Thursday, July 30, 2026

Worship of Goddess Durga - దుర్గారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుర్గారాధన

నారదా! ఇప్పుడింక దుర్గాదేవీ ఆరాధన విను. దుర్గను స్మరిస్తే చాలు ఆపదలు పారిపోతాయి. అందరూ హాయిగా ఉపాసించవచ్చు. జగన్మాత శైవి, శక్తి, మహాద్భుతశక్తి, సర్వబుద్ధి అధిదేవి, సర్వాంతర్యామిస్వరూపిణి, కఠిన సంకట విమోచని. అందుకే దుర్గ అయ్యింది. వైష్ణవులూ శైవులూ ఉపాసించదగిన పరాదేవత. మూలప్రకృతిరూప. సృష్టిస్థితిలయకారిణి. నవాక్షరమంత్రం చెప్పనా!

వాగ్భవం శంభువనితా కామబీజం తతఃపరమ్‌

చాముండాయై పదం పశ్చాద్విచ్చే ఇత్యక్షరద్వయమ్‌

ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే - అనే నవాక్షరమంత్రం భక్తులపాలిటి కల్పవృక్షం. దీనికి బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఋషులు. గాయత్రి ఉష్ణిక్కు అనుష్టుప్పులు ఛందస్సులు. మహాకాళీ మహాలక్షీ మహాసరస్వతులు దేవతలు. భ్రామరీ దుర్గా రక్తదంతికలు బీజాలు. నందా శాకంభరీ భీమాదేవీత్రయం శక్తులు. ధర్మార్థకామమోక్షాలలో వినియోగం.

ఋషులను మౌళియందు, ఛందస్సులను వదనంలోనూ దైవతాలను హృదయంలోనూ శక్తి బీజాలను స్తనాలలోనూ - ఇత్యాదిగా అంగన్యాస కరన్యాసాలతో మంత్రశాస్త్రంలో చెప్పబడిన విధానాలను అక్షరాలా పాటిస్తూ దుర్గాదేవిని అర్చించాలి. ఇలా ధ్యానించాలి -

ఖడ్గ చక్ర గదా బాణచాపాని పరిఘం తథా

శూలం భుశుండీం చ శిరః శంఖం సందధతీం కరైః ॥

మహాకాళీం త్రినయనాం నానాభూషణభూషితాం ।
నీలాంజన సమప్రఖ్యాం దశపాదాననాం భజే ॥

మధుకైటభనాశార్థం యాం తుష్టావాంబుజాసనః ।
ఏవం ధ్యాయేన్మహాకాళీం కామబీజస్వరూపిణీమ్‌


అక్షమాలాం చ పరశుం గదేషు కులిశాని చ ॥

పద్మం ధనుష్కుండికాం చ దడం శక్తిమసిం తథా ॥

చర్మాంబుజం తథా ఘంటా సురాపాత్రం చ శూలకమ్‌ ।
పాశం సుదర్శనం చైవ దధతీమరుణప్రభామ్‌


రక్తాంబుజాసవగతాం మాయాబీజస్వరూపిణీమ్‌ ।
మహాలక్ష్మీం భజేదేవం మహిషాసురమర్దినీమ్‌ ॥

ఘంటా శూలే హలం శంఖం ముసలం చ సుదర్శనమ్‌

ధనుర్బాణాన్ హస్తపద్మైర్దధానాం కుందసన్నిభామ్‌ ॥

శుంభాది దైత్యసంహర్త్రీం వాణీబీజస్వరూపిణీమ్‌

మహాసరస్వతీం ధ్యాయేత్‌ సచ్చిదానందవిగ్రవామ్‌ ॥ 

కామబీజస్వరూపిణిగా మహాకాళి, మాయాబీజస్వరూపిణిగా మహాలక్ష్మి, వాణీబీజస్వరూపిణిగా మహాసరస్వతి అయిన దుర్గాదేవిని ఇలా ధ్యానించి షట్కోణసంయుక్త - అష్టదళపద్మ - చతుర్వింశతి పత్రక - భూగృహసమాయుక్త - యంత్ర విచింతన చెయ్యాలి.

సాలగ్రామంలోగానీ మంగళకలశంలోగానీ యంత్రంలోగానీ ప్రతిమలలోగానీ బాణచిహ్నంలోగానీ సూర్యడిలోగానీ ఏకాగ్రచిత్తంతో దేవిని ఆవాహనచేసి ఉపాసించాలి. జయాదిశక్తియుతమైన పీఠంలో నిలిపి పూజించాలి. తూర్పుకోణంలో సరస్వతీసహితుడైన బ్రహ్మను, నైఋతికోణంలో శ్రీసహితుడైన హరిని, వాయుకోణంలో పార్వతీపరమేశ్వరులనూ, దేవికి ఉత్తరంగా సింహాన్నీ, వామభాగంలో మహిషాసురుణ్ణీ నిలిపి అర్చించాలి. నందజ - రక్తదంత - శాకంభరి - దుర్గ - భీమ - భ్రామరి - శక్తులను షట్కోణాలలో కొలవాలి. బ్రాహ్మి - మాహేశ్వరి - కౌమారి - వైష్ణవి - వారాహి - నారసింహి - ఐంద్రి - చాముండక - రూపాలను అష్టదళాలలో యజించాలి. అటు పైని చతుర్వింశతి తత్త్వపత్రాలలో విష్ణుమాయ - చేతన - బుద్ధి - నిద్ర - క్షుధ - ఛాయ - తృష్ణ - శాంతి - జాతి - లజ్జ - క్రాంతి - శ్రద్ధ - కీర్తి - లక్ష్మి - ధృతి - వృత్తి - శ్రుతి - స్మృతి - దయ - తుష్టి - పుష్టి - మాతృ - భ్రాంతి - పరలను అర్చించాలి. ఆ తరవాత భూపురకోణాలలో గణేశ క్షేత్రపాలక వటుక యోగినులను పూజించాలి. ఇంద్రాదిదేవతలనూ వజ్రాద్యాయుధాలనూ ఇలాగే వెలుపల ఆవాహనచేసి అర్చించాలి. సావరణంగా ఇలా అర్చించి రాజోపచారాలు చెయ్యాలి. నవార్ణమంత్రాన్ని జపించాలి. సప్తశతీస్తోత్రం పఠించాలి. ఇటువంటి స్తోత్రం ముల్లోకాలలోనూ లేదు. ఇలా నిత్యం చేసిన భక్తుడు చతుర్విధపురుషార్ధాలకూ ఆలయమవుతాడు.

