Monday, January 5, 2026

Karulla Karalla Gowri Devi Katha - కరుళ్ళ గౌరీదేవి కథ

కరుళ్ళ గౌరీదేవి కథ

ఒక బ్రాహ్మణునకు అయిదుగురు కొడుకులు కలరు. ఆ అయిదుగురు కొడుకులకు పెండ్లి అయి అయిదుగురు కోడండ్రు కాపురమునకు వచ్చిరి. అందులో అయిదవకోడలు కరుళ్లగౌరీదేవి నోము పట్టినది. అందుచేత వాళ్ళందరూ సంపదలతో తులతూగుచుండిరి. 

ఆ చిన్నది ప్రతిదినము ఉదయ కాలమందే స్నానము చేసి, అత్త సొమ్మొద్దు మామ సొమ్మొద్దు, పుత్రి సొమ్మొద్దు, పురుషసొమ్మొద్దు, నా సొమ్మే నాకిమ్మిని సూర్యదేవుని ప్రార్థించి ఆమెరోజూ నమస్కారములు చేసేది. అట్లు నమస్కారములు చేసిన కొంతకాలమునకు అత్తకు మామకు, బావకు మరదలకు, భర్తకు ఎల్లవారికి ఆమెమీద కోపంగా వుండేది. ఒకరోజున పడుకొని నిద్రపోవుచుండగా మంచముతోపాటు దీసుకొనిపోయి మహారణ్యములో షారవేసిరి. ఆమె కొంతసేపటికి నిద్రమేలుకొని ఆ యడవిలోనే నీళ్ళు పోసుకొని సూర్యభగవానునకు నమస్కారము చేయుచుండగా ఆమె దోసిటిలోనికి నిండుగా వరహాలు వచ్చెను. ఆమె అవి తీసుకొని సమీప 'పల్లెకేగి పసుపు, కుంకుమ, గిన్నె ఉప్పు, మిరపకాయ, బియ్యము మొదలగు యావత్తు సామాగ్రిని కొని ఒక
గొల్లముసలివాని సహాయమున నొక గుడిసెలో నివసించుచుండెను. యింటి వద్దనున్న వారికందరికి అష్టదరిద్రము పట్టుకొని నానాస్థలములు తిరుగుచు తినుటకు తిండి, కట్ట గుడ్డయు లేక బాధపడుచు ఒకరోజున కట్టెపుల్లల నిమిత్తము యీ యడవిలోనికి వచ్చిరి. అట్లు వచ్చి తమకు సమీపములో నొకచోట సూర్యనమస్మారములు చేయుచున్న యా చిన్నదానిని చూచి తక్కిన కోడండ్రంతా"ఇదిగో! మా తోటికోడలు ఈలాగే సూర్యనమస్మారములు చేయుచుండేది" అని తమవారితో చెప్పసెాగిరి. 

సూర్యప్రభావమువల్ల అడవిలోనున్న చిన్నది డబ్బుకలదై మేడలు, మిద్దెలు, తోటలు, దొడ్లు కట్టించి అరిదేశి పరదేశి వస్తే అడ్డములేకుండా అన్నము పెట్టుచుండేది. ఆ సమయమునందు ఆమె అత్తా మామ లక్కడకువచ్చి- "మాకింత అన్నం పెట్టించదవా?” యని యడిగిరి. అప్పుడు అత్తమామ యని ఆమె గ్రహించి "నామామగారు అత్తగారు మీలాగే వుండేవారు. మీదేవూరు? మీరెవర" ని అడిగెను. అందుకు వారు- "మేము ఫలానా!” అని చెప్పిరి. అంతలో పెనిమిటివచ్చెను. వారి ముగ్గురికి తలంటి నీళ్లుపోయించి వారికి సకలోపచారములు చేయుచు పదమూడు కరుళ్ళు కంచములో పెట్టి క్రొత్త కంచముకొని చీర, రవికెలగుడ్డ కరుళ్ళు పెట్టుకొని ఉద్యాపనము చేసికొనెను. ఏడాది అయిన తరువాత చీర, రవిక, పదమూడు కరుళ్ళు క్రాత్త కంచములో బెట్టి ఉద్యాపనము చేసుకొనవలెను.

ఉద్యాపన: యేడాది నిండిన తర్వాత ఒక క్రొత్త కంచములో పదమూడు కరుళ్ళు పెట్టి చీర , రవికేలగుడ్డతో ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

కథలోప మైనను వ్రతలోపము కాకూడదు. భక్తి తప్పినా ఫలము తప్పదు.

Polala Amavasya Katha - పోలాలమావాస్య కథ

పోలాలమావాస్య కథ

ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు.

