Friday, April 17, 2026

Chapter 144 The Battle of Haihaya Kalaketa - అధ్యాయము 144 హైహయ కాలకేతుల యుద్ధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 144

హైహయ కాలకేతుల యుద్ధము

రాజా! అట్టి యశోవతి పలుకులు విని మహావీరుడైన యేకవీరుడు ప్రసన్న వదన కమలముతో నామెకిట్లు పలికెను : 

రంభోరూ! నీవు లలిత మృదువచనములతో నడిగిన వృత్తాంతము చెప్పెదను వినుము. నేను హైహయ వంశీయుడను. నాపేరేక వీరుడు. నేను లక్ష్మీ పుత్రుడను. నీవు నా మనస్సును పరవశము చేసితివి. నేను విరహవేదనచే కృశించుచున్నాను. ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? మొదట నీవతిలోకమైన నీ చెలి సింగారపుమేనిసొంపులు వర్ణించితివి. నా యెడద కామబాణహతమై దాని కువ్విళ్ళూరు చున్నది. 

ఆమె గుణవర్ణనమున నా చిత్తము నాలో లేకున్నది. ఆమె నన్ను దోచుకొనినది. ఈ రెంటిపిదప నీవు రాక్షసవృత్తాంతము చెప్పితివి. అది విని నాకు వింతగనున్నది. అంతటి రాక్షసుని కాలదన్ని 'నేను హైహయునే వరించితిని. అతని కంటె నన్యునివరింప'నని యేకావలి తెంపుతో రక్కసుని ముందు చెప్పినదా! ఆమె పల్కిన ఈ మాటలకు నే నామెకు దాసుడనైతిని. ఇపుడు నీకేమి మేలుచేసి పెట్టవలయునో తెలుపుము. 

సులోచనా! నాకా దుష్టరాక్షసుడున్న చోటు దెలియదు. అతని పురమునకు వెళ్ళు మార్గము తెలియదు. సుందరీ! విశాలసుందరాక్షీ! నన్నామె ముందునకు చేర్చుటకు నీవే తగినదానవు. కనుక నన్ను నీ చెలికత్తెయుండు చోటునకు త్వరగ జేర్చుము. నేనా క్రూరరాక్షసుని నిలువున చంపగలను. 

వివశత్వముతో శోకసంతప్తయగు నీ ప్రియరాజ పుత్రిని విడిపింపగలను. ఆమె మదిలోని తీరనివెత తీర్చగలను. ఆమెను నగరి కంపగలను. ఆ యేకావళి నామె తండ్రి కప్పగింపగలను. ప్రియవాదినీ! ఆ పిదప రాజామెకు పెండ్లి చేయును. ఇది నా నిశ్చితాభిప్రాయము. నీ కోర్కెయు నిదేకదా! ఇపుడు నీ ప్రయత్నమున సర్వము సమకూరును. కనుక రాక్షసుని పురము చూపుము. ఇక నా పరాక్రమము చూడుము.

వరవర్ణినీ! శుభకార్యములు చేయించుటకు నీవే తగిన జాణవు. ఆ దురాచారి పరదారల నపహరించువాడు; అతనిని నేను సంహరించు విధానము గల్గింపుము. వాని దుర్గమమైన పురమునకు త్రోవజూపుము అను ప్రియవచనములు వినిన యశోవతి ముదితురాలయ్యెను. అపుడామె రమాసుతుడు రాక్షసునిజేరు నుపాయమిట్లు చెప్పెను: 

రాజా! శ్రీభగవతి యొక్క సర్వసిద్ధ ప్రదమగు మహామంత్రము గలదు. దానిని స్వీకరింపుము. మహాత్మా! ఆ రాక్షసుడు నిసించు పురమును నీ కిపుడే చూపగలను. నీవు నాతో వచ్చుటకు సిద్ధపడుము. కాలకేతు మహావీరుడు. పెక్కుమంది రాక్షసులు వాని కండగ నున్నారు. అతని బలము చాల గొప్పది. అచట మీ యిర్వురకు పోరు సాగగలదు. 

