవి అగ్నిముఖి కనక జలమధ్యంలో నిలిచి జపించకూడదని కొందరు మహర్షులు అంటున్నారు.

న గాయత్రీం జపేద్విద్యాన్‌ జలమధ్యే కథంచన

యతస్సాగ్నిముఖీ ప్రోక్తేత్యాహుః కేచిన్మహర్షయః ॥

సురభి - జ్ఞాన - శూర్ప - కూర్మ - యోని - పద్మ - లింగ - నిర్వాణకాలనే ఆష్టముద్రలను జపాంతంలో ప్రదర్శించాలి. ధ్యానమంత్ర పూజావిధుల్లో ఉచ్చారణదోషాలు ఏమైనా దొర్లితే క్షమించమని ప్రార్థిస్తూ గాయత్రీతర్పణం విడిచిపెట్టాలి.

ఈ మంత్రానికి ఛందస్సు గాయత్రి, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత. తర్పణే వినియోగః. భూః అని ఉచ్చరించి ఋగ్వేదపురుషుణ్ణీ, భువశ్శబ్దంతో యజుర్వేదపురుషుణ్ణీ, స్వః అనే వ్యాహృతితో సామవేద పురుషుణ్ణీ, మహశ్శబ్దంతో అధర్వణవేద పురుషుణ్ణీ, స్మరిస్తూ తర్పణాలు విడిచి పెట్టాలి. 

అటుపైని జనః పదంతో ఇతిహాసపురాణాలనూ, తపశ్శబ్దంతో సర్వాగమాలనూ, సత్యం శబ్దంతో సత్యలోకపురుషుణ్ణీ, ఓం భూః - భూలోకపురుషం తర్పయామి తర్పయామి అంటూ నీళ్ళు వదిలిపెట్టాలి. భువశ్చేతి భువర్లోకపురుషం తర్పయామి. స్వః స్వర్లోకపురుషం తర్పయామి. 

ఇలాగే గాయత్రీతర్పణలు. ఓం భూరేకపదాం గాయత్రీం తర్పయామి. ఓం భువః ద్విపదాం ..... ఓం స్వః త్రిపదాం గాయత్రీం ..... ఓం భూర్భువః స్వశ్చేతి చతుష్పదాం గాయత్రీం తర్పయామి. ఉషసీ గాయత్రీ సావిత్రీ సరస్వతీ వేదజననీ పృథ్వీ అజాకౌశికీ సాంకృతి సార్వజితి భేదాలతో గాయత్రికి తర్పణలు ఇవ్వాలి. ఇలా వేదపురుష - లోకపురుష - గాయత్రీ తర్పణాలు అయ్యాక శాంతికరంగా జాతవేదసమంత్రం పఠించాలి. మానస్తోకమంత్రంకూడా జపించాలి. త్య్రంబకమంత్రం మరింత శాంతికరంగా ప్రసిద్ధం. తచ్చంయోరిత్యాది మంత్రమూ ఇటువంటిదే. శాంతికరమంత్ర పఠనమయ్యాక అతోదేవా మంత్రద్వయంతో సర్వాంగ స్పర్శనం చేసుకోవాలి. స్యోనాపృథివి మంత్రంతో భూమికి మ్రొక్కాలి. యథావిధిగా గోత్రనామాలు చెప్పుకోవాలి.

పంచాయతన పూజ




Khechari Mudra - ఖేచరీ ముద్ర

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఖేచరీ ముద్ర

ఈ ప్రాతస్సంధ్యా విధానంలో ప్రాణాయామం తర్వాత ఖేచరీముద్రను మునిపుంగవులు చెప్పారు. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే - ఈ ముద్ర పట్టినప్పుడు చిత్తమూ జిహ్వా ఆకాశంలో (ఖే) సంచరిస్తూ ఉంటాయి. దృష్టి భూమధ్యభాగంలో స్థిరంగా నిలుస్తుంది. కనక దీన్ని ఖేచరీముద్ర అన్నారు. నారదా! సిద్ధసమానమైన ఆసనం లేదు, కుంభక సమానమైన వాయువు లేదు, ఖేచరీ సమానమైన ముద్రలేదు. ఇది ముమ్మాటికీ సత్యం.

