Tuesday, June 9, 2026

Monday Lord Shiva - సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం - పరమశివుని ఆరాధన

సోమవారం రోజున పరమశివుని  పూజించడం సహజం. సోమవారం రోజును "సోముని రోజు"గా భావిస్తారు. ఇక్కడ "సోమ" అంటే చంద్రుడు. చంద్రుడు పరమశివుడి జటాజూటంపై స్థానం పొందినవాడు కాబట్టి ఈ రోజు శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

పురాణల ప్రకారం, దక్షప్రజాపతి శాపం వల్ల చంద్రుడు తన కాంతిని కోల్పోయి క్షీణించసాగాడు. అప్పుడు చంద్రుడు పరమశివుని కోసం కఠిన తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నమై చంద్రుణ్ని తన తలపై ధరించి శాప ప్రభావం తగ్గించాడు. అందుకే శివుడికి "చంద్రశేఖరుడు" అనే నామం వచ్చింది.

చంద్రునికి ప్రత్యేకించి ఆలయం లేనందున శివుని ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాదు సోమ అనే శబ్దాన్ని స+ఉమ అని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడైనవాడు అంటే పార్వతీపతి అంటే శివుడు. ఆ విధంగా సోమవారం శివునికి ప్రత్యేక దినంగా రూపాంతరం చెందింది. స్కాందపురాణంలో సోమవార వ్రతమహిమ ఉంది. ఈ రోజున శివుడు ఉమాసహితుడై భక్తులను అనుగ్రహిస్తాడు.

సోముడంటే కుబేరుడు అనే అర్థం కూడా ఉంది. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్.. ఈశ్వరుడు ఐశ్వర్యదాయకుడు. శివుని ఆరాధించిన కుబేరుడు ఐశ్వర్యవంతుడైన రోజు కనుక ఈ రోజును సోమవారం అని పిలుస్తున్నారని పెద్దలు చెప్పారు.

సోమవారం రోజున శివారాధన చేస్తే, మనశ్శాంతి, దోష నివారణ, ఆరోగ్యం, ఐశ్వర్యం కోరికల సిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం.


సోమవారం శివునికి ఏ విధంగా పూజ చేయాలి:
శివారాధనకు సోమవారం విశిష్టమైనది. మిగిలిన రోజులకన్నా సోమవారం రోజు శివయ్యను ఆరాధిస్తే శివానుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. స్కంద పురాణం ప్రకారం పరమ శివుడు తన శిరస్సున సోముడు అంటే చంద్రుని ధరిస్తాడు కాబట్టి సోమవారం శివారాధనకు శ్రేయస్కరమని తెలుస్తోంది.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకుంటే సోమవారం రోజు ఆవు పాలు, నల్ల నువ్వులు శివయ్యకు సమర్పించాలి. అనంతరం మహా మృత్యుంజయ మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే శివయ్య అనుగ్రహంతో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరని వారు సోమవారం రోజు సూర్యోదయం సమయంలో కుంకుమ కలిపిన జలంతో శివలింగానికి అభిషేకం చేసి శివునికి ఎండుద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 11 సోమవారాలు చేస్తే త్వరగా వివాహం అవుతుంది.

ప్రతి సోమవారం 'ఓం నమః శివాయ' అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుందని శాస్త్రవచనం.

పార్వతీదేవి కూడా శివుడి అనుగ్రహం పొందడానికి సోమవారం వ్రతం చేసిందట. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడు, అర్జునుడు కూడా సోమవారం వ్రతం చేసి దివ్య శక్తులను పొందినట్లు ఉంది. అందువల్ల ఈ కలియుగంలో కూడా సోమవారం శివుడికి పూజ చేయడం వల్ల కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

సోమవారం శివుడికి అభిషేకం చేయడం వల్ల పూర్వ జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయట. ప్రస్తుత జీవితంలో మనశ్శాంతి కలుగుతుందట. బాధలు పోయి సుఖ సంతోషాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

No comments:

Post a Comment

Matsyavatara Sri Vedanarayana Swamy Temple, Nagalapuram, Tirupati District - మత్స్యావతార శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, నాగలాపురం, తిరుపతి జిల్లా

మత్స్యావతార  శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం,  నాగలాపురం,  తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక మరియు అత్యంత ప్రసిద్ధ మత్స్యావతార దేవాలయం శ్ర...