Saturday, April 11, 2026

Chapter 27 By the grace of Sridevi, the Pandavas found their dead heroes - అధ్యాయము 27 శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 27

శ్రీదేవి దయవలన పాండవాదులు మృతవీరులను గాంచుట

సూతుడిట్లనియెను : ఆ పంచపాండవులకు ద్రౌపది భార్యయై పతివ్రతయైనది. ఆ సాధ్వీమతల్లికి తన పతులకంటె సుందరతరులగు నైదుగురు కొమరులు గల్గిరి. అర్జునుడు శ్రీకృష్ణు ననుమతమున నతని సోదరియగు సుభద్రను హరించుకొనివచ్చి భార్యగ బడసెను. మహాభారతయుద్ధమందు సుభద్రకు జనియించిన అభిమన్యుడును ద్రౌపదేయులును వీరస్వర్గమలంకరించిరి. ఆ సమయమున నభిమన్యుని భార్య యుత్తర నిండుచూలాలుగ నుండెను. ఆమె గర్భ మశ్వత్తాముని బాణాగ్నికి క్రాగిక్రాగి మృతశిశువును గనెను. అపుడు శిష్టరక్షకుడు శ్రీవాసుదేవుడు తన లోకాద్భుత ప్రతాపము జూపించి యశ్వత్థామ బాణాగ్నికి దగ్ధుడైన తన మేనల్లుని కొడుకునకు మరల ప్రాణము పోసెను. వంశము పరిక్షీణమగుచుండగ బుట్టినవాడగుటవలన నా బాలుడు పరిక్షిత నామమున నిలపై వన్నెకు వాసికెక్కెను. ధృతరాష్ట్రుడు తన నూరుగురు కొడుకులు సంగరమందు చచ్చుటవలన దుఃఖితుడై పాండవుల యేలుబడిలో నుండెను. భీముని హృదయవిదారకమైన పరుషములకు పీడితుడయ్యును కోరలూడపెఱికిన పామువలె పడియుండెను. గాంధారియు శోకాతురయై యచ్చటనే యుండెను. ధర్మరాజు వారిరువురకు పరిచర్యలు సలుపుచుండెను. ధర్మాత్ముడగు విదురుడును యుధిష్ఠి రానుమతిచే వారిచెంతనే యుండి మంచి మాటలతో వారిని ప్రబోధించుచుండెను. ధర్మపుత్త్రుడును వారికి నిరంతర సేవలు సేయుచు వారి పుత్త్రశోకము మఱపించుచుండెను.

భీముడు మాత్రము పట్టరాని యుక్కురోషమున లోకులు వినునట్టుగ వారిని వాగ్బాణములతో పీడితులుగజేయుచుండెను. ఈ పుట్టు గ్రుడ్డివాని కొడుకులందఱు రణరంగమున నొక్కుమ్మడిగ నాచేతిలోబడి మన్నుగఱచిరి. ఆ క్రూర దుశ్శాసనుని ఱొమ్ముచీల్చి వానిగుండె నెత్తురు కుత్తుకబంటిక గ్రోలితిని. ఈ కుచ్చితాలమారి గ్రుడ్డివాడిపుడు మేమిడు ధర్మపిండమును తలవంచుకొని తినుచున్నాడు. ఇతడు కాకమువంటివాడు. వట్టి పనికిమాలినకుక్క. వ్యర్ధముగ జీవించుచున్నాడు. భీము డీ రీతిగ ప్రతిదినము పరుష వాక్యములు ధృతరాష్ట్రుని ముందాడుచుండెను. ధర్మాత్ముడగు ధర్మరాజు మాత్రమతడు మోఱకుడని తలచి యతని నూరడించుచుండును. ఇట్లు ధృతరాష్ట్రు డచట పదునెన్మిదేండ్లు తీరని పుత్రశోకమున నెట్టులో గడపి తుదకు వనములకేగుటకు ధర్మరాజు నడిగెను. నేను విధివిధానముగ నా కొడుకులకు తిలతర్పణము లొనరింతు నని ధృతరాష్ట్రుడు యుధిష్టిరునిగోరెను. భీముడు రణమృతుల కందఱి కంత్యక్రియలు జరిపెనుగాని ప్రాతపగలు మనస్సులో పెట్టుకొని నా కొడుకులకు మాత్రము కర్మలు జరుపలేదు. కనుక నీవు నాకు సరిపడు ధనమొసంగినచో నా కొడుకుల కర్మలొనరించి పిమ్మట స్వర్గ ఫలప్రదమగు తపమొనరింప వనముల కేగుదును. అపుడు విదురుడు ధృతరాష్ట్రునకు ధనవిమ్మని ధర్మరాజుతో చాటుగ చెప్పెను. అందులకు ధర్మజు డతనికి ధనమీయ దలంచెను. అంత ధర్మరాజు తన వారిని రావించి ఓ మహాశయులరా ! ధృతరాష్ట్రున కతని కుమారుల తిలతర్పణమునకు డబ్బిత్తు, ననెను. మహాతేజస్కుడగు తన పెద్దన్న మాటలు విని మహాబాహుడగు భీము డుగ్రుడై యిట్లనియెను:

