Saturday, April 11, 2026

Chapter 31 Astikamahamuni stopping of the snake sacrifice of Janamejaya - అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 31

ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

సూతుడిట్లనెను: ఆ తెఱంగున పరీక్షిత్తు ప్రాణములు పాసెను. ఆతని కుమారుడు జనమేజయుడు. కడు పసివాడు. కనుక మంత్రులు రాజునకు పరలోకక్రియలు జరుగునట్లు చేసిరి. వారు దుర్మరణమున ప్రాణాలు వదలిన రాజు శవమును గంగాతీరమందు చందనచితి పేర్చి దానిపై నుంచిరి. రాజ పురోహితులు దుర్మరణము జెందిన ఆ రాజునకు వేద మంత్రములతో పరలోకక్రియలు జరిపిరి. వారు బ్రాహ్మణులకు యథోచితముగా బహువిధముల గోదానసువర్ణదా నాన్న దానవస్త్రదానము లొనర్చిరి. మంత్రులందఱును పౌరజానపదులను నొక సుముహుర్తమున ప్రజా ప్రీతికరుడు బాలకుడునగు రాజసుతుని జనమేజయుని పాలకునిగ నొనరించి సింహాసనమున గూర్చుండబెట్టిరి. ఒక దాది యతనికి రాజచిహ్నములను గూర్చి శిక్షణ గఱపెను. మహామతియగు అతడును దిన దిన క్రమమున ప్రవర్దమానుడయ్యెను. పదునొకండవయేట నతనికి కులపురోహితుడు యథోచిత విద్య గఱపెను. వాని నా బాలకుడు చక్కగ నేర్చుకొనెను. అర్జునునకు ద్రోణుడును కర్ణునకు పరశురాముడునువలె జనమేజయునకు కృపాచార్యుడు చక్కగ ధనుర్వేదమంతయు నేర్పెను. ఆ రాజు విద్యలెల్లబడసి దురతిక్రముగడు బలశాలి యయ్యెను. మఱియు వేద ధనుర్వేదములు తుదముట్ట నెరిగి పరమార్థవేత్త యయ్యెను. అతడు దర్మార్థకుశలుడు - సత్యవాది - జితేంద్రియుడునై జను లితడు ధర్మరాజను నట్లు రాజ్యము చేసెను.

అంతట కాశీరాజగు సువర్ణవర్మాక్షుడు తన వపుష్టమయను కన్య నతని కిచ్చెను. ఆ ధవళాక్షినిబొంది జనమే జయుడు మున్ను కాశీరాజు కూతురును బడసిన విచిత్రవీర్యుడువలెను సుభద్రను పొందిన అర్జునుడువలెను ముదితనుగూడి ప్రమదముతో వనోపవనములందు విహరించెను. ఇంద్రుడు శచిని బడసి ప్రసన్నుడై నట్లే యతడా లేమనుజేరి సుఖముండెను. అతడు ప్రజలు సంతోషించునట్లు వారిని లాలించి పాలించెను. కార్యదక్షులైన మంత్రులెల్లరును తమ తమ విధులు చక్కగ నిర్వహించుచుండి ఆ దినములలో ఉత్తంకుడను ముని యుండెను. అతడు తక్షకునిచేత బాధింపబడెను. ఆ బాధకు ప్రతీకార మెవరు చేయగలరోయని యాలోచించి యుత్తంకుడు జనమేజయుడందులకు తగినవాడనియెంచి హస్తిపురికేగెను. ఆ ముని జనమేజయుని సమీపించి యిట్లు పలికెను : 

'రాజా! నీవు సమయానుకూలముగ మంచిచెడ్డ లెఱుగలేవు. నీవు చేయరాని పని చేయుదువు. చేయవలసినది చేయవు. నీకు కోపముగాని ప్రయత్నముగాని తెలియవు. ఇట్టి నిన్ను నేనేమి కోరగలను? నీవు తంత్ర మెఱుగవు. నీకు దేనియందును పగలేదు. నీవింకను పిల్లచేష్టలు మరువలేదు.' 

జనమేజయు డిట్లనియెను: 'ఇతరులు నాకు చేసిన ఏ అపకారము నాకు తెలియలేదో నేను దేనికి ప్రతీకారము చేయలేదో మహాభాగా ! నాకంతయు వివరముగ దెలుపుము. చేయగలను.'

అనగా 

ఉత్తంకుడిట్లనియెను : ఓ భూపతీ ! నీ తండ్రి తక్షకుని దౌర్మార్గ్యముచే హతుడయ్యెను. నీ మంత్రులను పిలిచి నీ పితృమరణమును గూర్చి యడిగి తెలిసికొనుము. అది విని రాజా విషయము గురించి మంత్రులతో ప్రస్తావించగా 

మంత్రులిట్లనిరి: 'నీ తండ్రి విప్రుని శాపకారణమున పాముచే కాటువేయబడి వెంటనే మరణించెను.' జనమేజయుడు నా తండ్రి చావునకు ముని శాపమెట్లు కారణమయ్యెను? అందులో తక్షకుని తప్పిదమేమి? నాకంతయు దెలుపుడు. అన 

నుత్తంకు డిట్లనియెను: తక్షకుడు కశ్యపునకు ధనమిచ్చి యతనిని చికిత్స చేయనీయక వెనుకకు పంపెను. రాజా ! నీ తండ్రిని చంపిన తక్షకుడు నీకు పగవాడగునా కాడా? మునుపు రురుముని భార్యయు సర్పదష్టయై చనిపోయెను. ఆమె యవివాహితుడగు రురునిచేత మరల బ్రతికింపబడినది. ఆ సమయమున రురుమని 'నా కంటబడిన ప్రతి పామును నా యాయుధముతో చంపగలను' అని దారుణ ప్రతిజ్ఞచేసి యతడు శస్త్రపాణి యయ్యెను. నాటినుండి యతడు నేల నాలుగు చెఱగులు తిరుగుచు కంటబడిన పాములనెల్ల చంపుచుండెను. అంత నతని కొకమారు వనమున నొక ముసలి డుండుభము కంటబడెను. అతడా పెనుబామునుగని దానిని చంపుటకు కోపముతో కఱ్ఱ పైకెత్తి దెబ్బకొట్టగా 

డుండుభ మిట్లనెను: విప్రా! నీకు నేనేమి యపరాధము చేసితిని? నన్నేల చంపదలచితివి? అందులకు రురువు తొల్లి నా యిష్టసఖి సర్పదష్టయై మరణించినది. ఆనాడు నేనెల్ల పాముల జంప ప్రతిన బూనితిని' అన నతనితో డుండుభము 'నేను నిన్ను కాటు వేయను, కాటువేయు పాములు వేరే యుండును. కేవలము పాము రూపముగల నన్ను చంపుట నీకు తగదు. అనెను. ఈ చక్కని మనుజ వాక్కులు పాము నోటవచ్చుట రురువు విని –

'నీవెవరవు?' ఈ డుండుభత్వము నీవెట్లు పొందితివి?' అని దానిని ప్రశ్నించెను. విప్రా ! నేనును పూర్వ మొక బ్రాహ్మణుడను. నా స్నేహితుడు ఖగముడనువాడు గలడు. అతడు ధర్మవిద్వరుడు. జితేంద్రియుడు. సత్యశీలుడు. నేనొక గడ్డిపామునుచేసి అగ్నిశాలలోనున్న యతనిని మూర్ఖత్వమున వంచించితిని. అతడు భయవిహ్వలుడై గడగడలాడుచు' ఓ మందమతీ! నీవు నన్ను వంచించితివి. కాన సర్పముగమ్మని శపించెను. అపుడు నేను పాముగ మారి యతని ప్రసన్నతకతనిని ప్రార్థించితిని. అతని కోపము కొంత శాంతించగ 'నిన్ను ప్రమతిపుత్త్రుడగు రురుపు శాపముక్తుని చేయు'ననెను ఆ పామును నేనే, నీవే యా రురుమునివి. ఇంకనా పరమహితవచన మాలకింపుము. విప్రులకు పరమధర్మ మహింసయే సుమా! విజ్ఞుడైన బ్రాహ్మణుడెల్లచోట్ల దయతో వర్తింపవలయును. ఇది నిజము విప్రేంద్రా ! హింస యాగములందు తప్ప వేరు సందర్భముల తగదు అని డుండుభము పలికెను. ఆ విప్రుడట్లు సర్పయోనినుండి ముక్తిగాంచెను. రురువు అట్లు ఖగముఖుని శాపముక్తిని గావించుటతోపాటు నాటినుండి హింసను మానుకొని, చచ్చి మరల బ్రతికిన బాలికను ప్రమద్వరను పెండ్లి చేసికొనెను.

రురువు అట్లు పాముతోడి పగదీర్చుకొనుటకు సర్పములను హింసించెను. నీవు మాత్రము వైరము మాని వర్తింతువే! ఇపుడు నీ తండ్రి స్నానదానములులేక నంతరిక్షమున దిరుగుచున్నాడు. ఓ రాజా! పాముల నన్నింటిని చంపి నీ తండ్రి నుద్ధరింపుము. తండ్రికి ఇతరుల వలన కలిగిన అపకారము నెఱుగనివాడు బ్రతికియు చచ్చినవాడే. నరనాయకా! ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు. నీ తండ్రి శత్రువును దలంచి అంబాయజ్ఞమను నామముతో సర్పయాగ మొనరింపుము. ఉత్తంకుని ఈ మాటలు విని జనమేజయుడు కన్నీరొలుక 'నే నభిమానవంతుడను. మందమతిని. పనికిమాలినవాడను. నా తండ్రి సర్పదష్టుడై ఘోరదుర్గతి బొందెను. కాన సర్పయాగ మొనరించి నా తండ్రి నుద్ధరింతును. జ్వాలలు గ్రక్కుచున్న యగ్నిలో పాములను వేల్తును, అని పలికి మంత్రులను రావించి 

రజు యిట్లనియెను: 'మంత్రాలారా! మీరు యాగ సంభారములు సిద్ధము సేయుడు. గంగాతీరమున యాగమునకు దిగినచోటు విప్రులచే గొలిపించి నిర్ణయింపుడు. అచట నూఱు గట్టిస్తంభములతో మనోహరముగ మండలము నిర్మింపజేయుడు. అందు శ్రేష్ఠమైన యజ్ఞ వేదిక నిర్మింపజేయుడు. యజ్ఞాంగముగ సర్పయాగము మహాఘనముగ సాగవలయును. అందు తక్షకుడు పశువుగ ఉత్తంకుడు హోతగా నుండవలయును. సత్వరమే సర్వజ్ఞులు వేదపారగులునగు బ్రాహ్మణోత్తముల నాహ్వానింపుడు.

అపుడు విచక్షణులగు మంత్రులు రాజు నాజ్ఞానుసార మొనరించిరి. బహువిధములైన యాగసంభారములతో యాగము ఆరంభమయ్యెను. సర్పహవనము జరుగుచుండగా తక్షకుడు భయార్తుడై బయలుదేరి ఇంద్రునికడ కరిగి తన్ను బ్రోవుమని వేడుకొనెను. ఇంద్రుడు తక్షకు నూరడించి తన గద్దియపై గూర్చుండబెట్టుకొని 'నాగేశ్వరా ! నిర్భయముగ నుండుము. నీ కభయ మిచ్చురున్నాను' అనెను. తక్షకు డింద్రు నాశ్రయించి యభయము బొందిన విషయ ముత్తంకుడు తెలిసికొని యుద్విగ్నుడై యింద్రునితోడి తక్షకుని వేల్చుచున్నానని నిమంత్రించెను. అట్టితఱి తక్షకుడు యాయావర కులోద్భవుడును జరత్కారు తనయుడునగు ఆస్తీకుని స్మరించగా నాబాలుడు జన్నము జరుగు చోటికేగుదెంచి జనమేజయుని స్తుతించి సంతుష్టుని చేసెను. రాజా పండితుడగు ఆస్తీకబాలుని చూచి యతని నర్చించి యతని వాంఛితములడుగగా బాలుడు 'మహాభాగా! ఇక నీ యజ్ఞము చాలింపుడు. ఇదే నా మనోవాంఛిత'మని పలికెను. సత్యబద్ధుడగు రాజతని ప్రార్థన మన్నించి సర్పయాగము చాలించెను. 