 ఒక బ్రాహ్మణునకు యేడుగురు కొడుకులు, ఏడుగురు కోడండ్రు కలరు. ఏడుగురు కోడండ్రు పోలాలమావాస్య నోము నోచుకుందామని యత్నము చేసికొనిరి. అంతట కడసారపు కోడలికి అమావాస్య రోజున ఒకపిల్ల చచ్చిపోయెను. ఆకారణము చేత ఆయేటికి ఆ నోము అంతామానివేసిరి. అదిమొదలు ప్రతిసంవత్సరము వీళ్లంతా నోము నోచుకుందామని యత్నము చేయుచుండుటయు, అమావాస్య వచ్చేసరికి కడసారపు కోడలికి పుట్టినపిల్ల చచ్చిపోవుచుండెను. ఇట్లు ఏడేళ్లు అయిన తరువాత “యేటేట మాకడసారపుదానికి పుట్ట, చావ” అని తిట్టుకుటూ కోడండ్రంతా మళ్లీ యత్నము చేసికొనిరి. అమావాస్య వచ్చేసరికి సరిగా కడసారపు కోడలికి ఒక పిల్లపుట్టి మళ్లీచచ్చిపోయెను. అంతా తిట్టి పోతారని చెప్పి చచ్చిపోయిన పిల్లను ఇంటిలో పెట్టి తాలము వేసికొని కడసారపుకోడలు అందరి తోడకోండ్రయింటికి వెళ్లెను. అందరికి తలాయొక పని సాయముచేసెను. తరువాత ఒకరియింటిలో తలంటి నీళ్లుపోసి, మరియొక యింటిలో పిండి పప్పు మొదలయినవి తెచ్చుకొని యింటికివచ్చి చచ్చినపిల్లను యింటిలో పెట్టుకొని తాను కూడా నోము నోచుకొనెను. ఆ ఆరాత్రిదాకా వుండి చీకటిలో చచ్చినపిల్లను భుజముమీదను వేసికొని పోలేరమ్మ గుడివద్దకు వెళ్ళి ఆ పిల్లను అక్కడ పెట్టి యేడ్చుచు కూర్చుండెను. ఇంతలో అమ్మవారు గ్రామ 

సంచారము వెళ్లి గుడివద్దకువచ్చి ఎడ్చుచున్న యా చిన్నదానినిచూచి “ఎమమ్మా ఇలా ఏడ్చుచున్నా”వని అడిగెను. అందుకా చిన్నది “యేడేండ్ల నుండి యేడుగురు పిల్లలను ఈ అమ్మవారికి అప్పగించుచున్నాను. ఈయేడు కూడా ఈ పిల్ల చచ్చి పోయింది. తోటికోడండ్రు తిట్టిపోతారని ప్రొద్దుటి నుంచి దాచి ఇపుడు తీసికొనివచ్చి ఇక్కడ పడకవేసి ఏడ్చుచున్నానని చెప్పెను. అప్పుడు అమ్మవారు కరుణించి- 'పిల్లలకు మరేమి భయంలేదు. నేను తీసికొనివచ్చి యిస్తానని చెప్పి అక్షతలు ఆచిన్నదాని చేతులోబోసి 'నీవు నీపిల్లలను పాతిపెట్టిన చోటికివెళ్లి పిలువమని చెప్పెను. ఆమె ఆ ప్రకారము అవి పుచ్చుకొని ఆ అక్షతలు చల్లి “అందెలాడరారా! మువ్వలాడరారా! అని వరుసగా ఏడుగురిని పిలువగా అందరు వరుసగా లేచి చక్కా వచ్చిరి. ఆమె
సంతోషముతో ఆ పిల్లలను తీసుకొని యింటకి వెళ్లెను. తెల్లవారిన తరువాత అందరూ చూచిన "అయ్యో! ఇదేటమ్మా! ఈ పిల్ల లెక్కడనుండి వచ్చినార" ని యడిగిరి. ఆ చిన్నది వారందరితోను తాను రాత్రిచేసిన పనులుచెప్పి- "పోలేరమ్మ దయవలన వీరు బ్రతికి వచ్చినారని చెప్పెను". అంతట నుంచి ప్రతిసంవత్సరము ఈ యమావాస్యను తప్పక నోము నోచుకొని అందరు ఈకథ చెప్పి అక్షతలు వేసుకొనుచుండిరి. అందుకా అమ్మవారు సంతోషించి సంతానము లేనివారికి సంతానము, సంతానము కలవారికి కడుపుచలవ యిచ్చి రక్షించెను.

