Saturday, April 18, 2026

Sukanya's story - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - సుకన్యా వృత్తాంతము

ఈ విధముగ శర్యాతి చింతాక్రాంతుడయ్యెను. అతడు తన సైనికులను మిత్రవర్గమును కోపముతో మంచిమాటలతో దాని కారణ మడిగెను. అంతలో సుకన్య దుఃఖితుడగు తన తండ్రిని చింతాతురులగు జనులను గాంచెను. ఆమె ముంటితో పుట్టను బొడిచిన విషయమును తలంచి తండ్రితో నిట్లనియెను: 

తండ్రీ! నేను వనములో నాడుకొనుచుండగ నాకు తీగలచే గప్పబడిన యొక పెద్దపుట్ట గనంబడెను. దానికి రెండు పెద్ద రంధ్రములు గలవు. మహారాజా! నే నా రంధ్రముల నుండి మిణుగురులను బోలు రెండు కాంతులు గాంచితిని. అవి మిణుగురులు గాబోలునని నేను వానిని ముంటితో బొడిచితిని. అంతలో నా పుట్టలోనుండి 'అయ్యో చచ్చితిని' అను మెల్లని స్వరము నా చెవుల బడెను. 

తండ్రీ! నే నా ముంటిని లాగి చూతును గదా- యది తడిసియుండెను. దానిని చూడగానే నా కనుమానము గల్గెను. ఇదేమో వింతగ నున్నదని యబ్బుర మొందితిని. ఆ పుట్టలో నేనేల గ్రుచ్చితినో నాకే తెలియకుండెను. అను సుకన్య మెత్తని పలుకులు వినియిదంతయు నా మునికి జరిగిన యపరాధఫలితమని యెఱింగి శర్యాతి వెంటనే యా పుట్టను జేర జనియెను. 

రాజు వెంటనే మునిచుట్టు పెరిగిన పుట్టను పగులగొట్టించి దుఃఖితుడై ముసలి తబిసియైన చ్యవనుని గాంచెను. అంత శర్యాతి భార్గవునకు దండప్రణామము లాచరించి నుతించి సవినయముగ నతని కిట్టు లనియెను. 

మహాభాగా! ఈ నా కూతురు బాల్య చాపల్యముతో చిలిపిగనాట లాడుకొనుచు నీ పొరపాటు పని చేసెను. ఈ సుకన్యను నీ చల్లని నిండుచూపులతో కనికరించి కావుము. మునివరులు నిత్తెము శాంతచిత్తులై యుందురని విందును. 

కనుక నా బాలను క్షమించుము. అని రాజు దిగులుతో వినయముతో ప్రార్థిం చుటగని చ్యవను డతని కిట్లు పలికెను :

ఓయి రాజా! నాలో నెన్నడు నిసుమంతయును కోపము లేదు. నీ కన్య సుకన్య నన్నింతగ బాధించినది. ఐనను నేను నిన్నిప్పటికిని శపించలేదు. రాజా! నేను తప్పుచేసి యెరుగను. మీ కన్యమూలమున నా కన్నుల కింతగ బాధ గల్గుచున్నది. ఈ పాపఫలితముగ నీ వింతగ దుఃఖము లనుభవించుచున్నావని నాకు తోచుచున్నది. 

అపరాజిత దేవి శివకుటుంబిని యగు శ్రీదేవి భక్తున కపరాధము చేసినవాడు శివునిచేత రక్షితుడైనను సుఖము గాంచడు. రాజా! నేను ముసలివాడను. ఇపుడు గ్రుడ్డివాడనైతిని. ఇక నా బ్రతుకు కటికిచీకటి మయము. ఇంక నాకు కావలసిన పరిచర్యలుచేసి నన్ను సేవించువారెవరు? అనగా 

రాజిట్లనియెను: ''ఓ మునిప్రవరా ! తాపసోత్తముల కోపము క్షణమాత్ర ముండును. కనుక క్షమించుము. నాకు పల్వురు సేవకులు గలరు. వారు నిన్ను బాయకసేవింతురు.'' 