నారదా! శ్రీదుర్గాపూజావిధానం సమగ్రంగా వివరించాను. చెప్పినందుకు నేనూ విన్నందుకు నువ్వూ కృతార్థులమయ్యాము. సకలదేవతలూ త్రిమూర్తులూ మనువులూ మునులూ జ్ఞానులూ యోగులూ ఆశ్రమవాసులూ లక్ష్మీసరస్వతులూ అందరూ దుర్గాదేవిని ధ్యానిస్తారు. అది కారణంగానే వారందరూ ఆయా పదవులలో నిలిచి కర్తవ్యాలు నిర్వహించడానికి సమర్థులు అవుతున్నారు. పంచప్రకృతులూ తదంశమూర్తుల గురించి రహస్యాతిరహస్యమైన ఆఖ్యానాలను నీకు వివరంగా తెలియజెప్పాను. దీన్ని విన్నవారికి చతుర్విధపురుషార్థాలూ సిద్ధిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇది ముమ్మాటికీ సత్యం. తొమ్మిదిరాత్రుల పాటు దేవీసన్నిధిలో ఈ ఆఖ్యానాలను పఠించినవారికి తీరనికోరికలంటూ ఉండవు. రోజుకి ఒక అధ్యాయంగా పారాయణచేస్తే దుర్గాదేవి వశవర్తిని అవుతుంది. అతడు దేవీ ప్రియకరుడవుతాడు. మనోరథాన్ని సంకల్పించుకొని దేవీభాగవత గ్రంథపూజచేసి కుమారి చేతికిచ్చి లేదా వటువు చేతికిచ్చి తెరవమని - వచ్చిన అధ్యాయాన్ని చదివితే శభాశుభ శకునాలూ ఫలాలూ తెలిసిపోతాయి. ఉదాసీనుడికి ఉదాసీనంగానే ఉంటుందినుమా! అని చెప్పి నారాయణమహర్షి ముగించాడు.

శ్రీ దేవీ భాగవతం దశమ స్కంధము


Radhika Aradhana - రాధికారాధన

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - రాధికారాధన

నారాయణమహర్షి! ప్రకృతిశక్తుల ఉపాఖ్యానాలన్నీ చెప్పావు. భుక్తిముక్తిప్రదాలు. విని ఆనందించాను. వేదాలలో నిగూఢంగా ఉన్న రెండు ఉపాఖ్యానాలు మిగిలిపోయాయి. వాటిని కూడా నీ ముఖతః వినాలని ఉంది. రాధాదేవి - దుర్గాదేవి. వీరి మహిమలు ఇప్పటికే చాలా చెప్పావు, చరాచరజగత్తు ఆంతా వారి అంశయే - ఆని తెలుసుకున్నాను. కానీ వారిని పూజించే విధానమేమిటో తెలియజెప్పలేదు. అదొక్కటి చెబితే విని తరిస్తాను.

నారదా! ఈ ఉపాఖ్యానం ఇంతవరకూ ఎవరూ నన్ను అడగలేదు. ఎవరికీ నేను చెప్పలేదు. నువ్వే అడిగావు. నీకే చెబుతున్నాను. ఇది పరమరహస్యం. సారాత్‌ సారం. పరాత్‌ పరం. గోప్యంగా ఉంచాలి. ఎవరికిబడితే వారికి చెప్పెయ్యకూడదుసుమా!

జగత్సృష్టికి మూలస్వరూపిణులు ఇద్దరు. ఒకరు ప్రాణశక్తి. ఒకరు బుద్ధిశక్తి, విరాడాది చరాచర జగత్తు అంతా ఈ రెండుశక్తులకూ అధీనమై ఉంటుంది. వీరి అనుగ్రహం కలగనంతవరకూ ఏ జీవికీ మోక్షం లేదు. అంచేత అందరూ ఈ ఇద్దరినీ సేవించవలసిందే. ముందుగా రాధికామంత్రం విను. 

శ్రీరాధాయై స్వాహా అనేది షడక్షరీ మూలమంత్రం. దీనికి ఆదిలో మాయాది మహాబీజాక్షరాలను వాంఛితాలకు అనుగుణంగా చేర్చుకోవచ్చు. అది చతుర్విధ పురుషార్థాలనూ కోరికలనూ తీర్చడంలో చింతామణి. కోటిముఖాలున్నా శతకోటి నాలుకలున్నా ఈ మంత్రం శక్తిని ఎవ్వరూ వర్ణించలేరు. గోలోకంలో రాసమండలంలో శ్రీ కృష్ణపరమాత్మ మూలమహాదేవి నుంచి ముమ్మోదటగా ఈ మహామంత్రాన్ని ఉపదేశంగా స్వీకరించాడు. ఆయన విష్ణువుకి ఆయన బ్రహ్మకూ ఆయన విరాట్పురుషుడికీ ఆయన ధర్ముడికి చెప్పారు. ధర్ముడు నాకు అనుగ్రహించాడు. ఇప్పటికీ నేను అదేమంత్రాన్ని జపిస్తున్నాను. అందుకే ఋషిని కాగలిగాను. బ్రహ్మాదిదేవతలుకూడా నిత్యమూ ఈ మంత్రాన్నీ ఈ మంత్రాధిదేవతనూ ఆరాధిస్తుంటారు. రాధాదేవిని అర్చించకు౦డా కృష్ణపరమాత్మను అర్చించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. రాదు. అంచేత వైష్ణవులు విధిగా రాధార్చన చెయ్యాలి.

రాధాదేవి శ్రీకృష్ణుడికి ప్రాణాధిదేవి. కనక అతడు రాధికాధీనుడు. అతడికి రాధ నిత్యం రాసేశ్వరి, ఆవిడ లేకుండా అతడు ఉండడు. సకలకామాలనూ రాధిస్తుంది (తొలగిస్తుంది) కనక రాధ. 

రాధా మంత్రానికి ఋషిని నేనే. ఛందస్సు గాయత్రి. దేవత - రాధిక. తారమే బీజం. శక్తిబీజం. మూలావృత్తితో షడంగాలు చెయ్యాలి. సామవేదంలో చెప్పబడినట్టు ధ్యానం చెయ్యాలి.

