Sunday, April 12, 2026

Chapter 64 Karmic effect - అధ్యాయము 64 కర్మ ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము - అధ్యాయము 64

కర్మ ప్రభావము

జనమేజయుడు సత్యవతీ సుతుడును పరాణజ్ఞుడునైన వ్యాసుని ఈ విధముగ ప్రశ్నించగా వాక్యవిశారదుడగు వ్యాసమహర్షి జనమేజయుని సంశయములెల్ల పాపుట కిట్లుపలికెను. 

వ్యాసమహర్షి ఇట్లు పలికెను: రాజా! ఏమని చెప్పుదును? కర్మగతి మిక్కిలి గహనమైనది. దాని రహస్యము దేవతలకు సైత మంతుపట్టదు. ఇక మానవుల సంగతి చెప్పవలయునా? ఈ జగములు త్రిగుణముల మేళనమున పుట్టుచుండును. జగమంతయును కర్మమువలననే సంభవించును. ఈ కర్మ బీజములవలన బుట్టుచుండు జీవుల కాద్యంతములు లేవు. వారు మాటి మాటికి నానాయోనులందు బుట్టుచు గిట్టుచుందురు. 

కర్మబంధములేనివాని కెన్నటికిని దేహధారణ జరుగదు. ఈ సర్వమును శుభము-అశుభము-మిశ్రమ నను మూడు విధములైన కర్మములచేత వ్యాపించియున్నదని తత్త్వవిదులగు బుధులనిరి. ఆ మూడు విధముల కర్మములును సంచితము ప్రారబ్ధము భవిష్యత్తు నను మూడు విధముల విభక్తమైనవి. ఈ మువ్విధములైన కర్మములును ప్రతివాని జీవితము నెడబాయ కుండును. బ్రహ్మాదులు సేతమా కర్మమునకు వశులై యుందురు. 

ఎల్ల జీవులకును సుఖదుఃఖములును హర్షశోకములును జరామృత్యువులును కామక్రోధలోభములును దేహగతములైన గుణములు. అవి దైవాధీనములై కల్గుచుండును. స్వర్గమందుగూడ రాగద్వేషములు చెలరేగుచుండును. దేవ నర తిర్యగ్జంతువులకును వికారములు అన్నియు దేహముతోకూడ సంప్రాప్తములై కల్గును. ఆ వికారములన్నియు నాయా ప్రాణుల పూర్వవైరానుయోగముగ స్నేహసంబంధముగ కర్మసూత్ర బద్ధముగ జీవులకు గలుగుచుండును. కర్మ సంబంధము లేనిచో నెల్లప్రాణులకు నుత్పత్తియే లేదు. కర్మమూలముననే సూర్యుడు మింటతిరుగు చున్నాడు. చంద్రుడు క్షయరోగియైనాడు.

కర్మకు ఫలముగనే రుద్రుడు సైతము కపాలముల దాల్చెను. ఈ విచిత్రకర్మము జగదుత్పత్తికి మూలకందము. ఈ కర్మమునకు మొదలులేదు. కాని, ముక్తివలన దీనికి నాశము గల్గును. ఈ స్థావర జంగమాత్మకమైన ప్రపంచము శాశ్వతమైనదిగా తోచును. కాని, యీ జగములు నిత్యములా కాక అనిత్యములాయని తేలక తికమక పడుచుందురు. ఈ జగము నిత్యమో అనిత్యమో జను లెఱుగరు. కాని, యిది మాత్రము మాయామయమై నిత్యమైనట్లుగ దోచును. అన్ని విధములుగా నొక కారణము వ్యాపించి యుండగ కార్యము లేదనుట పొసగదుగదా! కావున నీ మాయ నిత్యమై అన్ని విధముల నన్నిటికి కారణభూతమై నిజమై యున్నది. 

కనుక ఓ రాజా! ఈ జగదుత్పత్త్యాది రూపమయిన సంసారగతికి కర్మము సహకారి కారణమనియు అందుచేతనే ఈ జగత్తులును అనిత్యములనియు ఈ జగత్తులన్నియు కర్మములచే నియంత్రితములై వాటికి లోబడి నడుచు చుండుననియు వివేకులెరుగవలయును. రాజవర్య! 

