Friday, April 17, 2026

Chapter 145 Deflection force description - అధ్యాయము 145 విక్షేపశక్తి వర్ణనము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము - అధ్యాయము 145

విక్షేపశక్తి వర్ణనము

జనమేజయుడిట్లనెను : ఓ మహితాత్మా ! నీ ముఖ కమలముల నుండి వెడలు నమృతమువంటి శ్రీ మాతృదేవి దివ్య కథా రసమెంత క్రోలినను తనివితీరుట లేదు. హైహయవంశోత్పత్తి చరిత్ర విచిత్రము విస్మయకరము. దానిని నీవు విపులముగ తెల్లమొనర్చితివి. కాని యందు నాకొక సందియము గల్గుచున్నది. అదేమన, దేవదేవుడు జగన్నాథుడు - సృష్టి స్థితి సంహార కారకుడు - కమలాపతి - విష్ణువు పురుషోత్తముడు హరి పరతంత్రుడై గుఱ్ఱము రూపేల దాల్చెను? నా యీ సంశయము బాపుటకీవే సమర్థుడవు. నీవు సర్వజ్ఞుడవు, మునివరుడవు కనుక హరియొక్క యీ విచిత్రవర్తనము గూర్చి తెలుపుము అన 

వ్యాసుడిట్లనెను : రాజా! పూర్వము నారదమునివరున కిదే సందేహము వెలిపుచ్చి యా మహాత్మునివలన దానిని తీర్చుకొంటిని. దానిని నీకు దెల్పుదును. ఆలింపుము. నారదుడు బ్రహ్మమానస పుత్రుడు - తబిసి - సర్వవిదుడు - పరమశాంతుడు - సర్వగుడు - కవి - సర్వలోకహితుడు - లోకప్రియుడు. ఆ మునిచంద్రు డొకనాడు తన మహతివీణియగు గోటమీటుచు స్వరతాల రాగలయలతో బాడుచు భూతలమున దిరుగుచుండెను. 

అతడొకనాడు సామవేదములోని బృహద్రథంతర మంత్రముల విశేషములు వెల్లడించు దివ్యగాయత్రీ గానము సలుపుచు నాశ్రమము చేరెను. సరస్వతీ తీరమున మునులకు నివాసయోగ్యమై జ్ఞాన సుఖములు గలిగించుచు శమ్యాప్రాసమను తీర్థమొకటి గలదు. ఆ పావనతీర్థమున నా యాశ్రమము గలదు. నే నాదివ్యతేజములు వెదజల్లుచు నేతెంచు బ్రహ్మ మానస పుత్రుని వీక్షించి లేచి యెదురేగి యతని నర్చించితిని. నే నతని కర్యపాద్యాది విధులొనరించితిని. ఆ అమిత తేజస్వి గూర్చున్న పిమ్మట నేనతని సన్నిధిలో గూర్చుంటిని.

అట్లు దివ్యజ్ఞానియగు నారదర్షి విశ్రమించి శాంతిగనుండుట గని నీవు నన్నడిగిన ప్రశ్న నేనతనిని నీ విధముగ నడిగితిని: 

'ఓ మునివర్యా! ఈ సారహీనమైన సంసారమందలి యే ప్రాణియు నెప్పుడు నెచ్చట నేరీతిగను సుఖశాంతులు బడయలేదని నేను గట్టిగ తెలిసికొంటిని. నేనొక ద్వీపముపై జన్మించితిని. పుట్టిన వెంటనే నన్ను నా తల్లి వదలి వెళ్ళెను. నేను నా కర్మ కొలదిగ దిక్కులేని వాడనై వనములందు పెరగితిని. 

దేవర్షీ! నేనపుడు పుత్రార్థినై యొక గిరిపై గిరీశుడైన శంకరుని గూర్చి తీవ్ర తపమొనరించితిని. నాకు మహాజ్ఞాని యగు శుకుడు జన్మించెను. నేనతనికి వేదాలసారము మొత్తము మొదటి నుండియు చక్కగ చెప్పితిని. నీ ప్రబోధముల పుణ్యమాయని అతడు నన్ను వదలి వేరొకలోకమున కరిగెను. నేను పుత్ర వియోగమున విలవిలలాడితిని. అంత నేను పుత్రవియోగ సంతప్తుడనై మేరుపర్వతము వదలి నా తల్లిని స్మరించుచు కురు భూముల కరిగితిని. ఈ సంసారమంతయును మిథ్యయని యెఱుంగుదును. 