అంఘ్రిమూలాలతో యోనిముద్ర చేసి దానిమీద నిశ్చలంగా కూర్చోవాలి. ఇంద్రియాలను కట్టుబాటులో ఉంచాలి. మనస్సును కదలనివ్వకూడదు. నడుం నిలబెట్టి సమంగా స్థాణువులా కూర్చోవాలి. భ్రూమధ్యభాగంలో దృష్టిని కేంద్రీకరించాలి. ఇది యోగులకు అత్యంత సుఖప్రదమైన సిద్దాసనం. ఇలా కూర్చుని ఆయాతు వరదా దేవీత్యాది శ్లోకాలతో గాయత్రీమాతను ఆహ్వానించి సర్వదేవి నమోస్తుతే అని నమస్కరించాలి. తేజో
సీత్యాది మంత్రాలతో ఆవాహన చెయ్యాలి. నేను చేసిన ఈ నీ అనుష్ఠానం సంపూర్ణమగుగాక ఆని అకాంక్షించాలి. అభ్యర్థించాలి.

అటుపైని శాపవిమోచన విధానాన్ని శ్రద్ధగా ఆచరించాలి. బ్రహ్మ- వసిష్ట - విశ్వామిత్ర శాపాలు వారి స్మరణలతో అంతరిస్తాయి. ఇది అయ్యాక సత్యాత్మకుడూ సర్వజగత్స్వరూపుడూ చిద్రూపుడూ వాచామగోచరుడూ అద్వితీయుడూ అయిన ఆ పరమాత్మను హృదయపద్మంలో ధ్యానించాలి. 

అటు పైని సంధ్యావందనానికి అంగభూతాలైన అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి. ప్రతీమంత్రానికీ ముందు ఓంకారం పలకాలి. ఓం భూః పాదాభ్యాం నమః ఓం భువః జానుభ్యాం నమః. ఓం స్వః కటిభ్యాం నమః. ఓం మహః నాభ్యై నమః. ఓం జనః హృదయాయ నమః. ఓం తపః కంఠాయనమః. ఓం సత్యం లలాటాయ నమః. ఓం తత్సవితుః అంగుష్టాభ్యాం నమః. ఓం వరేణ్యం తర్జనీభ్యాం నమః. ఓం భర్గోదేవస్య మధ్యమాభ్యాం నమః. ఓం ధీమహి అనామికాభ్యాం నమః. ఓం ధియో యోనః కనిష్ఠికాభ్యాం నమః. ఓం ప్రచోదయాత్‌ కరతలకరపృష్ఠాభ్యాం నమః. 

ఓం తత్సవితుర్బ్రహ్మాత్మనే హృదయాయ నమః. ఓం వరేణ్యం విష్ణ్వాత్మనే శిరసే స్వాహా. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే శిఖాయై వౌషట్‌. ఓం ధీమహి శక్త్యాత్మనే కవచాయ హుమ్‌. ఓం ధియో యోనః కళాత్మనే నేత్రత్రయాయ నమః. ఓం ప్రచోదయాత్‌ సర్వాత్మనే అస్త్రాయ ఫట్‌.

అక్షరన్యాసమూ ముద్రలూ




Monday, August 3, 2026

Sandhyopasana (Ritual prayers performed at dawn, noon, and dusk) - సంధ్యోపాసన

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - సంధ్యోపాసన

నారదా! బొట్టు పెట్టుకోవడమయ్యాక చెయ్యవలసింది సంధ్యోపాసన, ఇక దాన్నిగురించి చెబుతాను ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతస్సంధ్యనూ, సూర్యుడు ఆకాశంలో నట్టనడిమికి చేరుకోగానే మధ్యాహ్న సంధ్యనూ, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయంసంధ్యనూ ఉపాసించాలి.