కనుక నీవు శ్రీదేవీమంత్రము గ్రహించి నావెంటరమ్ము. ఆ దుష్టుడున్న పురము త్రోవ నీకు జూపగలను. నీవా పాపకర్ముని చంపి నా చెలిచెఱ బాధ తొలగింపుము. అను నామె తీపి పలుకులు విని యేకవీరుడు మంత్రము గ్రహించెను. అంతలో దైవయోగమున నచటికి మహాజ్ఞాని యగు దత్తాత్రేయ డరుదెంచెను. ఏకవీరు డా ఋషి వలన త్రిలోకతిలకాయమానమై శుభనామముగల శ్రీయోగేశ్వరీ మహామంత్రము గ్రహించెను. ఆ మంత్ర ప్రభావమున నతని కన్నియు నెఱుగు శక్తియు నంతట తిరుగు శక్తియు గల్గెను. 

అతడు యశోవతిని గూడి రక్కసుని చొరరాని పురికి పయనమయ్యెను. యశోవతి కొంతసేనను వెంటగొనివచ్చెను. ఆ క్రూర రాక్షసుని పురము పన్నగములు గల పాతాళమువలె రాక్షసులచే రక్షింపబడుచుండెను. అట్టి పురమును హైహయుడును యశోవతియు జేరిరి. ఆ రీతిగ దండెత్తివచ్చుచున్న వీరునిగని రాక్షస భటులు భయపడి రోదించుచు కాలకేతుని చెంతకరిగిరి. అత్తఱి రాక్షసు డేకావళి చెంత గూర్చుండి కామమోహితుడై వినయముగ ప్రియములు పలుకుచుండెను. అది గని భటులతనికిట్లనిరి : 

రాజా! ఈ కామిని చెలియగు యశోవతి యొక రాకుమారుని వెంట పెట్టుకొని గొప్ప సేనతో వచ్చుచున్నది.

ఆ వీరుడు జయంతుడో! కార్తికేయుడో తెలియుట లేదు. అతడు రణమదోన్మాదమున సేనా సమేతముగ వచ్చుచున్నాడు. పోరాటము సిద్ధమైనది. త్వరపడుము. ఆ దేవపుత్రునితో నీవు పోరుము. లేదా యీ కమలాక్షిని వదలి పెట్టుము. వారి సైన్యము మూడు యోజనములంత మేర వ్యాపించినది. నీవును సిద్దపడుము. వేగ రణభేరి మ్రోగించుము అను భటుల మాటలు విని రాక్షసుడు క్రోధమూర్ఛితుడై తన బలశాలురగు సాయుధ రాక్షసుల నిట్లు పురికొల్పెను: 

రాక్షసులారా! మీరు శస్త్రపాణులై వైరులను మార్కొనుడు; వెళ్ళుడు అని రాజు తన భటుల కాజ్ఞాపించెను. కాని, తాను మాత్రము ప్రేమపూర్ణుడయ్యెను. అతడు వివశుడై తనచెంత దుఃఖించుచున్న యేకావళితో నిట్లనియెను : 

'ఓ తన్వంగీ! ఆ వచ్చువాడెవడు? నీ తండ్రియా లేకె పరపురుషుడా? తలోదరీ! నీ కొఱకు సేనతో వచ్చువా డెవడై యుండును? ఒకవేళ నీ తండ్రి నిన్ను బాసియుండలేక వచ్చుచున్నాడేమో? అతడు నీ తండ్రియైనచో నేనతనితో యుద్ధము చేయను. అతనికి నా యింటికి సగౌరవముగ దెచ్చి పూజించి రత్న వస్త్రహారములిచ్చి సత్కరింతును. అతనికి నా యింట సర్వ విధముల నాతిథ్య మిత్తును కాక! 