శ్వేతచంపకవర్ణాభాం శరదిందుసమాననామ్‌ ।
కోటిచంద్రప్రతీకాశాం శరదంభోజలోచనామ్‌ ॥

బింబాధరాం పృథుశ్రోణీం కాంచీయుతనితంబినీమ్‌ ।
కుందపంక్తిసమానాభ దంతపంక్తి విరాజితామ్‌ ॥

క్షామాంబరపరీధానాం వహ్నిశుద్దాంశుకాన్వితామ్‌ ।
ఈషద్దాస్యప్రసన్నాస్యాం కరికుంభయుగస్తనీమ్‌


సదా ద్వాదశవర్షియాం రత్నభూషణభూషితామ్‌ ।
శృంగారసింధులహరీం భక్తానుగ్రహకాతరామ్‌ ॥

మల్లికామాలతీమాలా కేశపాశవిరాజితామ్‌ ।
సుకుమారాంగలతికాం రాసమండలమధ్యగామ్‌ ॥

వరాభయకరాం శాంతాం శశ్వత్‌ సుస్థిరయౌవనామ్‌ ।
రత్నసింహాసనాసీనాం గోపీమండలనాయికామ్‌ ॥

కృష్ణప్రాణాధికాం వేదబోధితాం పరమేశ్యరీమ్‌


రాధాదేవి శ్వేతచంపకవర్ణంలో ఉంటుంది. ఆవిడ వదనం శరచ్చంద్ర సమానం. కోటిచంద్రుల కాంతిని వెదజల్లుతూంటుంది. కన్నులు శరత్కాలంలో వికసించిన పద్మాల్లాగా ఉంటాయి. అధరం దొండపండే. శ్రోణీభారం విశాలం. కటిసీమలో బంగారు మొలనూలు. చిరుమువ్వల సవ్వడి. తీర్చిదిద్దినట్టున్న పలువరుస మల్లెమొగ్గలు ఏరి పేర్చినట్టుంటుంది. తెల్లని చీర. ఆగ్నిజ్వాలలాంటి అంచుతో పైటచెంగు. ప్రసన్నవదనం. చిరునవ్వులు చిందిస్తూంటుంది. ఎత్తయిన వక్షఃస్థలం. ఎప్పుడూ పన్నెండేళ్ళవయస్సే. రత్నాభరణాలు. శృంగారసింధువులో ఎగసిపడే కెరటం. భక్తులను అనుగ్రహించడానికి ఎల్లవేళలా ఆరాటపడుతూ ఉంటుంది. మల్లికామాలతీమాలికలు తురిమిన కేశపాశం. పూలతీగలాంటి సుకుమారశరీరం. ఎప్పుడూ రాసమండలాన మధ్యలో ఉంటుంది. వరదహస్తమూ అభయహస్తమూ. శాంతస్వరూప. ఎప్పుడూ తరిగిపోని యౌవనం. రత్ససింహాసనంమీద కూర్చుంటుంది. గోపీమండలానికి నాయిక. కృష్ణుడికి ప్రాణాలకన్నా ఎక్కువ. వేదాలు చెప్పిన పరమేశ్వరి రాధికాదేవియే.

ఇలా ధ్యానించి సాలగ్రామంలోగానీ కలశంలోగానీ అష్టదళయంత్రంలోగానీ దేవిని స్థాపించి పూజించాలి. అటుపైని దేవతలను ఆవాహనచేసి ఆసనాదులను సమర్పించాలి. అన్నీ మూలమంత్రోచ్చారణతోనే చెయ్యాలి. పాదాలకు పాద్యం శిరస్సుపై అర్ఘ్యం ముఖానికి ఆచమనీయం రెండేసిసార్లు మంత్రపూర్వకంగా సమర్పించాలి. మధుపర్కం ఇవ్వాలి. పాడి ఆవును ఇవ్వాలి. అటు పైని స్నానశాలకు తీసుకువెళ్ళాలి. అభ్యంగనస్నానం చేయించాలి. నూతనవస్త్రాలు ఇవ్వాలి. అలంకారపూర్వకంగా చందనచర్చ జరపాలి. తులసీదళాలు పొదిగిన పుష్పమాల అలంకరించాలి. ఆందులో పారిజాతాలూ పద్మాలూ ఉండాలి. ఈ అర్చన ఆయ్యాక పరివార దేవతలను అర్చించాలి. నాలుగు విదిక్కుల నడుమ అంగపూజ చెయ్యాలి. అష్టదళ పద్మంలో దక్షిణావర్తంగా పరివారదేవతలను నిలపాలి. తూర్పు దళంలో మాలావతిని, ఆగ్నేయదళంలో మాధవిని, దక్షిణదళంలో రత్నమాలను, నైఋతికోణంలో సుశీలను, పశ్చిమదళంలో శశికళను, వాయవ్యకోణంలో పారిజాతను, ఉత్తరదళంలో పరావతినీ ఈశాన్యకోణంలో సుందరిని ఆవాహన చెయ్యాలి. వీరికి వెనకతట్టున దిక్పాలకులను నిలపాలి. వారివారి ఆయుధాలనూ ఆవాహన చెయ్యాలి. అప్పుడు ఆవరణసహిత రాధాదేవిని గంధాదులతో దేవోపచార రాజోపచారాలతో అర్చించాలి.

తతో దేవీం సావరణాం గంధాద్యైరుపచారకైః

రాజోపచారసహితైః పూజయేన్మతిమాన్నరః


ఇది అయ్యాక సహస్రనామార్చన చెయ్యాలి. ఇలా చేసిన భక్తుడు సాక్షాత్తూ విష్ణుతుల్యుడు అవుతాడు. గోలోకనివాసం పొందుతాడు. కార్తికపూర్ణిమనాడు రాధాజన్మోత్సవం చేస్తే రాసేశ్వరి సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. మంత్రాలను వర్ణసంఖ్యా విధానంగా పునశ్చరణ చెయ్యాలి. దశాంశం తిలాహోమం చెయ్యాలి. ఇంక రాధాస్తోత్రమేమిటంటే -

నమస్తే పరమేశాని రాసమండలవాసిని

రాసేశ్వరి నమస్తే
స్తు కృష్ణప్రాణాధిక ప్రియే ॥

నమస్త్రైలోక్యజనని ప్రసీద కరుణార్ణవే ।
బ్రహ్మవిష్ణ్వాదిభిర్దేవైః వంద్యమానపదాంబుజే ॥

నమః సరస్వతీరూపే నమస్సావిత్రి శంకరి ।
గంగాపద్మావతీరూపే షష్ఠిమంగళచండికే


నమస్తే తులసీరూపే నమో లక్ష్మీస్వరూపిణి

నమో దుర్గే భగవతి నమస్తే సర్వరూపిణి ॥

మూలప్రకృతిరూపాం త్వాం భజామః కరుణార్ణవామ్‌

సంసారసాగరాదస్మాత్‌ ఉద్దరాంబ దయాం కురు ॥

ఈ స్తోత్రాన్ని ముప్పొద్దులా పఠించేవారికి దుర్లభమన్నదే లేదు. జన్మాంతంలో గోలోక రాసమండలనివాసం తప్పదు.

