Saturday, April 11, 2026

Chapter 31 Astikamahamuni stopping of the snake sacrifice of Janamejaya - అధ్యాయము 31 ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

శ్రీ దేవీ భాగవతం ద్వితీయస్కంధము - అధ్యాయము 31

ఆస్తీకమహాముని జనమేజయుని సర్పయాగము మాన్పించుట

సూతుడిట్లనెను: ఆ తెఱంగున పరీక్షిత్తు ప్రాణములు పాసెను. ఆతని కుమారుడు జనమేజయుడు. కడు పసివాడు. కనుక మంత్రులు రాజునకు పరలోకక్రియలు జరుగునట్లు చేసిరి. వారు దుర్మరణమున ప్రాణాలు వదలిన రాజు శవమును గంగాతీరమందు చందనచితి పేర్చి దానిపై నుంచిరి. రాజ పురోహితులు దుర్మరణము జెందిన ఆ రాజునకు వేద మంత్రములతో పరలోకక్రియలు జరిపిరి. వారు బ్రాహ్మణులకు యథోచితముగా బహువిధముల గోదానసువర్ణదా నాన్న దానవస్త్రదానము లొనర్చిరి. మంత్రులందఱును పౌరజానపదులను నొక సుముహుర్తమున ప్రజా ప్రీతికరుడు బాలకుడునగు రాజసుతుని జనమేజయుని పాలకునిగ నొనరించి సింహాసనమున గూర్చుండబెట్టిరి. ఒక దాది యతనికి రాజచిహ్నములను గూర్చి శిక్షణ గఱపెను. మహామతియగు అతడును దిన దిన క్రమమున ప్రవర్దమానుడయ్యెను. పదునొకండవయేట నతనికి కులపురోహితుడు యథోచిత విద్య గఱపెను. వాని నా బాలకుడు చక్కగ నేర్చుకొనెను. అర్జునునకు ద్రోణుడును కర్ణునకు పరశురాముడునువలె జనమేజయునకు కృపాచార్యుడు చక్కగ ధనుర్వేదమంతయు నేర్పెను. ఆ రాజు విద్యలెల్లబడసి దురతిక్రముగడు బలశాలి యయ్యెను. మఱియు వేద ధనుర్వేదములు తుదముట్ట నెరిగి పరమార్థవేత్త యయ్యెను. అతడు దర్మార్థకుశలుడు - సత్యవాది - జితేంద్రియుడునై జను లితడు ధర్మరాజను నట్లు రాజ్యము చేసెను.

అంతట కాశీరాజగు సువర్ణవర్మాక్షుడు తన వపుష్టమయను కన్య నతని కిచ్చెను. ఆ ధవళాక్షినిబొంది జనమే జయుడు మున్ను కాశీరాజు కూతురును బడసిన విచిత్రవీర్యుడువలెను సుభద్రను పొందిన అర్జునుడువలెను ముదితనుగూడి ప్రమదముతో వనోపవనములందు విహరించెను. ఇంద్రుడు శచిని బడసి ప్రసన్నుడై నట్లే యతడా లేమనుజేరి సుఖముండెను. అతడు ప్రజలు సంతోషించునట్లు వారిని లాలించి పాలించెను. కార్యదక్షులైన మంత్రులెల్లరును తమ తమ విధులు చక్కగ నిర్వహించుచుండి ఆ దినములలో ఉత్తంకుడను ముని యుండెను. అతడు తక్షకునిచేత బాధింపబడెను. ఆ బాధకు ప్రతీకార మెవరు చేయగలరోయని యాలోచించి యుత్తంకుడు జనమేజయుడందులకు తగినవాడనియెంచి హస్తిపురికేగెను. ఆ ముని జనమేజయుని సమీపించి యిట్లు పలికెను : 

'రాజా! నీవు సమయానుకూలముగ మంచిచెడ్డ లెఱుగలేవు. నీవు చేయరాని పని చేయుదువు. చేయవలసినది చేయవు. నీకు కోపముగాని ప్రయత్నముగాని తెలియవు. ఇట్టి నిన్ను నేనేమి కోరగలను? నీవు తంత్ర మెఱుగవు. నీకు దేనియందును పగలేదు. నీవింకను పిల్లచేష్టలు మరువలేదు.' 

జనమేజయు డిట్లనియెను: 'ఇతరులు నాకు చేసిన ఏ అపకారము నాకు తెలియలేదో నేను దేనికి ప్రతీకారము చేయలేదో మహాభాగా ! నాకంతయు వివరముగ దెలుపుము. చేయగలను.'

