Tuesday, April 21, 2026

Rohithudi Maranam - రోహితుడిమరణం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - రోహితుడిమరణం

సూతు డిట్లనెను : ఒకనాడు రోహిత కుమారకుడు తోడి బాలురతో నాడుకొనుటకు కాశికిబయట కొంత దూర మేగెను. కొంత తడ వాడుకొనిన పిదప నతడు చివరలుగల మెత్తని చిఱుదర్బలను తన శక్తికొలది కోయుచుండెను. ఇవి ఏల యని బాలురడుగగ నా స్వామి బ్రాహ్మణుడు. ఇవి అతని ప్రీతికని పలికెను. 

అతడు తన రెండు చేతులతో యజ్ఞలక్షణము గల్గి అగ్నిదీపకమగు సమిధ గ్రహించెను. అత డగ్నిలో వేల్చుటకు మోదుగు సమిధలను తీసికొని వాని మోపెటులో నెత్తిని పెట్టుకొని యడుగడుగున దుఃఖించుచు ముందునకు సాగెను. అతడు దప్పికొని నీరున్నచోటికి వెళ్ళి మోపుదింపి నీట దిగెను. 

అతడు దప్పితీర నీరుత్రాగి యొక మూర్తముసేపు సేదదీర్చుకొని తిరిగి మోపెత్తుకొనుటకు దాని నొక పుట్టపై నుంచెను. అంతలో విశ్వామిత్రు నానతి నొక కాలసర్పము ఘోరభీకరముగ విషాగ్నులు గ్రక్కుచు పుట్ట వెడలెను. పాము రోహితుని కాటు వేయగ నతడు నేలపడి యసువులు బాసెను. చచ్చిన రోహితునిగని బాలురు విప్రు నింటి కేగిరి. వారు భయముతో వణకుచు

రోహితుని తల్లితో నిట్లనిరి : ఓ విప్రదాసీ, నీ కుమారు డాటలాడుకొనుటకు బయటకు వెళ్ళెను. అతని నొక పాము కాటు వేసెను. అతడు వెంటనే చనిపోయెను. వారి మాటలు విని యామెకు పిడుగు పడినట్లయ్యెను. పిడుగుదెబ్బ కరటిచెట్టు పడినట్లామె నేలగూలెను. పిమ్మట విప్పుడు కోపముతో నామె మొగముపై చన్నీరు చల్లెను. ఆమె యొక మూర్తమున తెలివొందగ 

విప్రుడామె కిట్లనెను: నీవు రాత్రి సమయమున నేడువరాదు. అది నింద్యము. అలక్ష్మీకరము. ఓసి దుష్టురాలా! ఏడ్చుచున్నావే : నీ హృదయములో సిగ్గు లేదే! అని బ్రాహ్మణుడు పలుకగ నామె పలుకక మిన్నకుండెను.

ఆమె తీరని పుత్రశోకమున పీడితురాలై తలవెండ్రుకలు విడివడగ నేలపైబడి పొరలి యాడుచు కన్నీటిమోముతో దీనముగ నేడ్చేను. అందులకు విప్రుడు కోపించి రాజపత్ని కిట్లనెను. ఓసి దుష్టురాలా! నీవు పనికిమాలినదానవు. నిన్ను డబ్బిచ్చి కొంటిని. ఐన నా పని కడ్డు గల్గించుచున్నావు. నీకు పనిచేతకానిచో నా ధనమేల తీసికొంటివి? అని యతడు నిష్ఠురముగ మాటిమాటి కామెను తూలనాడెను. 

అపుడామె డగ్గుత్తికతో నేడ్చుచు నిట్లనెను : ఓ స్వామీ ! నా కొడు కూరిబయట పాముచే కాటు వేయబడియున్నాడు. అతనిని మరల చూడను. కనుక నా కనుమతి యిచ్చినచో నతనిని కడసారి చూపు చూచుటకు వెళ్ళుదును. అని యామె ఱాల్గరగునట్లు విలపించగ విప్పుడు మఱల కోపించి 

రాజపత్ని కిట్లనియెను: ఓసి దుర్మార్గులారా! ఓసి మొండిదానా! నీకు పాపభీతి లేదేమో! ఒక యజమాని ధనము తీసికొన్నవాడు తన యజమానుని పని నెఱవేర్చవలయును. అట్లు చేయనిచో నతడు మహారౌరవ నరకమున గూలును. అతడచ్చట చాలాకాల ముండి పిదప కోడిగ పుట్టును. 

