Thursday, February 5, 2026

Vyasudu Vyakula Chittundai Chinthinchuta - వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

ఈ విధంగా శౌనకుడు మున్నగు మునిచంద్రులు అడుగగా, వారికి సూతమహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఒక మహాయుగంలో భాగాలైన కృతత్రేతాయుగాలు గడచి, మూడోదైన ద్వాపరయుగం పూర్తయ్యే సమయంలో ఒక వృత్తాంతం జరిగింది. ఉపరిచరవసువనే ఒకరాజు ఉండెడివాడు. ఇంద్రుడిచ్చిన విమానంలో ఆకాశంలో సంచరించే వసువు కావున ఆయనకు ఉపరిచర వసువనే పేరు సార్ధకమయింది. ఆయనే వసుమహారాజు. ఆ వసువు తేజస్సువల్ల ఉద్భవించిన కన్య కావున “వాసవి” అనే పేరుతో వాసింక్కింది సత్యవతి. ఆ పవిత్రక్షేతంలో పరాశర మహర్షివల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. ఆయన మహాజ్ఞాని. వేదవిభాగం కావించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధింక్కాడు. సరస్వతీనది ప్రవహించే స్థలంలో ఆయన నివాసం. అదే బదరికాశ్రమం. ఆయన ఒకనాడు ఆ నదీజలాలలో స్నానంచేసి కాలోచిత కర్మలాచరించి పరమపవిత్రుడై ఉన్నాడు. ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చుండి ధ్యానముద్రలో ఉన్నాడు. అంతలో సూర్యోదయమయింది. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన ఆ ఋషి కనబడకుండా కడువేగంతో పరుగుపెట్టే కాలగమనంలో ఏర్పడే మార్పులను గమనించాడు. భూలోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని గ్రహించాడు. యుగపరిణామంవల్ల పాంచభౌతిక శరీరాలలో శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సత్తువలేనివారు, ధైర్యగుణం లేనివారు, ధారణాశక్తి లేనివారవుతారని భావించాడు. అంతేకాదు. అల్పాయుష్ములు అవుతారని, బలహీనులవుతారని నిశ్చయించాడు. తన తపోదృష్టితో అంతా పరీక్షించి సర్వవర్జాలవారికి, అన్ని ఆశ్రమాల వారికి మేలు చేకూర్చాలని నిర్ణయించాడు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులద్వారా, ఆచరించడానికి వీలుండే వైదిక కర్మలద్వారా ప్రజలకు క్షేమంకరాలైన యజ్ఞాలు నిరంతరం కొనసాగాలని దృష్టి నిలిపాడు. అంతవరకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజుస్సు, సామం, అథర్వం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలను పంచమవేదంగా పేర్కొని, వాటికి ప్రామాణ్యాన్ని సంతరించాడు.

పైలుడు ఋగ్వేదం, జైమిని సామవేదం, వైశంపాయనుడు యజుర్వేదం, సుమంతుడు అథర్వవేదం అధ్యయనం చేశారు. నా తండ్రి రోమహర్షణుడు ఇతిహాసాలను, పురాణాలను అభ్యసించాడు. ఈ ఋషులందరు తాము నేర్చుకొన్న వేదాలను వేర్వేరుగా తమ శిష్యులకు బోధించారు. ఆ శిష్యులు అదేవిధంగా తమ తమ శిష్యులకు విభజించి ఉపదేశించారు. ఈ విధంగా భూమండలంపై బ్రాహ్మణసమూహంలో వేదవృక్షం శాఖోపశాఖలై విస్తరిల్లింది.

ఈ విధంగా క్రమక్రమంగా వేదం విభజింపబడి ఏకంగాకాక 
భిన్నభిన్న శాఖలుగా ప్రజ్ఞాపటిమ పూర్తిగాలేని వారిచే ధారణ చేయబడింది. స్త్రీలు, కర్మసంస్కారంలేని శూద్రులు, కర్మసంస్కారమున్నా ఆచరించకుండా వ్యవహరించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వేదాలకు, తద్విహిత ధర్మాలకు దూరంగా ఉండిపోయారు. అటువంటివారికి వేదం శ్రవణయోగ్యం కాదు. కాబట్టి సామాన్యులందరికి మేలు కలిగేలా వ్యాసుడు భారతమనే ఇతిహాసం రచించాడు. విశ్వశ్రేయస్సుకై తానింత చేసినా, ఆయన మనస్సు ఎందుకో సంతుష్టి పొందలేదు. తన అసంతృప్తికి హేతువేమిటోయని ఆయన సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి ఆలోచించసాగాడు. తనలో తాను ఈ విధంగా అనుకొన్నాడు.

కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను. వేదాలను విభజించాను. అగ్నులను వ్రేల్చను. పూజ్యులను గౌరవించాను. శాస్త్రవిహితాలైన కర్మలను ఆచరించాను. వేదార్డాన్ని, దాని ఆంతర్యాన్ని మహాభారతరూపంలో వెల్లడించాను. స్త్రీశూద్రాదులు ఒనరించే ధర్మాలన్నీ వివరించాను. ఇంత చేసినా, నా అంతరాత్మ శాంతి పొందడంలేదు. అయ్యో! నా మనస్సులో అంతరాత్మ పరమాత్మతో ఐక్యం కానట్లు, సంతుష్టుడు కానట్లు తోస్తున్నది. అన్నీ ఒనరించాను. కాని విష్ణువునకు, హరిభక్తులకు అత్యంత ప్రియాన్ని చేకూర్చే భాగవత స్వరూపాన్ని ప్రతిపాదించలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. తెలివితక్కువ పని చేశాను. ఎంత విస్మృతిపాలయ్యాను? అని వ్యాసుడు విచారించే సమయంలో

Shuka Maharshi Shukudu - శుకుడు(శుక మహర్షి)

శుకుడు(శుక మహర్షి)

భాగవతమంటే పుణ్యకీర్తనుడైన జగదీశ్వరుని దివ్యచరిత్రం. ఇది పరబ్రహ్మకు ప్రతిరూపమైనట్టిది. సర్వపురాణాలలోను శ్రేష్టమైనట్టిది. దీనిని పూర్వం విశ్వకల్యాణార్థమై భగవంతుందైన వ్యాసమహర్షి అత్యంత పవిత్రంగా, ఆనందమయంగా, అనురాగపూర్వకంగా విరచించాడు. దీనినంతా తన కుమారుడైన శ్రీశుకునిచే పఠింపజేశాడు. ఈ భాగవతం సమస్త వేదాలసారం. సకల పురాణాల సారాంశం. గంగానదీమధ్యభాగంలో సంసారవిరక్తుడై, సకలమునిగణసమేతుదై, ప్రాయోపవిష్టుడైన పరీక్షిన్మహారాజు ప్రశ్నించగా, ఆ శుకమహర్షి దీన్ని ప్రవచించడం జరిగింది. మునీంద్రులారా! సావధానంగా వినండి.

ధర్మజ్ఞానసమేతుడై శ్రీకృష్ణుడు ఆత్మపదానికి వెళ్లిపోయాడు. కలిప్రవేశంతో పాపమనే చీకటిలో కూరుకుపోయి జనులంతా అంధులైపోయారు. అట్టివారికి ఈ భాగవతం సూర్యునిలా ప్రకాశించి వెలుగులను నింపింది. ఆనాడు బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతూ శుకుడు ఈ భాగవతాన్ని కీర్తనం చేశాడు. ఆ సమయంలో నేను ఆకళింపు చేసుకొన్నదానిని స్ఫురించినంతమేరకు క్రమంగా మీకు వినిపిస్తాను అని సూతమహర్షి పలికిన వెంటనే మునిశ్రేష్ఠుడైన శౌనకుడు ఇలా అన్నాడు.

సూతమునీంద్రా! ఏ యుగవేళలో, ఏ ఉద్దేశంతో, ఏ ప్రదేశంలో, ఈ భాగవతాన్ని వినిపించుమని ఏ శ్రోతలు శుకమహాయోగిని కోరారు. ఏ కారణంచే వ్యాసభగవానుడు బాగా పరిశోధించి లోకవిఖ్యాతంగా పూర్వం దీన్ని రచించాడు? ఆయన కుమారుడైన శుకుడు ఎటువంటి ఆదరంతో పరీక్షిన్న్మహారాజునకు ఈ భాగవత కథ వినిపించాడు? నినంతా మాకు సవిస్తరంగా వివరించి వినిపించు.

పండితశేఖరా! వ్యాసతనూజుడైన శుకుడనువాడు మహాయోగి. సమదర్శి. బ్రహ్మజ్ఞుడు. మాయాతీతుడు. గూఢవర్తనుడు. జ్ఞానశూన్యునిలా వ్యవహరించేవాడు. దూరంగా విసరివేయబడ్డ సంసారదుఃఖం కలవాడు. సంసార క్లేశాలకు దూరంగా ఉండేవాడు. అంతేకాదు.

ధీమంతుడా! ఒకనాడు దేవకాంతలు జలకాలాడుతున్నారు. దిగంబరుడై ఆ దారిగుండా శుకుడు వెళ్లడం వారు చూచారు. అయినా వారు ఏమాత్రం చలించలేదు. కదలలేదు. సిగ్గుపడలేదు. ఒడ్డుకు వచ్చి వస్త్రాలు ధరించలేదు. కాని ఇంతలో కొడుకు వెనుక “ఓ శుకా!” అని అరుస్తూ వస్తున్న వ్యాసులవారిని కూడ చూచారు. ఆయనను చూడడంతోనే ఆ దేవకాంతలు సిగ్గుతో కుంచించుకుపోయారు. గబగబా గట్టుకుచేరి వస్త్రాలు ధరించారు. ఇది ఎంత విచిత్రమో కదా!