చ్యవను డిట్లనెను: ''ఓయి రాజా! ఇది యేకాంతప్రదేశము. నేను గ్రుడ్డివాడను. ఇక నాతపమెట్లు సాగగలదు? నీ సేవకులు నాకు ప్రియము గూర్తురనుట యెట్లు నమ్మదగును! రాజా! నమ్న ప్రసన్నునిగ జేసికొనదలచినచో నా ప్రియవచనము వినుము. 

నా మాట నిలవబెట్టుము. కమలలోచనయగు నీ సుకన్యను నా కప్పగించుము. ఆమె నన్ను బాయక నా పరిచర్యలు చేయవలయు. మహారాజా! నీవు నీ కన్యను నాకిచ్చిన తృప్తినందుదును. ఆ పడతి నాకు సేవలు సేయగలదు. నా తపము నిర్వఘ్నముగ సాగును. 

రాజేంద్రా! నేను చెప్పినట్లు చేయుము. నేను సంతుష్టుడ నగుదును. దానిచే నీకు మేలగును. నీ సైనికుల యడ్డంకులు తొలగును. రాజా! నీవు నెమ్మదిలో చక్కగ నాలోచించుకొని నీ కన్యను నాకు దానము సేయుము. నేను తాపసుడను నియతవ్రతుడను. 

ఆమెను నాకిచ్చుట వలన నీకెట్టి దోషమును తగులదు.'' అను తీయని ముని వచనములువిని శర్యాతి చింతాతురుడై తన సుకన్య నిత్తునని మునికి మాట యీయలేదు. ఈయనని పలుకలేదు. ఇతడు గ్రుడ్డివాడు. కురూపి ముసలివాడు. 

ఇట్టివానికి నాకు బుట్టిన దేవ కన్యను బోలు సుకన్య నర్పించి నేనేమి సుఖము బడయగలను? ఎంత పాపియైనను మతిహీనుడైనను రాబోవు మంచిచెడుగు లెఱింగియును తన స్వార్థమునకు తన కూతురు సంసార సుఖమును బలి యీయదలంచునా?

ఈ నాగారాల పట్టి యీ ముసలి చీకును పతిగబొంది ఏమి సుఖమునందును? కాలము నెట్లు దొర్లించునో! ¸యవన ముననున్నయువతి తన కన్నిట నీడు జోడగు భర్తను పొందియును తనియదు. ఇంక నా సుకన్య యీ ముసలి గ్రుడ్డివానితో నేమి సుఖములు పొందును? 

సురూపము నిండు జవ్వనముగల అహల్యకు గౌతమ తాపనుడు పతి ఐన నామె యింద్రునివలన వచింపబడెను గదా? ఆ పిదప ధర్మహాని జరుగు టెఱిగి గౌతముడు వారిని శపించెను. కనుక నాకెన్ని కష్టములు గల్గినను సుకన్యను మాత మితని కీయను. అని తలపోసి రాజు దుఃఖితమతియై తన యింటికేగి మంత్రులను రావించి ఆలోచనలు జరిపి వారితో నిట్లనెను: 

ఓ మంత్రులారా! ఇప్పుడు నా కర్తవ్యమేమి? నా పుత్రికను ముసలి బ్రాహ్మణున కీయవలయునా? లేక యీ దుఃఖము లనుభవింపవలయునా? మీరెల్లరును గలిసి నాకు మేలు తెఱగు నాలోచింపుడు. 