ఇపుడు నా కీ ధర్మపన్నాలు వల్లించుటతో పని యేమి? పాపరతులు-మూర్ఖులు-క్రూరులు-నీచులు-శఠులు-నగు వారుందురు. అట్టివారి కీ మాటలు చవిటినేల నాటిన విత్తనములవలె వ్యర్థములు. నీకు పరలోక భయమున్నచో రమ్ము. నా యింటిపని చేయుము. అని యనగ నామె గడగడలాడుచు 

విప్రునితో నిట్లనెను: ఓ స్వామీ! సంతోషించి యీ దీనురాలిపై నింత దయ బూనుము. నా కొడుకును చూచి వెంటనే వత్తును. ఒక్క మూర్తము సమయమిమ్ము. అని యామె విప్రుని పాదాలపై తలనిడి బూనుము. నా కొడుకును చూచి వెంటనే వత్తును. ఒక్క మూర్తము సమయమిమ్ము. అని యామె విప్రుని పాదాలపై తలనిడి వేడుకొనెను. ఆమె తీరని పుత్రశోకముతో పీడితురాలై దీనముగ రోదించెను. అపుడు విప్రుడు క్రోధ ముతో కనుగ్రుడ్లెఱ్ఱచేసి యిట్లనెను.

నీ కొడుకేమైన నాకేమి? మొదట నా పనులు చక్క పెట్టుము. నా కోపము నీకు తెలియదా! నా కొరడాదెబ్బ యపుడే మఱచితివా! అని బ్రాహ్మణుడనగ నామె తన గుండె ఱాయిచేసికొని యింటిపనులు చేసెను. నడిరేయి తన స్వామి పాదము లొత్తెను. 

అపుడు విప్పుడామెతో నిట్లనెను : ''ఇక నీవు నీ కొడుకు దగ్గఱకేగి యతని యంత్యక్రియలు జరిపి వెంటనే తిరిగి రమ్ము. తెల్లవారు సరికి వచ్చి నాయింటి పనులకు లోపము గల్గగూడదు.'' అని విని యామె యదే రాత్రి యొంటిగ నేడ్చుచు వెళ్ళెను. ఆమె చనిపోయిన తన కొడుకుమనుగాంచి గుంపునుండి చీలిన లేడివలె దూడ చనిపోయిన యావువలె మిక్కిలి శోకపీడిత యయ్యెను. 

ఆమె కాశీపురి బయటకేగి నేలమీద గడ్డి-కట్టెలు-దర్బ-పై దిక్కులేనివానివలె పడుయున్న తన కొడుకును చూచెను. ఆమె దుఃఖార్తయై భోరున నిట్లు విలపించెను : నా కుమారా ! నామీద నీకింత రోష మేలరా! ఇపుడు నాయొద్దకు రారా ! ప్రతిదినము నీవమ్మా అమ్మా యని పలుసార్లు నా కెదురుగ వచ్చు చుందువే ! ఇపుడు రావేమి? యని యామె యడుగులు తడబడ నతనిమీద పడి మూర్చితురాలయ్యెను. 

ఆమె పిదప తెలివొంది తన రెండు చేతులతో బాలుని కౌగిలించుకొని యతని ముఖముపై తన ముఖముంచి దీనార్తితో రోదించెను. ఆమె పిదప తన చేతులతో నతని తల పోట్ట తాకుచు హా బాలా! హా శిశూ! హా సుందరా: అయ్యో చిన్నారీ! యని గుండె చెఱువుకాగ నేడ్చెను. 