దుర్గారాధన


The Story of Surabhi - సురభి చరితం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - సురభి చరితం

నారాయణమహర్షీ! ఇంతకీ ఈ సురభి ఎవరు? గోలోకంనుంచి వచ్చిందన్నావుగదా! ఆ గోవు చరిత్రను తెలియజెప్పమన్నాడు నారదుడు.

నారదా! సురభి అంటే గోమాత. గోవులకు అధిష్టానదేవత. గోవులకు కన్నతల్లి. సృష్టిలో మొట్టమొదటి గోవు. గోలోకంలో ఆవిర్భవించింది.

సృష్టి తొలినాళ్ళల్లో శ్రీకృష్ణుడు గోలోకంలో రాధికాసహితుడై గోపాంగనా పరివృతుడై బృందావనానికి వెళ్ళాడు. రహఃక్రీడలతో వినోదించసాగాడు. అలసిపోయాడు. పాలుతాగాలి అనిపించింది. అనిపించడమేమిటీ వెంటనే తన శరీరంలో ఎడమభాగం నుంచి లీలావిలాసంగా దూడతోసహా ఒక పాడిఆవును సృష్టించాడు, కొత్త కుండలోకి పాలు పితికాడు. అమృతంకన్నా రుచికరమైన పాలు. జన్మ మృత్యు జరా వ్యాధి నివారకమైన క్షీరం. కడుపునిండా పుచ్చుకున్నాడు. మిగిలిన పాలతో కుండను ఒక చదువైన ప్రదేశంలో విడిచిపెట్టాడు. అక్కడ శతయోజన విస్తీర్ణమైన క్షీరసరోవరం ఏర్పడింది. చుట్టూ రత్నాలు తాపించిన గట్లు, బంగారుమెట్లు. రాధాదేవికీ గోపికా బృందానికీ అది క్రీడా సరోవరమయ్యింది.

ఆ గోవే కామధేనువు. సురభి. దాని రోమకూపాలనుంచి కోట్ల సంఖ్యలో కామధేనువులు ఆవిర్భవించాయి. ఒక్కొక్క గోపకుడికీ ఒక్కొక్క సురభిగా అవతరించాయి. కాలక్రమాన దూడలు పుట్టి పెరిగి అసంఖ్యాకంగా అభివృద్ధి చెందాయి.

శ్రీకృష్ణుడే మొట్టమొదటిసారిగా సురభిని పూజించాడు. అటుపైని ముల్లోకాలలోనూ గోపూజ ఆచారంగా స్థిరపడింది. ధ్యానమూ స్తోత్రమూ మూలమంత్రమూ పూజావిధానమూ - ఇత్యాదులన్మీ వేదోక్తంగా ఉన్నాయి. చెబుతాను గ్రహించు.

ఓం సురభ్యై నమః అనేది షడక్షరమూలమంత్రం. లక్షసార్లు జపిస్తే సిద్ది కలుగుతుంది. బుద్ధి వృద్ధులను కలిగించే ధ్యానశ్లోకాలున్నాయి.

లక్ష్మీస్వరూపాం పరమాం రాధాసహచరీం పరామ్‌ ।
గవామధిష్ఠాతృదేవీం గవామాద్యాం గవాం ప్రసూమ్‌ ॥

పవిత్రరూపాం పూతాం చ భక్తానాం సర్వకామదామ్‌ ।
యయా పూతం సర్యవిశ్వం తాం దేవీం సురభిం భజే ॥

ఘటంలోగానీ ధేనుశిరస్సునగానీ కట్టుగొయ్యనుగానీ(బంధస్తంభం) సాలగ్రామంలోగానీ సురభిని ఆవాహనచేసి పూజించాలి. ప్రాతస్సాయంసంధ్యల్లో ఈ పూజ నిర్వహించాలి.

వరాహావతారకాలంలో విష్ణుమాయవల్ల సురభులు ఒక్కసారిగా అన్నీ వట్టిపోయాయి. పాలచుక్క దొరక్క దేవతలు కటకటలాడారు. నెయ్యిలేక యజ్ఞాలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ఆయన చెప్పిన ఉపాయం ప్రకారం దేవేంద్రుడు సురభిని స్తుతించాడు.

నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః

గవాం బీజస్వరూపాయై నమస్తే జగదంబికే ॥

నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః ।
నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః ॥

కల్పవృక్ష స్వరూపాయై సర్వేషాం సతతం పరే ।
క్షీరదాయై ధనదాయై బుద్దిదాయై నమో నమః ॥

శుభాయై చ సుభద్రాయై గోపప్రదాయై నమో వమః

యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః ॥

ఈ స్తోత్రానికి సురభి సంతుష్టి చెందింది. ప్రత్యక్షమై ఇంద్రుడికి వాంఛితార్థసిద్ధిగా వరమిచ్చి గోలోకానికి వెళ్ళిపోయింది. దేవతలు తమ లోకానికి వచ్చేశారు. సురభులన్నీ మళ్ళీ పాడి ఆవులై క్షీరధారలు కురిపించాయి. దేవతల యజ్ఞయాగాదులు హాయిగా సాగాయి.

ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించిన వారికి గో ధన ధాన్య సమృద్ధి లభిస్తుంది. కీర్తి లభిస్తుంది. పుత్రపౌత్రాభివృద్దిగా వంశం పరిఢవిల్లుతుంది. పరలోకంలో కృష్ణమందిరంలో నివాసమూ కృష్ణసేవాభాగ్యమూ దొరుకుతాయి.

రాధికారాధన


The Manasa Stotram composed by Indra - ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం

మహర్షీ అంటూ మళ్ళీ అందుకున్నాడు నారదుడు. ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం పూజాక్రమం తెలియజెప్పమన్నాడు. నారాయణమహర్షి అలాగే అని చెప్పనారంభించాడు.

