నారదా! ఇక స్వధాదేవి ఉపాఖ్యానం చెబుతాను విను. ఇది పితృదేవతలకు తృప్తి కలిగిస్తుంది. శ్రాద్ధాన్నఫలాన్ని వృద్ధిపాందిస్తుంది. సృష్టికి ఆదిలో బ్రహ్మదేవుడు పితృగణాలను ఏడింటిని సృష్టించాడు. అందరూ తేజస్వరూపులు, మనోహరులు, సుఖస్వరూపులు. వారికి తర్పణాలూ శ్రాద్దాన్నమూ ఆహారంగా కల్పించాడు. బ్రాహ్మణులకు తర్పణపర్యంతమైన స్నానమూ, దేవపూజనపర్యంతమైన శ్రాద్దమూ త్రిసంధ్యాంతమైన ఆహ్నికమూ వేదవిహిత కర్మలు, ముప్పాద్దులా శ్రాద్ధతర్పణాలు చెయ్యాలి. బలిప్రదానం చెయ్యాలి. బ్రహ్మయజ్ఞ (వేదపఠన) చెయ్యాలి. ఇవి చెయ్యకపోతే మైలపడ్డట్టే. ఏ కర్మాచరణకూ అర్హుడు కాడు.
బ్రహ్మ ఇలా నియమాలు ఏర్పరిచి పితృదేవతలకు ఆకలి దప్పికలు లేకుండా బ్రాహ్మణులు నిత్యమూ తర్పణాలు విడిచి పెట్టేలా చూశాడు. బ్రాహ్మణులు అలా మంత్రపూర్వకంగా ఇస్తూనే ఉన్నారుగానీ ఎక్కడ ఏలోపం జరుగుతోందో అవి పితృదేవతలకు అందడంలేదు. వాళ్ళు హాహాకారాలు చేస్తూ బ్రహ్మదేవుడికి విన్నవించుకున్నారు.
చతుర్ముఖుడు ఒక మానసపుత్రికను సృష్టించాడు. రూపయౌవన సంపన్న, చంద్రవదన, విద్యావతి, గుణవతి, రూపవతి, శ్వేతచంపకంలాగా నిగనిగలాడుతోంది. రత్నభూషలు ధగధగలాడుతున్నాయి. ఆవిడ పరాప్రకృతిశక్తిలో ఒక అంశం. శుభప్రదంగా చిరునవ్వులు చిందిస్తోంది. పలువరుస తీర్చిదిద్దినట్టుంది. లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. ఆవిడకు స్వధాదేవి అని నామకరణం చేసి పితృదేవతలకు భార్యగా సమర్పించాడు. అవిడ పద్మాస్య, పద్మలోచన, పద్మజ, పద్మపాద, తుష్టిరూపిణి. ఆవిడను స్వీకరించి పితృదేవతలు సంతోషించారు. తృప్తి చెందారు.
అటుపైని బ్రాహ్మణులకు రహస్యంగా ఒక ఉపదేశం చేశాడు. పితృదేవతలకు మీరు ఇచ్చే తర్పణ శ్రాద్దాన్నాలను స్వధాంతంగా మంత్రాలు ఉచ్చరిస్తూ సమర్పించండి. అప్పుడే అవి పితృదేవతలకు అందుతాయి అని చెప్పాడు. అప్పటినుంచీ విప్రులందరూ అలాగే చెయ్యనారంభించారు. అవి పితృదేవతలకు ఆందనారంభించాయి. వారు ఆకలిదప్పులు తీరి ఆనందించారు.
దేవతలకు హవిర్దానాలు చేసేటప్పుడు మంత్రాలు స్వాహాంతంగా ఉండాలి. పితృదానాల్లో స్వధాంతంగ ఉండాలి. ఈ దేవ పితృయజ్ఞాలు అన్నింటా దక్షిణాదేవి తప్పదు. అదక్షిణగా చేసే యజ్ఞం నిష్ఫలం. మృతప్రాయం.
