Monday, September 7, 2026

Sree Maha Bhagavathamu Part 12 - శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము

శ్రీరస్తు శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము

శ్రీ మరుదశనపతిశయన!, కామిత మునిరాజ యోగి కల్పద్రుమ! యు
ద్దామ! ఘనజనకవరనృప, జామాతృవరేశ! రామచంద్రమహీశా!

గాలిని ఆహారంగా భుజించే సర్పములకు రాజైన ఆదిశేషుడు పాన్పుగా కలవాడా! కోరికతో ఆశ్రయించిన మునులకు, రాజులకు, యోగులకు కల్పవృక్షం వంటివాడా! ఉన్నతుడా! ఘనుడైన జనక మహారాజుయొక్క అల్లుండ్రలో ఘనత వహించినవాడా! రామచంద్ర ప్రభూ!

('మునిరాజయోగి' అన్నపుడు 'మునిశ్రేష్ఠులైన యోగులకు' అని కూడా చెప్పవచ్చు. జనక మహారాజుకు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు అల్లుండ్రే. అయితే వీరిలో శ్రీరాముడు జామాతృవరేశుడు.)

పూజనీయమైన గుణాలచేత గొప్పవారైన శౌనకాది మునులకు సమస్త పురాణాలను వివరించి చెప్పే సామర్థ్యం గల సూతుడు ఈ విధంగా చెప్పాడు. పరీక్షిన్మహారాజుకు శుకయోగి శ్రీకృష్ణుడు అవతారం చాలించేవరకు జరిగిన జన్మకర్మలు చెప్పగా విని, సంతోషపడి, 'మహాత్మా! శ్రీమన్నారాయణుని కథలను, ఆయన గుణాలను, ఆచార విధులను, జీవాత్మభేదాన్ని, శ్రీహరిని పూజించవలసిన విధానాన్ని జ్ఞానయోగాన్ని అనుష్ఠించే పద్ధతిని, ఇంకా ఇటువంటి వాటి నెన్నిటినో చెప్పి నన్ను విజ్ఞానిని చేసి ఆదరించావు. ఇంక భవిష్యత్తులో జరగబోయే పనులను కూడా తెలియజేయి అని రాజు కోరాడు. శుకమహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు.

శుకయోగి పరీక్షిత్తునకు భావికాలగతులు జెప్పుట


 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sri Krishna Balaramulu Vaikunthamuna Karuguta - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట

పరీక్షిన్మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అన్యాయవర్తులైన దుర్మార్గులను చంపి, న్యాయవర్తులైన సజ్జనులను కాపాడి బలరామునితో కలసి ద్వారకనుండి వెళ్లిపోగా యాదవులు మద్యపానంచేసి మదించి ఈర్ష్యతో సరదాగా తమలో తాము పోట్లాడుకోవడం మొదలుపెట్టారు.

(అది నిజమైన పోట్లాట (యుద్ధం) గా మారింది). ఏనుగులు, గుర్రాలు, రథాలు, కాల్బలం (సైనికులు) అనే చతురంగ బలాలతో కూడి అడ్డులేకుండా యుద్దానికి తలపడ్డారు. మునులశాపం కారణంగా ఎత్తెన తుంగపోగులతో అలసిపోయేలా కొట్టుకొంటూ, పొడుచుకొంటూ తలపడ్డారు. 

తుంగపోగులు వజ్రాయుధంతో సమానంగా తగలగా ముక్కలై, కూలిన మొండాలతో, వికలమైన శరీరాలతో, విరిగిన రథాలతో, ఒరిగిన బండ్లతో, నేలపై కూలిన గుర్రాలతో, ఒరిగిపోయిన ఏనుగులతో ఆ యుద్ధభూమి నిండిపోయింది. ఆ యుద్ధంలో యాదవులందరూ చనిపోవడం చూచి నవ్వుకొంటూ శ్రీకృష్ణుడు, బలరాముడు అలా అలా వెళ్లిపోయారు.

అలా వెళ్లి, బలరాముడు ఒక దారిలో పోయి యోగమార్గంతో ఆదిశేషునిలో కలిశాడు (బలరాముని అవతారం సమాప్తమైంది. శ్రీకృష్ణుడు మరో మార్గంలో వెళ్లి ఒక పొదరింటి మాటున (పడుకొని) విశ్రాంతి తీసుకొంటూ ఒక కాలిమీద మరొక కాలుపెట్టి కదిలిస్తూ వినోదిస్తూ ఉండగా ఒక బోయవాడు వేటకు వచ్చి దిక్కులన్నీ నిక్కి చూస్తూ ఉంటే చెట్టుమాటున ఆ పరమపురుషుని కదలుతున్న కాలు లేడి చెవివలె కనిపించింది. 

వెంటనే వాడు బాణాన్ని వింటియందు చేర్చి గురిచూసి వదిలాడు. ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు హాహాకారాలు చేస్తూ కదులుతూ ఉంటే, బోయవాడు దగ్గరకు వచ్చి జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడని తెలుసుకొని భయంతో 'మహాపరాధిని, పాపాత్ముడను, వక్రబుద్దిని' అని అనేక విధాలుగా దుఃఖిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటే వాడిని చూచి కృష్ణుడిలా అన్నాడు. 

'నువ్వెందుకు దుఃఖిస్తావు? పూర్వజన్మలలో చేసిన కర్మలు ఎంతటి వారికైనా అనుభవించవలసిందే. తప్పదు. నీవు కారణమాత్రుడవు అంతే'. అని తెలుపగా వాడు “గొప్ప తప్పులు చేసినవాళ్లు ఊరికే పోరు. దేవతలకు, గురువులకు, వైష్ణవులకు ద్రోహం చేసినవారు ఉండడానికి వీలుకాదు” అని పవిత్రమైన మనస్సుతో ప్రాయోపవేశదీక్షకు పూనుకొని ప్రాణాలు వదలి వైకుంఠానికి వెళ్లాడు. అప్పుడు ...

(ఈ వచనంలో ప్రధానాంశం బలరామకృష్ణుల నిర్యాణం. మూలంలో వివరంగా ఉన్న విషయాలను నారయ ఈ వచనంలో సంగ్రహించాడు. మూలభాగవత విషయాలను చూస్తే అవి తెలుస్తాయి.)

తరువాత శ్రీకృష్ణుని రథసారధియైన దారుకుడు అందమైనవాడూ, ఏకాగ్రతతో ఆలోచిస్తున్నవాడూ, సర్వజ్ఞుడూ, మేరుపర్వతం వంటి ధీరుడూ, రాక్షస సంహారకుడూ, ఏకాంతంగా ఉన్నవాడూ అయిన శ్రీకృష్ణుని ఎంతో ప్రీతితో చూశాడు.

అలాచూసి మిక్కిలి భయభక్తులతో చేతులు జోడించి దారుకుడు ఇలా అన్నాడు.

శ్రీకృష్ణా! నిన్ను కనుగొనలేని కన్నులు వ్యర్థాలు. నిన్ను వర్ణించని నాలుక రసహీనం. నిన్ను చూడని రోజులు నిందింపదగినవి. కనులారా చూచి నన్ను ఆదరించు.

అంటూ దారుకుడు దుఃఖంతో ఇలా విన్నవించాడు. 'యాదవసమూహం (సముద్రమంత యాదవసమూహం) నశించింది. చుట్టాలు, గురువులు, మిత్రులు అటూ ఇటూ చెల్లాచెదరైపోయారు. ద్వారకకు పోయి మిత్ర జనంతో ఏమని చెప్పేది?' అని అంటూ ఉన్న సమయంలోనే శ్రీకృష్ణుని దివ్యమైన ఆయుధాలూ, దివ్యమైన రథాలూ, గుర్రాలూ మాయమైపోయాయి. 

శ్రీకృష్ణుడు దారుకునితో 'అక్రూరునికి, విదురునికి ఈ విషయమంతా చెప్పు. అర్జునుడి వద్దకు వెళ్లి స్త్రీలనూ, పిల్లలనూ, గురువులనూ, వృద్ధజనాన్ని హస్తినాపురానికి తీసుకొని పొమ్మని చెప్పు. ఇక వెళ్లు' అన్నాడు. 

దారుకుడు తిరిగివెళ్లి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు వివరంగా తెలియజేశాడు. అలా చేసేలోపలే ద్వారకానగరం పరిపూర్ణజలంలో మునిగిపోయింది. ఎవరికీ ప్రవేశించడానికి వీలు లేకపోయింది. 

అప్పుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నూరుకోట్ల సూర్యుల దివ్యతేజస్సుతో బయలుదేరి నారదాది మునుల సమూహం, బ్రహ్మరుద్రాది దేవతలు జయజయ నినాదాలతో(తోడుగా) కదలిరాగా తన స్థానానికి(వైకుంఠానికి) వెళ్లిపోయాడు. ఆ నారాయణుని (శ్రీకృష్ణుని) మూర్తి (విగ్రహం) సముద్ర ప్రాంతంలో జగన్నాథుని రూపం పొంది ఉంది అని శుకుడు పరీక్షిత్తు చెప్పెనని తెలిపి -

ఈ శ్రీకృష్ణుని కథను వినినా, వ్రాసినా సంపద, కీర్తి అదృష్టం తప్పక కలుగుతాయి. అలాంటి మానవుడు దీర్ఘాయువుతో, లోకులు మెచ్చగా లోకంలో జీవిస్తాడు. (ఫలశ్రుతి)

నవ్వుమోమూ, చక్కని నడుమూ, నల్లని దేహమూ, లక్ష్మీదేవికి నివాసస్థానమైన వక్షమూ, పెద్దబాహువులూ, అందమైన చెవిపోగులుగల చెవులూ, మదగజగమనమూ, నల్లనిజుట్టూ, దయారసంతోకూడిన చూపూ కలిగిన విష్ణుమూర్తి (శ్రీకృష్ణుడు) ఆనందం కలిగేటట్లు కనులు మూసినప్పుడూ, తెరచినప్పుడూ ప్రత్యక్షమగును గాక.

పద్మాలవంటి కనులు గలవాడా! సద్గుణాలతో శోభిల్లేవాడా! జనకరాజుచే పొగడబడినవాడా! ప్రకాశించే కీర్తి అనే అమృతంలో ఆవరించబడిన బ్రహ్మాండభాండం కలవాడా! రఘువంశానికి తిలకం వంటివాడా!

భూపుత్రి సీతతో ఆనందించువాడా! ధర్మమార్గాన్ని అనుసరించి చరించువాడా! సాటిలేని నీతికలవాడా! దేవతలకు శత్రువులైన రాక్షసులను సంహరించువాడా! గురువులకూ, పండితులకూ సుఖం కలిగించేవాడా! కోసల దేశానికి ప్రభువా! దేవతల భయాన్ని పోగొట్టువాడా! పండితుల హృదయాలలో విహరించువాడా! శ్రీరామా!

శ్రీ కృష్ణార్పణమస్తు 

శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Avadhuta - Yadusamvadamu - అవధూత - యదుసంవాదము

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - అవధూత - యదుసంవాదము

పద్మనాభుడైన శ్రీకృష్ణుడు ఉద్ధవుని మీద గల కూరిమితో ఇలా చెప్పాడు. ఒకరోజు యదురాజు దగ్గరకు ఎక్కడనుండో ఒక యోగి వచ్చాడు. అతడు అడ్డులేక అన్ని దిక్కులూ తిరిగేవాడు. ఎప్పుడూ సంతృప్తితో ఉంటాడు. ఈశ్వరుడివేషం ధరించి ఉన్నాడు. యదురాజు ఆ యోగిని ఎక్కడనుండి వచ్చావని అడిగాడు. అందుకా యోగి స్పష్టంగా ఇలా అన్నాడు.

అవధూత ఇలా అన్నాడు. “నిర్మలమైన విజ్ఞానంలో నేర్పరులైన యోగ్యులు ఇరవైనాలుగుమంది నాకు గురువులు అయినారు. వారివల్ల నేను విజ్ఞానినైనాను”.

(అవధూత - వర్ణాశ్రమధర్మాలను వదిలిపెట్టి, శీతోష్ణపరిస్థితులను తట్టుకొంటూ, దేహసంస్కారాలు లేకుండా కేవలం బ్రహ్మనిష్ఠతో మెలిగేవాడు అవధూత).

అంత యాదవరాజు లోభం మోహం మొదలైన వాటిని వదిలిపెట్టి శరీరి ఏ రకంగా విష్ణువును చేరవచ్చునో తెలుపుమనగా అవధూత ఇలా అన్నాడు.

సత్ప్రవర్తనగల ఓ రాజా! పరుల సొమ్మును, పరుల భార్యలను కోరకుండా; ఇతరులను నిందించకుండా, ఇతరుల వస్తువులమీద అభిలాష లేకుండా; ముసలితనంవల్ల రోగాలు రాకముందే; శరీరం వణకకముందే; కంఠంలో కఫం చేరకముందే; శక్తియుక్తులు సన్నగిల్లకముందే; దృఢమైన భక్తిభావంతో దానవాంతకుడైన శ్రీకృష్ణునిపాదపద్మాలను భజిస్తూ తరగని ఆనందాన్ని ప్రతిరోజూ ఎవడు పొందుతాడో అలాంటివాడు భవబంధాలనుండి విముక్తుడు అవుతాడు.

భార్యాపుత్రధన ధాన్యాదులలో పెక్కువిధాల మక్కువను పెంచుకొన్న మనుష్యుడు మిక్కిలి భయంకరమైన వియోగం వల్ల కలిగిన దుఃఖంతో తెలివిని పోగొట్టుకొని చిక్కువడి, నీతి వివేకాలు లేక మానసిక భారంతో నశించి మగపావురం వలె నిజంగా పోతాడు (మరణిస్తాడు).

దీనికొక ఇతిహాసం(కథ) ఉంది. విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక గూడు నిర్మించుకొని పరస్పర మోహంతో ఉన్నది. కొంతకాలానికి ఆ పావురందంపతులకు సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలు అపరిమితంగా అటూఇటూ తిరుగుతూ ఉండగా సంతోషంతో, భోగానుభవంతో కొన్ని నెలలు గడిచాయి. 

ఇలా ఉండగా కాలగతి వలన ఒక బోయవాడు వచ్చి వలలు వేశాడు. ఆ వలలలో ఆడపావురం, పిల్లలూ తగుల్కొన్నాయి. మగపావురం ధైర్యం కోల్పోయి భార్యాబిడ్డలమీద గల ప్రేమాతిశయంతో తానుకూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించిపోయింది. 

కాబట్టి దేనియందూ ఎక్కువ మోహం పనికిరాదు. కనుక యోగీంద్రులైనవారు ఎప్పుడూ విష్ణువును ధ్యానిస్తూ భూమి, గాలి, ఆకాశం, నీళ్లు, అగ్ని చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, ముంగిస, లకుముకిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలుచేసేవాడు, సాలెపురుగు, కందిరీగ మొదలైన వాటి గుణగణాలు తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉంటారు.

భూమి మొదలుగా శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ 'నాకు తెలియాలి. నిర్మలమైన బుద్ధితో వీటినిగురించి తెలియజేయ'మని ఉద్ధవుడు అడిగాడు. అప్పుడు వినయవంతుడైన ఉద్ధవునితో శ్రీకృష్ణుడు వెంటనే చెప్పాడు.

ఈ విధంగా భూమివల్ల సహనం, వాయువు(గాలి) వల్ల గొప్పపరోపకారం, ఆకాశంవల్ల కాలం సృజించిన గుణాలతో సాంగత్యం లేకపోవడం. నీటివల్ల ఎప్పుడూ శుచిగా ఉండడం. అగ్నివల్ల నిర్మలంగా ఉండడం, చంద్ర సూర్యులవల్ల వృద్ధి క్షయాలందు సమభావం కల్గి ఉండడం, పావురంవల్ల భార్యాబిడ్డల మీద ప్రేమ, కొండచిలువవల్ల ఇష్టంగా తిరుగుతూ అందిన ఆహారాన్నిమాత్రమే గ్రహించడం, సముద్రంవల్ల ఉత్సాహరోషాలు, మిడుతవల్ల యథాశక్తి అనుకూలకర్మలను ఆచరించడం, తుమ్మెదవల్ల సారంమాత్రమే గ్రహించడం, ఏనుగువల్ల స్త్రీ విముఖత, తేనెటీగవల్ల కూడబెట్టుకొనే గుణం, లేడివల్ల విచారపరత్వం, చేపవల్ల జిహ్వాచపలత, ముంగిసవల్ల దొరికినదానితో తృప్తిపడడం, లకుముకిపిట్టవల్ల మోహత్యాగం, బాలునివల్ల విచారం విడిచి పెట్టడం. బాలికవల్ల సాంగత్యం విడిచిపెట్టడం, బాణాలుచేసేవాడివల్ల ఏకాగ్రత, పామువల్ల పరుల ఇంట నివసించడం, సాలెపురుగువల్ల సంసారబంధంలో చిక్కకుండడం, కందిరీగవల్ల లక్ష్యజ్ఞానం విడువకుండా ఉండడం అనే వీటి గుణాలను తెలుసుకోవాలి.