ఇంద్రుడు సుస్నాతుడై ధౌతవస్త్రాలు ధరించి శుచిగా నానావిధ పూజాద్రవ్యాలతో వచ్చాడు. వస్తూనే మనసాదేవికి సాష్టాంగ నమస్కారం చేశాడు. రత్నసింహాసనంమీద కూర్చుండబెట్టాడు. రత్నకుంభాలతో తెచ్చిన గంగాజలంతో వేదమంత్రపూర్వకంగా స్నానం చేయించాడు. అగ్నిజ్వాలల్లాంటి వస్త్రాలను సమర్పించాడు. చందనం అందించాడు. అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు. గణేశ దినేశ వహ్ని విష్ణు పార్వతీ పరమేశ్వరులను(దేవషట్కం) ముందుగా అర్చించాడు.

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా అనే మూలమంత్రాన్ని జపిస్తూ పారిజాత పుష్పాలతో పాదపూజ చేశాడు. ఇతరులకు ఎవ్వరికీ అందనంతటి విలువైన వస్తువులతో శ్రద్దగా షోడశోపచారాలూ జరిపాడు. నృత్యవాద్యసంగీతాలతో ఆనందపరిచాడు. ఈ పూజను చూడటానికి త్రిమూర్తులూ సతీసమేతులై వచ్చారు. పులకాంకితగాత్రుడై సాశ్రునేత్రుడై మనసాదేవిని స్తుతించాడు.

దేవీ! పతివ్రతా శిరోమణీ! నిన్ను స్తుతించాలి అనుకొంటున్నానుగానీ నాకు శక్తి సరిపోవడం లేదు. స్వభావాన్ని వర్ణించడమే స్తోత్రలక్షణమని వేదం చెబుతోంది. (స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతత్పరమ్‌) నువ్వు పరాత్పరవు. ప్రకృతి స్వరూపిణివి. నీ గుణగణాలను వర్ణించడం నా తరమా! శుద్దసత్త్వస్వరూపవు. కోపక్రోధవివర్జితవు. శంకర ప్రియశిష్యవు. నాకు సోదరివి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అశక్తుడై మా బావగారు జరత్కారుడంతటివాడు నీ అనుమతినే యాచించాడు. అదితిలాగా నువ్వు నా తల్లివి, సోదరివిగా దయారూపవు. కన్నతల్లిలాగా క్షమారూపవు. నా ప్రాణాలను కాపాడావు. కుటుంబాన్ని రక్షించావు. బంధుమిత్ర పరివారాన్ని ఆపదలో ఆదుకున్నావు. నువ్వు సురేశ్వరివి. జగదంబికవు. నిన్ను నిత్యమూ పూజించాలి. ఇప్పుడు చేస్తున్న ఈ పూజతో ఆనందించి ఇంకా మాపట్ల దయామయివి అవుతావని ఆకాంక్షిస్తున్నాను.

ఆషాఢంలో సంక్రమణంనాడుగానీ నెలనెలా పంచమీనవముల్లోగానీ మాసాంతంలోగాని (పూర్ణిమ - అమావాస్య) ఇంతెందుకు నిత్యమూ నిన్ను అర్చించినవారికి పుత్రపౌత్రాభివృద్ధిగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. కీర్తిమంతులూ విద్యావంతులూ గుణవంతులూ అవుతారు. అజ్ఞానంతో నిన్ను నిందించినవారికి సర్పభయం తప్పదు. దరిద్రులవుతారు. నువ్వు స్వయంగా సర్వలక్ష్మివి. వైకుంఠంలో మహాలక్ష్మివి. జరత్కారుడు నారాయణాంశ సంభూతుడు కనక నిన్ను చేపట్టాడు. బ్రహ్మదేవుడు నిన్ను తన తేజస్సునంతా ఉపయోగించి మనస్సుతో సృష్టించాడు. కనకనే మనసాదేవివయ్యావు. పరమపావనమూర్తివి. మమ్మల్ని రక్షించడానికే నువ్వు అవతరించావు. నీ అంతట నువ్వు సిద్దయోగినివి. సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్టే. నేటినుంచీ దేవతలూ త్రిలోకవాసులూ భక్తితో నిన్ను అర్చిస్తారు. అభీష్టవరాలు పొందుతారు.

దేవేంద్రుడు మనసాదేవిని మనసారా స్తుతించి భగినీపతి జరత్కారువును వెంటదీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. సుతుడు అస్తీకుడితో మనసాదేవి కశ్యవుడి ఆశ్రమంలో సుఖంగా నివసించింది. సోదరుల పూజలు అందుకుంటోంది. అందరూ అర్చనలు చేస్తున్నారు.

గోలోకంనుంచి(కామధేనువు) సురభివచ్చి మనసాదేవికి క్షీరాభిషేకం జరిపింది. ఆత్యంత గోప్యమూ సర్వజన దుర్లభమూ అయిన జ్ఞానాన్ని ఉపదేశించింది. ఇంద్రలోకానికి తిరిగివెళ్ళింది.

ఇంద్రుడు చేసిన మనసాస్తోత్రాన్ని పఠించినవారికి నాగభయం ఉండదు. విషంకూడా అమృతోపమం అవుతుంది. వంశవృద్ధి జరుగుతుంది. అయిదులక్షలసార్లు పఠిస్తే స్తోత్రసిద్ది కలుగుతుంది. అతడు సర్పాలపై సవారీ చెయ్యగలడు. సర్పాలపై విశ్రమించగలడు.

సురభి చరితం


The Story of Astika - ఆస్తీక వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఆస్తీక వృత్తాంతం

వెళ్ళిందే కానీ అనుక్షణమూ అక్కడ దుఃఖిస్తూనే ఉంది. పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది. క్రమంగా నెలలునిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది. తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటినుంచి వెలువడే జ్ఞానోపదేశాలను రోజూ విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడూ జ్ఞానీంద్రుడూ అయ్యాడు. నారాయణాంశ సంభూతుడు.

శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు. పార్వతీ పరమేశ్వరులు బ్రాహ్మణులకు సువర్ణరత్నవస్త్రరాశులు పంచిపెట్టారు. వేదశాస్త్రాభ్యాసం అయ్యాక మృత్యుంజయమైన పరతత్త్వాన్నీ బ్రహ్మజ్ఞానాన్నీ ఉపదేశించాడు. కుర్రవాడికి గురువుపట్లా ఇష్టదేవత హరిపట్టా భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తీకుడు ఆస్తీకుడు అన్నారు.