మంత్రులిట్ల నిరి: మహారాజా! ఇట్టి దురంతమైన ధర్మ సందేహములకు మేము మాత్రమేమి సమాధానము లీయగలము? ఆ దౌర్బాగ్యున కీ యందాల సుకన్యను చూచి చూచునెట్లు చేజేతుల నప్పగింత పెట్టగలము? ఇట్లు మంత్రులును తన తండ్రియును చింతాక్రాంతు లగుట సుకన్య గ్రహించెను. ఆమె వారి భావ మెఱింగి నవ్వుచు తన తండ్రితో నిట్లు పలికెను 

తండ్రీ! నీ వేల వ్యాకుల చిత్తుడవైతివి? నా మనుగడగూర్చి నీ వింతగ దుఃఖముతో విచారింపనేల? ఆ మునిపుంగవుని మదికి నేను బాధ గల్గించితిని. కనుక నా మునివర్యుని సన్నిధికేగి యతని మదికి నచ్చునట్లు మాటాడగలను. ఆ ముని ప్రవరునకు నేను నన్నర్పించు కొందును. అతనిని సుప్రసన్నుని జేయగలను.' అని పలికిన తనకూతురు ప్రియవాక్కులు రాజు వినెను. 

అంత రాజు సంతుష్టిజెంది మంత్రులెల్లరు వినునట్లు సుకన్యతో నిట్లనెను: ఓ పుత్త్రీనీవబలవు. ఆ వనమందలి మునివర్యుడు గ్రుడ్డి వృద్దు. ముక్కోపి ముసలియగు మునిమాన్యునకు నీవు తాల్మితో నెట్లు సపర్యలు చేయగలవు. నీవు సుందరాంగివి. నిన్నొక గ్రుడ్డివాని కెట్టు లప్పగింపగలను?

ఆ ముసలిముని తన సుఖము తాను గోరుకొనును. అతనికి నిన్నెట్టు లర్పింపగలను? ఏ తండ్రియేని తన కూతున కన్నివిధముల నీడు జోడు కులము బలము గలవానితో పెండ్లిచేయును. ప్రతివాడు తన కుమార్తెను ధనధాన్యములు సంప దలుగలవానికే యుచ్చును. కాని యొక నిఱుపేద కీయదలంపడు గదా! 

ఓ విశాలాక్షీ! నీ యీ నిండు గడుసుజవ్వనమేడ! ఆ వనములందు గ్రుమ్మరుచున్న ముసలి చీకేడ! ఓ పుత్రీ! వయసుమీఱి సత్తువ గోల్పోయిన మునికి నిన్నెటు లీయగలను? నీవు నిత్తె మంతిపురమున నుండుదానవు. పర్ణశాలలో నెట్లు మనుగడ సాగింతువు? 

కమలాక్షీ! ఇపుడు నేనేమి చేయగలను? నా సైనికులు నేను చచ్చిన చత్తుము గాక! కాని పికభాషిణీ! బాలామణీ ! నిన్నొక గ్రుడ్డివాని కర్పించుట నా కెంతమాత్ర మిష్టములేదు. కాగలదేమో కాకమానదు. నేను ధైర్యము వదలకుందును. బాలా ! నీవు గుండె నిబ్బరముతో నుండుము. 

నా రాజ్యము నా దేహమున్నను పోయినను నాకు దిగులులేదు. నిన్ను మాత్ర మొక గ్రుడ్డివాని చేతిలో పెట్టను. కన్నులు లేని వానికే విధముగనైన నిన్నీయను.'' అను తన తండ్రి మాటలను సుకన్య వినెను. ఆమె విప్పారిన మొగముతో తన యంతరాత్మ ప్రభోధించిన వచనము లిట్లు పలికెను. 

తండ్రీ ! నన్ను గూర్చి యింతగ చింతింపగా నేల? నన్నా మునివర్యున కిప్పుడే ప్రదానము చేయుము. నావలన లోకములు మేలుపొంది సుఖించుగాక! ఆ పరమపావనుడు మహా శక్తుడగు మునిపతిని పరమ సంతోషమున సేవించు కొనగలను. ఆ యేకాంత ప్రదేశమునందు పరాభక్తితో పతివ్రత ధర్మముతో చక్కగ ముసలి మునితో మసలు కొందును. 

