తిరుప్పావై - పన్నెండవ పాశురము
శ్రీ గురుభ్యోనమః
జై శ్రీ కృష్ణ
జై శ్రీమన్నారాయణ
నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ!
స్వోచ్ఛిష్టాయామ్ స్రజినిగళితమ్ యా బలాత్కృత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః
ప్రియ భగవత్ బంధువులారా!
తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు 11 పాశురాలని అనుసంధానం చేసి 12వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు నిద్రలేపబోతున్న గోపిక ఏడో గోపిక. ఇప్పటివరకు ఆరుగురు గోపికల్ని నిద్ర మేల్కొలిపి గోదాదేవితో సహా అందరు గోపికలూ కలిసి ఏడవ గోపిక ఇంటికి చేరుకున్నారు. ఈ గోపిక కూడా మంచి వంశంలో జన్మించింది. వీళ్ల వంశానికి మంచి చరిత్ర ఉంది. ఈ గోపికకి ఒక అన్నయ్య ఉన్నాడు., అతని పేరు శ్రీదాముడు. సుదాముడు కాదండి, సుదాముడు అంటే కుచేలుడు. కానీ ఇతని పేరు శ్రీదాముడు. ఈ గోపాలుడు శ్రీకృష్ణుడికి బాగా పరిచయం, ఇతను ఎప్పుడూ కూడా శ్రీకృష్ణునితోనే తిరుగుతూ ఎప్పుడూ శ్రీకృష్ణుని వదలకుండా ఉంటాడు. అప్పుడు తను పనికి వెళ్ళడం మానేశాడు. ఇంతకి తను చేసి పని ఏమిటి? రోజు ఉదయాన్నే పశువుల్ని మేతకు తీసుకెళ్లి, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, పాలు పితకాలి, తోడు పెట్టాలి, పెరుగు చిలకాలి, వెన్న తియ్యాలి, నెయ్యి కాచాలి ఇవన్నీ గొల్ల వాళ్ల యొక్క స్వధర్మాలు. ఎవరు చేయవలసిన ధర్మము వాళ్ళు ఆచరించాలి. ఎవరి పని వారు చేయాలి. వృత్తి ధర్మం మానకూడదు. పూజారి భగవదారాధన చేయాలి. బ్రాహ్మడు సంధ్యావందనం చేయాలి. వైశ్యుడు వ్యాపారం చేయాలి. కుమ్మరి కుండలు చేయాలి. వైశ్యుడికి కుండలు చేసే నైపుణ్యం ఉండదు. కుమ్మరికి వ్యాపారం చేసే అనుభవం ఉండదు. ఎవరి వృత్తిని వారు తప్పనిసరిగా చేయాలి. పుడుతూనే ఎవరూ కూడా కులంతో పుట్టలేదు. వృత్తిని బట్టి కులాన్ని నిర్ణయించారు పెద్దలు. మరి గోపాలుడిది గోసంరక్షణ. అదే అతని పని కదా! గోపాలకులందరి పని అదే కదా! కానీ ఈ శ్రీదాముడు తన పనిని మరిచిపోయి, పట్టించుకోకుండా ఎప్పుడూ శ్రీకృష్ణునితో తిరగడం, బృందావనంలో ఆడుకోవడం, యమునా నదిలో ఈత కొట్టడం, ఆ నది ఒడ్డున ఉన్న చెట్లు ఎక్కడం, బిళ్లా కర్ర ఆడడం. ఇదే రోజు పని అయిపోయింది. కానీ ఇక్కడ గోపాలుడిది అధర్మం కాదు. ఎందుకంటే అతను నిత్యం, నిరంతరం భగవంతుని సేవలోనే ఉన్నాడు. నంద వ్రజంలో గోపాలకులు అందరూ ఇంచుమించు అలాగే తయారయ్యారట.