అంత దిగంబరుడు, యౌవనం పొడసూపినవాడు అయిన తన కొడుకునుచూచి ఆ దేవకాంతలు వస్త్రధారణ చేయకుండా- వల్కలధారి, అతివృద్దుడు అయిన తనను చూచి చీరలు చుట్టుకొన్న వారిని చూచి, దానికి కారణమేమని వ్యాసుడు ప్రశ్నించాడు. అప్పుడు వారు “నీ తనయునికి స్త్రీపురుషులనే భేదభావం ఏ కోశానా లేదు. ఆయన నిర్వికల్పుడు. నీలో ఆ భేదభావం ఇంకా పోలేదు. అందువల్ల నీ కొడుకునకూ, నీకు ఎంతో తేడా ఉంది” అని అన్నారు కదా! అటువంటి శుకయోగి కురుజాంగల దేశాలలో ఎలా అడుగుపెట్టాడు? హస్తినాపుర పౌరులు ఆయనను ఎలా గుర్తించగలిగారు? పిచ్చివానివలె, మూగవానివలె, మందునివలె కనబడే ఆ మహర్షియైన శుకయోగికి, రాజర్షియైన పరీక్షిత్తునకు సంవాదరూప సంభాషణ ఎలా చేకూరింది? ఒక సుదీర్ధ గాథగా చెప్పడానికి వీలైన భాగవత పురాణ ప్రవచనం ఏ రీతిగా సాగింది? ఆ శుకుడు గృహస్థుల ఇండ్లలో ఆవుపాలు పిండేటంతకాలం మాత్రమే నిలుస్తాడని, ఆయన గోదోహనమాత్రకాలం ఎక్కడెక్కడ ఉంటాడో ఆ ప్రదేశాలన్నీ పుణ్యతీర్థాలవుతాయని వచిస్తారు. అట్టి మహర్షి అన్నిరోజులు ఒకేచోట ఎలా ఉండిపోయాడు? భక్తశిఖామణియైన పరీక్షినృపమణి ఎలా జన్మించాడు? ఏయే కృత్యాలు ఆచరించాడు? ఆ విశేషాలన్నీ సవివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.

ఆ పరీక్షిత్తు సాధారణ మానవుడు కాదు కదా! ఏ రాజు తన పరాక్రమంతో పాండవాన్వయ బలధైర్యాలు, కీర్తిప్రతిష్టలు వర్ధిల్లునట్లుగా పరిపాలన సాగించి జీవించాడో, శత్రురాజేంద్రులు బంగారు ధనరాసులను తీసుకొనివచ్చి కప్పం చెల్లించి ఏ చక్రవర్తి పాదద్వంద్వాన్ని సేవించారో, ఏ వీరుని తండ్రియైన అభిమన్యుడు కర్ణద్రోణాది వీరులచే పరిరక్షితమైన పద్మవ్యూహాన్ని చీల్చి చెండాడినాడో, ఎవని పితామహుడైన అర్జునుడు భీష్మాధిపత్య రక్షితమైన కౌరవ సైన్యాన్ని ఛిన్నాభిన్నంచేసి గోగణాన్ని మళ్లించాడో, అట్టి అఖండ యశస్సంపన్నుడైన పరీక్షిత్తు విడిచి పెట్టరాని సామ్రాజ్యాన్ని వదలివేసి, గంగానదీ తీరంలో ప్రాయోపవేశంచేసి, ప్రాణాలు అరచేత పెట్టుకొని ఏ కారణంచేత క్రుంగి కృశించి ఉన్నాడు.

ఉన్నత ప్రశస్తితో విరాజిల్లే మానవోత్తములు ఎప్పుడూ ఆత్మసుఖాలను అంతరాత్మలో ఏ కోశాన కోరరు. నిత్యం సమస్త జనానికి ధనసంపదలు, ఐశ్వర్యం, సౌఖ్యం, శ్రేయస్సు చేకూరాలని అభిలషిస్తారు. పరీక్షిత్తు లోకోపకార పరాయణుడు కదా! అతడు వైరాగ్యంతో, శరీరాన్ని త్యజించడానికి ఏల సిద్ధపడ్డాడో కదా!

“మహాపురుషా! అన్ని గ్రంథాల సారాంశాలను గ్రహించావు. పెక్కు భాషలలో పారంగతుడవయ్యావు. పలు రీతులలో గాథలు గొప్పగా వివరిస్తావు. మేమంతా జ్ఞానపారగులమయ్యేలా సర్వం స్పష్టంగా తెలియబేయవయ్యా!” అని శౌనకుడు అడిగాడు.

Parkshith Maha Raja - పరీక్షిత్ మహారాజు

పరీక్షిత్ మహారాజు

పరబ్రహ్మస్వరూపుడు అయిన పరమేశ్వరుడే గరికపోచ నుండి బ్రహ్మపర్యంతం సకలజీవరాశులను సృష్టించాడు. ఆ సృష్టిలో దేవతలు, మానవులు, తిర్యక్కులు (పశుపక్ష్యాదులు), స్థావరాలు (చలనంలేనివి) అనే నాలుగు వర్గాలు ఉన్నాయి. వాటిలో స్త్రీ పురుషభేదాలు, సత్త్వ రజస్తమోగుణ భేదాలు ఏర్పడ్డాయి. మనుష్యజాతిని క్రమబద్ధీకరించడానికి ఆశ్రమధర్మ భేదాలు, వర్ణవిభజనలు, వారి మనుగడకు పురుషార్జాలు నిర్దెశించబడ్డాయి. ఆ పురుషార్జాలను సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని అందించడానికి చతుర్ముఖబ్రహ్మ ద్వారా భగవానుడే వేదాలను వెలువరింపబేశాడు.ఆ జ్ఞానాన్ని నేరుగా పొందడానికి సామాన్యులకు సాధ్యం కాదు కనుక భగవంతుడే వేదవ్యాసునిగా అవతరించి వేదవిజ్ఞానాన్ని ఒకచోట చేర్చి విపులీకరించి, కర్మకాండలతో కూడుకొన్న పూర్వభాగానికి తన శిష్యుడైన జైమినిచే పూర్వమీమాంసాసూత్రాలు వ్రాయించి జ్ఞానభాగమైన ఉత్తర భాగానికి తానే బ్రహ్మసూత్రాలను రచించాడు. అందులోను పూర్వభాగానికి వివరణగా పంచమవేదమనబడే మహాభారతాన్నీ ఉత్తర భాగానికి వివరణగా శ్రీమద్భాగవతాన్ని రచించి, వాటిలో వేదసారాన్నంతా సులభంగా అర్ధమయ్యేటట్లు పొందుపరచాడు.

సృష్టించాలనే సంకల్పం కలిగినపుడు దానికి అనుగుణమైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుని శరీరంలో ఉండే జీవుని చేరి జగత్తును సృష్టిస్తాడు. ఉపసంహారం చేయదలచుకొన్నప్పుడు తమోగుణ ప్రధానమైన శివునిలోనుండే జీవునితో చేరి లయం చేస్తాడు. జగత్తుయొక్క రక్షణ పోషణకార్యాన్ని సత్త్వగుణ ప్రధానమైన విష్ణుస్వరూపంలో నిర్వహిస్తాడు. వేదాలలో నిర్దెశింపబడిన వాసుదేవుడే సృష్టికి పూర్వమందున్న పరమాత్మ భగవానుడు. అతడు సమస్త జీవుల దశేంద్రియ, మనస్సులతోనూ, పంచభూతాలతోనూ కూడి విరాట్‌పురుషునిగా వెలసి, అనిరుద్ధుడు అనబడి, నీటిలో యోగనిద్రలో శయనించి, తన నాభిహ్రదము నుండి పద్మాన్ని సృష్టింపగా, ఆ పద్మంనుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. వేయిశిరస్సులతో, సహస్ర అవయవాలతో దివ్యాభరణాలతో ప్రకాశించే అనిరుద్ధ భగవానుని దివ్యదేహం నుంచి సనకసనందనాది నలుగురు కుమారులు, దేవమానవాదిరూపాలు ఆవిర్భవించాయి. ఆ దేవదేవుడే క్రమేణా కాలానుగుణంగా అనేకమైన అవతారాలెత్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసంస్థాపన, భక్తపాలన వంటి అనేకకార్యాలను నిర్వర్తించాడు. మంత్రద్రష్టలైన మునులు, వ్యాసవశిష్టాది మహర్షులు, దక్షాదిప్రజాపతులు, మనువులు, ఇంద్రాదిదేవతలు మొదలైన వారందరూ ఆ
పరమాత్మయొక్క అంశలచే పుట్టినవారే.

శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలు పరిపూర్ణాలు. తక్కిన అవతారాలు ఒక ప్రత్యేకకార్యార్థమై సంభవించాయి. శ్రీకృష్ణావతారంలో జ్ఞానం, బలం, శక్తి ఐశ్వర్యం, వీర్యం, తేజస్సు మొదలైన భగవంతుని దివ్యమంగళ లక్షణాలన్నీ ప్రకటితమయ్యాయి. అందుకే 'కృష్ణస్తు భగవాన్‌ స్వయం' అని అన్నారు.

ఈ స్టూలజగత్తే కాకుండా మనోబుద్ధి అహంకారాలతో కూడుకొన్న సూక్ష్మదేహాలు కూడా భగవంతుని
మాయచే ఏర్పడ్డాయి. ఆయన అవతారలీలారహస్యాలు పరిమితమైన మానవమేధాశక్తికి, తర్కహేతుచర్చలకు అంతుబట్టవు. ఆయన పాదపద్మాలను శరణు వేడినవారికి మాయపొరలు తొలగి మర్మం తెలుస్తుంది. సకల వేదసారాన్ని వ్యాసుడు, తన కుమారుడు శ్రీశుకదేవునికి బోధించాడు. శుకమహర్షి పరీక్షిత్తునకు, అక్కడ ఉన్న ఋషులకు వినిపించాడు. అక్కడ ఈ పరమపవిత్రమైన భాగవతగాథను వినే అదృష్టం నాకు దక్కింది. నా శక్తిమేరకు నేను విన్నదానిని మీ అందరికీ వినిపిస్తాను” - అని సూతమహర్షి శౌనకాది మహామునులకు వివరించాడు.