రాజా! నీవు నీ ప్రాణాలకన్న మిన్నగ చూచుకొను నీ కొడుకు నేడు నేలపై పడియున్నాడు. నీ వెక్కడనుంటివో; వచ్చి నీ కుమారుని చూచు కొమ్ము. తన బాలుని ముఖలక్షణములుగని యతడు బ్రతికియే యున్నాడని యామె గ్రహించెను. కాని యతని నల్లబడిన ముఖము తాకి యిట్లెనెను : ఓ కుమారా ! నిదురలెమ్ము. వెంటనే మేలుకొమ్ము. ఇపుడు భయంకరమైన నడిరేయి చిమ్మచీకటి. ఈ రాత్రి భూతప్రేతపిశాచ డాకినుల గుంపులు కేకలు పెట్టుచున్నవి.

నీ నిచ్చెలికాండ్రు వెళ్ళిపోయిరి. నీ వొక్కడవే యిక్క డేల? యని యామె మఱల విలపించెను. 

సూతు డిట్లనెను: ఇటు లామె మఱల పలికి దీనముగ వాపోయెను. అయ్యో! నా ముద్దుల పట్టీ! నా బాలుడా! నా రోహితుడా! నాకొడుకా! నాతో మారు మాటాడవేమిరా! ఓ గారాల పట్టీ ! నేను నీ యమ్మనురా ! నన్నే యెఱుగవురా : నన్ను చూడుము. నేను దేశ మును రాజ్యమును వదిలిపెట్టి వచ్చితిని. నేను నా భర్తచే నమ్ముడుపోతిని. నేను కేవలను నీ మొగము చూచుకొనియే బ్రతుకుచున్నానురా? 

నీవు పుట్టగనే బ్రాహ్మణులు నీ భవిష్యత్తుగూర్చి యిట్లు తెల్పిరి. నీవు దీర్ఘాయుష్మతుడవు- చక్రవర్తివి- పుత్రపౌత్రవంతుడవు-- శూరుడవు- దానశీలుడవు- సాత్వికుడవు- గురుదేవ విప్రపూజకుడవు- సత్యవాదివి-తల్లిదండ్రులకు ప్రియ కరుడవు- జితేంద్రియుడుగా గలవని నీ జాతకమున గలదు. అవన్నియు నేడు నీ యెడల నసత్యము లయ్యెను గదా. 

నీ యఱచేతిలో చక్రము- మత్స్యము- గొడుగు- శ్రీవత్సము- స్వస్తిక చహ్మము- కలశ చామరములు- మిగిలిన శుభలక్షణములు- ఎన్నియో కలవు. నేడవన్నియు నసత్యము లయ్యెను గదరా కొడుకా! అయ్యో రాజా! ఆ నీ రాజ్యమెక్కడ! ఆ నీ మంత్రు లెక్కడ! ఆ నీ సింహాసన మెచట! నీ ఛత్రము నీ ఖడ్గము నీ ధనము నెక్కడ! ఆ నీ యయోధ్యాపురము- ఆ రమ్యహర్మ్య ములు- ఆ గజాశ్వరథములు అవన్ని యెక్కడ : ఓ కొడుకా! నీవు వానన్నిటిని వదలి యెక్కడి కేగితివిరా. 

ఓ నరపతీ ! ఓ ప్రియా ! ఒక్కసారి రమ్ము. దొగాడుచు ఱొమ్మునను కుంకుమ పూసికొనిన నీ యీ కొడుకు కొంటెతనమున తన మేని నిండ మన్ను పూసికొనెనో ఏ నీ కొడుకు బాలభావమున కస్తూరి మేన పూసికొనెనో-రాజా! నీ తొడపై నున్నయే నీ కొడుకు నీ నొసటి తిలకమును చెపనెనో-ఎవని మంటి నోటిని వాత్సల్యమున నేను ముద్దాడితినో-

నేడా నీ కొడుకు మొగముపై నీగలుదోమలు ముసరగ చూడనలవి కాకున్నది. రాజా! అట్టి నీ కొడుకు నేడు దిక్కుమాలిన వానివలె పడియున్నాడు. అక్కట దైవమా! వెనుకటి జన్మములోనే నెట్టి చేయరాని పని చేసితినో! దాని ఫలితముగ నేను నేడిట్టి చెడు ఫలిత మనుభవించుచున్నాను. 

హరిశ్చంద్రుడి భార్యకు మరణదండన

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...