Monday, April 13, 2026

Chapter 69 The ego effect - అధ్యాయము 69 అహంకార ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 69

అహంకార ప్రభావము

అ యచ్చరల తీయని పలుకు లాకర్ణించి ప్రతాపవంతుడగు ధర్మపుత్రుడిపుడు నేనేమి చేయవలయునని విమర్శించుకొనుచుండెను. నేను వీరిని గూడినచో నీ మునులలోన నవ్వుల పాలగుదును. నాకీదుఃఖ మహంకారమున కల్గినది. ఇపుడింక విచారించి లాభములేదు. ధర్మవినాశమునకు మూలకారణ మహంకారమే గదా! ఈ సంసార మహావృక్షమున కహంకారమే మూలమని మహాత్ములు సైతము వచింతురు. ఈ వలపుకత్తెలను గాంచిన వెంటనే నేను మౌనముగ నేలయుండకుంటిని! ఆ వార్త కామినులతోడ మర్మభాషణములు సలుపుట వలన నేనిన్ని వెతలకు గురియైతిని. 

అంతేకాక నా తపోధనము వ్యయించి ఈ ఉత్తమ సుందరులను బుట్టించితిని. ఈ ప్రమదోత్తమలు కామాతురలై నన్ను వదలకేదో బాధపెట్టుచున్నారు. నేనిపుడు సాలెపురుగు పగిది స్వయంకృతాపరాథమున జిక్కుకొంటిని. వీరి తీరని వలపుపాశములచేత కట్టివేయబడితిని. ఇపుడు నా కర్తవ్యమేమి? నేనొకవేళ యీ వన్నెల చిన్నెల మిటారులను వదలుతుననుకొందము. అపుడు వారు భగ్న హృదయలగుదురు. నన్ను శపించి మఱి యేగుదురు. అపుడు నేను వీరివలన ముక్తుడవై యొంటరిగ తిరుగుచు తపమొనర్తును. 

కనుక నేనిపుడు నింపాదిగ కోపము తెచ్చుకొని యీ సుందరాంగులను విడనాడుదును ఆనుచు ఆ నారాయణ ఋషి యిట్లు తన మదిలో తలపోసెను. ఆ నారాయణుఢాత్మసుఖము బడయగోరి తనలోతా నిట్లాత్మ విమర్శము చేసికొనెను: 

ఈ క్రోధము మిక్కిలి సంతాపకారకమైనది. ఇది రెండవ శత్రువు. ఈ లోకములందు క్రోధము కామము కంటె చెడ్డది. లోభము కంటే నతిదారుణమైనది. కోపిష్ఠుడైన నరుడు ప్రాణవినాశకమైన హింస చేయును. ఈ కోప మెల్లభూతముల యెడదలందును దుఃఖాగ్నిని రగుల్కొల్పును. ఇది నరక మనెడు తోటలోని దిగుడు బావి వంటిది. రెండు చెట్ల రాపిడి వలన బుట్టిన యగ్ని యా చెట్లనే కాల్చివేయును. అటులే యీ శరీరమునందలి యెదలో బుట్టిన దారుణమైన కోపాగ్ని యీ శరీరమంతయు గాల్చివేయును అని యిట్లు దీనముగ చింతించుచున్న నారాయణుని నరుడు గాంచెను. 

ధర్మపుత్రుని తమ్ముడగు నరుడు తన యన్నకిట్లని వాస్తవము తెలిపెను: ఓ నారాయణా! ఓ మహానుభావా! కోప ముడుగుము. గర్వమును మొదలంట నడచివేయుము. శాంతభావ మాశ్రయించుము. తొల్లి యహంకార దోషముననే గదా మన తపమున కాటంకము వాటిల్లినది.

ఈ దురహంకారాది భావముల చేతనే కదా తొల్లి మనము దానవుడగు ప్రహ్లాదునితో దివ్యసహస్ర వర్షములు ఘోరముగ పోరాటమొనరించితిమి. సురోత్తమా! ఇట్లు మనము మునుపు దుర్భర దుఃఖము లనుభవింతిమి. మునివరా ! కనుక కినుక వదలుము. ఆత్మశాంతి బొందుము. శాంతమే తపమునకు మూలబీజమని మునులు వక్కాణింతురు. 

వ్యాసు డిట్లనెను : ఆ నరుని వచనములు విని ధర్మనందనుడు పరమ శాంతుడయ్యెను. 