ఈ గుణాలు గ్రహించి కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యాలనే ఆరుశత్రువులను జయించి; ముసలితనం, మరణం రాకుండా వాయువును(గాలిని) వశంచేసుకొని శరీరం పవిత్రంగా ఉండడానికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలనే ఆరు కర్మలమీద ఆసక్తి గలవాడై పట్టణాలను, గ్రామాలను, నగరాలను వదలి; కొండలయందు, అడవులయందు తిరుగుతూ; దేహం నిలవడానికి కావలసిన కొద్దిపాటి ఆహారం గ్రహిస్తూ సంతోషం, దుఃఖం రెంటినీ సమానంగా భావిస్తూ లోభాన్ని మోహాన్ని వదిలిపెట్టి; ఇంద్రియాలను జయించి; నేను తప్ప మరొకటి తెలియక ఆత్మనిష్ఠతో పవిత్రమైన మనస్సు కలిగిన యోగి నాలో కలుస్తాడు కాబట్టి...

మోహవశుడై ధనవాంఛ అనే ప్రవాహంలో చిక్కుకొని క్రౌర్యానికి వశుడైన మనుష్యుడు ఎప్పుడూ దైన్యంతో దేహాన్ని శ్రమకు గురిచేస్తాడు.

దీనికి నిదర్శనంగా ఒక ప్రాచీనమైన కథ ఉంది. శ్రద్ధతో విను. మిథిలానగరంలో పింగళ అనే ఒక వేశ్యారత్నం ఉంది. ఆమెవలన నాకు కొంత పరిజ్ఞానం కలిగింది. అది ఎలాగంటే - ఆమె డబ్బుమీద ఆశతో తన భర్తను మోసగించి ధనమిచ్చే మరొకనిని చేరదీసింది. వాడిని తన ఇంటిలోనికి తీసుకొనిపోయి రాత్రంతా నిద్రలేకుండా గడిపింది. పట్టణంలోనూ, బజారులలోనూ తిరుగుతూ నిద్రలేకపోవడంవల్ల నీరసపడింది. ధనవ్యామోహంలో పడి తిరిగి తిరిగి బడలిక చెందింది. 

కడకు తనను సుఖపెట్టువాడే భర్త అని ఆలోచించింది. శ్రీమన్నారాయణుని గురించి ఇలా చింతిస్తే ఆయన మోక్షం ప్రసాదిస్తాడుగదా అని భావించింది. తన శయనాగారం, ఇతర సంపదలు త్యజించింది. వెంటనే వాసుదేవుని పాదపద్మాలకు నమస్కరించాలనే కోరిక కలదై శరీరం మెరుపువలె చంచలమైనదని, అశాశ్వతమైనదని నిశ్చయించుకొని పరతత్త్వంపై మనస్సును లగ్నంచేసి మోక్షం పొందింది. అని తెలిపి

పాపరహితుడా! శరీరం స్థిరమైనదికాదని, మోహాన్ని విడిచి మానవుడు సిద్ధిపొందిన మునివలె ప్రవర్తిస్తూ, ఇల్లువిడిచి మోక్షసంపదను పొందుతాడు.

ఇంకా ఒక ప్రత్యేకతగల పురాతనపుణ్యకథ చెపుతాను విను. “కనకావతీపురంలో ఒక బ్రాహ్మణుని కూతురైన కన్యకారత్నం ఉంది. ఆమె మణిమయకంకణాలు ధరించి ఆనందంతో చుట్టాలకు అన్నం వండడానికి వరిధాన్యం దంచుతన్నది. దంచేటప్పుడు రోకలి బరువుతో చేతులలోని కంకణాలు ధ్వనిస్తూ మోగుతున్నాయి. ఆ ధ్వనిని అసహ్యించుకొని ఆ పరమపతివ్రత ఆ కంకణాలనన్నింటిని తీసివేసి ఒక్క కంకణాన్ని మాత్రమే ఉంచుకొన్నది. 

అందుచేత తొందరపడక భగవత్పరమైన, అనన్య మనస్సుతో నిర్మలమనస్కులై నరులు మోక్షం పొందుతారు. కాబట్టి అజ్ఞానం, జ్డానం నేను కల్పించిన మాయ అని తెలిసి, పశువులు వెళ్లే మార్గంలో పోకుండా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం అనే షడ్గుణాలు కలిగిన యోగీశ్వరులవలె సుఖం కోరకుండా ఉండేవాళ్లు ముక్తులవుతారు. సర్వం విష్ణుమాయగా తెలుసుకో” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేశాడు. 

అప్పుడతడు “దేవా! నీ రూపాన్ని ఎలా దర్శించవచ్చు” నని అడిగాడు. అందుకు శ్రీకృష్ణుడిలా అన్నాడు. “భక్తి భావనాపరుడై, దయాపరుడై, మితంగా మాట్లాడుతూ, అబద్దాలాడకుండా, చేసే కర్మలన్నీ నాకు అర్పించేవాడు భాగవతుడు అనబడతాడు. 

నా కథలు, నా జననం, నా పనులూ వింటూ నా దాసులైన భాగవతులను ఇంటికి తీసుకొని వెళ్లి, వాళ్లను స్నానం, పూజ, భోజనం, శయనం, ఆసనం మొదలైన సపర్యలచేత సంతోషింపజేసిన వాడయినా భాగవతుడు అనబడతాడు. ఇలా ఎంతకాలం జీవిస్తాడో అంతకాలం ఇదేవిధంగా ఉండేవాడు నా రూపంతో వైకుంఠంలో ఉంటాడు.

అదీగాక శుకుడు, సనకుడు మొదలైన యోగీంద్రులూ, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైన భాగవతులూ శాస్త్రాచారాలు ప్రేరేపించడంచేతనే కాకుండా విశేషించిన భక్తితో, ఏమరపాటు రాకుండా లక్ష్మీసమేతుడను, శంఖ చక్ర గదా శార్‌ఙ్గాదులతో కూడినవాడను అయిన నన్ను గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనవి సమర్పిస్తూ ఎప్పుడూ ధ్యానిస్తూ తెలుసుకొన్నారు. 

మధురాపురానికి బలరామునితో కలసి నేను వెళ్లినప్పుడు గోపికలు ఓపిక లేకే (విరహాన్ని భరించలేక) భక్తియోగంతో నన్నే ధ్యానించి ముక్తి పొందారు. ఇదే భక్తియోగ పద్ధతి అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పాడు. చెప్పగా -

భూపతివైన శ్రీకృష్ణా! ఉదాత్తచరిత్రా! ధ్యానం ఎలా నిలుస్తుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? దాని విషయమంతా వివరంగా నాకు తెలియజేయుమయ్యా!

అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. కొయ్యనడుమ అగ్ని సూక్ష్మరూపంలో ఉండే విధంగా అన్ని శరీరాల్లోనూ ఛేదింప వీలుకాని, దహింప వీలుకాని, ఎండింప వీలుకాని జీవుడు నివసిస్తూ ఉంటాడు. 

ఆ మాట విన్న ఉద్ధవుడు హరితో ఇలా అన్నాడు. 'సనకుడు, సనందుడు మొదలైన యోగీంద్రులకు యోగమార్గం ఏ విధంగా బోధించావు? ఆ మార్గం ఎలాంటిది?' చెప్పుమని కోరగా శ్రీకృష్ణుడిలా అన్నాడు. 

'సనకాదులు మొదట ఈ విషయం బ్రహ్మను అడిగారు. బ్రహ్మ తనకు కూడా తెలియదన్నాడు. దానికి వాళ్లు ఆశ్చర్యపడుతుంటే నేనా సమయంలో హంసరూపం ధరించి వాళ్లకు చెప్పిన విధం వినుము. 

పంచేంద్రియాలకు కనిపించే పదార్ధం అనిత్యం(అశాశ్వతం) నిత్యమైంది బ్రహ్మం మాత్రమే. జీవుడు తన కర్మల వల్ల పొందిన శరీరంతో సంసారంలో మమకారాన్ని వదిలిపెట్టి నిశ్చలమైన జ్ఞానంతో నా లోకమైన వైకుంఠం చేరుతాడు. కలలో దొరికే పదార్ధం నిజం కానట్లుగా కర్మానుభవం అయినంతవరకు శరీరం ఉంటుంది. అని సాంఖ్యయోగంలో సనకాదులకు తెలిపితే విని బ్రహ్మ మొదలైన దేవతలు తెలుసుకొన్నారు.

అది వాళ్ల వల్ల భూలోకంలో ప్రసిద్ధమైంది. కాబట్టి నీవు కూడా దానిని తెలుసుకొని పుణ్యాశ్రమాలకు వెళ్లు. నాయందు భక్తి కలవాడు, ఆసక్తి కలవాడు అయిన వాని పాదధూళిని తన శరీరానికి తాకించుకొనేవాడు; శంఖచక్రాదిముద్రలు ధరించిన వాళ్లకు, శ్రీ హరిదివ్యనామాలను (ఊర్ధ్వపుండ్రాలను) ధరించినవాళ్లకు అన్నమూ, నీళ్లూ ఇచ్చేవాడు; వాసుదేవునిభక్తులను చూచి సంతోషించేవాడు భాగవతుడు. 

అన్ని సాంగత్యాలను వదిలిపెట్టి అన్యం తెలియక నన్నే తలచే మానవుడికి భుక్తినీ, ముక్తినీ ఇస్తాను” అని ఆనతీయగా ఉద్ధవుడు ధ్యానమార్గస్వరూపాన్ని తెలుపుమన్నాడు. 

శ్రీహరి ఇలా చెప్పాడు. ఏకాగ్రచిత్తులై కరకమలాలు రెండు తొడలపై పెట్టి ముక్కుకొనపై దృష్టి నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయగతుని గావించి, పదునెనిమిది విధాలైన ధారణా యోగసిద్దులను తెలిసికొని, వాటిలో అణిమ మున్నగు వాటిని ముఖ్యసిద్ధులుగా గ్రహించి, ఇంద్రియాలను బంధించి, మనస్సును ఆత్మలోచేర్చి, ఆత్మను ఆత్మతో లగ్నంచేసి బ్రహ్మపదాన్ని పొందే భాగవతశ్రేష్ఠులు ఇతర విషయాలు మాని నన్ను పొందుతారు.

పూర్వం పాండురాజు కొడుకైన అర్జునుడు యుద్ధరంగంలో విషణ్ణుడై ఇలాగే అడిగితే అతనికి నేను చెప్పిన విధం నీకు తెలియజేస్తాను. చరాచరాత్మకమైన లోకమంతా నారూపంగా భావించి, భూతాలలో ఆధారభూతం; సూక్ష్మాలలో జీవుడు; జయింపరాని వాటిలో మనస్సు; దేవతలలో బ్రహ్మ వసువులలో అగ్ని, ఆదిత్యులలో(దేవతలలో) విష్ణువు; రుద్రులలో శివుడు; బ్రహ్మలలో భృగువు; ఋషులలో నారదుడు; ఆవులలో కామధేనువు; సిద్ధులలో కపిలుడు; రాక్షసులలో ప్రహ్లాదుడు; గ్రహాలలో(నక్షత్రాలలో) చంద్రుడు; ఏనుగులలో ఐరావతం; గుర్రాలలో ఉచ్చైశ్శ్రవం; సర్పాలలో వాసుకి; జంతువులలో సింహం; ఆశ్రమాలలో గృహస్థాశ్రమం; అక్షరాలలో ఓంకారం; నదులలో గంగ; సముద్రాలలో పాలసముద్రం; ఆయుధాలలో విల్లు; కొండలలో మేరుపర్వతం; చెట్లలో అశ్వత్థం(రావిచెట్టు); మూలికలలో యవలు; యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞం; వ్రతాలలో అహింసావ్రతం; యోగాలలో ఆత్మయోగం; స్త్రీలలో శతరూప; వాక్కులలో సత్యవాక్కు, ఋతువులలో వసంత ఋతువు; మాసాలలో మార్గశిరం; నక్షత్రాలలో అభిజిత్తు; యుగాలలో కృతయుగం; భగవంతుని రూపాలలో వాసుదేవుడు; యక్షులలో కుబేరుడు; కోతులలో ఆంజనేయుడు; రత్నాలలో పద్మరాగం, దానాలలో అన్నదానం; తిథులలో ఏకాదశి; నరులలో వైష్ణవుడై భాగవతుడిలా ప్రవర్తించేవాడు ఇవన్నీ నా విభూతులుగా తెలుసుకో' అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా మళ్లీ ఉద్ధవుడిలా అన్నాడు.

పద్మనాభా! కమలనయనా! వర్ణాలు, ఆశ్రమాలు, వాటిధర్మాలు నిర్ణయించి, చెవులకు ఇంపుగా ఆనతిస్తే నేడు వింటాను.

అని ఉద్ధవుడు అడుగగా శ్రీకృష్ణుడు నాలుగువర్ణాల పుట్టుకా, నాలుగు ఆశ్రమాలకు తగిన పనులూ, నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలూ, ప్రవర్తించడానికి, నివర్తించడానికి కారణాలైన పురాణాలూ, ఇతిహాసాలూ, శాస్త్రాలూ, వైరాగ్యానికి సంబంధించిన విజ్ఞానాలూ మొదలైనవన్నీ తెలిపాడు. 

'అన్నిధర్మాలను వదిలిపెట్టి నన్నొక్కడినే శరణుపొందు' అనే ఉపనిషత్తుల్యమైన భగవద్గీతావచనం చొప్పున నాయందు మనస్సు పెట్టి ఉండేవాడు నేనే నని చెప్పబడుతాడు. పలురకాల వాదాలెందుకు? దేనిమీదా మనస్సు లగ్నం కానీక నా మీదనే మనస్సు కలిగి నడచుకో అని చెప్పగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

(వచనంలో ఈ ప్రతిపాదింపబడిన అతి సులభమైన భక్తి, ప్రపత్తి, శరణాగతి ముక్తికి హేతువులుగా చెప్పబడడంవల్ల పాండిత్యం లేనివారు, గొప్పశాస్త్రాలు చదువలేనివారు కూడా ముక్తికోసం దిగులు చెందవలసిన అవసరంలేదని, నిర్మలమైన దైవభక్తి ఉంటే చాలునని తెలుస్తుంది.)

బ్రహ్మకు తండ్రియైనవాడా! భక్తులు నమస్కరించే పాదద్వంద్వం కలవాడా! శ్రీకృష్ణా! నాకు తెలియని విషయాలు కొన్ని చెప్పావు. ఇంకా తెలుసుకోవలసిన వాటినిగురించి చెప్పు. ఉపాయంతో ప్రవర్తిస్తాను.

అని ఉద్ధవుడు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు చెప్పసాగాడు. ఉద్ధవా! నీ ప్రశ్నలు క్లిష్టమైనవి. అయినా చెపుతాను విను. నియమాలూ, శమదమాలూ మొదలైనవి ఏవి? తపమనగా నేమి? సుఖదుఃఖాలూ, స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు ఎట్టివాడు? ఈశ్వరుడంటే ఎవరు? అని నీవు నన్నడిగిన విషయాలన్నిటినీ వేరువేరుగా వివరిస్తాను.

మౌనవ్రతమూ, ఓర్పూ, జపమూ, తపమూ, అతిథులను సత్కరించడమూ, పరహితమూ, దొంగతనమూ మొదలైనవి లేకుండుట అనే ఇలాంటివి నియమాలు అనబడతాయి. 

ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం, శత్రుమిత్రుల యెడల సమానంగా ఉండడం 'శమ' మని చెప్పబడుతుంది. 

అజ్ఞానులకు జ్ఞానోపదేశం చేయడం, కోరికలను వదిలి పెట్టడం, సమదర్శనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం అనేవి కల్గి ఉండడం విద్యగా చెప్పబడతాయి. 

శమదమాది గుణాలు లేని వాడుగావడం, నాయందు భక్తి లేనివాడు గావడం 'అవిద్య' అనబడుతుంది. 

చిత్తశుద్ది గలిగి ఎప్పుడూ తృప్తిచెందినవాడుగా ఉండడం 'దమ' మని చెప్పబడుతుంది. 

ఇటువంటి నియమాలూ, గుణాలూ కలిగి నాయందు భక్తి కలిగి ఉండడమే 'సుఖం'. నన్ను తెలుసుకోలేక తమోగుణంతో ఉండడమే 'దుఃఖం'. 

బంధువుల, గురువుల యెడల భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను నిగ్రహించినవాడూ, త్రిగుణ సాంగత్యం లేనివాడు అయినవాడే ఐశ్వర్యవంతుడు. 

నాయందు మనస్సు నిలిపి కర్మయోగమందూ, జ్ఞానయోగమందూ ఇష్టం కలిగిన వాళ్లై జనకరాజు మొదలైనవాళ్లు మోక్షాన్ని పొందారు. భక్తియోగం చేత బలి, ప్రహ్లాదుడు, ముచికుందుడు మొదలైనవాళ్లు పరమపదాన్ని పొందారు. 

కనుక ఈ విషయాన్ని తెలుసుకొని నిరంతరం నీ మనస్సులో భక్తియోగాన్ని నిలుపుకో. మట్టికుండకు రంధ్రం పడితే నీళ్లు కారిపోయే విధంగా రోజురోజుకు ఆయువు తరిగిపోతూ, చావు దగ్గరపడుతూ ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకొని ఎప్పుడూ ఏమరకుండా నన్నే తలుస్తూ ఉండేవాడు నాకు ఇష్టుడు.

పాపరహితుడైన ఉద్ధవా! జీవుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు పూర్వజన్మ స్మృతి (జ్ఞానం) సంపూర్ణంగా ఉంటుంది. అతడు పుట్టిన పిమ్మట (కడుపులోనుండి భూమిమీద పడగానే) లోపల ఉండిన ఆ జ్ఞానమంతా పోతుంది (నశిస్తుంది).

'అందుచేత మానవుడు బాల్యం, పిన్నతనం, యువకత్వం అనే వయోదశల తరువాతగాని, పెద్దవాడైన తరువాతగాని నన్ను తెలుసుకొంటే కృతార్ధుడవుతాడు. సంపద కలిగించే గర్వంవల్ల గుడ్డివాడయితే చీకటి అనే బావిలో పడతాడు. 

అలాంటి వాడిని దరిద్రుడుగా చేస్తే జ్ఞానోదయమై నా పాదపద్మాలకు నమస్కరించాలనే తలంపుకలిగి మోక్షం పొందుతాడు. అందువల్ల శరీరాభిమానం వదిలిపెట్టి, ఇహలోకపరలోక సౌఖ్యాలను కోరకుండా, మనస్సును నిగ్రహించుకొని ఎప్పుడూ నన్ను స్మరించేవాడు వైకుంఠపదాన్ని పొందుతాడు. నేను కూడా అతనిని విడువలేక అతని వెంటనే వెళుతూ ఉంటాను. నారదాది మునులు భక్తిభావంవల్ల నా రూపం పొందారు'. అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడింకా ఇలా అన్నాడు.

అయ్యా! దేవా! శ్రీకృష్ణా! సర్వజ్ఞనిధీ! సృష్టికర్తయైన బ్రహ్మను ఎవడు నేర్పుతో నడుపుతాడో వెంటనే చెప్పవయ్యా!

అనగా శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు 'ఆ విధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక గుడ్డు(అండం) గా ఏర్పడ్డాయి. ఆ గుడ్డునుండి నేను పుట్టాను. అంతనా బొడ్డు రంధ్రం నుండి బ్రహ్మ పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదాలు మొదలైన జగాన్నంతా అతనిచేత నేనే నిర్మింపజేశాను. 

ఆ బ్రహ్మకు నూరేండ్లు నిండిన తరువాత భూమి గంధంలో అణగిపోతుంది. గంధం నీటిలో కలుస్తుంది. ఆ నీరు రసంలో లీనమవుతుంది. ఆ రసం తేజోరూపాన్ని ధరిస్తుంది. ఆ తేజస్సు రూపంలో సంక్రమిస్తుంది. ఆ రూపం వాయువు (గాలి) లో కలుస్తుంది. ఆ వాయువు స్పర్శగుణంతో గ్రహింపబడి ఆకాశంలో లయిస్తుంది. ఆ ఆకాశం శబ్దమనే తన్మాత్రచే లోగొనబడినట్లయితే ఇంద్రియాలు మనోవికారాలతో కూడి ఈశ్వరుని పొంది ఈశ్వరత్వం పొందుతుంది.

నేను రజస్సు, సత్త్వం, తమస్సు అనే మూడు గుణాలతో కూడి మూడు మూర్తులు ధరించి సృష్టియొక్క పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికీ కారణుడనై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. పరమ పవిత్రుడవు, పరమ భక్తిసహితుడవు కమ్ము' అని చెప్పాడు. అంత

(మహత్‌ - సాంఖ్యుల పంచవింశతితత్త్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుండి వచ్చిన భూమిక. ఈ తత్త్వాలను కొందరు తొమ్మిదిగా చెపుతారు. పురుషుడు, ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, ఆకాశం, వాయువు, తేజస్సు, జలం, పృథివి అనేవి తొమ్మది తత్త్వాలు. 

జీవుడు, పరమాత్మ అనే ఇద్దరిని కలిపి పురుషుడు అన్నారు. మహదాదిగుణాలు కలసి 'అండం' ఉద్భవించిందని, దానినుండి భగవానుడు ఉద్భవించాడని భాగవతం చెపుతున్నది. 'అండపిండ బ్రహ్మాండంబు' అంటూ ఉంటారు. వీటిలో అండం అంటే గుడ్డు, పిండం అంటే దేహధారణ చేస్తున్న దశలోని రూపం. బ్రహ్మాండమంటే విశ్వం. పారమార్థికంగా అండం అంటే పంచమహాభూతాలతో కూడిన సృష్టి.

శ్రీమన్నారాయణుడే త్రిమూర్తులను ధరించి సృష్టి స్థితి లయలనే కార్యాలను నిర్వహిస్తాడని భాగవతం చెపుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులే త్రిమూర్తులు. త్రిమూర్తత్వం ఒకే తత్త్వం. వివిధ కార్యాల నిర్వహణకోసం అది మూడు తత్త్వాలుగా రూపొందింది. మొదటిది బ్రహ్మతత్త్వం. ఈ తత్త్వం సృష్టికార్యాన్ని నిర్వహిస్తుంది. కాబట్టి రజోగుణ సంయుక్తంగా ఉంటుంది. రెండవది విష్ణుతత్త్వం. ఈ తత్వం స్థితికి సంబంధించింది. కాబట్టి సత్వగుణసంయుక్తంగా ఉంటుంది. మూడవది మహేశ్వరతత్త్వం. ఈ తత్త్వం అప్పటివరకు పోషింపబడిన విశ్వాన్ని లయింపజేస్తుంది. 

అందువల్ల ఈ తత్త్వం తమోగుణ ప్రధానంగా ఉంటుంది. గుణ ప్రాధాన్యాన్ని బట్టి, నిర్వహించే పనులను బట్టి త్రిమూర్తులు రజస్సు, సత్త్వం, తమస్సు అనే గుణాలకు ప్రతినిధులుగా గుర్తింపబడినారు.)

రూపంలేని నీకు యోగులు రూపం కల్పించి నిన్ను మహాభక్తితో సేవిస్తూ ఉంటారు. నీవు వాళ్ల కోరికలను ఎలా తీరుస్తావు. నాకు తెలియజెయ్యి.

ఉద్ధవుడు అడిగిన ప్రశ్నకు నారాయణుడు (శ్రీకృష్ణుడు) ఇలా అన్నాడు. నేను అన్ని వర్ణాలవాళ్లకు సమమైన పూజాపద్ధతిని చెపుతాను. రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని తమ ఆచారం ప్రకారం ఒక ఆకారం కల్పించి ఒక పేరు పెట్టి కొందరు పూజిస్తారు. 

కంచుతోగాని, సీసంతోగాని, వెండితోగాని, బంగారుతోగాని చేసిన విగ్రహరూపాలు శ్రేష్ఠమైనవి. ఈ విధంగా నా విగ్రహరూపాలలో నా భావాన్ని భావించి కొలిచిన వారికి నేను ప్రసన్నుడనవుతాను. ఈ లోకంలో మానవులకు ధ్యానం నిలువదు. దేవతాప్రతిమలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అందమైనవి సారవంతాలైనవి మనస్సును ఆకట్టుకొనేవి అయిన రూపాలలో నేను ప్రసన్నమనస్కుడనై ఉంటాను. 

కావున నన్ను పాలకడలిలో పవళించిన వాడినిగా ఎంచి శుభ్రమైన వస్త్రాలు, భూషణాలు, పూలదండలు, మైపూతలు అర్పించి, దివ్యాలైన అన్ని పాఠాలతో, పదహారు విధాలైన రాజోపచారాలతో బాహ్యమైన పూజలు చేసి, నాకు ఇష్టమైన పదార్దాలను సమర్పించి, నిత్యం మనః పూజావిధానాలతో సంతోషింపబజేసి, దివ్యాలైన వస్త్రభూషణాలతో, పూలదండలతో ప్రకాశిస్తూ శంఖ చక్ర కిరీటాదులతో అలంకృతుడనైన దివ్యమంగళ విగ్రహునిగా భావించి ధ్యానపరవశుడైన నా భక్తుడు నాలో చేరుకొంటాడు.

ఉద్ధవా! నీవు ఇటువంటి తీవ్రమైన యోగనిష్ఠతో బదరికాశ్రమంచేరి, నేను చెప్పిన సాంఖ్యయోగాన్ని మనస్సులో నిలుపుకొని కలియుగాంతం వరకు ఉండుమని శ్రీకృష్ణుడు చెప్పగా ఉద్ధవుడు ఆనందంతో నిండిన మనస్సు గలవాడై శ్రీకృష్ణుని పాదపద్మాలను హృదయంలో నిలుపుకొని పవిత్రమైన బదరికాశ్రమానికి వెళ్లాడు. అని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పగా

(సర్వవర్ణాలు - బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులే సర్వవర్ణాలవాళ్లు. ఏ వర్ణం వారికైనా పూజావిధానం ఒకటే అనడానికి భాగవతం ఆ విధంగా చెప్పింది. దేవతాప్రతిమలను రాతితోగాని, మట్టితోగాని, కొయ్యతోగాని చేసి పూజించవచ్చు. 

ఇలాంటి విగ్రహాలకంటె లోహంతో చేసిన విగ్రహాలు శ్రేష్ఠమైనవి. విగ్రహపూజ బాహ్యపూజ. 
మనస్సులోనే ఒక మూర్తిని కల్పించుకొని ఆరాధించవచ్చు. అది ఆభ్యంతర పూజ.

దేవతా విగ్రహాలు ఒకచోట నుండి మరొక చోటికి మార్చదగినవి, ఒకేచోట స్థిరంగా ఉండేవి అని రెండు రకాలు. అలాంటి విగ్రహాలలో మంత్రశక్తితో ప్రాణప్రతిష్టచేస్తే అవి సజీవమై భగవంతునికి వాసస్థానాలవుతాయి.

శుకమహర్షి మాటలు విన్న పరీక్షిత్తు మునిచంద్రా! శ్రీకృష్ణుని కథలను యోగులు మెచ్చేవిధంగా, ఆశ్చర్యం కలిగేవిధంగా, నేర్పుగా చెప్పినప్పటికి నా మనస్సు తృప్తి పడడంలేదు.

తరువాత కృష్ణుడేమైనాడు? యాదవులు ఎలా ప్రవర్తించారు? ద్వారకానగరం ఎలా ఉండింది? తాపసోత్తమా! సంతోషంతో నాకు స్పష్టమయ్యేటట్లు చెప్పు.

శ్రీ కృష్ణ బలరాములు వైకుంఠమున కరుగుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Krishnudu Uddhavunaku Paramarthopadesamu Seyuta - కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట

ఈ విధంగా స్తుతించి “దేవా! నీవు యాదవజాతిని నాశనం చేసి వెళ్లిపోతే మేము ఏ విధంగా జీవించగలం? నీకు సహచరులమై నీతో కలసి చేసిన స్నాన, పాన, భోజన, శయన, ఆసనాదులను ఎలా మరచిపోగలం?” అని ఉద్ధవుడు అనగా 

శ్రీకృష్ణుడిలా అన్నాడు. “బ్రహ్మ మొదలైన దేవతలు చేసిన విన్నపాన్ని అనుసరించి భూమి బరువును తొలగించాను. ఇక నేటికి ఏడవరోజు సముద్రుడు ద్వారకానగరాన్ని ముంచివేస్తాడు. యాదవజాతి నాశనం అవుతుంది. అంతట కలియుగం వస్తుంది. కలియుగంలో మానవులు ధర్మం వదిలినవారూ, సదాచారరహితులూ, అన్యాయపరులూ, అధికమైన కోపం గలవారూ, మందమతులూ, తక్కువ ఆయువు కలవారూ, బహురోగాలచేత పీడింపబడుతూ ఉండేవారూ, ఫలించని పనులు చేసేవారూ, నాస్తికులూ అయి ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుండా ఉంటారు.

కాబట్టి నీవు స్నేహితులు, చుట్టాలు మొదలైనవాళ్ల అనుబంధాన్ని వదిలిపెట్టు. ఇంద్రియసౌఖ్యాలలో మునిగిపోకు. భూతలంమీద గల పుణ్యతీర్ధాలలో స్నానం చెయ్యి. మనస్సుతో పంచేంద్రియాలతో గ్రహింపదగు వస్తుసముదాయమంతా నశించేది అని తెలుసుకో. పురుషుడు(జీవుడు) అనేకాలైన సంపదలను సంపాదించి తన గుణదోషాలతో మోహితుడై ఉంటాడు.

కాబట్టి మావటివాడు మదగజాన్ని కట్టివేసిన విధంగా ఇంద్రియాలనూ, మనోవికారాలనూ నిగ్రహించి; భార్యాపుత్రులు ధనం విషయంలో ఆసక్తి వదలి సుఖదుఃఖాలలో సమంగా ప్రవర్తించు. 

ఈ ప్రపంచమంతా పరమాత్మయే అధిష్ఠానంగా కల్గిందిగా తెలుసుకో. మాయ ఆత్మకు వశమైనదిగా గ్రహించు. జ్ఞానవిజ్ఞానవంతుడవై ఆత్మానుభవంతో తృప్తిపొంది విశ్వాన్ని నన్నుగా భావించి ప్రవర్తించు” అని శ్రీకృష్ణుడు ఆనతిచ్చాడు.

ఉద్ధవుడు భక్తితో, భయంతో, వినయంతో చెతులు జోడించి “మహాత్మా! సన్న్యాస జీవితం చాలా కష్టం. పామరులైనవాళ్లు ఆచరించలేరు. నీ మాయచేత భ్రాంతులైనవారు ఈ సంసారసముద్రాన్ని దాటి ఎలా మోక్షం పొందుతారు? సేవకుడనైన నామీద దయతో చెప్పాలి. బ్రహ్మ మొదలైన దేవతల సమూహం కూడా బాహ్యవస్తువులందు భ్రాంతులై తిరుగుతూ ఉంటారు. 

నీ భక్తులైన పరమభాగవతులుమాత్రమే ఆ మాయను తిరస్కరించగలుగుతారు. గృహిణులకైనా, గృహస్థులకైనా, సన్న్యాసులకైనా ఎప్పుడూ నీ నామస్మరణే మోక్షసామ్రాజ్యాన్ని అందిస్తుంది. 