అతడు పరవీరుడైనచో నతనిని నా వాడియమ్ములతో దునుముదును. అతడీ మహాకాలుని చేతిలో చచ్చుటకే వచ్చుచున్నాడు. కనుక నో విశాలాక్షీ! ఆ వచ్చుచున్న మందమతి యెవడు? అతడు దుర్ధర్షడను మహాబలుడనగు నా లావెఱుగక వచ్చుచున్నాడు కాబోలు! అతడెవడో తెలుపుము 

ఏకావళి యిట్లనెను : మహాత్మా! ఆ వచ్చుచున్న వీరుని నే నెఱుగను. నీ చెఱలో నున్న నాకేమియు తెలియదు. అతడు నా తండ్రిగాని సోదరుడు గాని కాదు. ఎవడో మహావీరుడు గాబోలు! అతడెందులకు వచ్చుచున్నాడో నాకు నిజముగ తెలియదు. 

రాక్షసు డిట్లనెను : 'నా భటులు నాతో ఏకావళి చెలి యశోవతి పనిగట్టుకొని యొక వీరుని వెంటబెట్టుకొని వచ్చుచున్నదనిరి. ఇంతకు నీ సఃఖి కార్యకుశల, ఆమె యెచటి కేగెను? నాకు ప్రతి వీరుడగు వైరి యెవ్వడును లేడు' అని రాక్షసు డనుచున్నంతలో భటులు కొందఱచటికి వచ్చిరి.

తన యింటిలో నున్న కాలేకేతునకు త్వరితముగ వారిట్లనిరి : రాజా! సైన్యము మనమీద వచ్చిపడుచున్నది. ఇంకను తీరికగ నిట్లు కూరుచుంటికేమి? నీవు వెంటనే గొప్ప సేనతో నగరు వెడలుము. భటుల మాటలు బలశాలియగు కాలకేతువు వినెను. అతడరదమెక్కి వేగముగ దన నగరము బయటి కేగెను. 

అదే సమయమున ప్రతాపియగు నేక వీరుడును రథమెక్కి వచ్చెను. ఏక వీరుడును కామినీ వియోగమున తపించుచుండెను. అంత వారిర్వురును వాసన వృత్రుల వలె ఘోరముగ పోరు సాగించిరి. వారి శస్త్రాస్త్రముల తళతళలతో నింగి మిఱుమిట్లు గొల్పుచుండెను. వారి పోరు పిరికి గుండెలదరిపడునట్లు దారుణముగ సాగుచుండెను. అంతట రమాపుత్రుడు రాక్షసుని గదతో గట్టిగ కొట్టెను. 

ఆ దెబ్బకు వాడు వజ్రాహతమగు గిరి వలె నేలగూలెను. తక్కిన రక్కసులెల్లరు భయకంపితులై కాలికి బుద్ధి చెప్పిరి. అపుడు యశోవతి యేకావళిని సమీపించి వింతగ తీయగ నిట్లనియెను : 

ఓ చెలియా! రారమ్ము; ఒక రాకుమారునిచేత దానవుడు నిహతుడయ్యెను. ఆ వీరు డేకవీరుడు. అతడు మహాధీరుడు. అతడు దారుణముగ పోరి దానవుని చంపెపను. అతడు మిక్కిలి శ్రమ జెంది సేనల గుడారములో సేద దీర్చుకొనుచున్నాడు. 

చపలాక్షీ! ఆ రాజవరుడు మన్మథుని చందమున నందగాడు. ఆ వీరుడు నీ యెదలోని దొడ్డ సుగుణములు విని తన కన్నుల కరవు దీర్చుకొన నిన్ను చూడ కాంక్షించుచున్నాడు. నేను గంగాతటమున నిన్ను గుఱించి యతనితో నెమ్మిగదుర బలికితిని. అతడు నా ప్రియవచనములకలరి రాగమగ్నుడై విరహాతురుడయ్యెను. ఆ నరపతి నందనుడు నీ సురూపమును తమితీర తిలకింప కోరుచున్నాడు.

