Saturday, December 21, 2024

తిరుప్పావై - ఏడవ పాశురము

తిరుప్పావై - ఏడవ పాశురము



ప్రియ భగవత్ బంధువులారా!

జై శ్రీమన్నారాయణ

ధ్యానం

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

నిన్న ఒక గోపికను నిద్ర లేపడంతో ఈ శ్రీ వ్రతం ప్రారంభమైంది. వేద పఠనం మొదలుపెట్టినప్పుడు శ్రీ గురుభ్యోన్నమః, హరిః ఓం తో ప్రారంభిస్తారు. ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు శుభం పలుకుతాం కదా! నిన్న మొదట పక్షుల శబ్దములు, పక్షుల కిలకిలారావాలు, శంఖనాదం, హరి హరీ అనే ధ్వనులు వినలేదా, వినిపించలేదా అని అడిగారు. పక్షులను శ్రీ గురు మూర్తులు అని అంటారు. అందుచేత పక్షుల శబ్దాలను శ్రీ గురుభ్యోన్నమః అన్నట్లుగా మనం ఇక్కడ భావించాలి. తర్వాత శంఖనాదం, హరి హరీ అన్న శబ్దం. హరిః ఓం అని శుభంతో ప్రారంభమైందని భావించాలి. భగవంతుని యొక్క నామాన్ని వినడం ఎంత అదృష్టమో!

రెండో గోపికను నిద్ర లేపడంతో ఈరోజు పాశురం ప్రారంభమవుతుంది.

కీశు కీశెన్రు ఎంగుం ఆనై చ్చాత్తన్ కలన్దు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో ప్పేయ్ పెణ్ణే!
కాశుం పిఱప్పుం కలగలప్పక్కై పేర్ త్తు
వాశ నఱుంగుళలాయ్ చ్చియర్, మత్తినాల్
ఓశై పడుత్త తయిరరవం కేట్టిలైయో?
నాయగ ప్పెణ్ పిళ్లాయ్ నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుం నీకేట్టే కిడత్తియో
తేశ ముడైయాయ్ తిఱవేలో రెంబావాయ్ || 7 ||

నిన్నటి పాశురంలో ఆ గోపికని పిళ్లాయ్ అని పిలిచారు. ఈరోజు గోపిక నితేశ ముడైయాయ్ అంటే.. తేజోవతీ, తేజ స్వరూపిణీ అని పిలుస్తున్నారు.

భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా ఉన్న తోటి పక్షులను కలుసుకొని కీచుకీచు మంటూ మాట్లాడుకుంటున్నాయట. ఇక్కడ జంట పక్షులు గురించి చెప్తున్నారు. భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయట.

ఆ పక్షులు మామూలు పక్షులు కాదు. ఆ మాటలు మామూలు మాటలు కాదు. భరద్వాజ పక్షులకి సూర్యోదయం అయితే కళ్ళు కనిపించవు. తన ఎదురుగుండా ఉన్న పక్షులను కూడా సరిగ్గా గుర్తించలేవు. అందుచేత అవి రాత్రంతా ఆ జంట పక్షులు ఒకదాన్నొకటి విడవకుండా సరస సల్లాపాలు ఆడుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ సూర్యోదయం అయితే మనం కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరగదు. తిరిగి సూర్యాస్తమయం అయ్యాక కలిసుంటాం అని ఆ ఎడబాటును సహించలేక ఇప్పుడే ఒక దాని మీద ఒకటి అభిమానాన్ని కురిపించుకుంటూ ఉంటాయట. ఈ పాశురంలో మనకు భరద్వాజ మహర్షిని గుర్తు చేస్తుంది ఆండాళ్ తల్లి. భరద్వాజుడు మూడు వేదాలు అధ్యయనం చేయాలని సంకల్పించాడు. అయినా అధ్యయనం చేయలేకపోయాడు. బ్రహ్మదేవుని కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వేదాధ్యయనానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. సరే అని వరం ఇచ్చాడు. 20 వేల సంవత్సరాలు అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు. మరొకసారి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు తిరిగి అదే వరాన్ని కోరాడు. మరో 20 వేల సంవత్సరాలు మరల అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు.

ఇక్కడ మనం తెలుసుకోవసింది ఇంకొకటి ఉంది.

చాలామంది త్రి ఆయుషం అంటే 300 సంవత్సరాలు అని అంటారు. ఆయుఃప్రమాణం అంటే వంద సంవత్సరాలు అంటారు. కానీ.. స్కాందపురాణంలో "ఆయుః ద్వింశతి సహస్రం" అంటే ఆయుః అంటే 20,000 సంవత్సరాలు. భరద్వాజ మహర్షి మరల తపస్సు చేసి వరాన్ని పొందాడు. మరొక 20 వేల సంవత్సరాలు అధ్యయనం చేశాడు. అయినా పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 60 వేల సంవత్సరాలు జీవించి కూడా వేదాధ్యయనం పూర్తి చేద్దాం అనుకుని పూర్తి చేయలేకపోయాడు. మరలా తపస్సు చేసాక బ్రహ్మ ప్రత్యక్షమై ఏమయ్యా! భరద్వాజా! ఇప్పటికైనా తెలిసిందా! వేదం అనంత రాశి. దానిని పూర్తి చేయడం నాకే సాధ్యం కాలేదు. ఒక గుప్పెడు ఇసుక తీసుకొని ఆ ఇసుక రేణువులు లెక్కపెట్ట గలవా? సాధ్యం కాదు కదా! అలాగే వేదాలన్నీ చదవడం, పూర్తి చేయడం అసాధ్యం అని బ్రహ్మదేవుడు చెప్పగా... అప్పుడు భరద్వాజుడు.. తండ్రీ! పోనీ నాకు మరికొంత ఆయుష్షు ఇవ్వండి. ఇప్పటివరకు నేను తెలుసుకున్నది ప్రజా జీవనం లోకి వెళ్లి దానిని వ్యాపింప చేస్తాను. అందరికీ వేదం గురించి తెలియజేస్తాను. నేను చదువుకున్నది పదిమందికి తెలియజేస్తాను. ఎందుకంటే మనకు వచ్చిన విద్య, మనకు తెలిసిన విద్య మనలోనే ఉంచుకోకూడదు. పది మందికి బోధించాలి. మనకున్న జ్ఞానం పదిమందికి పంచాలి. అప్పుడే మన చదువుకి సార్ధకత. నాకు అవకాశం ఇవ్వండి అని ప్రార్థించగా బ్రహ్మ సరే అంటాడు. అలా వేదాధ్యయనానికి తమ జీవితమంతటినీ ధారపోసిన అధ్యయన, అనుష్టాన, సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు.