కాబట్టి పరమేశ్వరా! నీ పాదాలను శరణు పొందుతున్నాను. నామీద కరుణరసాన్ని ప్రసరింపజేయి” అని ప్రియసేవకుడైన ఉద్ధవుడు పలికాడు. అప్పుడు అతనితో శ్రీకృష్ణుడిలా అన్నాడు. 

“పురుషునికి, ఆత్మకు ఆత్మే గురువు. చెడు మార్గాలలోకి వెళ్లకుండా మంచిమార్గంలో వర్తిస్తూ మిక్కిలి గొప్పదైన నా నివాసానికి(వైకుంఠానికి) చేరుకో. సమస్తశక్తులు గల నన్ను సాంఖ్యయోగులు ఎప్పుడూ పురుషభావంతో(పరమాత్మభావంతో) భావిస్తూ ఉంటారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు కాళ్లు కలవి, అసలు కాళ్లు లేనివి అయిన జీవులలో రెండుకాళ్లుగల మనుష్యులు ఉత్తములు. 

అలాంటి ఉత్తములైన మనుష్యులలో నిరంతర ధ్యానగరిష్ఠులైన యోగీశ్వరులు ఉత్తములు. వాళ్లలో సందేహించేవాళ్లు గ్రహించలేని నన్ను సత్త్వగుణులు గ్రహిస్తారని తెలిసి తమ మనః పద్మాలలో జీవాత్మ, పరమాత్మలను ఒకటిచేసి శంఖం, చక్రం, గద, ఖడ్గం, శార్‌ఙ్గం, కౌమోదకి, కౌస్తుభం - వీటితో కూడినవానిగా నన్ను భావించేవారు పరమయోగీంద్రులు, పరమజ్ఞానులు” అని చెప్పి ఇంకా 'అవధూత - యదు సంవాదం' అనే ప్రాచీనమైన కథ ఒకటి ఉంది. చెపుతాను వినుమన్నాడు.

(శ్రీమన్నారాయణుడు “సర్వమూలశక్తి సంపన్నుండు” అంటే సర్వజ్ఞత్వ, సత్య సంకల్పాది శక్తులతో కూడి జగత్‌ సృష్టి చేయగలిగిన వాడని అర్థం. సాంఖ్యయోగపరులంటే -సాంఖ్యయోగాన్ని అభ్యసించినవాళ్లు. సంఖ్యతో కూడినది సాంఖ్యం. సాంఖ్యమంటే జ్ఞానం. జ్ఞానవిచారణలో అనాత్మ వస్తువులను లెక్కించవలసి ఉంటుంది. లెక్కచెప్పేటప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కాబట్టి సాంఖ్యమని పేరేర్పడింది. ప్రకృతిలోగల తత్త్వాలను లెక్కించి వాటిలో అనాత్మరూపాలను త్యజించి, పరమాత్మజ్ఞానాన్ని గ్రహించడమే సాంఖ్యవిద్య. అందువల్ల ఆత్మానాత్మ రూపమైన విజ్ఞానమే సాంఖ్యం. 

షడ్దర్శనాలలో సాంఖ్య దర్శనం ఒకటి. న్యాయం, వైశేషికం, సాంఖ్యం, యోగం, మీమాంస, వేదాంతం షడ్దర్శనాలు.

అవధూత - యదుసంవాదము
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Krishnudu Durnimithamulam Gani Yadavula Nella Dwarakanundi Prabhas Tirdhamunaku Bamputa - కృష్ణుడు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకు బంపుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - కృష్ణుడు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకు బంపుట

కాకులు, గుడ్లగూబలు పగటిపూటే బంగారుమేడలలో పెక్కువిధాలుగా ఏడుస్తున్నాయి. గుర్రాల తోకలయందు అగ్గిపుట్టింది. ఎంతో ఆశ్చర్యకరంగా(ధాన్యంలేక) అన్నం మొలకలెత్తింది. రాత్రిపూట చిలుకలు, గోరువంకలు వికృతస్వరాలతో మూర్చిల్లాయి. ఒక జంతువు వేరొక రకమైన జంతువును ఈనింది. పౌరుల ఇండ్లలో ఆకాశంనుండి అగ్నికణాలు కురిశాయి. సూర్యబింబాన్ని నల్లనిరంగు ఆవరించింది. ఇలా అపశకునాలు లేక ఉపద్రవాలు ఎన్నో కనిపించాయి. అందుచేత ఓ యాదవులారా! మీరు ఇక్కడ ఉండవద్దు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రభాసతీర్థానికి వెళ్లండి” అని శ్రీకృష్ణుడు ఆదేశించాడు.

(ప్రభాసతీర్థం గొప్ప పుణ్యక్షేత్రం. దక్షుడి శాపంవల్ల క్షయరోగం కలిగిన చంద్రుడు ప్రభాసతీర్ధంలో స్నానం చేయగానే ఆ రోగం పోయింది. ఆ మాట చెప్పి యాదవులందరినీ ఆ క్షేత్రానికి వెళ్లమన్నాడు శ్రీకృష్ణుడు.)

శ్రీకృష్ణుని మాటలు విని యాదవులు సంతోషంతో తమ బలగాలతోనూ, భార్యలు, బిడ్డలు, మిత్రులతోనూ; ఏనుగుల, గుర్రాల సమూహాలతోనూ కలసి క్రమంగా తొందరగా ప్రభాసతీర్థానికి వెళ్లారు.

ఉద్ధవుడు దివ్యజ్ఞానంతో తన మనస్సులో తెలుసుకొని లక్షీపతీ! శ్రీహరీ! ఆర్తజనుల పాలిటి కల్పవృక్షమా! పండితులను నడిపించువాడా! మాకు నీవే దిక్కని స్తుతించాడు.

కృష్ణుడు ఉద్ధవునకు పరమర్థోపదేశము సేయుట
 






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sunday, September 6, 2026

Brahmadi Devatalu Srikrishnuni Vaikunthamunaku Biluva Vacchuta - బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము -
బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట

దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, రుద్రుడు, బ్రహ్మ మొదలైన దేవతలు; మహర్షులు కమలాక్షుడైన శ్రీకృష్ణుని దర్శించడానికి ఎంతో సంతోషంతో ద్వారకానగరానికి వచ్చారు.

(సుధాశనులు = సుధను(అమృతాన్ని) అశనంగా(ఆహారంగా) గ్రహించేవాళ్లు దేవతలు. సుఖంగా పానం చేయబడేది సుధ. దేవతలు అమృతం ఆహారంగా గ్రహిస్తారు కాబట్టి వాళ్లకు జరామరణాలుండవు. రెక్కలతో ఎగిరేవాళ్లు గరుడులు. ఆకాశంలో సంచరించే వాళ్లు ఖేచరులు. గుటికాంజనాది విద్యలను ప్రదర్శించేవాళ్లు విద్యాధరులు. వీళ్లందరూ దేవతలలోని వారే.)

యాదవవంశమనే ఉద్యానవనంలో ప్రకాశించే కల్పవృక్షంవంటివాడు పరమేశ్వరుడు. జనులు కోరిన ఫలాలను ఇచ్చేవాడు అయిన పద్మాక్షుని దేవతలు దర్శించి వైదిక సూక్తాలతో స్తుతించారు.

(పారిజాతం దేవతరువు. పాలసముద్రంలో పుట్టిన వృక్షమిది. దేవతరువులు ఐదున్నాయి. అవి - మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం.)

సకలభువనాధిపతీ! సర్వేశ్వరా! పుట్టుక లేనివాడవై భూమి బరువును తగ్గించడంకోసం నీవు అవతరించావు. నీవు జన్మించి ఇప్పటికి నూటాఇరవైఅయిదు సంవత్సరాల కాలం గడచిపోయింది. ఇక వైకుంఠసౌధానికి వేంచేయి.

ఆ విధంగా అనిన బ్రహ్మ ఈశ్వరుడు మొదలైన సమస్త దేవతా సమూహాల మాటలను అంగీకరించి శ్రీకృష్ణుడు వాళ్లతో “యాదవులకు పరస్పరం శత్రుత్వాన్ని కల్పించి వాళ్లను చంపించి భూమి బరువును తగ్గించి త్వరగా వస్తాను మీరు వెళ్లండి” అని చెప్పి బ్రహ్మాదులను వీడ్కొలిపాడు. బ్రహ్మాదిదేవతలు తమతమ స్థానాలకు వెళ్లారు. తరువాత -

(యాదవులను చంపించడం భూభారం తగ్గించడంకోసమే. ఇది శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణ, శిష్టరక్షణ కార్యక్రమంలో ఒక భాగం.

కృష్ణుడు దుర్నిమిత్తములం గని యాదవుల నెల్ల ద్వారకనుండి ప్రభాస తీర్థమునకు బంపుట







శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Vasudevunaku Naradudu Puraathanambagu Videharshabha Samvaadam Deluvuta - వసుదేవునకు నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదం దెలువుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - 
వసుదేవునకు నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదం దెలువుట

ఓ రాజా! చెపుతాను వినండి. దీనికి ఒక పెద్దదైన, ప్రఖ్యాతమైన వెనకటి కథ ఉంది. దాన్ని కూడా చెపుతాను. ముందొకసారి నారదముని ద్వారకకు వచ్చి ఎంతో ఇష్టంతో తిన్నగా శ్రీకృష్ణుని సందర్శించాడు.

ఆవిధంగా దేవర్షి నారదుడు శ్రీకృష్ణదర్శనానికి వచ్చి ఇంటిలోపలికి వెళ్లగా వసుదేవుడు ఆ మహర్షిసత్తముని అర్ఘ్యపాద్యాదులతో యథావిథిగా పూజించి బంగారు ఆసనంపై కూర్చుండబెట్టి తగిన కథావృత్తాంతాల వినోదాలతో పొద్దుపుచ్చుతూ ఇలా అన్నాడు.

'మునీంద్రా! ఏ మానవుడు నిరంతరం శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆసక్తిగా భజించడో వాడికి చావు సమీపంలోనే ఉంటుంది. నీ దర్శనంవల్ల ధన్యుడనయ్యాను. అచ్యుత, అనంత, గోవింద మొదలైన నామాలను స్మరిస్తూ ఏకాగ్రమైన చిత్తంగల మీవంటి సుకృతాత్ముల రాకవల్ల లోకులు సుఖాశ్రయులై ఉంటారు. దేవతలను భజించేవాళ్లను దేవతలుకూడా దయతో చూస్తారు. అటువంటి సజ్జనులు, దీనవత్సలులు పూజాదివిధులతో ఆ దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటారు. కాబట్టి శ్రీమద్భాగవతకథలలో గల ధర్మాలను అడుగుతాను.

ఏయే ధర్మాలను వీనులవిందుగా వింటే యమభటుల దెబ్బలు తినకుండా ముకుందుని పాదపద్మాలకు నమస్కరించే కోరిక కలవారై వైకుంఠపదవిని పొందుతారో అలాంటి ధర్మాలను తెలియజేయండి. పూర్వం శ్రీకృష్ణుణ్ణి కొడుకుగా కోరుకొని మోక్షమార్గం తెలుసుకోలేక దైవమాయలో పడి మనస్సులో పుట్టిన అపాయాంధకారసంసారంలో చిక్కుకొని ఉన్నాను. హరికథామృతాన్ని ప్రవహింపజేయండి. అట్లైతే నాకు సుఖం కలుగుతుంది, అని వసుదేవుడు ప్రార్ధించగా నారదుడు వాసుదేవునికథల ప్రస్తావనవల్ల పరస్పర సంభాషణమూలమైన సంతోషంతో ఇలా అన్నాడు.

(ముకుందుడంటే మోక్షాన్ని ప్రసాదించేవాడని అర్ధం. శ్రీకృష్ణునికి ముకుందుడని పేరుంది.)

జనసుతా! నీవు నన్నడిగిన ప్రశ్నకు సమాధానం వేదశాస్త్రచోదితమైన గొప్పదైన శ్రీహరిగుణకథనమే. వినవలసిందని వేడుకతో వినిపించడం ఆరంభించాడు.

ఎంతటి పాపం చేసినవాళ్లైనా ఎప్పుడూ నారాయణశబ్దాన్ని ఎక్కువగా స్మరించేవాళ్లు ధన్యులు. అలాంటివాళ్లను నుతించడం బ్రహ్మకుకూడా సాధ్యం కాదు.

అందుకని శ్రీమన్నారాయణునిమీద భక్తిని కలిగించేది, మోక్షమార్దాన్ని పెంపొందింపజేసేది అయి ప్రసిద్ధిగా ఉన్న విదేహఋషభసంవాదమని పేరొందిన ప్రాచీనమైన ఒక కథావిశేషాన్ని నీకు చెపుతాను, ఏకాగ్రమైన మనస్సుతో వినుమని ఇలా చెప్పాడు.

ఓ వసుదేవా! విను. స్వాయంభువుడనే మనువుకు ప్రియవ్రతుడనే కొడుకు కలిగాడు. ప్రియవ్రతునికి లోకప్రసిద్ధుడైన ఆగ్నీధ్రుడు అనే పుత్రుడు పుట్టాడు.

(మానవుల పుట్టుకకు మనువు కారణమని చెపుతారు. మనువు దైవాంశసంభూతుడు. పదునలుగురు మనువులన్నారు.

1) స్వాయంభువ, 2) స్వారోచిష, 3) ఉత్తమ, 4) తామస, 5) దైవత, 6) చాక్షుస, 7) వైవస్వత, 8) సావర్ణి, 9) దక్షసావర్ణి, 10) బ్రహ్మ 11) ధర్మసావర్ణి, 12) రుద్రసావర్ణి, 18) శౌచ్య, 14) ఇంద్రసావర్ణి అనే పేర్లు గలవారు మనువులు.

మొదటి మనువైన వైవస్వతమనువు రెండవసృష్టికర్తగా ప్రసిద్ధి పొందాడు. ఇతడే పదిమంది మహర్షులను ఉద్భవింపజేశాడు. మానవధర్మశాస్త్రమైన మనుస్మృతి కర్తకూడా ఇతడే. ఒక మనువు కాలాన్ని మన్వంతరం అంటారు. మనుస్మృతి ప్రకారం ఒక మన్వంతరం 43,20,000 సంవత్సరాలు)

ఆ ఆగ్నీధ్రుడికి పండితుడైన 'నాభి' అనే కొడుకు జన్మించాడు. అతడు బలిచక్రవర్తితో స్నేహంచేసి భూభారం వహించి తన ఆజ్ఞాబలంతో శత్రువుల రాజ్యాలన్నీ స్వాధీనం చేసుకొని పాలించాడు. ఆ 'నాభి' కి 'ఋషభుడు' అనే మంచికొడుకు కలిగాడు. హరిభక్తుడైన ఋషభుడు వందమంది కొడుకులను పొందాడు. ఆ వందమందిలో 'భరతుడు' అనే మహానుభావుడు శ్రీమన్నారాయణుని భక్తుడై ప్రాపంచిక సౌఖ్యాలను పరిత్యజించాడు. గొప్ప తపస్సుచేసి మూడు జన్మలలో బంధాలనుండి విముక్తి పొందాడు. మోక్షసుఖం కలిగిన పరవశత్వంతో శ్రీమన్నారాయణాత్మక పరమపదాన్ని పొందాడు. భరతుడు పాలించిన భూభాగం భరతవర్షం అనే పేరుతో వర్ధిల్లి ప్రఖ్యాతమైంది.

మరలా ఆ ఋషభుని కుమారులలో తొమ్మిదిమంది బలపరాక్రమ, తేజోరూపాలు కలవారై తొమ్మిది భూభాగాలకు అధికారులైనారు. ఇంకా వాళ్లలోని ఎనభై ఒక్కమంది కుమారులు నిత్యకర్మానుష్ఠానాలలో ఆసక్తి కలవారై బ్రాహ్మణత్వాన్ని స్వీకరించారు. ఇక మిగిలినవారిలో కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్దుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమిళుడు, చమసుడు, కరభాజనుడు అనే పేర్లుగల తొమ్మిదిమంది ఋషులు బ్రహ్మవిద్యావిశారదులు అయినారు. మూడు లోకాలను పరమాత్మ స్వరూపంగా భావించారు. ప్రాపంచిక జగత్తుతో సంబంధం లేనివాళ్లయినారు. ఆటంకం లేని రాకపోకలు కలవారై దేవ, సిద్ధ, సాధ్య, యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుష, నాగ లోకాలలో ఇష్టానుసారం విహరిస్తూ ఒకనాడు.

