Tuesday, December 24, 2024

తిరుప్పావై పదవ పాశురము

తిరుప్పావై పదవ పాశురము .


శ్రీ గురుభ్యోనమః

జై శ్రీ కృష్ణ

ప్రియ భగవత్ బంధువులారా!


నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!

స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే

గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః

భగవత్ బంధువులారా! గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముని వదిలి ఉండలేక, విరహంతో బాధపడి, నిద్రలేక, వ్రతము చేయవలెనని బయలుదేరి అందరూ వస్తుంటే, పది మంది మాత్రమే లేవకుండా నిద్రించటం ఆశ్చర్యంగా ఉంటుంది చూసేవాళ్ళకి. ఆ పది మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా మేలుకొలుపుతున్నారు. వారి నిద్ర మనలాగా, మన నిద్రలాగ కాదు. లౌకికమైన తామస నిద్ర కాదు. అది భగవదనుభవం వలన కలిగిన సాత్విక నిద్ర అని మనం తెలుసుకోవాలి. భగవంతుని పొందడానికి ఉపాయాలు మూడు రకాలుగా ఉన్నట్లు మనకి భగవద్గీత ద్వారా తెలుస్తుంది. భగవద్గీత 18 అధ్యాయాలు మూడు భాగాలుగా అంటే మూడు షట్కములుగా విభజించడం జరిగింది.

మొదటి ఆరు అధ్యాయాలు కర్మ షట్కం,7 నుంచి 12 వరకు గల అధ్యాయాలను భక్తి షట్కంగా,13 నుంచి 18 వరకు గల అధ్యాయాలను జ్ఞాన షట్కం గా విభజించారు.భగవత్ ప్రాప్తికి ఉపాయములుగా ఈ మూడు షట్కంలను నిర్దేశించారు.జ్ఞాన షట్కంలో 18వ అధ్యాయం మోక్షసన్యాస యోగములో 46.వ.శ్లోకం.

స్వ కర్మణా తమభ్యర్చ్య

సిద్ధిం విన్దతి మానవః

తనకు నిర్దేశించబడిన కర్మని ఆచరించడం ద్వారా మానవుడు సిద్ది పొందుతాడు

అలాగే భక్తి షట్కం 11 వ అధ్యాయము లో విశ్వరూప సందర్శన యోగంలో54 వ.శ్లోకం శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతున్నారు.

భక్త్యా త్వనన్యయా శక్యః

అహమేవంవిధోఽర్జున

జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన

ప్రవేష్టుం చ పరంతప

అనన్యమైన భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు. అనన్యమైన అంటే వేరే ఏ ఇతర వస్తువు పైన కాకుండా కేవలం భగవంతుని మీదే ప్రేమ, అనురాగం, ఆసక్తి ఉండాలి.. అప్పుడు మాత్రమే భగవంతుని పొందగలరు.

సర్వం జ్ఞానప్లవేనైవ

వృజినం సంతరిష్యసి

జ్ఞానం అన్న పడవ సహాయంతో భగవంతుని చేరడానికి ప్రతిబంధకంగా ఉన్న పాపరాశిని దాటగలవు.ఈ మూడు శ్లోకాల్లోని మనకి భగవంతుని దగ్గరకు చేర్చే మార్గాన్ని చెబుతున్నారు.

ఈ పదవ రోజు లేపబోతున్న 5.వ.గోపిక కూడా స్థితప్రజ్ఞురాలే. ఈ గోపిక శ్రీకృష్ణుడు ఇంటి పక్కనే ఉంటుందట. రెండిళ్లకి మధ్యలో ఒక గోడ. అవకాశం వచ్చినప్పుడల్లా మన శ్రీకృష్ణుడు గోడ దూకుతుంటాడాన్నమాట.

