Monday, April 13, 2026

Chapter 68 Birth of Urvashi - అధ్యాయము 68 ఊర్వశి జననం

 శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 68

ఊర్వశి జననం

శ్రీవ్యాసభగవాను డిట్లనెను : అంత ముమ్మెదట వసంతు డా గిరిరాజము మీదికి జేరెను. అట వెంటనే చెట్లన్నియును విరియబూచెను. తుమ్మెదల గుంపులతో విరాజిల్లెను. ఆ వనమునందలి మామిడి వకులము తిలకము మోదుగు సాల తమాల తాలములు మధూకము మున్నగు వృక్షములు చక్కగ పుష్పించి శోభిల్లెను. చెట్ల చివరికొమ్మలపై మనోహరమైన కోకిలారావములు చెవుల పండువులు సేసెను. కొనలు దేరిన తీవియలు చెట్లను పెనవేసికొనెను. అత్తఱి దంపతుల తలపులు రేకులు విప్పెను. స్త్రీ పురుషులు పరస్పరము మదనాతురులై బద్ధానురాగులై ప్రమత్తులై క్రీడాసక్తులైరి. 

అంత నెదలను చల్లపఱచుచు మెల్లని కమ్మని మలయ మారుతము లొలసెను. మునులకు సైతము ఇంద్రియములు వశముతప్పి చెలరేగెను. పూవిలుకాడును రతినిగూడి త్వరితగతితో బదరికాశ్రమము జేరెను. ఆతడు తన యైదు పూబాణములను వింట సంధించి పొంచి యుండెను. రంభ తిలోత్తమ మున్నగు నచ్చరలేమలు నాయాశ్రమముజేరి స్వరతాల లయలతో రాగభావ మధురగానము లొనర్చిరి. వారి మధుర గీతాలాపములు తుమ్మెదల ఝుంకారములు కోయిలల కలకూజనములు ఆలకించి పులకించి ఆ నరనారాయణులు ఎచ్చరికపడిరి. 

ఆ మహర్షులు మాత్రము కాలముగాని కాలమున వసంతశ్రీతో బూచిన వనరాజిని గని యిట్లు చింతాపరులైరి. ఇది సమయము గాని సమయము. ఇపుడీ వసంతర్తువెట్లు గలిగెను? ఎల్ల ప్రాణులును మన్మథాతురులై వశము తప్పి కనబడుచున్నారు. కాల ప్రకృతికి విరుద్ధమైన ఈ సంఘటన మెట్లు ఘటిల్లెనని నారాయణుడు విస్మయముతో తన కనులు దెఱచి నరున కిట్లు పలికెను: 

ఓ సోదరా! ఈ విరియబూచిన చెట్లు గనుము. ఆ చెట్లపైగల కోయిలల కలరావములు తుమ్మెదల రొదలు వినుము.

ఓ మునీ! మృగరాజు తన వాడి గోళ్ళతో గజరాజును చీల్చివేయును. అటులే ఋతురాజగు వసంతుడు నెఱ్ఱనిమోదుగుపూలతో శిశిరర్తువును చీల్చుచున్నాడు. అల్లదిగో! రక్తాశోకము చేతులై మోదుగుపూలు పాదములై నీలాశోకములు కేశములై విప్పారిన కమలము ముఖమై నల్ల కలువలు కన్నులై మారేడుపండ్లు స్తనములై విరిసిన కుందకుసుమములు పలువరుసలై తిలకపుష్పములు కర్ణావతంసములై మంకెన పూవులు పెదవులై ప్రేంకరణపు పూవులు గోరులై పుంస్కోకిలల రవములు కంఠస్వరములై కడిమిపూలు నునుపైన చక్కనివస్త్రములై నెమళుల పించెములు మేలిమిసొమ్ములై సారసస్వనములు అందెల రవళులై జాజిమొగ్గలు మొలనూలై మత్త హంసగతులు నడలై గారపూలు నూగారులై విలసిల్లుచు వసంతలక్ష్మి శ్యామయై నా బదరికాశ్రమమున కేతెంచినది. 

మునీ! ఈ యకాలమున వసంతశ్రీ వచ్చుటకు కారణమేమై యుండును? నాకిది వింతగ నున్నది. దీనిని మన తపోవిఘ్నకారిణిగ నెఱుగుము. వేల్పుకన్నెలు మనకు ధ్యానభంగమగునట్లు మధురగానము వినిపించుచున్నారు. ఇదంతయును మన తపోభంగమునకు పన్నిన యింద్రుని పన్నుగడయేసుమా ఈ యదనుగాని తఱిలో వసంతు డిట్టి ప్రీతి యెట్టు గల్గించును? అ యింద్రుడే మనకు వెఱగొంది యీ విఘ్నమునకు తలపడెనని తోచును. సుగంధులు శీతములు మనోహరములునగు గాలులు వీచుచున్నవి. దీనికి కారణ మింద్రుని పన్నాగము కాక మరేదియుగాదు అని యీ విధముగా భూదేవశ్రేష్ఠుడగు నారాయణుడు పలుకుచుండగానే మదనుడు మున్నగువారు వారికి కంటబడిరి. నరనారాయణ భగవాను లాదేవగణమును గని విస్మితచేతస్కులైరి.

మన్మథుడు-మేనక-రంభ-తిలోత్తమ-పుష్పగంధ-సుకేళి-మహాశ్వేత-మనోరమ-ప్రమద్వర-చారుహాసిని-సంగీతజ్ఞ ఘృతాచి-చంద్రప్రభ-కోకిల భాషిణి-సోమ - అంబుజాక్షి - విద్యున్మాల - కాంచనమాలిని మఱియు వరారోహ లెందరో యా మునుల ముందట ప్రత్యక్షమైరి. అట్లు వచ్చిన కామసేనయగు పదునారు వేల యైదువందల మంది యచ్చరలను గాంచి పరమ మునులు పరమ విస్మయ మందిరి. ఆ దివ్యాభరణ మాల్యములతో మచ్చిక మీఱు దేవకాంతలు మునివరుల కంజలులు ఘటించి వారి యెదుట నిలువబడిరి. వారు భూమిపై దుర్లభము-మదనోద్దీపకమునైన దివ్య మధురగాన మాలపించిరి. 

నరనారాయణు లా గానములను వినిరి. పిదప నారాయణుడు వారితో నీ రీతిగ బలికెను. 'ఓ శోభన మధ్యమలారా! మీరు నాకము నుండి వచ్చి నా కతిథులైతిరి. నేను మీ కాతిథేయుడను. నా యాతిథ్యము స్వీకరింపుడు. మీ రెల్ల రిచటనే సుఖముండుడు.' 

వ్యాసు డిట్లనియెను: ఆ దేవతలు తమకు విఘ్న మొనరింప నింద్రునిచేత బంపబడియుందురని యభిమానవంతుడగు నారాయణుడు తలచెను. వీరి యందచందము లేమాత్రములు? వీరిని తలదన్ను దివ్యవిలాసరూప సంపన్నులను సృష్టింతును. నా తపోబలము చూపగలను' అని యిట్లు నారాయణుడు దలచి తన చేతితో తన తొడ చఱచుకొని వెంటనే యొక్క సర్వాంగ సుందరిని సృజించెను. నారాయణుని ఊరువులనుండి పుట్టుటచే నామె యూర్వశి యనబరగెను. అచ్చర లా సుందరిని గని యొకరి మొగమొకరు వెలవెలపోయి చూచుకొనిరి.

ఆ పిదప నారాయణు డింద్రుడంపిన దేవకామినులకు సేవలు సేయుటకై సోయగమున వారికన్న మిన్నలగు నన్నులమిన్నలను పుట్టించెను. అట్లు పుట్టిన పడుచుకన్నెలు నగుచు పాడుచు పలువిధములగు నుపహారములు చేతులగొని వారి యెట్టయెదుట నిలువబడిరి. ఆ తపోవిభవమున జనించి విభ్రమము గొల్పు నూర్వశిని కన్నార గాంచి దేవాంగనలు మోహితలైరి. వారి మేనులు గగుర్పొడిచెను. వారి మోముతమ్ములు ముదమున విప్పారెను. 

వారపుడు నారాయణున కిట్లనిరి: మేము కడు బాలలము. మీ తపో మాహాత్మ్యమును ఆత్మ స్థిరతను తిలకించితిమి. మిమ్మెట్లు నుతింపవలయునో తెలియకున్నది. మా క్రీగంటి విసపు ములుకులకు దగ్ధుడుగాని వాడు లేడు. కాని, మీ మనస్సులు మాత్ర మేమాత్రమును గంపింపకున్నవి. మీరలు వినివృత్తకాములు-శమదమనిధులు-దైవాంశ సంభూతులు-మునివరులునైన నరహరులని మే మెఱుంగుదుము. మే మింద్రుని పనుపున నతని కార్యసాధన కేతెంచితిమి కాని, మీ సేవకు రాలేదు. 

మే మెంతటి సంచిత పుణ్యభాగ్యమున మీ దివ్య సందర్శన భాగ్యము బడయగల్గితిమో యెఱుగకున్నాము. మేము పాపులము. ఐనను మీరు మమ్ము మీ వారిగ భావించితిరి. మమ్ము శపింపక వదలితిరి. దీన మీ క్షమా గుణము వెల్లడి యగుచున్నది. మహాశయులగు పండితులు తుచ్ఛమైన శాపము లిచ్చి తమ తపస్సును వ్యయము చేసికొనరు అని సురకామినులు సవినయముగ తలలువంచి పలికిరి. 

