Friday, April 17, 2026

Chapter 149 Naradudu Mayavasudaguta - అధ్యాయము 149 నారదుడు మాయావశుడగుట

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 149

నారదుడు మాయావశుడగుట

నారదు డిట్లనెను : మునివరా ! శ్రీదేవీ సత్కథామృతము తేటపరతును. సావధానముగ నాలింపుము. యోగవిదులగు మునులకు సైతము మాయాప్రభావము బోధపడదు. బ్రహ్మ మొదలుకొని గడ్డిపోచవఱకుగల చరాచర ప్రపంచమంతయు మాయాశక్తి విజృంభణమే. మాయ అచింత్యము. జయింపరానిది. నేనొకప్పు డత్యద్భుత కార్యకుశలుడగు హరిని దర్శించుటకు సత్యలోకమునుండి మనోహరమైన శ్వేతద్వీపమున కేగితిని. 

అపుడు నేను లయతానముల నలరు మహతి వీణియు మీటుచు సప్తస్వరములతో సామగాన మాలపించుచుంటిని. నే నచట విష్ణుని దర్శించితిని. ఆ శ్రీహరి నీలమేఘశ్యామలకోమలాంగుడు - చతుర్భాహువు - ఉరమున రాజిల్లు కౌస్తుభకాంతులవాడు - చక్రగదాధరుడు - దేవదేవుడు. దేవతా సార్వభౌముడు - పీతాంబరుడు - సువర్ణమకుటాంగదవిరాజితుడు - విలాసవతియగు శ్రీలక్ష్మితో నానందశ్రీలతో క్రీడించుచుండగ నేను దర్శించితిని. 

అత్తఱి సర్వశుభలక్షణసంపన్న - సకల భూషణ భూషితయగు లక్ష్మీదేవి నన్ను చూచి లోపలి మందిరమున కరిగెను. ఆ నారీశిరోమణి రూప¸యవనగర్విత - కాంత - హరిప్రియ - నడయాడు సువర్ణముతోసప్రభ. అట్లు సువ్యక్తములగు శోభనాంగములుగల లక్ష్మి లోనికేగుట గని నేను వనమాలి - జగత్ర్పభువగు దేవదేవోత్తమునితో నిట్లంటిని : 

'ఓ దేవదేవేశా! పద్మనాభా! భగవానుడా! లోకైకమాత నా రాకగని యేల లోని కరిగెను? జనార్దనా! జగద్విభూ! నేను జారుడను - ధూర్తుడను గాను. జితేంద్రియుడను జితక్రోధుడను జితమాయుడను గదా! అను నా గరువంపు మాటలు విని జనార్దనుడు చిర్నవ్వుతో వీణ పలికినట్లు తీయగ నిట్లు పలికెను : 

నారదా! ఏ స్త్రీయైనను తన పతిచెంత దక్క నితరు నొద్ద నెప్పుడు నెక్కడ నుండరాదనుట లోకమర్యాద గదా!

ఈ పలురూపుల మాయను సనకాదిమునులు యోగులు జితేంద్రియులు సాంఖ్యులు నిరాహారులు ప్రాణాయామపరులైనను తెలిసికొనజాలరు. మునివరా! రసజ్ఞా! మాయా దేవతలకు సైత మగమ్యము. నేను జితమాయుడనని పల్కిన మాట మరెప్పుడు నెక్కడ బల్కకుము. 

బ్రహ్మ - నేను - శివుడు - సైతము గెలువరాని మాయను గెలువ నోపము. ఇక నీవు పరులు నన నెంతటివారు? దేవ - నర - తిర్యగ్జాతుల తనువులు దాల్చినవారు జయింపరాని మాయ నెట్లు జయింపగలరు? వేదవిదుడు - యోగి - సర్వజ్ఞుడు - జితేంద్రియుడు నైనావాడైనను త్రిగుణబద్ధుడైనంత వఱకు మాయను గెల్వనేరడు. 

కాలము రూపము కాని రూపము గలది. కాలమును మాయా స్వరూపమే. ఒక పండితు డేమి - మధ్యముడేమి మూర్ఖుడేమి - ప్రతివాడును మాయవలలో జిక్కికొనవలసినదే. కాలము దలచుకొన్నచో తన సహజస్వభావా కర్మలచేత ధర్మజ్జుని సైతము వికలునిగ జేయును. 

కనుక కాలము చేత లెంతవానికిని తెలియరావు అని పలికి విష్ణువు మిన్నకుండెను. నే నాశ్చర్యముతో వాసుదేవుడు సనాతనుడునగు జగన్నాథునితో నిట్లంటిని : 

రమాపతీ! మాయ యొక్క నిజస్వరూపమేది? దాని శక్తి యెంత? దాని యునికి యెక్కడ? దాని కాధార మేది? దాని స్వభావ మెట్టిది? నాకు తెలుపుము. మాపతీ! భూధరా! మాయను చూడవలతును. దానిని తెలిసికొనగోరుచున్నాను. దయచేసి మాయాచరిత్ర నాకు తెలుపుము అంటిని. 

విష్ణు విట్లనెను : మాయ త్రిగుణములు - అఖిలాధర - సర్వజ్ఞ - సర్వసమ్మత - బహురూప - అజేయ - జగమంతట నిండారి తాండవించును. నారదా! నీకు మాయను గను కుతుక మున్నచో నాతో గరుడు నెక్కుము మన మిద్దఱ మిపుడు వేఱొకచోటి కేగుదము. 