Poli Padyami Katha - పోలి (పాడ్యమి) స్వర్గమునకువెళ్లు కథ

పోలి (పాడ్యమి) స్వర్గమునకువెళ్లు కథ

పోలి పాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజుని పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే, మార్గశిర మాసంలో మాత్రం విష్ణుమూర్తిని పూజిస్తారు. అంతే కాకుండా పోలి పాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు, నీటి కొలనులు, చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి విశిష్టత, పోలి స్వర్గం కథ తెలుసుకుందాం..

అనగనగా ఒక చాకలిది. దానికి నలుగురు కొడుకులు, నలుగురు కోడల్లు కలరు. ఆ చాకలికి ముగ్గురు కోడండ్రు, తాను ప్రతిరోజు కార్తీకమాసములో ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు యుదయము కాకుండా స్నానము చేసికొని, దీపముపెట్టి నెలరోజులా తీరుగ జరిపెను. తరువాత కార్తీక బహుళ అమావాస్యనాడు తెల్లవారుజామునలేచి కడసారపు కోడలు పోలితో  “మేము స్నానమునకు వెళ్ళుచున్నాము. మేము వచ్చేవకు యింటివద్ద జాగ్రత్తగా నుండవలసినదినిచెప్పి చాకలిది, ముగ్గురు కోడండ్రు స్నానమునకు వెళ్ళిరి. 

అప్పుడు చిన్నకోడలులేచి చల్లచేసి కవ్వమును అంటి యున్న వెన్న ఊచ్చుకొని ప్రత్తిచెట్టు క్రిందపడియున్న ఒక ప్రత్తికాడ తెచ్చుకొని వత్తిగా చేసి నూతివద్ద స్నానముచేసి వెన్న, వత్తితో కలిపి దీపము వెలిగించుకొని అత్తగారు రాకుండా ఆదీపము మీద చాకలిబాన మూత వేసెను.

అప్పుడు దానికి ఆకాశమునుండి విమానము వచ్చెను. అది విమానమునెక్కి బొంది తో గూడ స్వర్గమునకు చక్కా వెళ్లుచుండెను. ఈ వెళ్ళడము యేటియొడ్డున దీపములు పెట్టుకొనుచున్న వాళ్ళందరుజూచి "చాకలిపోలి స్వర్గమునకు వెళ్లుచున్నది. చాకలిపోలి స్వర్గమునకు వెడలుచున్నది" అని అందరు ఆశ్చర్యపడసాగిరి. అంత "మాకోడలేమిటి! స్వర్గమునకు వెళ్లడమేమిటి?" అని చాకలిది, దాని ముగ్గురు కోడండ్రును ఆశ్చర్యముతో జూచిరి. అలాజూచి అయితే.. పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని ఆ విమానము మీదనుండి వెళ్లేదాని కాళ్లునలుగురు పట్టుకొనిరి. అప్పుడు విష్ణుమూర్తివచ్చి ఈ కోడలిని వదలిపెట్టి వాళ్లను నలుగురను పట్టుకొని “అశ్రద్ధగా భక్తిలేకుండా దీపాలు పెట్టుకున్నారు. పోలి శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది. కాబట్టి పోలి కి బొందితో స్వర్ణమునిచ్చినాను. మీరు అడవులపాలై పోవలసినదిని శాపము పెట్టి చక్కాపోయెను.

అప్పటి నుంచి మహిళంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్క రోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజు 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనసుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి.

ఈ కథ చెప్పి అక్షతలు వేసికోవలయును.

