Sunday, December 29, 2024

ADHE CHUDARAYYA అదె చూడరయ్యా

 అదె చూడరయ్యా


తాళం : ఆది
రాగం : భోళి (మేళకర్త 15, మాయ మాళవ గౌళ జన్యరాగ )
రూపకర్త : అన్నమాచార్య

ఆరోహణ : స రి1 గ3 ప ద1 స
అవరోహణ: స ని3 ద1 ప గ3 రి1 స

పల్లవి
అదె చూడరయ్యా పెద్ద హనుమంతుని
గుదిగొని దేవతలు కొనియాడేరయ్యా ||

చరణము
ఉదయాస్తశైలములు ఒక జంగగా చాచె
అదిగో ధ్రువమండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ||

దండిగా బ్రంహ్మాOడము దాక తోకమీదకెత్తి
మెండగు ధిక్కుల నిండా మేను వెంచెను
గుండు గూడా రాకాసుల కొట్టగా చేతులు చాచె
అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా||

ధిక్కులు పిక్కటిల్లగా దేహారో మములు పెంచె
పక్కన లోకములకు ప్రాణమై నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరి బంటాయ
మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య ||

KATTEDURA VAIKUNTHAM కట్టెదుర వైకుంఠము

 పల్లవి 

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ ||

చరణములు 
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ||

సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ||

వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ||

CHANDAMAMA RAAVO చందమామ రావో జాబిల్లి రావో

 పల్లవి 

చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో ||

చరణములు 
నగుమోము చక్కని యయ్యకు నలువ బుట్టించిన తండ్రికి
నిగమము లందుండే యప్పకు మా నీల వర్ణునికి |
జగమెల్ల నేలిన స్వామికి ఇందిర మగనికి
ముగురికి మొదలైన ఘనునికిమా ముద్దుల మురారి బాలునికి ||

తెలిదమ్మి కన్నుల మేటికి మంచి తియ్యని మాటల గుమ్మకు
కలికి చేతల కోడెకుమా కతల కారి ఈ బిడ్డకు |
కుల ముద్ధించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు
నిలువెల్ల నిండు వొయ్యారికి నవ నిధుల చూపుల జూసే సుగుణునకు ||

సురల గాచిన దేవరకు చుంచు గరుడుని నెక్కిన గబ్బికి
నెరవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతల పట్టికి |
విరుల వింటి వాని యయ్యకు వేవేలు రూపుల స్వామికి
సిరిమించు నెరవాది జాణకు మా శ్రీ వేంకటేశ్వరునికి ||

INDARIKI ABHAYAMBU ఇందరికీ అభయంబు లిచ్చు చేయి

 రాగం: కాంభోజి రాగం


పల్లవి 
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||

చరణములు 
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోల్ల వాడిచేయి ||

తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||

పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||

EKKUVA KULAJUDAINA ఎక్కువ కులజుడైన హీన కులజుడైన

 పల్లవి 

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ||

చరణములు 
వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె |
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||

పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె |
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ||

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె |
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||

JO ACHYUTANANDA జో అచ్యుతానంద జోజో ముకుందా

 పల్లవి 

జో అచ్యుతానంద జోజో ముకుందా
రావె పరమానంద రామ గోవిందా ||

చరణములు 
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా |
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ||

గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి |
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి ||

నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ |
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ||

పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు |
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ||

అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే |
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ||

గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి |
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ||

రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను |
మాపుగానే వచ్చి మా మానములను
నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ||

ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి |
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ||

అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి |
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ||

హంగుగా తాల్లపాకన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పె నీ జోల |
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల ||

JAGADAPU CHANUVULA జగడపు చనువుల జాజర

 పల్లవి 

జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||

చరణములు 
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||

భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||

బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...