అపుడు వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతము వినిపించెను. అది వినినప్పటికిని రాజునకు శాంతి చేకూరలేదు. అతడు వ్యాసమహర్షిని మునివరా! దిగులు నా మనస్సును దహించివేయుచున్నది. నాకు మనశ్శాంతి యెట్లు చేకూరునో - ఇపుడు నా కర్తవ్యమేమో తెలుపుము. దౌర్భాగ్యమున నా తండ్రి సర్పహతుడయ్యెను. క్షత్త్రియులకు సమరమున మరణము శ్రేష్ఠమైనది. రణమందైనను ఇంటియందైనను విధిపూర్వకముగ సహజముగ దైన్యములేని చావు చచ్చు టుత్తతము గదా! కాని, నా తండ్రి చావావిధముగ జరుగలేదు. అతడంతరిక్షమున మరణించెను. కాన నతని యాత్మకు శాంతి గల్గు నుపాయము దెలుపుము. నా తండ్రి దుర్గతినుండి స్వర్గమున కేగునట్లు చేయుము' అని వేడెను.

అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 30 Parikshit dies under the curse of Vipra - అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 30

పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

సూతుడిట్లనియెను: కశ్యపుడు అట్లు బయలుదేరిననాడే పురుషోత్తముడగు తక్షకుడును పరీక్షిత్తు శపింపబడెనని విని తన యింటినుండి బయలుదేరి వృద్ధబ్రాహ్మణ వేషమున పోవుకు రాజు సన్నిధి కేగుచుండిన ఆ బ్రాహ్మణునితో త్రోవలో తారసిల్లెను. తక్షకుడు ఆ మంత్రవిదుడగు విప్రుని 'నీ వెవ్వడవు? ఇంత వేగిర మెక్కడి కేగుచున్నావు? నీ పని యేమి? నీ తలంపేమి? అని యడుగగా' తక్షకుడు పరీక్షిత్తును గాటువేయునట. నే నారాజును మరల బ్రతికించుట కింత త్వరతగ్ర వెళ్ళుచున్నాను. విప్రా! నా దగ్గఱ విషహరమగు మంత్రమున్నది. ఆయువు బాగుగ నున్నచో నే నతనిని కచ్చితముగ బ్రతికించగలను' అని కశ్యపు డనెను. 'ద్విజవరా! ఆ తక్షకుడను నేనే. నేనే యా రాజును కాటువేయువాడను. నా విషపు కాటును చికిత్సించి బ్రతికించుట నీ తరముగాదు. అని తక్షకుడన 'ఆ శప్తుడైన రాజును నీవు నీ కోఱలతో కాటు వేయుము. నేను నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. ఇందే మాత్రము సందేహములేదు.' అని కశ్యపుడు వచించెను. 'అనఘా! నేను కాటు వేసిన రాజును మరల బ్రతికింపగలవేని తొలుత నీ మంత్రశక్తి చూపుము ఏదీ చూతము. ఇదిగో ఇపుడే యీ మఱ్ఱిచెట్టును నా విసపు కోఱలచే గాటువేతును. దీనిని బ్రతికించుము చూతము' తన తక్షకునితో నీవా చెట్టును కాటువేసి మొత్తము బూది చేసినను సరే; నేను మరల దానికి ప్రాణము పోయగలనని కశ్యపుడు పలికెను.

వెంటనే తక్షకు డాచెట్టును తన విషజ్వాలలతో గాల్చి బూదిసేసి 'ఓ విప్రా! దీనిని బ్రతికించి నీ మంత్ర ప్రభావము చూపు' మని కశ్యపునితో నన బూదినంతటిని ప్రోగుచేసి ' ఓ నాగరాజా! విషదరా! నేనిపు డీ మఱ్ఱిచెట్టును నీకండ్లముందే నా మంత్రశక్తితో మరల బ్రతికింతును. చూతువుగాని నా శక్తి' అని మంత్రవిదుడగు కశ్యపుడు తన చేతిలోనికి జలము తీసి కొని మంత్రించి యా మంత్రజలమును భస్మరాశిపై చల్లెను. మంత్ర పూతమగు జలము తగులగనే బూడిద పచ్చనిచెట్టుగ మారెను. ఆ చెట్టు ఎప్పటియట్టులనుండుట గని తక్షకుడు విస్తుపోయెను. అపుడు తక్షకుడు కశ్యపునితో 'నీ వింత శ్రమ యేల జెందుచున్నావు? నీ మానోవాంఛితమేమి? తెలుపుము. దానిని నేను సమకూర్తును.' అనెను.

అనగా కశ్యపుడు 'ఓ పాపఱడా! నేను ధనార్థిని. రాజు శపింపబడెనని విని వచ్చితిని. నా విద్యను ప్రదర్శించి నృపసత్తముని బ్రదికించి ధనము బడయదలచితిని.' 

తక్షకుడు అనెను : ఓ విప్రేంద్రా ! ఆ రాజు నుండి నీవు కోరునంత ధనము నే నేనిత్తును. తీసికొని నీ యింటి కేగుము. దీనివలన మన యిరువుర కోరికలను దీరును. అని తక్షకుడు విప్రునితో పలికెను. పరమార్ఖ విదుడగు కశ్యపు డతని మాటలు విని యిపుడేమి చేతునా యని మాటి మాటికిట్టు లాలోచించెను: 

'నేనొకవేళ లోభమునకు దాసుడనై డబ్బు తిని నా యింటికేగినచో నాకీ లోకమున కీర్తి గలుగదు. అట్లుగాక నా వలన రాజు జీవించెనేని నాకు శాశ్వతకీర్తిచేకూరును. దీనివలన ధనప్రాప్తి - పుణ్యలాభము - రెండును గల్గును. కనుక కీర్తినే సంపాదించుట మంచిది. కీర్తిలేని ధనమేల? అది వ్యర్థము. మునుపు రఘమహారాజు యశోధనమునకై తన దనమంతయు నొక బ్రాహ్మణునకు సమర్పించెను. హరిశ్చంద్ర కర్ణులును చెడని యశము గడించిరి. విషాగ్నిచే కాలిచచ్చు రాజును గని యెట్లూరకుండను? నా మూలమున రాజు జీవించినచో జనులకందఱకును క్షేమము సమకూరును. కానిచో దేశమున నరాజకము ప్రబలి సర్వనాశమగు ననుటలో సందియములేదు. రాజు చనిపోవగ ప్రజానాశము గల్గును. ఆ పాపము నన్ను చుట్టుకొనును. ఈ ధనలోభమున నాకు తీరని యపకీర్తియు గల్గును.' అని తలంచి ధీశాలియు ధర్మాత్ముడనగు ఆ కశ్యపుడు ధ్యానములో మునింగి రాజు మరణించనున్నట్లు గ్రహించెను. తక్షకునివలన ధనముగొని తన యింటి కేగెను.

ఈ విధముగ తక్షకుడు కశ్యపు నతని యింటి మొగము పట్టించి పిదప రాజును చంపుటకై యత డేడవనాటికి హస్తిపురి కేగెను. తక్షకు డాపురముజేరి పరీక్షిత్తు పై మేడపై మణిమంత్రౌషధులచేత రక్షింపబడుచున్నాడని విని యిట్లాలోచించెను: 

"రాజును చంపకున్నచో నాకు విప్రశాపము గలుగునను భయము గలదు. నే నీ మేడలోని కేయోగమున జేర గలను? ఈ రాజు విప్రశాపహతుడు; ముని పీడాకరుడు; పాపి; శఠుడు. నే నితని నెటుల వంచింపగలను? ఈ నాటివఱకీ పాండవుల కులమున నొక ముని మెడలో చచ్చిన పామును వేసిన వాడు పుట్టనేలేదు. ఈ రాజు నింద్యమైన పని చేసెను. ఇతనికి కాలగతి తెలియనదిగాదు. ఐనను నాత్మరక్షకుల నియోగించి చివరి మేడలో దాగుకొనియున్నాడు. ఇతడు మృత్యువునే మోసగింపదలచుచు నిశ్చింతగనున్నాడు. నేనొక విప్రునిచేత ప్రేరింపబడితిని. ఇప్పుడితనిని కాటువేయు నుపాయమేది? పాప మారాజు మందమతితో చావు తప్పనిదని తెలియక కాబోలు తన చుట్టును రక్షకుల నిలుపుకొని మేడపై ప్రమోదించున్నాడు. ఒకవేళ బలీయమైన దైవమువలన చావు నిశ్చితమైనచో కోటి ప్రయత్నములు చేసినను ఫలితము సున్న. చావు తప్పింపరాదు. ఇతడు పాండవుల గొప్ప వంశములో బుట్టియు చావుగతి నెఱిగియు జీవితాశ వదలుటలేదు. పైగ నెంత నిశ్చింతగ నున్నాడు! ఈ మంచితరుణమున రాజు దానధర్మము లాచరించుకొనుట మంచిది. ధర్మమువలన వ్యాధి తొలగును. చిరాయువును గల్గును. కానిచో చావు తప్పదనుకొని స్నానదానాదిక్రియలు జరిపి స్వర్గ మేగుటకు మేను చాలించుట మఱియు మంచిది. ఇట్లు పున్నెము కూడబెట్టుకొననిచో నరకము తప్పదు. ఒక బ్రాహ్మణుని యూరకే పీడించిన పాపము' విప్రుని ఘోరశాపము అను నీ రెంటివలనను నితనికి మృత్యువు సన్నిహితమైనది. ఇప్పుడితని నోదార్చుట కొక్క విప్రుడైన లేడు. విధి విధించిన చావునకు తిరుగులేదు.

తక్షకుడు ఇట్లాలోచించి తన చెంతనున్న నాగులను తాపసమేషములు ధరింపజేసి రాజుకడ కంపెను. పిమ్మట తక్షకుడు తానును రాజుకొఱకు మంచి ఫలామూలాదులు గొనివచ్చెను. తానందలి ఒక పండులో చిన్న పురుగు రూపున దూరి యుండెను. సత్వరమే నాగులెల్లరు తాపసులై ఫలములుగొని వెడలి రాజభవనముజేరి మేడచెంత నిలుచుండ ఆ తాపసులనుగని 'మీ కార్యమే' మని భటులు వారి నడిగిరి. ''మేము రాజదర్శనార్థము తపోవనమునుండి యరుదెంచితిమి. కులదీపకుడు చారుదర్శనుడునగు పరీక్షిత్తు నాథర్వణమంత్రములతో దీవింపవచ్చినవారము. రాజుతో తమ దర్శనమునకు మును లేతెంచిరని తెలుపుడు. రాజు నభిషేకించి పిదప తీయని ఫలములిచ్చి మేమేగుదుము. భరతకులమున ద్వారపాలకులుండుట తాపసులకు రాజధర్మము లభింపకుండుట మేమింతవఱకు కనివిని యెఱుగము. పరీక్షిత్తున్న చోటికేగి యతని నాశీస్సులతో వర్ధిల్లజేసి, యతనినుండి సెలవు గైకొని వెళ్ళుదుము'' అని తాపసులు వచించిరి.