''ఓ మహానుభావా! దుర్యోధన పక్షపాతికి ధనమిచ్చుటయా? అతడా సొమ్ముతో సుఖము లొందును. ఇంతకన్న మూర్ఖత్వము మరేమున్నది? నీ యీ దుర్మంత్రణము వలననే మేము మొదటి నుండి కష్టాలపాలయితిమి. ఆ దుర్మార్గుని వలననే కదా ద్రోపది నిండు సభ కీడ్పించబడినది? ఓ సువ్రతా! మేమా విరాట నగరమున నుండుటకు హేతువు నీ ప్రసాదమే కదా! అమిత విక్రములమగు మాకొక మత్స్యరాజు నింట నూడిగము చేయవలసి వచ్చెగదా! ఇంతకు నీవు జూదమాడనిచో మాకీ యష్టకష్టాలు వచ్చెడివే కావు. ఆ జరాసంధునే పరిమార్చగల్గిన నేనొక విరాటుని వంట యింట గంటె త్రిప్పవలసి వచ్చెను. అర్జును డింద్రుని కుమారుడు. అంతటివాడే యాడుపిల్లలకు నర్తనము నేర్పువాడై బృహన్నల గావలసి వచ్చెను గదా! అతడొక సామాన్య స్త్రీ రూపము దాల్చెను. విధి యెంతగ మారె నకట ! గాండీవగుణరవమున శోభిల్లు గాండీవి చేతగాజులు గలగల లాడుటయా! ఆత్మాభిమానము గల మహాపురుషున కభిమానము చంపుకొనుటకన్న దుఃఖమేముండును? కనులకు కాటుక తల వెనుక జడకొప్పుదాల్చి కులుకు పార్థుని గాంచినప్పుడెల్ల నా గుండె నీరై కరిగిపోయెడిది. దీనికంతటికి మూలకారణమైన యీ ముసలి గ్రుడ్డివాని తల నా కఱకు కత్తివాటుతో కఱకఱ దెగనఱికినగాని నామదికూరటగల్గదు. అయ్యో! ఆ దుష్టదుర్యోధనుడు విదురాదులతో సంప్రతింపకయే మమ్మానాడు మంటలు మండు లక్కయింట గాల్పచూచెనే! అయ్యో పాపము, మమ్ము గాల్పదలచిన యా దుష్టుడే చివరకు కాలి బూడిద యయ్యెను గదా! ఓ నరపతీ! ఆనాడు నీ యనుమతి లేకయే కీచకాదుల నంతమొందించితిని. కాని ధృతరాష్ట్రుని సుతులు వారి భార్యలందరు నా చేత చంపబడక పోయిరి గదా! రాజేంద్రా! ఒకనాడు నీ శత్రులగు దుర్యోధనాదులు గంధర్వుల చేతిలో జిక్కిరి. అపుడు నీ దయాభిక్షవలన వారు విడిపింపబడిరి. అది నీ మూర్ఖత్వము గాక మరేమి? అట్టి కిరాతకుడైన దుర్యోధనుని మేలునకు నీవిపుడు ధనమీయదలచితివే! నీవెంత ప్రేరించినను నేను మాత్రమే దీని కొప్పుకొనను.''