జనమేజయు డిట్లనెను: ఓ మునివర్యా! నాకొక శంకగల్గుచున్నది. ఏమన - ఆ ప్రహ్లాదుడు మహా భాగవతోత్తముడు గదా! ఆతడు శ్రీవిష్ణు భక్తుడు గదా? పరమ శాంతుడు గదా? అంతటి మహాత్ముడు నరనారాయణ మహర్షులతోడ నేల పోరు సలిపెను? ఆ ధర్మపుత్రులు తాపసోత్తములు - శాంతమనస్కులు. అట్టివారితో ప్రహ్లాదునకెట్లు సమాగమము గలిగెను? ఆ ప్రహ్లాదుడు గూడ ధర్మాత్ముడు గదా! అట్టివాడు వారితో నేల బవర మొనర్చెను? తాపసులు - సత్వ సంస్థితులు - నైన ఆ నరనారాయణులకు ప్రహ్లాదునితో వైరమేల సంభవించెను? 

ఇంకిటులే జరుగుచో తపము - ధర్మము శ్రమ మాత్రముగ మిగులును గదా! ఏలయన, తొల్లిటి సత్యయుగమునందు తపము లేదు. జపము లేదు. ఇంటి తపోనిరతులు సైతము వట్టి యహంకార మయమగు కోపమును జయింపలేకుండిరి. అహంకారపు మొలక లేనిచో కోపమునకు తావేది? అసూయకు నిలుకడయేది? ఈ యహంకారము వలననే కామక్రోధాది భావములు కల్గుచుండును. కోటి వేల ఏండ్లు తపించ వచ్చును. కాని, యొక్క యహంకారపు మొలకెత్తగనే యాతపఃఫలమంతయును సూర్యుడుదయింపగనే చీకటి వ్రీలిపోవునట్లు నశించును. ఒక్క గరువపు మొలక చిగుర్చగనే తపః పుణ్య మంతయును వమ్మగును. ఆ మహనీయుడగు ప్రహ్లాదుడును హరితో రణమొనరించెను. ఓ రాజ! ఆ ప్రహ్లాదుని పున్నెమంతయు వ్యర్థమయ్యెను. శాంతిపరాయణులైన నరనారాయణులు తమ తపఃఫలమును చెడగొట్టుకొనిరి.

వారెప్పుడు పోరాటమునకు దిగిరో అపుడే వారి సుకృతము-శాంతి-మంటగలిసెను. ఏలయన నంతటి సత్త్వ సంపన్నులు గూడ అహంకారమును జయింపలేకపోయిరి గదా! ఇంక నా బోటివాడు గర్వము నెట్టణచుకొనగలడు? ఈ త్రిభువనములందెవ్వడో యొక్కడహంకారము లేనివాడు మున్ను లేడు. ముందుండబోడు. ఇనుప సంకెళ్ళచే బంధింపబడినవా డొకవేళ ముక్తుడు గావచ్చును. కాని, పనికి మాలిన యహంకారముచే బద్ధుడైనవాడెన్నడు విముక్తుడు గాజాలడు. ఈ చరాచర జగమంతయు నహంకారమయము. జీవుడు మలమూత్రములతో కంపుగొట్టు సంసారమందు పరిశ్రమించుచుండును. ఇట్టి మోహమయమైన సంసారమునందింక బ్రహ్మజ్ఞానమెట్లు గల్గును? 

ఓ సువ్రతా! మునివ్రతా! కావున అన్నిటికన్న కర్మ ప్రధానులగు మీమాంసకుల మతము యుక్తమైనదని నాకు దోచుచున్నది. మహాత్ములు గూడ నిరంతరము కామక్రోధములచే నిబద్ధులయి యుందురు. ఇక నీకలియుగమున మా బొంట్లకు గతి ఏమి? 

వ్యాసు డిట్లనెను : ఓ భారతా! కారణము కంటె కార్యము భిన్నముగ నుండదు. గుండ్రని చెవి కుండలములు స్వర్ణమయములైనట్లు చరాచర బ్రహ్మాండమంతయు నహంకార మయమై యొప్పెసగుచుండును. వస్త్రమునకు కారణము దారములు. దారముల వలననే వస్త్ర మేర్పడును. అటులే యీ స్థావరజంగమాత్మకమైన జగములెల్ల గుణత్రయముతో రచింపబడి యుండును. అవన్నియు మిథ్యలే. లేనివానివంటివే. అట్టి వానిని గూర్చి వంతజెంద నేల? బ్రహ్మ-విష్ణువు-రుద్రుడు సైతము అహంకార సమ్మోహితులై యుందురు. ఆ త్రిమూర్తులు నీయగాధమైన నిస్సార సంసారములో బడి కొట్టుమిట్టాడు చుందురు. నారదుడు-వసిష్ఠుడు మున్నగు మునివరులు పరమజ్ఞానులు. వారు సయిత మీసంసారమందు మాటి మాటికి జన్మము దాల్చుచుందురు. 