ఐనను పుత్రవియోగము భరింపలేక శోకించి కృశించి మాయాపాశబద్ధుడనైతిని. శంతనుడు నా తల్లిని వివాహమాడెను. అదెఱింగి నేనచటనే సరస్వతీతటమున పుణ్యాశ్రమ మేర్పరచుకొంటిని. కొంతకాలమునకు శంతనుడు స్వర్గస్థుడుగాగా నా తల్లి విధవయయ్యెను. ఆమె యిర్వురు కుమారులను భీష్ముడు పెంచి పెద్ద చేయుచుండెను. ధీశాలియగు భీష్ముడు చిత్రాంగదుని రాజుగ జేసెను. చిత్రాంగదుడు నాకు సోదరుడు చక్కనివాడు. కొన్నాళ్ళకతడు కాలగర్భమున గలిసెను. తనకొడుకగు చిత్రాంగదుడు చనిపోవుటవలన నా తల్లి సత్యవతి శోకసాగరమున మునిగెను.

మహాత్మా! నా తల్లి దుఃఖితురాలగుట విని మహాత్ముడు భీష్ముడును నేనును వెళ్ళి యామెను నూరడించితిమి. భీష్ముడు రాజ్యరమా విముఖుడు. అతడు తన రెండవ తమ్ముడగు విచిత్రవీర్యుని రాజుగ జేసెను. అతడు ప్రతాపి భీష్ముడు రాజుల నెల్లరిని తన విక్రమముతో నోడించి కాశిరాజపుత్రికల నిర్వురను దెచ్చి సత్యవతి కిచ్చెను. 

ఒక శుభముహూర్తమున విచిత్రవీర్యున కా కన్యలతో వివాహము జరిగెను. అది గని నేను ప్రమోదమందితిని. నా తమ్ముడగు విచిత్రవీర్యుడు దనుర్ధనుడు వయసుగాడు. అయినను రాజయక్ష్మరోగ పీడితుడగుటవలన నతడును పుత్రహీనుడుగనేమరణించెను. అపుడు నా తల్లి వలవల యేడ్చెను. 

కాశిరాజపుత్రిక లక్క సెల్లెండ్రిరువురును తమ పతి మరణించుటవలన తామును పతివ్రతా ధర్మము పాటింప దలంచిరి. వారు బోరున విలపించుచున్న తమ యత్తతో నిట్లనిరి : 

మేమును మా పతితో సహగమన మొనర్తుము. అత్తా! నీ పుత్రుని గూడి మేము స్వర్గమున నందనవనమునందు సుఖముగ విహరింపగలము. అపుడు నా తల్లి భీష్ముని హితవచనములాలించి దయబూని తన కోడండ్రను సహగమన యత్నమునుండి వారించెను. విచిత్రవీర్యునకు పరలోకక్రియలు జరిగెను. 

ఆ పిదప నా తల్లి హస్తి పురమందుండి భీష్ముని హితవు ప్రకారము నన్ను మదిలో తలంచినది. ఆమె స్మరించి నంతనే నేను నా తల్లి భావమెఱింగి వేవేగ హస్తిపురమున కరిగితిని. అట పుత్రశోకమున కృశించియున్న నా తల్లికి దోయిలించి శిరమువంచి యిట్లంటిని :

ఓ తపస్వినీ ! అమ్మా! నీ మనస్సులో నన్నేల స్మరించితివి? నేను నీ దాసుడను. నేనేమి కార్యము చేయవలయునో యాజ్ఞాపింపుము. తల్లీ! నాకు తీర్థము నీవే - పరదేవతవు నీవే! నీవు తలంచినంతనే వచ్చితిని. నీ కెట్టి ప్రియమొనర్పవలయునో తెలుపుము. నేనటుల పలికి నా తల్లిచెంత నుంటిని. అపుడామె భీష్మునివైపు చూచుచు నాతో నిట్లు పలికెను : 