భీము డీ రీతిగ పలికి వెళ్ళెను. పిదప ధర్మజుడు తక్కిన మువ్వురితో సంప్రతించి ధృతరాష్ట్రునకు బహు ధన మొసంగెను. అపు డంబికాసుతుడగు ధృతరాష్ట్రుడు తన కొడుకుల కూర్ధ్వలోక క్రియలు జరిపెను. విప్రులకు భూరిగ దాన దక్షిణ లొసగెను. ఆ విధముగ ధృతరాష్ట్రుడు గాంధారీ సహితుడై తన కొడుకులకు పరలోకక్రియలు జరిపెను. పిమ్మట నతడు విదురునితో కుంతీగాంధారులతో వనముల కేగెను. మహామతి విజ్ఞుడునగు సంజయుడుగూడ వారివెంట బయలుదేరెను. పాండవులు కుంతి నెంతయో వారించిరి. కాని యామె వినక వనముల కేగెను. ఆ సమయమున భీముడు నితర కౌరవులు విలపించుచు గంగాతీరమువదలి గజపురి కేగిరి. వారట్లడవులకేగి గంగాతీరమందలి శుభమైన శతయూపాశ్రమము జేరి యచ్చట పర్ణకుటీర మేర్పరచుకొని యందు సమాహితచిత్తమున తపము నెఱపిరి.

వారు పోయి యారేండ్లు గడచెను. ఒకనాడు ధర్మజుడు వారి యెడబాటు సైపలేక తన తమ్ములతో నిట్లు పలికెను: 

ధర్మజుయిట్లనియె: నేను కలలో దుర్బలయై వనమందుండియున్న కుంతిని గాంచితిని. కనుక మన తల్లిని పితరులను దర్శింపవలయునని నా మనస్సు దలంచుచున్నది. మహాత్ములగు విదుర సంజయులను జూడవలయుననియు నా మది గోరుచున్నది. కనుక మీకిష్టమైనచో మనమందఱము కలసి పోదము. ఇది యుక్తమని తలచుచున్నాను.' అటు పిమ్మట పాండవులు ద్రౌపది సుభద్ర యుత్తర నాగరకజనులును - వారిని దర్శించు కోరికతో శతయూపాశ్రమము చేరిరి. అచ్చో వారు వారిని సందర్శించిరి. వారిలో విదురుడు గనబడలేదు. అందులకే దర్మజు డతనినిగూర్చి ధృతరాష్ట్రు నడిగెను. ధృతరాష్ట్రుడు ధర్మజునకిట్లు పలికెను: 

ధృతరాష్ట్రుడు యిట్లనియె: ఆ విదురుడు నిస్పృహుడు నిష్పరిగ్రహుడు విరక్తుడు. కాన నెటనో యేకాంతమున సనాతనతత్త్వమును దనలో ధ్యానించుచున్నాడు. మరునాడు యుధిష్ఠిరు డాగంగాతటమున సంశితవ్రతుడు తీవ్రతపమున కృశాంగుడునగు విదురుని దర్శించెను. 

ధర్మజుడయిట్లనియె:నేను దర్మజుడను నీకు ప్రణమిల్లుచున్నాను అని పలికెను. విదురు డది వినియు స్థాణువువలె విననట్టులుండెను. అంతలో నొక్క క్షణమాత్రలో విదురుని నుండి యొక మహాద్భుత దివ్యతేజము బయలువెడలి ధర్మాంశజుడగు ధర్మజునిలో లీనమయ్యెను.

అట్లు విదురుడు ప్రాణములు వదలగ ధర్మజుడు వగచి యతని దేహమునకు దహనసంస్కారములు చేయబూనుకొనెను. అంతలో నొక యశరీరవాణి యిట్లు పలికెను: 

"ఓ ధర్మరాజా! వినుము. ఇతడు వైరాగ్య శ్రీలలితుడు. బంధముక్తుడు. కాన దహనార్హుడు గాడు. మీరింక యథేచ్ఛముగ నేగుడు. అపుడు పాండవ సోదరులందరును పావనగంగలో మునిగి దృతరాష్ట్రునకు జరిగిన దంతయును నివేదించిరి. పాండవులు మరల తమ యాశ్రమములు చేరి పౌరులతో నుండిరి. అంతలో వారి చెంతకు శ్రీ వ్యాసభగవానుడును నారదమహర్షియు నేతెంచిరి. అత్తఱి కొంద ఱితర మునులుగూడ ధర్మజునికడ కరుగుదెంచిరి. అపుడు శుభదర్శనుడగు వ్యాసునితో కుంతి యిట్లు విన్నవించెను. 