మళ్ళీ వీటిలో అంతర్భేదాలున్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతస్సంధ్య ఉత్తమం. నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమం. సూర్యుడు ఉదయించేశాక చేసే ప్రాతస్సంధ్య అధమం. ఇలాగే - సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయంసంధ్య - ఉత్తమం. అస్తమించాక చేసేది మధ్యమం. చుక్కలు పాడిచాక చేసే సాయంసంధ్య - అధమం. విప్రుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లివేరు. వేదాలే శాఖలు. ధర్మకార్యాలు ఆకులు. 

కనక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలూ లేవు, ఆకులూ లేవు. అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యనివాడు జీవచ్చవం. మరుజన్మలో కుక్కగా పుడతాడు. అందుచేత నిత్యమూ సంధ్యోపాసన చెయ్యాలి. ఏమరకూడదు. ఇది లేనిదే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు. 

సూర్యోదయానికీ అస్తమయానికీ ముందుండే మూడు ఘటికలూ సంధ్యాకాలం. ఆ సమయంలోనే సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితుల్లో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చతుర్థార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే నూటయెనిమిదిసార్లు గాయత్రిని జపించి సంధ్యవార్చాలి.

ఏ సంధ్యను ఆతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరవాత తత్కాలీన సంధ్యావందనం చెయ్యాలి. ఇంటిలో చేసుకుంటే అది సాధారణసంధ్య. గోశాలలో చేస్తే అది మధ్యమం. నదీతీరానగానీ దేవాలయంలోగానీ చేసుకుంటే అది ఉత్తమ సంధ్య. 

సంధ్యావందనమంటే దేవీ ఉపాసన కనక దేవీ సన్నిధిలోనే ముప్పాద్దులా చెయ్యాలి. అనంతఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించిన దైవం లేదు. హరహరి ఉపాసనలు నిత్యవిధులు కావు. సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. 

ఇది శ్రుతిచోదితం. సర్వవేదసారం. బ్రహ్మాదిదేవతలు కూడా సంధ్యాసమయంలో వేదస్వరూపిణి గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి. కనక గాయత్రీదేవి అంటే వేదోపావ్య అని తెలుసుకో. అందుచేత శాక్తులా శైవులా వైష్టవులా అనే భేదం లేదు. విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే.

ముందుగా కేశవాదినామాలతో ఆచమించి ప్రాణాయామం చెయ్యాలి. కేశవ - నారాయణ - మాధవ - గోవింద - విష్ణు - మధుసూదన - త్రివిక్రమ - వామన - శ్రీధర - హృషీకేశ - పద్మనాభ - దామోదర - సంకర్షణ - వాసుదేవ - ప్రద్యుమ్న- అనిరుద్ధ - పురుషోత్తమ - అధోక్షజ - నారసింహ - అచ్యుత - జనార్దన - ఉపేంద్ర - హరి - శ్రీకృష్ణ అనేవి చతుర్వింశతి నామాలు. 

వీటికి ప్రతినామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి. చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి మూడు నామాలతోనూ జలం ముమ్మారు పుచ్చుకోవాలి, (ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా.) అటుపైని ఓం గోవిందాయనమః ఓం విష్ణవే నమః - ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండింటితో చేతులు కడుక్కోవాలి. 

తరవాత రెండింటితో పాదాలు కడుక్కోవాలి. ఆపైని రెండింటితో శిరస్సున జల్లుకోవాలి (మార్జనం). అటు తరువాత మూడింటితో పాణి - పాద - శిరస్పంప్రోక్షణలు చేసుకోవాలి. తక్కిన సంకర్షణాది ద్వాదశనామాలను ఉచ్చరిస్తూ ద్వాదశాంగాలనూ స్పృశించాలి. కుడిచేత్తో త్రాగాలి. ఎడమచేత్తో తాకాలి - స్పృశించాలి. అప్పటికిగానీ నీళ్ళు పరిశుద్ది పొందినట్టు కాదు. అటుపైనే ఆచమనం.

కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి, మినప గింజంత నీరు చొప్పున ముమ్మారు (విడివిడిగా పోసుకుని) పుచ్చుకోవాలి. అంటే త్రాగాలి. ఆంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ఠ కనిష్ఠికలను సాచి, నడిమి మూడువేళ్ళనూ పాముపడగలాగా ముందుకి తెచ్చి, అరచేతిలో గుంట ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి (అప్పటికే నీటిని స్పృశించి పరిశుద్ధిపాందిన) ఎడమచేతితో నీళ్ళు పోనుకుని ఓం కేశవాయ స్వాహా అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన రెండు నామాలతోనూ మరో రెండుసార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తిఅయినట్టు.

ఆచమించాక ప్రాణాయామం చెయ్యాలి. ప్రణవ సహితంగా గాయత్రీమంత్రాన్ని జపిస్తూ చెయ్యాలి. ఇందులో రేచక పూరక కుంభకాలని మూడు అంశాలున్నాయి. దక్షిణ నాసారంధ్రంనుంచి రేచకం, వామవాసారంధ్రం నుంచి పూరకం చెయ్యాలి. పూరకమంటే గాలిని లోపలికి పీల్చుకోవడం. కుంభకమంటే పీల్చిన గాలిని ఊపిరి తిత్తుల్లో నిలుపుకోవడం. రేచకమంటే ఆ గాలిని విడవడం. 

(ఇవి మూడూ సమానకాల వ్యవధానంతో జరగాలి. పీల్చినంతసేపు నిలపాలి. నిలిపినంతసేపు విడవాలి. అంతసేపు ఆగాలి. మళ్ళీ అలాగే అంత సేపు పీల్చాలి. ఇలా సాగాలి అంటారు. దీన్ని తజ్ఞుల దగ్గర తర్ఫీదు పాందడం అవసరం) 

పూరక సమయంలో కుడిముక్కు పుటాన్ని బొటనవేలితో నొక్కి ముయ్యాలి. ఎడమ ముక్కునుంచి గాలి పీల్చాలి. రేచక సమయంలో నడిమివేలూ చూపుడు వేలూ వదిలేసి మిగిలిన చిటికెనవేలూ దాని ప్రక్కనే ఉండే అనామికతో (ఉంగరంవేలు) ఎడమ ముక్కుపుటాన్ని ఒత్తి ముయ్యాలి. కుడిముక్కు నుంచి గాలి వదలాలి.

పూరక - కుంభక - రేచకాలు మూడు కలిసి ఒక ప్రాణాయామమని యోగులూ యోగశాస్త్రాలూ చెబుతున్నమాట. పూరక సమయంలో నీలోత్పలదళశ్యాముడూ చతుర్భుజమహాత్ముడూ అయిన శ్రీహరిని నాభిమధ్యంలో ప్రతిష్టించుకోవాలి. కుంభక సమయంలో కమలాసనుడూ ప్రజాపతీ జగన్నాథుడూ చతుర్వదనుడూ అయిన పితామహుణ్ణి హృదయస్థానంలో ధ్యానించాలి. రేచక సమయంలో శుద్ధస్పటిక సంకాశుడూ పాపనాశకుడూ నిర్మలుడూ శంకరుడూ అయిన మహేశ్వరుణ్ణి ఫాలభాగంలో స్మరించుకోవాలి. పూరకంలో విష్ణుసాయుజ్యం. కుంభకంలో బ్రహ్మగతి. రేచకంలో ఈశ్వర ప్రాప్తి,

నారదా! పౌరాణాచమనాద్యమూ శ్రౌతాచమనాద్యమూ అంటూ కొన్ని విధులను చెబుతూ ఉంటారు. అవేమిటో అని కంగారుపడకు. కేశవనామాలతో ఆచమిస్తే ఆది పౌరాణికాచమనం. గాయత్రీ మంత్రంతో ఆచమిస్తే అది శ్రాతాచమనం. ప్రణవసహితంగా వ్యాహృతిత్రయాత్మకంగా గాయత్రిని ఉచ్చరించాలి.