ఓ బ్రహ్మపుత్రా! జితాత్ములకును దెలియరాని మాయా మహిమ నీకు చూపగలను. దానిని బొంది నీవు మదిలో విచారింపకుము అని హరి నాతో పలికి మదిలో గరుత్మంతుని దలంచెను. అంతలోనే గరుడుడు హరి సన్నిధిలో వచ్చి వ్రాలెను.

హరి గరుడుని రాక గని నన్నాదరముతో దానిపై నెక్కించి తాను నధిష్ఠించెను. గరుత్మంతుడు హరిప్రేరితుడై వాయు వేగమున తరలి హరి పోదలచిన వనమున కేగెను. అట్లు మేము గరుడు నెక్కి మహా వనములు దివ్య సరస్సులు నదులు పురములు గ్రామములు జనపదములు గొల్లపల్లెలు మునుల పావనాశ్రమములు వాపీకూపములు విశాలములైన నీటి పడియలు కమలకముల కాసారములు జింకల పందుల గుంపులు చూచి కన్యాకుబ్జము దాపున కేగితిమి. 

అట మేము హంస కారండవ చక్రవాకములతో కమలములతో నలరారు రమణీయమైన సరస్సు గాంచితిమి. ఆ తీయని విమల సలిలములందు పలువన్నెల విరయబూచిన కమలమ్ములచుట్టు గండుతుమ్మెదల గుంపులు చెవుల కింపుగ ఝంకారములు చేయుచున్నవి. ఆ కొలను సముద్రమోయన నొప్పుచున్నది. 

దానిని గని హరి నాతో నిట్లనెను : 'నారదా! చూడుము. ఈ తమ్మికొలను తుమ్మెదల మారుమ్రోతలచే రమ్యగంభీరముగ నున్నది. ఈ కొలని నిండ కమలములు విరిసినవి! నీరు స్వచ్ఛముగ న్నుది! మనము దీనిలో గ్రుంకి కన్యాకుబ్జపుర మేగుదము' అని పలికి హరి నన్ను గరుత్మంతుని మీది నుండి దింపి తానును దిగెను. 

అంతట హరి ముసి ముసిగ నగుచు నా చూపుడువ్రేలు పట్టుకొని సరస్సును గొనియాడుచు నన్ను కొలని కెలంకునకు గొనిపోయెను. అట మేము దట్టమైన చల్లని చెట్ల నీడలలో కొంత సేద దీర్చుకొంటిమి. అపుడు 

హరి యిట్లనెను : 'నీ వీ జలమున తానమాడుము. ఈ నీరు స్వచ్ఛమైనది. ఈ సలిలము సాధులచిత్తమువలె నిర్మలమైనది. నీ పిదప నేను నీ పావన తటాకమున గ్రుంకు లాడుదును.

ఈ నీరు కమల పరాగములతో పరిమళలహరులు విరజిమ్ముచున్నది' అని హరి యనగ నేను స్నానమాడ నిశ్చయించుకొని వీణియ జింకచర్మము తీసి నెయ్యముతో నీటిచెంతకేగి కాలుసేతులు కడుగుకొని జుట్టు ముడివేసికొని దర్భలు చేబూనితిని. ఆచమించి పవిత్రజలమున స్నానమాడితిని. 

నేను మునుగునపుడు శ్రీహరి నావంక జూచుచుండెను. నేనింతలోనే పురుషరూపముపాసి సుందర స్త్రీరూపమున నొప్పితిని. విష్ణువు నా వీణను జింకచర్మమును తాను గ్రహించెను. గరుడవాహనుడు గరుడు నెక్కి త్వరితముగ గగన మార్గమున తన వైకుంఠ మేగెను. నేను పలుసొమ్ములుగని చక్కని రమణిగ సొబగు వహించితిని. 

ఆ మఱుక్షణమునుండి నాకు పూర్వదేహస్మృతిగాని జగన్నాథుని జ్ఞాపకముగాని వీణా విజ్ఞానముగాని లేకుండెను. నేనట్లు మోహినీరూపమంది తటాకము వెల్వడి కమలముల నలరుచు విమలజలములగల కొలకును పరికించు చుంటివి. ఇంతలో నింత వింత యేమి? నా కీ నారి రూపేమి? అని నేను మాటిమాటికి విచారపడుచుంటిని. 

అంతలో గజాశ్వరథములు తోడు నడుచుచుండగ నరదమెక్కి వచ్చుచున్న తాలధ్వజుడను రాజు కంటికింపుగ నాకంటబడెను. ఆ రాజు మారునకు మాఱు రూపుగ నవయువకుడై దివ్యభూషణ భూషితుడై విరాజిల్లు చుండెను. అతడు భూషణ భూషితనగు నన్ను జూచెను. ఆ రాజచంద్రుడు చంద్రుముఃనగు నన్ను క్రిందుమీదుల చూచి పరమవిస్మయమంది 

నాతో నిట్లు పలికెను : ఓ కల్యాణీ! నీవెవతెవు? ఎవరి కూతురవు? నీవు దేవతా స్త్రీవా? మానవభామినివా! గంధర్వకన్యవా! నాగకన్యకవా! ఆహా! ఏమి యీ రూపలావణ్యము! ఈ రూప¸యవనములతో అలంకృతవగు నీ వొంటిగ నుంటివేల? నీకు పెండ్లియైనదా? కన్నెవా? నిజము పలుకుము? సుకేశీ! సుమధ్యా! చారులోచనా! ఇచట నేదో వెదుకుచున్నావే! మదనమోహినీ! పికస్వరా! నీ కోరికి యేమో తెలుపుము. తలోదరీ! రాయంచ నడలదానా! నన్ను నీ సొంతము చేసికొని మదిలోని కోర్కులు తీర భోగములనుభవించుము.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...