Sunday, January 4, 2026

Grahana Gowri Nomu Katha - గ్రహణ గౌరీ నోము కథ

గ్రహణ గౌరీ నోము కథ

ఒక బ్రాహ్మణునకు నలుగురు కొడుకులును, ఒక కూతురు కలరు. ఆకూతురు పుట్టినరోజు మొదలుకొని రాత్రి పురుగులుగాను పగలు మనిషిగాను అగుచుండేది. రాత్రివేళ తల్లి ఆ పురుగులను పోగుచేసికొని విచారించుచుండేది. అలాగునుండగా కొన్నాళ్ళకు ఆ పిల్ల తల్లిని పుట్టింటికి తీసుకొనివెళ్లు నిమిత్తము అన్నగారువచ్చి- “అమ్మా! యీ పిల్లకు ఎడాది వెళ్లినది. గనుక ఒకసారి పుట్టింటికి రమ్మని పిలిచెను. ఆమె "యిప్పుడుకాదు ముందువస్తాను" అని చెప్పెను. ఆ మాటలువిని అతడు వెళ్లిపోయెను. తరువాత నాలుగేండ్లు అయిన పిమ్మట మరల అన్నవచ్చి- "అమ్మాయీ!
రమ్మన" ని పిలువగ "ఇప్పుడు కాదు వస్తానులే!" అని జవాబు చెప్పెను. ఆ మాటలకు సరేయని అతడు వెళ్లిపోయెను. ఆ పిల్ల పెద్దదైనకొద్ది, పురుగులు ఎక్కువ కాజొచ్చెను. ఆ పురుగులను రాత్రి తల్లి జాగ్రత్తగా కాపాడుచుండెను. అంతట ఆ పిల్లలకు పది సంవత్సరములు ఈడువచ్చెను. అప్పుడు తిరుగా అన్నగారువచ్చి - "ఇప్పుడైనా నీవు వచ్చినగాని లేని యెడల నీకు మేములేము, మాకు నీవులేవు" అని గట్టి పట్టుచేయగా ఆమె మరోమాట చెప్పలేక కోడండ్రను పిలిచి నాలుగు రోజులు పిల్లను చూచుచెండెదరా? అని అడిగినదట. వారు "మావల్లకాదని"రి. అప్పుడు నాలుగోకోడలు -"నేను చూచెదను. మీరు వెళ్లిరండిని చెప్పెను. ఆ బ్రాహ్మణునిభార్య నాలుగో కోడలిని తలుపుచాటునకు తీసుకొనిపోయి తన కూతురు రహస్యమును చేప్పి రాత్రివేళ ఆ పిల్లకు గుంటదగ్గర ప్రక్కవేసి ఒక్క పురుగైన చెదరకుండా వానిని లోనికి ప్రోగుచేసి కాపాడవలెనని బహు రహస్యముగా చెప్పి పుట్టింటికి వెళ్ళెను. అంత దీపాలు పెట్టేసరికి వంటచేసి మామగారికి భర్తకు భోజనముపెట్టి ఆపిల్లను గుంటవద్ద చాపవేసి పరుండబెట్టి నాలుగవకోడలా పిల్లవద్ద పరుండెను. తరువాత ఆ బల్ల పురుగులగు చుండగా వాటినన్నింటి ని గుంటలోకిత్రోసి తెల్లవారినదాక జూచుచుండెను. అంతట ఆమెభర్త- "ఇది నాయొద్దకు రావడములేదు. ఎక్కడికోపోవుచున్నది"
అని అనుమానపడి మూడురోజులైన తరువాత నాలుగోరోజున దీపాలు పెట్టగానే భోజనముచేసి ఆ చిన్నది పడుకొనేగది గోడమీద కూర్చుండెను. అంతట ఆమె భోజనముచేసి మామూలు ప్రకారము ఆ పిల్లను కనిపెట్టుకొని కూర్చుండెను. ఆ రాత్రి చర్య అంతయు గోడమీదనుండి యా బ్రాహ్మణ చిన్నవాడుచూచి తెల్లవారిన తరువాత దిగివచ్చి "అయ్యో! నా చెల్లెలు ఇంత కష్టపడుచున్నది. ఇదియేమి?" అని భార్యనడగ "నాలుగురోజులనుంచి యేమిచేస్తున్నావు? నాకు కనబడడంలేదేమి?"
అని కోపపడెను. "ఈ లాంటి పని మీ అమ్మ నాకు అప్పచెప్పినది. అందుచేత కనిపెట్టుకొని యుండవలసివచ్చినది" యని యామె చెప్పగా - "ఈ దురవస్థ యీమెకు ఎందుచేతవచ్చెనో!" అని విచారముపొంది అడవిలోనికి ఆకుమీద ఆకు పోకచెక్క పోక వేసికొని తలక్రిందు కాళ్లుమీదు పెట్టుకొని తపస్సుచేయమొదలు పెట్టెను.

అంతలో నాత్రోవను బోవుచున్న పార్వతీ పరమేశ్వరులు తన తపస్సునకు కారణమేమని యడుగగా అందుకా బ్రాహ్మణ చిన్నవాడు "మాచెల్లెలు పుట్టినది మొదలు పగలు మనిషి, రాత్రి పురుగులుగాను అగుచున్నది అది ఎందుచేతనో తెలుసుకొనగోరి యట్లు తపస్సు చేయుచున్నాన" ని ఆ బ్రాహ్మణచిన్నవాడు చెప్పెను. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు దివ్యదృష్టిజూచి "మీ చెల్లెలు క్రిందటి జన్మము రజస్వలై యింటిలో కలిపింది. ఆ దోషముచేత యిలావచ్చినది. కాబట్టి ఆమెచే గ్రహణగౌరీనోము పట్టించి క్రమప్రకారము యుద్యాపనము చేయించిన యెడల దోషము పోవునని చెప్పి యదృశ్యులైరి. అప్పుడా బ్రాహ్మణ చిన్నవాడింటికి వచ్చి పార్వతీపరమేశ్వరులు చెప్పిన గ్రహణ గౌరీనోము చెల్లిలిచేత పట్టించి ఉద్యాపనము చేయించెను. అంతట ఆ పాపముపోయి
ఆ పిల్ల రాత్రి పగలు ఎప్పటిలాగుండెను. తరువాత తల్లివచ్చి పిల్ల రత్నములాగున నుండుటజూచి మునుపటి చిహ్నము లేమీ లేకపోవుటకు సంతోషించుచు "ఏమిటి అమ్మాయీ! ఎలాపోయిందా పురుగులగుట్ట?" యిన కోడలిని యడిగెను. అప్పుడు చిన్నకోడలు అత్తగారు వెళ్ళినది మొదలు భర్తతనమీద యనుమానపడుట, యడవికి వెళ్ళుట గ్రహణగౌరీనోము పట్టించుట, మొదలగు సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి- “ఇది గ్రహణగౌరీనోము పట్టుటచేత పోయినది ఇదిగో మీ అమ్మాయి!” యిన ఆ పిల్లను అత్తగారి కప్పగించెను.