ఎవరైతే వారు చేయవలసిన కర్మలను చేయకుండా తప్పించుకొని తిరుగుతారో అలాంటి వాళ్ల గురించే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మీకు అందరికీ తెలిసిన శ్లోకమే. 18 వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం లో 5 వ శ్లోకం
యజ్ఞ దాన తపః కర్మ
న త్యాజ్యం కార్యమేవ తత్
యజ్ఞో దానం తపశ్చైవ
పావనాని మనీషినామ్
అంటే..
యజ్ఞము, దానము, తపస్సు లాంటి కర్మలను వదలకూడదు. అవి తప్పకుండా ఆచరించి తీరవలసినవే. యజ్ఞము, దానము, తపస్సుమనసులోని మాలిన్యాన్ని తొలగిస్తాయి. మనుషులకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ జ్ఞానమే మోక్షానికి మార్గము. అందుచేత బుద్ధిమంతులు, విజ్ఞులు ఎప్పుడూ కూడా కర్మలను వదలకూడదు. అని శ్రీ కృష్ణపరమాత్మే స్వయంగా భగవద్గీతలో చెప్పాడు.ఈరోజు గోపాలుడు శ్రీదాముడు తన స్వధర్మాన్ని వదిలి శ్రీకృష్ణుడితో సంబంధాన్ని పెంచుకున్నాడు. లక్ష్మణుడు శ్రీరామున్ని ఎలాగైతే వదిలి వుండలేదో అలాగే ఈ గోపిక అన్నయ్య శ్రీదాముడు కూడా శ్రీకృష్ణ పరమాత్మని వదిలి ఉండలేక పోతున్నాడు. ఎవరైనా భగవంతునితో బంధాన్ని పెంచుకున్నప్పుడు, భగవత్ కైంకర్యమొనర్చి నప్పుడు, తనకు వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించడానికి అవకాశం లేక మానివేసినప్పటికీ అతనికి ఏ దోషం అంటదు.
శ్రీదాముడు ఆ విధంగా ఉంటే, ఇక్కడేమో ఇంటి దగ్గర ఉదయమే పాలు పితికే వారు లేరు. కట్టిన దూడలను విప్పేవారు లేరు. ఇలా ఎవరూ లేకపోవడం చేత ఆవులూ, గేదెలూ వాటి యొక్క లేగదూడలను తలచుకుంటున్నందువలన.. పొదుగులు బరువెక్కి.. పాలు వాటంతట అవే నేలమీద క్రిందనే స్రవించేయట. పెద్ద ధారలాగ క్రిందని ఒలిగిపోయేవట, కారిపోయేవట. ఈ అన్నయ్య పట్టించుకునేవాడు కాదు. భక్తుడు. అలాంటి మహా భక్తుడైన శ్రీ కృష్ణుని స్నేహితుడైన అన్నకి చెల్లెలైన గోపికని నిద్ర నుంచి లేపడానికి గోపికలందరూ కలిసి వచ్చేరు.
ఇప్పుడు పాశురం చూద్దాం.
కన్నెత్తిళం కత్తెరుమై క్కన్రుక్ కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్తిల్లం శేరాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
శినత్తినాల్ తెన్ని లంగై క్కోమానై శెట్ర
మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్
ఇనిత్తాన్ ఎళుందిరాయ్! ఈదెన్న పేరురక్కమ్!
అనైత్తు ఇల్లత్తారుమ్ అరిన్దు ఏలోర్ ఎంబావాయ్ || 12 ||
ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థం చూద్దాం
కన్నెత్తు ఇళంకత్తెరుమై క్కన్రుక్కు ఇరంగి
ఉదయమే ఆవులకు పాలు పితికే వాళ్ళు లేరట. ఆవు దగ్గరికి దూడలను వదిలేవాళ్లు కూడా లేరట. లేగ దూడలు ఆ తల్లి కోసం, తల్లేమో తన దూడ కోసం అరుస్తున్నాయిట. పాలు చేపడం వల్ల పొదుగులు బరువుగా అయిపోయాయట.
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
పొదుగులు బరువుగా అయిపోవడం వల్ల అవి దూడలను తలుచుకుంటూ అరుస్తూ పాలని ధారగా కురిపిస్తున్నాయట.