ఆ మాటలు విని వారిని విప్రులుగ నెఱింగి రక్షకులు విప్రులారా! నేడు రాజదర్శనముగాదు. రేపు ఉదయమున నెల్ల తాపసులు రాజభవనముకు రండు. విప్రశాపభయమున రాజు రక్షితుడై యున్నాడు. ఇపుడీ మేడపై కెక్కుట తగదు. మా మాట నిజము. అని రక్షకులు వారికి రాజాదేశమును వినిపించిరి. భటులారా రక్షకులారా! మా ఫలమూలములు నాశీస్సులు స్వీకరింపవలయునని రాజునకు మా మాటగ జెప్పుడని మునులు మరల రక్షకులతో ననగా భటులేగి రాజునకు తాపసుల రాకను వారి మాటలను తెల్పిరి. 'వారి ఫలమూలాదులు తెండు. వారి రాకకు కారణ మడుగుడు. ఆ తాపసులకు నా ప్రణామములని జెప్పుడు. వారిని రేపుదయమున రమ్మనుడు. నేడు నా దర్శనము గాదని చెప్పు'డని రాజ భటుల నాదేశించెను. వెంటనే భటులు వెళ్ళి మునుల ఫలమూలాదులు తీసికొని సాదారముగ కానుకగ వానిని రాజునకు సమర్పించిరి. విప్రవేషధారులగు నాగులు వెళ్ళిన పిదప ఫలములు తీసికొని రాజు తన మంత్రులతో ఓ సుహృత్తులారా! ఈ పండు మీరు భక్షింపుడు. నేనుగూడ విప్రులొసంగిన వాని నుండి యొక ఫల మారగింతును అని తన ప్రియజనులకు పండ్లొసగి తానొక పండు చీల్చి చూచెను.

దానిలో నల్లనికన్నులు తామ్రవర్ణముగల యొక చిన్నపురుగు రాజు కంటబడెను. దానినిగని మంత్రులును విస్మితులైరి. అపుడు వారితో రాజు 'ఇపుడు సూర్యు డస్తమించును. ఇక తక్షక విషమునకు నేను ధయపడనేల? నేనిపు డమోఘ విప్రశాప మంగీకరింతును. ఈ పురుగు నన్ను కరచుగాక!' అని రాజు దానిని తన కంఠమున నిలుపుకొనెను. రవి యస్తమించువేళకు రాజు తన మెడకు తగిలించుకొనిన కీటకము గ్రక్కున భయంకర కాలరూపడగు తక్షకుడుగానయి రాజు మెడచుట్టును చుట్టుకొని కాటువేసెను. మంత్రులెల్లరును విస్మితులై మిక్కిలి దురపిల్లిరి. ఆ ఘోరరూపముగల నాగరాజునుగని యెల్లరును భయపడి పరుగెత్తిరి. రక్షకులు గొల్లున నేడ్చిరి. పెల్లుగ హాహాకారములు మిన్ను ముట్టెను. పరీక్షిత్తా విధముగ పాము పడగచేత జుట్టబడి పౌరుషముసెడి కదలక మాటాడలేక పడిపోయెను. తక్షకుని విషాగ్ని జ్వాలలు చెలరేగినవి. అవి రాజును గాల్చి నిలువున ప్రాణాలు తీసినవి. తక్షకుడట్లు రాజు ప్రాణములు తీసి వినువీధి కెగిరెను. అతడు తన మాటలచే జగములచే కాల్చునేమో యని చూపఱకు తోచెను. రాజు కాలిపడిన చెట్టువలె ప్రాణాలు వదలి నేలగూలెను. జనులందఱు మృతుడయిన రాజునుగాంచి ఎట్టు విలపించిరి.

అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chpater 29 Rurumuni's rescue of his beloved - అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 29

రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

పరీక్షిత్తిట్లనియె : రురుముని కామార్తుడై తన యాశ్రమములో నుండెను. అపుడతని తండ్రి 'రురూ! ఏమో దిగులుతో నుంటివే'మని యడిగెను. రురువు 'అయ్యా! స్థూలకేశు నాశ్రమమందు ప్రమద్వరయను తగిన కన్య గలదు. నాకామెను భార్యగ జేయవలయు' నని తండ్రితో బలికెను. ప్రమతి వెంటనే స్థూలకేశు నాశ్రమముజేరి యామునిని తనవానిగ సుముఖునిగ జేసికొని యతని కన్యను తన కుమారునకు నిమ్మని యడిగెను. ఒక మంచి మూర్తమున నా కన్యను మీ చేతిలో బెట్టుదునని స్థూలకేతుడు ప్రమతికి మాట యిచ్చెను. వనమునందు పెండ్లికై శుభసంభారములు సమకూర్చెను. ఆ తపోవనమున నట్లు వారిరువురును పెండ్లి జరుపుటకు సముద్యుతులైరి. అదే సమయమున ఆ చారులోచనయగు కన్య తన యింటి మొగసాలలో నిదురించుచుండగ నామె కాలి నొకపాము కాటు వేసెను. దాన నా చారులోచన విగతప్రాణయయ్యెను. ప్రమద్వర మరణించుట గాంచగనే యచట పెద్దగ యేడుపు పెడబొబ్బలు సాగినవి. మునులందఱు చుట్టును గుమిగూడి శోకించుచుండిరి. తన కూతునుగాంచి యామె తండ్రి ప్రాణాలు పోయినప్పటికిని మొగాన కాంతిరేఖ సన్నగిల్లక నేలపై పడియున్న యామెపైబడి వలవల యేడువసాగెను. ఆ యేడ్పు విని రురువు నచటి కేగెను.

సజీవవలెనే పడియున్న ఆ కామినియగు ప్రమద్వరను ఏడ్చుచున్న స్థూలకేశుని నచట మూగిన ఇతర ఋషిసత్తములనుగాంచి ఆ తావునుండి రురువు బయటకువచ్చి విరహాకులుడై ఇట్లు బోరున నేడ్చెను : 

'అక్కట ! దైవముచే నీపాము వింతగ పంపబడినదే! ఇది నా సుఖవిఘాతమునకు దుఃఖమునకును హేతువయ్యె గదా! నా ప్రాణవల్లభ మరణించెను. ఇకనేమి చేయుదు? ఎక్కడకని పోదును? ఈ నా ప్రియారాలు లేక జీవింపగోరికలేదు. ఈ వరారోహను నేను కౌగిలించుకొనలేదు. ముద్దు పెట్టుకొననే లేదు. మందభాగ్యుడను నేనామె పాణిని గ్రహించలేదు. ఈమెను గూడి యగ్నిలో లాజహోమము వేల్చనైతిని. ఈ మానవజన్మము వ్యర్థమైనది. ఇత్తరి నా యసువులు పోయిన బాగుగ నుండును. దుఃఖితుడు పాపియగు వాడెంత కోరుకొన్నను వానికి చావురాదు. ఇంక నాకీ నేలపై దివ్యసుఖవాంఛ లెట్లు తీరును? కనుక నేనిపుడు భీకరమై లోతైన మడుగులోపడికాని నిప్పులో దుమికికాని ప్రాణముల త్యజింతును. ఇంత విషము మ్రింగియో మెడ కురిపోసికొనియో చనిపోదును' అని యిట్లు రురువు వాపోవుచునదీతటమున గూర్చుండి తన మదిలో నిట్లాలోచించసాగెను: 

'ఘోరమైన యాత్మవధ చేసికొని చచ్చిన ఫలితమేమి? నా చావునకు నా తల్లిదండ్రులే దుఃఖింతురు. ప్రాణములు వదలిన నన్నుగాంచి దైవము మాత్రము హర్షము వెలిపుచ్చును. నా చావునకు తక్కిన వారందరు సంతసింతురు. నేను చచ్చి మాత్రమా పరలోకమున నా ప్రియకు చేయగల్గిన యుపకారమేమి? ఇట నీమె విరహవేదనమున నే నాత్మ వధము చేసికొన్నచో పరలోకమున నామె నాకు ప్రియురాలగునని నమ్మకమేమి? ఇందువలన నేను చనిపోయిన దోషము గల్గునుగాని చావకున్న నే దోషమును గల్గదు.' అని చక్కగ విచారించి రురువపుడు స్నాన మాచరించి యాచమించి శుచియై దోసిలినిండ నీరు తీసికొన 'నా వలన నేదేని సుకృతముగాని దేవతార్చనగాని జరిగియున్న యెడల - నేను నా గురువులను భక్తితో బూజించితినేని - నేను జపతపోహోమములు జరిపినవాడనేని - వేదములు చక్కగ నధ్యయనము చేసితినేని - గాయత్య్రనుష్ఠానము నన్ను సంస్కరించియుండెనేని - సూర్యుడు నాచేత నారాధింపబడెనేని నా ప్రియురాలిపుడే మరల జీవించుగావుత ! ఒకవేళ నా కాంత బ్రతుకదేని నేనుగూడ నామెతోబాటు ప్రాణములు వదలుదును.'

అని పలికి దేవతల నారాధించి యా జలము నతడు భూమిపై జల్లెను. ఇట్లు రురువు తన భార్యకై మిక్కిలిగ శోకించుచుండ నొక దేవదూత రురువుకడ కరుగుదెంచి యతనితో నిట్లనెను: 

'బ్రాహ్మణా! అతి సాహసము వలదు. చనిపోయిన నీ ప్రియురాలు తిరిగి యెట్లు బ్రతుకగలదు? ఈ ప్రమద్వర గంధర్వాప్సరసల కూతురు. అవివాహితగ మరణించినది. కాన వేరొక సుందరాంగిని కామింపుము. ఈమెకై దుర్బుద్ధివై రోదింతువేల? ఈమెపై నీకింత ప్రీతి యెందులకు? 

రురువిట్లనియె: 'ఓ దేవదూతా! నే నితర స్త్రీని వరింపజాలను. ఈమె బ్రతుకనిచో నే నిప్పుడే యిక్కడనే ప్రాణములు వీడుదును.' రురువు పట్టుదలకు దేవదూత ప్రమోదమందెను. 

ఆ దేవదూత మనోహరమైన సత్యవాక్కులతో నిట్లనెను: బ్రాహ్మణోత్తమా! పూర్వము దేవతలచే విధింపబడిన యొక యుపాయము గలదు. దానిని జెప్పుదును. వినుము: నీ యర్ధాయువునిచ్చి నీ ప్రమద్వరను బ్రతికించుకొనుము. 'నేను నిస్సందేహముగ నా సగమాయువు నా ప్రియురాలి కొఱకిత్తును. నా ప్రియ యీక్షణమే బ్రతికి లేచుగాత' మని రురువనెను. 

అంతలో విశ్వావసువు తన పుత్త్రి మరణవార్తవిని స్వర్గమునుండి దిగి వచ్చెను. అపుడా విశ్వావసువును దేవదూతయు ధర్మదేవతకడకరిగి యిట్లనిరి: 'ధర్మదేవా! ఈ ప్రమద్వర విశ్వావసుని కూతురు. రురుని ప్రియురాలు. పాముకాటుచే మరణించినది. ఈమె కొరకు రురువు చావునకును సిద్ధపడి తన యాయువులోని సగము భాగ మీయదలచెను. కనుక రురుని వ్రతాచరణ ప్రభావమున ప్రమద్వర మరల జీవించుగా వుత్ర!' 

ధర్ముడిట్లనియె: దేవదూతా! ఆ విశ్వావసుని కూతురు బ్రతుకవలయునన్నచో రురువుయొక్క సగమాయువుగొని యామెను బ్రతికించుము. ధర్మదేవుని మాటలువిని దేవదూత ప్రమద్వరను పునర్జీవితురాలనుజేసి సత్వరమే యామెను రురున కప్పగించెను. తరువాత నొక శుభదినమున మంచి ముహూర్తమున రురువు విధానము ననుసరించి యామెను పెండ్లాడెను.