వ్యాసుడిట్లనెను: కామినుల ఈ పలుకులు విని పరమప్రీతులు ప్రసన్నవదనులు సంతుష్టాంతరంగులు తపోదీప్తాంగులు విజిత కామలోభులు ధర్మాత్మజులునైన నరనారాయణులు మీ వాంఛితములు దెలుపుడు. మేము దీర్తు'మని దేవ కామినులతో నిట్లనిరి. మీ రీ సొగసుకత్తె చారునయన యైన ఊర్వశిని స్వర్గమునకు గొనిపొండు. ఈమెను మేము సురపతికి కానుకగ నిచ్చితిమనుడు. ఆ యింద్రుని సంతృప్తికి తొడలనుండి పుట్టిన యూర్వశి నతనికి సమర్పించితిమి. ఎల్ల దేవతలకు మేలగుత! మీరిక స్వేచ్ఛగ నరుగుడు. మీ రీనాటి నుండి యెవరి తపమునకుగాని విఘ్న మొనరింపకుడు.' 

అప్సర లిట్లనిరి: ఓ నారాయణా! సురశ్రేష్ఠా! మహాభాగా! మేము మీ చరణకమలములను మనసార పరమభక్తితో నమ్మితిమి. మే మింకెక్కడికిని వెళ్ళజాలము. ఓ నాథా! మధుసూదనా! కమలపత్రాక్షా! నీవు మా యెడల సంతుష్టిజెంది మా వాంఛితార్థము లీడేర్ప దలచితివి. వరము లీయదలచితివి. మాలో రగుల్కొను కోర్కి కోరుచున్నాము. వినుము:

ఓ జగత్పతీ ! దేవేశా ! పరంతపా ! నీవు మాకు పతివి గమ్ము. మేము నెయ్యము తియ్యము దోప నిన్నే నిచ్చలు సంసేవింతుము. నీవు పుట్టించిన చారులోచన లిచ్చటనే యుండగలరు. ఊర్వశి మున్నగువారు స్వర్గమేగగలరు. మేము మొత్తము పదారువేల యేబది మంది యువతులము. మే మిచ్చటనే యుండి తాపసోత్తములగు మీ పరిచర్య చేతుము. మాధవా! దేవేశా! మాలోని కోర్కి సఫలమొనరించి సత్యవాదివి గమ్ము. చెలువలు కాశాభంగ మొనరించిన నది హింస యనంబడును అని యిట్లు ధర్మతత్వజ్ఞులగు మునులు వచింతురు. మే మేదో భాగ్యవశమున స్వర్గమునుండి యిచటి కేగుదెంచితిమి. నీ ప్రేమలో బడితిమి. 
ఓ లోకనాథా! దేవేశా! నీవు మమ్ము వదలవలదు. నీవు సర్వసమర్థుడవు.' 

నారాయణు డిట్లనెను: ఇట మేము వేయేండ్లింద్రియములు గెల్చి ఘోర తప మొనర్చితిమి. ఓ సొగసుకత్తెలాలా! అట్టి తపమును మే మిపుడెట్లు భంగ మొనరింతుము? నాకు ధర్మనాశకమైన కామమం దిచ్ఛలేదు. బుద్ధిగలాడెవ్వడును పశువు పగిది విషయము లనుభవింపడు. 

అచ్చర లిట్లనిరి : శబ్దము మున్నగు పంచతన్మాత్రల సుఖములందు స్పర్శసుఖము కడు దొడ్డది. అది యానందరస మూలము. దాని సాటి సుఖము మరేదియును లేదు. మహారాజా! కాన నెల్లరీతుల మా మాట పాటింపుము. ఈ గంధమాదన గిరిపై మాతోడ సుఖముగ విహరింపుము. ఇక స్వర్గము గోరుదేని యీ పర్వతము కన్నవేరే స్వర్గము లేనేలేదు. ఈ శోభన స్థములందు శోభనసురాంగనలమగు మమ్ముగూడి ఆనందింపుము.

అధ్యాయము 69 అహంకార ప్రభావము

Chapter 69 The ego effect - అధ్యాయము 69 అహంకార ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 69

అహంకార ప్రభావము

అ యచ్చరల తీయని పలుకు లాకర్ణించి ప్రతాపవంతుడగు ధర్మపుత్రుడిపుడు నేనేమి చేయవలయునని విమర్శించుకొనుచుండెను. నేను వీరిని గూడినచో నీ మునులలోన నవ్వుల పాలగుదును. నాకీదుఃఖ మహంకారమున కల్గినది. ఇపుడింక విచారించి లాభములేదు. ధర్మవినాశమునకు మూలకారణ మహంకారమే గదా! ఈ సంసార మహావృక్షమున కహంకారమే మూలమని మహాత్ములు సైతము వచింతురు. ఈ వలపుకత్తెలను గాంచిన వెంటనే నేను మౌనముగ నేలయుండకుంటిని! ఆ వార్త కామినులతోడ మర్మభాషణములు సలుపుట వలన నేనిన్ని వెతలకు గురియైతిని. 

అంతేకాక నా తపోధనము వ్యయించి ఈ ఉత్తమ సుందరులను బుట్టించితిని. ఈ ప్రమదోత్తమలు కామాతురలై నన్ను వదలకేదో బాధపెట్టుచున్నారు. నేనిపుడు సాలెపురుగు పగిది స్వయంకృతాపరాథమున జిక్కుకొంటిని. వీరి తీరని వలపుపాశములచేత కట్టివేయబడితిని. ఇపుడు నా కర్తవ్యమేమి? నేనొకవేళ యీ వన్నెల చిన్నెల మిటారులను వదలుతుననుకొందము. అపుడు వారు భగ్న హృదయలగుదురు. నన్ను శపించి మఱి యేగుదురు. అపుడు నేను వీరివలన ముక్తుడవై యొంటరిగ తిరుగుచు తపమొనర్తును. 

కనుక నేనిపుడు నింపాదిగ కోపము తెచ్చుకొని యీ సుందరాంగులను విడనాడుదును ఆనుచు ఆ నారాయణ ఋషి యిట్లు తన మదిలో తలపోసెను. ఆ నారాయణుఢాత్మసుఖము బడయగోరి తనలోతా నిట్లాత్మ విమర్శము చేసికొనెను: 

ఈ క్రోధము మిక్కిలి సంతాపకారకమైనది. ఇది రెండవ శత్రువు. ఈ లోకములందు క్రోధము కామము కంటె చెడ్డది. లోభము కంటే నతిదారుణమైనది. కోపిష్ఠుడైన నరుడు ప్రాణవినాశకమైన హింస చేయును. ఈ కోప మెల్లభూతముల యెడదలందును దుఃఖాగ్నిని రగుల్కొల్పును. ఇది నరక మనెడు తోటలోని దిగుడు బావి వంటిది. రెండు చెట్ల రాపిడి వలన బుట్టిన యగ్ని యా చెట్లనే కాల్చివేయును. అటులే యీ శరీరమునందలి యెదలో బుట్టిన దారుణమైన కోపాగ్ని యీ శరీరమంతయు గాల్చివేయును అని యిట్లు దీనముగ చింతించుచున్న నారాయణుని నరుడు గాంచెను. 

ధర్మపుత్రుని తమ్ముడగు నరుడు తన యన్నకిట్లని వాస్తవము తెలిపెను: ఓ నారాయణా! ఓ మహానుభావా! కోప ముడుగుము. గర్వమును మొదలంట నడచివేయుము. శాంతభావ మాశ్రయించుము. తొల్లి యహంకార దోషముననే గదా మన తపమున కాటంకము వాటిల్లినది.

ఈ దురహంకారాది భావముల చేతనే కదా తొల్లి మనము దానవుడగు ప్రహ్లాదునితో దివ్యసహస్ర వర్షములు ఘోరముగ పోరాటమొనరించితిమి. సురోత్తమా! ఇట్లు మనము మునుపు దుర్భర దుఃఖము లనుభవింతిమి. మునివరా ! కనుక కినుక వదలుము. ఆత్మశాంతి బొందుము. శాంతమే తపమునకు మూలబీజమని మునులు వక్కాణింతురు. 

వ్యాసు డిట్లనెను : ఆ నరుని వచనములు విని ధర్మనందనుడు పరమ శాంతుడయ్యెను. 

జనమేజయు డిట్లనెను: ఓ మునివర్యా! నాకొక శంకగల్గుచున్నది. ఏమన - ఆ ప్రహ్లాదుడు మహా భాగవతోత్తముడు గదా! ఆతడు శ్రీవిష్ణు భక్తుడు గదా? పరమ శాంతుడు గదా? అంతటి మహాత్ముడు నరనారాయణ మహర్షులతోడ నేల పోరు సలిపెను? ఆ ధర్మపుత్రులు తాపసోత్తములు - శాంతమనస్కులు. అట్టివారితో ప్రహ్లాదునకెట్లు సమాగమము గలిగెను? ఆ ప్రహ్లాదుడు గూడ ధర్మాత్ముడు గదా! అట్టివాడు వారితో నేల బవర మొనర్చెను? తాపసులు - సత్వ సంస్థితులు - నైన ఆ నరనారాయణులకు ప్రహ్లాదునితో వైరమేల సంభవించెను? 