ఈగోపిక కూడా శ్రీకృష్ణుడే తన వద్దకు వస్తాడు; నేను ఎందుకు వెళ్ళాలి? ఆ పరమాత్మే వచ్చి తనను సంతోష పెడతాడని తన ప్రయత్నం ఏమీ లేకుండానే హాయిగా చీకు చింతా లేకుండా నిద్రపోతుంది. భగవంతుడి మీద నమ్మకం ఉంటే భక్తులు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందరూ నోము నోచేందుకు కృష్ణ పరమాత్మ దగ్గరికి బయలుదేరుతుంటే కృష్ణుడేమో ఆయనే నోము నోచి ఈ గోపిక దగ్గరకు వస్తాడట. ఈ గోపిక దగ్గరికి రావడానికి తాపత్రయపడి పోతుండాట. అది ఈ గోపిక యొక్క ప్రత్యేకత. ఏది జరిగినా మన మంచికే. అంతా ఆయనే చూసుకుంటాడు అని భావిస్తారు. కష్టం వస్తే కుంగిపోరు. సుఖం వస్తే పొంగిపోరు. భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం 22 శ్లోకంలో శ్రీ కృష్ణ పరమాత్మ ఈ విధంగా చెబుతాడు.

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం

శ్రీకృష్ణుడు అంటున్నాడు అర్జునుడితో. ఎవరైతే వేరే ఏ ఇతర ఆలోచనలు లేకుండా ఎల్లప్పుడు అత్యంత భక్తితో పరమేశ్వరుడనైన నన్నే ఉపాసన చేస్తారో, ధ్యానిస్తారో వారి యొక్క యోగక్షేమాలు, కష్ట, సుఖాలు అన్నీ కూడా నేనే చూసుకుంటాను. ఆ బాధ్యతంతా నాదే అని ఆ పరమాత్మ చెప్తున్నాడు. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే ఉన్నది ఇప్పుడు మనం లేపబోయే 5.వ.గోపిక.ఆ పరమాత్మే వచ్చి తనని సంతోష పెడతాడని, తన ప్రయత్నం మానుకొని సంతోషం గా ఉంటుంది ఈరోజు గోపిక. తను చేసిన కర్మకి ఫలితం వచ్చినా, రాకపోయినా దాని వల్ల వచ్చే లాభాలు, నష్టాలు అన్నీ భగవంతుడికే కాని తనకి కావు అని నిశ్చింతగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రియాలు అన్నీ వాటి పని మానేసి, ఒక్క మనసు మాత్రమే పని చేస్తుంది. ఈ స్థితిని ఏకేంద్రియావస్థ అంటారు. ఈ స్థితిలో ఉన్న వారిని కూడా స్థితప్రజ్ఞులనే అంటారు. భగవద్గీత రెండవ అధ్యాయం 56 వ శ్లోకంలో కూడా స్థితప్రజ్ఞుడు గురించి శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా చెప్తారు.

దుఃఖేష్వనుద్విఘ్నమనాః సుఖేషు విగత స్పృహః

వీత రాగ భయ క్రోధః స్థితధీర్మునిరుచ్యతే


దుఃఖేషు అనుద్విఘ్నమనాఃఇందాక చెప్పినట్లుగా కష్టంలో కూడా కుంగిపోని వాడు.

సుఖేషు విగత స్పృహఃసుఖం వచ్చినప్పుడు పొంగిపోడు. ఎందుకంటే వాడికి తెలుసు ఏదీ శాశ్వతం కాదని, కష్టం గాని, సుఖంగాని ఎక్కువ కాలం ఉండదని.

వీత రాగ భయ క్రోధఃరాగద్వేషాలు, భయము, కోపము లేనివారు స్థితధీర్మునిరుచ్యతే

స్థిత ధీ(ఇతి)=స్థిత ప్రజ్ఞుడు అనిమునిః=మనసుని తన ఆధీనంలో ఉంచుకున్న వాడు
ఉచ్యతే=చెప్పబడుతున్నాడు. ఈరోజు గోపిక ఇలాంటి కోవకే చెందుతుంది.


