Monday, April 20, 2026

The sale of Harishchandra - హరిశ్చంద్రుని విక్రయం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుని విక్రయం

వ్యాసుడిట్లనెను : విశ్వామిత్రుడు ఇట్లు దయమాలి నిష్ఠురముగ రాజుతో బలికి యాధన మంతయునుగొని కోపముతో వెడలిపోయెను. విశ్వామిత్రుడు వెళ్ళిన పిదప హరిశ్చంద్రుడు మాటి మాటికి వేడి నిట్టూర్పులు వదలుచు తల నేలకు వేసి శోక సంతప్తుడై భోరన నేడ్చుచిట్లనెను. 

నేను కష్టాలు పడుట వలన ప్రేతము వలె నున్నాను. నేడు ప్రొద్దుగ్రుంకు లోపల నన్నెవడైనను కొనువాడున్నచో వెంటనే నా వెల నిర్ణయింపవచ్చును. అనునంతలో ధర్మదేవత చండాల రూపమున నేతెంచెను. అతడు నిర్దయుడు-వికృతాకారుడు-మేన దుర్గంధము వెడలువాడు - పొడవైన మీసలు పొట్టగలాడు - నల్లనివాడు-లంబో దరుడు. భీకరుడు. చేత వెదురుకర్ర దాల్చినవాడు-వెడల్పు ఱొమ్ము గలాడు. ఎముకల మాలలలంకరించుకొన్నవాడు. 

చండాలుడిట్లనెను: నాకొక దాసుడు కావలెను. నేను నిన్ను దాసునిగ తీసికొందురు. నీ కెంత ధన మీయవలయునో వేగమే తెలియజేయుము. క్రూరదృష్టి దుశ్శీలము గల్గి దయమాలిన చండాలుని రూపుగని నీవెవ్వడవని రాజుడిగెను. 

చండాలుడిట్లనెను : రాజా! నేనొక చండాలుడను. ప్రవీరుడని పేరొందితిని. నా శాసనము పాలించుము. నీవు శవముల మీద వస్త్రము తీసికొనుచుండుము. అని పలుకగ 

రాజతని కిట్లనెను: నన్నొక బ్రాహ్మణుడు గాని క్షత్రియడు గాని గ్రహించ వలయునని నేను కోరుచున్నాను. ఉత్తముని ధర్మ ముత్తమముగ మధ్యముని ధర్మము మధ్యమముగ అధముని ధర్మమధమముగ నుండు నని తెలిసినవారందరు. 

చండాలుడిట్లనెను : రాజా! నీ వాలోచించుకొనక యెవడైన నన్నిపుడు గ్రహింపవచ్చునని యేల వెల్లడిచేసితివి! చక్కగ నాలోచించి పల్కినవాడు తప్పక తన అభీష్టమును పొందును. కాని నీవు మాత్ర మాలోచింపక సామాన్యముగ బలికితివి. నీకు సత్యము మీద నమ్మక మున్నచో నేను నిన్ను గ్రహించితిని. 

హరిశ్చంద్రుడిట్లనెను: అసత్యము పలుకు నరాధముడు తప్పక వెంటనే నరకమున గూలును అసత్యము కంటె నాకు చండాలత్వమే మంచిది.

వ్యాసుడిట్లనెను: ఇట్లు పలుకుచున్నంతలో తపోనిధియగు విశ్వామిత్రు డచటి కేతెంచెను. అతడు కన్నుల నుండి మంట లెగయుచుండ 

రాజుతో నిట్లనెను: ఇతడు చండాలుడు. నీకు ధన మీయవచ్చినాడు. కనుక నా కీయవలసిన మొత్తము యజ్ఞ దక్షిణ యేల చెల్లింపవు? 

రాజిట్లనెను: ఓ విశ్వామిత్రా! భగవానుడా ! నన్ను సూర్య వంశజునిగ నెఱుంగుము. నేను ధనాశకు లోబడి యెట్లు చండాల దాసుడను గాగలను? 

విశ్వామిత్రుడిట్లనెను : నిన్ను చండాలుడు కొని యిచ్చిన ధనము నా కీయవలయును. అట్టి ధనము నా కీయకున్నచో నేను నిన్ను తప్పక శపించగలను. చండాలుని నుండి కాని విప్రుని నుండి కాని గ్రహించిన దక్షిణా ధనము నా కిచ్చివేయుము. ఇపుడు చండాలుడు తక్క మరెవ్వడును ధన మిచ్చు వాడులేడు. 