శంకరుడి ఆజ్ఞమీదట ఆస్తీకుడు తపస్సుకోసం పుష్కరక్షేత్రానికి వెళ్ళాడు. మూడులక్షల సంవత్సరాలు మహామంత్రాన్ని జపించి తపోధనుడై మహాయోగియై గురువు శంకరుణ్ణి నమస్కరించడానికి తిరిగివచ్చాడు. నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు. కశ్యపప్రజాపతి కూతురినీ మనుమడినీ చూసి ఆనందాశ్రువులు రాల్చాడు. బ్రాహ్మణులకు విందులు చేశాడు. నూరులక్షల రత్నాలు పంచిపెట్టాడు. కశ్యపుడి భార్యలు దితి - అదితి సంబరపడ్డారు. ఆశీర్వదించారు. తల్లీకొడుకులిద్దరూ చాలాకాలం అక్కడే నివసించారు.

ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురి అయ్యాడు. ఇప్పటినుంచి ఏడు రోజుల్లోగా తక్షకుడనే సర్పరాజు నిన్ను కాటువేస్తాడని శృంగి శాపం. పరీక్షిత్తు భయపడిపోయి గాలీవెలుతురూ చొరని భవనంలో దూరి అన్ని రక్షణలూ ఏర్పాటు చేసుకుని రోజులు గడుపుతున్నాడు. ఆరురోజులు గడిచ్మాయి. ఏడవరోజు వచ్చింది.

పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు. రాజమందిరం దరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు, ఇద్దరికీ సంవాదం జరిగింది. ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు. తక్షకుడిచ్చిన మణిని తీసుకు ధన్వంతరి వెళ్ళిపోయాడు. తక్షకుడు రాజగృహంలోకి చొరబడ్డాడు. మంచంమీద పడుకున్న పరీక్షిత్తుని కాటువేశాడు. అతడు మరణించాడు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు దారుణంగా దుఃఖించాడు. తండ్రికి అంతిమక్రియలు నిర్వహించాడు.

జనమేజయుడు సర్పజాతిమీద పగబట్టాడు. విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు. సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమకుండంలో వచ్చిపడి మరణిస్తున్నాయి. తక్షకుడు భయాకులుడయ్యాడు. పరుగుపరుగున వెళ్ళి ఇంద్రుణ్ణి శరణువేడాడు. దేవేంద్రుడు అభయమిచ్చాడు. ఇది తెలిసిన జనమేజయుడి విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి హోమం చెయ్యడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. దానితో ఇంద్రాదిదేవతలు గడగడలాడారు. బృహస్పతి సలహాపై మనసాదేవిని ఉపాసించారు. ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు ఆస్తీకుణ్ణి జనమేజయుడి సన్నిధికి పంపించింది.

ఆస్తీకుడంతటివాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజయుడు సంబరపడ్డాడు. అతిథి మర్యాదలు చేశాడు. ఏమికావాలో కోరుకోమన్నాడు. ఇంద్ర తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తీకుడు అడిగాడు. విప్రులతో సంప్రదించి జనమేజయుడు అంగీకరించాడు. సర్పయాగాన్ని ముగించాడు. బ్రాహ్మణులందరికీ భూరిదక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు.

విప్రులూ మునిశ్వరులూ దేవతలూ వెళ్ళి మనసాదేవిని దర్శించారు. పూజలు చేశారు. ఎవరిమటుకు వారు స్తుతించారు. ఇంద్రుడు పూజాసంభారంతో వచ్చి శుచిగా భక్తిశ్రద్దలతో అర్చించాడు. షోడశోపచారాలూ చేశాడు. బ్రహ్మాదిదేవతలు ఆనందించారు.

నారదా! ఇదీ మనసాదేవి ఆఖ్యానం. ఏమన్నా సందేహాలున్నాయా? ఇంకా ఏదయినా వినాలనుకుంటున్నావా? అని కాసింత విశ్రాంతి తీసుకున్నాడు నారాయణమహర్షి.

ఇంద్రుడు చేసిన మానసా స్తోత్రం


The Story of Manasa Devi - మానసా దేవి కథ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - మానసా దేవి కథ

నారదా! ఇప్పూడింక ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు. మహామునీశ్వరుడు కశ్యపుణ్జి శరణువేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాలనుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టానదేవతగా చతుర్ముఖుడు మనసాదేవిని సృష్టించాడు. ఆవిడ సద్యోయౌవనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుణ్ణీ స్తుతించింది. వెయ్యి దివ్యవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే ఆశుతోషుడుకదా!(వెంటనే సంతోషించే భోళాశంకరుడు) మనసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపచేశాడు. లక్ష్మీ మాయా కామబీజాక్షరాలతో కృష్ణాయస్వాహా అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదుల్ని చెప్పాడు. పుష్కరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చెయ్యమని ఆజ్ఞాపించాడు.

మనసాదేవి మూడుయుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకలజన పూజితవు అవుతావని వరం ఇచ్చాడు. ప్రథమపూజ తానే చేశాడు. రెండవపూజ శంకరుడు చేశాడు. ఆటుపైని కశ్యపుడూ దేవతలూ మునులూ మనువులూ నాగజాతివారూ మానవజాతివారూ అందరూ పూజించారు. త్రిలోకవందిత అయ్యింది.

కశ్యపప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మనసాదేవిని కన్యాదానం చేశాడు. అయాచితంగా లభించిందనీ బ్రాహ్మణుడి ఆజ్ఞ అనీ ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకి వెళ్ళిపోయాడు.

ఒకనాడు పుష్కరక్షేత్రంలో మర్రిచెట్టు నీడలో పరమనైష్ఠికుడు జరత్కారువు తన మనసాదేవి ఒడిలో తల అన్చి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయంసంధ్యాసమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే, ఎలాగా - అని మనసాదేవి కళవళపడింది.

బ్రాహ్మణుడికి ప్రాతస్సాయం సంధ్యావందనాలు నిత్యవిధులు. ఇవ్వి చెయ్యకపోతే బ్రహ్మహత్యా మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకూ పనికిరాడు. అశుచి అయిపోతాడు ఆని వేదం
చెబుతోంది.

మనసాదేవికి ఇవన్ని జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్యామహాపాతకిని చెయ్యడంకన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడమేమిటి జరత్కారువును నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడిచెట్టంత ఎత్తున అలిగాడు.

