Monday, April 13, 2026

Chapter 68 Birth of Urvashi - అధ్యాయము 68 ఊర్వశి జననం

 శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 68

ఊర్వశి జననం

శ్రీవ్యాసభగవాను డిట్లనెను : అంత ముమ్మెదట వసంతు డా గిరిరాజము మీదికి జేరెను. అట వెంటనే చెట్లన్నియును విరియబూచెను. తుమ్మెదల గుంపులతో విరాజిల్లెను. ఆ వనమునందలి మామిడి వకులము తిలకము మోదుగు సాల తమాల తాలములు మధూకము మున్నగు వృక్షములు చక్కగ పుష్పించి శోభిల్లెను. చెట్ల చివరికొమ్మలపై మనోహరమైన కోకిలారావములు చెవుల పండువులు సేసెను. కొనలు దేరిన తీవియలు చెట్లను పెనవేసికొనెను. అత్తఱి దంపతుల తలపులు రేకులు విప్పెను. స్త్రీ పురుషులు పరస్పరము మదనాతురులై బద్ధానురాగులై ప్రమత్తులై క్రీడాసక్తులైరి. 

అంత నెదలను చల్లపఱచుచు మెల్లని కమ్మని మలయ మారుతము లొలసెను. మునులకు సైతము ఇంద్రియములు వశముతప్పి చెలరేగెను. పూవిలుకాడును రతినిగూడి త్వరితగతితో బదరికాశ్రమము జేరెను. ఆతడు తన యైదు పూబాణములను వింట సంధించి పొంచి యుండెను. రంభ తిలోత్తమ మున్నగు నచ్చరలేమలు నాయాశ్రమముజేరి స్వరతాల లయలతో రాగభావ మధురగానము లొనర్చిరి. వారి మధుర గీతాలాపములు తుమ్మెదల ఝుంకారములు కోయిలల కలకూజనములు ఆలకించి పులకించి ఆ నరనారాయణులు ఎచ్చరికపడిరి. 

ఆ మహర్షులు మాత్రము కాలముగాని కాలమున వసంతశ్రీతో బూచిన వనరాజిని గని యిట్లు చింతాపరులైరి. ఇది సమయము గాని సమయము. ఇపుడీ వసంతర్తువెట్లు గలిగెను? ఎల్ల ప్రాణులును మన్మథాతురులై వశము తప్పి కనబడుచున్నారు. కాల ప్రకృతికి విరుద్ధమైన ఈ సంఘటన మెట్లు ఘటిల్లెనని నారాయణుడు విస్మయముతో తన కనులు దెఱచి నరున కిట్లు పలికెను: 

ఓ సోదరా! ఈ విరియబూచిన చెట్లు గనుము. ఆ చెట్లపైగల కోయిలల కలరావములు తుమ్మెదల రొదలు వినుము.

ఓ మునీ! మృగరాజు తన వాడి గోళ్ళతో గజరాజును చీల్చివేయును. అటులే ఋతురాజగు వసంతుడు నెఱ్ఱనిమోదుగుపూలతో శిశిరర్తువును చీల్చుచున్నాడు. అల్లదిగో! రక్తాశోకము చేతులై మోదుగుపూలు పాదములై నీలాశోకములు కేశములై విప్పారిన కమలము ముఖమై నల్ల కలువలు కన్నులై మారేడుపండ్లు స్తనములై విరిసిన కుందకుసుమములు పలువరుసలై తిలకపుష్పములు కర్ణావతంసములై మంకెన పూవులు పెదవులై ప్రేంకరణపు పూవులు గోరులై పుంస్కోకిలల రవములు కంఠస్వరములై కడిమిపూలు నునుపైన చక్కనివస్త్రములై నెమళుల పించెములు మేలిమిసొమ్ములై సారసస్వనములు అందెల రవళులై జాజిమొగ్గలు మొలనూలై మత్త హంసగతులు నడలై గారపూలు నూగారులై విలసిల్లుచు వసంతలక్ష్మి శ్యామయై నా బదరికాశ్రమమున కేతెంచినది. 

