Monday, April 13, 2026

Chapter 75 The divine teacher deceives the demons - అధ్యాయము 75 దేవగురువు దానవులను వంచించుట

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 75

దేవగురువు దానవులను వంచించుట

అట్లు ధీశాలియైన బృహస్పతి మోసముతో శుక్రరూపము దాల్చి దైత్యులకు పురోహితుడయ్యెను గదా! ఆ పిదప నతడేమి చేసెను? ఆ దేవగురువు సర్వ విద్యానిధి - అంగిరుని తనయుడు - అంతటి మహాముని యింతటి కపటమునకేల తలపడెను? సత్యము ధర్మమూలమని సకల ధర్మశాస్త్రములు వక్కాణించును. ఆ పరమ సత్యము వలన పరమాత్మ లభ్యమగునని మునులు వక్కాణింతురు. ఆ బృహస్పతి యంతటివాడును దానవులతో మిథ్యావచనములు పలికెను గదా! 

ఇంక నేలోకములో నేగృహస్థుడు సత్యవాది కాగలడు? ఈ యఖండ బ్రహ్మాండములోని విభవములందు భోజ్యమైన యాహారమును బొందుట కంటె మరేదియును లేదు. అట్టి తిండికొఱకు మునులు సైతము వంకర నడకలు నడతురు. 

శిష్టులు కొఱవడుట వలన శబ్దము విషయమున ప్రామాణికత్వ భావన తగ్గిపోయినది. ఆ గురునిలోనే నింద్యవర్తన మున్నదే! ఇంక నతనిలో శిష్ట గుణ మెట్లుండును? దేవతలు సత్త్వసంభూతులనియు మనుజులు రజోగుణజనితులనియును జంతువులు తమోగుణజాతము లనియును మునులు వచింతురు. అమరగురు నంతటివాడు తానే మిథ్యావాది యయ్యెనే: 

ఇంక రజస్తమోగుణములు గల నరులలో సత్యమెవడు పలుకును? ఈ జగత్త్రయము మిథ్యయందు - మాయయను పెంజీకటియందు మునిగి యున్నది. ఇంక సాధారణ జంతువుల కేదిగతి? ధర్మమునకు స్థానమేది? అను సందేహము నాకు గల్గుచున్నది. హరి - బ్రహ్మ - ఇంద్రుడు - ఇతర దేవతలును కపట వర్తనములందు చతురులై యున్నచో ఇంక నల్పబుద్ధులగు నరులమాట చెప్పనేల? ఎల్లదేవతలును తపోధనులగు మునులును కామక్రోధకలుషితులు - లోభోపహత చిత్తులు - కపట రచనా నిపుణులునై వర్తింతురు. 

వసిష్ఠ వామదేవ విశ్వామిత్రాది మునులును గురువును పాపరతులుగదా! ఇక ధర్మాభ్యుదయమునకు గతియేది? బ్రహ్మ ఇంద్రుడు అగ్ని చంద్రుడు మున్నగు దేవతలును పరస్త్రీ లంపటులు గదా! ఇంక భువనములం దార్యత్వ మెక్కడ నుండును?

ఎల్ల సురలును మునులను లోభముచే అభిభూతులై యున్నారు. ఇంకెవరి వాక్కుల నుపదేశ రూపమున మననము చేయవలయును? అని జనమేజయుడు ప్రశ్నింపగా 

వ్యాసమహర్షి యిట్లనెను : బ్రహ్మయేమి? విష్ణువేమి? శివుడేమి? ఇంద్రుడేమి? దేహధారియైన ప్రతివాడును ప్రకృతి వికారములతో బుట్టుచుండును. బ్రహ్మయును విష్ణువును శివుడును నెల్లరును రాగవంతులే. రాగవంతుడు చేయని యకృత్య మేముండును? రాగి తన నేర్పుచే పైకి ముక్తుని పగిది గనబడును. కాని, కష్టములు కలిగిన తఱి ప్రతి రాగవంతుడును గుణములచేత బద్దుడగును. 

కారణము లేక కార్యమెట్లుండును? బ్రహ్మాది దేవతలకును విడదీయ రాని త్రిగుణములే కారణభూతములు. వారి దేహములు సైతము పంచవింశతి తత్త్వముల వలన బుట్టుచుండును. కాని, మరొక విధముగ గావు. ఎల్లరును కాలము సమీపించగనే మరణించవలసినదే. ఇందు రవంతయును సందియము లేదు. 

అందఱు నితరుల కుపదేశించుటలో శిష్టులే. ఏదైన పని జరుగవలసి వచ్చినచో మొదట స్వభావమున కలత బయలుదేరును. ఆ పిదప కామక్రోధ లోభములును ద్రోహమత్సరములును అహంకారమును బుట్టును. తరువాత పని సాధ్యమగును. వీనినన్నిటి నేదేహియును వదలజాలడు. 