“పూర్వం ఉపరిచరవసువు వలన జన్మించిన సత్యవతికి పరాశరమహర్షి వల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. అతడు కలియుగంలోని ప్రజల దుస్థితిని ధ్యానావస్టలో గమనించి, వారికి తేలికగా అర్ధం కావడానికి వేదాలను నాలుగుగా విభజించి ఋగ్వేదాన్ని పైలునకు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, అధర్వవేదాన్ని సుమంతునకు అప్పగించి వాటిని తమ తమ శిష్యులకు బోధిస్తూ భద్రపరచాలని ఆదేశించాడు. పురాణేతిహాసాలను సూతుని తండ్రి అయిన రోమహర్షణునికి అప్పగించాడు. వేదాలను గ్రహించలేనివారికి మహాభారతాన్ని పంచమవేదంగా చతుర్వేదసారంగా భగవద్గీతను ఇమిడ్చి, సులభగ్రాహ్యంగా రచించాడు.
బ్రహ్మసూత్రాలనూ వ్రాశాడు. ఇన్ని అనన్యసాధ్యమైన గొప్ప గ్రంథాలు వ్రాసినా వ్యాసుడు అశాంతితో వ్యాకులచిత్తుడై ఉండగా ఒకనాడు దేవర్షి నారదుడు వచ్చి వ్యాసుని ఊరడించి ఇలా అన్నాడు - “ఓ మహానుభావా! వేదవ్యాసా! నీవు అనేక వేదపురాణ శాస్త్ర ఇతిహాసాదులను అనన్యసాధ్యంగా లోకులకు అందించి ఎనలేని సేవ చేశావు. భారత మహాగ్రంథంలో ప్రసంగవశాన భగవానుని గుణగణాలను పేర్కొన్నావే కానీ ప్రధానంగా దేవదేవుని గాథధాగుణగణాలను కీర్తించలేదు. భగవత్స్వరూపలీలాగుణవైభవాలను నుతించని గ్రంథం ఎంత గొప్పదయినా అది నిస్సారమయింది. అట్టివాటిని పరమహంసలయిన పరమభాగవతోత్తములు ఎవ్వరూ ఆదరించరు. ప్రజలకు భక్తిని కలిగించలేని కర్మ దుఃఖహేతువే కాని ఫలప్రదంకాదు. భగవద్బక్తిని కలిగించని పురుషార్ధసాధనలు మోక్షప్రదాలు కావు. భగవంతునికి సమర్పితంకాని కర్మఫలాలు తాత్కాలికాలు అనర్ధాన్ని తెచ్చిపెట్టేవి. సుఖశాంతులను కలిగించవు. కాబట్టి ఓ వ్యాసమహర్నీ! సకల వేదశాస్త్ర జ్ఞాననిధివైన నీవే భగవానుని దివ్యలీలాగాథలను వివరించడానికి సర్వసమర్థుడవు. నీ రచనలను చదివినవారికీ, విన్నవారికీ మోక్షం లభిస్తుంది. నీవు భగవంతుని నామసంకీర్తన లీలాగుణ వైభవగాథలతో కూడి భక్తిని ప్రతిపాదించే కావ్యాన్ని రచిస్తే పరమశాంతిని ఆనందాన్ని పొందగలవు” అని ఉపదేశించి నారదమహర్షి అందుకు తార్కాణంగా తన పూర్వజన్మవృత్తాంతాన్ని వివరించి నిష్క్రమించాడు.

ఆ తరువాత వ్యాసుడు తన 'శమ్యాప్రాసము' అనే ఆశ్రమంలో ధ్యానమగ్నుడై పరమదేవుని దర్శించి, ఆయన అధీనంలో ఉన్న మహామాయను దాటుకొని, భగవదనుగ్రహం పొందడానికి భక్తియే సాధనమని గ్రహించి శ్రీమహాభాగవత సంహితను రచించి తన పుత్రుడైన శుకయోగికి వివరించాడు అని సూతుడు శౌనకాది మునులకు ఇట్లు చెప్పసాగాడు.

పరీక్షిత్తుయొక్క జన్మనుగూర్చి, ముక్తినిగూర్చి, పాండవుల మహాప్రస్తానాన్ని, శ్రీకృష్ణకథోదయాన్ని మీకు వివరిస్తాను. మహాభారతయుద్ధంలో చివరిరోజు భీముని గదదెబ్బతో తొడలు విరిగి చచ్చేందుకు సిద్ధంగా ఉన్న దుర్యోధనుని దురవస్థచూచి అశ్వత్థామ విచారంతో అతనికి ప్రియం కలిగించడానికి రాత్రి పాండవళిబిరంలో దూరి గాఢనిద్రలో ఉన్న ద్రౌపదీపుత్రులైన అయిదుగురు ఉపపాండవుల తలలునరికి దుర్యోధనునికి చూపి సంతృప్తిపరచాడు.

ఈ ఘోరవార్తను విన్న అర్జునుడు కలతజెంది శ్రీకృష్ణుని తోడ్కొని అశ్వత్థామను బంధించి తెచ్చి, ద్రౌపది కోరికపై వానిని చంపకుండా అతని తలపైనున్న శిరోమణిని తీసివేసి, తల గొరిగించి విడిచిపెట్టాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజును పట్టాభిషిక్తునిజేసి, అతనిచే అశ్వమేధయాగాలను చేయించి, అపాండవం చేయాలనే సంకల్పంతో అశ్వత్తామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం బారినుండి ఉత్తరగర్భంలోని శిశువును రక్షించాడు. ఆ బాలుడే పరీక్షిత్తు.

భారతయుద్ధంలో జరిగిన అపారజననష్టంగూర్చి దుఃఖిస్తూ శ్రీకృష్ణవ్యాసనారదాదులు ఎంత సముదాయించినా ధర్మరాజు శోకబుద్ధితో తపించిపోతుంటెే, అంపశయ్యపై శయనించి దేహత్యాగానికి సిద్ధంగా ఉన్న భీష్మునివద్ద శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో అపారలోకానుభవ విషయాలు, శాస్త్రజ్ఞానసంగతులను తెలుసుకొన్నాడు. పాండవులవద్ద కొన్నాళ్లు గడిపి, వారినందరినీ ఒప్పించి శ్రీకృష్ణపరమాత్మ హస్తినాపురం నుండి ద్వారకకు వెళ్లిపోయాడు.

తరువాత కొన్నాళ్లకు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని పరిసమాప్తం కావించాడని తెలుసుకొన్న ధర్మరాజాదులు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి, మహాప్రస్థానం చేశారు.

తదనంతరం పరీక్షిత్తు ధర్మమార్గం తప్పకుండా జనరంజకంగా, ధర్మబద్దుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఉత్తరాభిమన్యుల పుత్రుడైన పరీక్షిత్తు అనబడే విష్ణురాతుడు పరమభాగవతోత్తముడై, సద్గుణసంపన్నుడై, పరాక్రమశాలియై కృపాచార్యుల ఆధ్వర్యంలో మూడు అశ్వమేధయాగాలు నిరాటంకంగా జరిపించగా, దేవతలు నిజరూపాల్లోనే వచ్చి హవిస్సులను అందుకొన్నారట. అతడు తన మేనమామ అయిన ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడి జనమేజయుడు మొదలైన నలుగురు కుమారులను పొందాడు. పరీక్షిత్తు దిగ్విజయ యాత్రచేసి
భద్రాశ్వ, కేతుమాల, ఇలావృత, రమ్యక, హిరణ్మయ, హరివర్ష, కింపురుష, భారతాది వివిధ దేశాలను జయించాడు.

ఆయాదేశాలలోని ప్రజలు, పండితులు పఠిస్తూ ఉండే పూర్వరాజుల చరిత్రలను వింటూ, ఆ కథలద్వారా పాండవులకు శ్రీకృష్ణుడు చేసిన సహాయాలు, వాసుదేవుని పాదపద్మాలపట్ల పాండవులకు ఉండే భక్తివిశేషాలను తెలుసుకొంటూ పరమాత్మునిపట్ల అంకితమైన పవిత్రభక్తితో పరవశిస్తూ పుణ్యాత్ముడై జీవిస్తూ ప్రజలను కంటికిరెప్పలా కాపాడేవాడు. ఒకసారి పరీక్షిత్తు దేశాటనం చేస్తుండగా రాజువేషాన్ని ధరించిన ఒక అనాగరికుడు ఒంటికాలితో ఉన్న ఒక ఎద్దును, కన్నీరు కారుస్తున్న ఒక గోమాతను కాలితో తన్నుతూ అదలించడం చూసి వాడే కలిపురుషుడని,
వృషభాన్ని ధర్మమూర్తిగాను, ఆవును భూమాతగాను గ్రహించి మెరపువేగంతో కత్తిదూసి కలిపురుషునిపైకి లంఘించాడు. అపుడు భయవిహ్వలుడైన కలిపురుషుడు పరీక్షిత్తుని పాదాలపైబడి శరణు వేడుకోగా, ఆయన కనికరించి “ఓయీ! నీవు నీచాత్ముడవు. రాజవేషం ధరించావు గాని నీలో అన్నీ పాపప్రవృత్తులే గోచరిస్తున్నాయి. అసత్యలోభ దౌర్జన్య చౌర్య దురాచార కపట మాయా కాలుష్యాది అవగుణాలన్నీ నిన్ను ఆశ్రయించి ఉన్నాయి. నీవల్ల నా ప్రజలు అనేకబాధలకు గురి అవుతారు. కనుక నీవునా రాజ్యంలో ఎక్కడా కనిపించరాదని శాసిస్తున్నాను”
అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత వృషభమూర్తికి లోపించిన 'తపం - శౌచం - దయి అనే మూడు పాదాలను పునరుద్ధరించి, భూమాతకు ఆనందం కలిగించి, కలిపీడ లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు. అలాంటి పరీక్షిత్తుని రాజ్యకాలంలోనే మీరు వేయి సంవత్సరాలపాటు చేయసంకల్పించిన ఈ సత్రయాగాన్ని ప్రారంభించారు అని సూతుడు శౌనకాది మహామునులకు వివరిస్తూ ఇంకా ఇలా చెప్పాడు.

ఈ విధంగా కలిని నిగ్రహించి, జనహితంగా చాలాకాలం రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిన్మహారాజు అరణ్యానికి వేటకై వెళ్లి అనేక జంతువులను వేటాడి ఆకలిదప్పికలతో అలసి సొలసి, ఎంత వెదికినా నీటిచుక్కైనా దొరకని స్థితిలో శమీకమహామునియొక్క ఆశ్రమంలో ప్రవేశించి, 'దాహం దాహం కొంచెం నీరివ్వండి' అని బిగ్గరగా ఎంత అరచినా ఎవరూ పట్టించుకోలేదు. ధ్యానమగ్నుడై ఉండడంవల్ల శమీకమహర్షికి ఏమీ వినిపించలేదు. దాహంతో గొంతెండి, నాలుక పిడుచకట్టుకుపోతుండగా దాహబాధను తట్టుకోలేక కదలక మెదలక ఉన్న మునిని చూచి
రోషావేశంతో, విధివశుడై బయట చచ్చిపడి ఉన్న పామును తెచ్చి శమీకుని మెడలోవేసి వెళ్లిపోయాడు. ఇది చూచిన ఇతర బాలురు, శమీక మహాముని పుత్రుడైన శృంగితో చెప్పగా అతడు, సర్వం తెలుసుకొని క్రోధావేశపరుడై నా తండ్రి మెడలో మృతసర్పాన్ని వేసి అవమానించినవాడు నేటికి వారం రోజులలో తక్షక సర్పదష్టుడై మరణిస్తాడు' గాక అని శపించాడు.