ఇంకిటులే జరుగుచో తపము - ధర్మము శ్రమ మాత్రముగ మిగులును గదా! ఏలయన, తొల్లిటి సత్యయుగమునందు తపము లేదు. జపము లేదు. ఇంటి తపోనిరతులు సైతము వట్టి యహంకార మయమగు కోపమును జయింపలేకుండిరి. అహంకారపు మొలక లేనిచో కోపమునకు తావేది? అసూయకు నిలుకడయేది? ఈ యహంకారము వలననే కామక్రోధాది భావములు కల్గుచుండును. కోటి వేల ఏండ్లు తపించ వచ్చును. కాని, యొక్క యహంకారపు మొలకెత్తగనే యాతపఃఫలమంతయును సూర్యుడుదయింపగనే చీకటి వ్రీలిపోవునట్లు నశించును. ఒక్క గరువపు మొలక చిగుర్చగనే తపః పుణ్య మంతయును వమ్మగును. ఆ మహనీయుడగు ప్రహ్లాదుడును హరితో రణమొనరించెను. ఓ రాజ! ఆ ప్రహ్లాదుని పున్నెమంతయు వ్యర్థమయ్యెను. శాంతిపరాయణులైన నరనారాయణులు తమ తపఃఫలమును చెడగొట్టుకొనిరి.

వారెప్పుడు పోరాటమునకు దిగిరో అపుడే వారి సుకృతము-శాంతి-మంటగలిసెను. ఏలయన నంతటి సత్త్వ సంపన్నులు గూడ అహంకారమును జయింపలేకపోయిరి గదా! ఇంక నా బోటివాడు గర్వము నెట్టణచుకొనగలడు? ఈ త్రిభువనములందెవ్వడో యొక్కడహంకారము లేనివాడు మున్ను లేడు. ముందుండబోడు. ఇనుప సంకెళ్ళచే బంధింపబడినవా డొకవేళ ముక్తుడు గావచ్చును. కాని, పనికి మాలిన యహంకారముచే బద్ధుడైనవాడెన్నడు విముక్తుడు గాజాలడు. ఈ చరాచర జగమంతయు నహంకారమయము. జీవుడు మలమూత్రములతో కంపుగొట్టు సంసారమందు పరిశ్రమించుచుండును. ఇట్టి మోహమయమైన సంసారమునందింక బ్రహ్మజ్ఞానమెట్లు గల్గును? 

ఓ సువ్రతా! మునివ్రతా! కావున అన్నిటికన్న కర్మ ప్రధానులగు మీమాంసకుల మతము యుక్తమైనదని నాకు దోచుచున్నది. మహాత్ములు గూడ నిరంతరము కామక్రోధములచే నిబద్ధులయి యుందురు. ఇక నీకలియుగమున మా బొంట్లకు గతి ఏమి? 

వ్యాసు డిట్లనెను : ఓ భారతా! కారణము కంటె కార్యము భిన్నముగ నుండదు. గుండ్రని చెవి కుండలములు స్వర్ణమయములైనట్లు చరాచర బ్రహ్మాండమంతయు నహంకార మయమై యొప్పెసగుచుండును. వస్త్రమునకు కారణము దారములు. దారముల వలననే వస్త్ర మేర్పడును. అటులే యీ స్థావరజంగమాత్మకమైన జగములెల్ల గుణత్రయముతో రచింపబడి యుండును. అవన్నియు మిథ్యలే. లేనివానివంటివే. అట్టి వానిని గూర్చి వంతజెంద నేల? బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు సైతము అహంకార సమ్మోహితులై యుందురు. ఆ త్రిమూర్తులు నీయగాధమైన నిస్సార సంసారములో బడి కొట్టుమిట్టాడు చుందురు. నారదుడు-వసిష్ఠుడు మున్నగు మునివరులు పరమజ్ఞానులు. వారు సయిత మీసంసారమందు మాటి మాటికి జన్మము దాల్చుచుందురు. 

కాన ఓ రాజా! ఈ జగములం దహంకృతి లేనివాడు లేడు. ఈ మాయాత్రిగుణముల వలన ముక్తుడై శాంతుడై ఆత్మ సుఃయైనవాడొక్కడుగూడ లేడు. ఈ కామక్రోధలోభాదులన్నియు నహంకారము నుండి పుట్టినవే. ఇవి దేహధారిని క్షణమైన విడిచి యుండజాలవు. వేదశాస్త్రములెల్ల చదివి పురాణములు విమర్శించువాడు గలడు.

దానము ధ్యానము దేవతార్చనము తీర్థాటగనము చేయువాడును గలడు. ఐన నతడు అహంకారముతో విషయలంపటుడై యెల్లపనులను దొంగవలె నాచరించు చుండును. కామము-మోహము-మదముతో నిండిన గుండెగలవాడు మొదట నేదియు వాస్తవ మెఱుగనేరడు. 

కృతత్రేతాద్వాపర యుగములందు గూడ ధర్మముండెను. కాని, ఆ యుగములందును ధర్మమునకు హాని గలిగెను. ఇంక నీ కలికాలము సంగతి చెప్పనేల? ఈ కలియుగమున మనస్స్పర్థలు లోభ రోషములు గల్గుచుండును. ఈ కలియుగమందిట్టి చెడుతలపులు పెక్కులు గల్గుచుండును. ఇట్టి కలిని గూర్చి యిక చెప్పెడి దేమి యుండును? ఈ కలికాలమున మత్సరము లేనివారు - సాధువులు లేరు. ఈ కలిలో కామక్రోధములు గెలిచినవారు లేదు. 

రాజిట్లనెను: మద మోహములు విడిచినవారే పుణ్యాత్ములు - వారే ధన్యజీవులు. ఈ త్రైలోక్యము జితేంద్రియులు - సదాచార సంపన్నులు నైన వారిచే జయింపబడినది. నా తండ్రి మహాత్ముడు. ఐన నత డొనరించిన పాతకమును నేనెంతయో బాధపడుచున్నాను. ఏ పాపములేని యొక తపసి మెడలో నా తండ్రి యొక చచ్చిన పామును తెచ్చివేసెను. ఆ దొసగు తొలంగుటకు నాకర్తవ్యమేమో తెలుపుము. నేను మోహవిభ్రాంతుడను. నా కర్తవ్య మేమో నాకు తెలియుటలేదు. మూఢాత్ముడు తేనె త్రాగజూచునే కాని తన యెదుట నున్న పర్వత ప్రపాతమును గాంచలేడు. ప్రతి నరుడును పనికిమాలిన పనికి బూనుకొనునే కాని ముందు రాబోవు నరకమునకు వెఱగొందడు. 

ఓ మునివరా! పూర్వము నరనారాయణులతో ప్రహ్లాదున కేల పోరు ఘటిల్లెనో తెల్పుము. వారేల పోరిరో నాకు దెలుపుము. మొదలా ప్రహ్లాదుడు పాతాళము విడిచి భూమి మీద కేల వచ్చెను? అతడు సారస్వత మహాతీర్థము-పుణ్యప్రదము నైన బదరికాశ్రమము నేల చేరెను? ఆ నరనారాయణులు పరమశాంతులు - తాపసోత్తములు - గదా. వారకారణముగ నేల రణమొనరించిరి? భార్యా ధనములు గుఱించి సహజముగ పరస్పరవైరము గులుగుచుండును. 

ఆ మును లీషణత్రయములు లేనివారు గదా! సనాతనులు గదా! ప్రహ్లాదుడును కడు ధర్మాత్ముడు గదా! వారి ఘోర సంగ్రామ మేల సంఘటిల్లెనో తెలుపుము. బ్రాహ్మణ దేవతా! వారన్నియు తెలిసిన వారయ్యు నేల పోరాడిరో తత్కారణ మంతయును సవిస్తరముగ విన గోరిక యగుచున్నది. దయతో నాకు వినిపింపుము అని జనమేజయుడు వ్యాసుని ప్రశ్నించెను.

Chapter 67 The influence of the asceticism of Naranarayana - అధ్యాయము 67 నరనారాయణుల తపఃప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 67

నరనారాయణుల తపఃప్రభావము

నృపవర్యా! వేయేల? ఈ ప్రపంచ మంతయు గాలించినను ద్రోహబుద్ధిలేని ధర్మాత్ముడు నూటికి కోటి కెక్కడనో యెవ్వడో లభించును. సృష్టికి ఆరంభమందుకూడ నీ చరాచరవిశ్వము రాగద్వేషమయమై యున్నది. ఇక కలి దూషితమైన యీ కాలమున దాని సంగతి చెప్పనేల? 

ఓ నృపా! దేవతలలోనే యీర్ష్య ద్రోహము కపటము గలవారు గలరు. ఇంక నర తిర్యక్కులను గూర్చి చెప్పనేల? ద్రోహ మొనర్చిన వానికి ద్రోహము మరల చేసిన నది సరిసమానముగ నుండును. కాని, ద్రోహము ద్వేషము లేని శాంతునకు ద్రోహము చేయుట దుష్టత్వ మనిపించుకొనను. ఎవ్వ డేని తాపసుడు శాంతుడై జపధ్యాన పరాయణు డైనచో నింద్రు డోర్వలేక యతని తపమునకు విఘ్నములు గలిగించుచుండును. 