ప్రాణాయామసమయంలో గృవాస్థులూ వానప్రస్థులూ నాసాగ్రాన్ని అయిదు వేళ్ళతోనూ ముయ్యాలనీ, బ్రహ్మచారులూ సన్యాసులూ అంగుష్ఠ కనిష్ఠికానామికలతో ముయ్యాలనీ ఒక నియమం. ఆపోహిష్ఠాదిక మంత్రాన్ని చదువుతూ ముమ్మారు కుశోదకం సంప్రోక్షించుకోవాలి. ఋగంతంలోగాని పాదాంతంలోగానీ ఈ సంప్రోక్షణలు (మార్జనలు) చేసుకోవచ్చు. దీనివల్ల సంవత్సరపాపం నశించిపోతుంది. 

అటు పైని మళ్ళీ ఆచమించి సూర్యశ్చేత్యాది మంత్రాన్ని చదివి జలప్రాశన చెయ్యాలి. దీనితో ఆంతరంగపాపాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు దక్షిణహస్తంలోకి మళ్ళీ జలం తీసుకుని ముక్కుకి దగ్గరగా తెచ్చుకుని వామకుక్షిలో పాపపురుషుణ్ణి స్మరించి, ఋతమిత్యాది మంత్రంగానీ ద్రుపదా ఇత్యాదిమంత్రంగానీ పఠిస్తూ దక్షిణశ్వాసమార్గం గుండా (కుడిముక్కు) ఆ పాపపురుషుణ్ణి చేతినీటిలోకి తీసుకురావాలి. ఇక ఆ నీళ్ళను చూడకుండా ఎడమవైపు రాతిమీదకు విసిరికొట్టాలి. నా శరీరం నిష్పాపమయ్యింది అని భావించాలి. 

అప్పుడు లేచినిలబడి, కాళ్ళు దగ్గరగా పెట్టుకుని దోసిటిలోకి నీళ్ళు తీసుకుని సూర్యుణ్ణి చూస్తూ గాయత్రిజపిస్తూ ముమ్మారు అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ప్రాతస్సాయం సంధ్యలో ఇలా మూడుసార్లూ, మధ్యాహ్న సంధ్యలో ఒక్కసారి అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రాతస్సంధ్యలో కొంచెం ముందుకి వొంగి, మధ్యాహ్నసంధ్యలో నిట్టనిటారుగా నిల్చునీ, సాయం సంధ్యలో కూర్చునీ ఇవ్వాలి.

ఇది అయ్యాక అసావాదిత్య మంత్రంతో ప్రదక్షిణం చెయ్యాలి. ఈ అర్ఘ్య ప్రదానానికి కారణమేమిటంటే - 

మందేహులని మహారాక్షసులున్నారు. మూడుకోట్ల మంది. మహావీరులూ మహాఘోరులూ కృతఘ్నులూ దారుణులూ. వీళ్ళంతా కలిసి సూర్యుణ్ణి తినివెయ్యాలని చూస్తుంటారు. కనక దేవతలూ ఋషులూ తపోధనులూ మహాసంధ్యను ఉపాసించి సూర్యుడికి అర్ఘ్యం విడిచి పెడతారు. 