ఈరోజు పాశురాన్ని చూద్దాం


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱఅమ్మనాయ్

మాత్తముం తారారో వాశల్తిఱవాదార్

నాత్తత్తుళాయ్ ముడినారాయణన్- నమ్మాల్

పోత్త ప్పఱై తరుం పుణ్ణియనాల్- వండొరునాళ్

కూత్తత్తిన్ వాయ్ వీళందకుమ్బకరణనున్

తోత్తుం ఉనక్కే పెరుందుయిల్తాన్ తందానో?

ఆత్త అనందలుడై యాయ్!అరుంగలమే!

తేత్త మాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్ || 10 || 


ఇప్పుడు ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.ఇక్కడ చూడండి గోదాదేవి ఈ 5.వ. గోపికను కొంచెం వెటకారంతో కొంచెం ఈర్ష్యతో లేపుతుంది.


నోత్తు చ్చువర్ క్కం పుగుగిన్ఱఅమ్మనాయ్

ఏమ్మా! మా కంటే ముందే నోము నోచేసి స్వర్గంలోకి ప్రవేశిద్దామనుకుంటున్నావా? ఆ పరమాత్మని కలుసుకుందాం అనుకుంటున్నావా? నీకు ఏంటమ్మా హాయిగా పడుకున్నావ్. ఇంత మంచులో, ఇంత చలి వేస్తుంటే మేమందరం కూడా ఆ పరమాత్మ దర్శనం కోసం వెళ్ళడానికి వస్తుంటే నువ్వు కనిపించలేదు. అందుకని నీ ఇంటి దగ్గర ఆగాం. నిన్ను కూడా తీసుకొని వెళ్దామని. నువ్వు చాలా ముఖ్యమైన దానివి కదా.


మాత్తముం తారారో వాశల్తిఱవాదార్

పోనీలే అమ్మా! తలుపు తీయకపోతే పోయావు, కనీసం మాట్లాడు. జవాబు అయినా ఇవ్వచ్చు కదా!. మాట్లాడితే నీ సొమ్ము ఏమైనా పోద్దా. లోపల కృష్ణుడు ఏమైనా ఉన్నాడా? అందుచేతనే మాట్లాడటం లేదా.

లోపల గోపిక.:

లోపల కృష్ణుడు లేడమ్మా! నేను ఒక్కత్తినే పడుకున్నాను. అయినా కృష్ణుడు మా ఇంట్లో ఉన్నాడని మీకెందుకు అనుమానం వచ్చింది. లోపల కృష్ణుడు ఉన్నాడని మీకు ఎలా తెలిసింది. కృష్ణుడు గాని మీకేమైనా కనబడుతున్నాడా?

బయట గోపిక.:

ఏమీ లేదమ్మా! ఆయన మాకు కనబడడానికి తలుపు అడ్డంగా వుంది కదా! అయినా సరే కృష్ణుడు లోపల ఉన్నాడని మాకు ఎలా తెలిసిందో చెప్పమంటావా? ఆయన ధరించిన కిరీటంలోని తులసి వాసన వస్తుందమ్మా! తులసి ఎక్కడ ఉంటే కృష్ణుడు అక్కడ ఉంటాడు కదా! అయితే మరి కృష్ణుడు నీ దగ్గర లేకుండానే ఇంత మొద్దు నిద్ర పోతున్నావా?

లోపల గోపిక.:

అయినా ఆయన మా ఇంట్లో ఎలాగుంటాడమ్మా! వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి కదా! ఆయన పేరు ఏంటన్నావ్! నారాయణుడు కదా! నారాయణుడంటే లోపలా, బయటా అంతటా ఉన్నవాడే కదా! నీ లోనీ ఉంటాడు, నా లోనీ ఉంటాడు. ఆ స్వామి ఎంత భక్తసులభుడో కదా! ఆయన వద్దకు వెళ్లి మనం ఏమీ అడగక్కరలేదు. "స్వామి నేను క్షేమంగా ఉండాలి" అని అంటే చాలు మనకు కావాల్సినవన్నీ తెలుసుకుని ఆయనే ఇస్తాడు. ఆయన మన నోముల పంట.

నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్

నువ్వు దాచినా దాగని తులసి వాసన వస్తుందమ్మా! కృష్ణుడు ఒక్కసారి గాని నిన్ను కౌగిలించుకొని వదిలేసినా సరే ఆ తులసి వాసన నీకు అంటుకుంటుంది. ఎన్ని స్నానాలు చేసినా ఆ వాసన పోదు.తులసి మాలలు ధరించిన శ్రీకృష్ణపరమాత్మని మనము ప్రార్థించి నట్లయితే మనకి పరను ప్రసాదిస్తాడు కదా! మన వ్రతానికి కావలసిన పరని ఇస్తాడు కదమ్మా! అందుకనే బయలుదేరాం.


నమ్మాల్ పోత్త ప్పఱై తరుం పుణ్ణి యనాల్

నేను మంగళం పాడగానే పరను ప్రసాదిస్తాడు.

అలాంటి పుణ్యమూర్తిని సేవించడానికి మనం బయలుదేరుతున్నాం కదా!


వండొరునాల్ కూత్తత్తిన్వాయ్ వీళంద కుమ్బకరణనున్

నీది కుంభకర్ణుడు నిద్రమ్మా! కుంభకర్ణుడు ఎవరో అంటావా! ఒక రోజు రామాయణంలో శ్రీరామచంద్రుడు చంపాడే కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుడే. అందుకే మనందరం కుంభకర్ణుడి నిద్ర అంటాం. కుంభకర్ణుడు నిద్రలో నీతో పోటీపడి ఓడిపోయి ఉంటాడు. ఆ నిద్ర అంతా నువ్వు తీసుకున్నట్లు ఉంది.


తోత్తుం ఉనక్కే పెరుందుయిల్ తాన్ తందానో?

ఆత్త అనందలుడై యాయ్!అరుంగలమే!

ఏమమ్మా నువ్వు లేకపోతే మా గోష్టిలో సందడేం ఉంటుంది చెప్పు. (చూడండి మనలో కొంతమంది ఒక కిట్టి పార్టీ అవ్వచ్చు, సత్సంగం అవ్వచ్చు. అందులో ఒక్కొక్కొక్కరు లేకపోతే అసలు హడావుడి ఉండదు.) అలా నువ్వు రాకపోతే ఎలాగమ్మా! మా గోష్ఠి అంతా ఒక ఎత్తు, నువ్వొక ఎత్తు.

తేత్త మాయ్ వందు తిఱవేలోర్ ఎమ్బావాయ్

ఆండాళ్ తల్లి మనకు ఈ పాశురంలో నమ్మాళ్వారిని గుర్తు చేస్తుంది. ఈ గోపిక అంత గొప్ప గోపిక అన్నమాట. ఎలాగూనమ్మాళ్వారిని మనం గుర్తు చేసుకున్నాం కాబట్టి ఆయన గురించి కూడా రెండు విషయాలు చెప్పుకుందాం.

ఈ పాశురాన్ని అర్థం చేసుకొని అనుసంధానం చేస్తే మనకు ఆ నమ్మాళ్వార్ దర్శనమిస్తారు. శ్రీ కృష్ణుడి మహాప్రస్థానం తర్వాత... కలియుగం ప్రారంభంలో 43 వ.రోజైన ప్రమాది సంవత్సరం, శుక్లపక్షం, చతుర్దశి శుక్రవారం, కర్కాటక లగ్నంలో విశ్వక్సేనుల వారి వంశంలో కురుకాపురి ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ అవతరించారు.

ఈయన ఒక అసాధారణ శిశువు. ఈ శిశువు తల్లి పాలు గానీ, నీరు గానీ లేకుండా, ఏడవకుండా, కళ్ళు తెరవకుండా ఉన్నాడు. లేక లేక పుట్టాడు, వరప్రసాదుడు, ఈ బిడ్డకి ఈ స్థితి ఏమిటి? ఈ విపరీత పరిస్థితికి విచారించి తల్లిదండ్రులు ఆ శిశువును, ఆ బిడ్డను కురుకాపురి లోని ఒక ఆలయానికి తీసుకువెళ్లి దేవుని ముఖమండపంలో వుంచారు. వెంటనే ఆ బిడ్డ కళ్ళు తెరిచి, పాక్కుంటూ పోయి ఆ ఆలయంలో వున్న చింత చెట్టు పైకి ప్రాకి, ఆ చెట్టు తొర్రలో పద్మాసనం వేసుకొని ధ్యానంలో మునిగి పోయాడు. అలా 16 సంవత్సరాలపాటు ధ్యానంలో జ్ఞానముద్రతో మౌనంగా ఉండిపోయాడు.