ఆ విధముగ మరణించి యామె మరల జీవించెను. కావున సర్వవిధముల మఱిమంత్రౌషధులచే ప్రాణ రక్షణము తప్పక చేసికొనుటవంటి శాస్త్రసమ్మతమైన యుపాయము చేసికొనదగి యున్నది. అని పరీక్షిత్తు తన మంత్రులను తనకు రక్షకులనుగా నియోగించి ఏడంతస్తుల ఉత్తమమగు మేడను నిర్మింపజేసి తన సచివులతో కూడా నా మేడ వెంటనే ఆరోహించెను. అందు మణిమంత్రధరులగు శూరులను రక్షకులుగ నియమించెను. నీ సేవకుడనగు నా తప్పిదమును మన్నించుమని తన పక్షమున నేగి మరల మరల నతనిని వేడి ప్రసన్నుని జేసికొనుటకై రాజు గౌరముఖుడను మునిని తన్ను శపించిన మునియాశ్రమమునకు పంపెను. సిద్ధమంత్రజ్ఞులగు బ్రాహ్మణుల నాత్మరక్షణ కేర్పాటు చేసికొనెను. సురక్షితమైన ఆ మేడ నెవ్వడు నెక్కకుండునట్లొక మంత్రి కుమారుడచటనుండి మేడ చుట్టును కొన్ని యేనుగులను నిలువబెట్టెను. ఆ మేడలోనికి గాలిగూడ చొచ్చుట కవకాశము లేకుండెను. ఎవరును లోన ప్రవేశించకుండ నివారింపబడుచుండిరి. రాజు లోననుండియే స్నానసంధ్యాదికృత్యములు నిర్వర్తించుచు భక్ష్యభోజ్యాదు లారగించుచు రాచకార్యములు చక్కపెట్టుచుండెను. అట్లు పరీక్షిత్తు మంత్రులతో మంతనములాడుచు దినములు లెక్కపెట్టుకొనుచుండెను. 

అంతలో మంత్రవిదులలో ఉత్తముడగు కశ్యపుడు అను బ్రాహ్మణుడు మహాత్ముడగు రాజునకు శాపము గలుగుటవిని అతనికి చావు తప్పించి డబ్బు గడించుకొనగోరి రాజున్న చోటి కేగుదునని తలంచి శపింపబడిన రాజున్న చోటికి వెళ్ళుటకు తన యింటినుండి బయలుదేరెను. ఆ కశ్యపుడు గొప్ప మంత్రవిదుడు విద్వాంసుడు మునిసత్తముడు ధనార్థి.

అధ్యాయము 30 పరీక్షిత్తు విప్రశాపమున మరణించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 29 Parikshit is cursed - అధ్యాయము 28 పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 28

పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

సూతు డిట్లనెను : ఆనాటికి మూడవనాడు ధృతరాష్ట్రుడు గాంధారీకుంతీసహితుడై వనమందు దావాగ్నిలోబడి దగ్ధుడయ్యెను. సంజయు డంతకుముందే దర్మజుని ధృతరాష్ట్రుని వదలి తీర్థయాత్రకు వెడలెను. ఇదంతయును నారదుని వలన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లకు యాదవు లెల్లరును ప్రభాసతీర్థమున నశించిరి. వారు మదిరాపానమత్తులై రామకృష్ణులు చూచుచుండగనే తమలో తాము కయ్యాలు పెట్టుకొని సమసిరి. బలరాముడు మేను చాలించెను. కమలాక్షుడగు శ్రీకృష్ణుడును శాపానుసారముగ వ్యాధుని బాణమున నిహతుడయ్యెను. అట్లు కృష్ణుడు తన యవతారము చాలించెనని విని వసుదేవుడు తన హృదయమందు శ్రీ భువనేశ్వరీదేవిని నిలిపి ప్రాణములు వదలెను. అంతట అర్జును డతి దుఃఖితుడై ప్రభాసతీర్థమునకేగి వారి వారికి దగినట్లుగ సంస్కారము లొనరించెను. అర్జునుడు హరి మృతశరీరముగాంచి చితిపేర్చి యందతనితో నతని యష్టమహిషులనుజేర్చి దహనసంస్కారము లొనర్చెను. రేవతితోడి బలరాముని దేహ మగ్నిలో దహింపజేసెను. పిమ్మట నతడు ద్వారకకుజని యచటి జనులను దోడుకొని పురమును వెడలించి నడచెను. వెంటనే సముద్ర ముప్పొంగి వాసుదేవుని పురమును నీటముంచెను. అంతట కిరీటి ప్రజలను వెంటనిడుకొని నిర్గమించెను. తేజస్వియగు నర్జును డనిరుద్దుని కొడుకు నింద్రప్రస్థపురికి రాజుగ జేసెను. పిమ్మట నర్జునుడు తన పడిన పాటులన్ని యును వ్యాసునకు చెప్పి రోదించెను.

వ్యాసుడు అర్జునితో మహామతీ ! శ్రీహరి మరల నవతరించునపుడు నీవు నతని వెంటవత్తు వనెను. అటు తరువాత చోరులును అభీరులును కృష్ణుని తక్కిన భార్యలమీద స్త్రీలమీదపడి దోచిరి. స్త్రీల యొంటిమీది సొమ్ములన్నియు నొలుచుకొని పోయిరి. అర్జునుడుగూడ తేజోహీనుడయ్యెను. వజ్రనామకు డింద్రప్రస్థమున యాదవులకు రాజుగ జేయబడెను. రాబోవు యుగమున నీవు మరల పూర్ణతేజస్కుడవు గాగలవని వ్యాసుడు చెప్పగ నర్జునుడువిని ముదమంది కరిపురమున కేగెను. అచట జరిగిన వృత్తాంతమంతయు నర్జునుడు ధర్మరాజాదులకు దెలిపెను. ధర్మజుడు శ్రీహరి దేహత్యాగము యాదవ వంశక్షయము అంతయువినెను. అంతట ధర్మరాజు హిమాచలమునకేగ సంకల్పించెను. అతడు ముప్పదియా
న నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్ల ప్రాయముగల పరీక్షిత్తునకు బట్టము గట్టెను. ఆ ప్రకారముగ ధర్మనందనుడు కరిపురమును ముప్పదియాన నెఱిగి ధర్మనందనుడు బిట్టు పలవించెను. కౌరవుల నాశము తరువాత ముప్పదియాఱండ్లు చక్కగ పరిపాలించి పిదప తన తమ్ములతో ద్రౌపదితో బయలుదేరెను.

ఆ విధముగ నారుగురును హిమగిరికేగి యందే ప్రాణములు వదలిరి. ఇట పరీక్షిత్తు పరమ ధార్మికుడు - రాజర్షి - రాజేంద్రుడు- చక్కగ నరువదేండ్లు పరిపాలించెను. ఒకనాడత డడవికి వేటకేగెను. ఆ రాజు దెబ్బతిన్న మృగాదులను పట్టుకొనుటలో మట్టమధ్యాహ్నమయ్యెను. ఆ పట్టపగటి వేడిమి కత డాకలిదప్పికలచే నలమటించెను. అతడా వడదెబ్బకు తాళలేక చేరువలో ధ్యానమగ్నుడైయున్న యొక మునివరునిగాంచి జలమిమ్మని యడిగెను. ఆ ముని నిర్మలనిశ్చలసమాధిలో నుంటచే మాటాడలేదు. పరీక్షిత్తు దప్పికచే కలిమాయచే కుపితుడై తన వింటికొనచే నచట చచ్చిపడియున్న పామును పైకెత్తెను. అతడు కలి ప్రభావమున దాని నా ముని మెడలో వేసెను. పామును తన మెడలో వైచినను ముని మాటాడకుండెను. ముని నిర్వికల్పుడై యుండెను. పిదప రాజు తన గృహమున కేగెను. ఆ ముని కుమారుడు గవిజాతుడు మహా తపస్వి. మహాతేజస్వి, మహాశక్తుడు. ఆ బాలుడు వన ప్రాంతమున తోడి మిత్రులతోడ నాడుకొనుచుండెను. అంతలో నతని మిత్రులెవరో యతనితో 'నీ తండ్రి మెడలో ఎవరో చచ్చిన పాము వేసి'రనిరి. ఆ మాటలు వినగనే యతుడు క్రుద్ధుడైవేగిరమే దోసిట జలముగొని నాతండ్రి మెడలో చచ్చినపాము వేసిన రాజు-పాపి యేడునాళ్లలో తక్షకునిచే కాటువేయబడి చచ్చునుగాత' మని శపించెను. అపుడు కొందఱు ముని కుమారకులు రాజభవనమందున్న పరీక్షిత్తుకడ కేగిరి. వారు రాజుతో నతనికి ముని బాలుడిచ్చిన శాపమును దెలిపిరి. అట్లు రాజు తనకు ముని బాలు డిచ్చిన శాపము తెలసికొనెను.

అంత పరీక్షిత్తు శాపము తప్పదని యెఱింగి వెంటనే వృద్ధామాత్యులను రావించి వారి కిట్లనియెను: ''నా ద్వేషకారణముగ నొక ముని బాలునిచేత శపింపబడితిని. కాన నో మంత్రులారా! ఇపుడు నే జేయదగిన యుపాయమేదేని నున్నచో నాలోచింపుడు. ఎట్టివానికేని చావు తప్పింపరాదని వేదవిదులందురు గదా! ఐనను తెలిసినవారు శాస్త్రోక్తపద్ధతులాచరింతురు. ఉపాయజ్ఞులగు - బుద్ధిమంతులు కొంద ఱిట్లు వచింతురు. ఎల్ల కార్యములు విజ్ఞుల యుపాయములవలన తప్ప మరిదేనివలనను నెఱవేరవు. మణి మంత్రౌషధముల ప్రభావము దుస్తరము. వాటి సిద్ధులవలన కార్యములు సిద్ధించును. తొల్లి యొక ముని తన భార్య పాముకాటునకు చనిపోగా నత డామెను మరల బ్రతికించుకొనెను. ఆ ముని తన భార్యకు తన యాయువులోని సగపాలిచ్చి యామెను మరల బ్రతికించుకొనెను. పండితులగు వారు భవితవ్యమును విశ్వసింతురు. మంత్రులారా! ఇందులకు ప్రత్యక్ష దృష్టాంతము ఇది: 

"ఈ భువిపైగాని దివిపైగాని యే పురుషుడైనను దైవముపై భారము వైచి నిరుద్యోగమున నూరక కూరుచుండునా? విరక్తుడగు యతికి సైతము బిచ్చమెత్తుకొనక పొట్టగడువదు గదా ! అతడు గృహస్థులు పిలిచినను పిలువకున్నను నింటింటికి వెళ్ళుచుండును. కాని యూరక గోళ్ళుగిల్లుకొనుచు కూరుచుండునా? కూరుచున్నచో నతని నోటిముందునకు పట్టెడు మెదుకులు తెచ్చి పెట్టువాడెవడు? తినకున్నచో నన్నము పొట్టలోనికి పోవుటెట్లు? కావున కార్యము నెఱవేరినను ప్రయత్నము మాత్రము చేసి తీరవలయును. ఒకవేళ కార్యము సాధ్యముగానిచో మాత్రమే మదిలో దైవమునే దిక్కుగ నమ్ముకొన వలయును.'' 

రాజు మాటలువిని మంత్రులనిరి: 'తన ప్రియురాలికై తన ఆయురర్ధ మిచ్చి బ్రతికించికొన్న యా ముని యెవరో యాతనిభార్య యెట్లు మరణించెనో విశదముగ దెలుపుడు.