అమితతేజస్వియగు విష్ణువు సైతము తన యిచ్చ మెచ్చునట్లుగ నచ్చిన జన్మమెత్త జాలడు. అతడిట్లెత్తగలిగినచో వైకుంఠధామ మందలి సుఖభోగములు విడనాడి యుగయుగమున నీచయోనులం దేల జన్మింప దలచును? కమ్మని పూలవాసనలు విరజిమ్ము తోటల విహారము జలక్రీడలు సుఖాసనములు కాలదన్ని యీ మలమూత్రముల కొంపలోనే బుద్ధిశాలి వసింపదలచును? మెత్తని పూసెజ్జను నెట్టివైచి యే పండితుడైన గర్భపుసంచిలో తలక్రిందుగపడి యుండగ గోరుకొనునా? పెక్కు రాగగీత వాద్యముల సుఖమువదలి యెంతటి విద్వాంసుడైనను గర్భవాస నరక మనుభవింప దలచునా? వదలరాని మహాలక్ష్మియొక్క మధుర హావభావరాగములు వదలి యే మతి మంతుడు నరకాస మనుభవింపదలచును? ఏ ప్రాజ్ఞుడీ మలమూత్రముల రసపాన మొనర్పదలచును? ఈ ముజ్జగాలలో గర్భవాస దుఃఖమును మించిన నరకము మరొకటి లేదు.

ఇట్టి ఘోరదుఃఖములకు కారణమైన కర్మమునకు భయపడి మనీషులును మునులునైన వారు రాజభోగములు వదలి దుస్తరతప మొనర్ప వనముల కేగుదురు. ఆ గర్భనరకమునకు భయపడినవాడు మూఢుడై మరల దానినే చేర గోరుకొనునా? గర్భవాస మందున్న వానిని పురుగులు తినుచుండును. వానికి జఠరాగ్ని తాపము మిక్కుటముగ గలుగుచుండును ఆ దారుణ గర్భవాస మందున్నవాడు మాయచే మాంసముచే చుట్టబడియుండవలయును. వానికంటె కారావాసమేని సంకెళ్లతో బంధింపబడుటేని కొంత మేలు గాదా? 

గర్భవాస మొక క్షణమాత్రమైన దైనను నది సుఖవంతమైనది కాదు. అనగా నిండుగ పది నెలలు గర్భవాసమున నుండుట మిక్కిలి బాధాకరమును దుఃఖప్రదమును సుమా! అటుపిమ్మట నతిదారుణమైన యోని యంత్రపుటిరుకునుండి బయలు వెడలుట మరింత పీడాకరము. అజ్ఞుని రీతిగను మూగవలెను బాల్య మందుండుటయు నింకను దుఃఖకరము. ఆ పుట్టిన శిశు వాకలిదప్పులను తెలుప నసమర్థుడై పరతంత్రుడై భీతుడై యుండును. 

బాలుడు ఆకలిగొని యేడ్చునపుడు తన తల్లి మిక్కిలి చింతించును. ఆ బాలుడధిక వ్యాధి పీడితుడైనచో నతని తల్లి యతనికి మందు త్రాపును. ఇట్లు బాల్యమున పెక్కు దుఃఖములు గలుగుచుండును. 

కాన, విబుధులే సుఖశాంతు లాశించి యింతటి ఘోరతర దుఃఖములను చేజేతుల నేలకొని తెచ్చుకొందురు ఎడతెగని సుఖమును విడిచి ఏ మూఢుడు శ్రమకరమును సుఖమును నశింపజేయునదియునగు మానవ జన్మమును - అది దేవతలకు కూడ భయపడక వారి నెదిరించి యుద్ధము చేయుట కవకాశమిచ్చున దైనను - కావలెనని కోరుకొనును? బ్రహ్మాది దేవతలును తమ తమ కర్మ పరిపాకము ననుసరించి సుఖాసుఖము లందుదురు. 

కునుక దేహము ధరించిన దేవతలు నరులు పశుపక్ష్యాదులు సైతము నెవరు చేసిన కర్మము వారనుభవింపక యేనాటికిని తీరదు. మానవుడు తపోదానయజ్ఞముల వలన నింద్ర పదవి నందవచ్చును. కాని, యా పున్నెము కొంచెమును క్షీణింపగనే యమరపతియు పతన మందును. శ్రీరామావతారమునందు రామునకు సాయముగ దేవతలు వానరులుగ జన్మించిరి. అట్లే వేల్పులు కృష్ణునకు సహాయముగ యాదవులై పుట్టిరి. ఈ విధముగ శ్రీమహావిష్ణువు యుగయుగమునందును విధిప్రేరితుడై పలువిధములుగ నవతరించి ధర్మ సంరక్షణ మొనరించుచుండును.

ఓ పుడమి ఱేడా! ఈ ప్రకారముగ శ్రీహరి యంతటివాడును రథచక్రము తిరుగునట్టు లద్భుతముగ పలుమారులు పలుయోనులందు తిరుగును. మహనీయుడగు హరి తన యంశాంశముతో భూమిపై స్వయముగ నవతరించి దుష్ట దానవులను దునుమాడుచుండును. 