పుత్రా! నీ సోదరుడు రాజక్ష్మరోగపీడితుడై మరణించెను. అందుచే వంశమింతటితో నాగునేమోయని భీతిచే దుఃఖించుచున్నాను. మేధావీ! పారాశర్యా! ఈ శుభకార్యనిర్వహణమునకు భీష్ముననుమతితో నేను నిన్ను దలంచితిని. ఈ నశించుచున్న వంశమును శంతనుని పేరుమీద నిలువబెట్టుము. నా దుఃఖము పాపుము. సురూపము సుశీలముగల కాశీరాజపుత్రికలు నీ తమ్ముని భార్యలు. ఆ యిర్వురితో నీవు సంగమించి పుత్రోత్పత్తి చేయుము; భరతవంశమును పునరుద్ధరింపుము. దీనివలన నీకెట్టి దోషమును గలుగదు అను నా తల్లి పలుకులు విని నేను సిగ్గుచే చింతాపరుడనై సవినయముగ నిట్లంటిని : 

తల్లీ! పరభార్యలను దాకుట పాపము గదా! ధర్మమెఱింగిన నేనీపని కెట్టు లొప్పుకొందును? తమ్ముని భార్య స్వకన్యతో సమాన యందురు. కనుక వేదశాస్త్రము లెఱిగిన నేనట్టి వ్యభిచార కర్మము నెట్లు చేయగలను? ఒక కులము నన్యాయముతో నిలువబెట్టరాదు. అట్లు చేయు పాపాత్ముని పితరులు సంసారమునుండి తరింపరు.

నేను లోకాలను మేలుబాట జూపువాడను. పురాణకర్తను. ఇక నే నెట్టు లిట్టి నీచకర్మమున కొడిగట్టగలను. అపుడు నా తల్లి పుత్రశోకముతో విలపించుచు వంశోద్ధరణము జేయదలచి నా చెంత కేతెంచి మఱల నిట్లనియెను : 

పరాశర నందనా! నా మాట వినుము. దీనివలన నీ కెట్టి దోషము లుండవచ్చును గాక! ఐనను పిన్నలు విచారింపక చేయుట మంచిది. ఇది శిష్టాచార పద్ధతి. కుమారా! నా మాట నమ్ముము. ఇందు నీకెట్టి దోషము తగులదు. నందనా! సంతానము గనుము. శోకసముద్రమున తపించుచున్న నీ తల్లికి సంతోషము గలిగింపుము. అని నా తల్లి పలుకగ 

సూక్ష్మ ధర్మనిర్ణేత విశేషజ్ఞుడు గంగాసుతుడునైన భీష్ముడు నాతో మెల్లగ నిట్లనెను : ఓ యనఘా! ద్వైపాయనా! నీవు చింతింపవలదు. తల్లి మాట నిలువబెట్టి యామెకు శాంతి గల్గింపుము. అపుడు నేను భీష్మ వచనములును తల్లి కోర్కియు నంగీకరించి శంక దక్కి యా నీచకార్యమునకు పూనుకొంటిని. నేనొక రేయి ఋతుమతియైన యంబికతో విలాసముగ గడపితిని. 

నా తపసవేషము జూడగనే యంబిక మనస్సు కలవర మొందెను. 'నీవు నా కలయికలో కన్నులు మూసికొంటివి. కనుక నీకు గ్రుడ్డివాడు పుట్టు'నని నేనామెను శపించితిని. మరునాడు నా తల్లి నన్నొంటరిగ పిలిచి 'మునిశ్రేష్ఠా! అంబికకు కొడుకు పుట్టునా?' యని నన్నడిగెను. 

అపుడు నేను తలవంచుకొని 'అమ్మా! ఆమెకు నా శాపమున గ్రుడ్డివాడు పుట్టు'నని నేనంటిని. అంత నా తల్లి కఠిన వాక్కులతో పుత్రుని గ్రుడ్డిని గమ్మని యేల శపించితి'వని నన్ను నిందించెను.

అధ్యాయము 146 వ్యాసుని మోహవృత్తాంతము

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...