అనగా 

ఉత్తంకుడిట్లనియెను : ఓ భూపతీ ! నీ తండ్రి తక్షకుని దౌర్మార్గ్యముచే హతుడయ్యెను. నీ మంత్రులను పిలిచి నీ పితృమరణమును గూర్చి యడిగి తెలిసికొనుము. అది విని రాజా విషయము గురించి మంత్రులతో ప్రస్తావించగా 

మంత్రులిట్లనిరి: 'నీ తండ్రి విప్రుని శాపకారణమున పాముచే కాటువేయబడి వెంటనే మరణించెను.' జనమేజయుడు నా తండ్రి చావునకు ముని శాపమెట్లు కారణమయ్యెను? అందులో తక్షకుని తప్పిదమేమి? నాకంతయు దెలుపుడు. అన 

నుత్తంకు డిట్లనియెను: తక్షకుడు కశ్యపునకు ధనమిచ్చి యతనిని చికిత్స చేయనీయక వెనుకకు పంపెను. రాజా ! నీ తండ్రిని చంపిన తక్షకుడు నీకు పగవాడగునా కాడా? మునుపు రురుముని భార్యయు సర్పదష్టయై చనిపోయెను. ఆమె యవివాహితుడగు రురునిచేత మరల బ్రతికింపబడినది. ఆ సమయమున రురుమని 'నా కంటబడిన ప్రతి పామును నా యాయుధముతో చంపగలను' అని దారుణ ప్రతిజ్ఞచేసి యతడు శస్త్రపాణి యయ్యెను. నాటినుండి యతడు నేల నాలుగు చెఱగులు తిరుగుచు కంటబడిన పాములనెల్ల చంపుచుండెను. అంత నతని కొకమారు వనమున నొక ముసలి డుండుభము కంటబడెను. అతడా పెనుబామునుగని దానిని చంపుటకు కోపముతో కఱ్ఱ పైకెత్తి దెబ్బకొట్టగా 

డుండుభ మిట్లనెను: విప్రా! నీకు నేనేమి యపరాధము చేసితిని? నన్నేల చంపదలచితివి? అందులకు రురువు తొల్లి నా యిష్టసఖి సర్పదష్టయై మరణించినది. ఆనాడు నేనెల్ల పాముల జంప ప్రతిన బూనితిని' అన నతనితో డుండుభము 'నేను నిన్ను కాటు వేయను, కాటువేయు పాములు వేరే యుండును. కేవలము పాము రూపముగల నన్ను చంపుట నీకు తగదు. అనెను. ఈ చక్కని మనుజ వాక్కులు పాము నోటవచ్చుట రురువు విని –

'నీవెవరవు?' ఈ డుండుభత్వము నీవెట్లు పొందితివి?' అని దానిని ప్రశ్నించెను. విప్రా ! నేనును పూర్వ మొక బ్రాహ్మణుడను. నా స్నేహితుడు ఖగముడనువాడు గలడు. అతడు ధర్మవిద్వరుడు. జితేంద్రియుడు. సత్యశీలుడు. నేనొక గడ్డిపామునుచేసి అగ్నిశాలలోనున్న యతనిని మూర్ఖత్వమున వంచించితిని. అతడు భయవిహ్వలుడై గడగడలాడుచు' ఓ మందమతీ! నీవు నన్ను వంచించితివి. కాన సర్పముగమ్మని శపించెను. అపుడు నేను పాముగ మారి యతని ప్రసన్నతకతనిని ప్రార్థించితిని. అతని కోపము కొంత శాంతించగ 'నిన్ను ప్రమతిపుత్త్రుడగు రురుపు శాపముక్తుని చేయు'ననెను ఆ పామును నేనే, నీవే యా రురుమునివి. ఇంకనా పరమహితవచన మాలకింపుము. విప్రులకు పరమధర్మ మహింసయే సుమా! విజ్ఞుడైన బ్రాహ్మణుడెల్లచోట్ల దయతో వర్తింపవలయును. ఇది నిజము విప్రేంద్రా ! హింస యాగములందు తప్ప వేరు సందర్భముల తగదు అని డుండుభము పలికెను. ఆ విప్రుడట్లు సర్పయోనినుండి ముక్తిగాంచెను. రురువు అట్లు ఖగముఖుని శాపముక్తిని గావించుటతోపాటు నాటినుండి హింసను మానుకొని, చచ్చి మరల బ్రతికిన బాలికను ప్రమద్వరను పెండ్లి చేసికొనెను.