కనుక నీ కిపుడు విష్ణు నంశమువలన యదువంశమున నవతరించిన కృష్ణుని శుభకరములైన దివ్య జన్మగాథలు వివరింతును వినుము: 

"రాజా! మున్ను శాపకారణముగ కశ్యపు నంశమున జన్మించిన మహాప్రతాపి యగు వసుదేవుడు పశుపాలన వృత్తిలో నుండెను. ఓ భూమీశా! ఆ కశ్యపున కిరువులు భార్యులు గలరు. వారు అదితి-సురస-యనబడువారు. వారు నేలపై దేవకీరోహిణు లను నక్కచెల్లెండ్రుగ బుట్టిరి. వరుణుడు కోపించి వారికి మహాశాప మొసంగెనని విందును.

రాజిట్లనియెను: మహాపతీ! ఆ కశ్యప మహర్షియేమి యపరాధ మొనరించెనని యతడు నతని భార్యయు శపింపబడిరి. నా కంతయు సవివరముగ దెలుపుము. వైకుంఠవాసియు రమానాథుడు నగు శ్రీవిష్ణు భగవానుడు గోకులమున నేల జన్మించెనో నాకు విశదపఱచుము. ఆ దేవముఖ్యుడును విశ్వధారకుడును ప్రభువును అవ్యయుడు నైన నారాయణ భగవాను డెవరి యానతి వలన నవతరించెను? ఆతడు తన దివ్యధామము విడనాడి నేలపై జన్మించి మానవీయకర్మము లేల యొనరించెనో నాకు సంశయముగ నున్నది. ఆతడీ నరజన్మ మెత్తి పలురీతులైన మోసములు జేసి పెక్కు దుష్ట మానవ భావము లనుభవించెను గదా! 

కామక్రోధములు శోక మాత్సర్యములు ప్రేమ వైరములు సుఖదుఃఖములు ఆర్జవ దైన్యములు సుకృత దుష్కృతములు వచనము హననము చలనము పోషణము తాపము విమర్శనము ఆత్మస్తుతి లోభమోహములు కపట దంభములు మున్నగు భావము లెల్ల ఈ నరజన్మమున గలుగుచుండును.

ఆ శ్రీహరి యా శాశ్వత సుఖకరమగు వైకుంఠమును కాలదన్ని యిట్టి క్రూర భావములు గల మనుజ జన్మ మేల గ్రహింపగోరెను? ఓ తాపసేంద్రా! ఆ హరి ధరపై మనుష్య జన్మ మెత్తి ఏ సుఖమునకై ప్రత్యక్షముగ గర్భవాస దుఃఖ మనుభవించెను? మునీంద్రా! మానవ జన్మములో గర్భదుఃఖము బాల్యదుఃఖము ¸యవనమున కామజన్యమగు దుఃఖము గృహస్థ జీవన దుఃఖము గల్గును. 

ఓ ద్విజేంద్రా! ఆ విష్ణు భగవానుడు మాటిమాటికీ మనుజత్వ మంది యేల యింతటి ఘోర దుఃఖము లనుభవించుచుండును? ఆ సుహృత్తముడగు విష్ణువు శ్రీరామాతార మెత్తి వనవాసమున నతిదారుణములును దుఃఖతరములు నగు క్లేశము లనుభవించెను? అపుడు రామచంద్రుడు సీతావియోగ దుఃఖమున సమరములు సల్పెను. సీతను పరిత్యజించెను. ఇట్లు పెక్కు దుఃఖము లనుభవించెను. 

అటులే శ్రీకృష్ణావతార మందును కృష్ణుని కారాగార జన్మము గోకులవాసము ఆలమందలు మేపుట మున్నగునది జరిగినవి. ఆ కృష్ణ భగవానుడు కంసవధ ద్వారకా గమనము మున్నగు పెక్కు సంసార దుఃఖము లేల యనుభవించెను. 

ఓ సర్వజ్ఞా! ముక్తసంగుడు జ్ఞానియగు వాడు తాను సొంతముగ నిట్టి దుఃఖములు బడయగోరుకొనునా? కావున నా యీ సంశయము లన్నియు విచ్ఛేదించి నా కాత్మశాంతి చేకూర్చుము.

అధ్యాయము 65 అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

No comments:

Post a Comment

Chapter 66 Maya Sakthi Effect - అధ్యాయము 66 మాయాశక్తి ప్రభావము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ  స్కంధము - అధ్యాయము 66 మాయాశక్తి ప్రభావము జనమేజయుడిట్లనియెను: ఓ మహాభాగా! వ్యాస! మహామేధావీ! నీవు చెప్పిన యాఖ్యానము వ...