ఉద్యాపనము: సూర్యగ్రహణము పట్టిన క్షణము పసుపు, కుంకుమ, బియ్యము, పిండి, ప్రత్తి, బెల్లం, ఆకు పోక పందిరిలో పెట్ట వలెను. గ్రహణము విడిచినంతనే వాటిని యింటిలో పెట్టవలెను. ఆ తరువాత రోజునుండి తొమ్మిది రోజులవరకు గౌరిని పూజించవలెను. తొమ్మిది రోజులు తొమ్మిది పద్మములు చేసి తొమ్మిది వత్తులతో జ్యోతులు వెలిగించి, తొమ్మిది అట్లు నైవేద్యము పెట్టవలెను. ఆఖరి రోజున ఆకులు, పోకలు, అట్లు క్రొత్తజల్లెడలోపల పెట్టి పాతజల్లెడ మూత వేసి ముత్తైదువులకు వాయన మియ్యవలెను.

Shodasa Gowri Vratham Katha - షోడశగౌరి వ్రతం

షోడశగౌరి వ్రతం ( తదియ నోములు)

పూర్వం ధర్మశాస్త్రాలు చక్కగా తెలిసిన ధర్మవర్తి అనే రాజుండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన కుమార్తెలుండిరి. వారు పూర్ణచంద్రుని కళలతో సర్వాంగసుందరంగా యుక్తవయస్కులైనారు. వారికి రూపగుణ, శౌర్యసంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహమైంది. మల్లమాంబ తనకున్న సంపదసౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ వ్రత దూషణలు చేస్తుండేది. ఫలితంగా పశుసంపదను క్రూరమృగాలు నశింపజేశాయి. ధనధాన్యాలు అగ్నికి ఆహుతైనాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లబాంబ అవమానంతో అన్నవస్త్రాలు లేక అడవిలో తిరుగసాగింది.

దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఆ అరణ్యంలో ఎండకుకాలుతున్న పెద్ద పాషాణం, చెట్టునిండా పండ్లున్నా, ఒక్క పక్షి కూడా వాలని మామిడిచెట్టు, పుష్పవిహీనమైన మాధవీలత, పొదుగునిండా పాలుండి కారిపోతున్నా దూడ తాగని ఒక బర్రె (గేదె) కనిపించాయి. ఇంకా ముందుకు నడవగా ఓండ్ర పెడుతూ తిరుగుతున్న గాడిద, పచ్చిగడ్డితో నిండిన ఊసరక్షేత్రంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఒక ఎద్దు కనిపించాయి.

అన్నపానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోషతో "హే జగదంబే! కరుణామయి నన్ను క్షమించు" అని మొక్కుతూ మూర్ఛిల్లింది.

ఆ రోజు భాద్రపద శుక్ల తదియ. ఉపవాసంతో "హే గౌరీ!"  అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదాంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యొక్షమైంది. మల్లమాంబ కనులు తెరిచి, చేతులు జోడించి 

నమస్తే గిరిజాయాతే లోకామాత్రే నమో నమః || 
నమస్తే లోక సాక్షిణ్యై తుభ్యం భూయో నమో నమః || 

అమ్మా! కరుణాసాగరి నన్ను క్షమించు. నా అపరాధాన్ని మన్నించుమని కాళ్లమీద పడి ఏడ్వసాగింది. 

గౌరీ సంతుష్టిపొంది, నీవు ధనగర్వంతో షోడశగౌరీ వ్రతం చేయుట మానేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే పుత్ర పౌత్రాదులు, సుఖసంతోషాలతో ఉంటావని తెలిపింది. పితృగృహంలో తానున్నప్పుడు నోచిన విధంగా అడవిపూలు, పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యం పెట్టి నమస్కరించింది.