ననైత్తు ఇల్లం శేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్
అలా పాలన్నీ దారగా కారడం వల్ల ఇల్లంతా చిత్తడి అయిపోయిందిట. అంటే పాలతో బురద బురద అయిపోయిందట ఇల్లంతా, ఆ వాకిలంతా పాలేనట. చూడండి ఆ పాల సంపద ఎంతుందో!
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడైపట్రి
అలాంటి పాడి సంపద కలిగిన ఐశ్వర్య వంతుడైన అన్నకి తోడబుట్టిన దానా! ఓ ముద్దుల చెల్లెలా!
శినత్తినాల్ తెన్ని లంగై క్కోమానై శెట్ర
మా తల మీద మంచు పడి అది కరిగి మా వళ్లంతా కారి పోతుంది. అయినా అంత చలిలో కూడా మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాం.
మనత్తుక్కు ఇనియానై పాడవుం నీ వాయ్ తిరవాయ్
ఒకనాడు లంకాధిపతి అయిన రావణాసురుడుని రాముడు కోపంతో సంహరించాడు. అలాంటి రాముడు నామాన్ని, ఆ శ్రీరామచంద్రుడు నామాన్ని మేము కీర్తిస్తున్నాం.
ఇనిత్తాన్ ఎళుందిరాయ్! ఈ తెన్న పేరురక్కమ్
అనైత్తు ఇల్లత్తారుమ్ అరిన్దు ఏలోర్ ఎంబావాయ్
అయినా నువ్వు నోరు మెదపడం లేదు. ఇంత మొద్దు నిద్రేవిటమ్మా! చూడు అందరూ నిన్నే చూస్తున్నారు. లే ఇంక లేచిరా! గేదెలు దూడల కోసం అరుస్తున్నాయి. ఆవుల కంటే కూడా గేదెలకు తమ దూడల మీద అభిమానం ఎక్కువ ఉంటుందట. ప్రేమ ఎక్కువగా ఉంటుంది. లేగ దూడలకి ఏమాత్రం కష్టం కలిగినా అవి సహించలేవట. లేగ దూడకి తమను తాము పోషించుకునే శక్తి ఉండదు. ఆవులు, గేదెలు ఆచార్యులు, గురువులు... వారికి భగవదనుగ్రహం పుష్కలంగా, సంపూర్ణంగా ఉంటుంది. పాలు ఎలాగైతే సమృద్ధిగా ఉన్నాయో అలాగే. దూడని దూరంగా ఉంచి తాడుతో కట్టేస్తారు. ఆ దూడ తనంతతానుగా తల్లి దగ్గరకు రాలేదు. దాన్ని ఎవరో విడిపించాలి. విడిపిస్తే గాని తల్లి దగ్గర పాలు తాగలేవు. అలాగే మనం కూడా సంసార బంధం అనే తాడుతో కట్టపడ్డాం. మనల్ని ఈ బంధాల నుంచి విడిపిస్తారు గురువులు. అప్పుడు దూడ తల్లి దగ్గరికి వెళ్లి పాలు తాగినట్లు మనం భగవంతునికి చేరువై మోక్షాన్ని పొందుతాం. ఇక్కడ లంకకు రాజు అయిన రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుని కీర్తిస్తున్నారట. రావణాసురుడు పాలిస్తున్న లంకే మన మానవ శరీరం. రావణాసురుడు మన మనస్సు. ఆ మనసుకు 10 ఇంద్రియాలు, రావణుడికి పది తలల్లాగా. రజోగుణం చేత రావణుడు తనది కాని దాన్ని నాది అనుకున్నాడు. అది రావణుడి అధర్మం. సీతను విడిపించి తనలో చేర్చుకున్నాడు రాముడు. శ్రీకృష్ణుడు తమని పట్టించుకోవటం లేదని, నిర్లక్ష్యం చేస్తున్నాడని అందుకే వారిని దూరంగా ఉంచిన కృష్ణుణ్ణి వదిలి శ్రీరాముని కీర్తించడం మొదలుపెట్టారు గోపికలు. తమలో ఉన్న అహంకార మమకారాలను నాశనం చేసి గురువుల అభిమానాన్ని పొందటానికి, భాగవత సహవాసానికి, కావలసిన యోగ్యతను ప్రసాదించాలని శ్రీరామచంద్రుడి నామాన్ని స్తోత్రం చేస్తున్నారు. రాముని ప్రార్థిస్తున్నారు. ఈ రోజు పాశురంలో మేల్కొనబడిన గోపిక అంటే కులశేఖరాళ్వారులు. కులశేఖరుడుని గుర్తు చేస్తుంది ఆండాల్ తల్లి. ఈయన గురించి మనం ముకుందమాలలో తెలుసుకున్నాం.
