Wednesday, July 29, 2026

The Lakshmi Puja and Lakshmi Stavam Performed by Indra - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం

నారదా! ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ ధ్యానం స్తోత్రం సవివరంగా చెబుతాను. తెలుసుకో - అని నారాయణమహర్షి కథను కొనసాగించాడు.

ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీరసముద్రతీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ దినేశ వహ్ని విష్ణు శివ పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాదులతో పూజించాడు. పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా వినయవినమితగాత్రుడై భక్తిప్రపత్తులతో ఆర్చించాడు. మునీంద్రులూ దేవతలూ బ్రాహ్మణులూ బృహస్పతి హరి హరుడు అందరూ ఎట్టఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాతపుష్పం తెచ్చి దానిమీద చందనం జల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం ఆది.

వెయ్యిరేకుల తామరపువ్వు దుద్దుమీద కూర్చునే తల్లిని, కోటి శరత్పూర్ణిమలనాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయిగొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఊపాసిన్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిరయౌవతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరియై సర్వసంపదలనూ ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను.

ఇలా స్తుతించి షోడశోపచారాలూ మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్యసింహాసనం సమర్పించి, పుష్పచందనదూర్యాది సంయుతంగా గంగోదకాలనూ శంఖతీర్థాలనూ అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి, ఆమలకీఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేహసౌందర్యవర్థకంగా సమర్పించి, విలువైన పట్టుచీరలు పెట్టి, రత్నాభరణాలు ఇచ్చి, పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపచేసి, జగచ్చక్షూరూపమూ తిమిరాపహమూ దీపాన్ని చూపించి, ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి, షడ్రసోపేతమూ అత్యంతరుచికరమూ నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నమూ పాయసమూ స్వస్తికమూ పక్వఫలాలూ కామధేనువిచ్చిన పాలూ పెరుగూ వెన్న నెయ్యి, చెరకు బెల్లం, గోధుమరవ్వతో బెల్లమూ పాలూ నెయ్యీ కలిపి వండిన (మిష్టాన్నం) ప్రసాదం - నివేదన చేశాడు.

శీతల వాయువులను విరజిమ్మే విసినకర్రనూ, కర్పూర సువాసితమై జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్నీ, సువాసితమూ సుశీతమూ పానీయాన్నీ, ఆచమనియాన్నీ మరో పట్టువస్త్ర యుగ్మాన్నీ, మరో రత్నభూషణాన్నీ, అన్ని ఋతువులలోనూ వాడిపోకండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్యపుష్పమాలికనూ, గంధాన్నీ శుద్దోదకాన్నీ, రత్ననిర్మిత - పుష్పచందనచర్చిత - వస్త్ర భూషిత మనోహర తల్పాన్నీ, భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవతా! ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో అపూర్వమూ దుర్లభమూ దేవభూషార్హమూ భోగార్హమూ అయిన ప్రతిద్రవ్యాన్నీ నీకు కానుకగా పూజావస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు.

ఇలా షోడశోపచారాలూ చేసి మహాలక్ష్మీమూలమంత్రాన్ని పదిలక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షంలాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీమాయా కామవాణీ బీజాక్షరపూర్వకంగా కమలావాసిన్యై స్వాహా, ఇది వేదోక్త మంత్రరాజం. కుబేరుడు దక్షుడు సావర్ణి మనువు మంగళుడు సప్తద్వీపాధిపతులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కేదారనృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహసిద్ధులు పొందారు.

మంత్రం సిద్దించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్యవిమానం మీద వరదాభయహస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తద్వీపాలకూ వ్యాపిస్తున్నాయి. రత్న భూషణాల ధగధగలలో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది. భకానుగ్రహకాతర, మెడలో రత్నమాల కోటిచంద్రసమప్రభంగా మెరుస్తోంది,

పురందురుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తనువు పులకించింది. బ్రహ్మదేవు డుపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి నారాయణికి కృష్ణప్రియకు మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు పద్మాస్యకు పద్మాసనకు పద్మినికి వందనం. వైష్ణవికి సర్వసంపత్స్వరూపిణికి సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి హర్షదాత్రికి కృష్ణవక్షఃస్థితకు కృష్టేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభాస్వరూపకు సంపదధిష్ఠానదేవతకు మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు బుద్దిదాయికి శిరసువంచి అయిదు పదిచేస్తున్నాను.

