Tuesday, December 17, 2024

తిరుప్పావై మూడవ పాశురము

తిరుప్పావై మూడవ పాశురము

శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ఆండాళ్ తిరువడిగలే శరణం

ప్రియ భగవత్ బంధువులారా!

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

ఇది చాలా మంగళకరమైన పాశురం. ఇది విశేష పాశురం. దీనిని అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటారు. విశేష పాశురం అంటే ఏమిటంటే మనకి మొదటి పాశురం విశేష పాశురం తిరిగి ఈ మూడో పాశురం విశేషం. అంటే రోజూ లాగా.. ఒక పొంగలి మాత్రమే నివేదన చేసి ఊరుకోకుండా... ఒక తీపి పదార్థాన్ని, రెండు మూడు ఆరగింపులను కూడా నివేదించడం, విశేష పాశురం రోజు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పాశురాన్ని చూద్దాం

ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్పాడి
నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్
తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు
ఓంగు పెరుం శెన్నలూడు కయలుగళ 
పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్తములై పట్రి - వాంగ
కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం.

ఈ మూడవ పాశురం లో వామనావతారం గురించి చెప్తారు. గోదాదేవికి వామనుడు అంటే ఇష్టం. ఎందుకంటే ఆమెకు శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రీతి. శ్రీకృష్ణుడు యొక్క అందానికి ఆ తల్లి మయమర్చిపోయింది. అదేవిధంగా ఆ బాలవామనుడు కూడా ముద్దుగా ఉంటాడు కదా! బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో.. అలాగే బాల వామనుడు కూడా అంతే అందంగా ఉంటాడు కాబట్టి గోదాదేవికి వామనావతారం అన్నా చాలా ఇష్టం. ఇది ఆశీర్వచన పాశురం. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఈ విశేష పాశురాన్ని పెద్దలు చదువుతారు. పాడి, పంట సమృద్ధిగా ఉండాలని పెద్దలు మంగళాశాసనం చేస్తారు. పాడిపంటలు రెండూ సమృద్ధిగా ఉంటే అదృష్టం.

శుభప్రదమైన వామనావతార కధ ఈ పాశురంలో వస్తుంది. బలి చక్రవర్తి భక్తుడు. దాన కర్ణుడు. కానీ అహంకారి. ఆయన అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో శ్రీమహావిష్ణువు వామనుడు అయ్యాడు. ఒకసారి బలి చక్రవర్తి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్లి ఓడిపోయాడు. అప్పుడు ఇంద్రుడిని ఎలాగైనా సరే ఓడించాలి అన్న అభిలాషతో.. విశ్వజిత్ యాగం చేసి సర్వశక్తులు పొంది.. మరల ఇంద్రుడి పై దాడి చేస్తాడు. ఇంద్రుడ్ని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి విష్ణువుతో మొరపెట్టుకొన్నారు. అప్పుడు విష్ణువు కశ్యపుడు - అదితి దంపతులకు కుమారుడిగా వామనుడై జన్మించాడు. బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధయాగానికి వామనుడు వెళ్లి బలిచక్రవర్తిని మూడు అడుగుల భూమిని దానం చేయమని అడుగుతాడు. పొట్టిగా ఉన్న బ్రాహ్మణుడిని, అతనిలో ఉన్న తేజస్సు చూసి.. బలి చక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు (ఆయన రాక్షసులు అందరికీ గురువే) దానం ఇవ్వద్దని బలిచక్రవర్తిని కోరతాడు. అతను సాక్షాత్తు విష్ణువే అని చెప్తాడు బలి చక్రవర్తికి. అప్పుడు బలి చక్రవర్తి శుక్రాచార్యుడితో.. గురువర్యా! సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వచ్చి నన్ను దానం అడిగితే లేదు అని ఎలా అనగలను. ఆయన చేయి కింద, నా చేయి పైన ఉన్నప్పుడు అంతకంటే జీవితానికి అదృష్టం ఏముంటుంది అని ఆయన భార్య అయిన వింద్యావళితో కలిసి మూడు అడుగులు దానం ఇచ్చి మోక్షాన్ని పొందుతాడు.

ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం..

ఓంగియులగళన్ద వుత్తమన్ పేర్పాడి

ఓ! గోపికలారా! వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని మూడడుగుల దానం అడిగి మూడు లోకాలు కొలిచేశాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరిగి పెరిగి మూడు లోకాలు కొలిచేశాడు. గోపికలు వామనావతారం ని ఇష్టపడటానికి కారణం ఏమిటి?

సాధారణంగా జీవులు ఏదైనా పెరగడానికి ఇష్టపడతారు కానీ తరగడానికి ఇష్టపడరు. ఈ అవతారంలో భగవంతుడు పెరుగుతాడు. అందుకని గోపికలు ఈ అవతారం అంటే ఇష్టపడతారు. భగవంతుడు కరుణామయుడు. భక్తుల కోసం ఎంత కిందకైనా దిగడానికి ఇష్టపడతాడు.