"హే జననీ! మార్గమధ్యంలో నేననేక చిత్రవిచిత్రాలన్నీ అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలి" అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో ‘‘భర్తరాకముందే భుజించి, పెద్దలను గౌరవించని స్త్రీ అలా పాషాణంగా మారింది. ధనధాన్యాపూన్ని ఉన్నా దానధర్మాలు చేయనివాడు మామిడిచెట్టుగా మారాడు. ఎలాంటి వరుడిని తీసుకొచ్చినా వంకలుపెట్టి పెళ్లికంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది. తానే విద్యావంతుడిని, కీర్తిమంతుడుని అని గర్వంతో తన దగ్గరకు విద్యార్జనకు వచ్చినవారికి విద్య చెప్పక పంపిన పండితుడు ఓండ్రపెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలివ్వని తల్లి పొదుగునిండా పాలున్నా, దూడకివ్వలేని స్థితిలో బర్రెగా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజరుభూమిని దానం చేసిన రాజు ఊసరక్షేత్రంలో ఎద్దుగా తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మ వారనుభవిస్తున్నారని" దేవి తెలియజేసి, దీవెనలందించి అదృశ్యమైంది.

అంతలో మల్లమాంబను అడవిలో వెతుకుతూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధ రాజువచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెను బంధుమిత్రులు చుట్టుముట్టారు. "ఏ పూజ చేశావు? ఏ నోము నోచావు" అని అడిగారు. అంతట మల్లమాంబ జరిగిన వృతంతము అంత తెలియజేసి, షోడశ గౌరీవ్రతం చేసినందు వల్లనే తన కష్టాలు అన్ని తొలగినవని తెలిపి మిగిలిన అందరుతో ఈవ్రతాన్ని ఆచారింపచేసి సుఖ సంతోషాలను పొందినదనీ తెలియజేసెను .


ఉద్యాపనము: ఈవ్రతాన్ని 16 సంవత్సరాలు నోము నోచుకోవాలి. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తితో వినాయకచవితికి ఒకరోజు ముందు అంటే భాద్రపదశుక్ల తదియరోజు 16 వత్తులు, 16 ముగ్గు, 16 వరుసల దారంతో, 16 ఉత్తరేణి ఆకులు పెట్టి తోరం కట్టుకోవాలి. 16 కుడుములు (బియ్యపు పిండి, పాలు, చక్కెర కలిపి) చేసి నైవేద్యం పెట్టాలి. ఇంకొక 16 కుడుములు పేరంటాలుకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. 16 ఉత్తరేణి ఆకులతో మరో 16 వరుసల తోరం 16 ముళ్లు వేసినది పేరంటాల చేతికి కట్టాలి. తరువాత తోరం కట్టుకొని , చేతిలో అక్షతలు ఉంచుకొని ఈ కథ వినవలెను


Gajula Gowri Nomu Katha - గాజుల గౌరీదేవి కథ

గాజుల గౌరీదేవి కథ

ఒక బ్రాహ్మణుని కోడలు గాజులగౌరీదేవి నోముపట్టి ఉల్లంఘనము చేసెను. అందుచేత ఆమెనిచూచి అంతా చిటచిట లాడుచుండేవారు, ఇరుగు చిటచిట-పొరుగు చిటచిట-అత్త చిటచిట మామ చిటచిట మగడు చిటచిట. ఎదురుచూస్తే వారే యిలాగున్నారని ఆ చిన్నది విచారించుచు, అడవిలోనికిపోయి తిరుగుచుండెను. అంతట విహారానికి వచ్చిన పార్వతీ పరమేవ్వరులు ఆ చిన్నదానిని చూచి- “ఏమిఅలాగు విచారించుచు తిరుగుచున్నావ”ని యడిగిరి. అందుకామె "యిరుగు, పొరుగు, అత్తమామ, మగడు నన్నుచూస్తే కోపంగా వుంటారు. అందుచేత నందరికి 
కోపమైతే యెట్లు బ్రతకనని ఇలా తిరుగుచున్నానని చెప్పెను. "అలాగు కాదమ్మా! నీవు గాజుల గౌరీనోము పట్టి ఉల్లంఘనము చేసినావు. ఆ కారణమున నిన్ను జూచిన అందరు కోపంగా నున్నది. నీవు తిరిగి ఆ నోముపట్టి ఉద్యాపనము చేసుకుంటే నిన్ను అంతా ప్రేమతో చూస్తారు అని పార్వతీదేవి చెప్పెను. ఆ ప్రకారం అమె యింటికివెళ్ళి ఆ నోము నోచుకొని యధావిధిగ యుద్యాపనము చెసికొనగా, అప్పటినుండి ఆమె అందరికి యిష్టము కలదయ్యెను.