రాజిట్లనియెను: ''భృగుమహర్షి భార్య పులోమ. ఆమె చాల సౌందర్యరాశి. ఆమెకు చ్యవనుడను ప్రసిద్ధికెక్కిన ముని సంభవించెను. ఆ చ్యవనునకు శర్యాతికూతురు సుకన్యయను నామె భార్య యయ్యెను. ఆ సుకన్య సుందరాంగి. వారికి ప్రమతియను ప్రఖ్యాత సుతుడు గలిగెను. ఆ ప్రమతి భార్య ప్రతాపి యనబరగెను. ఆమెకు రురువను సుతుడు జనియించెను. ఆనాళ్లలో స్థూలకేశుడను తపస్వి యుండెను. ఆ తాపసుడు ధర్మాత్ముడు. సత్యసమ్మతుడు. త్రిలోకసుందరి మేనక విశ్వావసువువలన గర్భము దాల్చెను. ఆమె యొకనాడు నదీతీరమున విహరించుచుండగా నిది జరిగెను. ఆ మేనక స్థూలకేశు నాశ్రమమున నొక యందాలపాపను గనెను. ఆ బాలనదీతటమున నొప్పులకుప్పయై యొప్పారుచుండెను. ఆ ముని యాదిక్కు లేని బాలను చేరదీసి ప్రమద్వరయను పేరిడి ముద్దుగ పెంచుకొనుచుండెను. కొంతకాలమున కా కన్నియ సర్వలక్షణశోభితయై పడుచుదనమున నెసగుచుండెను. ఒకనాడా పడుచుకన్నెను రురుమహర్షికన్నారగాంచెను. ఆతని హృదయమున పూవుముల్కుల కైపైక్కెను.

అధ్యాయము 29 రురుముని తన ప్రియురాలిని బ్రతికించుకొనుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 27 By the grace of Sridevi, the Pandavas found their dead heroes - అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 27

శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

సూతుడిట్లనియెను : ఆ పంచపాండవులకు ద్రౌపది భార్యయై పతివ్రతయైనది. ఆ సాధ్వీమతల్లికి తన పతులకంటె సుందరతరులగు నైదుగురు కొమరులు గల్గిరి. అర్జునుడు శ్రీకృష్ణు ననుమతమున నతని సోదరియగు సుభద్రను హరించుకొనివచ్చి భార్యగ బడసెను. మహాభారతయుద్ధమందు సుభద్రకు జనియించిన అభిమన్యుడును ద్రౌపదేయులును వీరస్వర్గమలంకరించిరి. ఆ సమయమున నభిమన్యుని భార్య యుత్తర నిండుచూలాలుగ నుండెను. ఆమె గర్భ మశ్వత్తాముని బాణాగ్నికి క్రాగిక్రాగి మృతశిశువును గనెను. అపుడు శిష్టరక్షకుడు శ్రీవాసుదేవుడు తన లోకాద్భుత ప్రతాపము జూపించి యశ్వత్థామ బాణాగ్నికి దగ్ధుడైన తన మేనల్లుని కొడుకునకు మరల ప్రాణము పోసెను. వంశము పరిక్షీణమగుచుండగ బుట్టినవాడగుటవలన నా బాలుడు పరిక్షిత నామమున నిలపై వన్నెకు వాసికెక్కెను. ధృతరాష్ట్రుడు తన నూరుగురు కొడుకులు సంగరమందు చచ్చుటవలన దుఃఖితుడై పాండవుల యేలుబడిలో నుండెను. భీముని హృదయవిదారకమైన పరుషములకు పీడితుడయ్యును కోరలూడపెఱికిన పామువలె పడియుండెను. గాంధారియు శోకాతురయై యచ్చటనే యుండెను. ధర్మరాజు వారిరువురకు పరిచర్యలు సలుపుచుండెను. ధర్మాత్ముడగు విదురుడును యుధిష్ఠి రానుమతిచే వారిచెంతనే యుండి మంచి మాటలతో వారిని ప్రబోధించుచుండెను. ధర్మపుత్త్రుడును వారికి నిరంతర సేవలు సేయుచు వారి పుత్త్రశోకము మఱపించుచుండెను.

భీముడు మాత్రము పట్టరాని యుక్కురోషమున లోకులు వినునట్టుగ వారిని వాగ్బాణములతో పీడితులుగజేయుచుండెను. ఈ పుట్టు గ్రుడ్డివాని కొడుకులందఱు రణరంగమున నొక్కుమ్మడిగ నాచేతిలోబడి మన్నుగఱచిరి. ఆ క్రూర దుశ్శాసనుని ఱొమ్ముచీల్చి వానిగుండె నెత్తురు కుత్తుకబంటిక గ్రోలితిని. ఈ కుచ్చితాలమారి గ్రుడ్డివాడిపుడు మేమిడు ధర్మపిండమును తలవంచుకొని తినుచున్నాడు. ఇతడు కాకమువంటివాడు. వట్టి పనికిమాలినకుక్క. వ్యర్ధముగ జీవించుచున్నాడు. భీము డీ రీతిగ ప్రతిదినము పరుష వాక్యములు ధృతరాష్ట్రుని ముందాడుచుండెను. ధర్మాత్ముడగు ధర్మరాజు మాత్రమతడు మోఱకుడని తలచి యతని నూరడించుచుండును. ఇట్లు ధృతరాష్ట్రు డచట పదునెన్మిదేండ్లు తీరని పుత్రశోకమున నెట్టులో గడపి తుదకు వనములకేగుటకు ధర్మరాజు నడిగెను. నేను విధివిధానముగ నా కొడుకులకు తిలతర్పణము లొనరింతు నని ధృతరాష్ట్రుడు యుధిష్టిరునిగోరెను. భీముడు రణమృతుల కందఱి కంత్యక్రియలు జరిపెనుగాని ప్రాతపగలు మనస్సులో పెట్టుకొని నా కొడుకులకు మాత్రము కర్మలు జరుపలేదు. కనుక నీవు నాకు సరిపడు ధనమొసంగినచో నా కొడుకుల కర్మలొనరించి పిమ్మట స్వర్గ ఫలప్రదమగు తపమొనరింప వనముల కేగుదును. అపుడు విదురుడు ధృతరాష్ట్రునకు ధనవిమ్మని ధర్మరాజుతో చాటుగ చెప్పెను. అందులకు ధర్మజు డతనికి ధనమీయ దలంచెను. అంత ధర్మరాజు తన వారిని రావించి ఓ మహాశయులరా ! ధృతరాష్ట్రున కతని కుమారుల తిలతర్పణమునకు డబ్బిత్తు, ననెను. మహాతేజస్కుడగు తన పెద్దన్న మాటలు విని మహాబాహుడగు భీము డుగ్రుడై యిట్లనియెను:

''ఓ మహానుభావా! దుర్యోధన పక్షపాతికి ధనమిచ్చుటయా? అతడా సొమ్ముతో సుఖము లొందును. ఇంతకన్న మూర్ఖత్వము మరేమున్నది? నీ యీ దుర్మంత్రణము వలననే మేము మొదటి నుండి కష్టాలపాలయితిమి. ఆ దుర్మార్గుని వలననే కదా ద్రోపది నిండు సభ కీడ్పించబడినది? ఓ సువ్రతా! మేమా విరాట నగరమున నుండుటకు హేతువు నీ ప్రసాదమే కదా! అమిత విక్రములమగు మాకొక మత్స్యరాజు నింట నూడిగము చేయవలసి వచ్చెగదా! ఇంతకు నీవు జూదమాడనిచో మాకీ యష్టకష్టాలు వచ్చెడివే కావు. ఆ జరాసంధునే పరిమార్చగల్గిన నేనొక విరాటుని వంట యింట గంటె త్రిప్పవలసి వచ్చెను. అర్జును డింద్రుని కుమారుడు. అంతటివాడే యాడుపిల్లలకు నర్తనము నేర్పువాడై బృహన్నల గావలసి వచ్చెను గదా! అతడొక సామాన్య స్త్రీ రూపము దాల్చెను. విధి యెంతగ మారె నకట ! గాండీవగుణరవమున శోభిల్లు గాండీవి చేతగాజులు గలగల లాడుటయా! ఆత్మాభిమానము గల మహాపురుషున కభిమానము చంపుకొనుటకన్న దుఃఖమేముండును? కనులకు కాటుక తల వెనుక జడకొప్పుదాల్చి కులుకు పార్థుని గాంచినప్పుడెల్ల నా గుండె నీరై కరిగిపోయెడిది. దీనికంతటికి మూలకారణమైన యీ ముసలి గ్రుడ్డివాని తల నా కఱకు కత్తివాటుతో కఱకఱ దెగనఱికినగాని నామదికూరటగల్గదు. అయ్యో! ఆ దుష్టదుర్యోధనుడు విదురాదులతో సంప్రతింపకయే మమ్మానాడు మంటలు మండు లక్కయింట గాల్పచూచెనే! అయ్యో పాపము, మమ్ము గాల్పదలచిన యా దుష్టుడే చివరకు కాలి బూడిద యయ్యెను గదా! ఓ నరపతీ! ఆనాడు నీ యనుమతి లేకయే కీచకాదుల నంతమొందించితిని. కాని ధృతరాష్ట్రుని సుతులు వారి భార్యలందరు నా చేత చంపబడక పోయిరి గదా! రాజేంద్రా! ఒకనాడు నీ శత్రులగు దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో జిక్కిరి. అపుడు నీ దయాభిక్షవలన వారు విడిపింపబడిరి. అది నీ మూర్ఖత్వము గాక మరేమి? అట్టి కిరాతకుడైన దుర్యోధనుని మేలునకు నీవిపుడు ధనమీయదలచితివే! నీవెంత ప్రేరించినను నేను మాత్రమే దీని కొప్పుకొనను.''

భీము డీ రీతిగ పలికి వెళ్ళెను. పిదప ధర్మజుడు తక్కిన మువ్వురితో సంప్రతించి ధృతరాష్ట్రునకు బహు ధన మొసంగెను. అపు డంబికాసుతుడగు ధృతరాష్ట్రుడు తన కొడుకుల కూర్ధ్వలోక క్రియలు జరిపెను. విప్రులకు భూరిగ దాన దక్షిణ లొసగెను. ఆ విధముగ ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై తన కొడుకులకు పరలోకక్రియలు జరిపెను. పిమ్మట నతడు విదురునితో కుంతీగాంధారులతో వనముల కేగెను. మహామతి విజ్ఞుడునగు సంజయుడుగూడ వారివెంట బయలుదేరెను. పాండవులు కుంతి నెంతయో వారించిరి. కాని యామె వినక వనముల కేగెను. ఆ సమయమున భీముడు నితర కౌరవులు విలపించుచు గంగాతీరమువదలి గజపురి కేగిరి. వారట్లడవులకేగి గంగాతీరమందలి శుభమైన శతయూపాశ్రమము జేరి యచ్చట పర్ణకుటీర మేర్పరచుకొని యందు సమాహితచిత్తమున తపము నెఱపిరి.

వారు పోయి యారేండ్లు గడచెను. ఒకనాడు ధర్మజుడు వారి యెడబాటు సైపలేక తన తమ్ములతో నిట్లు పలికెను: 

ధర్మజుయిట్లనియె: నేను కలలో దుర్బలయై వనమందుండియున్న కుంతిని గాంచితిని. కనుక మన తల్లిని పితరులను దర్శింపవలయునని నా మనస్సు దలంచుచున్నది. మహాత్ములగు విదుర సంజయులను జూడవలయుననియు నా మది గోరుచున్నది. కనుక మీకిష్టమైనచో మనమందఱము కలసి పోదము. ఇది యుక్తమని తలచుచున్నాను.' అటు పిమ్మట పాండవులు ద్రౌపది సుభద్ర యుత్తర నాగరకజనులును - వారిని దర్శించు కోరికతో శతయూపాశ్రమము చేరిరి. అచ్చో వారు వారిని సందర్శించిరి. వారిలో విదురుడు గనబడలేదు. అందులకే దర్మజు డతనినిగూర్చి ధృతరాష్ట్రు నడిగెను. ధృతరాష్ట్రుడు ధర్మజునకిట్లు పలికెను: 

ధృతరాష్ట్రుడు యిట్లనియె: ఆ విదురుడు నిస్పృహుడు నిష్పరిగ్రహుడు విరక్తుడు. కాన నెటనో యేకాంతమున సనాతనతత్త్వమును దనలో ధ్యానించుచున్నాడు. మరునాడు యుధిష్ఠిరు డాగంగాతటమున సంశితవ్రతుడు తీవ్రతపమున కృశాంగుడునగు విదురుని దర్శించెను. 