రురువు అట్లు పాముతోడి పగదీర్చుకొనుటకు సర్పములను హింసించెను. నీవు మాత్రము వైరము మాని వర్తింతువే! ఇపుడు నీ తండ్రి స్నానదానములులేక నంతరిక్షమున దిరుగుచున్నాడు. ఓ రాజా! పాముల నన్నింటిని చంపి నీ తండ్రి నుద్ధరింపుము. తండ్రికి ఇతరుల వలన కలిగిన అపకారము నెఱుగనివాడు బ్రతికియు చచ్చినవాడే. నరనాయకా! ఆ పాములను చంపనంత కాలము నీ తండ్రికి దుర్గతి పాయదు. నీ తండ్రి శత్రువును దలంచి అంబాయజ్ఞమను నామముతో సర్పయాగ మొనరింపుము. ఉత్తంకుని ఈ మాటలు విని జనమేజయుడు కన్నీరొలుక 'నే నభిమానవంతుడను. మందమతిని. పనికిమాలినవాడను. నా తండ్రి సర్పదష్టుడై ఘోరదుర్గతి బొందెను. కాన సర్పయాగ మొనరించి నా తండ్రి నుద్ధరింతును. జ్వాలలు గ్రక్కుచున్న యగ్నిలో పాములను వేల్తును, అని పలికి మంత్రులను రావించి 

రజు యిట్లనియెను: 'మంత్రాలారా! మీరు యాగ సంభారములు సిద్ధము సేయుడు. గంగాతీరమున యాగమునకు దిగినచోటు విప్రులచే గొలిపించి నిర్ణయింపుడు. అచట నూఱు గట్టిస్తంభములతో మనోహరముగ మండలము నిర్మింపజేయుడు. అందు శ్రేష్ఠమైన యజ్ఞ వేదిక నిర్మింపజేయుడు. యజ్ఞాంగముగ సర్పయాగము మహాఘనముగ సాగవలయును. అందు తక్షకుడు పశువుగ ఉత్తంకుడు హోతగా నుండవలయును. సత్వరమే సర్వజ్ఞులు వేదపారగులునగు బ్రాహ్మణోత్తముల నాహ్వానింపుడు.

అపుడు విచక్షణులగు మంత్రులు రాజు నాజ్ఞానుసార మొనరించిరి. బహువిధములైన యాగసంభారములతో యాగము ఆరంభమయ్యెను. సర్పహవనము జరుగుచుండగా తక్షకుడు భయార్తుడై బయలుదేరి ఇంద్రునికడ కరిగి తన్ను బ్రోవుమని వేడుకొనెను. ఇంద్రుడు తక్షకు నూరడించి తన గద్దియపై గూర్చుండబెట్టుకొని 'నాగేశ్వరా ! నిర్భయముగ నుండుము. నీ కభయ మిచ్చురున్నాను' అనెను. తక్షకు డింద్రు నాశ్రయించి యభయము బొందిన విషయ ముత్తంకుడు తెలిసికొని యుద్విగ్నుడై యింద్రునితోడి తక్షకుని వేల్చుచున్నానని నిమంత్రించెను. అట్టితఱి తక్షకుడు యాయావర కులోద్భవుడును జరత్కారు తనయుడునగు ఆస్తీకుని స్మరించగా నాబాలుడు జన్నము జరుగు చోటికేగుదెంచి జనమేజయుని స్తుతించి సంతుష్టుని చేసెను. రాజా పండితుడగు ఆస్తీకబాలుని చూచి యతని నర్చించి యతని వాంఛితములడుగగా బాలుడు 'మహాభాగా! ఇక నీ యజ్ఞము చాలింపుడు. ఇదే నా మనోవాంఛిత'మని పలికెను. సత్యబద్ధుడగు రాజతని ప్రార్థన మన్నించి సర్పయాగము చాలించెను. 

అపుడు వైశంపాయనుడు జనమేజయునకు మహాభారతము వినిపించెను. అది వినినప్పటికిని రాజునకు శాంతి చేకూరలేదు. అతడు వ్యాసమహర్షిని మునివరా! దిగులు నా మనస్సును దహించివేయుచున్నది. నాకు మనశ్శాంతి యెట్లు చేకూరునో - ఇపుడు నా కర్తవ్యమేమో తెలుపుము. దౌర్భాగ్యమున నా తండ్రి సర్పహతుడయ్యెను. క్షత్త్రియులకు సమరమున మరణము శ్రేష్ఠమైనది. రణమందైనను ఇంటియందైనను విధిపూర్వకముగ సహజముగ దైన్యములేని చావు చచ్చు టుత్తతము గదా! కాని, నా తండ్రి చావావిధముగ జరుగలేదు. అతడంతరిక్షమున మరణించెను. కాన నతని యాత్మకు శాంతి గల్గు నుపాయము దెలుపుము. నా తండ్రి దుర్గతినుండి స్వర్గమున కేగునట్లు చేయుము' అని వేడెను.

అధ్యాయము 32 ఆస్తీకమహాముని జన్మవృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

పంచాంగం

No comments:

Post a Comment

Chapter 37 Shiva and Brahma worshipping Sridevi - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట

శ్రీ దేవీ భాగవతం తృ తీయ స్కంధము - అధ్యాయము 37 శ్రీదేవిని శివబ్రహ్మలు ప్రస్తుతించుట బ్రహ్మ యిట్లనియె: అని యీ ప్రకారముగ దేవదేవుడగు విష్ణువు జ...