తండ్రీ! నాలో విషయ భోగేచ్ఛలేదు. నా మనస్సునకు విషయ సంకల్పసంబంధము లేదు. నా చిత్తము ప్రకృతి శాంతమైనది. అను సుకన్య సూక్తులాలకించి మంత్రులు పరమ విస్మయమందిరి. అపుడు రాజు పరమ ప్రీతితో మునివరుని సన్నిధి కరిగెను. ఆ తపోధనునకు తలవంచి ప్రణమిల్లి 

రాజిట్లనెను: ఓ స్వామీ! ఓ విభూ! నా పుత్రికను నీ సేవలకు తప్పక స్వీకరింపుము. అని రాజు వివాహ మంగళ విధానములో తన సుకన్యను చ్యవనునకు ధారపోసెను.

చ్యవనముని సుకన్యనుచేపట్టి ప్రసన్నుడయ్యెను. అతడు రాజొసంగు కట్నములు కానుకలు ముట్టలేదు. మునీశుడు సుకన్యను మాత్రమే తన పరిచర్యలకు గ్రహించెను. అట్లు చ్యవనుడు ప్రసన్నుడుగాగ సైనికులు మున్నగువారు నిరోధము పాసి సుఖమొందిరి. రాజు తన కన్నెనిట్లు మునికర్పించి సంతోషమొంది తన యింటికి వెళ్ళుచుండెను. 

అంతలతాంగియగు సుకన్య తన తండ్రితోనిట్లనెను. తండ్రీ! ఈ విలువైన సొమ్ములు వస్త్రములు తీసికొనుము. నాకు జింక చర్మము నారచీరలు నిమ్ము. ఒకముని భార్యకు తగిన వేషముతో నేనీతపస్వికి సేవలు సేతును. తండ్రీ! నీ కీర్తి యీ భూమిపైనే కాక స్వర్గపాతాళములందును శాశ్వతమై వెలయు గాక. 

నేను పరలోక సుఖములకొఱకీ పరమ తాపసుని రేబవళ్ళు పరిచరింతును. ఈ ముసలి గ్రుడ్డివాని కందాల జవరాలినగు నన్నొప్పగించినందుకు చింతింపకుము. నాసౌశీల్యము చెడు నేమో యను తలంపు నీకెంత మాత్రము వలదు. ఈ భూమిపై నరుంధతి వసిష్ఠుని ధర్మపత్నియైనది. నేను నటులే యితని కగుదును. 

దీనికి విచారింపబని లేదు. ఈ భూమిపై అత్రిపత్నియగు అనసూయ పరమ సాధ్వియై ప్రసిద్ధి గాంచెను. నేను నటులే పరమ సాధ్వికాగలను. లోకముల వాసిగాంతును. అను సుకన్య వాక్కులను ధర్మ విదుడగు రాజు వినెను. సుకన్య రాజ భూషణవస్త్రములు తీసి నార చీరలు కట్టుకొనెను. 

రాజామెకు జింక చర్మమొసంగెను. ఇట్లు ముని భార్య వేషముతో శాంతి కాంతివలె చిరున గవున చెన్నంధు తన కూతునుగాంచి రాజొకేసారి గొల్లుమని యేడ్చెను. రాజు వెల వెల బారిన మొగముతో స్తబ్దుడై యుండెను. రాణులెల్లరేతెంచి నార చీరలు దాల్చిన సుకన్యను గాంచి యెలుగెత్తి దురపిల్లిరి. వారు శోకార్తలై పెదవులు తడ బడ పెద్ద పెట్టునవాపోయిరి. 

ఈ విధానమున శర్యాతి మహారాజు తన సుకన్యను చ్యవనముని ప్రవరునకు అప్పగింత పెట్టి మునియను మతితో మంత్రులతో తన యింటికేగుదెంచెను.

No comments:

Post a Comment

The vows and worships of the Goddess as prescribed by the Goddess - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవిచెప్పిన దేవీవ్రతాలు, పూజలు ఓ సువ్రతా! ఇపుడు నీకు దేవీ వ్రతములగూర్చి తెల్పుదును వినము. ఈ దేవీవ్రతముల నెల...