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమోనమః ।
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః ॥

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥

సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః

హరిభక్తి ప్రదాత్య్రై చ హర్షదా
త్య్రై నమోనమః ॥

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః

చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభవే ॥

సంపత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః

నమో బుద్దిస్వరూపాయై బుద్దిదాయ్యై నమోనమః ॥

వైకుంఠంలో మహాలక్ష్మివి. క్షీరసాగరంలో మాయాలక్ష్మివి. అమరావతిలో స్వర్గలక్ష్మివి. మహారాజులకు రాజ్యలక్ష్మివి. ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో సురభిగా(కామధేనువు) ఆవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి. దేవమాత అదితివి నువ్వే. కమలవు, కమలాలయవు. హవిర్దానసమయంలో నువ్వు స్వాహాదేవివి. కవ్యదానంలో స్వధాదేవివి. నువ్వు విష్ణురూపవు, సర్వాధార వసుంధరవు, శుద్ధసత్త్వస్వరూపవు, నారాయణపరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్యప్రదాయినివి. పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారమూ భస్మప్రాయమూ ఆయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి. సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థకామమోక్షాలకు కారణరూపిణివి. శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలుకుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వుమాత్రం అందరికీ అన్నివేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు.

తల్లిలేని శిశువుల్ని కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వులేని వాడిని కాపాడేందుకు ఇంక ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నాపట్లకూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యిజారిపోయింది. ఓ సనాతనీ! దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వూ నీ అనుగ్రహమూ నావెంట లేనంతవరకూ నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వసంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్నీ జ్ఞానాన్నీ నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్నీ ప్రభావాన్నీ రాజ్యాధికారాన్నీ పరాక్రమాన్నీ ఐశ్వర్యాన్నీ జయాన్నీ మళ్ళీ నాకు అందించు.

దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవలా విలపించాడు. బ్రహ్మేశాన శేషధర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షానా దేవతల పక్షానా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు.

మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది. దేవతలకు అభీప్సితవరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులూ ఇంద్రాదిదేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమతమ లోకాలకు వెళ్ళారు.

నారదా! పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని త్రిసంధ్యలలోనూ పఠించేవారు కుబేరులవుతారు. రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. అయిదు లక్షలసార్లు భక్తితో పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అటుపైని మరొక్కనెల సిద్దసోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడూ మహాసుఖి అవుతాడు.

శౌనకాది మహామునులారా! మహాలక్ష్మీ ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి. నారాయణమహర్షిని వేనోళ్ళ కొనియాడాడు.

నారాయణమహర్షీ! నువ్వు సాక్షాత్తూ నారాయణుడివి. రూప గుణ తేజో యశః కాంతులలో సమానుడివి. జ్ఞానులలో యోగులలో సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో తపస్వులలో మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని ఆద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే ఆది వినిపించు. వేదపురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు.

నారదా! అటువంటివి చాలా ఉన్నాయి. ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు. అదే చెబుతాను.

మహర్షీ! హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారుగదా! వారి చరిత్ర ఇంతవరకూ నేను వినలేదు. నీనోటినుంచి వినాలని ఉంది.

స్వాహా వృత్తాంతం


No comments:

Post a Comment

Sthandila Kunda Samskaralu - స్థండిల కుండ సంస్కారాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - స్థండిల కుండ సంస్కారాలు నారదా! ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండసంస్కారాలు చెబుతాను. తెలుసుకో. మూలమంత్రంతో వీక...