సమాధినుండి లేచిన శమీకముని జరిగినదంతా తెలుసుకొని మిక్కిలి విచారిస్తూ శృంగితో ఇలా అన్నాడు. “నాయనా! ఎంతపని చేశావురా. ఇంత చిన్న తప్పుకే అంత కఠోరమైన శాపాన్ని ఇస్తావా? తల్లి కడుపులోనే దగ్దం కావలసిన రాజును శ్రీహరియే రక్షించాడు కదా. వాసుదేవుడు నిష్క్రమించిన తరువాత అరాచకం ప్రబలిపోకుండా ఈ రాజే దేశాన్ని కాపాడి సమర్థవంతంగా సంరక్షిస్తున్నాడు. అలాంటి ధర్మాత్ముడైన రాజు లేకపోతే జరిగే అనర్జాల పాపం మనకు చుట్టుకోదా? తొందరపాటుతో ఎంత చెడ్డపని చేశావురా తండ్రీ!” అని మందలించి, విచారించి ఒక మునిబాలుని పిలిచి ఈ శాపవార్తను మహారాజుకు తెలిపిరమ్మని పంపించాడు. శాపవార్తను తెలుసుకొన్న పరీక్షితుడు జరిగినదానికి విచారించి, దైవసంకల్పాన్ని ఎవరూ తప్పించుకోలేరని భావించి, తనకు మరణకాలం
సమీపించిందని గ్రహించి, తన హృదయాన్ని గోవిందునిపై లగ్నంచేసి సకలరాజ్యభోగాలను విడిచిపెట్టి, సర్వసంగపరిత్యాగియై, విష్ణుపదియైన గంగానది ఒడ్డున, దర్భాసనం మీద కూర్చొని నిశ్చలభక్తితో ధ్యానిస్తున్నాడు.

ఈ విధంగా పాండవపౌత్రుడైన పరీక్షిత్తు శ్రీమహావిష్ణువుయొక్క చరణారవింద సంస్మరణకందళిత
హృదయారవిందుడై గంగానది తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్న విషయం తెలుసుకొన్న అత్రి, విశ్వామిత్ర, వశిష్ట, భృగు, వ్యాస, భరద్వాజ, పరశురామ, దేవల, మైత్రేయ, కణ్వ, అగస్త్య, నారదాది పరమపావనులైన బ్రహ్మర్షి రాజర్షి దేవర్షి పుంగవులు అనేకులైన ఋషిసత్తములు శిష్యప్రశిష్యులతో వచ్చారు. పరీక్షిత్తు వారందరికీ దండప్రణామాదులాచరించి, ఆనందబాష్పాలతో చేతులు జోడించి “ఓ దయామూర్తులైన తపోధనులారా! మీరు సమస్త పాపరాశిని భస్మం చేయగల పుణ్యాత్ములు మీ పాదరజం సోకగానే నేను ధన్యుడనయ్యాను. నా పాపం పరిహారమయ్యే మార్గం సెలవియ్యండి. ఈ సంసారసాగరంలో మునిగితేలుతున్న నాకు ఈ విప్రశాపమే ఒక వరం అయ్యేటట్లు భావిస్తున్నాను. ఈశ్వరసంకల్పం అనివార్యం. రాబోయే ప్రతి జన్మలోను శ్రీకృష్ణచింతనపట్ల ఆసక్తి, శ్రీకృష్ణగాథా శ్రవణానురక్తి, శ్రీకృష్ణదరణసరోజాలపట్ల భక్తి కలిగేట్లు అనుగ్రహించండి. నా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని గోవిందుని లీలలు గానం చెయ్యండి, భాగవతోత్తముల చరిత్రలను వినిపించండి, ఏడురోజులలో నాకు ముక్తి కలిగే మార్గమేదో చూపించండి” అని వేడుకొని, తన కుమారుడైన జనమేజయునికి రాజ్యభారం అప్పగించాడు.

పరీక్షిత్తుని హరిభక్తికి సంతోషించిన ఆ మహామునులందరూ వారంరోజుల గడువు దాకా తాము అక్కడే ఉంటామన్నారు. ఏడుదినాలలో ముక్తిని పొందే మార్గమేదైనా ఉందా? అని అన్వేషించసాగారు.

అంతలో దైవయోగంచేత, పదహారేళ్ల బాలునివలె కనిపిస్తూ, దిగంబరుడైన ఒక అవధూత అక్కడికి వచ్చాడు. అతనిని మహాయోగివరేణ్యుడు, వేదవ్యాస కుమారుడైన శ్రీశుకదేవునిగా గుర్తించి అక్కడ ఉన్న మహర్షులందరూ గౌరవసూచకంగా లేచి ఆయనను ఆహ్వానించారు. పరీక్షిత్తు ఎదురేగి, ప్రణమిల్లి, సత్కరించి, ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఆయన పాదాలపై వాలి ఇలా అన్నాడు.

"ఓ యోగీంద్రా! నేడెంత సుదినం. నా అదృష్టవశంచేత మీరు వచ్చారు. ఎక్కడా ఆవుపాలు పితికే సమయంకంటే ఒకచోట ఆగని మీ దర్శనంకంటే మాబోటి వారికే ఏమికావాలి? శ్రీకృష్ణపురమాత్మయే మిమ్మల్ని ఇక్కడికి పంపించి ఉంటాడని నా నమ్మకం. నా సమస్యకు పరిష్కారమార్గం చూపగలవారు మీరే. తాము నాపట్ల అనుగ్రహముంచి వారం రోజుల వ్యవధిలో వైకుంఠధాముని చేరే దారి చూపించండి. ఎల్లప్పుడూ మానవుడేమి చేస్తుండాలి. ఏమి వింటూ ఉండాలి. దేనినిగూర్చి ఆలోచిస్తూ ఉండాలి. మరణానికి చేరువలో ఉన్న నేను ఇప్పుడేమి చెయ్యాలి. దేనిని పరిత్యజించాలి. సరియైన మార్గాన్ని ఉపదేశించి నన్ను తరింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని పరీక్షిత్తు శ్రీశుకదేవులవారిని వేడుకొన్నాడు అని సూతుడు శౌనకాది ఋషులకు చెప్పాడు.


శుకుడు(శుక మహర్షి)

Sree Maha Bhagavathamu - శ్రీ మహా భాగవతము

 శ్రీ మహా భాగవతము

పోతన భాగవతము ప్రథమస్కంధము





వ్యాసునికడకు నారదుండు వచ్చుట

నారదుని పూర్వజన్మవృత్తాంతము

అర్జునుండు వుత్రఘాతియగు అశ్వత్థామ నవమానించుట

ద్రొపది యశ్వత్థామను జూచి సంభాపించుట


కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

ధర్మజుండు శ్రీ కృష్ణసహితుండై భీష్మునికడ కేగుట

భీష్ముండు శ్రీకృష్ణుని స్తుతించుట


శ్రీకృష్ణుడు ద్వారకానగరంబు ప్రవేశించుట












శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట

Pothana Bhagavathamu Prathama Skandhamu - పోతన భాగవతము ప్రథమస్కంధము

పోతన భాగవతము ప్రథమస్కంధము

ఎవని కారణంగా అన్నిలోకాల పుట్టుక, ఉనికి, వినాశం జరుగుతూ ఉందో, అనుసరించుటచేత, వెనుదిరుగుటచేత అన్ని పనుల్లో అంతా తెలిసినవాడై, అన్నింటికి తానే ప్రభువై, ఎవడు సంకల్పమాత్రంచేత నాలుగు వేదాలు బ్రహ్మదేవునికి తెలియచెప్పాడో, ఎవనిపట్ల పండితులంతా పరమప్రీతితో ఉంటారో, ఎవనియందు సత్వరజస్తమోగుణాలవల్ల ఏర్పడినసృష్టి నీళ్ళు, ఎండమావులు, గాజు మొదలగు వాటిలో తాను కలిసి మెలిసి ఉన్నట్లు తోచేవిధంగా ప్రకాశించి, ఇదిసత్యమేమో అన్నట్లు అగుపిస్తూ ఉందో, తన శక్తితో మాయను తొలగించుకొన్నవాడెవడో - ఆలాంటి పాపరహితుని, సత్యస్వరూపుని, పరబ్రహ్మాన్ని ప్రతిదినం నేను కోరి స్మరిన్తాను.

“సత్యం పరం ధీమహి” అనే గాయత్రీమంత్రంతో ప్రారంభమైనందువల్ల గాయత్రీ పరదేవతాస్వరూపమైనదై, గాయత్రిని మించి విరివిగ ధర్మాలు, వృత్రాసురవధ ఏ గ్రంథంలో వివరింపబడునో అది భాగవతమని మత్స్యపురాణం చెప్పినందువల్ల ఈ పురాణం భాగవతమనే పేరుతో ప్రసిద్ధి పొందింది.

యత్రాధికృత్య గాయత్త్రీం, వర్ణ్యతే ధర్మవిస్తరః,
వృత్రాసురవధోపేతం తద్భాగవతమిప్యతే

అని మత్స్యపురాణం.

గాయని, గాయత్రిని మించి ధర్మాలను విరివిగ వివరించి, వృత్రాసురవధతో కూడి ఉంటే దానిని భాగవతం అంటారు. “జన్మాద్యస్య... సత్యం పరం ధీమహి” అని వ్యాసమహర్షి చెప్పిన ప్రథమశ్లోకంలోని గాయత్రీమంత్ర పదాలద్వారా ఆ పరతత్త్వ స్మరణ జరిగింది. ప్రధానంగా మోక్షధర్మం, ఇతర ధర్మాలు గ్రంథం నిండా మెండుగా ఉన్నాయి. షష్టస్కంధంలో వృత్రాసురవధ ఉంది. అందువల్ల మత్స్యపురాణం చెప్పినట్లు ఈ పురాణగ్రంథం భాగవతంగా పేరొందింది.

ఈ భాగవతం ముముక్షువులకు ఆనందం కలిగించేది. వేదవ్యాస మహర్షి రచించినది. దీనిని భక్తితో వినగోరేవారి నిర్మలహృదయాలలో భగవంతుడు నివసిస్తాడు. అంతేకాని కుతర్కవాద శాస్త్రాలవల్ల మాత్రం ఆయన లోబడడు. మంచివారు, అసూయ లేనివారు, కర్మఫలితాలపై అపేక్ష లేనివారు, సంసారంలో ప్రవర్తింపజేసే కోరిక లేనివారు, ఒక్క తత్త్వదర్శనమందు మాత్రమే ఇచ్చ కలవారు దీనియందు ఎప్పుడూ మనస్సును నిలిపి ఉంచాలి. అందువల్ల తాపత్రయం నశిస్తుంది. ఈ 
గ్రంథంలో పరమపురుషార్థమైన మోక్షం తెలియజేయబడుతుంది. అదే మిక్కిలి ఆనందదాయకం. సత్తు అసత్తుగాక, వ్యక్తం అవ్యక్తం కాక అంతటా ప్రకాశించే పరమాత్మను ఇందులో తెలుసుకోతగును.