ముకుందమాలలో ఒక శ్లోకము
శ్రీ వల్లభేతి వరదేతి దయాపరేతి
భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి
నాథేతి నాగ శయనేతి జగన్నివాసేతి
ఆలాపనం ప్రతి పదం కురుమే ముకుందా!
కులశేఖరాళ్వారుల వారు ఆ రంగనాధుని, ఆ శ్రీరంగనాథుడిని, ఆ శ్రీరంగం లో ఉండే అర్చామూర్తిని ప్రార్థిస్తున్నారు.
ఓ ముకుందా! శ్రీవల్లభా! దయాపరా! వరదా! భక్త ప్రియా! భవలుంఠన కోవిదా! నాథా! నాగశయనా! జగన్నివాసా!ముకుందా! మోక్షాన్ని ప్రసాదించే వాడా! మోక్షాన్నిచ్చే వాడా! అని
శ్రీవల్లభా! లక్ష్మీదేవికి ఇష్టమైన వాడా! అని.
(భర్త అంటే ఎవరికండీ ఇష్టం ఉండదూ!).
దయాపరా! అమితమైన దయని కురిపించే వాడా! అని.
వరదా! వరాలను ఇచ్చేవాడా! వరాలను కురిపించే వాడా! అని.
భక్త ప్రియా! భక్త ప్రియుడా! భక్తులు అంటే ఇష్టమైన వాడా! అని.
భవలుంఠన కోవిదా! ఈ సంసార సాగరం నుండి మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చటంలో నీకంటే నేర్పరు లెవరయ్యా! అని
నాథా! నాథుడా! ఎవరికి నాథుడట, లక్ష్మీదేవికి నాథుడు, అంటే లక్ష్మీదేవికి భర్త లక్ష్మీపతి. లక్ష్మీపతీ! అని.
నాగశయనా! ఆదిశేషుడు మీద పడుకునే వాడా! మన ఇంట్లో పాముందని ఎవరైనా అన్నారనుకోండి, దాన్ని పట్టుకొని బయటికి పంపించేదాక మనకి నిద్ర పట్టదు. అలాంటిది ఒక పాము కాదు, వేయి పడగల పాము. ఆయనకు ఎలా నిద్ర పడుతుందో. (ఈ వాక్యం చమత్కారంగా రాశాను ఎవరూ ఏమీ అనుకోవద్దు).
జగన్నివాసా! ఈ జగత్తులో అంతా నివసిస్తుండేవాడు. జగత్తంతా ఆయనే.
విశ్వం విష్ణుః ఆలాపనం ప్రతి పదం కురుమే ముకుందా!
ప్రతి పదంలోనూ నీ నామమే రావాలి అంటే వచ్చే ప్రతి మాట నీగురించే కావాలి. ఇక్కడ పదం అనే మాటకు ఇంకొక అర్థం అడుగు. అంటే ప్రతి అడుగులో నేను వేసే ప్రతి అడుగు నీ దేవాలయానికి రావాలి, నీ దగ్గరికే రావాలి. అని కులశేఖరుడు ప్రార్ధించినట్లు ఇక్కడ గోపికలు ఆ శ్రీ రామచంద్రుని ప్రార్థిస్తున్నారు.
ఆండాల్ తిరువడిగళే శరణం
No comments:
Post a Comment