ధర్మజుడయిట్లనియె:నేను దర్మజుడను నీకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. విదురు డది వినియు స్థాణువువలె విననట్టులుండెను. అంతలో నొక్క క్షణమాత్రలో విదురుని నుండి యొక మహాద్భుత దివ్యతేజము బయలువెడలి ధర్మాంశజుడగు ధర్మజునిలో లీనమయ్యెను.

అట్లు విదురుడు ప్రాణములు వదలగ ధర్మజుడు వగచి యతని దేహమునకు దహనసంస్కారములు చేయబూనుకొనెను. అంతలో నొక యశరీరవాణి యిట్లు పలికెను: 

"ఓ ధర్మరాజా! వినుము. ఇతడు వైరాగ్య శ్రీలలితుడు. బంధముక్తుడు. కాన దహనార్హుడు గాడు. మీరింక యథేచ్ఛముగ నేగుడు. అపుడు పాండవ సోదరులందరును పావనగంగలో మునిగి దృతరాష్ట్రునకు జరిగిన దంతయును నివేదించిరి. పాండవులు మరల తమ యాశ్రమములు చేరి పౌరులతో నుండిరి. అంతలో వారి చెంతకు శ్రీ వ్యాసభగవానుడును నారదమహర్షియు నేతెంచిరి. అత్తఱి కొంద ఱితర మునులుగూడ ధర్మజునికడ కరుగుదెంచిరి. అపుడు శుభదర్శనుడగు వ్యాసునితో కుంతి యిట్లు విన్నవించెను. 

"తపోధనా! ద్వైపాయనా! నా కొడుకు కర్ణుడు తాను పుట్టినప్పుడే నానుండి దూరమయ్యెను. నా మది యిపు డతనిని గాంచ పరితపించుచున్నది. కనుక నాకతనిని జూపుము. ఓ విభూ! మహానుభావా! ఇందులకు నీవే సమర్థుడవు. కనుక నా వాంఛితము నెఱవేర్పుము." 

గాంధారి యిట్లనియెను: దుర్యోధనుడు రణమున కేగిన పిమ్మట నేనతనిని చూచి యెరుగను. కనుక నోమునివర్యా ! అతనిని నతని సోదరులను నాకిపుడు జూపుము. 

సుభద్ర యిట్లు పలికెను: ఓ మహాతపోధనా! అభిమన్యుడు నాకు ప్రాణములకంటె ప్రియమైనవాడు. నే నతనిని జూడగోరుచున్నాను. కనుక నా కతనిని జూపుము. 

సూతుడిట్లనియెను: ఆ విధముగ వ్యాసుడు వారు పల్కిన పల్కు లాలకించెను. ఆ మునీశ్వరుడు సంధ్యాసమయమున గంగనుజేరి ప్రాణాయామ మాచరించెను. అపు డతడా దేవదేవి దీనబంధువగు శ్రీసనాతనీ దేవిని హృదయకమలమందు నిలిపి ధ్యానించెను. పిదప వ్యాసుడు యుధిష్ఠరాదుల రావించెను. వారా పుణ్యగంగాజలముల పరిశుద్ధులైరి. ఆ విశ్వజననిని సంతుష్టురాలిని చేసి వ్యాసుడిట్లు సన్నుతించెను:

''శ్రీదివ్యమూల ప్రకృతీ! పురుషారామా! సగుణనిర్గుణాకృతీ! దేవదేవీ! బ్రహ్మ రూపిణీ! సుందరమణిద్వీపనివాసినీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాగ్ని యమవరుణ కుబేరులకు పూర్వమే వెలుగొందు శ్రీమాతృదేవీ! ఓ ఆద్యయగు పరాశక్తీ! నీకు సుమాంజలు లర్పింతును తల్లీ! ఓ పరిపూర్ణా! కళామయీ! భవానీ! ఈ పంచమహాభూతములు వాని గుణములు మనోబుద్ధ్యహంకారములు కరణములు సూర్యచంద్రులులేని మహాకాలమున తెలియరాని పెంజీకట్ల కావల నేకైక మహాజ్యోతిర్మూర్తివై విలసిల్లు దేవీ! నీకు సుమాంజలు లర్పింతును. విరాట్‌ స్వరూపమగు జీవలోకమును హిరణ్యగర్భమయమగు చిత్తమందునిలిపి యాసమష్టిలింగశరీరమగు హిరణ్యగర్భతత్త్వమును సామ్యావస్థలో నుంచి కల్పము చివరిదాక నిశ్చలచైతన్యజ్యోతియై వెలుగొందు శ్రీదేవి నెంత వివేకియు నెఱుగజాలడు. నీ వే యా మృతవీరుల జూపింపుము.'' ఈ వ్యాసస్తోత్రముతో నన్నుతయై శ్రీ భువనేశ్వరీ దేవి స్వర్గమునుండి మృతవీరుల రావించి యక్కడివారికి జూపెను. అట్లు మరల గనంబడిన తమ తమ వారిని కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు చూచి చూచి ముగ్ధులై శ్రద్ధాంజలు లర్పించిరి. పిదప వ్యాసుని యమితతేజము చేత వచ్చినవారలు మరల తమ తమ చోటులకు పంపబడిరి. ఇట్లు పాండవులు శ్రీదేవి దయవలన నింద్రజాలమువంటి దృశ్యము గాంచిరి. తరువాత నెల్లరు తమ తమ వాసములకు చేరుకొనిరి. పాండవ లట్లు శ్రీవ్యాసుని కథామృతపు చిలువలు రుచి జూచుచు హస్తిపుర మరిగిరి.

అధ్యాయము 28 పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 26 The Birth Story of Pandavas - అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 26

పాండవుల జన్మవృత్తాంతము

సూతుడిట్లనెను : ఆ ప్రకారముగా శంతనుడు సత్యవతిని పెండ్లి యాడెను. వారి కిరువురు కొమరులు గలిగి కాలవశులై మరణించిరి. ఆ వ్యాసమునితోడ కూడకకేగిన యంబిక మునిమూర్తుని చూడనోపక కన్నులు మూసికొనెను. ఫలితముగ ధృతరాష్ట్రుడు పుట్టుచీకుగ బుట్టెను. మరొకరాచకన్నె మునినిగాంచగానే యామె మొగము వెలవెలబోయెను. అందుచే వ్యాసుని కోపమున నామెకు పాండువర్ణము గలవా డుద్భంచెను. మూడవసారి కామకళావిదురాలగు దాసి వ్యాసుని సంతృప్తిని జేసెను. ఆ కారణమున ధర్మంశమున నామెకు సత్యవాది శుచియగు విదురుడు జన్మించెను. ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడగుటవలన మంత్రు లతని కధికార మీయక చిన్నవాడైననను పాండుని రాజుగ నియోగుంచిరి. ఇట్లు బలశాలియగు పాండురాజు భీష్మ ననుమతిచే రాజయ్యెను. మేధావియగు విదురు డతనికి మంత్రిగ నియమింపడెను. ధృతరాష్ట్రునకు నిర్వురు భార్యలు గలరు. మొదటి యామె సుబలుని పుత్రియగు గాంధరి. రెండవ భార్య యింటిపనులు చక్కబెట్టుచుండు వైశ్య. అటులే పాండురాజునకు శూరసేనుని కూతురగు కుంతి, మద్రదేశపు రాజు కూతురు మాద్రియను భార్యలు గలరు. గాంధరి నూర్గురు కొడుకులను గనెను. వైశ్య యుయుత్సుడను నొక ప్రియ సుతుని గనెను. కుంతి తన తండ్రి యింట నుండగ కన్నెప్రాయమునందె సూర్యునివలన కర్ణుని గనెను. తరువాత నామె పాండురాజునకు భార్య యయ్యెను.

ఋషులిట్లనిరి: సూతమునీ, మొదట కుంతికి కొడుకు పుట్టెనంటివి. తరువాత పాండురా జామెను పరిగ్రహించెనంటివి. నీవంతయు వింతగ బలుకుచున్నావు. సూర్యునివలన కన్యకకు కర్ణుడెట్లు గలిగెను? ఆమెకు మరల పాండురాజుతో నెట్లువివాహమైనది? 

సూతుడిట్లనెను: శూర సేనుని కుంతి. ఆమెకు చిన్నప్పుడే కుంతిభోజుడను రాజు శూరసేనుని ప్రార్థించి తన కూతురుగ స్వీకరించెను. అట్లు కుంతిభోజు డామెను పుత్త్రిగ స్వీకరించి యామె నగ్నికార్యములందు సేవకు నియోగించెను. అంతనొకనాడు దుర్వాసోమహర్షి యామె పుట్టినింటికి చాతుర్మాస్యదీక్ష జరుపదలచి యేతెంచెను. అపుడు కుంతి యా మునీశ్వరునకు పరిచర్యలు చేయుచుండి నతనిని సంతుష్టునిగ జేసెను. అందుకు ముని యలరి యామె కొక దివ్య మంత్ర ముపదేశించెను. ఆమంత్రప్రభావమున దేవతలే వచ్చి వాంఛితార్థములు లీడెర్చగలరు. ముని వెళ్ళిన పిదప కుంతి మంత్రప్రభావ మెఱుగదలచి యే దేవత నాహ్వానింపవలయునాయని యాలోచించెను. అంతలో అపుడే ఉదయించిన దివాకరుడగు సూర్యుని చూచి యామె మంత్ర ముచ్చరించి రవి నాహ్వానించెను. అపు డాదిత్యుడాకాశమండలమందుండి దివ్యసుందరమైన మానావాకారమున నామె మందిరమం దామె సమీపమున నవతరించెను. అట్లు సూర్యునిగని కుంతి కడు విస్మయమందెను. భయమున కంపించెను. మరుక్షణమే పుష్పవతి యయ్యెను. ఆ చారులోచన కేల్మొగిచి నిలచి రవి కిట్లనియెను: 

కుంతి నిట్లనియెను:  మీ దర్శనభాగ్యమున నేనిపుడు సంతసిల్లితిని.ఇంక మీరు మీ నిజమండలమున కేగుడు. 

సూర్యుడిట్లనియె: కుంతీ| మంత్రబలమున నన్ను నీవు పిలిచితివి. పిలుపుపై వచ్చి నీముందు నిలచిన నన్ను నీవేల పొందకున్నావు? నల్లని కడ కన్నులు గల కుంతీ| నేను కామార్తుడను. నీయం దనురాగభావము కలవాడను.మంత్రాధీనుడనై వచ్చితిని. నీతో విహారించుటకై కొనిపొమ్ము. 

కుంతి నిట్లనియెను: ధర్మజ్ఞా| సర్వసాక్షీ| సువత్రా| నీకు నమస్కారము. నేను కన్నియను. కులకన్యనగు నన్నునీవిట్లు పరుషాలు పలపకరాదు. 

సూర్యుడిట్లనియెను: నేనిపుడు రిత్తగ వెళ్ళినచో దేవతలందరు నన్ను నిందసేతురు. పరిహసింతురు. నాకు వారిలో దలవంపులగును. ఇది నిజము. నన్ను నీవిపుడు కలియకున్నచో నిపుడే నిన్ను, నీకు మంత్రమొసంగినవిప్రుని శపింతును. వరాననా| జనులు ఇది గుర్తింపకుండునట్లును నీ కన్యాత్వము చెడకుండునట్లు చేయుదును. నావంటి కొడుకును నీకు కలుగును. అని పలికి రవి తనయందు భావముకలదై లజ్జతో కూడియున్న ఆ కుంతి ననుభవించి ఆమెకు వాంఛితమగు వరమునిచ్చి వెడలెను.