కానీ భగవంతుడు భక్తుడు కోసం ఆ రెండు హేయమైన పనులకోసం కూడా సిద్ధపడ్డాడు.ఇంద్రుని కోసం వామనుడిగా, ఒక బిచ్చగానిగా వచ్చాడు. అక్కడ చూడండి భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రధసారధిగా ఉన్నాడు. ఆయనకు ఏమి అవసరం ఉంది అంటే! ఇక్కడ అర్జునుడు భక్తుడు. అందుకే ఆయనకోసం సారధి అయ్యాడు.

కృష్ణుడు రాజ వంశంలో జన్మించి గోపికలను కాపాడటానికి గోపాలుడు అయ్యాడు. పాలు పితికే వాడయ్యాడు. అది ఆయన గొప్పతనం. భక్తుల మీద ఉండే ప్రేమ. తర్వాత ఇందులో ఇంకో రహస్యం కూడా ఉంది. వామన అవతారంలో వామనుడి తల్లిదండ్రులు అదితి కశ్యపులే.. శ్రీకృష్ణావతారంలో శ్రీ కృష్ణుడి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. గోపిలకి  కృష్ణుడికి వామనునికి బేధం తెలీదు అనే ఉద్దేశంతోనే వామనావతారాన్ని కీర్తిస్తున్నారు.

దీనిలో అంతరార్థం చూద్దాం..

వామనుడు అడిగిన మూడు అడుగులలో రహస్యం ఏమిటంటే.. శ్రీకృష్ణుడు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 27 వ శ్లోకంలో ఇలా చెబుతాడు అది మీ అందరికీ తెలిసిందే.

 యత్ కరోషి యదశ్నాసి 
యజ్ఞుహోషి దదాసి యత్
యత్ తపస్యసి కౌంతేయ
తత్ కురుష్వ మదర్పణమ్

ఏపనైతే చేస్తున్నావో, దేనినైతే తింటున్నావో, ఏ హోమాన్నైతే చేస్తున్నావో, దేన్నైతే చేస్తున్నావో, ఏ తపస్సైతే చేస్తున్నావో ఓ అర్జునా! ఆ ఫలితాలని నాకు సమర్పించు.

ఈ మూడు పాదాలలో చెప్పినవే వామనుడు అడిగిన మూడు అడుగులు. అర్జునుడు ద్వారా శ్రీకృష్ణుడు సర్వ జీవకోటిని ఉద్దేశించి చెప్పాడు. అటువంటి పురుషోత్తముని ప్రార్ధన చేస్తే

నాంగళ్ నమ్పావైక్కు చ్చాత్తి నీరాడినాల్

ఈ తిరుప్పావై వ్రతం పేరుమీద మనం ఉదయాన్నే స్నానం చేస్తే..

తీంగిన్ఱి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు

నెలకు మూడు వానలు కురిసినట్లయితే కరువుకాటకాలు ఉండవు. ఈతి బాధలు ఉండవు. సుఖంగా ఉంటాం. ఈతి బాధలంటే.. ఈతి బాధలు 6 ఉంటాయట. అవేమిటంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలకలు, మిడతలు(చీడలు), దుష్ట ప్రభుత్వం ఇవి అన్నీ తొలగిపోతాయట. 

ఓంగు పెరుం శెన్నలూడు కయలుగళ

వామనుడు లాగా వరిచేలు కూడా అంత ఎత్తుకు పెరుగుతాయి. అలా ఎదిగిన వరిచేల మధ్య నీటిలో చేపలు తుళ్ళి తుళ్ళి ఆడతాయిట. 

పూంగువళై ప్పోదిల్ పొరివణ్డు కణ్-పడుప్ప

కలువపువ్వుల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనెను తుమ్మెదలు తాగి మత్తుగా నిద్రపోతాయట.

తేంగాదే పుక్కిరుందు శీర్ త్తములై పట్రి - వాంగ
కుడం నిఱైక్కుం వళ్ళల్ పెరుంబశుక్కల్

గోపాలబాలకులు పాలు పితకడానికి పశువుల కొట్టంలో ప్రవేశించి స్థిరంగా కూర్చుంటారట. వారి ప్రమేయం లేకుండా, వారు ఏమీ చేయకుండానే, అంటే పాలు పితికే ముందు ఆ దూడని తీసుకువచ్చి ఆవు దగ్గర పాలు తాగించి ఆ తర్వాత పాలు పితుకుతారు. కానీ ఇక్కడ అవేం చేయకుండానే వాళ్ళు పాల గిన్నెల్ని తిన్నగా తీసుకువచ్చి ఆ ఆవు దగ్గరకు వచ్చి ఆ పొదగు క్రింద పెడతారట. పొదుగులు ఎలా ఉంటాయట బలిష్టంగా ఉంటాయట. ఆ గిన్నె అక్కడ పెట్టగానే, పొదుగుల క్రింద పెట్టగానే ఏదో వర్షం వచ్చినట్టు పాలు ధారగా ఆ పొదుగుల నుంచి గిన్నెలోకి వస్తాయట.ఎన్నో కుండలతో పాలిస్తాయట ఆ గోవులు.

నీంగాద శెల్వం

మనము ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో సంపదలు వస్తాయి. ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన వ్రతాన్ని చేసి మనం శుభాలు పొందుదాం. 


ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...