Thursday, June 25, 2026

Rama-Lakshmana Dwadashi - Champaka Dwadashi - రామలక్ష్మణ ద్వాదశి - చంపక ద్వాదశి

రామలక్ష్మణ ద్వాదశి - చంపక ద్వాదశి

జ్యేష్ఠ మాసం శుక్ల పక్షంలో వచ్చే ద్వాదశిని రామలక్ష్మణ ద్వాదశి అనీ, చంపక ద్వాదశి అనీ అంటారు. 

వరాహ పురాణం ప్రకారం ప్రతినెలా శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి విశేషమైనదే! జ్యేష్ఠ మాసంలో వచ్చే శుక్ల ద్వాదశి నాడు మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడిని పూజించాలని సూత మహర్షి చెప్పినట్టుగా వరాహ పురాణ కథనం.

రామలక్ష్మణ ద్వాదశి (పుత్ర సంతాన వ్రతం): పుత్ర సంతానం కోసం పరితపించిన దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి సూచన మేరకు ఈ వ్రతాన్ని ఆచరించాడు. దీని ఫలితంగానే శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. సంతానం లేని వారు ఈ రోజున ఉపవాస ఉండి, శ్రీరామ లక్ష్మణులను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

ఈ సందర్భంగా జ్యేష్ఠ ఏకాదశి నాడు బంగారంతో చేయించిన (శక్తి ఉన్నవారు) రామలక్ష్మణ విగ్రహాలను పూజించి, మర్నాడు అంటే ద్వాదశి నాడు వాటిని దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. ఆర్థికంగా శక్తిలేని వారు మట్టి ప్రతిమలను పూజించి కూడా దానమివ్వొచ్చు. శ్రీరాముడు విష్ణుమూర్తి స్వరూపుడైతే, లక్ష్మణుడు ఆదిశేషుడి రూపం.

ఈ ఉభయులను ప్రత్యేకంగా ఆవాహన చేసి పూజించడం వల్ల గవామయన యాగం చేసిన ఫలితం కలుగుతుందని పెద్దల మాట. ఒక ఏడాది పాటు నిర్విఘ్నంగా యాగం చేయడాన్ని గవామయన యాగం అంటారు.

కేవలం రామలక్ష్మణ ద్వాదశి నాడు వారిద్దరినీ పూజించడం వల్ల అంతటి గొప్ప పుణ్యం లభిస్తుందని ప్రతీతి. 

చంపక ద్వాదశి (సంపెంగల పూజ): ఒడిశా(ఉత్కళ రాష్ట్రము)  మరియు పూరీ జగన్నాథ ఆలయం పరిసర ప్రాంతాలలో ఈ ద్వాదశిని "చంపక ద్వాదశి" అని పిలుస్తారు. ఈ రోజున స్వామివారిని సంపెంగ పువ్వులతో (చంపక పుష్పాలు) విశేషంగా అలంకరించి పూజిస్తారు.

ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి: జగద్గురువు ఆది శంకరాచార్యులు అవతార పరిసమాప్తి గావించింది కూడా ఈ రోజునే! ఈ క్రమంలో ద్వాదశి నాడు ఆదిశంకరుల ధ్యానం వల్ల ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది.

జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రామలక్ష్మణ ద్వాదశి, చంపక ద్వాదశి, ఆదిశంకర కైలాస గమనం అని పిలుస్తారు..

ఏకాదశ్యాం సౌవర్ణరామలక్ష్మణౌ సంపూజ్య 
ద్వాదశమ్యాం బ్రాహ్మణాయ దద్యాత్| 
తథా చోక్తం వరాహపురాణే-

జ్యైష్ఠమాసేఽప్యేవమేవ సంకల్ప్య విధినా నరః|
అర్చయేత్ పరమం దేవం పుష్పైర్నానావిధైశ్శుభైః॥

స్రగ్వస్త్రయుగసంచ్ఛన్నౌ సౌవర్ణౌ రామలక్ష్మణౌ|
అర్చయిత్వా విధానేన ప్రభాతే బ్రాహ్మణాయ తౌ॥

దాతవ్యౌ మనసా కామమీహతాం పురుషేణ తు॥ 

ఇతి| తస్మాత్ ఏవ ద్వాదశ్యా రామలక్ష్మణద్వాదశీతి సంజ్ఞా స్యాత్|

ఈ రోజున రామలక్ష్మణులను పూజిస్తే రామానుగ్రహం కలుగుతుంది. జగన్నాథునకు సంపెంగలు మొదలైన అనేక పువ్వులతో విశేష అర్చనాదులు చేస్తారు. కనుక ఏ ప్రాంతంలోని వారైనా సంపెంగలు మొదలైన పూలతో విష్ణువును ఆరాధించాలి.

వ్రత విధానం
పుత్ర సంతానం కోరుకునేవారు రామలక్ష్మణ ద్వాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై రామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించి, శాస్త్రోకంగా కలశ స్థాపన చేయాలి. అనంతరం రామలక్ష్మణులకు ఆవాహన, ఆచమనం వంటి 16 రకాల షోడశోపచార పూజలు చేయాలి. రామలక్ష్మణులకు వస్త్ర సమర్పణ చేయాలి. పూజ పూర్తి అయ్యేవరకు ఉపవాసం చేయాలి.

దానాలు:
ఈ సందర్భంగా రామలక్ష్మణ ద్వాదశి ముందు నిర్జల ఏకాదశి రోజు ఆర్ధికంగా శక్తి ఉన్నవారు బంగారు రామలక్ష్మణులు విగ్రహాలను పూజించి, రామలక్ష్మణ ద్వాదశి రోజు పూజించిన బంగారు విగ్రహాలను దానంగా ఇవ్వాలని ధర్మశాస్త్ర వచనం. శక్తికొద్దీ మట్టి ప్రతిమలను కూడా దానం చేయవచ్చు. అంతేకాకుండా ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం, భూదానం, వస్త్ర దానం, సువర్ణ దానం వంటి దానాలు కూడా విరివిగా చేస్తే వ్రతఫలం అధికమవుతుంది. దీనివల్ల ఒక సంవత్సరం పాటు యాగాలు చేసినంతటి ఫలితం లభిస్తుందని నమ్ముతారు.

ఆదిశంకరాచార్యుల ఆరాధన: షణ్మత స్థాపకులైన జగద్గురువు శ్రీ ఆదిశంకరులు కైలాస గమనం చేసింది కూడా ఈ పవిత్రమైన ద్వాదశి తిథి రోజే. అందువల్ల ఈ రోజున వారిని స్మరించుకోవడం కూడా చాలా విశేషం.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Visakha Nakshatra - విశాఖ నక్షత్రము

విశాఖ నక్షత్రము నక్షత్రం - విశాఖ అధిపతి - గురువు గణము - రాక్షస జాతి - స్త్రీ వృక్షం - నాగకేసరి జంతువు - పులి నాడి - అంత్య పక్షి - గరుడుడు అధ...