ఈ ప్రపంచ మెల్లప్పుడు నిదేవిధముగ సాగుచుండునని పెద్దలందురు. ఈ ప్రపంచము మంచి చెడ్డల కలయిక. కనుక నీ భావ పరంపరలకు భిన్నముగ ప్రపంచ ముద్భవించును. 

ఒకప్పుడు విష్ణుభగవాను డంతటివాడే ఘోరతరముగ తపమాచరించును. ఒకప్పుడు సురపతియును పెక్కు జన్నము లాచరించును. అతడే వేరొకప్పుడు రమణీ విలాసములకు రంజితుడగును. విష్ణువు వైకుంఠ ధామ మందు లక్ష్మీపరవశుడై యామెతో లీలావినోదము లందును. అతడే యింకొకప్పుడు ఘోరదానవులతో దారుణ రణ మొనరించును. 

విష్ణువు సహజముగ దయాసముద్రుడే! ఐనను నతడును పోరు సల్పును. తీవ్రమగు వైరిబాణములచే బాధింపబడును. ఒకప్పుడు దైవయోగమున జయమో పరాజయమో పొందుచుండును. ఇట్లు శ్రీనాథుడైన హరియు సుఖ దుఃఖములలో పరిభ్రమించు చుండును. 

ఇందు శంక రవంతయును లేదు. ఒకప్పుడా విష్ణువే శేషశయ్యపై యోగనిద్రా ముద్రితుడగును.

ఆ విష్ణువు యథా సమయమున స్వభావముచే ప్రతిబోధితుడై మేల్కొనును. బ్రహ్మ - హరి - శివుడు - ఎల్లదేవతలును ఎల్ల మునులును తమకాయు వున్నంత కాలముచు సంచరింతురు. రాత్రి తొలగిపోగా స్థావర జంగమాత్మకమైన జగములు తిరిగి సంభవించును. రాత్రి రాగా నంతయును మరల మహాప్రళయమందు కలియును. 

ఇందు సందేహము లేదు. బ్రహ్మాదులును తమ తమ యాయువులు తీరగనే సంక్షయ మొందుదురు. మరల బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రాది దేవతలు తేజో దేహములతో సముద్భవింతురు. వారు మరల తమ తమ కామాది స్వభావములను పూర్వశక్తులను బొందుచుందురు. ఈ ప్రపంచము కామక్రోధాదుల కలయికలో నిరంతరముగ సాగుచుండును. 

ఇట్టి జగము గూర్చి నీవు విస్మయమంద బనిలేదు. ఈ విశ్వమున పరమార్థ విదుడును సంసార నిర్ముక్తుడైన యుత్తమ పురుషుడు లభించుట కడు కష్టము. ఈ సంసార బాధలకు భయపడువాడు పెండ్లి చేసికొనడు. అట్టివాడు సర్వసంగ పరిత్యాగముతో నిశ్చింతుడై చరించును. 

తొల్లి చంద్రుడు తన గురుని భార్యతో సంగమించెను. ఆ గురుడు తన తమ్ముని భార్యను గూడెను. ఈ రీతిగ నీ సంసార చక్రము రాగలోభాదులతో కలిసి నిరంతరము తిరుగుచుండును. గృహస్థ జీవనయాత్ర సాగించు నరుడే వైరాగ్యముతో సంసారము నిస్సారమని కర్మములు వదలవలయును. 

ఆ విరాగి సచ్చిదానంద స్వరూపిణియైన శ్రీ రాజరాజేశ్వరి నారాధింప వలయును. ఈ చరాచర జగములా త్రిభునేశ్వరి మాయాశక్తిచే నావరింపబడి యుండును. ఈ జగములు మదిరామత్తునివలె పిచ్చివానిరీతి నెడతెగక పరిభ్రమించుచుండును. ఆ జగన్మాత నారాధించినవాడు మాయాగుణముల నుండి విడివడును. మతిమంతుడు. ముక్తి నందవలయును. 

దీనిని మించిన సన్మార్గము మరొకటి లేదు. బుద్ధిమంతుడు జగదేక మాతను సేవించి దయామృతమునకు పాత్రుడు గావలయును.

అట్లు పాత్రుడు గానంతవరకు అమృతానంద మెట్లు గల్గును? ఆ దయావతీమతల్లి యగు తల్లికి గాక మనపై నితరుల కెవ్వరికి దయ కలుగును? కనుక విశుద్ధ చిత్తముతో నా దయామృతనిధిని భజింపవలయును. 

ఏ యమ్మలయమ్మను సేవించిన నరుడు జీవన్‌ ముక్తుడగునో అట్టి దేవిని దుర్లభమగు మనుజ జన్మ నెత్తియు ప్రాణి సేవించనిచో అట్లు మాతను గొలువనివాడు నిచ్చెనపై నుండి క్రిందపడినవాని వంటివాడు. ఈ త్రిగుణమయమైన విశ్వ మహంకారమయము. ఈ జగము సత్యముచే బద్ధమైనది. ఆమెను సేవింపక నరుడు ముక్తుడెట్లు కాగలడు? 