ఇట్లనుచున్నంతలో నేకావళిలో పెండ్లి కూతునకు తగిన సిగ్గు తొట్రుపాటు ముంచుకొని వచ్చెను. వివశురాలనగు నేనతని ముఖమెట్లు చూతునాయని యామె తన మదిలో దలచెను. ఆ కామర్తుడు తన్ను తప్పక తన సొంతము చేసికొనునని తలంచు చామె యశోవతితో పూలపల్లకిలో గూర్చుండి వెళ్ళెను. ఆమె మాసిన మేనిపై మాసిన చీరగట్టి రాజున్న గుడారము చెంత కేగెను. ఆ వచ్చుచున్న విశాలాక్షిని వీక్షించి 

రాకుమారు డిట్లనెను: ' పూబోడీ! తన్వీ! నా కన్నులు దప్పికొన్నవి. నీ కన్నులు చినుకు వెన్నెలలవలన వాని దప్పితీరును: అని తన సరసను ముచ్చటాడుచున్న కామపరవశుని క్రీగంట తలవంచుకొన్న ప్రేమముగ్ధ అగు ఏకావళిని యశోవతి గాంచెను. యశోవతి శిష్టాచారము తెలిసినది. 

ఆమె రాకొమరునకిట్లనెను : రాకుమారా! ఈమె తండ్రి యీమెను నీ చేతులలో నుంచదలంచెను. ఇపుడీమె తానుగ నీ హృదిలో నింత చోటుజేసికొనెను. ఇక మీ యిర్వురి సాంగత్యము జరిగితీరును. కొద్ది సమయము వరకు వేచియుండుము. ఈమె నీమె తండ్రి చెంతకు గొనిపొమ్ము. అతడు వివాహ విధి యథావిధి జరిపి యీమెను నీ కప్పగింత పెట్టగలడు అను యశోవతి మాటలలో నిజమెఱింగి రాకుమారుడు సేనతో గదలెను. 

ఆ విధముగ నేకవీరుడిర్వురు జవరాండ్రను గూడి యేకావళి తండ్రి కడకేగెను. తన పట్టి తిరిగివచ్చుట విని రాజు సంతుష్టుడయ్యెను. రాజు మంత్రులను వెంటగొని వారి కెదురుకోలు జరిపెను. చాలా కాలమునకు మలినాంబరములతో తన పుత్రిక గనంబడినందులకు రాజు హర్షించెను. యశోవతి జరిగిన విషయమంతయు దెలిపెను. అపుడు రా జేకవీరుని గలిసి యతనిని సగౌరముగ తన యింటికి తోడుకొని వెళ్ళెను. 

అతడు శీఘ్రతరముగ నొక శుభముహూర్తమున వారికి వివాహము యథావిధిగ జరిపించెను. రాజతనిని సత్కరించి యతనికి పెక్కు వస్తు సంభారములు కానుకగ నొసంగెను. తన కూతు నేక వీరునితో నంపెను. యశోవతి తండ్రి యశోవతిని సైతము రాకుమారుని వెంట నంపెను. ఇట్లు రమా పుత్రుడు వివాహము చేసికొని పరమానందభరితుడయ్యెను. అతడు తన యింటి కరిగి వారిని గూడి పెక్కు సుఖభోగము లనుభవించెను. ఏకావళికి కృతవీర్యుడను పుత్రుడు గలిగెను. కృతవీర్యుని కొడుకు కార్తవీర్యుడును పేర విశ్వవిఖ్యాతి గాంచెను. ఇట్లు హైహయవంశమును వర్ణించితిని.

అధ్యాయము 145 విక్షేపశక్తి వర్ణనము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...