సత్పురుషులకు సత్యయుగము మధ్యములకు క్రియాయోగాత్మకములైన త్రేతా ద్వాపర రూప మధ్య యుగములు దుష్టులకు కలియుగము నిర్దేశింపబడినవి. రాజా! ఎప్పుడో యెక్కడో యెవ్వడో యొకడు సత్యధర్మము లనుసరించును. కాని, భిన్న భిన్న యుగములందు భిన్న భిన్న జీపులు దానికి వ్యతిరేకముగ నా యా యుగధర్మముల బట్టి వర్తింతురు. సర్వధర్మ సంస్థితికి వాసనలే ముఖ్యకారణము లందురు. అవి మలినములైనచో ధర్మముగూడ చెడిపోవును. మలిన వాసనలు ఎల్ల విధములుగ సత్యమును చెఱచును. 

పూర్వము బ్రహ్మ హృదయమునుండి ధర్ముడను కుమారు డుండెనని విందుము. ఆ బ్రాహ్మణోత్తముడు సత్యసంపన్నుడు-వేదనిరతుడు. ఆతడు దక్షుని పదిమంది కుమార్తెలను వరించెను. ధర్ముడు వారిని క్రమముగ పాణిగ్రహణము చేసికొనెను. సత్యస్వరూపుడగు ఆతడు వారియందు పుత్త్రులను బడసెను. వారు హరి కృష్ణుడు నరుడు నారాయణుడు నను నలుగురు కుమారులు. వారిలో హరి కృష్ణులు నిరంతరము యోగనిరతులైరి. నర నారాయణులు మహిమాలయమైన హిమాలయము జేరి బదరికాశ్రమ తీర్థమున నుత్తమ తప మాచరించిరి.

ఆ తాపసోత్తములగు పురాణ మునిసత్తములు పావనగంగా విశాల తీరమున సవితృ పరబ్రహ్మమును జపింప దొడంగిరి. ఆ విష్ట్వంశ సంభూతులగు నరనారాయణ పరమర్షులు సంపూర్ణముగా వేయి సంవత్సరముల వఱకు భవ్య తప మాచరించిరి. వారి తపము వేడిమి కీ చరాచర జగము తపించినది. ఆ ధర్మ తనయులు ధ్యాననిష్ఠులైరి. నే నిపుడేమి సేతునని యింద్రుడు సైతము చింతాపరవశుడై యిట్లు కలతను వెతను జెందెను. తాము సిద్ధార్థులైనచో వీరు నా యింద్రాసనము గ్రహింపక యుందురా? 

కనుక వీరి తపమునకు విఘ్న మొనరింపవలయును. దారుణమైన కామక్రోధ లోభములను వీరి చిత్తములందు కలిగించి ఈ మునుల తపస్సునకు విఘ్నము చేయవలయును అని కోరి ఇంద్రుడు గజమధిరోహించి వేగముగ గంధమాదనగిరి కరిగి పుణ్యాశ్రమమున ఆ పరమర్షులను సందర్శించెను. ఆహా! వీరి శరీరములనుండి తపఃకాంతులు విరజిమ్మబడుచున్నవి. వీరు సూర్యులో బ్రహ్మలో విష్ణులో రూపుదాల్చిన యగ్నులో యన నొప్పుచున్నారు. వీరు నిజముగ ధర్మపుత్త్రులు-మహర్షులు. ఈరింత మహోగ్రతపము చేసి యేమి చేయుదరో యని తలపోయుచు నింద్రుడు వారితో నిట్లనెను: 

'ధర్మసుతులగు మహానుభావులారా! మీ తపః ప్రయోజన మేమో తెలుపుడు. నేను మీకు శ్రేష్ఠమైన వర మీయ నేనెంచితిని. మీ తపమునకు సంతసించితిని. మీ కోరిక యెంత యీరానిదైన నిత్తును.' ఇట్లు పలికి యింద్రుడు వారి యెదుట నిలిచెను. కాని, ఋషులు మాత్రము ధ్యాననిష్ఠులై యాత్మచింతనతో అతనితో నేమియును బలుకక మిన్నకుండిరి. అంత నింద్రుడు భయంకరమైన మోహినీమాయను కల్పించి –

సింహములు వ్యాఘ్రములు తోడేళ్లు మున్నగు క్రూర జంతువుల నుత్పన్న మొనర్చెను. వాన గాలి నిప్పులను కల్పించెను. ఇట్లు పలు మారు వారిని భయ పెట్టజూచెను. కాని, యతని బెదరింపులకు ధర్మసుతు లేమాత్రమును జంకలేదు. ఆ తాపసు లింద్రు డిచ్చు వరముల కాస పడకుండిరి. గాలినిప్పుల భయమునకు వెనుకంజ వేయలేదు. అది కని యమరపతి నిజ నివాసమున కేగెను. ఆ తాపసులను సింహవ్యాఘ్రములు చుట్టుముట్టెను. ఐనను వారు తమ యాశ్రమము నుండి యెంతమాత్రమును చలింపలేదు. వారి ధ్యాననిష్ఠకు భంగ మొనరించు వాడెవ్వడును లేకుండెను. 

అట్లా మునివరులు తన భయలోభములకు లొంగిపోలేదని దుఃఖించుచు నింద్రుడు తన యమరావతిలో చింతింపసాగెను. ఆ మునులద్భుత పరాప్రకృతిని-సకల లోకేశ్వరేశ్వరిని-సనాతనిని ఆదిశక్తిని మహావిద్య నుపాసించుచున్నారు. అట్లు ధ్యానించువారి నిష్ఠను మహామాయావి సైతము భంగ మొనర్పజాలడు. ఏలయన - ఆ పరాశక్తి సకల దేవాసుర మాయలకు మహామాయ గదా! ఆ ఋషులు వాక్‌-మాయా-కామ బీజ మంత్రములను ధ్యానించుచు దురితదూరులై యున్నారు. వారి నింకెవ్వరు బాధింపగలరు? ఎవ్వాని చిత్తఫలకమునందు శ్రీత్రిభువనేశ్వరీ బీజము ప్రకట మగుచుండునో వానికి విఘ్న మొనరింపగలవాడెవ్వడు? 

ఆ యింద్రుడును మాయమోహితు డగుట వలననే వారికి ప్రతిక్రియ చేయదలచెను. అపు డింద్రుడు కామవసంతులను బిలిపించి కామునితో నిట్లనియెను: 

మదనా! నీవు రతిని వసంతుని అచ్చరలను తోడుగగొని గంధమాదన గిరిపై బదరి కాశ్రమమున తప మొనరించుచున్న పురాణ పురుషులు ఋషి సత్తములు నైన నరనారాయణుల చెంత కేగుము. అట నొంటరిగ తపించు ఋషులకు తపోభంగము గల్గించుము. వారి చిత్తములు కామాయత్తము లగునట్లు చేయుము. నీ కమ్మని పూములుకుల దెబ్బలతో వారినపి మోహపఱచి యుచ్చాటన మొనరించి మదిలో నోపలేని తాపము రేకెత్తించుము. నా కార్యము చక్కబెట్టుము.

మహానుభావా! ఆ మునులైన ధర్మసుతులను నీ వశము చేసికొనుము. ఈ విశాల ప్రపంచమందలి దేవదానవ మానవులందు నిన్నెదిరించువాడులేడు. నీ బాణపు దెబ్బలు తిని నీకు వశము గానివాడెవ్వడు? నీ ప్రభావమున బ్రహ్మనగు నేను శివుడు చంద్రుడు అగ్ని ఇందరము కామమోహితుల మైనవారమేగదా. 

ఓ పూవిల్తుడా! పరాక్రమముగల నీ పూలబాణాలకు వారొక లెక్కయా? ఈ దేవవారకాంతలను నీకు తోడుగ పంపుచున్నాను. వీరు నీ వెంట రాగలరు. అచటికి రంభ మున్నగు నచ్చరలును రాగలరు. రంభకాని తిలోత్తమకాని కార్యసాధనమున నెఱజాణలు. ఈ శుభకార్యమునకు నీ వొక్కడవే చాలుదువు. ఇంక వీరందఱు నీవెంట నున్న కార్యసాధనమున సంశయమేల యుండును? కాన ఓ మహాశయా! నా కార్యము చక్కపెట్టుము. నీ వాంఛితార్థ మీడేర్తును. 

ఆ తాపసోత్తములను వరదానములతో నా యోపినంత ప్రలోభింపజేసి చూచితిని. ఐనను వారు శాంతముగ నుండి తమ చోటులనుండి చలింపలేదు. నా పడిన శ్రమ యంతయు బూడిదలో బోసిన పన్నీరయ్యెను. అటు పిమ్మట నా మాయను పన్ని యా తపస్వులను భయపెట్ట జూచితిని. ఐనను వారు తమ నెలవులనుండి చలింపలేదు. వారికి తమ మేనులు గాపాడుకొను కోరికి యున్నట్లును లేదు.

ఆ మాటలు విని మదనుడింద్రున కిట్లనెను: వాసవా! నీ మదిలోని కార్యము నిపుడే యొనరింతును. ఆ మునులొకవేళ బ్రహ్మ-విష్ణు-శివుడు-సూర్యుడునను వారిలో నెవరినిగూర్చి ధ్యానించుచున్నను వారిని వశము చేసికొందును. కానీ శ్రీకామ రాజబీజమును శ్రీమహాదేవీ బీజమును నెమ్మదిలో పరమభక్తితో వారు ధ్యానించుచున్నచో నట్టి దేవీభక్తులను వశము చేసికొనుట నా వశముగాదు. ఆ మహాశక్తిని పరమభక్తి భావమున వారు ధ్యానించుచు నా దేవి నాశ్రయించినచో నా పూములుకులు వారిముందు పనిచేయవు అన 

ఇంద్రు డిట్లనియెను: మహానుభావా! నీవు ఈ సర్వులతో సన్నద్ధుడవై తరలుము. నీవు నాకు హితకరుడవు. ఎంత దుస్సాధమైన పనినైనను చేయగలవాడవు. నీవు దక్క నా కితరుడు సహాయము లేదు. ఈ విధముగ నింద్రు డాదేశింపగ మన్మథుడు మొదలుగా నెల్లరును సిద్ధమై ధర్మపుత్రులు దుస్తరతపమొనర్చు చోటి కరిగిరి అని వ్యాసుడు జనమేజయునకు తెలిపెను.