ఉద్యాపనము: ఒక ముత్తయిదువును తీసుకొనివచ్చి ఆమెకు యిష్టమైన గాజులు. తొడిగించి, తలంటి నీళ్లుపోసి, చీర రవికెలగుడ్డ యిచ్చి పిండివంటలతో భోజనము పెట్టవలెను. 

భక్తి తప్పినా ఫలముతప్పదు. కథలోపమైనను వ్రతలోపము కాకూడదు.

Nandikeswara Vrata Nomu Katha- నందికేశ్వర వ్రత కథ

నందికేశ్వర వ్రత కథ

ఒకనాడు కైలాసపర్వతమున వినోద మందిరమున పార్వతి పరమేశ్వరునకు పాదము లొత్తుచుండగా పరమేశ్వరుడు పార్వతి తో - “ఓపార్వతీ! నీచేతులు మృదువుగా నుండక నాపాదములు నొచ్చుచున్నవి. కావున నీవు నా పాదము లొత్తవద్దనియె. అందుకు పార్వతి చింతాకులస్వాంతయై-"దేవా! ఎందుచేత నిట్లంటిరో చెప్పవలయునని ప్రార్ధించగా పరమేశ్వరుడు "నీవు పరోపకారము చేసినావుకావు. అందుచేత నిట్లుండె"ననియెను. "ఇందుకేమి చేసినచో నీకర్కశత పోవు"నని యడుగ నీశ్వరుడు- “నీవు నీళ్ళరేవునకు నీ
ళ్ళపొయ్యి వేసుకొని నీళ్ళుకాచుచు పోవువారికి తలంటి నీళ్ళుపోసిన నీచేతులకు మృదుత్వము వచ్చు"నని చెప్పెను. 

పార్వతి ఆ ప్రకారము నీళ్ళుకాచి వచ్చీపోయేవారికి నీళ్ళుబోయుచుండగా నొక పేదరాలు తలంటి నీళ్ళు పోసుకుందామని పిల్లలు తాను అచ్చటికి రాగా వారికిగూడా తలంటి నీళ్లు పోసెను. పిమ్మట వారు పార్వతియొద్ద సెలవు తీసుకొని పోవుచుండగా వారిని జూచి పార్వతి- "వీరికి భాగ్యమిచ్చెద"నని మనస్సులో సంకల్పించుకొనెను. 

ఆ పేదరాలు యింటికి వెడలుసరికి పెనిమిటి యెడ నొకమూట, పెడ నొకమూట వేసికొనివచ్చెను. ఆ రోజు నుండి వారికి క్రమముగా భాగ్యమువచ్చెను. అంత నా బ్రాహ్మణునిభార్య బంగారు తూగుటుయ్యలలో కూర్చుండి వచ్చుపోవువారికి కందరికి పని చెప్పుచుండెను. అది పెద్దవాడుకగా సూళ్ళవెంట చెప్పుకొనుచుండిరి. అప్పుడు పార్వతి-"నేను భాగ్యమిచ్చిన బ్రాహ్మణస్త్రీ కాబోలు, ఇంతకు వచ్చినదనుకొని ఒక పేద ముత్తయిదువయై ఆ బ్రాహ్మణ స్త్రీ యింటికివచ్చి వాకిటిలో నిలువబడెను. ఆ బ్రాహ్మణస్త్రీ బంగారపుతూగుటుయ్యలలో నూగుచుండి 

యా ముదుసలి యవ్వనుగాంచి "అమ్మా! పాలు పొంగువచ్చినవి. పాలమీద నొక నీళ్ళచుక్క చల్లి వెళ్ళమ" నెను. అప్పుడామె పాలమీద నీళ్లుచల్లి యింటికివెళ్ళి తలగట్టుకొని పడుకొనెను. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి- ఎందుచేత నీలాగుంటినని యడుగగా బ్రాహ్మణునిభార్యకు తాను భాగ్య మిచ్చినది మొదలుకొని జరిగిన చర్య చెప్పి నన్ను అవమానించిన యామె భాగ్యము తీసివేయవలసినదని పరమేశ్వరుని ప్రార్థించెను. పరమేశ్వరుడు వినాయకుని పంపగా నాతనిచూచి యా బ్రాహ్మణస్త్రీ ఐదుమానికెల బియ్యము ఉండ్రాళ్ళు వండి, సోలెడు
గిద్దెడు నెయ్యివోసి చల్లిదయంచక పుల్దియుంచక చాకికిపెట్టక వేకికి పెట్టక వినాయకునికి నైవెద్యము పెట్టెను. అతనవితిని భాగ్యము తీసివేయుట నాతరముకాదని ఇంకను భాగ్యమునిచ్చి చక్కబోయెను. 