మునీ! ఈ యకాలమున వసంతశ్రీ వచ్చుటకు కారణమేమై యుండును? నాకిది వింతగ నున్నది. దీనిని మన తపోవిఘ్నకారిణిగ నెఱుగుము. వేల్పుకన్నెలు మనకు ధ్యానభంగమగునట్లు మధురగానము వినిపించుచున్నారు. ఇదంతయును మన తపోభంగమునకు పన్నిన యింద్రుని పన్నుగడయేసుమా ఈ యదనుగాని తఱిలో వసంతు డిట్టి ప్రీతి యెట్టు గల్గించును? అ యింద్రుడే మనకు వెఱగొంది యీ విఘ్నమునకు తలపడెనని తోచును. సుగంధులు శీతములు మనోహరములునగు గాలులు వీచుచున్నవి. దీనికి కారణ మింద్రుని పన్నాగము కాక మరేదియుగాదు అని యీ విధముగా భూదేవశ్రేష్ఠుడగు నారాయణుడు పలుకుచుండగానే మదనుడు మున్నగువారు వారికి కంటబడిరి. నరనారాయణ భగవాను లాదేవగణమును గని విస్మితచేతస్కులైరి.

మన్మథుడు-మేనక-రంభ-తిలోత్తమ-పుష్పగంధ-సుకేళి-మహాశ్వేత-మనోరమ-ప్రమద్వర-చారుహాసిని-సంగీతజ్ఞ ఘృతాచి-చంద్రప్రభ-కోకిల భాషిణి-సోమ - అంబుజాక్షి - విద్యున్మాల - కాంచనమాలిని మఱియు వరారోహ లెందరో యా మునుల ముందట ప్రత్యక్షమైరి. అట్లు వచ్చిన కామసేనయగు పదునారు వేల యైదువందల మంది యచ్చరలను గాంచి పరమ మునులు పరమ విస్మయ మందిరి. ఆ దివ్యాభరణ మాల్యములతో మచ్చిక మీఱు దేవకాంతలు మునివరుల కంజలులు ఘటించి వారి యెదుట నిలువబడిరి. వారు భూమిపై దుర్లభము-మదనోద్దీపకమునైన దివ్య మధురగాన మాలపించిరి. 

నరనారాయణు లా గానములను వినిరి. పిదప నారాయణుడు వారితో నీ రీతిగ బలికెను. 'ఓ శోభన మధ్యమలారా! మీరు నాకము నుండి వచ్చి నా కతిథులైతిరి. నేను మీ కాతిథేయుడను. నా యాతిథ్యము స్వీకరింపుడు. మీ రెల్ల రిచటనే సుఖముండుడు.' 

వ్యాసు డిట్లనియెను: ఆ దేవతలు తమకు విఘ్న మొనరింప నింద్రునిచేత బంపబడియుందురని యభిమానవంతుడగు నారాయణుడు తలచెను. వీరి యందచందము లేమాత్రములు? వీరిని తలదన్ను దివ్యవిలాసరూప సంపన్నులను సృష్టింతును. నా తపోబలము చూపగలను' అని యిట్లు నారాయణుడు దలచి తన చేతితో తన తొడ చఱచుకొని వెంటనే యొక్క సర్వాంగ సుందరిని సృజించెను. నారాయణుని ఊరువులనుండి పుట్టుటచే నామె యూర్వశి యనబరగెను. అచ్చర లా సుందరిని గని యొకరి మొగమొకరు వెలవెలపోయి చూచుకొనిరి.

ఆ పిదప నారాయణు డింద్రుడంపిన దేవకామినులకు సేవలు సేయుటకై సోయగమున వారికన్న మిన్నలగు నన్నులమిన్నలను పుట్టించెను. అట్లు పుట్టిన పడుచుకన్నెలు నగుచు పాడుచు పలువిధములగు నుపహారములు చేతులగొని వారి యెట్టయెదుట నిలువబడిరి. ఆ తపోవిభవమున జనించి విభ్రమము గొల్పు నూర్వశిని కన్నార గాంచి దేవాంగనలు మోహితలైరి. వారి మేనులు గగుర్పొడిచెను. వారి మోముతమ్ములు ముదమున విప్పారెను. 

వారపుడు నారాయణున కిట్లనిరి: మేము కడు బాలలము. మీ తపో మాహాత్మ్యమును ఆత్మ స్థిరతను తిలకించితిమి. మిమ్మెట్లు నుతింపవలయునో తెలియకున్నది. మా క్రీగంటి విసపు ములుకులకు దగ్ధుడుగాని వాడు లేడు. కాని, మీ మనస్సులు మాత్ర మేమాత్రమును గంపింపకున్నవి. మీరలు వినివృత్తకాములు-శమదమనిధులు-దైవాంశ సంభూతులు-మునివరులునైన నరహరులని మే మెఱుంగుదుము. మే మింద్రుని పనుపున నతని కార్యసాధన కేతెంచితిమి కాని, మీ సేవకు రాలేదు. 