Sunday, April 12, 2026

Chapter 66 Maya Sakthi Effect - అధ్యాయము 66 మాయాశక్తి ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 66

మాయాశక్తి ప్రభావము

జనమేజయుడిట్లనియెను: ఓ మహాభాగా! వ్యాస! మహామేధావీ! నీవు చెప్పిన యాఖ్యానము విని నేను పరమవిస్మయమందితిని. జీవుడీ పాపరూపమైన సంసారబంధనముల నుండి యెట్లు విముక్తుడుగాగలడు? ఏలయన, కశ్యపాత్మజుడు త్రైలోక్యపతియునగు దేవేంద్రుడే యట్టి హేయముల కొడిగట్టిన నింక నరులమాట చెప్పనేటికి? 

మాతృసేవ యను నెపముతో ప్రతినయొనర్చి యామె గర్భముజొచ్చి యందున్న బాలుని చంపుటెంత దారుణకృత్యమో కదా! ధర్మపరిపాలకుడును శాసకుడు నైన త్రిలోకాధిపతియే యంతటి క్షుద్రకార్య మొనర్ప నింక సామాన్యుడెట్లు చేయకుండును? 

జగద్గురూ!అల కురుక్షేత్ర సంగ్రామము నందు నా పితామహులు చేసిన దుష్టకృత్యములకు నా కచ్చెరువు గలుగుచున్నది. అధర్మముగ ప్రవర్తించు వాసుదేవునిచే భీష్మద్రోణకృపకర్ణులు ధర్మాంశజుడగు ధర్మరాజును పురికొలుపబడిరి. వారును దేవాంశజులే! మేధావులే: ధర్మ తత్పరులే! ఈ సంసారము నిస్సారమని యెఱింగిన వారలే! ఐనను వారును ధర్మబాహ్యముగ నిందిత కృత్యము లేల యొనర్చిరి? 

విప్రప్రవరా! అట్లు జరిగినచో నిక ధర్మమునకు చోటేది? ధర్మమునకు ప్రమాణమేది? నేనీ కథానక మాలకించినంతనే నా మనస్సు కలగుండు పడినది. ఒక యాప్తుని వాక్యమును ప్రమాణమను కొందుమేని అట్టి దివ్యదేహధారియు సర్వసముడు నైన యాప్తుడెవడు? లోకములందు పురుషు డెల్ల భంగుల విషయాసక్తుడై రాగవంతుడగుచుండును. అర్థనాశము కలిగిన వానికి తప్పక రాగద్వేషములు కల్గుచుండును. ప్రతివానికిని తన స్వార్థమునకై ద్వేషముతో నసత్యము పలుకవలసి వచ్చును. 

అన్నియు తెలిసిన సత్త్వమూర్తియగు హరియే జరాసంధుని చంపుటకు కపటమున బ్రాహ్మణ వేషము తాల్చెను. అంతటి సత్త్వమూర్తియగు మహానుభావుడే యంతంత పనిచేయగ నిక నాప్తుడెవ్వడు? ఏది ప్రమాణము? అర్జునుడును యాగనిర్వహణమునకు కపట వృత్తి నవలంబించెను గదా? వారు చేసిన యజ్ఞ మెట్టిది? అది యేల శాంతి రహితమైనది? అది పరలోక ప్రాప్తికి గాని యశమునకు గాని చేయబడినదా?

ధర్మమునకు మొదటి పాదము సత్యము, రెండవది శౌచము, మూడవది భూతదయ, నాల్గవది నిష్కామదానము అని పురాణవిదులు పేర్కొందురు. ఆ నాలుగును లేనిచో ధర్మపు ప్రతిపాదమునకు నిలుకడయే లేదు. ధర్మనీతి బాహ్యమైన పని ధర్మమొసంగు ఫలము నెట్లొసగగలదు? వారిలో నే యొక్కరికి ధర్మము నెడల స్థిరమతి లేదని నాకు దోచుచున్నది. ఆ జగత్ర్పభువగు విష్ణువు కపటము కొఱకై వామన రూపముదాల్చి పాపమా బలిని వంచించెను గదా! ఆ బలి నూఱు యాగములకు కర్త - వేదాజ్ఞను తలదాల్చువాడు - ధర్మిష్ఠుడు - దానశీలి - సత్యవాది - జితేంద్రియుడు. 

వ్యాసా! అంతటివాడును ప్రభవిష్ణువగు విష్ణునిచే నకస్మాత్తుగా స్థానభ్రష్టుడయ్యెను. ఇపుడు వారిలో జయ మెవ్వరిది? వామనునిదా? బలిదా? ద్విజోత్తమా! కపట నాటక సూత్రధారియగు వామనుడు బలిని గెల్చెనా? లేక వంచితుడైన బలి వామనుని జయించెనా? నిజము పలికి నా సందియ ముడుపుము. నీవు బహుపురాణకర్తవు - ధర్మజ్ఞుడవు - మహామతివి. కాన వాస్తవము దెలుపుమని నిన్నడుగుచున్నాను. 

వ్యాసు డిట్లనెను: రాజా! ఈ సమస్త భూమండలమును దానము చేసిన బలి నిజముగ గెల్చినవాడు. ఆ హరి బలిని వంచించుటకు వామనత్వమొంది వామనడను పేరును ఖ్యాతి బడసెను. పిమ్మట హరి బలికి ద్వారపాలకుడయ్యెను. కాన దైవ ధర్మము సత్యమగును గాని యితరము గాదు. ఈయెల్ల దేహులకు సర్వభూతాత్మభావముతోడ సత్యపాలన మొనరించుట క్లేశ సాధ్యము. ఈ మహామాయ త్రిగుణాత్మిక - సర్వతోముఖము. ఇదెంతటి వానికిని దాటశక్యము గానిది, ఈ విశ్వము మాయచేతనే విరచింపబడినది. ఇది త్రిగుణముల సమ్మేళనము. కాన వంచకునకు సత్యపాలనమెట్లు సాధ్యమగును? ఈ విశ్వమిట్టి మిశ్రిత గుణములతో జనించినది. ఇది సనాతనము, తిరుగులేని దైవధర్మము. విధి విధానము. వైఖానసాదిమునులు మాత్రము విగత సంగులు - అపరిగ్రహులు - మాయా తీతులు. వారు మానమోహరహితులు - సత్యసంగతులు - తృష్ణారాగవర్జితులు వారు మాత్రమే సత్యధర్మమునకు దృష్టాంతముగ బేర్కొనదగినవారు.

ఓ రాజా! ఈ యంతయును త్రివిధ గుణమయము. కాన వేదపురాణములందు ధర్మశాస్త్రములందు నేక వాక్యత గన్పట్టదు. సగుణరాగవంతుడు సగుణకార్యము లొనరించును. కాని, నిర్గుణుడు సగుణచేష్ట లెన్నడును సలుపడు. ఈ త్రిగుణము లెల్లవేళల కలిసి మెలిసి యుండునే కాని విడివిడిగ నుండజాలవు. కనుక నిర్మలమును సుస్థిరమునైన పరమధర్మ మందెవని బుద్ధి నిలుచును? మహారాజా! ఈ బలవత్తరములైన యింద్రియములు నరుని మాయామోహితునిగ జేయును. 

కనుక నింద్రియములు జన్మకు హేతువు లగుచున్నవి. మనస్సే యింద్రియములలోన దగులుకొని వెడలజాలకుండును. ఈ మనసు వలన వివిధ భావ పరంపరలు గలుగుచుండును. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవఱకు నున్న స్థావరజంగమములైన యెల్ల ప్రాణులు నిరంతరము త్రిగుణములచే ప్రేరితము లగుచుండును. మాయా వశవర్తు లగుచుండును. ఆ మాయాశక్తి యెంతటి వారినైన మోహమున ముంచివైచి యాడించుచుండును. ఈ జగములను వికారవంతములుగ జేయుచుండును. 

నరేంద్రా! ఈ నరుడేదేని పనిని మొదలు పెట్టుచో నతడు తొలుత నసత్యము లాడ నేర్చుకొనును. పిదప విషయభోగము లాకాంక్షించును. అవి తనకు దక్కనప్పుడు వానికొఱకు వంచనకైన పాల్పడును. దానిచే నతనికి దురితములు సంభవించును. కాన కామక్రోధలోభములు బలవత్తరములగు శత్రులు (నరకద్వారములు - ఆత్మ వినాశకములు). ఈ శత్రువులకు బానిసలైన నరులు మంచిచెడ్డల వివేక మెఱుంగరు. వారికి సంపదలం దహంకారము మిన్నుముట్టగ పుట్టుచుండును. అహంకారము వలన సమ్మోహము-సమ్మోహమున బుద్ధినాశము-తుదకు నాశము-గల్గును. ఈ జీవుల మనస్సులం దనేక సంకల్ప వికల్పములు పుట్టుచు నడగుచుండును. ఈ చిత్తమునందు నెల్లవేళల నసూయాద్వేషములు-ఆశ-తృష్ణ-దైన్యము-దంభము-దుర్మతి రగులుకొనుచుండును. ఈ చెడుభావము లెల్ల జీవులను మోహవశులుగ జేయుచుండును. నరుడు యజ్ఞ దానములు తీర్థ వ్రత నియమములు నాచరించును.