ఈ భాగవతం ఒక మహాఫలం. అది వేదమనే కల్పతరువునుంచి బాగా పండి తనంతట తాను రాలి క్రిందపడింది. దానినీ చిలుక ముట్టుకోగా అమృతరసంతో కూడుకొని ఉంది. ఆ ఫలరసాన్ని రసజ్ఞులు, తత్త్వ
జ్ఞులు తనివితీరా గ్రోలెదరుగాక!

ఈ విశ్వంలో చాలా అడవులు ఉన్నాయి. కాని నైమిశారణ్యం మిక్కిలి స్తుతించదగింది. శుభప్రదమయింది. అది మునిగణంచే వాసికక్కింది. పుష్పఫలసమృద్ధితో వృద్ధి పొందించబడిన ద్రవ్యరాశి కలది.

ఆ నైమిశారణ్యం లక్ష్మీదేవితోను, మన్మథునితోను వాసికెక్కిన మధుసూదనుని వైకుంఠ భవనంలా, శారదాదేవితో కూడుకొన్న బ్రహ్మదేవుని సత్యలోకంలా, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, చంద్రుడు, ఏకాదశరుద్రులు, పార్వతి, కుబేరుడు, నంది, గాలవుడు, శాండిల్యుడు, పాశుపతులు, జటాధారులు మున్నగువారితో కూడుకొన్న మహేశ్వరుని కైలాస సభామండపంలాగా, ఐరావతం, అమృతం, రంభాద్యప్సరసలు మొదలగువారితోనున్న బలసూదనుని సుధర్మాపీఠంలా, రక్కసుల గుంపులతోకూడియున్న మురుడనే రాక్షసుని నివాసంలా, శంఖపద్మకుందముకుందాది నవనిధులతో భాసిల్లే కుబేరుని నిలయంలా, నిరంతరం బాణాగ్ని జ్వాలలతో దీపించే శ్రీరామచంద్రుని సంగరరంగంలా, కార్తవీర్యార్జునుని సంహరించిన భార్గవరాముని సంగ్రామభూమిలా, అరిష్టజంభనికుంభాదిశక్తులతో కూడియుండే రాక్షసుల యుద్ధరంగంలా, ద్రోణార్జునుల బంగారు రథాలతో రాజిల్లే కురుక్షేతయుద్ధంలా, శల్యుని సహాయంతోకూడిన కర్ణుని కయ్యంలా, నలనీలపనసాది వానరులచే కొనిరాబడ్డ శిలలచే శోభిల్లే రామసేతువులా, అక్షరమైన అక్షయఫలంతో కూడిన ముక్కంటి సేవలాగా, పున్నాగపుష్పాలు, తుమ్మెదలు కలసి ప్రకాశించే మన్మథుని చెఱకువిల్లులా, గొప్పజూలు, వాడిగోళ్లు కలిగిన నరసింహుని అవతారంలా, నటనటీ వాద్యయుక్తమైన రంగస్థలంలా, చందన కర్పూర తిలకంచే అలంకరించబడే పార్వతీదేవి ఫాలభాగంలా, ఇంద్రధనుస్సుతోకూడి మేఘాలతో, వడగండ్లతో కలసిన వానయొక్కరాకలా, గాయత్రీమంత్రంచే పరమపవిత్రమైన వేదంలా, తేలికయైన లలితమైన పదప్రయోగంతో రచించబడిన మహాకవి ఉత్తమకావ్యంలా, గరుత్మంతునిచే ప్రకాశించే తల్లియైన వినతాదేవి మందిరంలా, దేవతలతో విలసిల్లే దేవేంద్రుని రాజధానియైన అమరావతీనగరంలా, మధువనే రాక్షసుని సహకారంతో కూడుకొన్న కైటభుని అధికారంలా, మోక్షఫలాన్ని ప్రసాదించే శ్రీమహావిష్ణువు కైంకర్యంలాగా, ఆకాశాన్నంతా శరాలతో కప్పివేసే అర్జునుని యుద్ధవిహారంలా, నందకపుండరీక సహితమైన వికుంఠనగరంలా, కృష్ణుని బాల్యక్రీడలచే శోభిల్లే నందుని వ్రేపల్లెలా, శ్రీరాముని ధర్మపత్నియైన సీతను అపహరించిన రావణుని లంకాపురిలా, గజగవయ శరభాది వానరులతో కూడియుండే సుగ్రీవుని సైన్యంలాగా, శివుడు, ఇంద్రుడు, భరద్వాజుడు, తిత్తిరి - ఇత్యాదులచే భాసిల్లే నారాయణుని ఆస్థానంలా, భీమధర్మరాజ దుర్యోధనాది శకుని నకుల సంయుక్తంబైన మహాభారతంలా, ఎడతెగక సాగిపోయే సూర్యరథ సంచారంలా, యావత్ప్రజానీకానికి మంచి మనస్సును ప్రసాదిస్తూ సంధ్యాసమయంలా ప్రకాశిస్తుంది. దానికే విష్ణుక్షేత్రమని పేరు.

అందు శౌనకాది మహర్షులు శ్రీమహావిష్ణువును పొందగోరి వేయిఏండ్ల కాలపరిమితిగల సత్రయాగాన్ని ఆచరిస్తున్నారు. ఒకనాడు వేకువజాముననే లేచి వారు నిత్యనైమిత్తికాదులు పూర్తి చేసుకొన్నారు. ఆ సమయంలో ఆ పుణ్యనైమిశారణ్యానికి సూతమహర్షి విచ్చేశారు.  మునీశ్వరులందరు ఆయనకు సుఖాసనం కూర్చి యథావిధిగా అర్చనలు గావించారు. అనంతరం ఆయనను ఇలా ప్రశ్నించసాగారు.

సూతుడు గురువైన వ్యాసునివల్ల విశేషమైన జ్ఞానం నేర్చుకొన్నాడు. ఆ జ్ఞానంద్వారా అన్ని పురాణాల సారాంశాన్ని విశేషంగా తెలుసుకొన్నాడు. శ్రీహరి సద్గుణాలను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉంటాడు. అపారకృపాగుణం కలవాడు. అట్టి సూతమహర్షిని తాపసులు ఇలా ప్రశ్నించారు.

పండితులలో శ్రేష్టడవైనవాడా! విశేషవిజ్ఞానంతో పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు మొదటినుంచి ప్రవచించినవాడవు. వ్యాసాది ప్రముఖులు, మహర్షులు, ధీమంతులు ఏ రహస్యాలను దర్శించారో, అవన్నీ నీ మనస్సులో స్ఫురిస్తాయి. వారి అనుగ్రహంవల్ల నీ బుద్ధికి తోచనిదంటూ ఏమీలేదు.

సద్గురువులు ప్రియ శిష్యులకు మిక్కిలి గోప్యాలైన విషయాలను కూడ తేటతెల్లం చేస్తారు. కాబట్టి ఈ లోకంలో సకల మానవులకు శాశ్వతానందాన్ని చేకూర్చిది ఏది ఉందో, దాన్ని బాగా పరిశీలించి మాకు ఉపదేశించు.


మహర్షీ! నీవు చాలాకాలం జీవించావు. పురాణాలలోని పరమార్థం గ్రహించావు. వినదగినవన్నీ విన్నావు. గురువులను సేవించి సత్ప్రసంగాలలో పాలు పంచుకొన్నావు.

ఋషిసత్తమా! ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు. దేనిలోనూ బుద్ధిపూర్వకంగా చొరవ చూపించలేరు. అల్పమైన ఆయుస్సు కలవారు. అనేకవిధాలైన రోగాలతో బాధలుపడేవారు. భగవద్‌ జ్ఞానసంపదలో అల్పులు. సత్కార్యాలు ఏవీ చేయలేనివారు. కాబట్టి అన్నివిధాలా ఆనందం దేనివల్ల చేకూరుతుందో ఆత్మకు ప్రశాంతి దేనివల్ల లభిస్తుందో దానిని మాకు అనుగ్రహించండి.

పవిత్ర చరిత్రగల ఓ సూతమహర్షీ! ఏ మహానుభావుని అవతారం సమస్తప్రాణులకు ఆనందం, అభివృద్ధి కలిగిస్తుందో, ఏ పవిత్రనామాన్ని పదేపదే పలకడంద్వారా చావుపుట్టుకలు దూరమవుతాయో, ఏ చరిత్రను హృదయంలో భావించినంత మాత్రాన మృత్యుదేవత భయపడి పరుగులు తీస్తుందో, ఏ దివ్యమూర్తి పాదాలనుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంతనే సమస్తకల్మషాలు దూరమవుతాయో, ఎవరి చరణాలను శరణువేడి భక్తులు తాపశాంతిని పొందుతారో, దేవకీ వసుదేవులకు ఎవడు ముద్దువిడ్డగా జన్మించాడో, అట్టి వాసుదేవుని కథలు వినాలనే సంకల్పంతో ఉన్నాము. అవన్నీ మాకు వినిపించు.

శ్రీ మహావిష్ణువు కల్యాణగుణాలను గూర్చి అధికంగా చేసే సంభాషణలు సరస్వతీదేవికి ఆభరణాలు. కల్మషవినాశకాలు. మృత్యుదేవతకు అధికభయంకరాలు. భక్తజనుల హృదయాలకు సంతోషకరాలు. అత్యంత శుభంకరాలు.

ఓ మహాత్మా! కలికాల పాపాలను పారద్రోలేది, గొప్ప కీర్తిమంతులు ప్రశంసించేది అయిన విష్ణుకథను చెపుతుంటే పవిత్ర స్థితిని కోరుకొనే ఏ పురుషుడు ఆసక్తితో వినడు!

బ్రహ్మానందానుభూతి పొందినవారై వినునటువంటి వారికే మాటమాటకు మధురాతిమధురమైన శ్రీకృష్ణుని చరిత్ర, మాకు కూడ వినాలని ఎంతో కోరికగా ఉంది. వింటేగాని తృప్తి కలుగదు.

ఓ బుధసత్తమా! ఈ విశ్వంలో మిక్కిలి శ్రేష్టమైనది నారాయణుని చరిత్ర. అదే అమృతం. దానిలోని సారమే జడివాన. దాని జల్లులు వరుసగా పడితేతప్ప సంసారకల్మషమనే కార్చిచ్చు చల్లారదు. ఇతర మార్గాలవల్ల ఆ చిచ్చు ఆరే అవకాశం లేదు. కారణం ఆ చిచ్చు మిక్కిలి విశాలమైనది. అణగదొక్కడానికి వీలయ్యేది కాదు. అంతంలేనిది. ఓర్చుకోవడానికి శక్యం అయ్యేది కాదు. అనేక జన్మలనుంచి రాశీభూతమై అతిశయిస్తూ వెన్నాడుతూ ఉంటుంది. తరింప శక్యం కానిది. అది ప్రవేశిస్తూ ఉంటే మిక్కిలి భయాన్ని కలిగిస్తుంది. అతికఠినమైనది. అది ఎల్లప్పుడూ వెంటాడే పాపాలతో మండుతూ ఉంటుంది. ఆ సంసార కల్మషమనే కార్చిచ్చు గోవిందుని కథలనే వర్షధారలతో తప్ప చల్లారదు.