కనుక మానవుడు సకలమును పరిత్యజించి శ్రీ త్రిభువనేశ్వరీ దేవిని సంసేవింపవలయును. 

జనమేజయు డిట్లనియెను : ఓ పితామహా! అట్లు గురుడు శుక్ర రూపము దాల్చి యేమి చేసెను? శుక్రుడెన్నడు తిరిగి రాగల్గెను? నాకంతయు దెలుపుము' అన 

వ్యాసు డిట్లు పలికెను: రాజా! అట్లు శుక్ర రూపమున దాగియున్న మహాత్ముడు బృహస్పతి పిదప నేమి చేసెనో తెలుపుదు నాలింపుము. దైత్యులు గురువును తమ గురునిగ భావించి యతని పట్ల విశ్వాసము గల్గి తన్మయులై యతని యానమేర మీఱకుండిరి. దైత్యులు బహుకాలము శుక్రుని వియోగమున మ్రగ్గిరి. 

కాన వారు గురు మాయామోహితులైరి. వారు విద్యకై శుక్రరూపుని శరణు జొచ్చిరి. ఈ లోకమందెంతటివాడును లోభమునకు వశుడగును గదా! అట నటుల శుక్రుడు జయంతిని గూడి పదేండ్లు నిండుగ క్రీడించెను. ఆ పిదప శుక్రునకు తన యాజ్యులగు దానవజనము జ్ఞప్తికి వచ్చెను. 

దైత్యులు నా మీద కొండంత యాస పెట్టుకొని నాకై యెదురుతెన్నులు చూచుచుందురు. నేనిపుడే వెళ్ళి వారిని గందును. వారు భయాతురులు, నా భక్తులు, వారికి దేవతల భయము గలుగకుండుత! అని మదినెంచి శుక్రుడు జయంతితో ఇటుల పలికెను: 

చారునేత్రీ! నా పుత్రులు దేవతలకు లొంగిపోయిరి. నీ పదేండ్ల గడువు పూర్తియైనది.

కనుక నో సుమధ్యమా! నే నిపుడే వెళ్ళి నావారిని గని తిరిగి వేగిరమే నీ ముంగిటికి చేరుకొందును అనగా ధర్మవిత్తమురాలగు జయంతి  'ఓ ధర్మజ్ఞ! సరి. నీ యిష్టానుసారము గానిమ్ము. నేను నీకు ధర్మలోపము గలిగింప'నని శుక్రునితో ననెను. 

ఆ మాటలు విని శుక్రుడు త్వరితగతి నరిగి దానవుల చెంత నున్న బృహస్పతిని గనెను. బృహస్పతి కపట వృత్తితో యజ్ఞములు నిందించు జైన ధర్మమును దానవులకు బోధించుచుండెను. ఓ యమరవైరులారా! మీ మేలుగోరి నేను నిజము పలుకుచున్నాను. అహింస పరమధర్మము. కాన దుష్టులనుగూడ చంపరాదు. బ్రాహ్మణులు జిహ్వాచాపల్యముతో భోగాసక్తితో వేదములందు పశుహింస తగిన దనిరి. 

కాని, యహింసయే పరమధర్మము సుమా! అని యిట్లు గురుడు వేదశాస్త్రములు నిందించుచు బలుకుచున్న మాటలు శుక్రుడు విని ఆశ్చర్యమందెను. అపుడు శుక్రుడు మదిలో నిట్లు తలపోసెను: 

'ఈ గురువు నాకు పరమశత్రువు. ఈ ధూర్తుని మూలమున నావారు వంచింపబడిరి. లోభము కడుంగడు చెడ్డది. ఇది పాపబీజము. నరకద్వారము. ఆ లోభమునకు లొంగి గురుడంతటివాడు నబద్ధములు ప్రచారము చేయుచున్నాడు. దేవతలందఱకు గురువు గురువు, అతడు ధర్మశాస్త్ర ప్రవర్తకుడు. ఎల్లరకు గురువాక్యము ప్రమాణము గద! 

నేడట్టి గురువే పాఖండమతము బూనెను గదా! ఇట్లు గురువే పాఖండ పండితడయ్యెననిన ఇంక కలుషచిత్తులైన యితరులు లోభవశమున నేమేమి చేయుదురో కదా! నా యాజ్యులు దానవులు మిక్కిలి మూఢాత్ములు. వీరిని నేడీ ద్విజోత్తముడు నటుని వేసము దాల్చి మిక్కిలి మోసగించుచున్నాడు.

అధ్యాయము 76 దైవమే బలవత్తరమను నుపాఖ్యానము

No comments:

Post a Comment

Shakthi Peetam - 5 Jogulamba Shakti Peetam - Alampur - శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం

శక్తి పీఠం -5 అలంపూర్లో (తెలంగాణ) – జోగులాంబ దేవాలయం జోగులాంబ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ జిల్లాలోని అలంపూర్లో ఉన్న దేవి ఆలయం. శక్తి...