కాని వాని నెల్ల గర్వాతిరేకమున సలుపుచుండును. అహంకారముతో జేసిన యే చిన్నపనియైనను నిర్మలముగ నుండజాలదు. రాగలోభములతో జేసిన పను లెల్లను నపవిత్రములుగ నుండును. కనుక పండితులు మునుముందుగ ద్రవ్యశుద్ధి గమనింపవలయును. ఎట్టి ద్రోహబుద్ధియు లేక సంపాదించిన ధనము ధర్మకర్మములందు ప్రశస్తమైనది. ద్రోహముతో నార్జించిన ద్రవ్యముతో నరుడు శుభకార్యము లొనరింపగూడదు. అట్లొకవేళ చేసినచో నది ఫలించు కాలమున విపరీతముగ మారును. అతి నిర్మలహృదయుడు నిష్కాముడు మనస్వియైన వాడొనరించిన పని చక్కగ ఫలవంత మగును. మనస్సు వికారమయమైనచో నాశించిన ఫలితము చేకూరదు. 

కావున యజమానులు ఋత్విగాదులు ఆచార్యవర్యులు - వీరు విశుద్ద మనస్కులుగ నుండవలయును. దేశకాలము లందును ద్రవ్యమందును కర్తృ క్రియలయందును మంత్రములందును శుద్ధి యుండవలయును. అపుడు యజమాను డాశించిన ఫలము పూర్తిగ ప్రాప్తించును. ఏలన, స్వార్థాభినివేశము గలవానికి మంచి చెడ్డల వివేకము గలుగదు. అట్టివాడు దైవాధీనుడై పాప మాచరించును గాని సుకృత మొనరింపడు. ఎల్ల దేవదానవులును ప్రజాపతి వలన నుద్భవిల్లిరి. ఐనను వీరు స్వార్థపరులును పరస్పర విరోధులునై వర్తింతురు. దేవతలు సత్త్వగుణ సంజాతులనియు మనుజులు రజోగుణ సంభూతులనియు తిర్యక్కులు తమోగుణ జనితము లనియు శ్రుతులందు గలదు. అమరులు సత్త్వసంజాతులైనను వారిలో వారికి పరస్పర వైర మనవరతము సంభవించుచుండును. ఇక తిర్యక్కులందు జాతి వైరమున్నదన్న నందు విచిత్ర మేమున్నది? దేవతలు సతతము ద్రోహపరులు-తపోవిఘ్నకరులు. వారు ద్వేషనిరతులు. పరస్పర వైరులు-అసంతుష్టులుగ నుందురు. కావున నీ సకల ప్రపంచ మహంకార సముత్పన్న మగుటచే నీ ప్రపంచ మెట్లు రాగద్వేష రహితముగా నుండగలదు?

అధ్యాయము 67 నరనారాయణుల తపఃప్రభావము

Chapter 65 The reason why Aditi, Kashyap were born as Devaki Vasudeva - అధ్యాయము 65 అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 65

అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

వ్యాసడు నిట్లనియె: శ్రీహరి యొక్కయు సకల దేవతల యొక్కయు నవతారములకు కారణము లనేకములు గలవు. ఇపుడు దేవకీ రోహిణీ వసుదేవుల సంభవమునకు యధార్థ హేతువుల వచింతును, ఆలకింపుము. 

మున్నొకప్పుడు కశ్యపమహర్షి తన యాగము కొఱకు వరుణదేవుని ధేనువు నపహరించెను. వరుణు డెంతగ వేడిను కశ్యపుడు దాని నతనికి తిరిగి యీయలేదు. అంత వరుణుడు జగత్ర్పభువైన బ్రహ్మ సన్నిధి కేగి యతనికి సవినయముగ దీనముగ దోసిలియొగ్గి తన దుఃఖము నిట్లు వెల్లడించెను: 

మహానుభావా! కశ్యపుడు నా గోవు నపహరించి యున్మత్తుడై యీయకున్నాడు. ఇక నేనేమి సేయవలయును? మనుష్య లోకమున గోపాలుడవు గమ్మని నే నతని శపించితిని. అతని యిరువురు భార్యలు నతి దుఃఖితులై యతని చెంతనే యుండగలరు. తల్లిలేని ఆవుల దూడలు ఇచట బాధపడుచున్నవి. కావున ఆ తరుణమున నదితి దుఃఖితయై కారాగారమున వసించి మృతపుత్త్ర యగు గాక యని శపించితిని అనిన వరుణుని వచనము లాలించి కశ్యపుని పిలిచి

బ్రహ్మ యిట్లు పలికెను: మహానుభావా! నీ వా లోకపాలుని ధేనువులను గ్రహించి మరల నతని కేల యీయకున్నావు? ఇట్టి యన్యాయమున కేల యొడిగట్టితివి? నీవు సర్వజ్ఞుడవు. నీకు న్యాయము తెలియును. ఐనను పరుల సొత్తపహరించి నీ వవినీతి కేల పాల్పడితివి? ఆహా! లోభము మహిమ యేమని చెప్పవచ్చును? అది మహాత్ములను సైతము విడువదు. అది పాప నిలయము - నరకప్రదము - సుజనులకు సమ్మతము గానిది. కశ్యపుడంతటివాడే దానిని వదలజాలకుండెను. ఇక నేమి చేతును? సకల దైవములకన్న లోభము మిన్న యని నాకు దోచుచున్నది. 

ఈ లోకములందు వైఖానస మహర్షులే ధన్యజీవులు. ఏలన, వారు ప్రతిగ్రహ విముఖులు - ఆత్మ చింతనపరులు - శాంతులు - జిత లోభులు. ఈ ప్రపంచము నందు లోభము కడు చెడ్డది. మహా శత్రువు - అపవిత్ర వస్తువు. అది కశ్యపు నంతటి వానిని దన సాంగత్యమున దురాచారునిగను సామాన్యునిగను మోహవశునిగను జేసినది.

ఇట్లు పలికి బ్రహ్మ కూడ తన మనుమడును మునివరుడును మిక్కిలి యిష్టుడగు నగు కశ్యప మునిని ధర్మరక్షణ కొఱకిటుల శపించెను. నీవు నీ యంశముతో నిలపై యదువంశమున నీ భార్యలతో గూడి జన్మమందుము. అట గోపాలక వృత్తితో మనుము.'' ఇట్లు భూభార మడగుటకును కశ్యపుడు నిజాంశమున జన్మించుటకును వరుణ బ్రహ్మల శాపములు మూలకారణము. ఇట్లే దితియు. నీ యేడుగురు కుమారులును పుట్టగనే మరణింతు'రని యదితిని శపించెను. 

ఇది విని మునిసత్తమా! దితికి గలిగిన శోకమునకు నామె తన సోదరి యింద్రజనని యగు నదితికి శాప మొసంగుటకును గల హేతువేమో తెలుపుము. నాకీ విషయమై శంక కలుగుచున్నది అని జనమేజయుడు ప్రశ్నింపగా, సత్యవతీ సుతుడగు వ్యాసుడు సావధానముగ రాజున కిట్లు సమాధానమిచ్చెను: 

భూమిపతీ! దక్ష ప్రజాపతి కిరువురు పుత్రికలు - దితి - అదితి యనబడువారు. గొప్ప నడువడి కల ఆ ఇరువురును కశ్యపునకు ప్రియ భార్యలైరి. అదితికి మహావీర్యవంతుడైన ఇంద్రుడు జన్మించెను. తనకు నంతటి తేజోవంతుడైన సుతుడు గావలయునని దితి అభిలషించెను. 

'మానదా! ధర్మిష్ఠుడు - ఇంద్ర తుల్యుడు - వీర్యవంతుడు నైన పుత్రుని నాకు ప్రసాదింపుము' అని కశ్యపుని వేడెను. ప్రియుడగు కశ్యపు డామెతో 

'ఓ అదితీ! నీవు శాంతించుము నేను చెప్పు నియమవ్రతమనుష్ఠింపుము. అపుడు నీ కింద్రతుల్యుడు జన్మింపగలడు' అనెను. ఆమె దాని కొడంబడి యుత్తమవ్రత మాచరించెను. ముని దితికి మనోహరమగు గర్భము నిలిపెను. దాని నామె జాగ్రత్తగ భరించెను. ఆ వరవర్ణిని యేకాగ్రచిత్తమున పవిత్రభావములతో పాలు మాత్రము త్రాగుచు నేలపై పరుండుచు పయోవ్రతము సలిపెను. 

అంతలో వీర్యవంతమైన దితి గర్భము సంపూర్ణమయ్యెను. ఆమె యంగము లుజ్జ్వలములై తెల్లగనయ్యెను. అది గని యదితి యిట్లు చింతించెను. 'దితి కింద్రుని బోలు కొడుకు పుట్టినచో నా సుతుడు బలహీనుడగును.'