సుశ్రోణియగు కుంతి గర్భము ధరించి రహస్య మందిరమందే యుండెను. ఈ జరిగిన కార్యమామె దాదికి తప్పనామెతల్లికిగాని లోకులకుగాని మరెవ్వరకిని తెలియదు. తన రహస్యమందిరమున అతి మనోహరుడును అతిరమ్యములగు కవచకుండలములతో కూడినవాడునగు కుమారుడామెకు గలిగెను. రెండవ సూర్యుని, అపర కుమారస్వామివలె నా శిశువుండెను. ఆ బాలుని దాది యెత్తుకొని సిగ్గులో మునిగిన కుంతితో నిట్లనియెను: 

"నీవేల యిపుడు చింతించుచున్నావు? నేనున్నానుకదా|" కుంతి తన కుమారునొక పెట్టెలో
నుంచుచు నాతనితో నిట్లనెను: 

"ఓసుతా! ఆర్తనగు నేను నా ప్రాణసముడవగు నిన్ను విడనాడుచున్నాను. ఏమి చేయగలను? ఆ సుగుణనిర్గుణ స్వరూప సర్వేశ్వరి భగవతి నిన్ను కాపాడుగాక! కోరికలదీర్చు ఆ విశ్వమాత నిను పాలించుగావుత! నేను దుష్టురాలగు స్వైరణివలె లోకలోచనుని తనయుడవగు నిన్నొంటిగ వదలుచున్నాను. ప్రాణసముడవగు కుమారా! నీ లలిత ముఖకమలము మరల నెపుడు గాంతునో కదా! వెనుకటి జన్మములందు నేను త్రిలోకమాత నారాధింపలేదేమోకదా! ఓ నందనా! అదృష్టహీనురాలను నేను నిన్ను వనములందు వదలుచున్నాను. నా పాపబుద్ధికి నేనే పరిపరి విధాల పరితపించుచున్నాను ఈ రీతిగ కుంతి పలికి జనదర్శనభయమున తన పట్టిని పెట్టెలో భద్రముగ నుంచి దాదిచేతులో పెట్టెను. ఆ పిదప భయపడుచు స్నానముచేసి కుంతి తన తండ్రి యింట నుండెను. ఆ పెట్టె నదిలో కొట్టుకొని పోయిపోయి యధిరథుడనువానికిదొరకెను. ఆ యధిరథుడొక సూతుడు. అతని భార్య రాధ. ఆమె బాలుని గ్రహించి పెంచెను. ఆ వీరుడు బలశాలి యగు బాలుడే సూతునింట కర్ణుడను పేర విఖ్యాతి గాంచెను.

కొన్నాళ్లకు కుంతీ స్వయంవరము జరిగెను. అందామె పాండురాజును వరించెను. మద్రరాజసుతయగు మాద్రియు నతనికి రెండవ భార్యయయ్యెను. ఒకనాడు పాండురా జు వేటకేగి మృగరూపమున క్రీడించుచున్న మునిని మృగమను భ్రాంతిచే బాణము ఏసి చంపెను. ఆ ముని కోపించి స్త్రీ సంగమము సల్పునపుడు నీవు నిట్లే మరణింతు వని పాండురాజును శపించెను. పాండురాజటుల శపింపబడి శోకమునగుందుచు రాజ్యము వీడి వనవాసము చేయుచుండేను. కుంతీ మాద్రులు తమ సతీధర్మము నెఱపుటకు రాజునకు పరిచర్యలు చేయ నతని వెంట వెడలిరి. పాండురాజు పావన గంగా తీరమందలి మున్యాశ్రమములందుండి ధర్మశాస్త్రములు వినుచు కఠిన తప మాచరించెను. అత డొకసారి యచట జరుగుచున్న ధర్మ విషయకచర్చల ప్రసంగమున ముని భాషణము లిట్లు వినెను. అపుత్త్రకులకు స్వర్గలోక గమనమునకు గతులుండవు.కనుక నే విధముననైన పుత్త్రుని బడయవలయును. అంశజుడు పుత్త్రికాపుత్త్రుడు క్షేత్రజుడు గోలకుడు కుండుడు సహోఢుడు కానీనుడు క్రీతుడు వనప్రాప్తుడు అశక్తులవలన డబ్బునకమ్ముడు పోయినవాడు అను వీరెల్లరును తనయులే యగుదురు. వీరిలో వరుసగ నొకనికన్న మరొకడు తక్కువవాడు. ఇది నిజము. అను ముని మాటలు విని పాండురాజు కుంతితో నిట్లనియెను. నీవు వేగమే యొక మహామునిని గలియుటకు తపోవని కరుగుము. ఆ ముని దయ వలన పుత్త్రుని గనుము. నా యాజ్ఞవలన నీకు దోషమంటదు. మునుపు సౌదాసుడను రాజు వసిష్ఠమహర్షి వలన పుత్త్రుని బడసెనని వింటిని.

అంత కుంతి యిట్లనియెను: 'ఓ కామదా! పూర్వము దుర్వాసో మహర్షి నాకు సిద్ధిప్రదమగు నొక మంత్రముపదేశించెను. అది నాయొద్ద గలదు. ఆ మంత్ర ప్రభావమున నేనే
దేవతనాహ్వానింతునో యా దేవత నా సన్నిధికి రాగలడు'' అపుడు కుంతి తన పతి యనుమతి బడసి ధర్మదేవతను స్మరించినది. ఆమె యతని కలయిక వలన యుధిష్ఠిరుని తొలి పుత్త్రుడగు బడసినది. పిదప నామె వాయుదేవుని దయవలన భీముని ఇంద్రుని యనుగ్రహమున కిరీటిని ప్రతియేట నొక్కొక్కని వంతున వరపుత్త్రులుగ బడిసినది. 

అపుడు మాద్రి పాండురాజుతో నిట్లనియెను: 
"ప్రభూ ! నాకును బుత్త్రులను ప్రసాదించుము. నేనేమి చేయుదును ? నా దుఃఖము బాయు నట్లొనరింపుము. పాండురాజా విషయము కుంతితో జెప్పెను. కుంతి దయతో మాద్రికి మంత్రోపదేశము జేసెను. మాద్రికొక్కడే పుత్త్రుడు చాలునని పాండురాచు కట్టడి చేసెను. మాద్రి యశ్వనీదేవతలను మదిలో స్మరించి నకులసహాదేవుల నిర్వురను గనెను. ఈ ప్రకారముగ దేవతలు పాండురాజు క్షేత్రమునందు పంచపాండవులై యుద్భవించిరి. ఓ మునులారా! వారా యడవిలో నొకరి కింకొకరొక యేడు అంతరముగ నుద్భవించిరి.

అంత నొకనాడు పాండురాజు చావుమూడగ కామార్తుడై ఆశ్రమమందు మాద్రిని సమీపించి బలాత్కారముగ నామె చేయి పట్టెను. ఆమె వద్దువద్దనియ యెంతగ మొఱ పెట్టి వారించినను పాండురాజు వినక తన ప్రియను తమిదీర కౌగిలించుకొనెను. వెంటనే యతడు మన్నుగఱచెను. చెట్టు పడినప్పుడు దాని నాశ్రయించియున్న తీవియగూడ పడునట్లు మాద్రి క్రిందబడి వలవల యేడవసాగెను. అపుడు కుంతియు రోదించుచు వచ్చెను. ఆ కోలాహలమును విని మునులును బాలకులును గుమిగూడిరి. అట్లు పాండురాజు దివంగతుడుగాగా మునులును పాండుపుత్త్రులును గలిసి గంగాతీరమున నతనికి దహన సంస్కారము లొనరించిరి. అపుడు మాద్రి తన సుతులను కుంతి కప్పగించినది. పిదప నామె సత్యచింతనతో సతీధర్మము పాటించుచు పాండురాజుతో సహగమించినది. ఆయాచోటుల వసించు మునులు పాండవులచేత దానములు తర్పణములు నాచరింపించిరి. పిదప వారు పాండవులను గొంతిని కరిపురికి గొనిపోయిరి. వారి శుభాగమన మెఱిగి గాంగేయుడు విదురుడు ధృతరాష్ట్రుడు ప్రజానీకము వారి కెదురేగెను. జనమునకు పాండురాజునకు గల శాపము తెలియును. కాన వారు కుంతినీ వరాననా! వీరలెవ్వరి పుత్త్రు'లని యడిగిరి. అపుడు కుంతి దుఃఖాన్వితయై వీరలు కురుకులమున ప్రభవించిన సురకుమారకులు అని నుడివి యామె వారు నమ్ముటకు తిరిగి దేవతలనే యాహ్వానించెను. అంత దేవత లేతెంచి గగనసీమపై వెలుగుమూర్తులై వీరు మా కన్నవారలే' యని వక్కాణించి పలికిరి. దేవవాక్కులకు భీష్ముడు విలువ నిచ్చెను. ఇట్లు భీష్ముడు దేవకుమారకుల గౌరవము నిలువబెట్టెను. అంత నచ్చటివారందఱును బాలకులను కుంతిని వెంట నిడుకొని హస్తినాపురములోని కరిగిరి. భీష్మాదులందరును సంప్రీతి మెఱయ తమ విభవముల కనుగుణముగ వారిని పోషించిరి. ఈ విధముగ కుంతీకుమారులు భీష్ముని చేత పరిరక్షింపబడిరి.

అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Chapter 25 Shantanu's marriage with Satyavati - అధ్యాయము 25 శంతనుడు సత్యవతిని వరించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 25

శంతనుడు సత్యవతిని వరించుట

ఋషు లిట్లడిగిరి : సూతమహామునీ! శాపకారణమున వసువు గాంగేయుడుగా నుద్భవించెనంటివి. శ్రీ వ్యాసుని తల్లియు గంధవతియని ప్రసిద్ధయునగు సత్యవతి శంతనుకు భార్య యెట్లయ్యెనో - ధర్మవరిష్ఠుడగు శంతను డా దాశపుత్త్రినెట్లు వరించెనో విపులీకరించి తెలిపి మా సందియము బాపుము.

సూతు డిట్లనియెను : రాజర్షియగు శంతనుడు గాంగేయుడగు తన కుమారునితో నా పరమశివుడు కైలాసమున తన కుమారునితోవలెనే సుఖముండెను. మృగయారతుడై వనముల కేగి మహిషరురు మృగములను జెండాడుచు వినోదించుచుండెను. ఆ రాజొకనాడు ఖడ్గసూకరములపై వాడి బాణములు ఏయుచు కాళిందీ నదీతీరమందలి వనముల కేగెను. అంతలో నతడచట నలౌకికమైన దివ్య పరిమళ మాఘ్రాణించి యా నెత్తావికెరటములు వీచు దిక్కు మొగమై దాని కారణ మారయుచుండెను. ఇది మందార పరిమళముగాని కస్తూరి సౌరభముగాని చంపక మాలతీ కేతక సుమముల నెత్తావిగాని కాదు. ఈ కమ్మతెమ్మెర యచ్చటినుండి వచ్చిననేమి! ఇది నా నాసికను తృప్తిపఱచుచున్నది? అని తలంచుచు ఆ సుగంధమునకు ముగ్ధుడై రాజావన సీమయంతయును కలయ దిరిగెను. అంతలో రాజొక యేకాంత ప్రదేశము మలిన వస్త్రములు ధరించియు మేని సొబగులు సింగారించుకొనిన ఒక రమణీయ కాంతను చూచెను. నల్లని కడకంటి చూపులుకల ఆమెను చూచి ఆ రాజు ఆశ్చర్యపడి ఈ తానాఘ్రాణించిన సుగంధ మామె దేహమునుడి బయలు వెడలినదే యని నిశ్చయించెను. మిగుల సుందరమును ఆద్భుతమును అగు ఆ రూపమును సర్వప్రాణులకు రంజకమగు ఆ సుగంధమును శుభమగు ఆ లేజవ్వనమును చూచి రాజు మిగుల నాశ్చర్యపడి ఇట్లు భావించెను: ఈమె ఎవరై యుండును. ఎక్కడినుండి ఇప్పుడు వచ్చి యుండును? దేవాంగనయో? మానవస్త్రీయో! గంధర్వ కన్యయో! నాగకన్యయో! ఈ గంధవతియగు కామిని ఎవరనునది ఎట్లు గుర్తింపగలను? అని రాజు తన లోలోన తలపోయుచు తానై స్వయముగ నిదమిత్థమని నిర్ణయింప లేకుండెను. ఈమె నాటి గంగయేమో! అనుకొనుచు నతడు కామవశుడై యా నదీతీరమున నున్న యా కాంతచెంత కేగి యామె నిట్లు ప్రశ్నింపసాగెను:

"ఓ ప్రియరూపా! నీవు ఎవ్వరి పుత్త్రివి? ఏల ఈ విజన ప్రదేశమునందు ఒంటిగా నున్నావు? చారునేత్రా! నీవు వివాహితవా? అవివాహితవా? నా మనస్సును రంజింపజేయు సుందరివగు వంపులు తీరిన కనుగొనలు కల నిన్నుచూచి కామవశుడనయితిని. నీవు ఎవరవు? ఏమి చేయుదానవు? అను విషయములను నీవు నాకు వివరముగా తెలుపుము "అని ఆ సుందరితో రాజు పలుకగనే ఆ పద్మాక్షి రాజుతో చిరునగవున నిట్లు పలికెను : 

"ఓ నరాధినాథా! నేను దాశపుత్త్రిని. తండ్రియాజ్ఞలో మెలగు కన్నియనని తెలియుము. ఓ నృపేంద్రా! ధర్మనిమిత్తముగ నేనీ నీటిలో ఈ నావ నడుపుదును. నా తండ్రి యిపుడే యింటికేగెను. అర్థపతీ! నీతో నిది పూర్ణముగా సత్యము పల్కుచున్నాను.