(నిత్యనైమత్తిక కామ్యకర్శలని కర్మలు మూడు రకాలు. ప్రతిరోజూ చేయవలసిన స్నానసంధ్యాద్యనుష్ఠానాలు నిత్యకర్మలు. ఇవి చేయకపోతే దోషం కలుగుతుంది. కొన్నికారణాల నిమిత్తం ఆచరించదగినవి నైమిత్తిక కర్మలు. పిండ ప్రదాన కర్మలు ఇలాంటివి. ఇవి ఆయా సందర్భాల్లో చేయదగినవి. కోరికలు నెరవేర్చుకోడానికి చేసేవి కామ్యకర్మలు. వీటివల్ల ఫలితం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాని ప్రత్యవాయంమాత్రం కలుగదు.)

లోకాలన్నిటికి ఒకే ప్రభువైన శ్రీహరి గుణగణాలను ఎక్కువగా స్మరించుకొంటూ, అతిశయించిన భక్తితో రేయింబవళ్లు, సంధ్యాసమయాలు ఆ శ్రీహరియందే ఎంతో ఆసక్తి కలిగి ఇంద్రియ నిగ్రహులైన ఆ తాపసులు భూలోకంలో

ఎంతో పుణ్యాత్ముడైన విదేహరాజైన నిమి నిర్వర్తించిన యజ్ఞం పరిసమాప్తి పొందుతున్న సమయంలో మోహం వదలిన పుణ్యాత్ములైన తాపసులు రాగా నిమి వాళ్లకు ఎదురువెళ్లి

భూపాలుడైన నిమి తొమ్మిదిమంది మునివర్యులను ఎంతో వేడుకగా అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజించాడు. వాళ్లను ఉచితాసనాలమీద కూర్చుండబెట్టి

(ఉచితాసనాలమీద కూర్చుండిన) వాళ్లతో విదేహరాజైన నిమి ఇలా అన్నాడు. 'మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే గొప్ప తపోనిధులు. భయంకరులు, అనేక దుఃఖాలతోను రోగాలతోను కూడినవారు, చెడ్డబుద్ధి గలవారు, అల్పులు అయిన మానవులు సారంలేని సంసారాలను ఎలా దాటగలరో ఆలోచించి జ్ఞానమార్గం తెలియజేయండి'.

అన్ని ప్రాణుల జన్మలకంటె మానవజన్మను పొందడం కష్టసాధ్యం. మానవజన్మ పొందినా శ్రీమన్నారాయణుని పాదాలధ్యానం మీద ఆసక్తి కలగడం మరీ కష్టం. అందువల్ల శాశ్వతమైన శుభాన్నిగురించి అడుగవలసి వచ్చింది. శరణాగతి పొందిన భక్తులకు శ్రీమన్నారాయణుడు సారూప్యం ఎలా అనుగ్రహిస్తాడు? ఆ విషయాన్ని గురించి తెలపండి, అని అడిగిన విదేహరాజుతో శ్రీహరికథలు అనే అమృతం తాగి పారవశ్యం పొందిన మునుల సమూహంలో “కవి” అనే పేరుగల మహానుభావుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు.

కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే వైరివర్గం లోను, మూడు రకాల కోరికలలోను చిక్కి మత్సర స్వభావంతో కూడిన మనస్సుగల మానవుడికి అచ్యుతుని పాదపద్మాలను సేవించే భాగ్యం ఎలా లభిస్తుంది? విశ్వాన్ని ఆత్మను వేరువేరుగా భావించేవాడికి భయం లేకుండా ఎలా పోతుంది? అజ్ఞానమనే చీకటిలో మునిగిన వాళ్లకు శ్రీహరి ధ్యానం ఎలా సిద్ధిస్తుంది? అటువంటి మానవుడు శరీరాన్ని వదిలి పరమాత్మ తత్త్వాన్ని ఎలా చేరుతాడు? కండ్లుమూసుకొన్న మానవుడు దారిలో నడుస్తూ తడబాటుపడి వెళ్లే విధంగా పరమాత్మ జ్ఞానంచేత స్వచ్చమైన మనస్సులో భక్తిభావం నిండుగా ఉండకపోతే వీళ్లకు పరమాత్మ స్థితి ఎలా సిద్ధిస్తుంది? అని అడిగావు. సమాధానం చెబుతాను శ్రద్ధతో విను.

(జీవి తన సర్వకర్మలను భగవత్పరం చేసి 'అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ' అని భగవంతునికి ఆత్మార్పణ చేసుకోవడం శరణాగతి. భగవంతుణ్ణి చేరడానికి కర్మ జ్ఞాన భక్తియోగాలతో పాటు ప్రపత్తియోగాన్ని కూడా ప్రతిపాదించారు వైష్ణవులు. శరణాగతి పొందడమే ప్రపత్తియోగ లక్షణం.

దారైషణ(భార్యమీద కోరిక), ధనైషణ (ధనంమీద కోరిక), పుత్రైషణ(కొడుకు కావాలని కోరిక) అనేవి ఏషణత్రయం. మానవ జీవితంలో ఈ మూడూ ప్రధానమైన కోరికలు. ఇవి మానవుని ప్రాపంచిక స్థితిలో పడవేస్తాయి. వీటిని జయిస్తే తప్ప పారమార్థికమైన ఆలోచనలు కలగవు.)

మానవుడు త్రికరణాలతో ఆయా సమయాల్లో ఏయే కర్మలు చేసినా ప్రతికర్మను 'కృష్ణార్పణం' అని నిర్వర్తించడం సుజ్ఞానమని ముని శ్రేష్ఠులు చెబుతారు.

(మనోవాక్కాయాలు త్రికరణాలు. అంటే మనస్సు, వాక్కు(మాట), కాయం (శరీరం). ఏ పనిచేసినా త్రికరణశుద్ధిగా చెయ్యాలంటారు పెద్దలు.)

జ్ఞాన అజ్ఞానాలలో పడి ఉంటే జ్ఞాపకశక్తి వ్యత్యస్తం అవుతుంది. కాబట్టి తెలివైన మానవుడు గురువునే దైవంగా భావించి, ఉత్తమోత్తముడైన లక్ష్మీనాయకుని మనస్సులో నిలిపి సేవించాలి. కలల్లాంటి కోరికలతో తేలిపోవడం వల్ల ఆలోచన నశిస్తుంది. అందువల్ల కోరికలను తగ్గించుకొని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండేవాడికి చేతిలో ఉసిరిక కాయవలె మోక్షం సులభంగా దొరుకుతుంది.

(శరీర ఇంద్రియాలతో సంబంధంలేని ఆత్మ అద్వితీయమై ఉండే స్థితి కైవల్యం.)

ఓ రాజా! ఎల్లప్పుడూ శ్రీకృష్ణుణ్ణి గురించి పాడే పాటలను చెవులకు ఇంపుగా వినాలి. శ్రీహరినామమాహాత్మ్యాన్ని వివరించే విషయాలను సంతోషంతో పాటలుగా పాడుతూ, ఆటలుగా ఆడుతూ ప్రవర్తించాలి. శ్రీమన్నారాయణుని పవిత్రమైన పేరులోని అక్షరాలను హృదయంలో ఎప్పుడూ స్మరిస్తూ ఉండాలి. పద్మలోచనుని లీలలను అడవిలో ఉన్నపుడైనా భక్తితో గానం చెయ్యాలి. విశ్వమంతా నిండి ఉన్న శ్రీహరిని వెర్రివాడువలె కీర్తిస్తూ లోకాన్ని అంటకుండా ఉండాలి. సృష్టి అంతా విష్ణుమయమని తెలుసుకోవాలి. భేదంగా చూడడం పనికిరాదు.

కవి అనే ముని చెప్పిన మాటలు వినిన విదేహరాజు భాగవతధర్మం ఏది? ఆ ధర్మం ఏవిధంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తులు ఎలా ఉంటాయి; ఆ విషయాలన్నీ తెలియజేయడానికి మీరే తగినవారు అన్నాడు. వెంటనే ఆ ముని సమూహంలోని హరి అనే మహాముని ఇలా అన్నాడు.

సర్వప్రాణులలో ఉండేవాడైన పద్మలోచనుడే తన మనస్సులో ఉండేవాడని, అతడే శంఖచక్రధరుడని నమ్మి భక్తితో ఆసక్తి గలిగి ప్రవర్తించేవాడే భాగవతుడు.

భూపాలా! వర్ణాశ్రమధర్మాలలోను, ఆయా వర్ణాశ్రమాలకు విధించినకర్మలలోను మునిగిపోకుండా సమస్త జగత్తులో నిండినవాడే శ్రీహరి అని భావించేవాడు నిజంగా భాగవతుడు.

ఇలా అన్నిబంధాలను పరిత్యజించి, అన్నింటిని తనలాగా భావించి, సూర్యుడు తన సహస్రకిరణాలతో ముల్లోకాలను పవిత్రం చేస్తున్నవిధంగా తన అడుగుదమ్ముల దుమ్ముచేత ముల్లోకాలను పవిత్రం చేస్తూ దేవదానవులచేత కూడా కొనియాడబడి సేవింపదగిన జనార్దనుని పాదపద్మాలకు నమస్కరించాలనే కోరిక కలిగి, భక్తిని రవ్వంతకూడా సడలనీకుండా, చంద్రోదయం వల్ల ఎండబాధ తొలిగిపోయిన విధంగా శ్రీమన్నారాయణుని చరణ నఖకాంతుల వెన్నెలచే హృదయతాపం పోగొట్టుకొని, తన భక్తి అనే తాడు బంధనంతో బంధింపబడిన వాసుదేవుని పాదపద్మాలను ధ్యానించడంవల్ల కలిగిన ఆనందంలో పరవశించేవాడు ఉత్తమభాగవతుడని చెప్పగా విని విదేహరాజు ఇలా అన్నాడు.

జితేంద్రియుడవైన మహర్షీ! కరిరాజుకు వరమిచ్చి కాపాడిన శ్రీహరిసౌశీల్యవాత్సల్యాది గుణాలు మూడు లోకాలనూ పావనం చేసేవి. అటువంటి గుణాలను స్పష్టంగా మనోరంజకంగా వినాలని నాకు కూతూహలం కలిగింది.

అలా అడిగిన విదేహరాజు మాటలు విని అంతరిక్షుడనే గొప్పఋషి ఇలా చెప్పాడు.

పరబ్రహ్మమని, పరతత్త్వమని, పరమపదమని, పరమేశ్వరుడని, శ్రీకృష్ణుడని, వేరువేరు పేర్లతో శ్రీమన్నారాయణుడే ప్రపంచమంతా నిండి ప్రకాశిస్తున్నాడు.

అవ్యక్తమైన, గుణరహితమైన పరబ్రహ్మంనుండి వ్యత్యాసంగా పుట్టిన జ్ఞానాన్ని 'విష్ణుమాయ' అంటారు. అటువంటి మాయచేత ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఎలాంటి చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియసుఖాలకోసం తిరుగులాడే చెడుబుద్ధి గలవారికి గాఢనిద్ర, స్వప్నం, మెలకువ అనే మూడు అవస్థలతోపాటు భగవంతుని పొందలేక పోవడమనే నాలుగో అవస్థకూడా కలుగుతుంది. కలలో గ్రహించదగిందీ, గ్రహించేవాడూ, గ్రహించడం అనే మూడు (త్రిపుటి) భేదాలుంటాయి. (త్రిపుటి) ఈవిధంగా అవిద్య అనే చీకటితో చుట్టుకోబడి మూడువిధాలుగా పరిణమించేకోరిక స్వప్నదశలో అణగినవిధంగా మూడు విధాలైన మాయకూడా ఆత్మలో విలీనమవుతుంది.

పరమేశ్వరుడు మొదట పృథివి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించి అందులో పంచభూతాత్మకమైన శరీరానికి పదకొండుఇంద్రియాలతో భేదం పుట్టిస్తూ, గుణాలచే గుణాలను అంగీకరిస్తూ, ఆత్మయందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అంగీకరిస్తూ ఉన్నవాడై సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నిమిత్తమాత్రాలైనకర్మలు చేస్తూ, అవి కలిగించే ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై ప్రవర్తిస్తూ ఉంటాడు. అనేకదుఃఖాలతో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ జలప్రళయం వచ్చి సర్వభూతాలు అందులో మునిగిపోయే వరకు (స్వేచ్చను కోల్పోయి) ప్రాపంచిక అనుభవాలు పొందుతూ చావుపుట్టుకలలో పడి దొర్లుతూ ఉంటాడు. ప్రళయకాలం(కల్పాంతసమయం) వచ్చినప్పుడు వస్తుగుణాలస్వరూపం పొందిన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.

ఆపైన నూరేండ్లు వాన లేకపోవడంవల్ల లోకాలన్నీ సూర్యతేజం(ఎండ)తో కాల్చివేయబడతాయి; ఆ తరువాత కింది లోకంలోని ఆదిశేషుని ముఖంనుండి వెడలిన అగ్నిజ్వాలలు వాయుసహాయంతో లేచి, అన్ని దిక్కులలో వ్యాపిస్తాయి. అటు తరువాత సంవర్తకాలనీ మేఘాల గుంపు నూరేండ్లు ధారాపాతంగా వర్షిస్తాయి. ఆ వర్షపు నీటిలో బ్రహ్మాండం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తరువాత భూమండలం తన వాసనగుణాన్ని కోల్పోయి నీటిరూపం ధరిస్తుంది. ఆ నీళ్లు రసాన్ని కోల్పోయి తేజోరూపం పొందుతాయి. ఆ తేజస్సు చీకటితో తొలిగింపబడి వాయువులో అణగుతుంది. ఆ వాయువు స్పర్శగుణాన్ని పోగొట్టుకొని ఆకాశంలో కలుస్తుంది. ఆ ఆకాశం శబ్దగుణాన్ని పోగొట్టుకొని ఆత్మయందు అణగిపోతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ది వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణాలతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మాయ తెలుపు(సత్వగుణం), ఎరువు(రజోగుణం), నలుపు(తమోగుణం) అనే మూడు వర్ణాలు(గుణాలు) కలిగి, సృష్టి స్థితి లయాలకు కారణమవుతుంది. అని మాయా స్వరూపమూ, మాహాత్మ్యమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు.

జగన్నుతా! సత్యవాక్కుల్ని సద్గుణాల్ని భూషణాలుగా కలవాడా! అజ్ఞానులైన మానవులు కనరాని మాయను లోపల అణచివేసి వైకుంఠాన్ని ఎలా పొందుతారు? ఈ వృత్తాంతాన్ని పూర్తిగా అర్ధమయ్యేటట్లు చెప్పండి అని అడుగగా ప్రబుద్దుడనే ముని ఆదరపూర్వకంగా ఇలా అన్నాడు.