ఇట్లు చింతించి మానవతి యగు నదితి తన కుమారుడగు నింద్రుని బిలిచి ఇట్లనెను. 'దితి గర్బమున నీకొక వీర్యవంతుడైన శత్రువు పుట్టగలడు. కాన ముందుగ నిపుడే వైరి నాశమున కుపాయము పన్నుము. చక్కగ విచారింపుము. దితి గర్బము నుండి బాలుడు పుట్టుటకు ముందే యతనిని చంపుము. నా సవతిని జూచినప్పుడెల్ల నా మనస్సు కలత జెందును. నా సుఖ మర్మములు ఛేదించినట్లగును. నాకు చిత్తశాంతి కలుగుట లేదు. రాజ యక్ష్మరోగము పగిది శత్రువు పెచ్చుమీఱినచో నతడు నశించడు. కావున ధీశాలి తన పగతుని మొక్క దశలోనే త్రుంచవలయును. ఓ యింద్రా! దితి గర్భ మినుపములికివలె నా యెదలో పడినది. దాని నేయుపాయముననైన సరే తొలగించి వేయుము. నా వాత్సల్యము బడయుగోరుదువేని సామదాన బలములలో దేనితో నైనను నీవు దితి గర్బమును హింసింపవలయును.' అనగా, 

అమరపతి యగు నింద్రుడు తన తల్లి మాటలు విని యాలోచించి తన సవతి తల్లి కడ కరిగెను. అతడు పాప బుద్ధితో నతి వినయము నటించి దితి పాదములకు నమస్కరించి విషగర్భితమైన తీయని మాటలతో ఆమె కిట్లనెను. 'మాతా! వ్రత నియమముల వలన నీ దేహము కృశించినది. కాన నీ సేవకు వచ్చితిని. నా కర్తవ్యమేదియో తెలుపుము. ఓ పతివ్రతా! నీకు పాదము లొత్తుదును. గురుసేవ వలన నక్షయ పుణ్యగతులు లభించును గదా? తల్లీ! నీవు - నా తల్లి అదితి - మీ యిరువురి యందు నా కెట్టి భేదము లేదు' అని ప్రతిన చేసి ఇంద్రు డామెపాదము లొత్తసాగెను. 

పరమపతివ్రతయు కృశాంగియు సులోచనయునగు దితి యతని పలుకులు నమ్మెను. ఆమె యలసట జెందుట వలన సంవాహన సుఖమున వెంటనే నిదురించెను. ఆమె నిద్రాపరవశురాలగుట గని యింద్రుడు శస్త్రము చేతబూని పదిలముగ సూక్ష్మరూపమున నామె శరీరమున ప్రవేశించెను. అట్లు వ్రజపాణి తన యోగబలముతో నామె యుదరము లోనికి జొచ్చి గర్భము నేడు విధములుగ వజ్రముచే ఖండించెను. లోని బాలుడు వజ్రము దెబ్బతిని యేడ్చుచుండెను. ఇంద్రు డతనితో నేడువ వలదని మెల్లమెల్లగ బలికెను.

ఆ యేడు భాగముల నొక్కొక్క దానిని మరల నేడుగ ఖండించెను. అంత వారు నలువది తొమ్మిదిమంది మరుత్తులై జన్మించిరి. ఆ పిదప దితి మేలుకాంచి తన గర్భమట్లగు టెఱిగి దుఃఖించి యింద్రునిపై కుపితురాలయ్యెను. అంతయు స్వసోదరీకృతమని సత్యవ్రతపరాయణ యగు దితి యెఱింగి రోషముతో నింద్రుని నదితిని 'ఇంద్రుడు కపటముతో నా గర్భముచే ఛేదించెను. అటులే యతని త్రైలోక్యరాజ్యవైభవము నశించుగాక! పాపచారిణి యగు నదితి పాపమతితో నా గర్భపాత మొనరించెను. నా సుతుడు హతుడయ్యెను. అదేవిధముగ నామె కొడుకులును పుట్టుటే తడవుగ మాటిమాటికి నశింతురుగాత! ఆమె పుత్త్ర శోకార్తయై కారాగారమందు కాలము గడపుచుండుగాత! ఆమె జన్మాంతర మందుకూడ మృత సంతానవతి యగు గాత' మని శపించెను. 

దితి ఇచ్చిన శాపమును కశ్యపుడు వినెను. పిమ్మట కశ్యపుడు ప్రేమగదుర దితిని శాంతిల్ల జేయుచు నామె కిట్లనెను: కల్యాణీ! కోపింపకుము. నీకు బలశాలురగు తనయులు గలుగుదురు. నీ కొడుకు లింద్రసములగుదురు. వారు మరుత్తులనబడు దేవతలగుదురు. నీ విచ్చిన శాప మదితి కిరువది యెనిమిదవ మన్వంతరము నందలి ద్వాపరమున గలిగి తీరును. ఆనాడదితి మానవ జన్మమెత్తి నీ శాప మనుభవించును. వరుణుడును సంతప్తుడై యామెకు ముందే శాపమిచ్చెను. మీ యిరువురి శాపమున నీమె మానవ జన్మ మెత్తగలదు అని యిట్లు తన పతి తన్నూరడింపగ దితి సంతుష్టిజెందెను. 

నాటినుండి యా వరవర్ణిని యెట్టి యప్రియమును బలుకలేదు. రాజా! ఈ విధముగ నీకు దేవకీ వసుదేవుల పూర్వశాప కారణములు వివరించితిని. నృపసత్తమా! ఈ కారణముగ నదితి స్వాంశముతో దేవకిగ జన్మించెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

SRI DEVI BHAGAVATHAM PART 4 - శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

అధ్యాయము 63 జనమేజయుని సంశయములు





అధ్యాయము 68 ఊర్వశి జననం




















శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

Chapter 64 Karmic effect - అధ్యాయము 64 కర్మ ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 64

కర్మ ప్రభావము

జనమేజయుడు సత్యవతీ సుతుడును పరాణజ్ఞుడునైన వ్యాసుని ఈ విధముగ ప్రశ్నించగా వాక్యవిశారదుడగు వ్యాసమహర్షి జనమేజయుని సంశయములెల్ల పాపుట కిట్లుపలికెను. 

వ్యాసమహర్షి ఇట్లు పలికెను: రాజా! ఏమని చెప్పుదును? కర్మగతి మిక్కిలి గహనమైనది. దాని రహస్యము దేవతలకు సైత మంతుపట్టదు. ఇక మానవుల సంగతి చెప్పవలయునా? ఈ జగములు త్రిగుణముల మేళనమున పుట్టుచుండును. జగమంతయును కర్మమువలననే సంభవించును. ఈ కర్మ బీజములవలన బుట్టుచుండు జీవుల కాద్యంతములు లేవు. వారు మాటి మాటికి నానాయోనులందు బుట్టుచు గిట్టుచుందురు. 

కర్మబంధములేనివాని కెన్నటికిని దేహధారణ జరుగదు. ఈ సర్వమును శుభము-అశుభము-మిశ్రమ నను మూడు విధములైన కర్మములచేత వ్యాపించియున్నదని తత్త్వవిదులగు బుధులనిరి. ఆ మూడు విధముల కర్మములును సంచితము ప్రారబ్ధము భవిష్యత్తు నను మూడు విధముల విభక్తమైనవి. ఈ మువ్విధములైన కర్మములును ప్రతివాని జీవితము నెడబాయ కుండును. బ్రహ్మాదులు సేతమా కర్మమునకు వశులై యుందురు. 

ఎల్ల జీవులకును సుఖదుఃఖములును హర్షశోకములును జరామృత్యువులును కామక్రోధలోభములును దేహగతములైన గుణములు. అవి దైవాధీనములై కల్గుచుండును. స్వర్గమందుగూడ రాగద్వేషములు చెలరేగుచుండును. దేవ నర తిర్యగ్జంతువులకును వికారములు అన్నియు దేహముతోకూడ సంప్రాప్తములై కల్గును. ఆ వికారములన్నియు నాయా ప్రాణుల పూర్వవైరానుయోగముగ స్నేహసంబంధముగ కర్మసూత్ర బద్ధముగ జీవులకు గలుగుచుండును. కర్మ సంబంధము లేనిచో నెల్లప్రాణులకు నుత్పత్తియే లేదు. కర్మమూలముననే సూర్యుడు మింటతిరుగు చున్నాడు. చంద్రుడు క్షయరోగియైనాడు.

కర్మకు ఫలముగనే రుద్రుడు సైతము కపాలముల దాల్చెను. ఈ విచిత్రకర్మము జగదుత్పత్తికి మూలకందము. ఈ కర్మమునకు మొదలులేదు. కాని, ముక్తివలన దీనికి నాశము గల్గును. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచము శాశ్వతమైనదిగా తోచును. కాని, యీ జగములు నిత్యములా కాక అనిత్యములాయని తేలక తికమక పడుచుందురు. ఈ జగము నిత్యమో అనిత్యమో జను లెఱుగరు. కాని, యిది మాత్రము మాయామయమై నిత్యమైనట్లుగ దోచును. అన్ని విధములుగా నొక కారణము వ్యాపించి యుండగ కార్యము లేదనుట పొసగదుగదా! కావున నీ మాయ నిత్యమై అన్ని విధముల నన్నిటికి కారణభూతమై నిజమై యున్నది. 

కనుక ఓ రాజా! ఈ జగదుత్పత్త్యాది రూపమయిన సంసారగతికి కర్మము సహకారి కారణమనియు అందుచేతనే ఈ జగత్తులును అనిత్యములనియు ఈ జగత్తులన్నియు కర్మములచే నియంత్రితములై వాటికి లోబడి నడుచు చుండుననియు వివేకులెరుగవలయును. రాజవర్య! 