బుద్ధిమంతుడవైన సూతా! భయంకర పాపాలనే అడవులు భస్మం కావాలంటే విష్ణునామ సంకీర్తన అనే కార్చిచ్చు ఒక్కసారి వ్యాపించాలి. సంసార బాధలనే మేఘసమూహాలు చెల్లాచెదరు కావాలంటే గోవింద సందర్శనమనే వాయువు ఒక్కమారు చెలరేగాలి. తాపత్రయాలనే మదేభాలు కూలిపోవాలంటే హరిధ్యానమనే సింహం ఒక్కమారు విజృంభించాలి. కామక్రోధాదులనే అంధకారం తొలగిపోవాలంటే నారాయణ స్మరణమనే సూర్యకాంతి ఒక్కసారిగా వ్యాపించాలి. సంసార సముద్రాన్ని దాటాలంటే కేశవభక్తి అనే నావమాత్రమే దాటించగలదు. పలుమాటలు ఎందులకుగాని శ్రీహరి మాహాత్యాన్ని మాకు వినిపించు.

అంతేకాదు కృష్ణుడు మాయామానుషరూపంతో రహస్యంగా ప్రవర్తిస్తూ, రోహిణీపుత్రుడైన బలరామునితో కలసి మానవులు చేయడానికి వీలుకాని సాహసవీరకృత్యాలు ఎన్నో చేశాడని విన్నాము. వాటినన్నీ మాకు వివరించండి. ఘోరకలి రాబోతున్నదని తెలిసి ఈ నైమిశమనే విష్ణుక్షేత్రంలో దీర్ఘసత్రమనే పేరుగల యజ్ఞం చేస్తున్నాము. హరికథలు వినాలనే సంకల్పంతో ఉన్నాము. అదృష్టం మాకు కలిసి వచ్చింది.

జలనిధిని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులు చుక్కాని ధరించియున్న నావికుని చూచి ఎంత సంతోషిస్తారో,కలిఘోర కృత్యాలను దూరం చేసుకోవాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకునీ దర్శనం లభించింది.

మునీంద్రా! ఉత్కృష్ట ధర్మాలకు పట్టుకొమ్మగా నిలిచిన భగవంతుడైన శ్రీకృష్ణుడు పరమపదానికి చేరుకోగా, ధర్మం బలం కోల్పోయి, దిక్కులేక ఎవరిని ఆశ్రయించిందో!

సూతుండు నారాయణ కథాప్రశంస



Suthudhu Narayana Katha Prashamsa Sutha Maha Muni Maharshi - సూతుండు నారాయణ కథాప్రశంస సూతమహర్షి

సూతుండు నారాయణ కథాప్రశంస

ఈ విధంగా సద్గుణాలచే అధికులైన శౌనకాది మహర్షులు ప్రశ్నించారు. అపుడు రోమహర్షణుని పుత్రుడు, ఉగ్రశ్రవనుడనే నామంతో విరాజిల్లేవాడు, పురాణాలను విశేషవ్యాఖ్యానంతో చెప్పే నేర్పుకలవాడు అయిన సూతమహర్షి

ఎవడు సర్వభూతాలయందు సమభావం కలవాడై, అన్ని కర్మలు వదలి సన్యాసియై ఒంటరిగా వెళ్ళుతుండగా, తండ్రియైన వ్యాసమహర్షి ప్రియమార ఓ కుమారా! అని పిలుస్తూ దగ్గరకురాగా, వృక్షాలన్నీ తన్మయత్వంతో ఓ కుమారా! ఓ కుమారా! అని ప్రతిధ్వనులు చేశాయో-ఆలాంటివానికి, సర్వభూతాలు తానైనవానికి, తపోధనులలో అగ్రగణ్యుడైనవానికి, విద్వాంసులలో శ్రేష్ఠుడైనవానికి, వ్యాసమహర్షి కుమారుడైన శుకమహర్షికి ముందుగా మొక్కుతున్నాను.

కార్యకారణాలకు అతీతంగా ప్రవర్తిల్లే ఆత్మతత్త్వమే అధ్యాత్మం. ఆలాంటి అధ్యాత్మాన్ని ప్రకాశింపచేసే దీపం, సకల వేదసారం, అద్వితీయం, అసాధారణం, మహాప్రభావ సంపన్నం అయిన పురాణమర్మాన్ని - సంసారమనే చీకట్లనుండి బయటపడాలనుకొనేవారికి ఏ మహాతపస్వి దయతో ఉపదేశించాడో, ఎవడు మహానుభావులచే స్తుతింపబడినాడో, ఎవడు నిర్మలమైన బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తున్నాడో, ఆలాంటి శుకమహ
ర్షిని ప్రీతితో సేవిస్తున్నాను.

నరనారాయణులకు, వేదమాత సరస్వతికి, వ్యాసమునీంద్రునకు నమస్కరించి, సంసారాన్ని తరింపజేసే ఈ మహాగ్రంధాన్ని భాగవతాన్ని వచిస్తున్నాను.

అని సూతుడు ఈ విధంగా దేవతలకు, గురువులకు కైమోడ్పులర్పించి ఇలా అన్నాడు “శౌనకాది మహర్షులారా! మీరు నన్ను సమస్తలోకాలకు శ్రేయస్సును కలుగజేసే పరమార్థం తెలియజేయుమని ప్రశ్నించారు. దేనివల్ల కృష్ణకథావిషయకమైన ప్రశ్న అడగబడుతుంది? ఏ విధంగా అంతరాత్మ ప్రశాంతత పొందుతుంది? ఏ ఆటంకంలేని, ఏ ఫలాపేక్షలేని విష్ణుభక్తి ఏదోరూపంలో ఏ విధంగా చేకూరుతుంది? అటువంటి ఉత్తమభక్తియే సమస్త జీవులకు ఉత్కృష్టధర్మం అవుతుంది. వాసుదేవునిపై ప్రకటించే భక్తియోగమే వైరాగ్యాన్ని, ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. గోవిందుని గాథల ద్వారా ఏయే ధర్మాలు తెలియజేయబడతాయో, అవే ప్రయోజనం చేకూర్చేవి. తక్కినవన్నీ నిరర్ధకాలు. ధర్మా
ర్థకామమోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలలో మోక్షాన్ని ప్రతిపాదించే ధర్మమే ఉత్కృష్ట ధర్మమవుతుంది కాని లౌకిక ప్రయోజనాలను కలిగించే ధర్మం ధర్మంకాదు. అదేవిధంగా ఆ పరమధర్మాన్ని అందించే అర్థమే ప్రయోజనకారి అవుతుంది కాని కేవలం కోరికలు తీర్చుకొనే అర్థ సంపాదన నిరర్థకమే. అదేరీతిగా ధర్మార్థాలతో మోక్షానికి అర్హమైన కామానుభవం సంభావ్యమవుతుంది కాని, కేవలం విషయభోగపరిమితమైన కామం దుష్కామమే. ఎంతకాలం జీవించి ఉంటామో, అంతకాలమే ఇంద్రియాలకు సంతృప్తి. కాబట్టి మోక్షగామి అయిన కామమే సత్కామం అనబడుతుంది. నిత్యనైమిత్తిక కర్మలద్వారా లభించే స్వర్గాది లోకప్రాప్తి ఏదయితే ఉందో, అది తత్త్వజిజ్ఞాస కల జీవులకు పరమప్రయోజనం కాదు. తత్త్వజిజ్ఞాస అంటే ధర్మజిజ్ఞాస అని కర్మవాదులు వచిస్తారు. వారి అభిప్రాయప్రకారంగా ధార్మికవిజ్ఞానమే తత్త్వం అనబడుతుంది. కాని తత్త్వం తెలిసిన వేదాంతులు జ్ఞానమనే పేరుతో రెండు కాకుండా ఎల్లప్పుడూ ఒక్కటై భాసించి నిలిచియుండే దానినే తత్త్వమని చెబుతారు. ఆ తత్త్వమే ఉపనిషత్తులు అధ్యయనం చేసే ఔపనిషదులచే "బహ్మం" అనబడుతుంది. అదే హిరణ్యగర్భోపాసకులచే "పరమాత్మగా" వ్యవహరించబడుతుంది. అదే సాత్త్వతులచే "భగవంతుడు"గా పిలువబడుతుంది. నిరంతరం ఉపనిషద్వాక్యాలను అనుసంధానం చేస్తూ ఉంటే జ్ఞానం, వైరాగ్యం చేకూరుతాయి. అపుడు వారికి నిర్మలమైన భక్తి ఉదయించి "బ్రహ్మం" గూర్చి మాత్రమే ఆసక్తి కలిగినవారవుతారు. ఆ తత్త్వవేత్తలు దేహాన్ని భోగసాధనమైన దాన్నిగా గుర్తిస్తారు. తమ ప్రత్యగాత్మలో పరమాత్మను దర్శిస్తారు. మానవులు ఆచరించే కర్మరూప ధర్మంద్వారా భక్తి చేకూరడమే పరమప్రయోజనం అవుతుంది. వారి వారి వర్ణాశ్రమ ధర్మాలద్వారా మానవులు కావించే సకల కర్మలకు మాధవుడు సంతోషించడమే సిద్ధి అవుతుంది. ఎల్లప్పుడూ మనస్సును ఏకాగ్రంచేసి నారాయణుని కథలను వినడం కీర్తించడం చేస్తూ ఉండాలి. చక్రాయుధ ధ్యానమనే పెద్దకత్తితో అహంకర్తృత్వమనే కర్మబంధాన్ని ఖండించివేయాలి. భగవంతునిపై అతిశయించే భక్తి కలిగి ఉండాలి. ముక్తిదాయకాలైన విష్ణుగాథలను మిక్కిలి ఆసక్తితో వినాలి. పవిత్రనదులలో స్నానం ఆచరించాలి. పూజార్హులైన వారిని సేవించాలి. కర్మబంధాలను పూర్తిగా తొలగింపజాలిన పుండరీకాక్షు చరిత్రలను వినడానికి అనురక్తి చూపించాలి. ఇటువంటి మానవునికి ఇతర ప్రాపంచిక విషయాలపై అభిరుచి జనించదు. పుణ్యశ్రవణ కీర్తనుడైన విష్ణువు తన గాథలను వినేవారి గుండెలనిండా స్థిరంగా ఉండిపోతాడు. అలా నిలిచి శుభాలు నెరవేరుస్తాడు. అశుభాలు దూరం చేస్తాడు. అమంగళాలు నశించిపోతే, భగవంతుని గూర్చి వివరించే గ్రంథాలు చదవాలని, భగవంతుని భజించే భక్తులను సేవించాలనే సంకల్పం కలుగుతుంది. అప్పుడు మాత్రమే నిశ్చలభక్తి ఏర్పడుతుంది. అచంచల భక్తి ప్రభవించడంతోనే రజోగుణ తమోగుణాలవల్ల కలిగే కామలోభాదులు నశించిపోతాయి. అపుడు మనస్సు సాత్వికగుణంచే ప్రసన్నమవుతుంది. మనస్సు ప్రసన్నమయితే దేనియందు సంగం లేనివాడవుతాడు. ముక్తసంగుడయితే భగవంతుని గూర్చి తెలుసుకోవాలనే ఇచ్చ జనిస్తుంది. ఈశ్వరుని గూర్చిన జ్ఞానం తెలిస్తే జ్ఞానాజ్ఞానాలకు కూర్చబడిన గ్రంథి విడివడిపోతుంది. అపుడు అహంకర్తృత్వభావన భిన్నమైపోతుంది. అహంప్రవృత్తి పటాపంచలు కాగా సర్వసంశయాలు తొలగిపోతాయి. సంశయాలు విచ్చేదంకాగా ప్రారబ్ధసంచితాగామి కర్మలన్నీ ఏవీ మిగలకుండా నశించిపోతాయి.