అప్పుడు తిరిగి నందిని పంపగా, అతడు వెళ్లేసరికి " యా బ్రాహ్మణ స్త్రీ అయిదుమానికెల శెనగలు నీళ్లలోబోసి నైవేద్యము పెట్టెను. ఆ శెనగలుతిని యాతడు భాగ్యము తీయుట నాతరము కాదని యింకను భాగ్యమునిచ్చి వెళ్లెను. 

అప్పుడు పార్వతి హరుని పంపగా యాతని నా బ్రాహ్మణ స్త్రీచూచి అయిదు మానికల బియ్యము అట్లువండి సోలెడు గిద్దెడు నెయ్యిబోసి బెల్లముపెట్టి యాతనికి నైవేద్యము పెట్టెను. అతండవి తిని-"భాగ్యము తీసివేయుట నాతరముకాద" ని యింకను భాగ్యమునిచ్చి చక్కావచ్చెను. తిరిగి అర్జునుని పంపగా నాతని చూచి యా బ్రాహ్మణస్త్రీ అయిదుమానికల బియ్యము అప్పాలువండి నైవేద్యము బెట్టగా నాతడవితిని మరింత భాగ్యమిచ్చి వెళ్లెను. 

అప్పుడు శివునిపంపగా నాతనిచూచి ఆ బ్రాహ్మణస్త్రీ అయిదు  మానికెల నువ్వుపప్పు చిమ్మిలి త్రొక్కిన నైవేద్యము బెట్టెను. అతడవితిని మరింత భాగ్యమునిచ్చి చక్కాబోయెను. తరువాత కాలభైరవుని పంపగా నాతని చూచి యా బ్రాహ్మణస్త్రీ అయిదుమానికెల మినపప్పు గారెలవండి నైవేద్యము పెట్టెను. అతడవితిని యామె భాగ్యము తీయుటనావల్ల కాదదని వెళ్ళిపోయెను. పిమ్మట చంద్రుని పంపగా నాతనిచూచి యాబ్రాహ్మణస్త్రీ అయిదుమానికెల బియ్యము చలిమిడిచేసి నైవేద్యము పెట్టెను. అతడవితిని "ఆమె భాగ్యము చెరుప నాతరము కాద" ని మరింత భాగ్యమిచ్చి వెళ్లెను. తరువాత సూర్యుని పంపగా నాతనిచూచి యాస్త్రీ అయిదుమానికెల బియ్యము పరమాన్నమువండి నైవేద్యము పెట్టెను. అతడది యారగించి ఆమెకింకను భాగ్యమిచ్చి
చక్కాబోయెను. 

తరువాత నెవరిని వెళ్లమన్న- మావల్లకాదు, నీవే వెళ్లమనిరి. అప్పుడు పార్వతీదేవి స్వయముగా బయలుదేరివెళ్లగా నామెనుచూచి ఆ బ్రాహ్మణగస్త్రీ మిక్కిలి భక్తిశ్రద్దలతో అయిదుమానికల బియ్యము పులగమువండి, నేయి బెల్లముతో నైవేద్యము పెట్టెను. ఆమె అది తిని కోపము పోయినదై “అమ్మా! మొదట నీమీద నాకు కోపమువచ్చి నీ భాగ్యము తీసివేయుటకు కందరిని పంపినాను. వారందిరికి అన్నీ చేసి పెట్టినావు. అందుచేత నీభాగ్యము మరింత వృద్ధిఅయినది. అందుచేత నాకు కూడా సంతోషము వచ్చినది. 

ఈనోము పట్టి కథచెప్పి అక్షతలువెసి కొని తొమ్మిది దినుసులు మిగలకుండా ఉద్యాపన చేసికొన్న యెడల సకల భాగ్యములు కలుగునని పార్వతీదేవి యదృశ్యమయ్యెను.

ఉద్యాపన: అయిదుమానికల పెసరపప్పు బిందెతో అత్తెసరుపెట్టి అయిదు మూళ్ల అంగవస్త్రము చుట్టపెట్టి బంగారపు నందిని చేయించి అయిదు డబ్బులు దక్షిణతాంబూలములతో పడకవేసి నందిమోహపు పెండ్లికొడుకునకు అందియ వలయును. 

Kamika Ekadashi - కామిక ఏకాదశి

కామిక ఏకాదశి మన భారతీయ సంప్రదాయంలో ఏకాదశి వ్రతాలకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును  భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. దక్షిణాయన పుణ్...