అమితతేజస్వియగు విష్ణువు సైతము తన యిచ్చ మెచ్చునట్లుగ నచ్చిన జన్మమెత్త జాలడు. అతడిట్లెత్తగలిగినచో వైకుంఠధామ మందలి సుఖభోగములు విడనాడి యుగయుగమున నీచయోనులం దేల జన్మింప దలచును? కమ్మని పూలవాసనలు విరజిమ్ము తోటల విహారము జలక్రీడలు సుఖాసనములు కాలదన్ని యీ మలమూత్రముల కొంపలోనే బుద్ధిశాలి వసింపదలచును? మెత్తని పూసెజ్జను నెట్టివైచి యే పండితుడైన గర్భపుసంచిలో తలక్రిందుగపడి యుండగ గోరుకొనునా? పెక్కు రాగగీత వాద్యముల సుఖమువదలి యెంతటి విద్వాంసుడైనను గర్భవాస నరక మనుభవింప దలచునా? వదలరాని మహాలక్ష్మియొక్క మధుర హావభావరాగములు వదలి యే మతి మంతుడు నరకాస మనుభవింపదలచును? ఏ ప్రాజ్ఞుడీ మలమూత్రముల రసపాన మొనర్పదలచును? ఈ ముజ్జగాలలో గర్భవాస దుఃఖమును మించిన నరకము మరొకటి లేదు.

ఇట్టి ఘోరదుఃఖములకు కారణమైన కర్మమునకు భయపడి మనీషులును మునులునైన వారు రాజభోగములు వదలి దుస్తరతప మొనర్ప వనముల కేగుదురు. ఆ గర్భనరకమునకు భయపడినవాడు మూఢుడై మరల దానినే చేర గోరుకొనునా? గర్భవాస మందున్న వానిని పురుగులు తినుచుండును. వానికి జఠరాగ్ని తాపము మిక్కుటముగ గలుగుచుండును ఆ దారుణ గర్భవాస మందున్నవాడు మాయచే మాంసముచే చుట్టబడియుండవలయును. వానికంటె కారావాసమేని సంకెళ్లతో బంధింపబడుటేని కొంత మేలు గాదా? 

గర్భవాస మొక క్షణమాత్రమైన దైనను నది సుఖవంతమైనది కాదు. అనగా నిండుగ పది నెలలు గర్భవాసమున నుండుట మిక్కిలి బాధాకరమును దుఃఖప్రదమును సుమా! అటుపిమ్మట నతిదారుణమైన యోని యంత్రపుటిరుకునుండి బయలు వెడలుట మరింత పీడాకరము. అజ్ఞుని రీతిగను మూగవలెను బాల్య మందుండుటయు నింకను దుఃఖకరము. ఆ పుట్టిన శిశు వాకలిదప్పులను తెలుప నసమర్థుడై పరతంత్రుడై భీతుడై యుండును. 

బాలుడు ఆకలిగొని యేడ్చునపుడు తన తల్లి మిక్కిలి చింతించును. ఆ బాలుడధిక వ్యాధి పీడితుడైనచో నతని తల్లి యతనికి మందు త్రాపును. ఇట్లు బాల్యమున పెక్కు దుఃఖములు గలుగుచుండును. 

కాన, విబుధులే సుఖశాంతు లాశించి యింతటి ఘోరతర దుఃఖములను చేజేతుల నేలకొని తెచ్చుకొందురు ఎడతెగని సుఖమును విడిచి ఏ మూఢుడు శ్రమకరమును సుఖమును నశింపజేయునదియునగు మానవ జన్మమును - అది దేవతలకు కూడ భయపడక వారి నెదిరించి యుద్ధము చేయుట కవకాశమిచ్చున దైనను - కావలెనని కోరుకొనును? బ్రహ్మాది దేవతలును తమ తమ కర్మ పరిపాకము ననుసరించి సుఖాసుఖము లందుదురు. 

కునుక దేహము ధరించిన దేవతలు నరులు పశుపక్ష్యాదులు సైతము నెవరు చేసిన కర్మము వారనుభవింపక యేనాటికిని తీరదు. మానవుడు తపోదానయజ్ఞముల వలన నింద్ర పదవి నందవచ్చును. కాని, యా పున్నెము కొంచెమును క్షీణింపగనే యమరపతియు పతన మందును. శ్రీరామావతారమునందు రామునకు సాయముగ దేవతలు వానరులుగ జన్మించిరి. అట్లే వేల్పులు కృష్ణునకు సహాయముగ యాదవులై పుట్టిరి. ఈ విధముగ శ్రీమహావిష్ణువు యుగయుగమునందును విధిప్రేరితుడై పలువిధములుగ నవతరించి ధర్మ సంరక్షణ మొనరించుచుండును.

ఓ పుడమి ఱేడా! ఈ ప్రకారముగ శ్రీహరి యంతటివాడును రథచక్రము తిరుగునట్టు లద్భుతముగ పలుమారులు పలుయోనులందు తిరుగును. మహనీయుడగు హరి తన యంశాంశముతో భూమిపై స్వయముగ నవతరించి దుష్ట దానవులను దునుమాడుచుండును. 

కనుక నీ కిపుడు విష్ణు నంశమువలన యదువంశమున నవతరించిన కృష్ణుని శుభకరములైన దివ్య జన్మగాథలు వివరింతును వినుము: 

"రాజా! మున్ను శాపకారణముగ కశ్యపు నంశమున జన్మించిన మహాప్రతాపి యగు వసుదేవుడు పశుపాలన వృత్తిలో నుండెను. ఓ భూమీశా! ఆ కశ్యపున కిరువులు భార్యులు గలరు. వారు అదితి-సురస-యనబడువారు. వారు నేలపై దేవకీరోహిణు లను నక్కచెల్లెండ్రుగ బుట్టిరి. వరుణుడు కోపించి వారికి మహాశాప మొసంగెనని విందును.

రాజిట్లనియెను: మహాపతీ! ఆ కశ్యప మహర్షియేమి యపరాధ మొనరించెనని యతడు నతని భార్యయు శపింపబడిరి. నా కంతయు సవివరముగ దెలుపుము. వైకుంఠవాసియు రమానాథుడు నగు శ్రీవిష్ణు భగవానుడు గోకులమున నేల జన్మించెనో నాకు విశదపఱచుము. ఆ దేవముఖ్యుడును విశ్వధారకుడును ప్రభువును అవ్యయుడు నైన నారాయణ భగవాను డెవరి యానతి వలన నవతరించెను? ఆతడు తన దివ్యధామము విడనాడి నేలపై జన్మించి మానవీయకర్మము లేల యొనరించెనో నాకు సంశయముగ నున్నది. ఆతడీ నరజన్మ మెత్తి పలురీతులైన మోసములు జేసి పెక్కు దుష్ట మానవ భావము లనుభవించెను గదా! 

కామక్రోధములు శోక మాత్సర్యములు ప్రేమ వైరములు సుఖదుఃఖములు ఆర్జవ దైన్యములు సుకృత దుష్కృతములు వచనము హననము చలనము పోషణము తాపము విమర్శనము ఆత్మస్తుతి లోభమోహములు కపట దంభములు మున్నగు భావము లెల్ల ఈ నరజన్మమున గలుగుచుండును.

ఆ శ్రీహరి యా శాశ్వత సుఖకరమగు వైకుంఠమును కాలదన్ని యిట్టి క్రూర భావములు గల మనుజ జన్మ మేల గ్రహింపగోరెను? ఓ తాపసేంద్రా! ఆ హరి ధరపై మనుష్య జన్మ మెత్తి ఏ సుఖమునకై ప్రత్యక్షముగ గర్భవాస దుఃఖ మనుభవించెను? మునీంద్రా! మానవ జన్మములో గర్భదుఃఖము బాల్యదుఃఖము ¸యవనమున కామజన్యమగు దుఃఖము గృహస్థ జీవన దుఃఖము గల్గును. 

ఓ ద్విజేంద్రా! ఆ విష్ణు భగవానుడు మాటిమాటికీ మనుజత్వ మంది యేల యింతటి ఘోర దుఃఖము లనుభవించుచుండును? ఆ సుహృత్తముడగు విష్ణువు శ్రీరామాతార మెత్తి వనవాసమున నతిదారుణములును దుఃఖతరములు నగు క్లేశము లనుభవించెను? అపుడు రామచంద్రుడు సీతావియోగ దుఃఖమున సమరములు సల్పెను. సీతను పరిత్యజించెను. ఇట్లు పెక్కు దుఃఖము లనుభవించెను. 

అటులే శ్రీకృష్ణావతార మందును కృష్ణుని కారాగార జన్మము గోకులవాసము ఆలమందలు మేపుట మున్నగునది జరిగినవి. ఆ కృష్ణ భగవానుడు కంసవధ ద్వారకా గమనము మున్నగు పెక్కు సంసార దుఃఖము లేల యనుభవించెను. 

ఓ సర్వజ్ఞా! ముక్తసంగుడు జ్ఞానియగు వాడు తాను సొంతముగ నిట్టి దుఃఖములు బడయగోరుకొనునా? కావున నా యీ సంశయము లన్నియు విచ్ఛేదించి నా కాత్మశాంతి చేకూర్చుము.

అధ్యాయము 65 అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...