సూర్యోదయ సూర్యాస్తమయంతో ప్రతిరోజూ మానవుల ఆయుస్సు తగ్గిపోతూ ఉంటుంది. శరీరంపైన, భార్యపైన, స్నేహితులపైన, సోదరులపైన నాది, నావారు అనే మమకారంతో కట్టువడి ఆ బంధాన్ని వదిలించుకొనే ఉపాయం కనపడక, సంసారమనే చీకటిలో మునిగి, భూతభవిష్యత్కాలాలు తెలియక గుడ్లగూబలవలె పుట్టుక, ముసలితనం, రోగాలు, ఆపదలు, చావులు పొందుతూ శరీరమే మేలనుకొంటూ ఉంటారు. మోహమనే మద్యపానంతో మదించినవారై, ఇంద్రియ విషయాసక్తులై తమను తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులైన మనుష్యుల సమీపానికి పోకుండా, పూర్తిగా శ్రీమన్నారాయణునిమీదే భక్తిభావం కలిగిన సద్గురువును నిత్యమూ పూజించి ఉత్తమ భాగవత ధర్మాలను ఆచరించాలి. ఆ భాగవత ధర్మాలు ఇవి :

1) సత్వగుణం కలిగి ఉండడం, 2) అన్ని ప్రాణులమీద దయగలిగి ఉండడం, 3) శ్రీహరికథలు అనే అమృతాన్ని పానం చేయడం, 4) బ్రహ్మచర్య వ్రతం అవలంబించడం, 5) ఇంద్రియ సుఖాలను మనస్సులో చేరనీయకుండా ఉండడం, 6) సాధువులతో సహవాసం చేయడం, 7) సజ్జనులతో స్నేహం కలిగి ఉండడం, 8) వినయసంపద కలిగి ఉండడం, 9) శుచిగా ఉండడం, 10) తపోలక్షణం కలిగి ఉండడం, 11) ఓర్పు కలిగి ఉండడం, 12) మౌనవ్రతం పాటించడం, 18) వేదశాస్త్రాలను చదివి ఆ యర్ధాలను అనుష్ఠించడం, 14) హింసకు పూనుకోకుండా ఉండడం, 15) సుఖదుఃఖాది ద్వంద్వాలను సహించడం, 16) భగవంతుడు అంతటా ఉన్నట్లు భావించడం, 17) మోక్షేచ్చ కలిగి ఉండడం, 18) జన సాంగత్యాన్ని వదలడం, 19) నారచీరలు మొదలైనవి ధరించడం, 20) తనంత తానుగా లభించిన దానితో తృప్తిపడడం, 21) వేదాంత శాస్త్రార్థాలను తెలుసుకోవాలనే కోరిక ఉండడం, 22) ఇతరదేవతలను నిందించకుండా ఉండడం, 23) మనోవాక్కాయాలతో శుద్ధి కలిగి ఉండడం, 24) సత్యమే మాట్లాడడం, 25) శమదమాది గుణాలు కలిగి ఉండడం, 26) ఇల్లు, తోటలు, పొలాలు, భార్య, సంతానం, ధనం మొదలైన వాటిని పరమేశ్వరార్పణంగా భావించడం, 27) భక్తులు కానివారిని దర్శించకుండా ఉండడం.

మహారాజా! మానవుడు శ్రీహరి భక్తులతో స్నేహంచేస్తూ, శ్రీహరి వృత్తాంతాలను మననం చేసుకొంటూ, ఆనందబాష్పాలు నిండిన కళ్లతో శరీరం పులకితమవుతుండగా విష్ణుమాయను గెలుస్తాడు.

(భాగవతుడికి శ్రీహరి కథలు మదిలో మెదలగానే శరీరం పులకలు రేగుతుంది. ఆ కథలను స్మరిస్తూ ఒకప్పుడు ఏడుస్తూ, మరొకప్పుడు నవ్వుతూ లౌకిక వ్యక్తులకంటె భిన్నమైన ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇది కూడా భాగవతునిలక్షణమే.)

అని చెప్పగా విదేహచక్రవర్తి వాళ్లతో ఇలా అన్నాడు. భాగవతులారా! అన్ని లోకాలకు ప్రభువై నారాయణుడు అనే పేరుతో ప్రసిద్ధుడైన పరమాత్ముని మహిమను వినాలనుకొంటున్నాను ఆనతీయండి అని అడుగగా పిప్పలాయనుడు అనే ముని ఇలా చెప్పాడు.

రాజా! నీమదికి ఇంపు కలిగేవిధంగా లోకేశ్వరుని చరిత్రను తెలియజేస్తాను. విను. సృష్టి స్థితి లయాలకు కారణమైన స్వయం ప్రకాశం కల పరంజ్యోతి స్వరూపం లేదా పరబ్రహ్మం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది. మంటలు అగ్నిలో ప్రవేశింపలేనట్లు ఇంద్రియాలు ఆత్మను పొందలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొనలేదు కదా! సత్త్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలు మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు, అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది.

సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు కలది ఒక తత్త్వం. ఆ తత్త్వం సకలపదార్థాలకు ఆధారం. దానినుండి వెలువడినవి అహంకారం, మహత్తు అనేవి. ఆ మహదహంకారం నుండి సకల భూతాలు, ఇంద్రియాలు వెలువడతాయి. వీటిలో చైతన్యరూపం కలిస్తే జీవం ఏర్పడుతుంది. ఆ చైతన్యరూపమే పరబ్రహ్మం. జీవుడు కర్మలను ఆచరించి ఆ ఫలాలకు భోక్త అవుతున్నాడు. చేతనాచేతనాలనే సత్తు, అసత్తు అంటారు. రెంటిలోను పరబ్రహ్మమే వ్యాపించి ఉంటుంది.

జీవభావం కంటె అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకొని బ్రహ్మ మొదలైనవారు నుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్ధిర చరాలలో ఉండి వృద్ధిక్రయాలు పొందకుండా, నిమిత్తమాత్రంచేత చెట్లు, తీగలు మొదలైన వానిలో ప్రతిస్పందన లేకుండా ఉంటాడు. పిమ్మట ఎల్ల ఇంద్రియాలచేత ఆవరింపబడిన ఆకారం పోగా మనస్సును వదలి వేదబాహ్యుడై తిరుగుతూ ఉంటాడు. స్పష్టమైన జ్ఞానదృష్టి గలవాడు సూర్యకాంతిసమూహాన్ని దర్శించినట్లు మంచి జ్ఞానం కలవాడు. విష్ణుభక్తిచేత గుణాలవల్ల, కర్మలవల్ల కలిగిన మనస్సులోని తప్పులను నశింపజేసుకొని, భగవంతుడిసన్నిధిని చేరుకోగలుగుతాడు. అని చెప్పగా విని విదేహరాజు ఇలా అన్నాడు.

ఓ మునిశ్రేష్ఠా! పిప్పలాయనా! మనిషి ఏయే పనులు(కర్మలు) క్రమంగా చేసి పుణ్యాత్ముడై జీవిస్తాడు? తాను పాపాలను పోగొట్టుకొని శ్రీహరి చరణాల్ని చేరుకుంటాడు?

అని విదేహరాజు అనగా విని ఆవిర్హోత్రుడు అనే ముని ఇలా అన్నాడు. కర్తవ్య కర్మలు చేయడం, కర్మలను చేయకుండడం, నిషిద్ధకర్మలు చేయడం అనే వాటిని తెలిపే వేదాలు ప్రకటించే అభిప్రాయాలు కాబట్టి వాటిని పండితులు కూడా తెలుసుకోలేరు. అవి కర్మాచారాలనిపించుకొంటాయి. పరమ పవిత్రమైన శ్రీహరిసేవ ముక్తిదాయకం. వేదవిధులను ఆచరించకుండా ఫలితాలు కోరే వాళ్లు అనేక జన్మలను పొందుతారు. ముక్తికోరేవాడు శాస్త్రం చెప్పిన విధంగా విష్ణువును పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటి దంటే - పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రమనస్కుడై పదహారువిధాలైన సేవలతో చక్రధరుని పూజించి, గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పించి, సాష్టాంగదండ ప్రణామాలు చేసి భక్తిభావంతో నిండిన మనస్సుగలవాడు హరిని చేరుతాడు - అని ఆవిర్హోత్రుడు చెప్పగా విని విదేహుడు 'భగవంతుడు ఏయే కర్మలు లేదా లీలలు ఆచరించాడో అంతా తెలుపవలసింది' అనగా ద్రమిళుడనే ముని ఇలా అన్నాడు.

(జనార్దన శబ్దానికి ప్రళయకాలంలో జనులందరిని పీడించువాడు అని వ్యుత్పత్యర్థం.
షోడశోపచారాలు - 1) ఆవాహనం 2) ఆసనం 3) పాద్యం 4) అర్ఘ్యం 5) ఆచమనీయం 6) అభిషేకం
7) వస్త్రం 8) యజ్ఞోపవీతం 9) గంధం 10) పుష్పం 11) ధూపం 12) దీపం13) నైవేద్యం 14) తాంబూలం
15) ప్రదక్షిణం 16) నమస్కారం. పూజాసమయంలో ఆచరించవలసినవి ఇవన్నీ.)

ఆకాశంలోని నక్షత్రాలను(చుక్కలను) లెక్కబెట్టవచ్చును. భూమిపై గల దుమ్ముకణాలను కూడా లెక్కబెట్టడానికి సాధ్యమవుతుంది. కాని పరిశీలించి చూడగా బ్రహ్మరుద్రాదులు కూడా శ్రీమన్నారాయణుని గుణవిశేషాలను వర్ణించలేరు.

అందుచేత తాను సృజించిన(సృష్టించిన) పంచభూతసమూహాన్ని శరీరంగా చేసి; దానిలో తన అంశతో ప్రవేశించి, సగుణాకారుడై నారాయణుడు అనే పేరుగల మునివర్యుడైన పరమేశ్వరుడు ప్రకాశించాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను ధరించి, జగత్తును సృష్టించడం, రక్షించడం, సంహరించడం మొదలైన గుణాలుండడంచేత రజస్సు, సత్త్వం, తమస్సు అనే త్రిగుణాలతో బ్రహ్మ విష్ణువు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడనబడే ఆ నారాయణునిచరిత్ర చెపుతాను. విను.

(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదూ పంచభూతాలు. ఈ పంచభూతాలతో శరీరం నిర్మించ బడుతుంది. శరీరమే పురం. దేవుడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి పురుషుడు అనేపేరు వచ్చింది. ఈ పురుషుడే పరమాత్మ)

యముడు స్వచ్చమైన మనస్సు కలదైన దక్షప్రజాపతి కుమార్తెను పెండ్లాడి బదరికాశ్రమంలో సత్కర్ముడైన నారాయణఋషిని పుత్రుడుగా కన్నాడు.

(బదరి అంటే రేగుచెట్టు. రేగుచెట్లు విస్తారంగా ఉండడంవల్ల నరనారాయణులు తపస్సుచేసిన ఆశ్రమానికి బదరికాశ్రమమని పేరు.)

అటువంటి నారాయణముని బదరికాశ్రమంలో అంతులేని నియమంతో తపస్సుచేశాడు. ఇంద్రుడు మనస్సులో భీతిచెంది అతని తపస్సును భగ్నం చేయడానికి మన్మథుణ్ణి, దేవ వేశ్యల్ని పంపాడు.

(బలఖేది = బలాసురుని సంహరించినవాడైన ఇంద్రుడు; మన్మథుని జెండాపై చేపబొమ్మ ఉండడంవల్ల మన్మథుడు మీనకేతనుడు.)

మన్మథుడు, దేవవేశ్యలు నారాయణముని తపస్సు చెడగొట్టడానికి అతని ఆశ్రమానికి వచ్చారు. ఆ తోట(తపోవనం) మద్ది, తీయమామిడి, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, మంచిగంధం, సురపొన్న, మందారం మొదలైన రకరకాల వృక్షాలతో దట్టంగా నిండి ఉన్నది. పూలతో, పండ్లతో నిండి వంగిన కొమ్మలతో కూడి ఉన్నది. గురివెంద పొదల పూలగుత్తుల మకరందం తాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. బంగారు పద్మాలతో, కలువలతో ప్రకాశించే సరస్సులు జంటలుగా విహరిస్తున్న జక్కవలూ, కొంగలూ, క్రోంచపక్షులూ, హంసల గుంపులచే అలంకరింపబడి ఉన్నాయి. తామరతూండ్లను తినడంలో ఆసక్తిగల సారసపక్షుల ముక్కులచే చీల్చబడిన తామరమొగ్గలలోని కేసరాలతో భాసించే సరోవరాలు కలిగి ఉంది. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులు మెల్లగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్లతో చిమ్ముకుంటూ నారాయణ మహర్షిని సమీపింపబోయేటప్పుడు...

నారాయణముని మన్మథునిబాణసమూహాలలో మునిగిపోలేదు. ధైర్యం విడువలేదు. ఆ స్త్రీల పదునైన చూపులకు మోహం పొందలేదు. ఏమాత్రం చలించకుండా తన హృదయంలో అచ్యుతుడు, రమేశుడు, అనంతుడు అయిన జగన్నివాసుణ్ణి నిశ్చలభక్తితో నిలుపుకొని ఆ స్త్రీలతో ఇలా అన్నాడు.

(అనంత శబ్దానికి ఆదిశేషుడు అని అర్ధం ఉన్నా - అంతంలేని వాడైన శ్రీహరినే చెప్పాలి.)

ఓ పద్మముఖులారా! మీరు ఇంద్రుడు పంపగా వచ్చారు. విహరించాలని కోరిక ఉంటే ఇక్కడ తిరగండి. అని మహర్షి అనగా వాళ్లు సిగ్గుపడి వెంటనే -

(అంభోరుహం అంటే నీటిలో మొలిచింది పద్మం.)

ఓ దివ్యమునివర్యా! నీ మహనీయ చరిత్రను తెలుసుకొని స్తుతించడానికి ఎవడికి సాధ్యమవుతుంది? ఆలుబీడ్డలనూ, మిత్రులనూ, సుఖాలనూ వద్దనుకొని తపస్సుచేసే ధర్మాత్ములకు అంతరాయాలు కలుగుతాయా? జగదీశ్వరుణ్ణి కొలిచే వాళ్లకు ఆటంకం కలుగుతుందా? కామక్రోధాలుగల మునిచేసే తపస్సు బురదగుంటలోని నీటివంటిది కదా! స్వచ్చమైన మనస్సు కలవాడా! నిన్ను వర్ణించడం మా తరమా? మా తప్పు మన్నించు - అంటూ సన్నుతించగా ఆ ముని ప్రసన్నుడై తన శక్తిని వాళ్లకు తెలియజెయ్యాలనుకొని అప్పుడు

ఆ నారాయణమునివర్యుడు ఎంతో ఆశ్చర్యంగా తన రోమకూపాలనుండి మూడుకోట్ల కన్యలసముదాయాన్ని పుట్టించాడు. గంధర్వ దేవతా కామినులు మిక్కిలి ఆశ్చర్యం, భయం మనస్సులో పుట్టగా ఆ మహార్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక అందగత్తెను తీసుకొని వెళ్లి ఇంద్రుని సభాస్థానంలో ఉంచి, జరిగిన విషయమంతా విన్నవించారు. ఇంద్రుడు మునిశక్తికి ఆశ్చర్యపడి మిన్నకున్నాడు. అటువంటి నారాయణమునీశ్వరుని చరిత్ర వినేవాళ్లు మిక్కిలి కల్యాణ గుణసంపన్నులు అవుతారు అని చెప్పగా --

('విబుధ' శబ్దానికి దేవత అని అర్థం. 'వృత్రాసురభ్రాతరం శాసితవాన్‌ పాకశాసనః అని పాకశాసన శబ్దానికి వ్యుత్పత్తి. వృత్రాసురుని సోదరుడైన పాకాసురుణ్ణి చంపినవాడని అర్థం. 'సునాసీర' అనేది ఇంద్రుణ్ణి తెలిపే పదం. శ్రేష్ఠమైన సేనాగ్రభాగం కలవాడు సునాసీరుడు.)

ఋషభునికి ఈవిధంగా ఆత్మయోగాన్ని గురించి చెప్పాడు. తరువాత శ్రీమహావిష్ణువు భూభారాన్ని అణచడానికి(తగ్గించడానికి) క్రమంగా అవతారాలు ధరించి పట్టుదలతో ఎంతో అవలీలగా రాక్షసులను సంహరించాడు.

అటువంటి పరమేశ్వరుడు విలాసంగా గ్రహించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కి - ఇత్యాది అవతారాలెన్నో ఉన్నాయి. ఆ అవతారాలనుగురించి తెలుసుకొని వాటిని నుతించడం ఆదిశేషునికైనా, బ్రహ్మదేవునికైనా సాధ్యంకాదు. అని చెప్పి

కొత్తగా వికసించిన పద్మాలవంటి కన్నుల జంట కలవాడా! పాదాలయందు ఆకాశగంగను పుట్టించిన వాడా! వేదములచే కొనియాడబడినవాడా! లక్ష్మీదేవియొక్కస్తన కుంభాలయందు పూయబడిన మనోజ్ఞమైన కస్తూరిచే పరిమళించే హృదయం కలవాడా! భూమిని మోసినవాడా! బ్రహ్మ మొదలైన దేవతల సమూహాల సంస్తుతులతో కూడినవాడా! నడుము మీద అందమైన బంగారువస్త్రం ధరించినవాడా! గరుత్మంతుడు వాహనంగా కలవాడా! వెండికొండ వేలుపుచే నుతింపబడిన వాడా! ఎల్లప్పుడు జపం చేయడంలో ఆసక్తి గలవాడా! నియమబద్ధమైన నడవడి కలవాడా! మత్స్య, కూర్మ వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, కల్కి అవతారాలను తాల్చినవాడా! గజేంద్రునికి వరాలిచ్చినవాడా! మునులచే, నరులచే, దేవతలచే, పక్షులచే పొగడబడినవాడా! కలికాలంలోని పాపాత్ముల ఆనందాన్ని హరించేవాడా!