అలాంటి భరద్వాజ పక్షులు మాట్లాడుకున్న మాటలు వినబడలేదా నీకు, ప్పేయ్ పెణ్ణే!పిచ్చిదానా! పిచ్చిపిల్లా! అని ఈరోజు గోపిక తో అంటున్నారు.

కాశుం (కాసుల పేరు) పిఱప్పుం (మెడలో ఆభరణాలు) కలగలప్ప (ఒక దానికొకటి రాసుకుంటున్న శబ్ధం)క్కైపేర్ త్తు చేతులు కదుపుతూ వాశ నఱుంగుళలాయ్ చ్చియర్ (గోపికలందరూ అలంకరించుకున్నటువంటి మంచి పరిమళం కేశాలకి అలంకరణలు), మత్తినాల్ ఓశై పడుత్త (కవ్వంతో పెరుగు చిలుకుతుంటే) తయిరరవం (చిలికే ధ్వని) కేట్టిలైయో? వినలేదా? లేక వినబడలేదా?

నందవ్రజములో గోపికలు బ్రహ్మీ ముహూర్తంలో పెద్ద పెద్ద కుండలతో పెరుగు దగ్గర పెట్టుకుని కవ్వంతో చిలకడం మొదలెడతారు. ఇది వాళ్ళ నిత్యకృత్యం. రాత్రి పాలన్నీ కుండలలో వేసి తోడు పెడతారు. అది ఉదయానికి గడ్డ పెరుగులా గట్టిగా తయారవుతుంది. పెరుగు చిలకడానికి కవ్వాన్ని ఆ కుండలో గట్టిగా పెట్టాలి. అంటే పెరుగు అంత గట్టిగా తోడుకుంటుంది. కవ్వం లోపలికి వెళ్ళాక కవ్వానికి వున్న తాడు పట్టుకొని ఇలా ఇలా ఇలా అని తిప్పుతున్నప్పుడు సర్ సర్ అన్న శబ్దం వస్తుంది. అది కూడా నీకు వినబడలేదా! ఇలా చిలుకుతున్నప్పుడు తల అటు ఇటు ఊపవలసి ఉంటుంది. అప్పుడు కొప్పు ముడి విడిపోతుంటుంది. ఆ తలలో ఉన్న పువ్వులు రాలి కింద పడుతుంటాయట. ఆ పువ్వుల వాసన ఆ చుట్టుపక్కల అంతా వ్యాపిస్తుందిట. ఆ వాసన కూడా నీకు తెలియలేదా! లేవమ్మా! లేచి రా!

నాయగ ప్పెణ్ పిళ్లాయ్ నారాయణన్ మూర్తి
కేశవనైప్పాడవుం నీకేట్టే కిడత్తియో

నాయగ ప్పెణ్ పిళ్లాయ్ అంటేఓ నాయకమణీ, ఓ నాయకురాలా!

మా అందరికీ నువ్వు నాయకురాలు లాంటి దానివి కదా!! మా అందరికీ నాయకురాలు లాగ ఉంటావు కదా! కృష్ణ పరమాత్మ గా అవతరించిన నారాయణమూర్తిని, కేశవుని (కేశి అనే రాక్షసుడిని సంహరించిన వాడిని) కీర్తిస్తుండగా కేశవ నామాలు చదువుతుండగా వారి గుణగణాలు పాడుతుండగా నువ్వు వినలేదా! లేకపోతే వినబడనట్లు నటిస్తున్నావా? నీ కేట్టే కిడత్తియో నీవు విని కూడా పడుకొని ఉన్నావా?తేశ ముడైయాయ్ ఓ తేజశ్శాలీ! మంచి మెరుపు కలిగిన ముఖము కల దానా! భగవంతుని అనుగ్రహం ఉన్నవాళ్ళు అందరూ గొప్ప తేజస్సు కలిగి ఉంటారు. నీ తేజస్సు మాకు కనిపిస్తుంది. తిఱవు ఇకనైనా తలుపు తెరువు ఏలో రెంబావాయ్ ఈ వ్రతం లోకానికే శుభాన్ని చేకూరుస్తుంది.

ఈ పాశురములో ఆండాళ్ తల్లి మనకు కులశేఖరాళ్వార్ గురించి చెప్తుంది. వీరి గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక రోజు చాలదు. వారం రోజులు చాలవు. కానీ సందర్భం వచ్చినప్పుడు తెలుసుకుందాం.


ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...