కాబట్టి నిరంతరం ధ్యానంచేసే తపశ్శ్రేష్ఠులు తమ అంతరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికై, హరిపై అచంచలమైన భక్తి కలవారై తమను తాము పూర్తిగా అర్పణం చేసుకొంటారు.

అంతటా, అందరిచే ధ్యానించబడే ఉత్తమ పురుషుడు (పరమాత్మ) ఒక్కడే. అతడే సృష్టిస్థితి  లయములను క్రమంగా కావిస్తాడు. సృష్టి సమయంలో బ్రహ్మ, స్థితివేళలో హరి, లయకాలంలో రుద్రుడు అనే నామాలు ధరిస్తాడు. ప్రకృతిగుణాలైన రజస్సత్త్వతమస్సులను గ్రహిస్తాడు. ఈ మువ్వురిలో అనంతసత్త్వ సంపన్నుడైన హరి చరాచరాలకు సమస్తశుభాలను ప్రసాదిస్తాడు.

అంతేకాకుండా మరో విశేషం కూడ ఉంది. అగ్నితో కలసి మండి ప్రకాశించే కొయ్యకన్న నలుపు ఎరుపు కలిసిన రంగుతో కూడుకొన్న పొగ విశిష్టమయింది. ఆ పొగకన్న ఆహవనీయ గార్హపత్య దాక్షిణాత్య రూపయజ్ఞ సాధకమైన వహ్ని విశిష్టమయింది. అదేవిధంగా ప్రవృత్తిరహితమైన తమోగుణంకన్న ప్రవృత్తి సహితమైన రజోగుణం విశిషమయింది. సోపాధిక జ్ఞాన హేతువైన కించిద్బ్రహ్మదర్శనసత్త కల్గిన రజోగుణంకన్న సాక్షా
ద్బ్రహ్మదర్శనసత్త కల్గిన నత్త్వగుణం మహావిశిష్టముయింది. ఆదికాలం నుండి యోగీశ్వరులు, జితేంద్రియులకు మాత్రమే ప్రత్యక్షమయ్యే షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీమహావిష్ణువును సత్త్వమయునిగా ఉన్నాడు కాబట్టి సేవించారు. కొందరు సంసారంలోని సుఖాన్ని కోరుతూ ఇతర దేవతలను కొలుస్తారు. కాని ముక్తిని కోరేవారు మాత్రం విష్ణువును భజిస్తారు. వారు వివిధరూపులైన గణాధిదేవతలను విడిచి, ఇతర దేవతానింద చేయక శాంతస్వభావులై నారాయణ కథలయందే ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు రజోగుణంతోను, తమోగుణంతోను కూడుకొన్నవారై సిరిసంపదలను, సిద్ధులను, సంతానమును వాంఛించి పితృదేవతలను, భూతదేవతలను, ప్రజాపతులను ఆరాధిస్తారు. నారాయణుడు ముక్తిప్రదాతగా సర్వజనులచే పూజించబడుతున్నాడు. వేదాలుకాని, యాగాలుకాని, యోగంకాని, కర్మకాని, జ్ఞానంకాని, తపస్సుకాని, గమ్యంకాని, ధర్మంకాని వాసుదేవపరంగా సార్థకమవుతున్నాయి. నిర్గుణంబైన పరబ్రహ్మ నివృత్తితో ఉన్నా ఒకప్పుడు ప్రవృత్తిని వహిస్తూ, త్రిగుణాలతో కూడిన తన ప్రకృతిచే ఈ విశ్వాన్ని అంతా సృజిస్తాడు. సగుణుడై విరాజిల్లుతూ ఉంటాడు. అగ్ని ఒకటే అయినా, అది అనేక వృక్షాల్లో వివిధ రూపాలతో ప్రకాశిస్తున్నట్లుగా, విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే అయినా నానావిధరూపాలుగా ఏర్పడిన అనంతభూతకోటిలో అంతర్యామిగా ప్రకాశిస్తూ ఉంటాడు. స్థూలములు, సూక్ష్మములు, ఇంద్రియాలు, త్రిగుణాలు, వాటి తత్త్వాలద్వారా తనచే సృజింపబడిన భూతకోటిలో చిక్కుపడక ఆయాగుణానుభవం పొందుతున్నట్లుంటాడు. విశ్వకర్తయైన ఆ భగవంతుడు దేవతలలోను, పశుపక్ష్యాదులలోను, మానవులలోను లీలావతారంగా క్రిందకు దిగివచ్చి సమస్త జగత్తులను కాపాడుతాడు అని సూతుడు వచిస్తూ ఇంకా ఇలా చెబుతున్నాడు.

ఆ పరమాత్మయే మహత్తత్త్వం, అహంకారం, శబ్దస్పర్శరూపరస గంధాలనే పంచతన్మాత్రలు, అంతఃకరణ చతుష్టయం, పంచేంద్రియాలు అనే సూక్ష్మాలైన పదునారు అంశలతో కూడుకొన్న వాడై, స్థూలాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే ఐదు మహాభూతాలతో విరాజిల్లుతున్నవాడై, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే త్రిగుణాలకు అతీతంగా ఉండే శుద్ధసత్త్వంతో భాసిస్తున్నవాడై, చరణాలు, ఊరువులు, భుజాలు, ముఖాలు, శ్రవణాలు, నయనాలు, నాసారంధ్రాలు, శిరస్సులు వేలకు వేలు ప్రకాశిస్తున్నవాడై, పచ్చని పట్టువస్త్రాలు, కేయూరాలు, కాంచనహారాలు, శ్రవణ కుండలాలు, రత్నకిరీటాలు వేలకువేలు కాంతులీనుచుండగా, ఆ ఆద్యంతరహితుడైన పరబ్రహ్మమే సగుణరూపుడై మనుష్యాకార పురుషోత్తమ రూపం ధరించి సమస్త భువనభాండాలను ప్రవర్తింపజేసే మహాయత్నంతో, అందరిచే ఆరాధించబడే గొప్పదైన (క్షీర) సముద్రమధ్యభాగంలో యోగమాయానిద్రాముద్రతో ప్రకాశిస్తూ ఉంటాడు.


శ్రీ మహా భాగవతము

Sree Maha Vishnu Ekavisanthi Avatharamulu - శ్రీ మహా విష్ణు యేకవింశత్యవతారములు

శ్రీ మహా విష్ణు యేకవింశత్యవతారములు

ఆ విరాట్స్వరూపమే అన్ని అవతారాలకు మొట్టమొదటిది. అదే అన్నింటికి మూలం. అది శ్రీమన్నారాయణుని దేదీప్యమానమైన సగుణరూపం. పరమయోగులైన వారికి మాత్రమే ఆ దివ్యస్వరూపం గోచరిస్తుంది. ఆ నారాయణుని నాభి పద్మంనుంచి సృష్టికారకులైన వారిలో శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆ విష్ణుభగవానుని అవయవ ప్రదేశాలనుండి సకలలోకాలు కల్పించబడ్డాయి. మొట్టమొదట ఆ విష్ణుదేవుడు "కౌమారం" అనే పేరుగల సృష్టిని ఆశ్రయించాడు. కేవలం ఆత్మదర్శనం మాత్రమే చేసేవాడై, దుష్కరమైన బ్రహ్మచర్యాన్ని మాత్రమే ఆచరించే దీక్ష వహించాడు.

రెండోసారి లోకాలను సృష్టించడానికి అనువుగా రసాతలభాగంలో ఉండిపోయిన భూమిని పైకెత్తడానికి యజ్ఞవరాహావతారం ధరించాడు. 

మూడోపర్యాయం నారదుడనే పేరుతో బ్రహ్మర్షియై కర్మబంధాలను తొలగించే వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. 

నాలుగోసారి ధర్ముని భార్యయైన మూర్తియందు నరనారాయణ రూపంలో అవతరించి దుష్కరమైన తపస్సు ఆచరించాడు.

ఐదో అవతారంలో కపిలుడనే పేరుతో ఉద్భవించి సమస్త సిద్ధులు తెలిసినవాడై “ఆసురి అనే బ్రహ్మర్షికి ఇరవై నాలుగు తత్వాలతో కూడిన సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు. 

ఆరో అవతారంలో అత్రికి అనసూయకు పుత్రుడై (దత్తాత్రేయుడై) అలర్కునకు, ప్రహ్లాదుడు మున్నగువారికి బ్రహ్మవిద్యను తెలియజేశాడు.

ఏడో పర్యాయం ఆకూతికి, రుచి ప్రజాపతికి యజ్ఞుడై జన్మించి, యముడు మున్నగు దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని కాపాడాడు.

ఎనిమిదో అవతారంలో మేరుదేవికి నాభికి ఉరుక్రముడనే పేరుతో పుట్టి మిక్కిలి ప్రసిద్దుడై ఆత్మవేత్తలకు పరమహంస పరివ్రాజకుల జీవన విధాన మెటువంటిదో తెలియజేశాడు.

తొమ్మిదోసారి ఋషులచే కోరబడి పృథు చక్రవర్తిగా ఆవిర్భవించి భూదేవిని ఆవుగాచేసి ఓషధులనన్నింటిని పితికాడు. 