ఈ రీతిగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసాలు ఎన్నో ఉన్నాయి. మనస్సుచేత, మాటచేత, శరీరంచేతచేసే, కర్మలతో విష్ణువును పూజించకుండా వ్యత్యస్తాలైన పోకడలతో సంచరించే మూఢులకు మంచి స్థితి ఎలా కలుగుతుంది? అని ముని అనగా ఆ మహారాజు ఆ మహాత్ముని చూచి 'అటువంటి మూఢులు ముక్తి పొందే మార్గం తెలియజేయుమ'ని అడిగాడు. అప్పుడు ఆ మునులలో 'చమసుడు' అనే ముని రాజుతో ఇలా అన్నాడు.

శ్రీహరి ముఖంనుండి, బాహువులనుండి, ఊరువులనుండి, పాదపద్మాలనుండి క్రమంగా నాలుగువర్ణాలవాళ్లు పుట్టారు. వాళ్లలో స్త్రీలూ, శూద్రులూ విష్ణువును స్మరిస్తారు. కలియుగంలో వేద, శాస్త్ర, పురాణాలలో ప్రసిద్దులై, కర్మలను ఆచరిస్తూ బ్రాహ్మణులు మిక్కిలిగర్వంతో విష్ణుభక్తులను ఎగతాళి చేస్తారు. వాళ్లు నరకానికి పోవడం నిజం. మెత్తని పక్వాన్నం తినడం మాని, ప్రాణిహానికి పాల్పడేవాడికి - అంటే జంతువులను చంపి మాంసం భుజించేవాడికి పాపం కలుగుతుంది. హరిని స్తుతించకుండా స్త్రీసౌఖ్యాన్ని అనుభవించాలని వెంపరలాడేవాడికి ఎప్పటికీ నరకమే కలుగుతుంది.

అందుచేత ఇల్లు, పొలం, సంతానం, భార్య, ధనం, ధాన్యం మొదలైన వాటిలో వ్యామోహంచేత మోక్షమార్గాలు కంటికి కనపడేవి కావని(పరోక్షాలని) వాటిని నిందించేవాడూ, హరిభక్తి లేనివాడూ నరకంలో పడతారని చమసుడు అనే మునివర్యుడు ఆనతిచ్చాడు. అప్పుడు విదేహరాజు ఇలా అన్నాడు.

అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణువు ఏ యుగంలో ఏ విధంగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? పూర్వం మునులచే, దేవతలచే ఏవిధంగా స్తుతించబడినాడు.

విదేహరాజు అడిగిన విషయం వినిన మునులలో 'కరభాజనుడు' అనే మునివర్యుడు ఇలా అన్నాడు. “ఎన్నో అవతారాలు, ఎన్నోరూపాలు, పలువిధాలైన రంగులు కలిగి రాక్షసులను సంహరించి; దుర్జనశిక్షణ, సజ్జనరక్షణ చేస్తూ శ్రీమహావిష్ణువు కృతయుగంలో తెల్లనిరంగు కలిగి, నాలుగుచేతులు కలిగి ఉంటాడు. జడలు, నారచీరలు, నల్లజింకచర్మపు ఉత్తరీయం, జపమాల, దండం, కమండలువు ధరించి; తపస్సు; ధ్యానం; అనుష్ఠానం గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సువర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్యనామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్దుడవుతాడు. త్రేతాయుగంలో ఎరుపురంగు కలవాడై నాలుగుచేతులు, మూడు పోగుల మొలనూళ్లు ధరించి, బంగరు రంగు జుట్టు కలిగి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు, స్రువం మొదలైన హోమసాధనాల చిహ్నాలలో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో వేదాంతులచేత నుతింపబడుతాడు. ద్వాపరయుగంలో నీలవర్ణం కలిగి, పీతాంబరం కట్టుకొని, రెండు చేతులు కలిగి, దివ్యాయుధాలు ధరించి, శ్రీ వత్సం, కౌస్తుభం, వనమాల అనే వాటితో ప్రకాశిస్తూ, మహారాజలక్షణాలు కలవాడై జనార్దనుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్దుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మొదలైన పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతింపబడుతాడు. కలియుగంలో నల్లని రంగు కలిగి, కృష్ణుడనే పేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞగానాలచేత వినుతింపబడతాడు. హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నలినోదరుడు మొదలైన పేర్లతో వేదాంతులైన మునివర్యులు స్తుతిస్తారు. ఇంకా -

ద్రవిడ దేశంలోని తామ్రపర్ణి, సహ్యజ, కృతమాల మొదలైన నదుల దగ్గరకు ఎవడైనా భక్తితో వెళ్లి, అక్కడ ఉండి పితృయజ్ఞాలు చేస్తే పుణ్యం లభిస్తుంది.

ఈ విధంగా కొనియాడదగిన కావేరి మొదలైన మహానదుల పవిత్ర జలాలలో స్నానం, పానం, దానం ఆచరించి; విష్ణుకథలనే అమృతరసం అనుభవించి ప్రసిద్ధులైన భాగవత శ్రేష్ఠులు ఉంటే వాళ్లు నశించనిస్థానం పొందుతారని ఋషభకుమారులు భగవంతునిమారురూపాలైన మహాత్ములవలె విదేహరాజుకు భగవద్భక్తికి సంబంధించిన ధర్మాలను బోధించి అంతర్హితులయ్యారు. మిథిలాధిపతి కూడా జ్ఞానయోగం స్వీకరించి ముక్తిపదం పొందాడు. ఈ కథను ఎవరు రాసినా, చదివినా, విన్నా వాళ్లకు ఆయువు, ఆరోగ్యం, సంపదలూ కలుగుతాయి. కొడుకులు, మనుమలూ కలుగుతారు. కలికాలానికి చెందిన సమస్త దోషాలు తొలగి విష్ణులోకంలో నివసిస్తారు అని నారదమహర్షి వసుదేవుడికి చెప్పాడు. అంతే కాకుండా -

వసుదేవా! నీవు కమలలోచనుడైన శ్రీమన్నారాయణుని పదభక్తికి సంబంధించిన కథలు విని పాపరహితుడవయ్యావు. నీకు లోకప్రసిద్ధమైన మంచి కీర్తి కలుగుతుంది. ఆపై కైవల్యం సిద్ధిస్తుంది. విష్ణువు నీ కొడుకు అనే మోహాన్ని విడిచి ఆయన శ్రీమహావిష్ణువు అని తెలుసుకొని సేవించు. ఆయన నీ కొడుకుగా అవతరించడం చేత నీ జన్మ పవిత్రమైంది. ఆయనతో సరస సల్లాపాలు జరుపుతూ స్నేహంగా మెలగడంవల్ల పవిత్రుడవైనావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురుడు, జరాసంధుడు, కాలయవనుడు శత్రువులైనా సంతోషంతో వాసుదేవునిలో చేరారు. అంటే వైరభక్తితో ముక్తి పొందారని భావం.

(శిశుపాలుడు - శ్రీకృష్ణునిమేనత్త సాత్త్వతి ఇతనితల్లి. తండ్రి దమఘోషుడు. శిశుపాలుడు గతజన్మలో హిరణ్యకశిపుడు. ధర్మరాజు రాజసూయయాగం చేసిన సందర్భంలో కృష్ణుడు తన సుదర్శనాయుధంతో సంహరించాడు. 

పౌండ్రకుడు - ఇతడు కరూశదేశాధిపతి. తానే నిజమైన వాసుదేవుడనని చెప్పుకొంటూ శ్రీకృష్ణునికి గల వాసుదేవ నామాన్ని తొలగించుకొమ్మని ఆగడం చేయడంవల్ల శ్రీకృష్ణునిచేతిలో మరణించాడు.

మురుడు - ఇతడు మురుడనే రాక్షసుడు. వరప్రభావంతో గర్వించి దేవేంద్రుని బాధించడంవల్ల శ్రీకృష్ణుడితనిని వధించాడు. 

జరాసంధుడు - ఇతడు మగధరాజు బృహద్రథుడికొడుకు. ఇద్దరు స్త్రీలకు సగం సగం శరీర భాగాలతో పుట్టిన ఇతనిని ఆస్త్రీలిద్దరూ పారేస్తారు. జర అనే రాక్షసి ఆ రెండు శరీరభాగాలను కలపడంవల్ల ఇతడు బతుకుతాడు. జర కలిపింది కాబట్టీ ఇతనికి జరాసంధుడు అనే పేరు కలిగింది. కంసుడి మామ అయిన ఈ జరాసంధుడు భీముడి చేతిలో మరణిస్తాడు.

కాలయవనుడు - యవనుడి కొడుకితడు. ఇతనిని నారదుడు ప్రేరేపించి కృష్ణుడి మీదికి యుద్దానికి పంపిస్తాడు. కృష్ణుడు ఎదురుగావెళ్లి పోరాడకుండా నీకు ధైర్యముంటే నన్ను పట్టుకొమ్మని పరుగెత్తి ముచికుందుడు అనే మహర్షి ఉన్న గుహలోకి వెళతాడు. కాలయవనుడు కూడా గుహలోకి వెళ్లి కృష్ణుడనుకొని ముచికుందుణ్ణి తొక్కి అతడి చూపులకు భస్మమవుతాడు.

వైరభక్తి - శ్రీమన్నారాయణుడితో వైరంపూని ఆయనను సంహరించడానికి ప్రయత్నించి తామే ఆయన చేతిలో మృతులై కైవల్యప్రాప్తి పొందిన రాక్షసులెందరో ఉన్నారు. శిశుపాల జరాసంధులు ఇటువంటి వాళ్లే. వైరంతో భగవంతుని అనవరతం వెదుకుతూ, ఆయన నామాన్ని ఇష్టం లేకున్నా ఉచ్చరిస్తూ వైరభక్తిని ప్రకటించుకొన్న వాళ్లు చివరకు మోక్షమే పొందగలిగారు.)

దుర్జనులను శిక్షించడం కోసం, సజ్జనులను రక్షించడంకోసం బ్రహ్మ మొదలైన ఎందరో దేవతలు ప్రార్ధించగా శ్రీహరి లోకంలో అవతరించాడు.

ఆ కారణంచేత లోకాలను రక్షించడంకోసం విష్ణువు అవతరించాడని వివరిస్తూ నారదుడు విష్ణుభక్తికి సంబంధించిన కథలు చెప్పాడు. ఆ కథలను వినిన దేవకీవసుదేవులు ఆశ్చర్యచకితమానసులై శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు. ఈ విషయాలు శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. పరీక్షిత్తు 'మునివర్యా! యాదవులను శ్రీహరి ఏవిధంగా నశింపజేశాడు? పరివారాలతో కూడినబ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, ఋషులు ద్వారకానగరంలో ఎలా ప్రవేశించారు? తరువాత ఏమైంది? శ్రీకృష్ణుడికథలు అనే అమృతాన్ని వీనులవిందుగా ఆస్వాదించినా ఇంకా తృప్తి కలగడంలేదు. భక్తులను రక్షించే శ్రీహరిచరిత్ర ఎలా కొనసాగింది; ఆపై వృత్తాంతమంతా తెలుపుము' అనగా శుకుడు ఇలా అన్నాడు.

బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు బిలువ వచ్చుట






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Friday, September 4, 2026

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను అని నిశ్చయించినాడు. మధురా నగరాన్ని యాదవ వంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు.

శ్రీ కృష్ణుని గూర్చి అయన గొప్పతనం గూర్చి మహాభారతం, భాగవత పురాణంలో చాలా చక్కగా వ్యాసమునీంద్రులు వివరించారు. 

శ్రీ కృష్ణుడు దేవకి, వసుదేవుల ఎనిమిదవ(అష్టమ) కుమారుడు . అతని జనన సమయంలో, హింస విపరీతంగా ఉండేది,

వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేసారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి సాగనంపుతుంటే ఆకాశవాణి – దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, మరియు తన తండ్రి ఉగ్రసేన మహారాజును మధురలోని చెరసాలలో బంధిస్తాడు.

ఆ కారాగారంలోనే శ్రీ కృష్ణుడు  జన్మించాడు, వారికి పుట్టిన మొదటి ఆరుగురు నవజాత శిశువులను పుట్టిన కొద్దిసేపటికే కంసుడు సంహరించాడు.

దేవకీ ఏడవ మారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆ గర్భాన్ని రోహిణి గర్భంలోకి  మారుస్తాడు. తదుపరి రోహిణి గర్భంలో బలరాముడు జన్మిస్తాడు. తరువాత దేవకీ ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది.

శ్రావణ శుద్ధ అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. దేవకి గదికి కాపలాగా ఉన్న కావలివారు విష్ణుమాయతో నిద్రపోవడంతో, వాసుదేవుడు కృష్ణుడిని తీసుకొని ఒక బుట్టలో పెట్టుకొని బయలుదేరుతాడు.విష్ణుమాయతో ఆ కారాగారం తలుపులు కూడా తెరుచుకున్నాయి.

తదుపరి వసుదేవుడు కృష్ణుడిని యమునా నది దాటించి నిద్రిస్తున్న యశోద పురిటిలో శ్రీకృష్ణుని ఉంచి ఆమెకు పుట్టిన స్త్రీ శిశువును తీసుకొని వస్తాడు. ఆమెయే యోగమాయ.

అక్కడి శిశువును తిరిగి చెరసాలకు తీసుకువస్తాడు. ఆ శిశువు యోగమాయగా అవతరించి కంసుడిని హెచ్చరిస్తుంది.

కృష్ణుని బాల్యమంతా, అతని సోదరుడైన బలరాముడుతో కలిసి నందవ్రజం, బృందావనం లో గడిచింది. అక్కడకి వచ్చిన పూతన లాంటి రాక్షసులను సంహరించి అక్కడి గోపగోపికలకు మరియు నందయశోదలకు ఆనందం కలిగిస్తాడు.

తదుపరి  మధురకి వచ్చి కంసుని మరియు అతని సహచర రాక్షసులను వధించి భూమికి కొంత భారం తగిస్తాడు.

తదుపరి కాలంలో మహాభారత యుద్ధంలో పాండవులతో కలిసి కొరవ మరియు దుష్ట రాజులను సంహరించి భూమికి భారం తగిస్తాడు 

శ్రీకృష్ణుని చిన్నతనంలో వెన్న దొంగిలించడం, దూడలను వెంబడించడం, గోశాలలో ఆడటం మరియు కుస్తీ పోటీలలో పాల్గొనడం వంటి కార్యక్రమాలలో బలరాముడుతో కలిసి పాల్గొనేవాడు.

కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు
ఈ రోజు భక్తులు పవిత్ర స్నానం చేసి పూజ అయ్యే వరకు ఉపవాసం ఆచరించాలి. పగలంతా ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం శ్రీకృష్ణుడికి పూజలు చేయాలి.

నైవేద్యంగా పండ్లు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ సమర్పించాలి. కొబ్బరితో చేసిన పంచకజ్జాయం ప్రసాదం గా కొన్ని ప్రాంతాలలో సమర్పిస్తారు.

సాయంత్రం ఉట్టి కట్టి సంతోషంగా జరుపుకోవాలి. లేని వారికి దానం చేయడం శ్రేష్టం. శ్రీకృష్ణ జయంతి వ్రతం చేయాలి.

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి పాటలు పాడుతూ నిద్రపుచ్చాలి.

ఈ జన్మాష్టమినాడు ప్రజలు ఉపవాసాలు ఉంటూ, కృష్ణునిపై ప్రేమను కీర్తిస్తూ భక్తి గీతాలు పాడుతూ, రాత్రంతా జాగరణ చేస్తూ జరుపుకుంటారు.