శరదృతువులో కృష్ణత్రయోదశినాడుగానీ మాఘమాసంలోగాని శ్రాద్దసమయాలలోగానీ ముందుగా స్వధాదేవిని పూజించి అటుపైని పితృయజ్ఞాలు జరపాలి. అలా చేయకుండా అహంకరించి తర్పణాలు విడిచినా శ్రాద్దాన్నం (పిండం) పెట్టినా అది పితృదేవతలకు అందదు. కర్తకు ఫలం దక్కదు.
బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థితయౌవనామ్ ।
పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్దానాం ఫలదాం భజే ॥
ఇది స్వధాధ్యానశ్లోకం. దీన్ని పఠించి సాలగ్రామ శిలలోగానీ మంగళకలశంలోగానీ స్వధాదేవిని ఆవాహన చెయ్యాలి. అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి. మూలమంత్రం జపించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా - అనే మూలమంత్రంతో పూజచేసి స్తుతించి నమస్కరించాలి. తొట్టతాలిగా బ్రహ్మదేవుడే స్వధాస్తుతి చేశాడు.
పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజజీవనరూపిణీ ।
శ్రాద్దాధిష్ఠాతృదేవీ చ శ్రాద్దాదీనాం ఫలప్రదా ॥
నిత్యా త్వం సత్యరూపాసి పుణ్యరూపాసి సువ్రతే ।
ఆవిర్భావ తిరోభావౌ సృష్టౌ చ ప్రళయే తవ ॥
ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా ।
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ॥
కర్మపూర్త్యర్థమేవైతా ఈశ్వరేణ వినిర్మితాః ॥
స్వధాదేవీ! నువ్వు పితృదేవతలకు ప్రాణసమానవు. బ్రాహ్మణులకు జీవనప్రదవు, శ్రాద్ధాధిష్ఠాన దేవతవు, శ్రాద్ధతర్పణ ఫలప్రదవు, నిత్యవు, సత్యవు, పుణ్యరూపవు. ఓ సువ్రతా! సృష్టివేళ నువ్వు
ఆవిర్భవించి ప్రళయవేళ తిరోధానం చెందుతావు. కర్మిష్ఠులకోసం నువ్వూ స్వాహాదక్తిణలూ ఆవిర్భవించారని వేదాలు నిరూపించి ప్రశంసించాయి. కర్మకాండకు పరిపూర్ణత సిద్ధించడంకోసమే ఈశ్వరుడు మిమ్మల్ని నిర్మించాడు.
ఇది బ్రహ్మదేవుడు తన కొలువులో చేసిన స్వధాస్తుతి. దీన్ని పఠించినవారికి సర్వవాంఛలూ నెరవేరతాయి. స్వధా అని ఉచ్చరిస్తే చాలు తీర్థస్నానఫలం దక్కుతుంది. సర్వపాపాలూ తొలగిపోతాయి. వాజపేయఫలం లభిస్తుంది. స్వధా స్వధా స్వధా అని ముమ్మార్లు ఉచ్చరిస్తే శ్రాద్ధ - బలి - తర్పణ ఫలాలు అందుతాయి. శ్రాద్ధకాలంలో స్వధాస్తోత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వింటే శ్రాద్ధఫలం దక్కుతుంది. ముప్పొద్దులా స్వధా స్వధా స్వధా అని మూడేసిసార్లు ధ్యానిస్తే ప్రియాసంగమ పుత్రప్రాప్తులు ఫలాలుగా చెబుతున్నారు. స్వధా స్తోత్రపఠనంవల్ల సకల తీర్థాలలోనూ స్నానంచేసిన పుణ్యం తప్పక లభిస్తుంది - అని చెప్పి బ్రహ్మదేవుడు ఆ సౌందర్యరాశి స్వధాదేవిని పితృదేవతలకు అప్పగించాడు. వారు స్వీకరించి ఆనందించారు.
No comments:
Post a Comment