రాజా! నేనును ధనము తీసికొనక యెట్టిపరిస్థితులలోను వెళ్ళను. నా ధనము నా కిప్పుడే అరగడియ ప్రొద్దుండు లోపల నీయకున్న నా శాపాగ్నిచే నిన్ను కాల్తును. అంత 

హరిశ్చంద్రుడిట్లనెను: నే నార్తుడను. నీ దాసుడను. విశేషించి నీ భక్తుడను. దీనుడను. ఓ విప్రర్షీ! దయబూనుము. ఈ చండాల సహవాసము నాకు తొలగింపుము. ఓ మునివర్యా! మిగిలిన ధనము చెల్లించుటకు నేను నీకే సేవలు చేయగలను. నీ మనసునకు వచ్చినట్లే మసలుకొనగలను. 

విశ్వామిత్రుడిట్లనెను: మహారాజా! నరపతీ! సరే. అట్లే కానిమ్ము. నాకే దాసుడవు గమ్ము. నా చెప్పిన మాట జవదాటకుము. అని ముని పలుకగ రాజు హర్ష మొంది తాను మరల జన్మము నందినట్లు తలచి 

విశ్వామిత్రున కిట్లనెను: ద్విజవర్యా! అనఘా! నేనెల్ల వేళల నీ యా దేశమే పాటింపగలను. నన్నాజ్ఞాపింపకుము. నేను నీ కేమి సేవ చేయవలయును? 

విశ్వామిత్రుడిట్లనెను: ఓ చండాలా! రమ్ము. ఇతడు నా దాసుడు. ఇతనిని నీ కమ్ముచున్నాను. ఇతనిని గ్రహించి నీ వితని కెంత మూల్య మిత్తువో తెల్పుము. నాకు దాసునితో పనిలేదు. నాకు ధనాశ మొండుగ నున్నది. అని ముని పలుకగనే చండాలుడు పరమానంద మొందెను.

అతడు విశ్వామిత్రుని ముందటి కేతెంచి యతనితో నిట్లు పలికెను. ప్రయాగ మండలమున పది యోజనముల వెడల్పు గల నేల; అది రతనాలగడ్డ. ఓ ద్విజోత్తమా! దానిని నేను నీకు సమర్పించుచున్నాను. ఇతనిని నాకిచ్చి నీవు నా కష్టములు గట్టెంక్కించితివి. ఆ పిదప చండాలుడు మునికి వేయి మంచి ముత్తెములు వేయి బంగారు నాణము లీయగ ముని వాని నెల్ల గైకొనెను. 

ఏమి జరిగినను హరిశ్చంద్రుని ముఖము నిర్వికారముగ నొప్పెను. రాజు ధైర్యము బూని విశ్వామిత్రుడే తన స్వామియని భావించెను. అతడే పని చేయించిన నే నా పని చేయగలనని రాజు తలచెను. అంతలో వెంటనే 

యాకాశవాణి యిట్లు పలికెను: ఓ మహనీయా! నీ వీయవలసిన దక్షిణా ధన మిచ్చితివి. ఋణ విముక్తడ వైతివి. ఈ మాట వినిపించగనే దివి నుండి రాజు తలపై పూలజల్లు కురిసెను. అపు డింద్రాదులెల్లరును మేలు మేలని రాజును ప్రశంసించిరి. అంత హరిశ్చంద్రుడు హర్షముతో 

విశ్వామిత్రున కిట్లనెను: ఓ మహామతీ! నీవే నా తల్లివి; తండ్రివి; బంధువవు; ధనము కొఱకు మోహితుడనగు నన్ను క్షణములో ఋణ విముక్తుని జేసితివి. ఓ హిరణ్య బాహూ ! నీ మాట నాకు మేలు వెల్గుల మూట యైనది. నేనిపు డేమి చేయవలయునో తెల్పుము. అని రాజనగా 

ముని యతని కిట్లనెను: రాజా! నేటి నుండి నీవు చండాలుని మాట ప్రకారము నడచుకొమ్ము. నీకు వేయి శుభములగుత మని పలికి ధనముగొని ముని వెడలిపోయెను.

కాటికాపరిగా హరిశ్చంద్రుడు

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...