Thursday, July 30, 2026

Vindhyavasini - వింధ్యవాసిని

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము - వింధ్యవాసిని

శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్నిర్మాత. సృష్టికర్త. లోకపితామహుడు. చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠినుంచి స్వాయంభువమనువు మానసపుత్రుడుగా అవతరించాడు. ఆ మనువుకి ధర్మపత్నిగా ధర్మస్వరూపిణి శతరూప ఆవిర్భవించింది. కొంతకాలం గడిచాక క్షీరసముద్రతీరంలో పరమపావన ప్రదేశంలో తపస్సు చేయనారంభించాడు. మహాభాగ్యప్రద దేవిని ఆరాధించాడు. మట్టితో దేవీమూర్తిని తయారుచేసి ఉపాసించాడు. వాణీబీజసహితంగా మహామంత్రాన్ని మనస్సులో జపించసాగాడు. నిరాహారుడై శ్వాసను బంధించి ఒంటికాలిమీద వర్షంలో నిలిచి నూరేళ్ళు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరం దేవీపాదపద్మాలనే హృదయంలో ధ్యానిస్తూ స్థావరమైపోయాడు. అమ్మవారికి అనుగ్రహం కలిగింది. దర్శనమిచ్చింది. వరంకోరుకోమంది. ఆ మహారాజు ఆనందపరవశుడు అయ్యాడు. అమరులకైనా అందని వరాలు ఆడిగాడు.

జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే ।
మాన్యే పూజ్యే జగద్దాత్రి సర్వమంగళమంగళే ॥

దేవీ! జయము జయము. విశాలాక్షీ! సర్వాంతర్యామీ! మాన్యా! పూజ్యా! జగన్మాతా! సర్వమంగళా! జయము - జయము. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించగలుగుతున్నాడన్నా శ్రీహరి పరిపాలిస్తున్నాడన్నా హరుడు సంహరించగలుగుతున్నాడన్నా ఇంద్రుడు ముల్లోకాలనూ శాసిస్తున్నాడన్నా - అంతా నీ కృపాకటాక్షమే. దిక్పాలకులతోసహా అందరూ నీ అంశలే. నీ వల్లనే వారంతా శక్తిమంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరమిస్తానంటే నాజన్మ ధన్యమయ్యింది. నాదొక్కటే వరం. బ్రహ్మమానసపుత్రుడుగా నేను చెయ్యబోయే సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుగాక! నేను జపించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించినా వారికి సత్వరంగా సకలసిద్దులూ కలుగుగాక! ఈ సంవాదాన్ని విన్నా చదివినా భుక్తిముక్తులు లభించుగాక! జాతి స్మరత్వం వక్తృత్వం సౌష్టవం జ్ఞానసిద్ధి కర్మమార్గసంసిద్ధి కలుగుగాక! పుత్రపౌత్రాదులతో వంశాభివృద్ది జరుగుగాక!

మహాదేవి ఈ వరాల నన్నింటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కంటకమగుగాక, నీ పుత్రులు వంశకరులగుదురుగాక, నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వాయంభువ మనువు చూస్తుండగానే వింధ్యపర్వతాలకు వెళ్ళిపోయింది.

నారదా! వింధ్యాద్రిని నువ్వు ఎరుగుదువుగదా! ఒకప్పుడు ఆకాశానికి ఎదిగి సూర్యుడి రథాన్ని అడ్డుకొని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం. ఆ పర్వతంమీద అమ్మవారు నివసిస్తుంది. కనకనే వింధ్యవాసినీదేవి అనేపేరు ఏర్పడింది.

నారాయణమహర్షి మాటలుగా సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న శౌనకాది మహామునులకు వింధ్యపర్వతం కథ తెలుసుకోవాలి అనిపించింది.

సూతమహార్షీ! వింధ్యాచలం ఏమిటీ, ఆకాశానికి ఎదగడమేమిటీ, సూర్యరథాన్ని ఆపడమేమిటి, ఎందుకు ఆపినట్టూ ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. అలా ఎదిగిపోయిన పర్వతాన్ని మళ్ళీ ఎవరు కుదించారు? అంతా వివరంగా చెప్పు. నీ ముఖచంద్రమండలంనుంచి జాలువారుతున్న ఈ దేవీచరితమనే అమృతాన్ని ఎంతగ్రోలినా తృప్తి తీరడంలేదు. సవిస్తరంగా తెలియజెయ్యి అని అభ్యర్థించారు.

వింధ్యాచల వృత్తాంతం



No comments:

Post a Comment

Sthandila Kunda Samskaralu - స్థండిల కుండ సంస్కారాలు

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - స్థండిల కుండ సంస్కారాలు నారదా! ఇక్కడ చెయ్యవలసిన స్థండిల కుండసంస్కారాలు చెబుతాను. తెలుసుకో. మూలమంత్రంతో వీక...