ఉణ్ణం శోరు, పరుకు నీరు,

తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కణ్ణన్


ఉణ్ణం శోరు అంటే తినే అన్నం,

పరుకు నీరు అంటే తాగే నీళ్లు,

తిన్నుం వెత్తిలైయుం అంటే అనుభవించే భోగ పదార్థములు,

ఎల్లాం అన్నీ కూడా కణ్ణన్ కృష్ణుడే.

తినే అన్నం, తాగే నీళ్లు, అనుభవించే భోగ భాగ్యాలు, అన్నీ కూడా కృష్ణుడే అనే భావంతో భగవన్నామాన్ని అవలంబించిన ఈ మహానుభావుడ్ని, ఈ మహాత్ముని చూడడానికి దివ్య దేశాలనుంచి అర్చామూర్తులందరూ కూడా ఆ చింత చెట్టు దగ్గరికి వచ్చి పర భక్తి, పరజ్ఞానాన్ని, పరమ భక్తిని ఆయనకు అంద చేశారు. మనం నిరంతరం చేసే ధ్యానమే భక్తి. హృదయంలో పరమాత్మని దర్శించుకుని చేసే ధ్యానం పరభక్తి.

ఆయన కళ్యాణ గుణం అనుభవిస్తూ, ఆయనకు ప్రపత్తి చేయడమే పరజ్ఞానం. ప్రపత్తి అంటే శరణాగతి. భగవంతునితో తమకు ఎడబాటు కలుగుతుందేమో అనే వ్యామోహం చెందడమే పరమ భక్తి. ఇవి వారికి కలిగాయి. అప్పుడు ఆయన వారందరినీ అంటే అర్చా మూర్తులందరిని స్తోత్రం చేసారు. అప్పటికి ఆయనకి నామకరణం జరగలేదు. ఆయన స్తోత్రానికి భక్తికి మెచ్చి ఈయన్ని నమ్మాళ్వార్ అంటే మా ఆళ్వార్ అని పిలిచి ఆదరించారు. ఈయన భగవంతున్ని హృదయంలో, తన మనసులో ప్రత్యక్షంగా అనుభవించారు. ఆ దివ్యమైన అనుభవంతో ఆయన దివ్యమైన ప్రబంధాలని రాశారు. అవేమిటంటే తిరువిరుత్తం, తిరువా శిరియుం, పెరియ తిరువందాది తిరువాయ్ మొళి. ఈ నాలుగూ నాలుగు వేదాలుగా లోకంలో ప్రసిద్ధి చెందాయి. వీరిని శఠకోపులు, కారి మారులు, పరాంకుశులు, కురు కేశులు, తిరుక్కురుకూర్ నంబి, వకుళాభరణులు అని ఇన్ని పేర్లతో ఆయన పిలవబడుతున్నారు. ఇప్పుడు మనం ఆలయాల్లో నిత్యం తీర్థం తీసుకొని, తలవంచి, తలపై ధరిస్తున్న శఠారి (శఠకూపం) శ్రీ నమ్మాళ్వార్ శిరస్సుపై ఉంచిన శ్రీపాదములే శరణ్యము అనే పవిత్ర భావనను కలుగ చేస్తుంది.ఇలా ఈరోజు శ్రీ గోదాగోపికలు ఒక గోపికను శ్రీ నమ్మాళ్వారుని మేల్కొలిపి, లేపి ముందుకు సాగుతున్నారు.


ఆండాల్ తిరువడిగళే శరణం


No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...