సాధ్వీ! ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను. ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారంచేస్తే నోములూ వ్రతాలూ దానధార్మలూ అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణపరమాత్మను పూజించినట్టే అన్నారు పెద్దలు. పతివ్రతావ్రతంకోసమే స్త్రీలకు భర్తరూపంలో శ్రీహరి స్వయంగా లభించేది. స్త్రీలు చేసే దాన - ధర్మ - యజ్ఞ - తీర్థస్నాన - వ్రత - తపో - దేవపూజా - సత్య - ఉపవాసాదికాలు అన్నీ కలిపినా పతిసేవాఫలంలో పదహారవవంతుకి సాటిరావు. భారతదేశంలో పతిసేవా పరాయణగా జన్మగడిపిన ఇల్లాలు భర్తతోసహా వైకుంఠానికీ బ్రహ్మలోకానికీ చేరుకుంటుంది. అప్రియం చేసినా పలికినా కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజన్మలో పతిపుత్రరహితగా నీచపడుతుంది.

జరత్కారుడి కోపంచూసి మనసాదేవి గడగడలాడింది. మాటపెగలలేదు. స్వామీ! సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాలిని క్షమించు. శృంగార - ఆహార - నిద్రాభంగాలు చేసినవారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను. శాంతించు - అని వేడుకొంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారుడు శాంతించలేదు. శపిస్తాను అంటూ కమండలూదకం చేతిలో పోసుకోబోయాడు.

సూర్యభగవానుడు సంధ్యాదేవీ సహితుడై ప్రత్యక్షమయ్యాడు. వినయంగానూ భయంభయంగానూ పలికాడు - మునీంద్రా! సూర్యాస్తమయం చూసి ధర్మలోపభయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. నీ సుఖాన్ని పాడుచేద్దామనే ఉద్దేశంతో కాదు. కనక క్షమించు. శపించకు. ఆమె పక్షాన నేను శరణువేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట. వారికోపం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసెయ్యగలరట. మళ్ళీ సృష్టించనూగలరట. బ్రాహ్మణుడికన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్నవాడివి. నువ్వే క్రోధవివశుడవైతే ఎలాగ? శాంతించు. శాంతించి శ్రీ కృష్ణపరమాత్మను ఉపాసించు.

సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చల్లారింది. శాంతించాడు. సంధ్యాసూర్యులను ఆశీర్వదించి పంపించాడు.

మనసా! శపిస్తాను అన్నానుకదా! శపించలేను. ప్రతిజ్ఞాభంగమూ చేసుకోలేను. కనక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఈ క్షణంనుంచీ నీకూ నాకూ ఏ సంబంధమూ లేదు. వెళ్ళిపో - అన్నాడు. మనసాదేవికి నెత్తిమీద పిడుగువడినంతపని అయ్యింది. ఏమి చెయ్యడానికీ తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని తన దేవుడు శ్రీహరినీ తన తండ్రి కశ్యపుడినీ సృష్టకర్తనూ స్మరించింది. వెంటనే ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ - అన్నాడు.

బ్రహ్మదేవుడు శ్రీ హరికి పాదాభివందనంచేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్రా! మనసాదేవి పతివ్రత. నీ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించడం ధర్మమేనా? అన్నీ తెలిసినవాడవు. ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి. ఆ తరువాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచి పెట్టు. అపుత్రకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించినవాడి పుణ్యాలు జల్లెడలో నీళ్ళల్లాగా జారిపోతాయి.

బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారువు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు, మంత్రపూర్వకంగా నాభిసంస్పర్శనం చేశాడు. మనసా! నువ్విప్పుడు గర్భవతివయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడూ అవుతాడు. నూర్గురు కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవతలు ఆనందంతో నృత్యంచేస్తారు.

ప్రియా! నువ్వు పతివ్రతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారిణివి, ధర్మిష్ఠవు, కులస్త్రీవి, కులపాలితవు. ఇప్పుడిక సత్పుత్రజనయిత్రివి. ఇంతకన్నా జీవితానికి ఏమికావాలి! సంతృప్తి చెందావుకదా!

మనోహారిణీ! మరొక రహస్యం చెబుతాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే - హరిభక్తిని ప్రబోధించేవాడే. అంతేగానీ అభీష్టసుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాసవిమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయియే అసలైన సోదరి. విష్ణుమంత్రాన్ని ఉపదేశించి విష్ణుభక్తిని ప్రసాదించినవాడే సినలైన గురువు. కృష్ణభావనరూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగి స్త్రీనే గురువు. బ్రహ్మాది స్తంబపర్యంత౦ ఈ చరాచరజగత్తు అంతా ఆ శ్రీకృష్ణపరమాత్మనుంచే ఆవిర్భవిస్తోంది. అతనిలోనే లీనమవుతోంది. ఇది తెలుసుకోవడంకన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పనీ, యజ్ఞాలు ఇవ్వనీ అన్నింటి సారమూ హరిసేవనమే. తత్త్వలన్నింటికీ సారభూతుడు శ్రీ హరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీ స్వామిని కనక. జ్ఞానంవల్ల బంధనాలు తెగిపోతాయి. కనక అదే మన మిత్రం. బంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రుసమానమే. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువుకాదు - రిపువు. బంధనాలు తెంచలేడు కనక శిష్యఘాతకుడు, అటువంటివాడు గురువూ కాదు, తండ్రీకాదు, బంధువూ కాదు. పరమానందరూపమూ అనశ్వరమూ అయిన కృష్ణభక్తిమార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు!

సాధ్వీ! శ్రీకృష్ణుడు అచ్యుతుడు. నిర్గుణుడు. పరబ్రహ్మ అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరీ! ఎదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను. దీన్ని క్షమించు. నీవంటి పతివ్రతలు ఓర్పూ సహనాలకు పెట్టింది పేరు. సత్త్వగుణానికి పుట్టిళ్ళు. అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలకు.

మనసాదేవీ! పుష్కరక్షేత్రంలో తపస్సుకి వెడుతున్నాను. మరింక నీ ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళు. నీకు సుఖమగుగాక! నావంటి నిస్ఫృహుల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనేకదా!

జరత్కారుడి ఉపదేశం మనసాదేవి మనస్సుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలువారుతూనే ఉంది. మెల్లగా కూడదీసుకుని -

ప్రాణవల్లభా! పరిత్యజించవలసినంతటి నేరం నేనేమీ చెయ్యలేదు. నిద్రాభంగం చేశానంటే నీ మంచికోసమే. అయినా పరిత్యజిస్తున్నావు. నీ ఇష్టం. సరే, నాకొక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్యాలి. బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నింటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడికన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు అందుకే.