కాన ఓ రాజా! ఈ జగములం దహంకృతి లేనివాడు లేడు. ఈ మాయాత్రిగుణముల వలన ముక్తుడై శాంతుడై ఆత్మ సుఃయైనవాడొక్కడుగూడ లేడు. ఈ కామక్రోధలోభాదులన్నియు నహంకారము నుండి పుట్టినవే. ఇవి దేహధారిని క్షణమైన విడిచి యుండజాలవు. వేదశాస్త్రములెల్ల చదివి పురాణములు విమర్శించువాడు గలడు.

దానము ధ్యానము దేవతార్చనము తీర్థాటగనము చేయువాడును గలడు. ఐన నతడు అహంకారముతో విషయలంపటుడై యెల్లపనులను దొంగవలె నాచరించు చుండును. కామము-మోహము-మదముతో నిండిన గుండెగలవాడు మొదట నేదియు వాస్తవ మెఱుగనేరడు. 

కృతత్రేతాద్వాపర యుగములందు గూడ ధర్మముండెను. కాని, ఆ యుగములందును ధర్మమునకు హాని గలిగెను. ఇంక నీ కలికాలము సంగతి చెప్పనేల? ఈ కలియుగమున మనస్స్పర్థలు లోభ రోషములు గల్గుచుండును. ఈ కలియుగమందిట్టి చెడుతలపులు పెక్కులు గల్గుచుండును. ఇట్టి కలిని గూర్చి యిక చెప్పెడి దేమి యుండును? ఈ కలికాలమున మత్సరము లేనివారు - సాధువులు లేరు. ఈ కలిలో కామక్రోధములు గెలిచినవారు లేదు. 

రాజిట్లనెను: మద మోహములు విడిచినవారే పుణ్యాత్ములు - వారే ధన్యజీవులు. ఈ త్రైలోక్యము జితేంద్రియులు - సదాచార సంపన్నులు నైన వారిచే జయింపబడినది. నా తండ్రి మహాత్ముడు. ఐన నత డొనరించిన పాతకమును నేనెంతయో బాధపడుచున్నాను. ఏ పాపములేని యొక తపసి మెడలో నా తండ్రి యొక చచ్చిన పామును తెచ్చివేసెను. ఆ దొసగు తొలంగుటకు నాకర్తవ్యమేమో తెలుపుము. నేను మోహవిభ్రాంతుడను. నా కర్తవ్య మేమో నాకు తెలియుటలేదు. మూఢాత్ముడు తేనె త్రాగజూచునే కాని తన యెదుట నున్న పర్వత ప్రపాతమును గాంచలేడు. ప్రతి నరుడును పనికిమాలిన పనికి బూనుకొనునే కాని ముందు రాబోవు నరకమునకు వెఱగొందడు. 

ఓ మునివరా! పూర్వము నరనారాయణులతో ప్రహ్లాదున కేల పోరు ఘటిల్లెనో తెల్పుము. వారేల పోరిరో నాకు దెలుపుము. మొదలా ప్రహ్లాదుడు పాతాళము విడిచి భూమి మీద కేల వచ్చెను? అతడు సారస్వత మహాతీర్థము-పుణ్యప్రదము నైన బదరికాశ్రమము నేల చేరెను? ఆ నరనారాయణులు పరమశాంతులు - తాపసోత్తములు - గదా. వారకారణముగ నేల రణమొనరించిరి? భార్యా ధనములు గుఱించి సహజముగ పరస్పరవైరము గులుగుచుండును. 

ఆ మును లీషణత్రయములు లేనివారు గదా! సనాతనులు గదా! ప్రహ్లాదుడును కడు ధర్మాత్ముడు గదా! వారి ఘోర సంగ్రామ మేల సంఘటిల్లెనో తెలుపుము. బ్రాహ్మణ దేవతా! వారన్నియు తెలిసిన వారయ్యు నేల పోరాడిరో తత్కారణ మంతయును సవిస్తరముగ విన గోరిక యగుచున్నది. దయతో నాకు వినిపింపుము అని జనమేజయుడు వ్యాసుని ప్రశ్నించెను.

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...