Thursday, September 3, 2026

Vishwamitra Vasista Naaradaadi Maharshulu Srikrishna Sandarsanambuku Vacchuta - విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - 
విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట

సాటిలేని అందమైన శరీరం ధరించి, అన్ని పనులూ చేయడంలో ఆసక్తి కలవాడైన శ్రీకృష్ణుడు యాదవులను నశింపజేయాలనే ఆలోచనలో ఉండిన సమయాన జటావల్కలాలు, కమండలాలు ధరించి; నల్లజింకచర్మాలు, రుద్రాక్షలు, విభూతి అలంకరించిన శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగువు, అంగిరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యులు; అత్రి, వసిష్ఠుడు, నారదుడు మొదలైన మునిశ్రేష్ఠులు స్వేచ్చావిహారం చేస్తూ ద్వారకానగరానికి వచ్చారు. ఆ ద్వారకానగరంలో

వాలఖిల్యులు నిత్య బ్రహ్మచారులు, ఊర్థ్వరేతస్కులు. అంగుష్ఠప్రమాణదేహులు. ఎప్పుడూ తలకిందులుగా తపస్సుచేస్తూనే ఉంటారు. వీళ్లను బ్రహ్మపుత్రులుగా పురాణాలు పేర్కొంటున్నాయి. వీళ్లు అరవైవేలమంది. వీళ్లుకూడా మహర్షులతో కలసి ద్వారకకు వచ్చారు.

గొప్పవాడూ, కౌస్తుభమణిని ఆభరణంగా కలవాడూ, చెవిపోగులజంటతో అందమైనచెంపలు కలవాడూ, తెల్లతామరలవంటి కండ్లుకలవాడూ, మేఘంవలె నల్లనివాడూ, అనేకరత్నాలు పొదిగిన కిరీటం ధరించినవాడూ, ఆజానుబాహుడూ, అడ్డులేని(చక్రాది) ఆయుధాలు చేతులలో ధరించినవాడూ, శుభకరమైన పసుపు పచ్చని పట్టువస్త్రం కట్టుకొన్నవాడూ, రుక్మిణీదేవి నయన పద్మాలకు సూర్యునివంటివాడూ, బ్రహ్మాదిదేవతలచేత సేవించదగిన చరణ కమలాలు కలవాడూ, కోటిమన్మథుల కాంతులతో ఒప్పే కోమలమైన శరీరం కలవాడూ, దీనజనరక్షణతో ప్రసిద్ధమైన నడవడి కలవాడూ, దయకు సముద్రం వంటివాడూ అయిన శ్రీకృష్ణుణ్ణి ఆ ఘనులైన మునులు దర్శించారు.

ద్వారకకు విచ్చేసిన మునులకు అర్ఘ్యం, పాద్యం మొదలైన మర్యాదలు చేసిన తరువాత వారు బంగారు గద్దెలపై కూర్చొని, పద్మనేత్రుడైన శ్రీకృష్ణునితో...

పద్మనాభా! జనులు అడవులలో ఉన్నప్పటికి నిన్ను కొలవని రోజులు వృథాగా గడచిపోతూ ఉంటాయి. శరీరాలు స్థిరమైనవి కావు కదా!

శ్రీకృష్ణా! భూమిపై పరమపవిత్రమైన నీ పాదాలు సంసారసముద్రాన్ని దాటించే తెప్పలు. పాపాలనే తీగలను హరించేవి. వేదాలకు అలంకారాలు. పీడితజనానికి దిక్కైనవి.

పద్మలోచనా! లక్ష్మీవల్లభా! ఒక సమయంలో చాలా చిన్నరూపాన్ని పొందుతావు. మరొక సమయంలో సృష్టి అంతా నీవే అయి పెద్ద రూపాన్ని ధరిస్తావు. ఇలా అనేక రూపాలను ధరిస్తున్న నీ ఆధిక్యతను స్తోత్రం చేయడానికి మాకు అలవి గాక ఆశ్చర్యం కలుగుతోంది.

లక్షీపతీ! పద్మలోచనా! నీ నామం అనేక జన్మలు అనే వ్యాధులకు కారణమైన కర్మలను సమర్థంగా నశింపజేసే మందు. అయ్యో! చెడుతలంపు కలవాళ్లు దీనిని తెలుసుకోలేక పోతున్నారు గదా!

ఇలా ఎన్నో విధాలుగా స్తోత్రం చేసిన (నారదాది) మునిశ్రేష్ఠులను దయగల కడకంటి చూపులతో చూచి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. “నా ధ్యానం, నా నామస్మరణం, జన్మ నెత్తడం అనే రోగాన్ని హరిస్తాయి. బ్రహ్మ శివుడు మొదలైనవారికి శరణమవుతాయి. శుభాలను కలిగిస్తాయి. నా రూపాలైన బ్రాహ్మణుల బాధలను తొలిగించే వారిని నేను ఐశ్వర్యవంతులను చేస్తాను అని యోగీశ్వరులకే ప్రభువైన శ్రీకృష్ణుడు సెలవిచ్చి తరువాత 'మీరు ఇక్కడికి ఎందుకొచ్చారు' అని అడిగాడు. దానికి ఆ మునులు 'మీ పాదపద్మాలను దర్శించడంకంటె మరొక విశేషం ఏముటుంది?' అన్నారు. వాసుదేవుని ముఖచంద్రామృతాన్ని తమకండ్లు అనే చకోరాలతో తాగి తమ ఇష్టానుసారం విహరించేవాళ్లై ద్వారకానగరానికి సమీపంలోగల పిండారకమనే పవిత్రతీర్థానికి వెళ్లారు. ఆ తరువాత...

(నారదాదులు పిండారక తీర్థానికి వెళ్లిన తరువాత) కొందరు యాదవులు పొగరెక్కి తమనేర్పుతో సాంబుణ్ణి అందంగా అలంకరించి, కప్పురపుతావిగల స్త్రీవలె కనిపించేటట్లు తయారుచేసి,

(సాంబుడు జాంబవతి శ్రీకృష్ణుల కొడుకు. యాదవవంశాన్ని నిర్మూలించిన ముసలానికి జన్మనిచ్చిందితడే.)

కొందరు యాదవులు గుంపుగా చేరి పెద్దగా నవ్వుతూ, అరుస్తూ, కేరింతలు కొడుతూ స్త్రీ వేషంలో ఉండిన సాంబుని ముందుంచుకొని వెళ్లారు. మునులసమూహానికి సాగిలబడి నమస్కరించారు. స్పష్టంగా కనపడుతున్న బరువైన గర్భంగల ఈ స్త్రీ కడుపులో ఉన్నది మగపిల్లవాడా లేక ఆడపిల్లా ఆలోచించి తేల్చి చెప్పుమని మునులను అడిగారు. అలా అడగగానే (మునులు) విపరీతంగా కోప్పడి

అలా వచ్చిన యాదవ బాలకులను చూచి వీళ్లు కొవ్వెక్కి వచ్చినారని భావించారు మునులు. కోపంతో కనుల చివర నిప్పులు వ్యాపించగా మమ్మల్ని ఎగతాళి చేయవచ్చా? అంటూ

యదువంశాన్ని నిర్మూలించగల ఒక రోకలి ఈ అమ్మాయికి తప్పకుండా పుడుతుంది. ఆలస్యం లేదు. ఇక వెళ్లండి అని చెప్పగా

దర్పంతో అతిశయించిన యాదవబాలకులు మునులు ఇచ్చిన శాపం విని భయపడి వడవడ వణకుతూ సాంబుని పొట్టచుట్టూ చుట్టిన వస్త్రం ముడి విప్పారు. అప్పుడు ఆ వస్త్రం నుండి ఒక రోకలి నేలమీద పడింది. యాదవ బాలకులకు ఆశ్చర్యం కలిగింది. దానిని తీసుకొనివెళ్లి శ్రీకృష్ణుని ముందుపెట్టి జరిగినదంతా చెప్పారు. అదంతా తాను కల్పించిన మాయవల్లనే జరిగిందని తెలిసికూడా తెలియని వాడిలాగా శ్రీకృష్ణుడు వాళ్లతో ఇలా అన్నాడు.

బుద్ది వక్రించి కండ్లు కనపడక పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహర్షులను పరిహాసం చేసే ప్రయత్నం చేసి, కులనాశనానికి మూలకారణమైన శాపం పొందే అవివేకులు ఉంటారా? (ఉండరు)

బ్రాహ్మణశాపాన్ని విష్ణువు, శివుడు, బ్రహ్మ మొదలైన వారైనా అడ్డుకోగలరా? ఇక మానవమాత్రులు ఎంతటివాళ్లు? పూర్వజన్మ కర్మఫలాన్ని అనుభవించకుండా తోసి పారెయ్యడానికి సాధ్యం కాదు గదా!

యతులను మిక్కిలి తూలనాడడంవల్ల యందువంశం నాశనం కాక తప్పదు. ఇందులో సందేహంలేదు. అని పలికి శ్రీకృష్ణుడు యాదవులతో సముద్రపు ఒడ్డున ఒక పెద్దకొండ ఉంది. అక్కడ ఎత్తుగా విశాలంగా భయం కలిగిస్తూ ఉండే బండమీద మీ భుజబలంతో ఈ ఇనుపరోకలిని బాగా పొడిచేసి ఆ పొడిని సముద్ర జలంలో కలిపి రండి. వెళ్లండి అన్నాడు. విశ్వపతి అయిన శ్రీకృష్ణుడు అలా చెప్పగానే వాళ్లు ఆ రోకలిని పొడిచేసి, దానికంటుకొని మిగిలి ఉండిన లోహపు ముక్కను పట్టించుకోకుండా సముద్రజలంలో పడవేశారు. ఆ లోహపుముక్కను ఒక చేప మింగింది. దానిని ఒక బోయవాడు వల సహాయంతో పట్టుకొన్నాడు. దాని కడుపులో ఉండిన ఇనుపముక్కను తీసి, తన బాణం చివర మొనగా చేసుకొన్నాడు. అని ఆ కథా విషయమంతా చెప్పిన శుకమహర్షిని చూచి పరీక్షిన్మహారాజు ఇలా అన్నాడు.

మహర్షీ! మనస్సు ఎలా చలనరహితంగా నిలుస్తుంది? వసుదేవుడు మన్మథజనకుడైన శ్రీమన్నారాయణుని చరణ కమలాలను ఎల్లవేళలా సేవించడం మిక్కిలి ఉత్తమమని నమ్మి, ఏవిధంగా తన మనస్సును నిశ్చలంగా నిలిపి పరమాత్మను పొందాడు.

అలా అడిగిన మహారాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు.

వసుదేవునకు నారదుడు పురాతనంబగు విదేహర్షభ సంవాదం దెలువుట






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Tuesday, September 1, 2026

Parikshinmaharaju Shukayogindru Nadigedu Prashna - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము - పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న

“అయ్యా! పుట్టుకకు కారణమైన కర్మ అనే రోగం తొలగిపోవడానికి కారణమైన దివ్యమైన మందు కాబట్టి శ్రీమన్నారాయణునికి సంబంధించిన కథలనే అమృతం తాగు” మని ఇలా అన్నాడు.

శ్రీకృష్ణుడు గొప్ప భుజబలం కలవాడై బలవంతమైన సేనతో గొప్ప రాక్షసవీరులందరిని యుద్ధంలో అనతికాలంలోనే సంహరించాడు. భూభారం ఇంకా ఎక్కువగా ఉండడంచేత జూదం అనే క్రీడ కారణంగా యుద్ధంలో చావడానికి కౌరవ పాండవసేనలు భూమండలం కంపించే విధంగా నడిచాయి.

అప్పుడు తనయందు (శ్రీకృష్ణుని) సహజమైన భక్తి గల యాదవవీరులు(యుద్ధంలో నశింపక) ఎంతగానో సంతసించారు. (వీరిని చూచిన) మహర్షులు, నందుడు మొదలైన వారికి కూడా ఎంతో సంతోషమైంది.

దేవతలందరిచేత సేవింపబడి ప్రసిద్ధుడైన శ్రీకృష్ణుడు దుర్మదాంధులైన భూపాలకులను అణచివేసి, కంసుడు మొదలైన వాళ్లను సమూలంగా సంహరించి, భూభారం తగ్గించి ఎంతో సంతోషంతో ఉండగా యాదవసేనలు విజృంభించి, నేల దద్దరిల్లేటట్లు అతి భయంకరంగా దుస్సహంగా నడిచాయి (దీనివల్ల భూభారం అధికమైంది).

శ్రీకృష్ణుడీవిధంగా పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబకాసురుడు, అఘాసురుడు మొదలైన రాక్షసులను; చాణూర ముష్టికులనూ; సాల్వ, శిశుపాల, దంతవక్త్ర, కంస, పౌండ్రకాదులను సంహరించి, ఆపైన కురుబలాన్ని అణచివేసి, ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాడు. ధర్మరాజు రాజ్యపాలన చేస్తుండగా సంతోషపడినాడు. తన భక్తులైన యాదవులను పరిశీలనగా చూచి “వీళ్లు ఇతరుల వల్ల పరాభవం(అవమానం) పొందరు. వీళ్లను సంహరించడానికి నేను తప్ప ముల్లోకాలలోనూ మరొక దైవం లేదు” అని భావించాడు.

యాదవులను పరిమార్చడానికి తాను తప్ప మరొక దైవం లేదని లోకప్రభువైన శ్రీకృష్ణుడు బాగా ఆలోచించాడు. ఎంతో పెద్దదైన వెదురుగుబురును (పొదను) లోపలి బొంగులు ఒకదానిని మరొకటి రాసుకోవడంవల్ల పుట్టిన అగ్ని దహించే విధంగా యాదవసేనలలో పరస్పర శత్రుత్వాలు కలిగించి ఆ సేనలను నాశనం చేస్తానని నిశ్చయించాడు. దానికి బ్రాహ్మణశాపాన్ని మూలకారణంగా తలచాడు. అనుకొన్నవిధంగా యాదవులను నశింపజేశాడని చెప్పిన శుకమహర్షితో రాజశ్రేష్ఠుడైన పరీక్షిత్తు ఇలా అన్నాడు.

ఓ మునిసత్తమా! ఆలోచించి చూస్తే శ్రీహరి పాదకమలాలను ఆసక్తితో సేవించే యాదవులకు బ్రాహ్మణశాపం ఎలా కలిగిందో ననిపిస్తున్నది. ఆ కారణాన్ని తలియజేయండి.

అలా అడిగిన రాజుకు మునిశ్రేష్ఠుడైన శుకుడు గొప్పవైన, గంభీరాలైన వాక్ప్రవాహస్ఫూర్తితో వినుమని ఇలా చెప్పడం ఆరంభించాడు.

విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనంబుకు వచ్చుట






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sunday, August 30, 2026

Sree Maha Bhagavathamu Part 11 - శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

శ్రీరస్తు శ్రీమహాభాగవతము ఏకాదశస్కంధము 

శ్రీ సీతాపతి! లంకే, శాసురసంహారచతుర! శాశ్వత! నుత వా 
ణీసత్యధిభూభవవృ, త్రాసురరిపుదేవజాల! రామనృపాలా!

శ్రీ జానకీనాయకా! లంకకు ప్రభువైన రావణుణ్ణి వధించడంలో నేర్పుచూపినవాడా! సుస్థిరుడా! సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మదేవుడు, శివుడు, వృత్రాసురుని శత్రువైన ఇంద్రుడు, దేవతలసమూహం స్తుతించిన లేదా వాళ్ల స్తుతికి పాత్రమైన ఓ రామభూపాలా!

ఉత్తమగుణాలు ఉండడంచేత ఎంతో గొప్పవారైన వైశంపాయనాది మునిశ్రేష్ఠులతో పురాణాలన్నిటిని వివరణాత్మకంగా చెప్పగల సూతమహర్షి ఇలా అన్నాడు. అలా ప్రాయోపవేశదీక్షను పూనిన పరీక్షిత్తు అనే మహారాజును చూచి శుకమునివర్యుడు

పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రు నడిగెడు ప్రశ్న








శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము






శ్రీ మహాభాగవతము ఏకాదశస్కంధము

Sree Maha Bhagavathamu Part 12 - శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము

శ్రీరస్తు శ్రీ మహాభాగవతము ద్వాదశస్కంధము శ్రీ మరుదశనపతిశయన!, కామిత మునిరాజ యోగి కల్పద్రుమ! యు ద్దామ! ఘనజనకవరనృప, జామాతృవరేశ! రామచంద్రమహీశా! గ...