ఆ మంత్రజలాలు వజ్రాలై ఆ రాక్షసుల్ని దహించివేస్తాయి. అందుకనే ద్విజులు నిత్యమూ సంధ్యను ఉపాసించాలి. సూర్యభగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వాలి. ఇది మహాపుణ్యప్రదమైన పవిత్రకర్తవ్యం. ఉచ్చారణమాత్రం చేతనే సంధ్యావందనాన్ని సాంగంగా సఫలం చేసే అర్ఘ్యాంగమంత్ర సారమేమిటంటే - నేను సూర్యుణ్ణి, నేను జ్యోతిని, నేను ఆత్మను, నేను ఆత్మజ్యోతిని, నేను శివుడను, నేను శుక్తుడను, నేను సర్వజ్యోతిని, నేను రసమును. 

ఓ వరదాయినీ! గాయత్రీదేవీ! బ్రహ్మరూపిణీ! రమ్ము రారమ్ము. జపానుష్ఠాన సిద్ధికోసం నా హృదయంలో ప్రవేశించు - అని ప్రార్థించి శుభ్రప్రదేశంలో శుభ్రపీఠంమీద కూర్చుని గాయత్రీమహామంత్రాన్ని జపించాలి. జపం ముగిశాక మళ్ళీ ధ్యానించి “పునరాగమనంకోసం సుఖంగా వెళ్ళిరా" అని వీడ్కోలు పలకాలి.

ఖేచరీ ముద్ర




Oordhwapundra Dhaarana - Applying the Urdhva Pundra - ఊర్ధ్వపుండ్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - ఊర్ధ్వపుండ్ర ధారణ

నారదా! ఇదీ భస్మత్రిపుండ్రాల మహిమ. ఇప్పటికి సమగ్రంగా చెప్పడమయ్యింది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్థ్వత్రిపుండ్రాల గురించి చెబుతాను. ఆలకించు. దాని వర్ణాలూ మంత్రాలూ దేవతలూ ఫలాలూ ఆనీ సమగ్రంగా చెబుతాను. తెలుసుకో.

పర్వతాగ్రం నదీతీరం విశేషించి శివక్షేత్రం సముద్రతీరం పుట్ట తులసికోట - వీటిలో ఎక్కడినుంచైనా మృత్తికను స్వీకరించవచ్చు. మరింక ఏ మృత్తికగానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపుమట్టి శ్రీకరం, తెల్లమన్ను ధర్మప్రదం. ఈ మట్టిని బొటనవేలుతో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం. నడిమివేలుతో ఆయుష్కరం. అనామికతో భుక్తిదాయకం. చూపుడువేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం. ఈ నాలుగువేళ్ళే ఉపయోగించాలి. గోళ్ళు తాకనివ్వకూడదు.

ఈ నిలువుబొట్టు దీపం వొత్తిలాగానీ వేణుపత్రంలాగానీ(వెదురు ఆకు) తామరమొగ్గలాగానీ తీర్చిదిద్దుకోవాలి. మత్స్య కూర్మ శంఖాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు. పది అంగుళాల పొడవుంటే ఉత్తమోత్తమం. తొమ్మిదంగుళాలుంటే మధ్యమం. అయిదు అంగుళాలవరకూ మధ్యమంగానే పరిగణన. నాలుగునుంచి రెండంగుళాలవరకూ కనిష్టం.

నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్నీ, పొట్టమీద నారాయణనామాన్నీ, గుండెలమీద మాధవనామాన్ని, గొంతుముడిక్రింద పెట్టుకునేటప్పుడు(కంఠకూపం) గోవిందనామాన్నీ, పొట్టకి కుడివైపున విష్ణునామాన్నీ, కుడి బాహువుమీద మధుసూదన నామాన్నీ, కుడిచెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమనామాన్నీ, పొట్ట ఎడమవైవున వామననామాన్నీ, ఎడమ బాహువుమీద శ్రీధరనామాన్నీ, ఎడమ చెవిమీద హృషీకేశనామాన్నీ, వీపుమీద పెట్టుకునేటప్పుడు పద్మనాభనామాన్నీ మూపుమీద పెట్టుకునేటప్పుడు దామోదరనామాన్ని స్మరించాలి. ఇలా పన్నెండు నామాలూ స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి. పూజాకాలంలో హోమసమయంలో సాయంప్రాతః సంధ్యాసమయాల్లో ఏకాగ్రచిత్తంతో కేశవాదినామాలు పలుకుతూ బొట్టులు ధరించాలి. శుచిత్వం సిద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు అతడు శ్వమాంసభక్షకుడైనా సరే మరణానంతరం దివ్యవిమానంలో విష్ణులోకం చేరుకుంటాడు.

కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణుపాదాకారంలో సాంతరాళంగా (మధ్యన ఖాళీగా) ధరిస్తే మరికొందరు పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతోగానీ పసుపుతోగానీ నిలువుబొట్టు కలపి(నిరంతరాళంగా) త్రిశూలాకారంలో ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు అచ్చిద్రంగా దీపశిఖా - పద్మముకుళ - వేణుపత్రాకృతుల్లో ధరిస్తున్నారు. ఇంకొందరు కేవల వైష్ణవులు అచ్చిద్రమో సచ్చిద్రమో - ఎలాగైనా ఏ ప్రత్యవాయవమూ లేదనీ, ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమనీ అంటున్నారు, ఏ బొట్టూ పెట్టుకోకపోతే ఏకాంతులకైనా ప్రసన్నులకైనా పరమైకాంతికులకైనా ప్రత్యవాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా ద్వాదశనామాలనూ జపిస్తూ దండాకారంగా అచ్చిద్రంగా ఊర్ధ్వపుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్యఖాళీలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీశ్రీహరులను అక్కడినుంచి తరిమివేసినట్టే.

కొందరేమో - అచ్చిద్రంగా ఊర్వపుండ్రాలను పెట్టుకోవడంకూడా అంత ప్రశస్తంకాదు, ఏకవింశతి నరకాలకి పోతాడంటున్నారు. అంచేత ఊర్థ్వపుండ్రాలను సాంతరాళంగా ధరించడమే ఉత్తమం. దండాకార - దీపశిఖాకార - పద్మముకుళాకార - మత్స్యాకారాల్లో ధరించడమూ ప్రశస్తమే. శిఖలాగా యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ్ర ధారణం నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఏ సత్కర్మలూ ఫలించవు. నైష్ఠికులైన వైష్ణవులు త్రిశూల - వర్తుల - చతురస్రక - అర్ధచంద్ర - శివలింగాకారాల్లో ధరించరుగాక ధరించరు. జన్మతః వైష్ణవుడై వేదమార్గాన్ని అనుసరించేవాడు మరింక ఏ ఇతరాకారాల్లోనూ పుండ్రధారణ చెయ్యడు. చెయ్యకూడదు. ఒకవేళ వైష్ణవాగమాలలో ఖ్యాతికోసమో కాంతికోసమో కామ్యసిద్ధికోసమో ఇంకేవైనా ఆకారభేదాలు ప్రసక్తమైనా వాటిని వైదికవైష్ణవులు ధరించరాదు.

వీటిలో వైదిక శ్రౌత స్మార్తాదిభేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే. కనక ఏ మార్గానికి చెందినవారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతుల్లో ధరించకూడదు. ఏదియేమైనా - వైదిక మార్గానుయాయులు భస్మంతో తిర్యక్‌త్రిపుండ్రాలను, నారాయణ ప్రపన్నులు గంధజలంతోనో మృత్తికతోనో శూలాకారంలో ఊర్థ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టూలేని శూన్యలలాటం ఎవరికీ ఎప్పుడూ తగదుగాక తగదు.

సంధ్యోపాసన




Brahmacharyam - బ్రహ్మచర్యం

శ్రీ దేవీ భాగవతం ఏకాదశ స్కంధము - బ్రహ్మచర్యం అధఃశయానుడూ(నేలమీద పడుకునేవాడు). ధర్మాత్ముడూ జితేంద్రియుడూ వినయవంతుడూ మితాహారీ శాంతచిత్తుడూ నిత్...