మే మెంతటి సంచిత పుణ్యభాగ్యమున మీ దివ్య సందర్శన భాగ్యము బడయగల్గితిమో యెఱుగకున్నాము. మేము పాపులము. ఐనను మీరు మమ్ము మీ వారిగ భావించితిరి. మమ్ము శపింపక వదలితిరి. దీన మీ క్షమా గుణము వెల్లడి యగుచున్నది. మహాశయులగు పండితులు తుచ్ఛమైన శాపము లిచ్చి తమ తపస్సును వ్యయము చేసికొనరు అని సురకామినులు సవినయముగ తలలువంచి పలికిరి. 

వ్యాసుడిట్లనెను: కామినుల ఈ పలుకులు విని పరమప్రీతులు ప్రసన్నవదనులు సంతుష్టాంతరంగులు తపోదీప్తాంగులు విజిత కామలోభులు ధర్మాత్మజులునైన నరనారాయణులు మీ వాంఛితములు దెలుపుడు. మేము దీర్తు'మని దేవ కామినులతో నిట్లనిరి. మీ రీ సొగసుకత్తె చారునయన యైన ఊర్వశిని స్వర్గమునకు గొనిపొండు. ఈమెను మేము సురపతికి కానుకగ నిచ్చితిమనుడు. ఆ యింద్రుని సంతృప్తికి తొడలనుండి పుట్టిన యూర్వశి నతనికి సమర్పించితిమి. ఎల్ల దేవతలకు మేలగుత! మీరిక స్వేచ్ఛగ నరుగుడు. మీ రీనాటి నుండి యెవరి తపమునకుగాని విఘ్న మొనరింపకుడు.' 

అప్సర లిట్లనిరి: ఓ నారాయణా! సురశ్రేష్ఠా! మహాభాగా! మేము మీ చరణకమలములను మనసార పరమభక్తితో నమ్మితిమి. మే మింకెక్కడికిని వెళ్ళజాలము. ఓ నాథా! మధుసూదనా! కమలపత్రాక్షా! నీవు మా యెడల సంతుష్టిజెంది మా వాంఛితార్థము లీడేర్ప దలచితివి. వరము లీయదలచితివి. మాలో రగుల్కొను కోర్కి కోరుచున్నాము. వినుము:

ఓ జగత్పతీ ! దేవేశా ! పరంతపా ! నీవు మాకు పతివి గమ్ము. మేము నెయ్యము తియ్యము దోప నిన్నే నిచ్చలు సంసేవింతుము. నీవు పుట్టించిన చారులోచన లిచ్చటనే యుండగలరు. ఊర్వశి మున్నగువారు స్వర్గమేగగలరు. మేము మొత్తము పదారువేల యేబది మంది యువతులము. మే మిచ్చటనే యుండి తాపసోత్తములగు మీ పరిచర్య చేతుము. మాధవా! దేవేశా! మాలోని కోర్కి సఫలమొనరించి సత్యవాదివి గమ్ము. చెలువలు కాశాభంగ మొనరించిన నది హింస యనంబడును అని యిట్లు ధర్మతత్వజ్ఞులగు మునులు వచింతురు. మే మేదో భాగ్యవశమున స్వర్గమునుండి యిచటి కేగుదెంచితిమి. నీ ప్రేమలో బడితిమి. 
ఓ లోకనాథా! దేవేశా! నీవు మమ్ము వదలవలదు. నీవు సర్వసమర్థుడవు.' 

నారాయణు డిట్లనెను: ఇట మేము వేయేండ్లింద్రియములు గెల్చి ఘోర తప మొనర్చితిమి. ఓ సొగసుకత్తెలాలా! అట్టి తపమును మే మిపుడెట్లు భంగ మొనరింతుము? నాకు ధర్మనాశకమైన కామమం దిచ్ఛలేదు. బుద్ధిగలాడెవ్వడును పశువు పగిది విషయము లనుభవింపడు. 

అచ్చర లిట్లనిరి : శబ్దము మున్నగు పంచతన్మాత్రల సుఖములందు స్పర్శసుఖము కడు దొడ్డది. అది యానందరస మూలము. దాని సాటి సుఖము మరేదియును లేదు. మహారాజా! కాన నెల్లరీతుల మా మాట పాటింపుము. ఈ గంధమాదన గిరిపై మాతోడ సుఖముగ విహరింపుము. ఇక స్వర్గము గోరుదేని యీ పర్వతము కన్నవేరే స్వర్గము లేనేలేదు. ఈ శోభన స్థములందు శోభనసురాంగనలమగు మమ్ముగూడి ఆనందింపుము.

అధ్యాయము 69 అహంకార ప్రభావము

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...