Sunday, April 26, 2026

Bhadrashva Varshamu - భద్రాశ్వ వర్షము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భద్రాశ్వ వర్షము

నారాయణు డిట్లనెను: భద్రాశ్వవర్షమునందు ధర్మపుత్రుడు భద్రశ్రవో నామముతో నుపాసింపబడును. అతని గొల్చు వంశజులను భద్రసేవకు లందురు. ఆ భద్రాశ్వవర్షమందు ప్రసిద్ది జెందిన వాసుదేవుని హయగ్రీవమూర్తి వెలుగొందుచున్నది. భాగవతులు నిశ్చల చిత్తముతోడి సమాధిలో మునింగి యా దివ్యమూర్తి నీ రీతిగ నుపాసింతురు.

భద్రశ్రవసు లిట్లందురు : ఆత్మచింతనచేయు ధర్మస్వరూపుడగు భగవానునకు నమస్కారము లని యుపాసింతుము. దైవము చేతలు చాలవిచిత్రములు. ఎల్లభూతములు మృత్యువాత బడుచుండుట స్వయముగ చూచియును జనము సత్యమును నమ్మరు. కొడుకునకుగాని తండ్రికిగాని దహనాదులు చేసియును జనము తిరిగి విషయము లనుభవింపజూచును. ఈ విశ్వము నశ్వరమని కవులు-పండితులు-వక్కాణింతురు. సమాధిలో మునిగిన యాత్మవిదులు నటులే యందురు.

ఓ రాజా! ఐనను విచిత్రమైన యీ మాయాకృతికి జనము ప్రమోహము జెందును. అట్టి మహిమాతిశయముగల నీకు నమస్కారములు. ఈ విశ్వమును నీవు పుట్టించి పెంచి లయింపజేతువు. ఐనను నిన్నావరణములేని యకర్తగ చెప్పుదురు. ఇదంతయును కార్యకారణుడవు సర్వాత్మకుడవు నగు నీవు మాయవలన సృజింతువు. వాస్తవముగ నీవు నిరుపాధికుడవు-అకర్తవు. యుగాంతమున తమోవృతములగు వేదములు దొంగిలింపబడగ నీవు హయగ్రీవరూపము దాల్చి రసాతలమునుండి వానిని తెచ్చి బ్రహ్మ యాచింపగ నతని కెవడిచ్చెనో యట్టి సత్యరూపుడు విశ్వహితుడు నగు వానిని నమస్కరింతుము.

ఇట్లు హయగ్రీవుడగు శ్రీహరిని భద్రశ్రవసులు సంస్తుతించి యతని గుణగణము లభివర్ణింతురు.
వీరి యీ దివ్యచరితలు విని చదువువారు పాపమను కుబుసమునుండి ముక్తులై శ్రీదేవీ లోకమును జేరగలరు.

హరి వర్షము






No comments:

Post a Comment

Bharatha Varsham - భారత వర్షం

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము -  భారత వర్షం శ్రీనారాయణు డిట్లనెను : ఇంక నాల్గు వేదములు పుట్టిన జీవధాత్రి కర్మభూమియగు పావన భారతవర్షమునందు న...