"తపోధనా! ద్వైపాయనా! నా కొడుకు కర్ణుడు తాను పుట్టినప్పుడే నానుండి దూరమయ్యెను. నా మది యిపు డతనిని గాంచ పరితపించుచున్నది. కనుక నాకతనిని జూపుము. ఓ విభూ! మహానుభావా! ఇందులకు నీవే సమర్థుడవు. కనుక నా వాంఛితము నెఱవేర్పుము." 

గాంధారి యిట్లనియెను: దుర్యోధనుడు రణమున కేగిన పిమ్మట నేనతనిని చూచి యెరుగను. కనుక నోమునివర్యా ! అతనిని నతని సోదరులను నాకిపుడు జూపుము. 

సుభద్ర యిట్లు పలికెను: ఓ మహాతపోధనా! అభిమన్యుడు నాకు ప్రాణములకంటె ప్రియమైనవాడు. నే నతనిని జూడగోరుచున్నాను. కనుక నా కతనిని జూపుము. 

సూతుడిట్లనియెను: ఆ విధముగ వ్యాసుడు వారు పల్కిన పల్కు లాలకించెను. ఆ మునీశ్వరుడు సంధ్యాసమయమున గంగనుజేరి ప్రాణాయామ మాచరించెను. అపు డతడా దేవదేవి దీనబంధువగు శ్రీసనాతనీ దేవిని హృదయకమలమందు నిలిపి ధ్యానించెను. పిదప వ్యాసుడు యుధిష్ఠరాదుల రావించెను. వారా పుణ్యగంగాజలముల పరిశుద్ధులైరి. ఆ విశ్వజననిని సంతుష్టురాలిని చేసి వ్యాసుడిట్లు సన్నుతించెను:

''శ్రీదివ్యమూల ప్రకృతీ! పురుషారామా! సగుణనిర్గుణాకృతీ! దేవదేవీ! బ్రహ్మ రూపిణీ! సుందరమణిద్వీపనివాసినీ! బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇంద్రాగ్ని యమవరుణ కుబేరులకు పూర్వమే వెలుగొందు శ్రీమాతృదేవీ! ఓ ఆద్యయగు పరాశక్తీ! నీకు సుమాంజలు లర్పింతును తల్లీ! ఓ పరిపూర్ణా! కళామయీ! భవానీ! ఈ పంచమహాభూతములు వాని గుణములు మనోబుద్ధ్యహంకారములు కరణములు సూర్యచంద్రులులేని మహాకాలమున తెలియరాని పెంజీకట్ల కావల నేకైక మహాజ్యోతిర్మూర్తివై విలసిల్లు దేవీ! నీకు సుమాంజలు లర్పింతును. విరాట్‌ స్వరూపమగు జీవలోకమును హిరణ్యగర్భమయమగు చిత్తమందునిలిపి యాసమష్టిలింగశరీరమగు హిరణ్యగర్భతత్త్వమును సామ్యావస్థలో నుంచి కల్పము చివరిదాక నిశ్చలచైతన్యజ్యోతియై వెలుగొందు శ్రీదేవి నెంత వివేకియు నెఱుగజాలడు. నీ వే యా మృతవీరుల జూపింపుము.'' ఈ వ్యాసస్తోత్రముతో నన్నుతయై శ్రీ భువనేశ్వరీ దేవి స్వర్గమునుండి మృతవీరుల రావించి యక్కడివారికి జూపెను. అట్లు మరల గనంబడిన తమ తమ వారిని కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులు చూచి చూచి ముగ్ధులై శ్రద్ధాంజలు లర్పించిరి. పిదప వ్యాసుని యమితతేజము చేత వచ్చినవారలు మరల తమ తమ చోటులకు పంపబడిరి. ఇట్లు పాండవులు శ్రీదేవి దయవలన నింద్రజాలమువంటి దృశ్యము గాంచిరి. తరువాత నెల్లరు తమ తమ వాసములకు చేరుకొనిరి. పాండవ లట్లు శ్రీవ్యాసుని కథామృతపు చిలువలు రుచి జూచుచు హస్తిపుర మరిగిరి.

అధ్యాయము 28 పరీక్షిత్తు శాపగ్రస్తు డగుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...