వైష్ణవులకు విష్ణుమూర్తిమీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైకపుత్రుడిమీద, ఒంటికన్నువారికి ఆ కన్నుమీద దప్పికగొన్నవారికి నీటిమీద, ఆకొన్నవారికి అన్నంమీద, కాముకులకు మైథునంమిద, దొంగలకు పరాయిసాత్తుమీద, కులటలకు జారుడిమీద, పండితులకు శాస్త్రంమీద, వణిజులకు వ్యాపారంమీద ఎంతమోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్తమీద అంత మనసుంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు - అని కాళ్ళమీద వ్రాలి ప్రాధేయపడింది.

జరత్కారుడు మనసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్దచేశాడు. వియోగభీతితో మనసాదేవీ అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికివారే ఊరడించుకున్నారు.

మెల్లగా విడిచి పెట్టి మనసకు ధైర్యంచెప్పి, శ్రీ కృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మనసాదేవి గుండెదిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది.

ఆస్తీక వృత్తాంతం


Manasa Devi Puja - మానసాదేవి పూజ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - మానసాదేవి పూజ

నారదా! ష
ష్ఠీదేవి - మంగళచండికల ఉపాఖ్యానాలు అయ్యాయి. మానసాదేవి వృత్తాంతం ఇక చెబుతున్నాను. ఆలకించు. ఆవిడ కశ్యపప్రజాపతి కూతురు. మానసపుత్రిక. అందుకే మానసాదేవి అన్నారు. మహాయోగీశ్వరి. పరాత్పరుణ్ణి నిరంతరం తన మనస్సులో నిలుపుకుంటుంది. అలాకూడా సార్థకనామధేయ. ఆత్మారామ, వైష్ణవి, సిద్ధయోగిని.

మూడు యుగాలపాటు శ్రీకృష్ణుడికోసం తపస్సు చేసింది. తపోనియమనిష్ఠలు కారణంగా ఆవిడ శరీరంలో శైథిల్యం వర్ణవైక్లబ్యం సంభవించాయి. అది గమనించి శ్రీకృష్ణుడు చమత్కారంగా “జరత్కారు” అని పేరుపెట్టాడు.

జరత్కారు శరీరం చ దృష్ట్వా యత్‌క్షీణమీశ్వరః ।
గోపీపతిర్నామ చక్రే జరత్కారురితి ప్రభుః ॥

కృపానిధి శ్రీహరి మానసాదేవి అభీష్టం తీర్చాడు. తాను స్వయంగా పూజచేసి తక్కినవారితో చేయించాడు. స్వర్గాదిలోకాలన్నింటా పూజలు జరిగాయి. ఆ సుందరీమణిని అందరూ గౌరిగా (గౌరవర్ణంలో ఉంటుంది కనక) ఆరాధించారు. జగద్గౌరి అనే పేరు స్థిరపడింది. కొంతకాలానికి శివుడికి శిష్యురాలయ్యింది. అప్పటినుంచి శైవి అనేపేరు వచ్చింది. మొదటినుంచీ విష్ణుభక్తురాలు కనక వైష్ణవి అయ్యింది. పరీక్షిన్మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసినప్పుడు పాముల ప్రాణాలను కాపాడింది కనక నాగేశ్వరి నాగభగిని అనేపేర్లు సిద్దించాయి. ఎంతటి విషాన్నయినా విరిచివెయ్యగలిగిన సామర్ధ్యం ఉంది కనక విషహర అనే బిరుదును పొందింది. హరుడినుంచి సిద్దయోగం పొందింది కనక సిద్దయోగిని, మరణించినవారిని బతికించకలదు కనక మృతసంజీవని. ఆస్తీకుడనే మునీంద్రుణ్ణి కన్నతల్లి. ఆస్తీకమాత, మహాతపస్విని. మహాజ్ఞాని. జరత్కారుడనే మహామునీంద్రుడికి ఇల్లాలయ్యింది కనక జరత్కారుప్రియ. ఇలా మొత్తం పన్నెండు పేర్లున్నాయి ఈ మానసాదేవికి.

జరత్కారుర్జగ
ద్గౌరీ మానసా సిద్దయోగిని
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తధా ॥

జరత్కారుప్రియాస్తీకమాతా విషహారేతి చ

మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ॥

ఈ పన్నెండు నామాలనూ పూజాకాలంలో పఠించినవారికీ వారి వంశోద్భవులకూ పాములపుట్టమీద పడుకున్నా సర్పభయం ఉండదు. పదిలక్షలసార్లు పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అది కలిగిందంటే అతడు మహావిషాన్ని తిని జీర్ణించుకోగలడు. పాములను అలంకరించుకోగలడు. నాగేంద్రుడిమీద నడుంవాల్చగలడు. నాగవాహనుడూ నాగాసనుడూ నాగతల్పుడూ కాగలడు. జన్మ ముగిసిన తరవాత సరాసరి వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో రేయింబవళ్ళు విందువినోదాలతో క్రీడించగలడు.

ఈ మనసాదేవి ధ్యానశ్లోకాలు సామవేదోక్తాలు. పూజావిధానమూ మూలమంత్రమూ ఉన్నాయి.

శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్‌ ।
వహ్నిశుద్దాంశుకాధానాం నాగయజ్ఞోపవితినీమ్‌ ॥

మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరామ్‌ ।
సిద్దాధిష్ఠాతృ దేవీం చ సిద్దాం సిద్దిప్రదాం భజే


ఇలా ధ్యానించి పుష్పచందనాదులతో పూజించాలి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా ఆనే మూలమంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో జపించాలి. ఆయిదులక్షలు జపంచేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. కలిగిందంటే అతడు సిద్దుడయినట్టే. అతడికి మహావిషంకూడా అమృత ప్రాయమే. సాక్షాత్తు ధన్వంతరిగా లెక్క. సంక్రమణం రోజునగానీ ప్రతినెలా పంచమినాడుగానీ గూఢమందిరాల్లో కూర్చుని ధ్యానావాహనషోడశోపచార పూర్వకంగా మనసాదేవిని అర్చించి ఈ మూలమహామంత్రం జపించాలి. అటుపైని బలిప్రదానం జరగాలి. ఆలా చేసినవారికి ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ది కలుగుతుంది. సత్కీర్తి లభిస్తుంది.

మానసా దేవి కథ


Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...