పదో పర్యాయం చాక్షుషమన్వంతరంలో మీనావతారం ధరించి భూమిరూపంలోనున్న ఓడలో ఎక్కించి వైవస్వతమనువును కాపాడాడు.

పదకొండోసారి సముద్రాన్ని చిలికే సమయంలో కూర్మావతారం ధరించి మందరపర్వతాన్ని తనవీపుపై నిలిపాడు.

పండ్రెండో అవతారంలో సురాసురులచే చిలుకపడ్డ పాలకడలిలో "ధన్వంతరి" అనే పేరుతో అమృత కలశాన్ని చేతదాల్చి సాక్షాత్కరించాడు.

పదమూడోసారి జగన్నోహినియై, అసురులను వంచించి సురలకు అమృతం ఆహారంగా పంచిపెట్టాడు.

పదునాల్గొదైన నరసింహావతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. 

పదియేనవదైన వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగులను యాచించి ముజ్జగాలు ఆక్రమించాడు. 

పదునారోసారి పరశురామావతారంలో ఆవేశం పొంది బ్రహ్మవేత్తలకు హాని కల్గించిన ప్రభువులను ఇరవై యొక్క పర్యాయాలు వధించి భూమిని క్షత్రియ శూన్యం కావించాడు.

పదియేడోసారి వ్యాసరూపంలో అవతరించి అల్పబుద్ధులైన మానవులపై దయచూపించి వేదవృక్షానికి శాఖోపశాఖలు కల్పించాడు.

పద్దెనిమిదో పర్యాయం దేవకార్యార్థమై శ్రీరాముడనే పేరుతో క్షత్రియుడుగా అవతరించి 'సాగరబంధనం' మున్నగు సాహసకృత్యాలు ఆచరించాడు. 

పందొమ్మదివ పర్యాయం బలరాముడుగను.

ఇరవైయవ అవతారం లో శ్రీకృష్ణుడు అనే రూపంలో యాదవవంశంలో జన్మించి భూభారాన్ని అరికట్టాడు.

ఇరవై ఒకటోసారి కలియుగ ప్రారంభ సమయంలో బుద్ధుడనే పేరుతో పుట్టి దానవులను వంచించడానికై “మధ్యగయ” అనే పుణ్యప్రదేశంలో జినసుతుడుగా విరాజిల్లుతాడు. 

ఇరవై రెండో పర్యాయం కలియుగసంధిసమయంలో భూమిని పాలించే పరిపాలకులే తస్కరప్రాయులై సంచరిస్తూ ఉండగా విష్ణయశుడనే బ్రాహ్మణోత్తమునకు 'కల్కి' అనే పేరుతో ఆవిర్భవించి అధర్మాన్ని నశింపజేసి కృతయుగ లక్షణాలను యథాతథంగా జరిగేటట్లుగా ఏర్పాటు చేస్తాడు. 

ఈ విధంగా భగవదవతార విశేషాలను వివరించి సూతుడు ఇంకా శౌనకాది మహామునులకు ఇలా వివరిస్తున్నాడు.

చెరువులోనున్న నీరు పెక్కు కాలువలరూపంగా ప్రవహించినట్లుగా, నారాయణుని ద్వారా ప్రపంచశ్రేయస్సును కలిగించేలా వ్యక్తమయ్యే అవతారాలు అనంతాలు. భూమిని పాలించే చక్రవర్తులు, దేవతలు, బ్రహ్మ
ర్షులు, మహర్షులు అందరూ విష్ణువు అంశలవల్ల, కళాంశల వల్ల జన్మించినవారే. బలరాముని తమ్ముడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీహరి అవతారమే. కృష్ణునకు, విష్ణునకు కించిద్భేదంకూడ లేదు.

ఏ సమయంలో లోకాలు రాక్షసబాధలచే చీకాకుపొందుతూ ఉంటాయో, ఆ సమయంలో భగవానుడైన శ్రీమన్నారాయణుడు ప్రతియుగంలోను లీలావతారంగా ఆవిర్భవించి కాపాడుతూ ఉంటాడు.

శ్రీమన్నారాయణుని అవతారగాథ ఎన్నో అంతరార్థాలతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని ఏ మానవుడైనా ఉదయం, సాయంకాలం మిక్కిలి శ్రద్ధతో భక్తితో పఠిస్తే చాలు, అతడు భవబంధాలకు లోనుగాక దూరంగా ఉంటాడు.

మహర్షులారా! సావధానంగా వినండి. వాస్తవానికి జీవుడు రూపంలేక జ్ఞానమే స్వరూపంగా కలవాడు. అయినప్పటికి పరమాత్మయొక్క మాయవల్ల జనించే మహత్తత్త్వం మున్నగు వాటివల్ల ఆత్మ కేంద్రబిందువుగా ఉండే స్థూలశరీరం జీవునికి కల్పించబడుతోంది. ఆకాశంలో గాలి ఆధారంగా ఉండే మబ్బులు, వాయువువల్ల భూమికి సంబంధించి పైకిలేచే దుమ్ముయొక్క బూడిదరంగుతో కన్పించినట్లుగా, సర్వదర్శియెన ఆత్మలో నానాదృశ్యాలు ఆత్మదర్శనం చేయని వారిచే కల్పించబడుతున్నాయి. జీవునికి ఈ కనబడుతున్న స్థూలశరీరంకన్న సూక్ష్మశరీరం వేరొకటి ఉంది. అది కనబడని గుణాలు కలదై ఉంటుంది. అది వినబడేది కాదు. అది నిత్యం వాస్తవస్థితిలో ఉంటుంది. అది కంటికి కనబడక అవ్యక్తమై సూక్ష్మరూపంతో కాలు, చేయి మున్నగు అవయవాలు లేక మరో శరీరంతో ఉంటుంది. ఆ సూక్ష్మశరీరం వల్లనే మరణానంతరం జీవునికి రాకపోకలతో పునర్జన్మ కనబడుతోంది.

ఎప్పుడయితే స్వరూపజ్ఞానం, సమ్యగ్‌జ్ఞానం జీవునకు కలుగుతాయో అప్పుడు స్థూలదేహం, సూక్ష్మదేహం కూడా తొలగిపోతాయి. ఆ సమయంలో మాయవల్ల ఆత్మలో ఈ సంసారమంతా కల్పించబడుతోందని తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే జీవుడు బ్రహ్మ సందర్శనానికి యోగ్యుడవుతాదు. ఆత్మదర్శనం అంటే సమ్యగ్ధర్శనమే. 

సర్వజ్ఞుడైన ఈశ్వరుని అధీనంలో మాయ ఎప్పుడూ క్రీడిస్తూ ఉంటుంది. ఆ అవిద్య (మాయ) ఉపశమించి తానే విద్యారూపంగా మారిపోయే సమయంలో జీవోపాధి ధరించడానికి హేతువులైన స్థూల సూక్ష్మరూపాలు రెండూ దగ్దమైపోతాయి. అపుడు జీవుడు కాష్ఠం లేకుండా ప్రకాశించే అగ్నివలె అవుతాడు. తాను దేహంలేకుండా పరమాత్మ స్వరూపాన్నిపొంది అద్వైతానందంతో విరాజిల్లుతాడు. ఈ విధంగా తత్త్వవేత్తలు వచిస్తారని చెబుతూ సూతమహర్షి ఇలా అంటున్నాడు.

భగవంతునికి పుట్టుక అనేదే లేదు. జన్మ అనేదే లేదంటే కర్మప్రసక్తి మాత్రం ఎలా ఉంటుంది? అయినా సత్కవులు బ్రహ్మను తెలిపే పదజాలంతోనే పరాత్పరునికి జన్మకర్మలు కల్పించి స్తోత్రం చేస్తూ ఉంటారు. వేదాల్లో ఎక్కడచూచినా, జీవునికివలె కర్మ జన్మలు ఉన్నట్లుగా పరమాత్మకు చెప్పబడలేదు.

భగవంతుడు సమస్త లోకాలను సార్ధక లీలావిలాసంగా సృష్టిస్తాడు. రక్షిస్తాడు. లయం చేస్తాడు. కాని తాను మాత్రం వాటియందు నిమగ్నుడు కాడు. అనేక ప్రాణికోటులలో అంతర్యామి రూపంలో విహారం చేస్తూ ఉంటాడు. ఇంద్రియ సమూహానికి ప్రీతి కలిగిస్తాడు. స్వర్గం దూరంగా ఉన్నాా దగ్గరగా ఉన్నట్లే భావించి ఆనందించేవిధంగా, ఇంద్రియాలకు దూరంగా ఉంటూ ప్రయోజనాన్ని సంతరిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇంద్రియాలను స్వీయవిషయాలపై ప్రవర్తింపజేస్తూ, ఆ వెనువెంటనే నియంత్రిస్తూ, ఇష్టం వచ్చినట్లు వాటిని తిప్పుతూ ఉంటాడు.

లోకేశ్వరుడైన శ్రీహరి క్రీడావిలాసాలు, నామరూపాలు అనంతాలు. వాటిని మనస్సు గ్రహించలేదు. వాక్కు స్తుతి చేయలేదు. ఎంత ఊహానైపుణ్యంతో, కుతర్కం చేసేవాడైనా ఆ పరమాత్మ క్రియాకలాపాలకు అవధిని ఏర్పాటు చేయలేడు. కళాభిజ్ఞుడు కానివాడు నాట్యంలోని అందచందాలను గ్రహించి అభినందించలేనట్లే, అజ్ఞుడైనవాడు సర్వజ్ఞుని లీలావిలాసాలను గ్రహించలేడు.

ఏ భక్తుడు ఇంచుకైనా వంచనలేకుండా, మనస్సులో నిరంతరం ప్రీతి కలిగి నారాయణుని పాదపద్మాల సుగంధాన్ని సేవిస్తాడో, అతడు మాత్రమే బ్రహ్మాదులకు కూడా గ్రహింప శక్యంకాని అత్యద్భుతాలైన హరి కర్మలీలలను తెలుసుకోగలుగుతాడు.

భూసురోత్తములారా! శ్రీహరి పాదద్వంద్వంపై మీకు కలిగిన భక్తి అచంచలమైనది. మిక్కిలి నిష్ఠతో కూడుకొన్నట్టిది. మీ మనఃప్రవృత్తి ఆయనయందే ఎడబాటు లేకుండా విరాజిల్లుతూ ఉంటుంది. మీరు ధన్యాత్ములు. సర్వం తెలిసినవారు. నారాయణస్మరణప్రభావంవల్ల చావుపుట్టుకల బాధలు ఎప్పుడూ మిమ్ములను సమీపించలేవు.

పరీక్షిత్ మహారాజు

Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం

బుధ గ్రహం (బుధుడు)  జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...