అని కామిని పలుకగనే కామాతురుడగు ఆ శంతను రాజు ఆమెతో నిట్లనెను : కురుప్రవీరుడనగు నన్ను నీ పతిగ జేసికొనుము. నీ యీ జవ్వనము వ్యర్థమయిపోరాదు గదా? నాకు ప్రకృతము మరియొక భార్యలేదు. మృగాక్షీ! నీవు నా ధర్మపత్నివి కమ్ము. నేను నీకు దాసుడనై సర్వదా నీకు వశవర్తినై యుండగలను. ఓ ప్రియా! నీయం దనురక్తుడనగు నన్ను మన్మథుడు సంతాపింపజేయుచున్నాడు. నా భార్య నన్ను వీడిపోయినది. పిమ్మట ఇంతవరకు వేరొకర్తుకను వివాహమాడలేదు. నేనిపుడు విధురుడను. రమ్యములగు సర్వావయవములు గల నిన్ను చూచిన నా మనస్సు వివశమయినది.

దాశకన్యయగు ఆ గంధవతి అతి రమ్యమును అమృతమువలె మాధుర్యము కలదియునగు రాజు పలుకు విని తానును సాత్త్వికభావయుక్తురాలై శంతనునకు ధైర్యము కలిగించుచు ఇట్లు పలికెను: రాజా! నీవు నా విషయమున పలికినదంతయు యథార్థమే యని భావించుచున్నాను. కాని నేను స్వతంత్రురాలను కానని గ్రహించి మీరు శీఘ్రమే మా తండ్రి నన్ను నీకు ఇచ్చునట్లు అడుగగోరెదను. దాశకుమారికనగు నేను స్వేచ్ఛ కలదానగాను. నా తండ్రి యానతి జవదాటను. నా తండ్రి నన్ను నీకు దానము చేసినచో మీరు నన్ను చేపట్టవచ్చును. నేను నీ వశవర్తినగుదును. రాజా! నిన్ను మాత్రమే ఏమి, నవ¸యవనమందున్న నన్నును మన్మథుడట్లే వేధించుచున్నాడు. ఎట్టి స్థితియందును కులాచార పరంపరా వ్యవస్థచే సాగవలసిన నిలుకడలను కాపాడుట న్యాయ్యముగదా!

ఆ వనిత వాక్కులు విని కామాయత్తచిత్తుడగు శంతనుడు దాశరాజు నింటికి ఆ కన్యను తన కిమ్మని కోరుట కేగెను దాశరాజు తన చెంతకువచ్చు భూపతిని చూచి విస్మయమందెను. అతడు రాజునకు నమస్కరించి దోయిలి పట్టి ఇట్లు పలికెను:

దాశరాజిట్లనెను: భూపాలకా! నేను మీ దాసుడను. మీ శుభాగమనమున ధన్యజీవుడనైతిని. ఏ యర్థము గోరి వచ్చితిరో నన్నాజ్ఞాపింపుడు. 

రాజిట్లనియెను: అనఘా! నీ వామోదించి ఇచ్చినచో నీ కూతును నా ధర్మపత్నిగ పరిగ్రహింతును. నా మాట నిజము.' 

దాశరాజిట్లనియె: రాజేంద్రా! నా కన్యారత్నమును మీరు ప్రార్థించుట మంచిదే. ఆమె ఒక యోగ్యుడైన యయ్యచేతిలో పెట్టదగినదే కదా! అపాత్రునకెన్నడు నీయను. రాజా! నాకూతునకు బుట్టుకొడుకే నీ తరువాత నీ గద్దెనెక్కవలయును. కాని నీ యితర కుమారులెక్కరాదు.' 

సూతుడిట్లనియె: దాశరాజు పల్కులువిని రాజు చింతాతురుడయ్యెను. గాంగేయునిదలచి దాశరాజునకు రాజేమియు మారు పలుకక మిన్నకుండెను. అంత రాజు కామార్తుడై తన యింటి కేగెను. చెప్పరాని దిగులుతో నతడు మజ్జనభోజనములు నిద్ర విడనాడెను. అట్లు చింతాతురుడైయున్న తన తండ్రినిగాంచి యతని దరిజేరి గాంగేయుడు అతని అసంతోష కారణ మడిగెను.

నీకెవడైన నలవిగాని వాడున్నచో చెప్పుము. ఆ శత్రువును పట్టితెచ్చి నీ పాదాలమీద పడవైతును. నీ చింతయేమో తెల్పుము. తన తండ్రి దుఃఖమెఱిగి దానిని బాపని కొడుకొక కొడుకేనా? వాడు పుట్టియేమి ఫలము? అట్టివాడు వెనుకటి జన్మల ఋణము దీర్చుకొనుటకు పుట్టిన వాడగును. ఇందు సందేహము లేదు. అలనాడు తన తండ్రి మాట నెరవేర్చుటకే కదా జన మనోనయనాభిరాముడగు శ్రీరాముడు రాజ్యమువదలి జానకీలక్ష్మణులుతోడురాగా వనములకేగి చిత్రకూటగిరులపై వసించెను. ఆనాడు హరిశ్చంద్ర మహారాజు కొడుకు రోహితుడను నతడు తన తండ్రి మాట మేరమీరకయే గదా యొక బాపని కమ్ముడుపోయి యతని యింట దాస్యమునకుండెను. మున్నొకనా డజీగర్తుని కొడుకు శునశ్శేపు డనువాడు తన తండ్రి చేత నమ్మబడి యూప స్తంభమునకు గట్టబడెను. అపు డతనిని విశ్వామిత్రుడు వచ్చి విడిపించెను గదా! మునుపొకనాడు పరశురాముడు తన పితృనానతిచేత తన తల్లి తల ఖండించి పేరు వడసెను. అత డపుడు తన గురు నాజ్ఞ తలదాల్చుటే తన గురు కర్తవ్యముగనెంచి చేయరాని పనియైనను చేసెను గదా! ఈ నా మేను మీది. నేను సమర్థుడనై యున్నాను. మీరు చెప్పినది తు-చ-తప్పక పాటింతును. నేనుండగ శోకింపనేల? ఎంత యసాధ్యకార్యమైనను సాధించి తీరుదును. నీ మదిలోని దిగులేమో తెలుపుము. ఈ క్షణమే విల్లు చేబూని నీ కోర్కి దీర్తును. నీ వాంఛితము నెఱవేఱినచో నా బ్రతుకు చరితార్థమగును. తన తండ్రి కామితము దీర్పజాలియుండియు నే కొడుకు దానిని దీర్పకుండునో వాడు వట్టి పనికిమాలినవాడు. తన తండ్రి చింత బాపి యతని నుద్ధరింపని కొడుకు పుట్టి యేమి ప్రయోజనము?'

సూతు డిట్లనియెను: తన తనయుని సాంత్వవచనము లాలకించి శంతను మహారాజు నెమ్మదిగ మోమున దోచు సిగ్గుచు లోన నడచుకొని యతని కిట్లు పలికెను: 

శంతనుడిట్లనియెను: నీవు మహాశూరుడవు-బలశాలివి-అభిమానివి. రణరంగధీరుడవు. ఇట్టి నీవొక్కడవే నాకు సుతుడవు గదాయని నాలోన తీరని చింత వేధించుచున్నది. కుమారా! నాకు నీవొక్కడవే సంతగుట చేత నొకవేళ నీవు యుద్ధమున మరణించినచో నాకిక ఆశ్రయముండదు. ఇంకేమి చేయగలను? ఇదొక్కటే నాకున్న చింత. నీముందు చెప్పుకొనదగిన చింత నాకు వేరేదియును లేదు. దీనికొఱకే నేనింతగ బాధపడుచున్నాను. తన తండ్రి మాట లాలకించి గాంగేయు డమాత్యవృద్ధులతో నిట్లనియెను: 

గాంగేయు డిట్లనియె: ఏదో సిగ్గువలన భూపతి నాతో సరిగ విడమఱచి పల్కుటలేదు. కనుక మీరతని చిత్తవర్తనమెఱిగి నాకంతయు నున్నదున్నట్లు దెల్పుడు. ఏ కలతయులేక వెంటనే యన్నిపనులు చక్కపెట్టి తండ్రి మదికి శాంతి చేకూర్చగలను. వారా మాటలువిని రాజు చెంతకేగి యతని చింతాకారణము దెలిసికొనిరి. వారా విషయముగూర్చి గాంగేయునకంతయు జెప్పిరి. విశేషజ్ఞుడగు గాంగేయుడు దానిగూర్చి యాలోచించెను. అపుడు వేగిరమే గంగాసుతుడు మంత్రులను వెంటనిడుకొని దాశరాజు నింటికేగి సవినయముగా నెమ్మిగదుర నతని కిట్లనియెను : 

గాంగేయు డిట్లనియెను: పరంతపా! నా తండ్రికి నీ కూతు నిమ్మని నిన్ను ప్రార్థించుచున్నాను. ఆమె నాకు తల్లి యగుగాక! ఆమెకు దాసుడనై యుందును. 

దాశరాజిట్లనియెను: రాజా! నీవే నా కూతును భార్యగ గ్రహింపుము. ఏలయన, నీవుండగ నీమెకు పుట్టినవాడు రాజు గాజాలడు గదా? 

గాంగేయు డిట్లనియెను: ఈ దాశపుత్త్రి నా తల్లి. ఈమెకు గల్గు కుమారుడే యెల్లభంగుల రాజు గాగలడు. నేను రాజ్యము నేలను. ఇందు సుంతయు సందేహము లేదు. 

దాశరాజిట్లనియెః నీ వాక్యము సత్యమని నేనెఱుంగుదును. కాని నీకు గలుగు కుమారుడు బలవంతుడై బలిమితో నిశ్చయముగ రాజ్య మపహరించవచ్చును గదా? 

గాంగేయుడిట్లనియెను: అట్లయిన నేను పెండ్లియే చేసికొనను. నేనిదే భీష్మమగు ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా యీ మాట నిజము అను భీష్మ ప్రతిజ్ఞ విని దాశరాజు శోభనాంగియగు సత్యవతిని శంతనునకు ప్రదానమొనరించెను. అతడు సత్యవతిని విధివిధానమున వివాహము చేసికొనెను. ఈమెకే మున్ను వ్యాసుడు జన్మించెననుట శంతను డెఱుగడు.

అధ్యాయము 26 పాండవుల జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...